204. రెండు వందల నాల్గవ అధ్యాయము
భీష్మ, ద్రోణుల మాటలను విదురుడు సమర్థించుట.
విదుర ఉవాచ
రాజన్ నిస్సంశయం శ్రేయః వాచ్యస్త్వమపి బాంధవైః ।
న త్వశుశ్రూషమాణే వై వాక్యం సంప్రతితిష్ఠతి ॥ 1
రాజా! మీహితైషుల కర్తవ్యం, శ్రేయస్సును సందేహించక పలుకటయే. మీరు విననిచో ఆ హిత వాక్యాలకు విలువ ఎంత మాత్రం లేదు. (1)
ప్రియం హితం చ తద్ వాక్యమ్ ఉక్తవాన్ కురుసత్తమః ।
భీష్మః శాంతనవో రాజన్ ప్రతిగృహ్ణాసి తన్న చ ॥ 2
తథా ద్రోణేన బహుధా భాషితం హితముత్తమమ్ ।
తచ్చ రాధాసుతః కర్ణః మన్యతే న హితం తవ ॥ 3
రాజా! శంతనుపుత్రుడు భీష్ముడు నీకు ప్రియహితవాక్యాలు చెప్పాడు. కాని ఆ వచనాల్ని మీరు గ్రహించటం లేదు. ద్రోణుడు కూడ హితమే చెప్పాడు. రాధానందనుడు కర్ణుడు ఆ వాక్యాలు మీకు మేలు కలిగించవని భావించాడు. (2,3)
చింతయంశ్చ న పశ్యమి రాజంస్తవ సుహృత్తమమ్ ।
అభ్యాం పురుషసింహాభ్యాం యో వా స్యాత్ ప్రజ్ఞయాధికః ॥ 4
మహారాజా! ఈ పురుషశ్రేష్ఠులకంటే విచారణలో అధికులు, మీ మేలు కోరేవారు ఎంత విచారించినా నాకు కనపడలేదు. (4)
ఇమౌ హి వృద్ధౌ వయసా ప్రజ్ఞయా శ్రుతేన చ ।
సమౌ చ త్వయి రాజేంద్ర తథా పాండుసుతేషు చ ॥ 5
రాజేంద్రా! వయస్సు, ప్రజ్ఞ, శాస్త్రాలలో వీరిద్దరు ఒకరికొకరు తీసిపోరు. వీరు మీ మీద, పాండుపుత్రుల మీద సమానమైన ప్రేమ కలవారని చెప్పాలి. (5)
ధర్మే చానవరౌ రాజన్ సత్యతాయాం చ భారత ।
రామాద్ దాశరథేశ్చైవ గయాచ్చైవ న సంశయః ॥ 6
భరతశ్రేష్ఠా! ధర్మంలో, సత్యంలో వీరిద్దరు దశరథరామునికంటె, గయునికంటె అధికులనటంలో సంశయం లేదు. (6)
న చోక్తవంతావశ్రేయః పురస్తాదపి కించన ।
న చాప్యపకృతం కించిత్ అనయోర్లక్ష్యతే త్వయి ॥ 7
మీకు అనిష్టం కల్గించే మాటలు వీరెప్పుడూ మీ ఎదుట పలుకలేదు. అదేవిధంగా నాకు తెలిసి మీకు వీరు అపకారం చేసిన గుర్తులేదు. (7)
తావుభౌ పురుషవ్యాఘ్రౌ అనాగసి నృపే త్వయి ।
న మంత్రయేతాం త్వచ్ఛ్రేయః కథం సత్యపరాక్రమౌ ॥ 8
మహారాజా! మీకు వారి విషయాన అపరాథ చింత అవసరం లేదు. ఆ పురుష శ్రేష్ఠులు మీకు హితం చేసేవారే. (8)
ప్రజ్ఞావంతౌ నరశ్రేష్ఠౌ అస్మింల్లోకే నరాధిప ।
త్వన్నిమిత్తమతో నేమౌ కించిజ్జిహ్మం వదిష్యతః ॥ 9
రాజా! వీరు లోకంలో నరశ్రేష్ఠులు, బుద్ధిమంతులు, కావున మీకు వంచనతో కూడిన మాటలను చెప్పరు. (9)
ఇతి మే నైష్ఠికీ బుద్ధిః వర్తతే కురునందన ।
న చార్థహేతోర్ధర్మజ్ఞౌ వక్ష్యతః పక్షసంశ్రితమ్ ॥ 10
కురునందనా! ధర్మం తెలిసిన వారు స్వార్థం కోసం ఏదో ఒక పక్షాన లాభం పొందాలనే ఆలోచన చేయనివారు అని నా విశ్వాసం. (10)
ఏతద్ధి పరమం శ్రేయః మన్యేఽహం తవ భారత ।
దుర్యోధనప్రభృతయః పుత్రా రాజన్ యథా తవ ॥ 11
తథైవ పాండవేయాస్తే పుత్రా రాజన్ న సంశయః ।
తేషు చేదహితం కించిత్ మంత్రయేయురతద్విదః ॥ 10
మంత్రిణస్తే న చ శ్రేయః ప్రపశ్యంతి విశేషతః ।
అథ తే హృదయే రాజన్ విశేషః స్వేషు వర్తతే ।
అంతరస్థం వివృణ్వానాః శ్రేయః కుర్యుర్న తే ధ్రువమ్ ॥ 13
భరతశ్రేష్ఠా! వీరి అభిప్రాయం నీకు కళ్యాణకారకం. దుర్యోధనాదుల వలె పాండవులు నీ పుత్రులే. సందేహం లేదు. దీనిని తెలియని ఇతరమంత్రులు మీ శ్రేయస్సును గుర్తింపలేరు. మీకుమారులపై మీకున్న పక్షపాతం వీరిమాటల్లో తెలిసినందున వారు మీకు కీడే చేస్తారు. (11-13)
ఏతదర్థమిమౌ రాజన్ మహాత్మానౌ మహాద్యుతీ ।
నోచతుర్వివృతం కించిద్ న హ్యేష తవ నిశ్చయః ॥ 14
కావున వీరిద్దరు తేజస్వులూ, మాహాత్ములు; కించిత్తు కూడా తగని సలహా ఇవ్వలేదు. కాని మీరు వీరి ఆలోచనను అంగీకరించలేదు. (14)
యచ్చాప్యశక్యతాం తేషామహతుః పురుషర్షభౌ ।
తత్ తథా పురుషవ్యాఘ్ర తవ తద్ భద్రమస్తు తే ॥ 15
పాండవులు అజేయులని వీరు ప్రశంసించిన మాటలు సత్యాలు. పురుషశ్రేష్ఠా! మీకు కళ్యాణం కలగాలి. (15)
కథం హి పాండవః శ్రీమాన్ సవ్యసాచీ ధనంజయః ।
శక్యో విజేతుం సంగామే రాజన్ మఘవతాపి హి ॥ 16
రాజా! సవ్యసాచి, ధనంజయుడు శ్రీమంతుడు. అతనిని యుద్ధంలో ఇంద్రుడైనా జయించలేడు. (16)
భీమసేనో మాహాబాహుః నాగాయుతబలో మహాన్ ।
కథం స్మ యుధి శక్యేత విజేతుమమరైరపి ॥ 17
వేయి ఏనుగుల బలం కల బాహుబలశాలి భీమసేనుని సమరంలో అమరులైనా గెలువలేరు. (17)
తథైవ కృతినౌ యుద్ధే యమౌ యమసుతావివ ।
కథం విజేతుం శక్యౌ తౌ రణే జీవితుమిచ్ఛతా ॥ 18
అలాగే యముని సుతులతో సమానులు, కవలలు, నకులసహదేవులను యుద్ధంలో జీవితాశ గలవారు ఎవరు ఎదుర్కొంటారు? (18)
యస్మిన్ ధృతిరనుక్రోశః క్షమా సత్యం పరాక్రమః ।
నిత్యాను పాండవే జ్యేష్ఠే స జీయేత రణే కథమ్ ॥ 19
యుధిష్ఠిరునిలో ధైర్యం, దయ, ఓర్పు, సత్యం, పరాక్రమం సదా ఉంటాయి - యుద్ధంలో అతనిని జయించటం అసాధ్యం. (19)
యేషాం పక్షధరో రామః యేషాం మంత్రీ జనార్దనః ।
కిం ను తైరజితం సంఖ్యే యేషాం పక్షే చ సాత్యకిః ॥ 20
బలరాముడు, ఉపాయశాలి శ్రీకృష్ణుడు, అతని తమ్ముడు సాత్యకి ఎవరి పక్షంలో ఉన్నారో వారిని ఓడించటం చాలా కష్టం. (20)
ద్రుపదః శ్వశురో యేషాం యేషాం శ్యాలాశ్చ పార్షతాః ।
ధృష్టద్యుమ్నముఖా వీరా భ్రాతరో ద్రుపదాత్మజాః ॥ 21
సోఽశక్యతాం చ విజ్ఞాయ తేషామగ్రే చ భారత ।
దాయాద్యతాం చ ధర్మేణ సమ్యక్ తేషు సమాచర ॥ 22
పాండవులు ద్రుపదుని అల్లుళ్లు. ధృష్టద్యుమ్నుని బావలు. వారిని జయించటం అసంభం. భరతశ్రేష్ఠా! ధర్మబద్ధంగా పాండవులు ఈ రాజ్యానికి ఉత్తరాధికారులు. ఈ విషయాన్ని మరువకుండా తగిన దానిని చెయ్యి. (21,22)
ఇదం నిర్దిష్టమయశః పురోచనకృతం మహత్ ।
తేషామనుగ్రహేణాద్య రాజన్ ప్రక్షాళయాత్మనః ॥ 23
రాజా! పురోచనుని పని వల్ల మీ అపకీర్తి అన్నివైపులకు పాకింది. పాండవులను అనుగ్రహించి ఈ మచ్చ పోగొట్టుకో. (23)
తేషామనుగ్రహశ్చాయం సర్వేషాం చైవ నః కులే ।
జీవితం చ పరం శ్రేయః క్షత్రస్య చ వివర్ధనమ్ ॥ 24
పాండవులపై చూపే ఈ అనుగ్రహం మన కులాన్ని రక్షిస్తుంది. హితాన్ని చేకూరుస్తుంది, క్షత్రియజాతి కంతటికి మేలు చేస్తుంది. (24)
ద్రుపదోఽపి మహాన్ రాజా కృతవైరశ్చ నః పురా ।
తస్య సంగ్రహణం రాజన్ స్వపక్షస్య వివర్ధనమ్ ॥ 25
రాజా! ద్రుపదుడు చాలా బలశాలి. మనకు అతనితో పూర్వం వైరం ఉంది. ఆయన్ని మనపక్షంలో చేర్చుకోవటం మనకు అభ్యుదయకరం. (25)
బలవంతశ్చ దాశార్హాః బహవశ్చ విశాంపతే ।
యతః కృష్ణస్తతః సర్వే యతః కృష్ణస్తతో జయః ॥ 26
మహారాజా! యదువంశీయుల సంఖ్య అధికం. పైగా బలవంతులు. కృష్ణుని పక్షమే వారి పక్షం. కృష్ణు డే పక్షాన ఉంటాడో వారికే జయం కలుగుతుంది. (26)
యచ్చ సామ్నైవ శక్యేత కార్యం సాదయితుం నృప ।
కో దైవశప్తస్తత్ కార్యం విగ్రహేణ సమాచరేత్ ॥ 27
సామోపాయం చే సాధ్యమయ్యే కార్యాన్ని దైవోపహతుడు యుద్ధంతో సాధించాలని చూస్తాడు. (27)
శ్రుత్వా చ జీవితః పార్థాన్ పౌరజానపదా జనాః ।
బలవద్ దర్శనే హృష్టాః తేషాం రాజన్ ప్రియం కురు ॥ 28
కుంతీపుత్రులు మరణించలేదని విని పౌరులు, జానపదులు వారిని చూసి సంతోషించారు. రాజా! వారికందరికీ ప్రియాన్ని ఆచరించు. (28)
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః ।
అధర్మయుక్తా దుష్ప్రజ్ఞాః బాలా మైషాం వచః కృథాః ॥ 29
దుర్యోధనుడు, కర్ణుడు, శకుని అధర్మపరాయణులు, బాలురు. ముందువచ్చే ఆపదలను తెలుసుకోలేరు.
వారి మాటలను ఆచరింపవద్దు.
ఉక్తమేతత్ పురా రాజన్ మయా గునవతస్తవ ।
దుర్యోధనాపరాధేన ప్రజేయం వై వినంక్ష్యతి ॥ 30
భూపాలా! గుణవంతులు మీరు. మీకు పూర్వమే దీనిని వివరించాను. దుర్యోధనుని తప్పుల వల్ల సమస్త ప్రజలు నశిస్తారు. (30)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి విదురాగమనరాజ్యలంభపర్వణి
విదురవాక్యే చతురధికద్విశతతమోఽధ్యాయః ॥ 204 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున విదురాగమనరాజ్యలంభపర్వమను
ఉపపర్వమున విదురవాక్యమను రెండువందల నాల్గవ అధ్యాయము. (204)