184. నూట ఎనుబది నాల్గవ అధ్యాయము

స్వయంవర సభావర్ణనము - ధృష్టద్యుమ్నుని ప్రకటన.

వైశంపాయన ఉవాచ
ఏవముక్తాః ప్రయాతాస్తే పాండవా జనమేజయ ।
రాజ్ఞా దక్షిణపంచాలాన్ ద్రుపదేనాభిరక్షితాన్ ॥ 1
వైశంపాయనుడు ఇలా అన్నాడు-
జనమేజయా! బ్రాహ్మణులతో ఇలా పలికిన పాండవులు ద్రుపదమహారాజు పరిపాలిస్తున్న దక్షిణపాంచాలదేశానికి ప్రయాణమైనారు. (1)
తతస్తే సుమహాత్మానం శుద్ధాత్మానమకల్మషమ్ ।
దదృశుః పాండవా వీరాః మునిం ద్వైపాయనం తదా ॥ 2
ఆ తరువాత పాండవులు మహాత్ముడు, శుద్ధాత్ముడు, అకల్మషుడు అయిన వ్యాసమహర్షిని దర్శించారు. (2)
తస్మై యథావత్ సత్కారం కృత్వా తేన చ సత్కృతాః ।
కథాంతే చాభ్యనుజ్ఞాతాః ప్రయయుర్ర్దుపదక్షయమ్ ॥ 3
వ్యాసమహర్షిని యథావిధిగా సత్కరించి, ఆయన చేసిన సత్కారాలను అందుకొని, అనుమతి తీసుకొని పాండవులు పాంచాలదేశానికి ప్రయాణం సాగించారు. (3)
పశ్యంతో రమణీయాని వనాని చ సరాంసి చ ।
తత్ర తత్ర వసంతశ్చ శనైర్జగ్ముర్మహారథాః ॥ 4
పాండవులు అందమైన వనాలను, సరస్సులను, చూస్తూ, అక్కడక్కడ ఆగుతూ నెమ్మదిగా ప్రయాణించారు. (4)
స్వాధ్యాయవంతః శుచయః మధురాః ప్రియవాదినః ।
అనుపూర్వ్యేణ సంప్రాప్తాః పంచాలాన్ పాండునందనాః ॥ 5
స్వాధ్యాయం చదువుకొంటూ, పవిత్రులై, మధురంగా ప్రియంగా మాట్లాడుకొంటూ పాండవులు క్రమంగా పాంచాలదేశానికి చేరుకొన్నారు. (5)
తే తు దృష్ట్వా పురం తచ్చ స్కంధావారం చ పాండవాః ।
కుంభకారస్య శాలాయాం నివాసం చక్రిరే తదా ॥ 6
పాండవులు కాంపిల్యనగరాన్నీ, సైన్యాలుండే చోటునూ చూచి ఒక కుమ్మరి ఇంటిలో ఆశ్రయం పొందారు. (6)
తత్ర భైక్షం సమాజహ్రుః బ్రాహ్మణీం వృత్తిమాశ్రితాః ।
తాన్ సంప్రాప్తాన్ తథా వీరాన్ జజ్ఞిరే న నరాః క్వచిత్ ॥ 7
అక్కడ బ్రాహ్మణధర్మంగా భిక్షాటనం చేశారు. ఆ వీరులను ఎవరూ, ఎక్కడా గుర్తుపట్టలేదు. (7)
యజ్ఞసేనస్య కామస్తు పాండవాయ కిరీటినే ।
కృష్ణాం దద్యామితి సదా న చైతద్వివృణోతి సః ॥ 8
ద్రుపదుని మనసులో ద్రౌపదిని అర్జునునకు ఇవ్వాలని ఉంది. కాని దానిని పైకి చెప్పటం లేదు. (8)
సోఽన్వేషమాణః కౌంతేయం పాంచాల్యో జనమేజయ ।
ధృఢం ధనురనానమ్యం కారయామాస భారత ॥ 9
జనమేజయా! ద్రుపదుడు అర్జునునికోసం వెతుకుతూ వంచరాని బలమైన ధనస్సును చేయించి అక్కడ ఉంచాడు. (9)
యంత్రం వైహాయసం చాపి కారయామాస కృతిమమ్ ।
తేన యంత్రేణ సమితం రాజా లక్ష్యం చకార సః ॥ 10
ఆకాశంలో కృత్రిమమైన యంత్రాన్ని నిర్మించి దానిలో లక్ష్యాన్ని ఏర్పాటు చేశాడు. (10)
వి॥ సం॥ ధనుర్విద్యనభ్యసిస్తున్న రోజుల్లో అర్జునుడు మాత్రమే చలించే లక్ష్యాన్ని భేదించగలిగాడు కాబట్టి ఇప్పుడు కూడా అర్జునుడే ఆ పని చేయగలడని భావించి ద్రుపదుడు చేసిన ఏర్పాటు ఇది. కర్ణుడు కూడా అది తేలికగా సాధించగలవాడే కాని హీనవంశంలో పుట్టినవాడు కాబట్టి తేలికగా తప్పించవచ్చు. (నీల)
ద్రుపద ఉవాచ
ఇదం సజ్యం ధనుః కృత్వా సజ్జైరేభిశ్చ సాయకైః ।
అతీత్య లక్ష్యం యో వేద్ధా స లబ్ధా మత్సుతామితి ॥ 11
ద్రుపదుడు ఇలా పలికాడు-
ఈ ధనుస్సును ఎక్కుపెట్టి, సిద్ధంగా ఉన్న ఈ బాణాలతో లక్ష్యాన్ని గురిచూచి కొట్టినవానికి నాపుత్రిక లభిస్తుంది. (11)
వైశంపాయన ఉవాచ
ఇతి స ద్రుపదో రాజా స్వయంవరమఘోషయత్ ।
తచ్ఛ్రుత్వా పార్థివాః సర్వే సమీయుస్తత్ర భారత ॥ 12
వైశంపాయనుడు అన్నాడు-
ఈవిధంగా ద్రుపద మహారాజు స్వయంవరాన్ని ప్రకటించాడు. అది విని రాజులందరు అక్కడికి చేరుకొన్నారు. (12)
ఋషయశ్చ మహాత్మానః స్వయంవరదిదృక్షవః ।
దుర్యోధనపురోగాశ్చ సకర్ణాః కురవో నృప ॥ 13
రాజా! స్వయంవరాన్ని చూడటానికి ఋషులు, మహాత్ములు, దుర్యోధనుని వెంట కర్ణునితో కలిసి కౌరవులు అంతా వచ్చారు. (13)
బ్రాహ్మణాశ్చ మహాభాగాః దేశేభ్యః సముపాగమన్ ।
తతోఽర్చితా రాజగణాః ద్రుపదేన మహాత్మనా ॥ 14
ఉపోపవిష్టా మంచేషు ద్రష్టుకామాః స్వయంవరమ్ ।
తతః పౌరజనాస్సర్వే సాగరోద్ధూతనిః స్వనాః ॥ 15
మహానుభావులైన బ్రాహ్మణులు అనేకదేశాల నుండి వచ్చారు. ద్రుపదమహారాజు వచ్చిన రాజులందరిని పూజించాడు. స్వయంవరాన్ని చూడాలనే కోరికతో పౌరులందరూ సముద్రఘోషవలె కలకలం చేస్తూ వచ్చి ఆసనాలపై కూర్చున్నారు. (14,15)
శిశుమారశరః ప్రాప్య న్యవిశంస్తే స్మ పార్థివాః ।
ప్రాగుత్తరేణ నగరాద్ భూమిభాగే సమే శుభే ।
సమాజవాటః శుశుభే భవనైః సర్వతో వృతః ॥ 16
నగరానికి ఈశాన్యభాగంలో సమతలమైన శుభప్రదేశంలో స్వయంవరమంటపం నిర్మింపబడింది. దానిని ఎన్నోభవనాలు అన్ని దిక్కులా చుట్టి ఉన్నాయి. స్వయంవరానికి వచ్చిన రాజులంతా ఆ మంటపం యొక్క ఈశాన్యభాగంలో కూర్చున్నారు. (16)
ప్రాకార పరిఖోపేతః ద్వారతోరణమండితః ।
వితానేన విచిత్రేణ సర్వతః సమలంకృతః ॥ 17
ప్రాకారం, అగడ్త, తోరణాలు కట్టిన ద్వారాలు, విచిత్రమైన చాందినీ- వీటితో మంటపం అంతటా అలంకరించ బడింది. (17)
తూర్యౌఘశతసంకీర్ణః పరార్ధ్యాగురుధూపితః ।
చందనోదకసిక్తశ్చ మాల్యదామోపశోభితః ॥ 18
వివిధమంగళవాద్యఘోషలతో, సుగంధభరితమైన అగురుధూపాలతో, మంచిగంధపు నీటి చిలకరింపులతో, పూలమాలల వరుసలతో ఆ మంటపం ప్రకాశిస్తోంది. (18)
కైలాసశిఖరప్రఖ్యైః నభస్తలవిలేఖిభిః ।
సర్వతః సంవృతః శుభ్రైః ప్రాసాదైః సుకృతోచ్ఛ్రయైః ॥ 19
కైలాసశిఖరాలవలె ఆకాశాన్ని తాకుతూ చక్కగా అలంకరించబడిన శుభ్రమైన మేడలతో అన్నివైపులా విరాజిల్లుతోంది మంటపం. (19)
సువరణజాలసంవీతైః మణికుట్టిమభూషణైః ।
సుఖారోహణసోపానైః మహాసనపరిచ్ఛదైః ॥ 20
స్రగ్దామసమవచ్ఛన్నైః అగురూత్తమవాసితైః ।
హంసాంశువర్ణైర్బహుభిః ఆయోజనసుగంధిభిః ॥ 21
బంగారు రంగు చాందినీలతో, మణులు పొదిగిన కుట్టిమ స్థలాలతో, భూషణాలతో, సుఖంగా ఎక్కగల మెట్లతో, పెద్ద పెద్ద సింహాసనాలతో ఆ సభ విలసిల్లుతోంది.
పూలమాలికలు, దండలతో కప్పబడి, అగరువాసనలతో నిండి అంచరెక్కలవలె పలురంగులతో చాలా దూరం సువాసనలు వెదజల్లుట్ వెదజల్లుతున్నది మంటపం. (20,21)
అసంబాధశతద్వారైః శయానాసనశోభితైః ।
బహుధాతుపినద్ధాంగైః హిమవచ్చిఖరైరివ ॥ 22
అనేకద్వారాలతో, మంచెలు, కుర్చీలతో శోభిస్తూ, రకరకాల రంగుల పూలతో హిమాలయశిఖరాలవలె ఎత్తుగా ఉన్నవి. (22)
తత్ర నానాప్రకారేషు విమానేషు స్వలంకృతాః ।
స్పర్ధమానాస్తదాన్యోన్యం నిషేదుః సర్వపార్థివాః ॥ 23
సభామంటపంలోని పలురకాల ఆసనాలలో రాజులందరు చక్కగా అలంకరించుకొని ఒకరితో ఒకరు పోటీపడుతూ కూర్చున్నారు. (23)
తత్రోపవిష్టాన్ దదృశుః మహాసత్త్వపరాక్రమాన్ ।
రాజసింహాన్ మహాభాగాన్ కృష్ణాగురువిభూషితాన్ ॥ 24
మహాప్రసాదాన్ బ్రహ్మణ్యాన్ స్వరాష్ట్రపరిరక్షిణః ।
ప్రియాన్ సర్వస్య లోకస్య సుకృతైః కర్మభిః శుభైః ॥ 25
మంచేషు చ పరార్ధ్యేషు పౌరజానపదా జనాః ।
కృష్ణాదర్శనసిద్ధ్యర్థం సర్వతః సముపావిశన్ ॥ 26
అందులో మహాబలపరాక్రమాలు కల రాజశ్రేష్ఠులు కృష్ణాగురుసువాసనాభరితులై, సౌభాగ్యసంపన్నులై కూర్చొని ఉన్నారు. తమ మంచిపనులతో, శుభకర్మలతో సర్వలోకానికి హితులై తమ దేశాన్ని రక్షించుకొనే ప్రసన్నహృదయులైన బ్రాహ్మణభక్తులు కూడ అక్కడే కూర్చున్నారు. పౌరులు, జానపదులు ద్రౌపదీ దర్శనం కోసం ఎత్తైన మంచెల మీద కూర్చున్నారు. (24-26)
బ్రాహ్మణైస్తే చ సహితాః పాండవాః సముపావిశన్ ।
బుద్ధిం పాంచాలరాజస్య పశ్యంతస్తామనుత్తమామ్ ॥ 27
అత్యున్నతమైన పాంచాలరాజ్యవైభవాన్ని తిలకిస్తూ బ్రాహ్మణులతోపాటు పాండవులు కూర్చున్నారు. (27)
తతః సమాజో వవృధే స రాజన్ దివసాన్ బహూన్ ।
రత్నప్రదానబహుళః శోభితో నటనర్తకైః ॥ 28
ఈ విధంగా నటులు, నర్తకులు, అనేకరత్న ప్రదానాలతో రాజులసముదాయం చాలారోజులుగా వర్థిల్లుతోంది. (28)
వర్తమానే సమాజే తు రమణీయోఽహ్ని షోడశే ।
ఆప్లుతాంగీ సువసనా సర్వాభరణభూషితా ॥ 29
మాలాం చ సముపాదాయ కాంచనీం సమలంకృతామ్ ।
అవతీర్ణా తతో రంగం ద్రౌపదీ భరతర్షభ ॥ 30
జనమేజయా! రాజసమూహం ఇలా ప్రకాశిస్తూ ఉండగా
పదహారవరోజున పుష్పమాలికను పట్టుకొని ద్రౌపది స్వయంవర రంగానికి వచ్చింది. (29,30)
పురోహితః సోమకానాం మంత్రవిద్ర్బాహ్మణః శుచిః ।
పరిస్తీర్య జుహావాగ్నిమ్ ఆజ్యేన విధివత్తదా ॥ 31
మంత్రవేత్త అయిన సోమకవంశపురోహితుడు యథావిధిగా అగ్నిహోత్రాన్ని ఏర్పరచి, నేతితో హోమం చేశాడు. (31)
సంతర్పయిత్వా జ్వలనం బ్రాహ్మణాన్ స్వస్తి వాచ్య చ ।
వారయామాస సర్వాణి వాదిత్రాణి సమంతతః ॥ 32
అగ్నిసంతర్పణ, బ్రాహ్మణుల స్వస్తివచనాలు అయిన తరువాత మంగళవాద్యధ్వనులన్నీ ఆపివేయబడ్డాయి. (32)
నిశ్శబ్దేతు కృతే తస్మిన్ ధృష్టద్యుమ్నో విశాంపతే ।
కృష్ణామాదాయ విధివత్ మేఘదుందుభినిఃస్వనః ॥ 33
రంగమధ్యే గతస్తత్ర మేఘగంభీరయా గిరా ।
వాక్యముచ్చైర్జగాదేదం శ్లక్ష్ణమర్థవదుత్తమమ్ ॥ 34
రాజా! నిశ్శబ్దమైన స్వయంవరమండపంలోనికి అన్నగారు ధృష్టద్యుమ్నుడు ద్రౌపదిని తీసుకొనివచ్చి, రంగమధ్యంలో నిలబడి, గంభీరమైన కంఠస్వరంతో స్పష్టంగా, చక్కగా అర్థమయ్యేటట్లుగా, పెద్దగా ఇలా చెప్పాడు. (33,34)
ఇదం ధనుర్లక్ష్యమిమే చ బాణాః
శృణ్వంతు మే భూపతయః సమేతాః ।
ఛిద్రేణ యంత్రస్య సమర్పయధ్వం
శరైః శితైర్వ్యోమచరై ర్దశార్ధైః ॥ 35
రాజులారా! నేను చెప్పేది వినండి. ఇదిగో లక్ష్యం, ధనస్సు, బాణాలు. పదునైన అయిదు బాణాలను పైన ఏర్పాటుచేసిన ఒక యంత్రంలోని లక్ష్యంలోకి గురితప్పకుండా కొట్టాలి. (35)
ఏతన్మహత్కర్మ కరోతి యో వై
కులేన రూపేణ బలేన యుక్తః ।
తస్యాద్య భార్యా భగినీ మమేయం
కృష్ణా భవిత్రీ న మృషా బ్రవీమి ॥ 36
ఈ గొప్పపనిని ఎవడు చేస్తాడో కులం, రూపం, బలం కలిగిన ఆ వ్యక్తికి నా చెల్లెలు ద్రౌపది భార్య అవుతుంది. నేను అబద్ధం చెప్పను. (36)
తానేవముక్త్వా ద్రుపదస్య పుత్రః
పశ్చాదిదం తాం భగినీమువాచ ।
నామ్నా చ గోత్రేణ చ కర్మణా చ
సంకీర్తయన్ భూమిపతీన్ సమేతాన్ ॥ 37
ధృష్టద్యుమ్నుడు సభలోనివారితో ఇలా మాట్లాడి ఆయారాజుల గోత్రనామాలు, గొప్పదనాలను తన సోదరి ద్రౌపదికి ఇలా తెలియజేశాడు. (37)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి స్వయంవరపర్వణి ధృష్టద్యుమ్నవాక్యే చతురశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 184 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున స్వయంవర పర్వమను
ఉపపర్వమున ధృష్టద్యుమ్నవాక్యమను నూట ఎనుబది నాల్గవ అధ్యాయము. (184)