19. పందొమ్మిదవ అధ్యాయము
జరాసంధుని రాజ్యాభిషేకము.
శ్రీకృష్ణ ఉవాచ
కస్యచిత్ త్వథ కాలస్య పునరేవ మహాతపాః ।
మగధేషూపచక్రామ భగవాంశ్చండకౌశికః ॥ 1
శ్రీకృష్ణుడిలా అన్నాడు -
ఆ తరువాత కొంతకాలానికి మహాతపస్వి అయిన చండకౌశికుడు మరల మగధదేశానికి వచ్చాడు. (1)
తస్యాగమనసంహృష్టః సామాత్యః సపురఃసరః ।
సభార్యః సహపుత్రేణ నిర్జగామ బృహద్రథః ॥ 2
ఆయనరాకతో ఆనందించిన బృహద్రథుడు అమాత్యులతో, పురోహితులతో, భార్యాపుత్రులతో కలిసి ఆయన సందర్శనకు బయలుదేరాడు. (2)
పాద్యార్ఘ్యాచమనీయైస్తమ్ అర్చయామాస భారత ।
స నృపో రాజ్యసహితం పుత్రం తస్మై న్యవేదయత్ ॥ 3
భారతా! అర్ఘ్య, పాద్య, ఆచమనీయాలతో రాజ్యంతో పాటు కుమారుని ఆయనకు నివేదించాడు. (3)
ప్రతిగృహ్య చ తాం పూజాం పార్థివాన్ భగవానృషిః ।
ఉవాచ మగధం రాజన్ ప్రహృష్టేనాంతరాత్మనా ॥ 4
సర్వమేతన్మయా జ్ఞాతం రాజన్ దివ్యేన చక్షుషా ।
పుత్రస్తు శృణు రాజేంద్ర యాదృశోఽయం భవిష్యతి ॥ 5
రాజా! పూజ్యుడైన ఆ మహర్షి రాజు చేసిన సత్కారాన్ని స్వీకరించి మనస్సులో ఆనందించి ఆయనతో ఇలా అన్నాడు - రాజా! దివ్యదృష్టితో నేనంతా తెలిసికొన్నాను. ఈ కుమారుడు ఎటువంటి వాడు కాగలడో విను. (4,5)
అస్య రూపం చ సత్త్వం చ బలమూర్జితమేవ చ ।
ఏష శ్రియా సముదితః పుత్రస్తవ న సంశయః ॥ 6
ఈ నీ కుమారుడు రూప, సత్త్వ, బల తేజస్సులతో జన్మించాడు. ఈ కుమారుడు సామ్రాజ్యలక్ష్మితో సంపన్నుడు కాగలడు. (6)
ప్రాపయిష్యతి తత్ సర్వం విక్రమేణ సమన్వితః ।
అస్య వీర్యవతో వీర్యం నానుయాస్యంతి పార్థివాః ॥ 7
పతతో వైనతేయస్య గతిమన్యే యథా ఖగాః ।
వినాశముపయాస్యంతి యే చాస్య పరిపంథినః ॥ 8
ఆ వైభవాన్నంతా తన పరాక్రమంతో పొందగలడు. ఎగిరే గరుడుని ఇతరపక్షులు ఏవీ అనుసరించలేనట్లు ఈ వీరకూమారుని పరాక్రమాన్ని ఇతరరాజులు అనుసరించలేరు. ఇతని శత్రువులయిన వారందరూ నశిస్తారు. (7,8)
దేవైరపి విసృష్టాని శస్త్రాణ్యస్య మహీపతే ।
న రుజం జనయిష్యంతి గిరేరివ నదీరయాః ॥ 9
రాజా! నదీవేగం పర్వతాన్ని పీడించలేనట్లే దేవతలు ప్రయోగించిన ఆయుధాలు కూడా ఇతనిని గాయపరచలేవు. (9)
సర్వమూర్ధాభిషిక్తానామ్ ఏష మూర్ధ్ని జ్వలిష్యతి ।
ప్రభాహరోఽయం సర్వేషాం జ్యోతిషామివ భాస్కరః ॥ 10
అభిషిక్తులయిన రాజులందరి శిరస్సులపై ఈతడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ఇతరగ్రహాల కాంతిని అపహరించినట్టు ఈ బాలుడు అందరి తేజస్సులను అపహరిస్తాడు. (10)
ఏనమాసాద్య రాజానః సమృద్ధబలవాహనాః ।
వినాశముపయాస్యంతి శలభా ఇవ పావకమ్ ॥ 11
సమృద్ధసేనలు, వాహనాలు గల రాజులైనా ఈ బాలుని ఎదిరిస్తే అగ్నిమీది మిడతల వలె నశించి పోతారు. (11)
ఏష శ్రియః సముదితాః సర్వరాజ్ఞాం గ్రహీష్యతి ।
వర్షాస్వివోదీర్ణజలాః నదీర్నదనదీపతిః ॥ 12
వర్షాకాలంలో సముద్రుడు ఉప్పొంగిన నదుల జలాలను తనలో లీనం చేసికొన్నట్టు ఈ బాలుడు రాజులు కూడబెట్టిన సంపదల నన్నింటినీ గ్రహించగలడు. (12)
ఏష ధారయితా సమ్యక్ చాతుర్వర్ణ్యం మహాబలః ।
శుభాశుభమివ స్ఫీతా సర్వసస్య ధరా ధరా ॥ 13
సర్వసస్యాలను ధరించే భూమి శుభాశుభాల నన్నింటినీ సమానంగా భరించినట్టు మహాబలుడైన ఈ బాలుడు చాతుర్వర్ణ్యాన్ని చక్కగా ఆదరించగలడు. (13)
అస్యాజ్ఞావశగాః సర్వే భవిష్యంతి నరాధిపా ।
సర్వభూతాత్మభూతస్య వాయోరివ శరీరిణః ॥ 14
దేహధారులందరూ సర్వప్రాణులకు ఆత్మ అయిన వాయువునకు అధీనులయినట్లు రాజులందరూ ఈ బాలుని ఆజ్ఞననుసరించి నడుచుకొంటారు. (14)
ఏష రుద్రం మహాదేవం త్రిపురాంతకరం హరమ్ ।
సర్వలోకేష్వతిబలః సాక్షాద్ ద్రక్ష్యతి మాగధః ॥ 15
సర్వలోకాలలోనూ అత్యంతబలవంతుడైన ఈ మాగధుడు త్రిపురాంతకుడు, మహాదేవుడు, రుద్రుడు అయిన హరుని ప్రత్యక్షంగా దర్శిస్తాడు. (15)
ఏవం బ్రువన్నేవమునిః స్వకార్యమివ చింతయన్ ।
విసర్జయామాస నృపం బృహద్రథమథారిహన్ ॥ 16
శత్రుసంహర్తా! ఈ విధగా మాటాడుతూనే చండకౌశికముని తన కర్తవ్యాన్ని మనసులో తలచుకొని బృహద్రథుని వీడి వెళ్ళాడు. (16)
ప్రవిశ్య నగరీం చాపి జ్ఞాతిసంబంధిభిర్వృతః ।
అభిషిచ్య జరాసంధం మగధాధిపతిస్తదా ॥ 17
బృహద్రథో నరపతిః పరాం నిర్వృతిమాయయౌ ।
అభిషిక్తే జరాసంధే తదా రాజా బృహద్రథః ।
పత్నీద్వయేనానుగతః తపోవనచరోఽభవత్ ॥ 18
అప్పుడు మగధాధిపతి అయిన బృహద్రథుడు జ్ఞాతులతో, బంధువులతో కలిసి నగరంలోనికి ప్రవేశిమ్చి జరాసంధునకు పట్టాభిషేకం చేసి పరమానందాన్ని పొందాడు.
జరాసంధునకు పట్టాభిషేకం చేసిన తర్వాత బృహద్రథరాజు తన ఇద్దరు భార్యలతో కలిసి తపోవనానికి వెళ్ళిపోయాడు. (17,18)
తతో వనస్థే పితరి మాత్రోశ్చైవ విశాంపతే ।
జరాసంధం స్వవీర్యేణ పార్థివానకరోద్ వశే ॥ 19
నరపతీ! ఆ రీతిగా తండ్రి, తల్లులు వానప్రస్థులు కాగా జరాసంధుడు రాజుల నందరినీ తన అదుపులోనికి తెచ్చుకొన్నాడు. (19)
వైశంపాయన ఉవాచ
అథ దీర్గస్య కాలస్య తపోవనచరో నృపః ।
సభార్యః స్వర్గమగమత్ తపస్తప్త్వా బృహద్రథః ॥ 20
వైశంపాయనుడిలా అన్నాడు -
ఆ తర్వాత బృహద్రథనరపాలుడు వానప్రస్థాశ్రమంలో దీర్ఘకాలం తపస్సు చేసి పత్నులతో సహా స్వర్గానికి వెళ్ళాడు. (20)
జరాసంధోఽపి నృపతిః యథోక్తం కౌశికేన తత్ ।
వరప్రదానమఖిలం ప్రాప్య రాజ్యమపాలయత్ ॥ 21
జరాసంధరాజు కూడా చండకౌశికముని ఇచ్చిన వరాలనన్నింటిని పొంది రాజ్యపాలన సాగించాడు. (21)
నిహత్ వాసుదేవ తదా కంసే మహీపతౌ ।
జాతో వై వైరనిర్బంధః కృష్ణేన సహ తస్య వై ॥ 22
శ్రీకృష్ణుడు కంసరాజును చంపిన తర్వాత శ్రీకృష్ణునితో జరాసంధునకు వైరమేర్పడినది. (22)
భ్రామయిత్వా శతగుణమ్ ఏకోనం యేన భారత ।
గదాక్షిప్తా బలవతా మగధేన గిరివ్రజాత్ ॥ 23
తిష్ఠతో మథురాయాం వై కృష్ణస్యాద్భుతకర్మణః ।
ఏకోనయోజనశతే సా పసాత గదా శుభా ॥ 24
భారతా! బలసంపన్నుడైన జరాసంధుడు తొంబదితొమ్మిది సార్లు తనగదను త్రిప్పి గిరివ్రజం నుండి దానిని విసిరాడు. తొంబది తొమ్మిది యోజనామ దూరంలో ఉన్న అద్భుత కర్మశీలుడయిన శ్రీకృష్ణుని రాజ్యం మగధలో ఆ గద పడింది. (23,24)
దృష్ట్వా పౌరైస్తదా సమ్యగ్ గదా చైవ నివేదితా ।
గదావసానం తత్ ఖ్యాతం మథురాయాః సమీపతః ॥ 25
పౌరులు అది చూచి ఆ విషయాన్ని శ్రీకృష్ణునకు తెలిపారు. ఆ గద పడినచోటు గదావసానమని ప్రసిద్ధికెక్కింది. (25)
తస్యాస్తాం హంసడింభకౌ అశస్త్రనిధనావుభౌ ।
మంత్రే మతిమతాం శ్రేష్ఠౌ నీతిశాస్త్రే విశారదౌ ॥ 26
ఆ జరాసంధునకు బుద్ధిమంతులలో శ్రేష్ఠులు నీతిశాస్త్రవిశారదులు అయిన మంత్రులు ఇద్దరుండేవారు. వారే హంసడింభకులు. ఏ ఆయుధంచేతనూ వారు చావరు. (26)
యౌ తౌ మయా తే కథితౌ పూర్వమేవ మహాబలౌ ।
త్రయస్త్రయాణాం లోకానాం పర్యాప్తా ఇతి మే మతిః ॥ 27
మహాబలులయిన వారిని గురించి నేను నీకు ముందే చెప్పాను. ఈ ముగ్గురు మూడు లోకాలనూ ఎదిరించటానికి సమర్థులని నా భావం. (27)
ఏవమేవ తదా వీర బలిభిః కుకురాంధకైః ।
వృష్ణిభిశ్చ మహారాజ నీతిహేతోరుపేక్షితః ॥ 28
వీరమహారాజా! ఈ రీతిగా నీతిని అనుసరించి యే నాడు బలవంతులయిన కుకుర-అంధక-వృష్ణివీరులు జరాసంధుని ఉపేక్షించారు. (28)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి జరాసంధ ప్రశంసాయా మేకోనవింశతి తమోఽధ్యాయః ॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున జరాసంధ ప్రశంస అను పందొమ్మిదవ అధ్యాయము. (19)