18. పదునెనిమిదవ అధ్యాయము

జరాసంధనామకరణము.

రాక్షస్యువాచ
జరా నామాస్మి భద్రం తే రాక్షసీ కామరూపిణీ ।
తవ వేశ్మని రాజేంద్ర పూజితా న్యవసం సుఖమ్ ॥ 1
రాక్షసి ఇలా అన్నది -
రాజేంద్రా నేను కామరూపిణి అయిన రాక్షసిని. నా పేరు జర. నీ ఇంట పూజింపబడుతూ సుఖంగా ఉన్నాను. (1)
గృహే గృహే మనుష్యాణాం నిత్యం తిష్ఠామి రాక్షసీ ।
గృహదేవీతి నామ్నా వై పురా సృష్టా స్వయంభువా ॥ 2
నేను మానవలోకంలో ఇంటింటా ఉంటాను. నేను రాక్షసినే. కానీ గృహదేవి అన్న పేరుతో విధి నన్ను ఎప్పుడో సృష్టించాడు. (2)
దానవానాం వినాశాయ స్థాపితా దివ్యరూపిణీ ।
యో మాం భక్త్యా లిఖేత్ కుడ్యే సపుత్రాం యౌవనాన్వితామ్ ॥ 3
గృహే తస్య భవేద్ వృద్ధిః అన్యథా క్షయామాప్నుయాత్ ।
త్వద్గృహే తిష్ఠమానాహం పూజితాహం సదా విభో ॥ 4
దానవవినాశనం కోసం నన్ను నియోగించాడు బ్రహ్మ. నేను దివ్యరూపం గలదానను. నన్ను పుత్రవతి అయిన యువతిగా ఇంటిగోడలపై చిత్రిస్తే ఆ ఇంట అభివృద్ధి ఉంటుంది. లేకపోతే హాని కలుగుతుంది. నీ ఇంట చాలా కాలం నుండి నేను పూజల నందుకొంటున్నాను. (3,4)
లిఖితా చైవ కుడ్యేషు పుత్రైర్బహుభిరావృతా ।
గంధపుష్పైస్తథా ధూపైఃభక్ష్యభోజ్యైః సుపూజితా ॥ 5
బహుపుత్రవతినిగా నన్ను గోడలపై చిత్రించారు. గంధ, పుష్ప, ధూప, భక్ష్య, భోజ్యాలతో సత్కరించారు. (5)
సాహం ప్రత్యుపకారార్థం చింతయామ్యనిశం తవ ।
తవేమే పుత్రశకలే దృష్టవత్యస్మి ధార్మిక ॥ 6
సంశ్లేషితే మయా దైవాత్ కుమారః సమపద్యత ।
తవ భాగ్యాన్మహారాజ హేతుమాత్రమహం త్విహ ॥ 7
దానికి ప్రత్యుకారమేదైనా నీకు చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తుంటాను. ధార్మికా! నీ కుమారుల ముక్కలను చూచాను. వాటిని కలిపాను.
అదృష్టవశాన కుమారుడయ్యాడు. ఇది నీ భాగ్యం వలన జరిగినది. నేను నిమిత్తమాత్రమే. (6,7)
(తస్య బాలస్య యత్ కృత్యం తత్ కురుష్వ నరాధిప ।
మమ నామ్నా చ లోకేఽస్మిన్ ఖ్యాత ఏష భవిష్యతి ॥)
(రాజా! ఆ బాలునకు తగిన సంస్కారాలను జరిపించు. నా పేరుతో ఇతడు ప్రఖ్యాతుడవుతాడు.)
మేరుం వా ఖాదితుం శక్తా కిం పునస్తవ బాలకమ్ ।
గృహసంపూజనాత్ తుష్ట్యా మయా ప్రత్యర్పితస్తవ ॥ 8
నేను మేరుపర్వతాన్ని అయినా తినగలను. నీ బాలకుడు ఇక లెక్క ఏమిటి? కాని నీ ఇంట నన్ను పూజించావు. కాబట్టి కుమారుని తిరిగి నీకు అర్పించాను. (8)
శ్రీకృష్ణ ఉవాచ
ఏవముక్త్వా తు సా రాజన్ తత్రైవాంతరధీయత ।
స సంగృహ్య కుమారం తం ప్రవివేశ గృహం నృపః ॥ 9
శ్రీకృష్ణుడిలా అన్నాడు.
రాజా! ఆ విధంగా పలికి జర అక్కడే మాయమయింది. రాజు ఆ కుమారుని తీసికొని ఇంటిలోనికి వెళ్ళాడు. (9)
తస్య బాలస్య యత్ కృత్యం తచ్చకార నృపస్తదా ।
ఆజ్ఞాపయచ్చ రాక్షస్యాః మగధేషు మహోత్సవమ్ ॥ 10
అప్పుడు బృహద్రథుడు ఆ బాలకునకు తగిన సంస్కారాలు జరిపించాడు. మగధదేశంలో ఆ రాక్షసికి మహోత్సవాలు జరపాలని ఆదేశించాడు. (10)
తస్య నామాకరోచ్చైవ పితామహసమః పితా ।
జరయా సంధితో యస్మాత్ జరాసంధో భవత్వయమ్ ॥ 11
'జరచేత కలుపబడినవాడు కాబట్టి జరాసంధుడు అగుగాక' అని బ్రహ్మసమానుడైన తండ్రి ఆ బాలకునకు పేరుపెట్టాడు. (11)
సోఽవర్ధత మహాతేజాః మగధాధిపతేః సుతః ।
ప్రమాణబలసంపన్నః హుతాహుతిరివానలః ॥ 12
ఆ మగధాధిపతి కుమారుడు మహాతేజస్వియై, తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగిస్తూ మహాకృతి, గొప్పబలం కలిగి శుక్లపక్ష చంద్రునివలె, నేయి పోసిన అగ్నివలె వృద్ధిపొందాడు. (12)
ఇతి శ్రీమహాభారతే సభాపర్వణి రాజసూయారంభపర్వణి జరాసంధోత్పత్తౌ అష్టాదశోఽధ్యాయః ॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున సభాపర్వమున రాజసూయారంభపర్వమను ఉపపర్వమున జరాసంధోత్పత్తి అను పదునెనిమిదవ అధ్యాయము. (18)
(దాక్షిణాత్య అధికపాఠము 1 శ్లోకము కలిపి మొత్తం 13 శ్లోకాలు)