205. రెండు వందల అయిదవ అధ్యాయము

పాండవులను తీసికొనివచ్చుటకు విదురుడు ద్రుపదుని కడకేగుట.

ధృతరాష్ట్ర ఉవాచ
భీష్మః శాంతనవో విద్వాన్ ద్రోణశ్చ భగవానృషిః ॥ 1
హితం చ పరమం వాక్యం త్వం చ సత్యం బ్రవీషి మామ్ ॥ 1
ధృతరాష్ట్రుడు చెప్పాడు - విదురా! శంతనునందనుడు భీష్ముడు జ్ఞాని. ద్రోణుడు ఋషి. వారి మాటలు మేలు చేస్తాయి. నీ మాటలు చాలా హితం కలిగిస్తాయి. ఇంకా సత్యాలు. (1)
యథైవ పాండోస్తే వీరాః కుంతీపుత్రా మహారథాః ।
తథైవ ధర్మతః సర్వే మమ పుత్రా న సంశయః ॥ 2
మహారథులు, కుంతీపుత్రులు, పాండుకుమారులు అయిన పాండవులు ధర్మంగా నాకూ పుత్రులే అన్నది సందేహంలేని మాట. (2)
యథైవ మమ పుత్రాణామ్ ఇదం రాజ్యం విధీయతే ।
తథైవ పాండుపుత్రాణామ్ ఇదం రాజ్యం న సంశయః ॥ 3
నా పుత్రులకు ఈ రాజ్యం ఎలా చెందుతుందో పాండవులకూ అలాగే చెందుతుంది. ఈ మాట నిస్సందేహం. (3)
క్షత్తరానయ గచ్ఛైతాన్ సహ మాత్రా సుసత్కృతాన్ ।
తయా చ దేవరూపిణ్యా కృష్ణయా సహ భారత ॥ 4
విదురా! నీవు ఇప్పుడే పోయి, కుంతిని, పాండవులను, దైవాంశగల ద్రౌపదిని తోడ్కొని రమ్ము. (4)
దిష్ట్యా జీవంతి తే పార్థాః దిష్ట్యా జీవతి సా పృథా ।
దిష్ట్యా ద్రుపదకన్యాం చ లబ్ధవంతో మహారథాః ॥ 5
కుంతి కూడా అదృష్టవశాన జీవించి ఉంది. కుంతీపుత్రులు బ్రతికి ఉండటం మన అదృష్టం, మహారథులైన పాండవులు ద్రుపదకన్యను స్వీకరించటం మరీ అదృష్టం. (5)
దిష్ట్యా వర్ధామహే సర్వే దిష్ట్యా శాంతః పురోచనః ।
దిష్ట్యా మమ పరం దుఃఖమ్ అపనీతం మహాద్యుతే ॥ 6
తేజస్వీ! అదృష్టం కొలది మనం వృద్ధి పొందాం. పురోచనుడు దూరమయ్యాడు. నా దుఃఖమంతా తొలగిపోయింది. (6)
వైశంపాయన ఉవాచ
తతో జగామ విదురః ధృతరాష్ట్రస్య శాసనాత్ ।
సకాశం యజ్ఞసేనస్య పాండవానాం చ భారత ॥ 7
సముపాదాయ రత్నాని వసూని వివిధాని చ ।
ద్రౌపద్యాః పాండవానాం చ యజ్ఞసేనస్య చైవ హ ॥ 8
వైశంపాయనుడు అన్నాడు - జనమేజయా! ధృతరాష్ట్రుని ఆజ్ఞానుసారం విదురుడు ద్రౌపదికి, పాండవులకు, ద్రుపదునికి కానుకలను తీసికొని పాండవులను చేరాడు. (7,8)
తత్ర గత్వా స ధర్మజ్ఞః సర్వశాస్త్రవిశారదః ।
ద్రుపదం న్యాయతో రాజన్ సంయుక్తముపతస్థివాన్ ॥ 9
రాజా! పాంచాల రాజధానికి పోయి సర్వశాస్త్ర పారంగతుడు, ధర్మజ్ఞుడైన విదురుడు పెద్దల నుంచి పిన్నల వరకు క్రమం అనుసరించి నమస్కరించాడు. (9)
స చాపి ప్రతిజగ్రాహ ధర్మేణ విదురం తతః ।
స్నేహాత్ పరిష్వజ్య స తాన్ పప్రచ్ఛానామయం తతః ॥ 10
రాజైన ద్రుపదుడు ధర్మంగా విదురుని ఆదరించాడు. పిమ్మట ఇరువురు ఒకరినుంచి వేరొకరు కుశలప్రశ్నలడిగి క్షేమం తెలుసుకొన్నారు. (10)
దదర్శ పాండవాంస్తత్ర వాసుదేవం చ భారత ।
స్నేహాత్ పరిష్వజ్య స తాన్ పప్రచ్ఛానామయం తతః ॥ 11
భారతా! విదురుడు పాంచాలరాజ్యంలో శ్రీకృష్ణుని, పాండవులను చూశాడు. ప్రేమతో కౌగిలించుకొని వారిని కుశలమడిగి సంతృప్తి పడ్డాడు. (11)
తైశ్చాప్యమితబుద్ధిః సః పూజితో హి యథాక్రమమ్ ।
వచనాత్ ధృతరాష్ట్రస్య స్నేహయుక్తం పునః పునః ॥ 12
పప్రచ్ఛానామయం రాజన్ తతస్తాన్ పాండునందనాన్ ।
ప్రదదౌ చాపి రత్నాని వివిధాని వసూని చ ॥ 13
పాండవానాం చ కుంత్యాశ్చ ద్రౌపద్యాశ్చ విశాంపతే ।
ద్రుపదస్య చ పుత్రాణాం యథా దత్తాని కౌరవైః ॥ 14
వారందరు బుద్ధిమంతుడైన విదురుని తగిన రీతిలో ఆదరించారు. ధృతరాష్ట్ర వచనానుసారం పాండవులను ఒక్కొక్కరిని క్షేమం, అడిగి తెలుసుకొన్నాడు. పాండవులకు, కుంతికి, ద్రుపదునికి అతని పుత్రులకు కౌరవులిచ్చిన ఆభరణాలు, రత్నాలు, ధనాలు ఇచ్చాడు. (12-14)
ప్రోవాచ చామితమతిః ప్రశ్రితం వినయాన్వితః ।
ద్రుపదం పాండుపుత్రాణాం సంనిధౌ కేశవస్య చ ॥ 15
అమితబుద్ధి గల విదురుడు, శ్రీకృష్ణపాండవుల ఎదుట వినయంతో నమ్రతతో ఇలా పలికాడు. (15)
విదుర ఉవాచ
రాజంచ్ర్ఛుణు సహామాత్యః సపుత్రశ్చ వచో మమ ।
ధృతరాష్ట్రః సపుత్రస్త్వాం సహామాత్యః సబాంధనః ॥ 16
అబ్రవీత్ కుశలం రాజన్ ప్రీయమాణః పునః పునః ।
ప్రీతిమాంస్తే దృఢం చాపి సంబంధేన నరాధిప ॥ 17
విదురుడు పలికాడు - ద్రుపదమహారాజా! పుత్రులు, మంత్రులతో కలిసి మీరు నా మాటలు వినండి. చక్రవర్తి ధృతరాష్ట్రుడు పుత్ర, మిత్ర, బంధు, మంత్రి గణసహితులైన మిమ్ములను క్షేమం అడిగాడు. మీపై ప్రసన్నత చూపాడు.
మహారాజా! మీ సంబంధం మాకు ప్రీతినిస్తోంది అని చెప్పమని నన్ను పంపాడు. (16,17)
తథా భీష్మః శాంతనవః కౌరవైః సహ సర్వశః ।
కుశలం త్వాం మహాప్రాజ్ఞః సర్వతః పరిపృచ్ఛతి ॥ 18
శంతనునందనుడు, గొప్ప ప్రజ్ఞకల భీష్ముడు కౌరవులందరితో గూడి మీ క్షేమాన్ని అన్నివిధాల కాంక్షించాడు. (18)
భారద్వాజో మహాప్రాజ్ఞః ద్రోణః ప్రియసఖస్తవ ।
సమాశ్లేషముపేత్య త్వాం కుశలం పరిపృచ్ఛతి ॥ 19
భరద్వాజనందనుడు, ప్రజ్ఞాపాటవాలు గల నీ ప్రియస్నేహితుడు, ద్రోణుడు నిన్ను కౌగిలించుకొని కుశలప్రశ్నలను అడిగాడు. (19)
ధృతరాష్ట్రశ్చ పాంచాల్య త్వయా సంబంధమీయివాన్ ।
కృతార్థం మన్యతేఽఽత్మానం తథా సర్వేఽపి కౌరవాః ॥ 20
పాంచాలరాజా! ధృతరాష్ట్ర మహారాజు మీతో సంబంధం కలియటం వల్ల తనను ధన్యునిగా భావించాడు. కౌరవులందరు కూడ ఇట్లే భావించారు. (20)
న తథా రాజ్యసంప్రాప్తిః తేషాం ప్రీతికరీ మతా ।
యథా సంబంధకం ప్రాప్య యజ్ఞసేన త్వయా సహ ॥ 21
యజ్ఞసేనా! వారికి రాజ్యప్రాప్తి కూడా అంతప్రీతిని కలిగించలేదు. మీ సంబంధం వారిని అన్నివిధాల ప్రసన్నులను చేసింది. (21)
ఏతద్ విదిత్వా తు భవాన్ ప్రస్థాపయతు పాండవాన్ ।
ద్రష్టుం హి పాండుపుత్రాంశ్చ త్వరంతి కురవో భృశమ్ ॥ 22
దీనిని తెలిసికొని మీరు పాండవులను హస్తినకు పంపాలి. కురువంశీయులు అందరూ చచ్చి బ్రతికిన వారిని చూడాలి అని ఆకాంక్షిస్తున్నారు. (22)
విప్రోషితా దీర్గకాలమ్ ఏతే చాపి నరర్షభాః ।
ఉత్సుకా నగరం ద్రష్టుం భవిష్యంతి తథా పృథా ॥ 23
చాలాకాలం నుంచి వీరు పరదేశాలలో జీవించారు. పాండవులు, కుంతి కూడ తమ పూర్వనగరాన్ని చూడాలనే కుతూహలంతో ఉంటారు. (23)
కృష్ణామపి చ పాంచాలీం సర్వాః కురువరస్త్రియః ।
ద్రష్టుకామాః ప్రతీక్షంతే పురం చ విషయాశ్చ నః ॥ 24
కౌరవకులంలోని శ్రేష్ఠులైన స్త్రీలు గాంధారి మొదలగువారు, హస్తినాపుర ప్రజలు పాంచాలరాజ పుత్రిని చూడాలనే కోరికతో ఆమె రాకకై ఎదురు చూస్తున్నారు. (24)
స భవాన్ పాండుపుత్రాణామ్ ఆజ్ఞాపయతు మా చిరమ్ ।
గమనం సహదారాణామ్ ఏతదత్ర మతం మమ ॥ 25
అందుచే మీరు పాండుపుత్రులను భార్యతో హస్తినకు రమ్మని ఆజ్ఞాపించాలి. ఇది నాకూ ఇష్టం. (25)
నిసృష్టేషు త్వయా రాజన్ పాండవేషు మహాత్మసు ।
తతోఽహం ప్రేషయిష్యామి ధృతరాష్ట్రస్య శీఘ్రగాన్ ।
ఆగమిష్యంతి కౌంతేయాః కుంతీ చ సహ కృష్ణయా ॥ 26
రాజా! వారిని హస్తినాపురానికి వెళ్లమని మీరు ఆజ్ఞాపిస్తే నేను వారి రాకను తెల్పటానికి తొందరగా చేరే దూతలను హస్తినకు పంపుతాను. కుంతి, ద్రౌపది, పాండవులు హస్తినకు వస్తున్నారని ధృతరాష్ట్రునకు వారు తెల్పుతారు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమన రాజ్యలంభపర్వణి విదురద్రుపదసంవాదే పంచాధిక ద్విశతతమోఽధ్యాయః ॥ 205 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమన రాజ్యలంభపర్వమను
ఉపపర్వమున విదురద్రుపదసంవాదము అను రెండువందల అయిదవ అధ్యాయము. (205)