179. నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము
ఔర్వుడు తన కోపమును బడబాగ్నిలో విడచుట.
ఔర్వ ఉవాచ
ఉక్తవానస్మి యామ్ క్రోధాత్ ప్రతిజ్ఞాం పితరస్తదా ।
సర్వలోకవినాశాయ న సా మే వితథా బవేత్ ॥ 1
తండ్రులారా! కోపంతో సర్వలోకవినాశం చేస్తానని నేను చేసిన ప్రతిజ్ఞ వ్యర్థం కారాదు. (1)
వృథా రోష ప్రతిజ్ఞో వై నాహం భవితుముత్సహే ।
అనిస్తీర్ణో హి మామ్ రోషః దహేదగ్నిరివారణిమ్ ॥ 2
వ్యర్థంగా కోపించి ప్రతిజ్ఞలు చేసే వాడినిగా నేను కాలేను. కోపాన్ని సఫలం చేయకపోతే అది అగ్ని అరణిని దహిమ్చినట్లు నన్ను దహిస్తుంది. (2)
యో హి కారణతః క్రోధం సంజాతం క్షంతుమర్హతి ।
నాలం స మనుజః సమ్యక్ త్రివర్గం పరిరక్షితుమ్ ॥ 3
సకారణమైన కోపాన్ని సహించేవాడు ధర్మార్థకామరూపమైన త్రివర్గాన్ని చక్కగా రక్షించుకోలేడు. (3)
అశిష్టానాం నియంతా హి శిష్టానాం పరిరక్షితా ।
స్థానే రోషః ప్రయుక్తఃస్యాత్ నృపైః సర్వజిగీషుభిః ॥ 4
అందరినీ జయింపగోరిన రాజులు తగిన సమయంలో రోషాన్ని ప్రదర్శించగలిగినప్పుడే దుర్మార్గులను శిక్షించి సజ్జనులను కాపాడగలరు. (4)
అశ్రౌష మహమూరుస్థః గర్భశయ్యాగతస్తదా ।
ఆరావం మాతృవర్గస్య భృగూణాం క్షత్రియైర్వధే ॥ 5
నేను తల్లితొడలో గర్భశయ్యపై నున్నప్పుడు క్షత్రియులు భార్గవులను సంహరించినపుడు వారి ఆర్తనాదాలను నేను విన్నాను. (5)
సంహారో హి యదా లోకే భృగూణాం క్షత్రియాధమైః ।
ఆగర్భోచ్ఛేదనాత్ క్రాంతః తదా మాం మన్యురావిశత్ ॥ 6
ఈ క్షత్రియాధములు గర్భస్థశిశువులను కూడా విడువక భృగువులను సంహరించటం ప్రారంభించినప్పుడే నన్ను కోపం ఆవేశించింది. (6)
సంపూర్ణకోశాః కిల మే మాతరః పితరస్తథా ।
భయాత్ సర్వేషు లోకేషు నాధిజగ్ముః పరాయణమ్ ॥ 7
అప్పుడు నా తల్లులు పూర్ణగర్భవతులు నా పితరులు వారితో భయంతో సర్వలోకాలలోనికి పరువెత్తారు. కాని శరణు దొరక లేదు. (7)
తాన్ భృగూణాం యదా దారాన్ కశ్చిన్నాభ్యుపపద్యత ।
మాతా తదా దధారేయమ్ ఊరుణైకేన మామ్ శుభా ॥ 8
భృగువంశస్థుల పత్నులకు రక్షకులెవ్వరూ దొరకలేదు. అప్పుడు కళ్యాణరూపిణి అయిన నా తల్లి నన్ను తొడలో దాచి ఉంచింది. (8)
ప్రతిషేద్ధా హి పాపస్య యదా లోకేషు విద్యతే ।
తదా సర్వేషు లోకేషు పాపకృన్నోపపద్యతే ॥ 9
పాపకర్మలను నిరోధించగలవాడు లోకాల్లో ఉంటే ఏ లోకంలో కూడా పాపకర్మలు చేసే వాడుండడు. (9)
యదా తు ప్రతిషేద్ధారం పాపో న లభతే క్వచిత్ ।
తిష్ఠంతి బహవో లోకాః తదా పాపేషు కర్మసు ॥ 10
పాపిని నిరోధించగలవాడెవ్వడూ లేకపోతే లోకులలో చాలామంది పాపకృత్యాలను చేస్తూనే ఉంటారు. (10)
జానన్నపిచ యః పాపం శక్తిమాన్ననియచ్ఛతి ।
ఈశస్సన్ సోపి తేనైవ కర్మణా సంప్రయుజ్యతే ॥ 11
పాపకృత్యమని తెలిసి, కూడా నిరోధించగల శక్తి కలిగి కూడా నియంత్రించని వానికి కూడా ఆ పాపకర్మ ఫలమంటుతుంది. (11)
హింస చేసినవారల యేగుగతికి. (1-7-146)
రాజభిశ్చేశ్వరైశ్చైవ యది వై పితరో మమ ।
శక్తైర్న శకితాస్త్రాతుమ్ ఇష్టం మత్వేహ జీవితమ్ ॥ 12
అత ఏషామహం క్రుద్ధోః లోకానామీశ్వరోహ్యహమ్ ।
భవతాం చ వచో నాలమ్ అహం సమబివర్తితుమ్ ॥ 13
తమ జీవితాన్ని ప్రియంగా భావించి అందరిని పరిపాలించవలసిన రాజులు కూడా రక్షింపసమర్థులై ఉండి కూడా నాపితరులను రక్షించలేదు. అందువలన నాకు వారిపై కోపం వచ్చింది. వారిని దండించగల శక్తి నాకున్నది. (12,13)
మమాపి చేద్భవేదేవమ్ ఈశ్వరస్య సతో మహత్ ।
ఉపేక్షమాణస్య పునఃలోకానాం కిల్బిషాద్భయమ్ ॥ 14
నేను కూడా సమర్థుడనై ఉండి పాపకృత్యాలను చూస్తూ ఊరుకుంటే నాకు ఈ లోకుల పాపాల వలన తీవ్రభయం కలుగుతుంది. (14)
య శ్చాయం మన్యుజో మేఽగ్నిః లోకానాదాతు మిచ్ఛతి ।
దహేదేష చ మామేవ నిగృహీతః స్వతేజసా ॥ 15
క్రోధం వలన నాలో పుట్టిన అగ్ని తన జ్వాలలతో లోకాలను మ్రింగదలచుకొన్నది. నేను దానిని నిరోధిస్తే అది తన తేజస్సుతో నన్నే తగులబెడుతుంది. (15)
భవతాం చ విజానామి సర్వలోక హితేప్సుతామ్ ।
తస్మాద్విదధ్వం యచ్ఛ్రేయః లోకానాం మమ చేశ్వరాః ॥ 16
మీరు సర్వలోకాల హితాన్ని కోరుతున్నారని కూడా నేనెరుగుదును. కాబట్టి పితరులారా! లోకాలకూ, నాకూ కుడా మేలు కలిగేటట్లు మీరు ఆదేశించండి. (16)
పితర ఊచుః
య ఏష మన్యుజస్తేఽగ్నిః లోకానాదాతు మిచ్ఛతి ।
అప్సు తమ్ ముంచ భద్రంతే లోకా హ్యప్సు ప్రతిష్ఠితాః ॥ 17
పితరులిలా అన్నారు.
క్రోధం వలన నీలో పుట్టిన అగ్ని లోకాలను గ్రసించగోరుతోంది కదా! దాన్ని నీటిలో వదలిపెట్టు. నీకు మేలు కలుగుతుంది. లోకాలు నీటిలోనే ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. (17)
ఆపోమయాః సర్వరసాః సర్వమాపోమయం జగత్ ।
తస్మాదప్సు విముంచేమమ్ క్రోధాగ్నిం ద్విజసత్తమ ॥ 18
ద్విజశ్రేష్ఠా! సర్వరసాలు జలమయాలు. సమస్త జగత్తు జలమయమే. కాబట్టి నీ క్రోధాగ్నిని నీటిలో విడిచి పెట్టు. (18)
అయం తిష్ఠతు మే విప్ర యదిచ్ఛసి మహోదధౌ ।
మన్యుజోఽగ్నిర్దహన్నాపః లోకా హ్యాపోమయాః స్మృతాః ॥ 19
విప్రుడా! నీకు నచ్చితే ఈ అగ్నిని సముద్రంలో నిలుపు. కోపం నుండి పుట్టిన అగ్ని నీటిని దహిస్తుంది. లోకాలు జలమయాలనే కదా వ్యవహారం. (19)
ఏవం ప్రతిజ్ఞా సత్యేయం తవానఘ భవిష్యతి ।
న చైవం సామరాలోకా గమిష్యంతి పరాభవమ్ ॥ 20
అనఘా! ఈ రీతిగా నీ ప్రతిజ్ఞ యధార్థమవుతుంది. దేవతలతో సహా ఈ లోకాలన్ని నష్టపోకుండా ఉంటాయి. (20)
వసిష్ఠ ఉవాచ
తతస్తం క్రోధజం తాత ఔర్వోఽగ్నిం వరుణాలయే ।
ఉత్ససర్జ స చైవాప ఉపయుంక్తే మహోదధౌ ॥ 21
మహద్ధయశిరో భూత్వా యత్తద్వేదవిదో విదుః ।
తమగ్ని ముద్గిరద్వక్ర్తాత్ పిబత్యాపో మహోదధౌ ॥ 22
వసిష్ఠుడిలా అన్నాడు.
నాయనా! అప్పుడు ఔర్వుడు క్రోధం నుండి పుట్టిన ఆ అగ్నిని సముద్రంలో వదలివేశాడు. ఇప్పటికీ ఆ అగ్ని పెద్దదిగా ఉన్న అశ్వముఖాకృతితో సాగరజలాలను త్రాగుతూనే ఉంది. వేదవేత్తలకు అది తెలుసు. ఆ బడబ తననోటి నుండి ఆ అగ్నిని క్రక్కుతూ మహోదధి జలాన్ని త్రాగుతూ ఉంటుంది. (21,22)
తస్మాత్ త్వమపి భద్రం తే న లోకాన్ హంతుమర్హసి ।
పరాశర పరాంల్లోకాన్ జానన్ జ్ఞానవతాం వర ॥ 23
జ్ఞానులలో శ్రేష్ఠుడా! నీకు మేలు కలుగుతుంది. పరాశరా! నీకు పరలోకాలను గురించి కూడా తెలుసు. ఆ లోకాలను నశింపచేయదగదు. (23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ఔర్వోపాఖ్యానే ఏకోనాశీత్యధిక శతతమోఽధ్యాయః ॥ 179 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున ఔర్వోపాఖ్యానమున నూట డెబ్బది తొమ్మిదవ అధ్యాయము (179)