192. నూట తొంబది రెండవ అధ్యాయము

(వైవాహిక పర్వము)

ద్రుపదపురోహితుడు యుధిష్ఠిరాదులకు కలియుట.

వైశంపాయన ఉవాచ
తతస్తథోక్తః పరిహృష్టరూపః
పిత్రే శశంసాథ స రాజపుత్రః ।
ధృష్టద్యుమ్నః సోమకానాం ప్రబర్హః
వృత్తం యథా యేన హృతా చ కృష్ణా ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు.
ద్రుపదమహారాజు పలికిన మాటలు విని సోమకవంశ శ్రేష్ఠుడైన ధృష్టద్యుమ్నరాజకుమారుడు పరమానందపడి 'ద్రౌపదిని చేపట్టినవారెవరు'? మొదలైన వృత్తాంతమంతా చెప్పనారంభించాడు. (1)
ధృష్టద్యుమ్న ఉవాచ
యోఽసౌ యువా వ్యాయతలోహితాక్షః
కృష్ణాజినీ దేవసమానరూపః ।
యః కార్ముకాగ్ర్యం కృతవానధిజ్యం
లక్ష్యం చ యః పాతితవాన్ పృథివ్యామ్ ॥ 2
అసజ్జమానశ్చ తతస్తరస్వీ
వృతో ద్విజాగ్ర్యైరభిపూజ్యమానః ।
చక్రామ వజ్రీవ దితేః సుతేషు
సర్వైశ్చ దేవై ఋషిభిశ్చ జుష్టః ॥ 3
దృష్టద్యుమ్నుడిలా అన్నాడు.
వింటినెక్కుపెట్టి లక్ష్యాన్ని నేలపడగొట్టిన ఆ యువకుడు విశాలనేత్రుడు. కృష్ణాజినాన్ని ధరించాడు. దేవతలతో సమానమైన రూపం గలవాడు. ఆ వీరుడు ఇతరులతో ఎవ్వరితోనూ కలియక బ్రాహ్మణశ్రేష్ఠులు చుట్టు ముట్టి అభినందిస్తూ ఉండగా సర్వదేవతల, మహర్షుల మధ్యలో నిలిచిన దేవేంద్రుని వలె కనిపిస్తూ వేగంగా నిష్క్రమించాడు. (2,3)
కృష్ణా ప్రగృహ్యాజినమన్వయాత్ తం
నాగం యథా నాగవధూః ప్రహృష్టా ।
అమృష్యమాణేషు నరాధిపేషు
క్రుద్ధేషు వై తత్ర సమాపతత్సు ॥ 4
తతోఽపరః పార్థివ సంఘమధ్యే
ప్రవృద్ధమారుహ్య మహీప్రరోహమ్ ।
ప్రకాలయన్నేవ స పార్థివౌఘాన్
క్రుద్ధోఽంతకః ప్రాణభృతో యథైవ ॥ 5
అప్పుడు ద్రౌపది మిక్కిలి ప్రసన్నురాలై గజరాజును అనుసరించే హస్తినివలె వారి ననుసరించింది. సహించలేని రాజులందరూ కోపించి నాలుగువైపుల నుంచి వారిని ముట్టడించారు. వారిలో రెండవవాడైన వీరుడు పెద్దచెట్టును పెఱికి రాజమండలంలోనికి దుమికి యముడు కోపంతో సమస్తప్రాణులను సంహరించేటట్లు ఆ రాజసమూహాలన్నింటిని యముని వద్దకు పంపసాగాడు. (4,5)
తౌ పార్థివానాం మిషతాం నరేంద్ర
కృష్ణాముపాదాయ గతా నరాగ్ర్యౌ ।
విభ్రాజమానావివ చంద్రసూర్యౌ
బాహ్యాం పురాత్ భార్గవకర్మశాలామ్ ॥ 6
ద్రుపదమహారాజా! చంద్రసూర్యులవలె ప్రకాశిస్తున్న వారిరువురూ నరశ్రేష్ఠులు. వారు రాజులందరూ చూస్తూ ఉండగానే ద్రౌపదితో కలిసి నగరానికి వెలుపల ఉండే కుమ్మరి వాని యింటిలోనికి ప్రవేశించారు. (6)
వి॥సం॥ భార్గవుడంటే కులాలుడు (కుమ్మరి) భ్రస్జ్-పాకే అనుధాతువు నుండి ఏర్పడినది. (దేవ)
తత్రోపవిషార్చి రివానలస్య
తేషాం జనిత్రీతి మమ ప్రతర్కః ।
తథావిధైరేవ నరప్రవీరైః
ఉపోపవిష్టైస్త్రిభిరగ్నికల్పైః ॥ 7
ఆ ఇంటిలో అగ్నిశిఖతో సమంగా వెలుగుతున్న ఒక స్త్రీ కూర్చుని ఉన్నది. బహుశః ఆమె ఆ వీరుల తల్లి కావచ్చు. ఆమె సమీపంలో అగ్ని జ్వాలవలె ప్రకాశించే ముగ్గురు వీరపురుషులు కూర్చొని ఉన్నారు. (7)
తస్యాస్తతస్తావభివాద్య పాదౌ
ఉక్తా చ కృష్ణా త్వభివాదయేతి ।
స్థితాం చ తత్రైవ నివేద్య కృష్ణాం
భిక్షాప్రచారాయ గతా నరాగ్ర్యాః ॥ 8
వారిద్దరు వీరులూ స్వయంగా తల్లిపాదపద్మాలకు నమస్కరించి ద్రౌపదిని నమస్కరింపమని ఆజ్ఞాపించారు. నమస్కరించిన పిమ్మట ద్రౌపదిని తల్లికి అప్పగించి వారు భిక్షాటనకు వెళ్ళిపోయారు. (8)
తేషాం తు భైక్షం ప్రతిగృహ్య కృష్ణా
దత్త్వా బలిం బ్రాహ్మణసాచ్చ కృత్వా ।
తాం చైవ వృద్దాం పరివేష్య తాంశ్చ
నరప్రవీరాన్ స్వయమప్యభుంక్త ॥ 9
వారు భిక్షాటనమ్ ముగించి తిరిగివచ్చిన తర్వాత ద్రౌపది ఆ భిక్షాన్నాన్ని వారితల్లి ఆజ్ఞానుసారం దేవతలకు బలిగా, బ్రాహ్మణులకు తృప్తిగా నిచ్చి, వారి తల్లికి, వారికి ప్రత్యేకంగా వడ్డించి చివరగా తానూ తిన్నది. (9)
వి॥తె॥ వెడదయుదరంబును నన్నువ కడుపును దృఢ కఠిన తనువుఁగల యాతనికిం
దొడర నొకపాలుపెట్టుము, వడి నాగాయుతబలంబు వాఁడతఁడబలా.
దేవతలకు, బ్రాహ్మణులకు పెట్టగా మిగిలిన అన్నాన్ని రెండుభాగాలు చేసి ఒక భాగం భీమునికి, రెండవ భాగం మిగిలినవారికి పెట్టి, తాను తిన్నది. ఈ విశేషం మూలభారతంలో ఏకచక్రపురనివాస ప్రారంభంలోనే స్పష్టంగా ఉన్నది. (ఆదిపర్వం 156/6).
తెలుగులో నన్నయ ఆ సందర్భంలో చెప్పి (ఆదిపర్వము 6/241) ఇక్కడ మరల కుంతి చేత ద్రౌపదికి చెప్పించాడు.
సుప్తాస్తు తే పార్థివ సర్వ ఏవ
కృష్ణా చ తేషాం చరణోపధానే ।
ఆసీత్ పృథివ్యాం శయనం చ తేషాం
దర్భాజినాగ్రాస్తరణోపపన్నమ్ ॥ 10
రాజా! భోజనమయినపిమ్మట వారందరు నిద్రించసాగారు. ద్రౌపది వారి పాదాలదగ్గర నిద్రించింది. భూమిపైనే ఆమె పాన్పును ఏర్పరచుకొన్నది. క్రింద దర్భలు పఱచి, పైన లేడి చర్మాన్ని పరచుకొన్నది. (10)
తే నర్దమానా ఇవ కాలమేఘాః
కథా విచిత్రాః కథయాంబభూవుః ।
న వైశ్యశూద్రౌపయికీః కథాస్తాః
న చ ద్విజానాం కథయంతి వీరాః ॥ 11
వారు వర్షాకాలపు మేఘాలవలె గర్జిస్తూ మధ్యమధ్యలో చిత్రవిచిత్రాలైన కథలను చెప్పుకొంటున్నారు. అయిదుగురు వీరుల మాటలను బట్టి వారు వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు కారు. (11)
నిస్సంశయం క్షత్రియపుంగవాస్తే
యథా హి యుద్ధం కథయింతి రాజన్ ।
ఆశా హి నో వ్యక్తమియం సమృద్ధా
ముక్తాన్ హి పార్థాన్ శ్రుణమోఽగ్నిదాహాత్ ॥ 12
రాజా! వారు చేసే యుద్ధవర్ణనలను బట్టి వారు క్షత్రియపుంగవులే సందేహం లేదు. కుంతీపుత్రులైన పాండవులు లాక్షాగృహదహనం నుండి తప్పించుకొన్నారని వినియున్నాం గదా! పాండవులతో సంబంధం కలుపుకొన వలెననే మనకోరిక తప్పక సఫలం కాగలదనిపిస్తోంది. (12)
యథా హి లక్ష్యం నిహతం ధనుశ్చ
సజ్యం కృతం తేన తథా ప్రసహ్య ।
యథా హి భాషంతి పరస్పరం తే
ఛన్నా ధ్రువం తే ప్రచరంతి పార్థాః ॥ 13
బలంగా నారి బిగించిన ధనుస్సు సిద్ధం కావింపబడిన తీరూ, దుర్భేద్యమైన లక్ష్యం భేదింపబడిన తీరూ చూస్తే వారి మాటలను బట్టి కుంతీపుత్రులైన పాండవులు బ్రాహ్మణవేషాలలో దాగి ఉన్నారని నిశ్చయమవుతోంది. (13)
తతః స రాజా ద్రుపదః ప్రహృష్టః
పురోహితం ప్రేషయామాస తేషామ్ ।
విద్యామ యుష్మానితి భాషమాణః
మహాత్మానః పాండుసుతాః కచ్చిత్ ॥ 14
ఈ సమాచారం విని ద్రుపదుడు ప్రసన్నుడై వారిని గురించి తెలుసుకోవాలని " మీరు పాండుపుత్రులైన పాండవులేనా" అని అడిగి రమ్మని తన పురోహితుని పంపాడు. (14)
గృహీతవాక్యో నృపతేః పురోధా
గత్వా ప్రశంసామభిధాయ తేషామ్ ।
వాక్యం సమగ్రం నృపతే ర్యథావత్
ఉవాచ చానుక్రమవిక్రమేణ ॥ 15
రాజాజ్ఞననుసరించి ద్రుపదపురోహితుడు వారివద్దకు పోయి వారి గుణగానం చేసి రాజైన ద్రుపదుని మాటగా ఒక్కొక్కరిని క్రమంగా పలుకరించి ఇలా అన్నాడు. (15)
విజ్ఞాతుమిచ్ఛత్యవనీశ్వరో వః
పాంచాలరాజో వరదో వరార్హాః ।
లక్ష్యస్య వేద్ధారమిమం హి దృష్ట్వా
హర్షస్య నాంతం ప్రతిపద్యతే సః ॥ 16
వీరులారా! వరాలనివ్వగల పాంచాలరాజైన ద్రుపదుడు మీ పరిచయాన్ని కోరుతున్నాడు. లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగల వీరపురుషుని చూచి హద్దులేని ఆనందాన్ని పొందాడు. (16)
ఆఖ్యాత చ జ్ఞాతికులానుపూర్వీం
పదం శిరస్సు ద్విషతాం కురుధ్వమ్ ।
ప్రహ్లాదయధ్వం హృదయం మమేదం
పాంచాల్యరాజస్య చ సానుగస్య ॥ 17
మీరు మీజాతిని, కులాన్ని తెలపండి. శత్రురాజుల శిరస్సులందు కాలుమోపండి. నా హృదయాన్ని, అనుచరులతో కూడిన ద్రుపదమహారాజు హృదయాన్ని ఆనందసంభరితం చేయండి. (17)
పాండుర్హి రాజా ద్రుపదస్య రాజ్ఞః
ప్రియఃసఖా చాత్మసమో బభూవ ।
తస్యైష కామో దుహితా మమేయం
స్నుషాం ప్రదాస్యామి హి కౌరవాయ ॥ 18
పాండుమహారాజు ద్రుపదునికి ఇష్టసఖుడు, ప్రాణసముడు. పాండు మహారాజునకు ప్రియమైన కోడలిగా తన పుత్రికను సమకూర్చాలని ఆ ద్రుపదుని చిరకాలవాంఛ. (18)
అయం హి కామో ద్రుపదస్య రాజ్ఞః
హృది స్థితో నిత్యమనిందితాంగాః ।
యదర్జునో వై పృథుదీర్ఘబాహుః
ధర్మేణ విందేత సుతాం మమైతామ్ ॥ 19
సర్వాంగసుందరులారా! మహారాజైన ద్రుపదుని హృదయంలో "పొడవైన, బలమైన చేతులు గల అర్జునుడు నా కుమార్తె ద్రౌపదిని ధర్మపురస్సరంగా వివాహమాడునుగాక" అన్న కోరిక చిరకాలం నుండి ఉన్నది. (19)
కృతం హి తత్ స్యాత్ సుకృతం మమేదం
యశశ్చ పుణ్యం చ హితం తదేతత్ ।
'నా కోరిక తీరితే నాపూర్వశుభకర్మల ఫలితాన్ని నేను పొందినట్లే' అని ద్రుపదుని భావన. ఇది తనకు కీర్తిని, పుణ్యాన్ని, మేలును కలుగజేస్తుంది.
అథోక్తవాక్యం హి పురోహితం స్థితం
తతో వినీతం సముదీక్ష్య రాజా ॥ 20
సమీపతో భీమమిదం శశాస
ప్రదీయతాం పాద్యమర్ఘ్యం తథాస్మై ।
మాన్యః పురోధా ద్రుపదస్య రాజ్ఞః
తస్మై ప్రయోజాభ్యధికా హి పూజా ॥ 21
ద్రుపదపురోహితుని మాటలను విని అతనిని వినయశీలునిగా గుర్తించి యుధిష్ఠిరుడు 'వీరు ద్రుపదుని పురోహితులూ, మాననీయులు. కాబట్టి ఈయనకు ఆదరసత్కారాలు విశేషంగా జరపాలి; అంటూ అర్ఘ్యపాద్యాలు సమర్పించవలసినదిగ దగ్గరనే ఉన్న భీముని ఆదేశించాడు. (20,21)
భీమస్తతస్తత్ కృతవాన్ నరేంద్ర
తాం చైవ పూజాం ప్రతిగృహ్య హర్షాత్ ।
సుఖోపవిష్టం తు పురోహితం తదా
యుధిష్ఠిరో బ్రాహ్మణమిత్యువాచ ॥ 22
రాజా! వెంటనే భీమసేనుడు అర్ఘ్యపాద్యాదులు ద్రుపద పురోహితునకిచ్చి అర్చించాడు. ఆ పురోహితుడు ఆనందంగా దానిని స్వీకరించి సుఖంగా కూర్చున్న తరువాత యుధిష్ఠిరుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అన్నాడు. (22)
పాంచాల రాజైన ద్రుపదుడు తనకోరికననుసరించి ఈ కన్యక నీయలేదు. లక్ష్యాన్ని భేదించనవానికే కన్యనిస్తానని శుల్కాన్ని కూడా నిశ్చయించాడు. ఈ వరపురుషుడు నియమానుసారం లక్ష్యాన్ని భేదించి ఈ కన్యను పొందాడు. (23)
న తత్ర వర్ణేషు కృతా వివక్షా
న చాపి శీలే న కులే న గోత్రే ।
కృతేన సజ్యేన హి కార్ముకేణ
విద్ధేన లక్ష్యేణ హి సా విసృష్టా ॥ 24
సేయం తథానేన మహాత్మనేహ
కృష్ణా జితా పార్థివసంఘమధ్యే ।
నైవంగతే సౌమకిరద్య రాజా
సంతాపమర్హత్యసుఖాయ కర్తుమ్ ॥ 25
రాజు ఆ విషయంలో వర్ణ, శీల, గోత్ర వివక్షను పాటించలేదు. వింటిని ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదించినవానికే కన్య నిస్తానన్నాడు. ఆ విధంగా రాజుల సమక్షంలో ఈ మహనీయుడు ద్రౌపదిని గెలుచుకొన్నాడు. ఈ స్థితిలో మీరాజు బాధపడవలసినదో, కష్టపడవలసినదో ఏదీలేదు. (24,25)
కామశ్చ యోఽసౌ ద్రుపదస్య రాజ్ఞః
స చాపి సంపత్స్యతి పార్థివస్య ।
సంప్రాప్య రూపాం హి నరేంద్రకన్యాం
ఇమామహం బ్రాహ్మణ సాధు మన్యే ॥ 26
ద్రుపదుని మనస్సులో ఉన్న కోరిక కూడా ఇప్పుడు సిద్ధిస్తుంది. ఈ రాజకన్యకను పొంది అన్నివిధాలుగా మేము యోగ్యులమూ, ఉత్తములమూ కాగలగటం వాస్తవం. (26)
న తత్ ధనుర్మందబలేన శక్యం
మౌర్వ్యా సమాయోజయితుం హి శక్యమ్ ।
న చాకృతాస్త్రేణ న హీనజేన
లక్ష్యం తథా పాతయితుం హి శక్యమ్ ॥ 27
బలహీనుడు ఆ ధనుసుకు వింటినారిని తొడగలేడు. అస్త్రవిద్యాబలం పూర్తిగా లేనివాడు. హీనవంశంలో పుట్టినవాడు ఆవిధంగా లక్ష్యాన్ని-(మత్స్యాన్ని)-పడగొట్టగలగటం అసాధ్యం. (27)
తస్మాన్న తాపం దుహితుర్నిమిత్తం
పాంచాలరాజోఽర్హతి కర్తుమద్య ।
న చాపి తత్పాతనమన్యథేహ
కర్తుం హి శక్యం భువి మానవేన ॥ 28
కావున పాంచాలరాజునకు తనకుమార్తె విషయంలో చింతిచటం యుక్తంకాదు. అలా జరుగకుంటే ఈ లోకంలో మరే నరుడూ ఆ లక్ష్యాన్ని ఛేదించలేడు. (28)
ఏవం బ్రువత్యేవ యుధిష్ఠిరే తు
పాంచాలరాజస్య సమీపతోఽన్యః ।
తత్రాజగామాశు నరో ద్వితీయః
నివేదయిష్యన్నిహ సిద్ధమన్నమ్ ॥ 29
యుధిష్ఠిరు డిలా ద్రుపదపురోహితునితో మాట్లాడుతూ ఉండగానే పాంచాలరాజైన ద్రుపదుని వేరొక దూత అక్కడకు వచ్చాడు. ద్రుపదమహారాజు మీకొరకు విందును సిద్ధంచేసి నాడని అతడు విన్నవించాడు. (29)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి వైవాహిక పర్వణి పురోహిత యుధిష్ఠిరసంవాదే ద్వినవత్యధిక శతతమోఽధ్యాయః ॥ 192 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున వైవాహికపర్వమను
ఉపపర్వమున పురోహితయుధిష్ఠిర సంవాదమను నూటతొంబది రెండవ అధ్యాయము. (192)