177. నూట డెబ్బది యేడవ అధ్యాయము
పరాశరుని జననము-ఔర్వోపాఖ్యానము.
గంధర్వ ఉవాచ
ఆశ్రమస్థా తతః పుత్రమ్ అదృశ్యంతీ వ్యజాయత ।
శక్తేః కులకరం రాజన్ ద్వితీయమివ శక్తినమ్ ॥ 1
గంధర్వుడిలా అన్నాడు.
అర్జునా! ఆశ్రమంలో నున్న అదృశ్యంతి శక్తివంశవర్ధనుడైన కుమారుని కన్నది. ఆ బాలుడు రూపంలో రెండవ శక్తి వలె ఉన్నాడు. (1)
జాతకర్మాదికాస్తస్య క్రియాః స మునిసత్తమః ।
పౌత్రస్య భరతశ్రేష్ట చకార భగవాన్ స్వయమ్ ॥ 2
భరతశ్రేష్టా! మునిశ్రేష్ఠుడైన ఆ వసిష్ఠుడు పౌత్రునకు జాతకర్మ మొదలుగా గల సంస్కారకర్మలను స్వయంగా జరిపాడు. (2)
పరాసుః స యతస్తేన వసిష్ఠః స్థాపితో మునిః ।
గర్భస్థేన తతో లోకే పరాశర ఇతి స్మృతః ॥ 3
ఆ బాలుడు గర్భంలో పడి మరణేచ్ఛ గల వసిష్ఠమహర్షిలో మరల జీవనోత్సాహాన్ని కల్గించాడు. కాబట్టి పరాశరుడన్న పేరుతో ప్రసిద్ధికెక్కాడు. (3)
అమన్యత స ధర్మాత్మా వసిష్ఠం పితరం మునిః ।
జన్మప్రభృతి తస్మింస్తు పితరీవాన్వవర్తత ॥ 4
ధర్మాత్ముడైన ఆ పరాశరముని వసిష్ఠుని తండ్రిగా భావించాడు. చిన్ననాటి నుండి తండ్రితో ప్రవర్తించినట్లే వసిష్ఠునితో మెలిగాడు. (4)
స తాత ఇతి విప్రర్షిః వసిష్ఠం ప్రత్యభాషత ।
మాతుః సమక్షం కౌంతేయ అదృశ్యంత్యాః పరంతప ॥ 5
కౌంతేయా! పరంతపా! ఆ విప్రర్షి పరాశరుడు తల్లి అయిన అదృశ్యంతి సమక్షంలో తండ్రీ అని వసిష్ఠుని సంబోధించాడు. (5)
తాతేతి పరిపూర్ణార్థం తస్య తన్మధురం వచః ।
అదృశ్యంత్యశ్రుపూర్ణాక్షీ శృణ్వతీ తమువాచ హ ॥ 6
ఆ బాలుని నోటి నుండి పరిపూర్ణార్థ బోధకమైన 'తండ్రీ' అన్న మధురవచనాన్ని విని అదృశ్యంతి కన్నుల నీరు నింపుకొని అతనితో ఇలా అన్నది. (6)
మా తాత తాత తాతేతి బ్రూహ్యేనం పితరం పితుః ।
రక్షసా భక్షితస్తాత తవ తాతో వనాంతరే ॥ 7
నాయనా! ఈయన మీ తండ్రికి తండ్రి. 'తండ్రీ' అని ఈయనను పిలువరాదు. మీ తండ్రిని అరణ్యంలో రాక్షసుడు తినివేశాడు. (7)
మన్యసే యం తు తాతేతి నైష తాత స్తవానఘ ।
ఆర్య ఏష పితా తస్య పితుస్తవ యశస్వినః ॥ 8
నీవు తండ్రి అని భావిస్తున్న ఈయన నీ తండ్రి కాదు. యశస్వి అయిన నీ తండ్రికి ఈ పూజనీయుడు తండ్రి. (8)
స ఏవముక్తో దుఃఖార్తః సత్యవా గృషిసత్తమః ।
సర్వలోకవినాశాయ మతిం చక్రే మహామనాః ॥ 9
ఆ మాట విని దుఃఖార్తుడై, మహామనస్కుడు, సత్యవచనుడైన ఆ ముని శ్రేష్ఠుడు-పరాశరుడు-సర్వలోకాలను నాశనం చేయాలని భావించాడు. (9)
తం తథా నిశ్చితాత్మానం స మహాత్మా మహాతపాః ।
ఋషిర్ర్బహ్మవిదాం శ్రేష్ఠః మైత్రావరుణిరన్యధీః ॥ 10
వసిష్ఠో వారయామాస హేతునా యేన తచ్ఛృణు ।
పరాశరుని మనస్సులోని నిశ్చయాన్ని గ్రహించి మహాత్ముడు, మహాతపస్వి, బ్రహ్మజ్ఞాని శ్రేష్ఠుడు, మిత్రావరుణకుమారుడు అయిన వసిష్ఠమహర్షి అతనిని వారించాడు. ఏ కారణంగా వారించగలిగాడో చెపుతా విను. (10 1/2)
వసిష్ఠ ఉవాచ
కృతవీర్య ఇతి ఖ్యాతః బభూవ పృథివీపతిః ॥ 11
యాజ్యో వేదవిదాం లోకే భృగూణాం పార్థివర్షభః ।
స తానగ్రభుజస్తాత ధాన్యేన చ ధనేన చ ॥ 12
సోమాంతే తర్పయామాస విపులేన విశాంపతిః ।
తస్మిన్ నృపతిశార్దూలే స్వర్యాతేఽథ కథంచన ॥ 13
బభూవ తత్కులేయానాం ద్రవ్యకార్యముపస్థితమ్ ।
భృగూణాం తు ధనం జ్ఞాత్వా రాజానః సర్వ ఏవ తే ॥ 14
యాచిష్ణవోఽభిజగ్ముస్తాన్ తతో భార్గవసత్తమాన్ ।
భూమౌ తు నిదధుః కేచిత్ భృగవో ధనమక్షయమ్ ॥ 15
వసిష్ఠుడిలా అన్నాడు.
కృతవీర్యుడని ప్రసిద్ధిచెందిన రాజు ఉండేవాడు. ఆ రాజశ్రేష్ఠుడు వేదవేత్తలయిన భృగువంశస్థులకు యజమాని. ఆ రాజు బ్రాహ్మణులను సోమయాగసమాప్తివేళలో విస్తారమైన ధనంతో, ధాన్యంతో, తృప్తి పరిచాడు.
ఆ రాజు స్వర్గస్థుడైన తరువాత ఒకసారి ఆ వంశస్థులకు ఏ కారణం చేతనో ధనం అవసరమైంది. భృగువంశస్థుల దగ్గర ధనమున్నదని తెలిసి ఆ రాజకుటుంబీకులందరు ఆ భార్గవుల దగ్గరకు యాచనకై వెళ్ళారు. ఆ బార్గవులలో కొందరు అక్షయమైన తమ ధనాన్ని భూమిలో దాచి ఉంచారు. (11-15)
దదుః కేచిద్ ద్విజాతిభ్యః జ్ఞాత్వా క్షత్రియతో భయమ్ ।
భృగవస్తు దదుః కేచిత్ తేషాం విత్తం యథేప్సితమ్ ॥ 16
కొందరు భార్గవులు క్షత్రియ భయంతో తమధనాన్ని బ్రాహ్మణులకు దానం చేశారు. కొందరు భృగువంశస్థులు మాత్రం ఇష్టపూర్తిగా ఆ రాజులకు ధనమిచ్చారు. (16)
క్షత్రియాణాం తదా తాత కారణాంతరదర్శనాత్ ।
తతో మహీతలం తాత క్షత్ర్రియేణ యదృచ్ఛయా ॥ 17
ఖనతాధిగతం విత్తం కేనచిద్ భృగువేశ్మని ।
తద్విత్తం దదృశుః సర్వే సమేతాః క్షత్రియర్షభాః ॥ 18
నాయనా! వేరు వేరు కారణాలను చూచి మరికొందరు అప్పుడు ధనమిచ్చారు. ఆ తర్వాత ఆ రాజులలో ఒకడు దేనికోసమో భూమిని త్రవ్వుతూ ఒక భృగువు ఇంటిలో పాతి ఉంచిన ధనాన్ని చూచాడు. అప్పుడు రాజశ్రేష్ఠులంతా ఒక్కటై అక్కడ చేరి ఆ ధనాన్ని చుచారు. (17,18)
అవమన్య తతః క్రోధాన్ భృగూన్ తాన్ శరణాగతాన్ ।
నిజఘ్నః పరమేష్వాసాః సర్వాంస్తాన్ నిశితైః శరైః ॥ 19
అప్పుడు వారు కోపంతో భృగువంశస్థులు శరణువేడినా వారిని తిరస్కరించారు. ఆ మేటి విలుకాండ్రు అందరు వాడి బాణాలతో వారినందరినీ చంపివేశారు. (19)
ఆగర్బాదవకృంతంతః చేరుః సర్వాం వసుంధరామ్ ।
తత ఉచ్ఛిద్యమానేషు భృగుష్వేవం భయాత్తదా ॥ 20
భృగుపత్న్యో గిరిం దుర్గం హిమవంతం ప్రపేదిరే ।
తాసామన్యతమా గర్భం భయాద్ దధ్రే మహౌజసమ్ ॥ 21
ఊరుణైకేన వామోరుః భర్తుః కులవివృద్ధయే ।
తద్గర్భముపలభ్యాశు బ్రాహ్మణీ యా భయార్దితా ॥ 22
గత్వైకా కథయామాస క్షత్రియాణాముపహ్వరే ।
తతస్తే క్షత్రియా జగ్ముః తం గర్భం హంతుముద్యతాః ॥ 23
అటు పిమ్మట భృగువంశంలోని గర్భస్థ శిశువులను కూడా చంపుతూ ఆ క్రోధాంధులు భూమిపై తిరుగసాగారు. భృగువంశవిచ్ఛిత్తి ఆరంభమైనదన్న భయంతో భృగుపత్నులు హిమాలయాలలోని దుర్గమ గుహలలో దాగారు. వారిలో ఒక స్త్రీ తేజస్వంతమైన తన గర్భాన్ని భయంతో ఒక తొడలో దాచుకొన్నది. ఆమె భర్త వంశవృద్ధిని కోరి ఆ పని చేసింది. ఆ గర్భ సమాచారాన్ని తెలిసికొని మరొక బ్రాహ్మణ స్త్రీ భయపడి ఒంటరిగా క్షత్రియుల దగ్గరకు వెళ్ళి ఆ విషయాన్ని చెప్పింది. అప్పుడు క్షత్రియులంతా ఆ గర్భవిచ్ఛేదన చేయాలని బయలుదేరారు. (22,23)
దదృశుర్ర్బాహ్మణీం తేఽథ దీప్యమానాం స్వతేజసా ।
అథ గర్భః సభిత్త్వోరుం బ్రాహ్మణ్యా నిర్జగామ హ ॥ 24
తన తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రాహ్మణిని వారు చూచారు. ఆపై గర్భస్థ శిశువు తొడలు బ్రద్దలు చేసి తనంత తానే బయటకు వచ్చాడు. (24)
ముష్ణన్ దృష్టీః క్షత్రియాణాం మధ్యాహ్న ఇవ భాస్కరః ।
తతశ్చక్షుర్విహీనాస్తే గిరిదుర్గేషు బభ్రముః ॥ 25
మధ్యాహ్నసూర్యుని వలె ఆ శిశువు క్షత్రియుల దృష్టిని దొంగిలించాడు. అప్పుడు కన్నులు కోల్పోయిన వారందరూ పర్వతప్రాంతాల్లో తిరుగసాగారు. (25)
తతస్తే మోహమాపన్నాః రాజానో నష్టదృష్టయః ।
బ్రాహ్మణీం శరణం జగ్ముః దృష్ట్యర్థం తామనిందితామ్ ॥ 26
మోహానికి లోనయి తమ దృష్టిని కోలుపోయిన ఆ రాజులందరూ దృష్టికోసం మరల అనిందిత అయిన ఆ బ్రాహ్మణిని శరణుకోరారు. (26)
ఊచుశ్చైనాం మహాభాగాం క్షత్రియాస్తే విచేతసః ।
జ్యోతిః ప్రహీణా దుఃఖార్తాః శాంతార్చిష ఇవాగ్నయః ॥ 27
భగవత్యాః ప్రసాదేన గచ్ఛేత్క్షత్రం సచక్షుషమ్ ।
ఉపారమ్యచ గచ్ఛేమ సహితాః పాపకర్మిణః ॥ 28
కనుచూపు కోల్పోయి దుఃఖార్తులై జ్వాలలు లేని అగ్నుల వలె అచేతనులై ఉన్న క్షత్రియులు ఆ మహాభాగతో ఇలా అన్నారు-
దేవి! నీవు అనుగ్రహిస్తే కనుచూపును పొంది మేమంతా నిష్క్రమిస్తాము. కొద్దిసేపు విశ్రాంతి తీసికొని పాపాత్ములమైన మేమంతా కలిసి వెళతాము. (27,28)
స పుత్రా త్వం ప్రసాదం నః కర్తుమర్హసి శోభనే ।
పునర్దృష్టిప్రసాదేన రాజ్ఞః సంత్రాతుమర్హసి ॥ 29
శోభనా! నీవు నీ కుమారునితో పాటు మమ్ము అనుగ్రహించాలి. మరల దృష్టిని అనుగ్రహించి రాజపుత్రులను మమ్మందరినీ కాపాడాలి. (29)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథ పర్వణి ఔర్వోపాఖ్యానే సప్తసప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 177 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున ఔర్వోపాఖ్యానమను నూట డెబ్బది ఏడవ అధ్యాయము. (177)