180. నూట ఎనుబదియవ అధ్యాయము
పరాశరుడు రాక్షసయాగము చేయుట-సమాప్తి.
గంధర్వ ఉవాచ
ఏవముక్తః సవిప్రర్షిః వసిష్ఠేన మహాత్మనా ।
న్యయచ్ఛదాత్మనః క్రోధం సర్వలోకపరాభవాత్ ॥ 1
గంధర్వుడిలా అన్నాడు.
మహాత్ముడైన వసిష్ఠుడు అంటే ఆ పరాశరబ్రహ్మర్షి సర్వలోకపరాభవసంకల్పం నుండి తన క్రోధాన్ని నియంత్రించుకొన్నాడు. (1)
ఈజే చ సమహాతేజాః సర్వవేదవిదాం వరః ।
ఋషీ రాక్షససత్రేణ శాక్తోయోఽథ పరాశరః ॥ 2
అప్పుడు సర్వవేదవేత్తలలో శ్రేష్ఠుడు, మహాతేజస్వి, శక్తినందనుడు అయిన పరాశరముని రాక్షసయాగాన్ని అనుష్ఠించాడు. (2)
తతో వృద్ధాంశ్చ బాలాంశ్చ రాక్షసాన్ స మహామునిః ।
దదాహ వితతే యజ్ఞే శక్తేర్వధమనుస్మరన్ ॥ 3
ఆ తరువాత శక్తివధను మనస్సులో పెట్టుకొని ఆ పరాశరముని విస్తృత యజ్ఞంలో రాక్షసులను బాలవృద్ధులతో సహా దహింప జేయసాగాడు. (3)
న హి తం వారయామాస వసిష్ఠో రక్షసాం వధాత్ ।
ద్వితీయామస్య మా భాంక్షం ప్రతిజ్ఞామితి నిశ్చయాత్ ॥ 4
ఆ సమయంలో వసిష్ఠమహర్షి కూడా పరాశరుని రెండవ ప్రతిజ్ఞను కూడా భంగపరచటమిష్టం లేక రాక్షసవధ నుండి పరాశరుని వారించలేదు. (4)
త్రయాణాం పావకానాం చ సత్రే తస్మిన్ మహామునిః ।
ఆసీత్ పురస్తాద్ దీప్తానాం చతుర్థ ఇవ పావకః ॥ 5
ఆ యాగంలో మండుతున్న మూడు అగ్నుల ఎదురుగా నాల్గవ అగ్నిలాగా ఆ పరాశరమహర్షి నిలిచాడు. (5)
తేన యజ్ఞేన శుభ్రేణ హూయమానేన శక్తిజః ।
తద్విదీపితమాకాశం సూర్యేణేవ ఘనాత్యయే ॥ 6
ఆ పరాశరుని యాగం నిర్మలమైనది, పవిత్రమైనది. పరాశరుడు హోమాన్ని ప్రారంభించగానే ఆ తేజస్సుతో మేఘాల మాటు నుండి సూర్యుడు బయటపడి ఆకాశాన్ని దీపింపజేసినట్లుగా గగనతలం ప్రాకాశించింది. (6)
తం వసిష్ఠాదయః సర్వే మునయస్తత్ర మేనిరే ।
తేజసా దీప్యమానం వై ద్వితీయమివభాస్కరమ్ ॥ 7
అక్కడున్న వసిష్ఠాది మహర్షులందరూ తేజస్సుతో వెలుగుతున్న ఆ పరాశరుని మరొక సూర్యునిగా భావించారు. (7)
తతః పరమదుష్ప్రాపం అన్యైరృషిరుదారధీః ।
సమాపిపయిషుః సత్రం తమత్రిః సముపాగమత్ ॥ 8
ఆ తరువాత ఇతరులు ఆ యాగాన్ని నివారించగలగటం చాలా కష్టమని భావించి ఉదారబుద్ధిగల అత్రి ఆ యాగాన్ని ఆపించాలని పరాశరుని దగ్గరకు వచ్చాడు. (8)
తథా పులస్త్యః పులహః క్రతుశ్చైవ మహాక్రతుః ।
తత్రాజగ్మురమిత్రఘ్న రక్షసాం జీవితేప్సయా ॥ 9
శత్రుసంహారా! అదే విధంగా పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మహాక్రతువు రాక్షసుల జీవితాలను రక్షించాలని అక్కడకు వచ్చి చేరారు. (9)
పులస్త్యస్తు వధాత్తేషాం రక్షసాం భరతర్షభ ।
ఉవాచేదం వచః పార్థ పరాశరమరిందమమ్ ॥ 10
భరతర్షభా! అర్జునా! రాక్షసులు ఆ విధంగా నశించటం చూచి పులస్త్యుడు అరిందముడైన పరాశరునితో ఇలా అన్నాడు. (10)
కచ్చిత్తాతాపవిఘ్నం తే కచ్చిన్నందసి పుత్రక ।
అజానతామదోషాణాం సర్వేషాం రక్షసాం వధాత్ ॥ 11
నాయనా! నీ యాగానికి ఏ విఘ్నమూ కలుగలేదు కదా! మీ తండ్రి హత్య గురించి ఏమీ తెలియని, నిర్దోషులయిన ఈ రాక్షసులను చంపటం ద్వారా నీవు ఆనందిస్తున్నావు గదా! (11)
ప్రజోచ్ఛేదమిమం మహ్యం న హి కర్తుం త్వమర్హసి ।
నైషతాత ద్విజాతీనాం ధర్మో దృష్టస్తపస్వినామ్ ॥ 12
నాయనా! నా సంతతిని నీవు ఇలా నాశనం చేయదగదు. ఇటువంటి హింస తపస్సంపన్నులయిన బ్రాహ్మణులకు ఎప్పుడూ ధర్మం కాదు. (12)
శమ ఏవ పరో ధర్మః తమాచర పరాశర ।
అధర్మిష్ఠం వరిష్ఠః సన్ కురుషే త్వం పరాశర ॥ 13
పరాశరా! శాంతి ఒక్కటే పరమ ధర్మం. దానిని పాటించు. నీవు శ్రేష్ఠబ్రాహ్మణుడవై కూడా పాపకృత్యాన్ని చేస్తున్నావు. (13)
శక్తిం చాపి హి ధర్మజ్ఞం నాతిక్రాంతుమిహార్హసి ।
ప్రజాయాశ్చ మమోచ్ఛేదం న చైవం కర్తుమర్హసి ॥ 14
మీ తండ్రి అయిన శక్తి ధర్మజ్ఞుడు. ఇటువంటి పనిని చెసి ఆయనను ఉల్లంఘించరాదు. నా సంతతిని నాశనం చేయదగదు. (14)
శాపాద్ది శక్తేర్వాసిష్ఠ తదా తదుపపాదితమ్ ।
ఆత్మజేన స దోషేణ శక్తిర్నీత ఇతో దివమ్ ॥ 15
వసిష్ఠవంశజా! శక్తి ఇచ్చిన శాపం వలననే అప్పుడు అటువంటి సంఘటన జరిగింది. తాను చేసిన తప్పువలననే శక్తి ఈ లోకాన్ని వీడి స్వర్గలోకానికి వెళ్ళవలసివచ్చింది. (15)
న హి తం రాక్షసః కశ్చిత్ శక్తో భక్షయితుం మునే ।
ఆత్మనైవాత్మనస్తేన ద్ఱ్రుష్టో మృత్యుస్తదా భవత్ ॥ 16
మహర్షీ! ఏ రాక్షసుడూ కూడా ఆయనను తినలేడు. తన శాపం వలననే తానప్పుడు మృత్యువును సందర్శించాడు. (16)
నిమిత్తభూత స్తత్రాసీద్ విశ్వామిత్రః పరాశర ।
రాజా కల్మాషపాదశ్చ దివమారుహ్య మోదతే ॥ 17
పరాశరా! ఆ విషయంలో విశ్వామిత్రుడు కానీ, కల్మాషపాద మహారాజు కానీ నిమిత్తమాత్రులే. నీ తండ్రి స్వర్గస్థుడై ఆనందంగా ఉన్నాడు. (17)
యే చ శక్త్యవరాః పుత్రాః వసిష్ఠస్య మహామునే ।
తే చ సర్వే ముదా యుక్తాః మోదంతే సహితాః సురైః ॥ 18
మహామునీ! శక్తికన్న చిన్నవారైన వసిష్ట కుమారులు కూడా దేవతలందరితో కలిసి ఆనందంగా సుఖాలననుభవిస్తున్నారు. (18)
సర్వమేతద్వసిష్ఠస్య విదితం వై మహామునే ।
రక్షసాం చ సముచ్ఛేదః ఏష తాత తపస్వినామ్ ॥ 19
నిమిత్తభూతస్త్వం చాత్ర క్రతౌ వాసిష్ఠనందన ।
తత్ సత్రం ముంచ భద్రం తే సమాప్తమిదమస్తు తే ॥ 20
మహామునీ! ఇదంతా వసిష్ఠునకు తెలిసినదే. నాయనా! శక్తినందనా! రాక్షస వినాశం కోసం సంకల్పించిన ఈ యజ్ఞంలో నీవు కుడా నిమిత్తమాత్రుడవే. కాబట్టి ఇప్పుడీ యాగాన్ని విడిచిపెట్టు. నీకు మేలు జరుగుతుంది. ఈ యజ్ఞాన్ని ముగించు. (19,20)
గంధర్వ ఉవాచ
ఏవ ముక్తః పులస్త్యేన వసిష్ఠేన చ ధీమతా ।
తదా సమాపయామాస సత్రం శాక్తో మహామునిః ॥ 21
గంధర్వుడిలా అన్నాడు.
పులస్త్యుడు, ధీమంతుడైన వసిష్ఠుడూ ఆ రీతిగా చెప్పిన తరువాత పరాశరమహాముని ఆ యాగాన్ని ముగించాడు. (21)
సర్వరాక్షస సత్రాయ సంభృతం పావకం తదా ।
ఉత్తరే హిమవత్పార్శ్వే ఉత్ససర్జ మహావనే ॥ 22
అప్పుడు సర్వరాక్షస సంహారం కోసం ప్రోదిచేసిన ఆ అగ్నిని ఉత్తరదిక్కున హిమాలయాలకు దగ్గరగా ఉన్న మహారణ్యంలో విడిచిపెట్టాడు. (22)
స తత్రాద్యాపి రక్షాంసి వృక్షా నశ్మన ఏవ చ ।
భక్షయన్ దృశ్యతే వహ్నిః సదా పర్వణి పర్వణి ॥ 23
ఆ అగ్ని ఇప్పటికీ అక్కడ ప్రత్యేకమైన పర్వవేళలో రాక్షసులను, చెట్లను, రాళ్ళను మండిస్తూ కనిపిస్తుంది. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఔర్వోపాఖ్యానే అశీత్యధికశతతమోఽధ్యాయః ॥ 180 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున ఔర్వోపాఖ్యానము అను నూట ఎనుబదియవ అధ్యాయము (180)