195. నూటతొంబది అయిదవ అధ్యాయము
వ్యాసుని ఎదుట ద్రౌపదీవివాహచర్చ.
వైశంపాయన ఉవాచ
తతస్తే పాండవాః సర్వే పాంచాల్యశ్చ మహాయశాః ।
ప్రత్యుత్థాయ మహాత్మానం కృష్ణం సర్వేఽభ్యవాదయన్ ॥ 1
వైశంపాయనుడు చెప్పాడు - మహారాజా! తరువాత కీర్తిమంతుడైన ద్రుపదుడు, పాండవులందరు కలిసి ఎదురేగి, వ్యాసునికి భక్తిపూర్వకంగా నమస్కరించారు. (1)
ప్రతివంద్య స తామ్ పూజాం పృష్ట్వా కుశలమంతతః ।
ఆసనే కాంచనే శుద్ధే నిషసాద మహామనాః ॥ 2
వ్యాసమహర్షి వారి పూజను స్వీకరించి ప్రసన్నుడై కుశలప్రశ్నలడిగి, పవిత్రమయిన కాంచనపీఠంపై కూర్చున్నాడు. (2)
అనుజ్ఞాతాస్తు తే సర్వే కృష్ణేనామితతేజసా ।
ఆసనేషు మహార్హేషు నిషేదుర్ద్విపదాం వరాః ॥ 3
అమితతేజస్వియైన ద్వైపాయనుని ఆజ్ఞతో నరశ్రేష్ఠులైన వారందరు విలువైన పీఠాలపై ఆసీనులయ్యారు. (3)
తతో ముహూర్తాన్మధురాం వాణీముచ్చార్య పార్షతః ।
పప్రచ్ఛ తం మహాత్మానం ద్రౌపద్యర్థం విశాంపతే ॥ 4
కథమేకా బహూనాం స్యాత్ ధర్మపత్నీ న సంకరః ।
ఏతన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథమ్ ॥ 5
ఆసీనులయ్యాక కొద్ది సేపటికి ద్రుపదుడు మధురమైన కంఠస్వరంతో ద్రౌపదీభర్త విషయమై ద్వైపాయనుని ఇలా ప్రశ్నించాడు. మహాత్మా! భగవంతుడా! సాంకర్యదోషం లేకుండా ఒకతే చాలామందికి భార్య ఎలా కాగలదు? ఉన్నది ఉన్నట్లుగా నాకు స్పష్టంగా చెప్పండి. (4,5)
వ్యాస ఉవాచ
అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోకవేదవిరోధకే ।
యస్య యస్య మతం యత్ యద్ శ్రోతుమిచ్ఛామి తస్య తత్ ॥ 6
వ్యాసుడు అన్నాడు - మిక్కిలి గహనమగుటచే లోకవేదవిరుద్ధంగా కన్పట్టే ఈ విషయంలో మీ మీ అభిప్రాయాలను వినాలనుకొంటున్నాను. (6)
ద్రుపద ఉవాచ
అధర్మోఽయం మమ మతః విరుద్ధో లోకవెదయోః ।
న హ్యేకా విద్యతే పత్నీ బహూనాం ద్విజసత్తమ ॥ 7
ద్రుపదుడు చెప్పాడు - విప్రోత్తమా! నాకిది అధర్మమనిపిస్తోంది. అంతేగాక ఇది లోకవేదాలకూ విరుద్ధం. చాలా మంది పురుషులకు ఒకతే భార్యకావటం లోకంలో ఉండదు. (7)
న చాప్యాచరితః పూర్వైః అయం ధర్మో మహాత్మభిః ।
న చాప్యధర్మో విద్వద్భిః చరితవ్యః కథంచన ॥ 8
పూర్వులైన మహాత్ములీ ధర్మాన్ని పాటించలేదు. విద్వాంసులైన పురుషులు ఇటువంటి అధర్మాన్ని ఎప్పుడూ ఆచరించరాదు. (8)
తతోఽహం న కరోమ్యేనం వ్యవసాయం క్రియాం ప్రతి ।
ధర్మః సదైవ సందిగ్ధః ప్రతిభాతి హి మే త్వయమ్ ॥ 9
అందువలన లోకవిరుద్ధమైన ఈ పనిని నేను ఆచరించను. ఈ ధర్మం ఎప్పుడూ సందేహాస్పదమే అని నాకనిపిస్తోంది. (9)
ధృష్టద్యుమ్న ఉవాచ
యవీయసః కథం భార్యాం జ్యేష్ఠో భ్రాతా ద్విజర్షభ ।
బ్రహ్మన్ సమభివర్తేత స వృత్తః సంస్తపోధన ॥ 10
ధృష్టద్యుమ్నుడు అన్నాడు - తపోధనా! మీరు బ్రాహ్మణులు. మీరే ఈ సంశయాన్ని తీర్చగలరు. సదాచారవంతుడైన జ్యేష్ఠసోదరుడు తమ్ముని భార్యయందెట్లు ప్రవర్తింపగలడు? (10)
న తు ధర్మస్య సూక్ష్మత్వాత్ గతిం విద్మః కథంచన ।
అధర్మో ధర్మ ఇతి వా వ్యవసాయో న శక్యతే ॥ 11
కర్తుమస్మ ద్విధైర్బహన్ తతోఽయం న వ్యవస్యతే ।
పంచానాం మహిషీ కృష్ణా భవిత్యితి కథంచన ॥ 12
ధర్మస్వరూపమే అత్యంతసూక్ష్మం. దాని గతిని ఎవరూ తెలుసుకోలేరు. మా వంటివారికి ధర్మాధర్మనిశ్చయం అశక్యం. అందువలన మేము ఇటువంటి వ్యవహారాలను అనుమతింపలేము. ద్రౌపది అయిదుగురికి భార్య కావటం ఏ విధంగానూ కుదరదు. (11,12)
యుదిష్ఠిర ఉవాచ
న మే వాగనృతం ప్రాహ నాధర్మే ధీయతే మతిః ।
వర్తతే హి మనో మేఽత్ర నైషోఽధర్మః కథంచన ॥ 13
శ్రూయతే హి పురాణేఽపి జటిలా నామ గౌతమీ ।
ఋషీనధ్యాసితవతీ సప్త ధర్మభృతాం వర ॥ 14
యుధిష్ఠిరుడు చెప్పాడు - నా మాటలెన్నడూ అసత్యాలు కావు. అధర్మంపై నాబుద్ధి ప్రవర్తించదు. ఈ వివాహాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది. కాబట్టి ఇది ఎన్నడును అధర్మం కాదు. పురాణాలలో జటిల అనే గౌతమగోత్రకన్య ఏడుగురు ఋషులను వివాహం చేసికొన్నది. (13,14)
తథైవ మునిజా వార్షీ తపోభిర్భావితాత్మనః ।
సంగతాభాత్ దశ భ్రాతౄనేకనామ్నః ప్రచేతసః ॥ 15
అట్లే కండుమహర్షి పుత్రికయైన వార్షి తపస్సులచే పవిత్రాలైన అంతఃకరణాలు కల ప్రచేతసుని పుత్రులను ఒకే పేరు గల వారిని పదిమందిని వివాహమాడింది. (15)
గురోర్హి వచనం ప్రాహుః ధర్మ్యం ధర్మజ్ఞసత్తమ ।
గురూణాం చైవ సర్వేషాం మాతా పరమకో గురుః ॥ 16
ధర్మజ్ఞులలో శ్రేష్ఠుడా! గురుజనుల ఆజ్ఞ ధిక్కరింప వీలుకానిది. ధర్మబద్ధమైనది. సమస్త గురుజనులలో తల్లియే ఉత్కృష్టమైన గురువు. (16)
సా చాప్యుక్తవతీ వాచం భైక్షవత్ భుజ్యతామితి ।
తస్మాదేతదహం మన్యే పరం ధర్మం ద్విజోత్తమ ॥ 17
అట్టి మాతల్లి మీరందరు ఈమెను భిక్షవలె అనుభవించండని పల్కింది. కావున మా అయిదుగురితో ఈ ద్రౌపది వివాహం ధర్మయుక్తమే. (17)
కుంత్యువాచ
ఏవమేతత్ యథా ప్రాహ ధర్మచారీ యుధిష్ఠిరః ।
అనృతాన్మే భయం తీవ్రం ముచ్యేఽహమనృతాత్ కథమ్ ॥ 18
కుంతి పలికింది - ధర్మాచరణపరుడైన ధర్మజుడు పలికినది సత్యమే. నేను అట్లే నిర్దేశించాను. నాకు అసత్యం వలన భయమేర్పడింది. నన్నెట్లైననూ అసత్యదోషం నుండి దూరం చేసే ఉపాయం చెప్పు. (18)
వ్యాస ఉవాచ
అనృతాన్మోక్ష్యసే భద్రే ధర్మశ్చైవ సనాతనః ।
న తు వక్ష్యామి సర్వేషాం పాంచాల శృణు మే స్వయమ్ ॥ 19
వ్యాసుడు చెప్పాడు - కల్యాణీ! అసత్యదోషం నీకంటదు. ఇది సనాతనమైన ధర్మమే. కాని ఇది అందరికీ (వర్తిస్తుందని) చెప్పను. పాంచాలరాజా! నీవు ఏకాంతంగా విను. (19)
యథాయం విహితో ధర్మః యతశ్చాయం సనాతనః ।
యథా చ ప్రాహ కౌంతేయః తథా ధర్మో న సంశయః ॥ 20
ధర్మజుడు పల్కినట్లే ఇది ధర్మబద్ధం, సనాతనం. ధర్మజుడు పల్కినట్లిది నిస్సందేహంగా ధర్మవివాహమే. (20)
వైశంపాయన ఉవాచ
తత ఉత్థాయ భగవాన్ వ్యాసో ద్వైపాయనః ప్రభుః ।
కరే గృహీత్వా రాజానం రాజవేశ్మ సమావిశత్ ॥ 21
వైశంపాయనుడు చెప్పాడు. తర్వాత ద్వైపాయనుడు ఆసనం నుంచి లేచి ద్రుపదుని చేయిపట్టుకొని రాజభవనంలోనికి ప్రవేశించాడు. (21)
పాండవాశ్చాపి కుంతీ చ ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ।
వివిశుర్యత్ర తత్రైవ ప్రతీక్షంతీ స్మ తావుభౌ ॥ 22
పాండవులు, కుంతి, ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు అక్కడనే కూర్చుండి వారిరువురికోసం వేచి చూడసాగారు. (22)
తతో ద్వైపాయనస్తస్మై నరేంద్రాయ మహాత్మనే ।
ఆచఖ్యౌ తద్ యథా ధర్మః బహూనామేకపత్నితా ॥ 23
భవనం లోపలకు ప్రవేశించి ద్వైపాయనుడు మహాత్ముడు. నరశ్రేష్ఠుడైన ద్రుపదునితో చాలా మంది పురుషులు ఒకే భార్యను కలిగి ఉండటం ఎలా ధర్మమవుతుందో వివరించాడు. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహికపర్వణి వ్యాసవాక్యే పంచనవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 195 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున వ్యాసవాక్యమను నూటతొంబది అయిదవ అధ్యాయము. (195)