176. నూట డెబ్బది ఆరవ అధ్యాయము

కల్మాష పాదుని శాపవిమోచనము - అశ్మక జననము.

గంధర్వ ఉవాచ
తతో దృష్ట్వాశ్రమపదం రహితం తైః సుతైర్మునిః ।
నిర్జగామ సుదుఃఖార్తః పునరప్యాశ్రమాత్తతః ॥ 1
గంధర్వుడిలా అన్నాడు.
ఆ తరువాత వసిష్ఠుడు తన బిడ్డలు లేని ఆశ్రమపదాన్ని చూచి తీవ్రశోకంతో ఆ ఆశ్రమం నుండి మళ్లీ వెళ్ళిపోయాడు. (1)
పో-పశ్యత్ పరితం పూర్ణాం ప్రావృట్కాలే నవాంభసా ।
వృక్షాన్ బహువిధాన్ పార్థ హరంతీం తీరజాన్ బహూన్ ॥ 2
అర్జునా! అది వర్షాకాలం. ఆ కాలంలో ఆ వసిష్ఠుడు క్రొత్తనీటితో నిండుగా వున్న ఒక నదిని చూచాడు. అది తీరంలోని వివిధవృక్షాలను లెక్కకు మిక్కిలిగా తనతో తీసికొనిపోతోంది. (2)
అథ చింతాం సమాపేదే పునః కౌరవనందన ।
అంభస్యస్యా నిమజ్జేయమ్ ఇతి దుఃఖసమన్వితః ॥ 3
అర్జునా! అది చూచి మరల దుఃఖించాడు. ' ఈ నీటిలో మునిగిపోతాను' అని ఆలోచించాడు. (3)
తతః పాశైస్తత్మానం గాఢం బద్ధ్వా మహామునిః ।
తస్యా జలే మహానద్యాః నిమమజ్జ సుదుఃఖితః ॥ 4
తరువాత మహర్షి త్రాళ్ళతో తనను తాను గట్టిగా కట్టుకొని దుఃఖిస్తూనే నీటిలో మునిగాడు. (4)
అథ ఛిత్త్వా నదీ పాశాన్ తస్యారిబలసూదన ।
స్థలస్థం తమృషిం కృత్వా విపాశం సమవాసృజత్ ॥ 5
అరిందమా! ఆపై ఆ నది ఆ ముని పాశాలను ఛేదించి ఆ వసిష్ఠమునిని ఒడ్డుకు చేర్చి త్రాళ్ళను విప్పి వదలివేసింది. (5)
ఉత్తతార తతః పాశైః విముక్తః స మహానృషిః ।
విపాశేతి చ నామాస్యాః నద్యాశ్చక్రే మహానృషిః ॥ 6
అప్పుడు పాశవిముక్తుడైన ఆ మహర్షి నీటినుండి బయటపడి ఆ నదికి విపాశ అని పేరుపెట్టాడు. (6)
శోకబుద్ధిం తదా చక్రే న చైకత్ర వ్యతిష్ఠత ।
సో-గచ్ఛత్ పర్వతాంశ్చైవ సరితశ్చ సరాంసి చ ॥ 7
శోకబుద్ధియై అప్పుడు ఎక్కడా ఒకచోట నిలువలేకపోయాడు. పర్వతాలపై నదీతీరాలపై, సరస్సుల గట్లపై తిరగసాగారు. (7)
దృష్వా స పునరేవర్షిః నదీం హైమవతీం తదా ।
చండ గ్రాహవతీం భీమాం తస్యాః స్రోతస్యపాతయత్ ॥ 8
ఆ సంధర్భంలో ఆ మహర్షి హైమవతీనదిని చూచాడు. అది భయంకరమైనది. భీకరమైన మొసళ్ళతో కూడినది. మరల ఆ ప్రవాహంలోని కురికాడు. (8)
సా తమగ్నిసమం విప్రమ్ అనుచింత్య సరిద్వరా ।
శతథా విద్రుతా యస్మాత్ శతద్రురితి విశ్రుతా ॥ 9
సరిద్వర అయిన ఆ హైమవతి వసిష్ఠుని అగ్నిసమానునిగా భావించి వందల పాయలుగా చీలి పరువులెత్తింది. అందువల్ల శతద్రువు అని పేరు పొందింది. (9)
తతః స్థలగతం దృష్ట్వా తత్రాప్యాత్మానమాత్మనా ।
మర్తుం నశక్యమిత్యుక్త్వా పునరేవాశ్రమం యయౌ ॥ 10
మరల తాను ఒడ్డుమీదనే ఉన్నట్టు గ్రహించి ఆత్మహత్య చేసికొని మరణించటం అసాధ్యమని భావించి వసిష్ఠుడు మరల ఆశ్రమానికి వెళ్ళాడు. (10)
స గత్వా వివిధాన్ శైలాన్ దేశాన్ బహువిధాంస్తథా ।
అదృశ్యంత్యాఖ్యయా వధ్వాఽథాశ్రమేఽనుసృతోఽభవత్ ॥ 11
ఈ ప్రకారంగా వివిధపర్వతాలకు, వివిధ ప్రదేశాలకూ వసిష్ఠుడు వెళ్ళాడు. ఆ ప్రయాణాలలో 'అదృశ్యంతి' అను పేరుగల కోడలు ఆయనను వెన్నంటి ఉండేది. (11)
అథ శుశ్రావ సంగత్యా వేదాధ్యయననిః స్వనమ్ ।
పృష్ఠతః పరిపూర్ణార్థం షడ్భిరంగై రలంకృతమ్ ॥ 12
ఆపై తన వెనుక నుండి స్వరబద్ధమైన వేదాధ్యయన శబ్దాన్ని విన్నాడు. అది షడంగాలతో అలంకరింపబడి స్పష్టంగా అర్థమవుతోంది. (12)
అనువ్రజతి కోన్వేష మామిత్యేవాథ సోఽబ్రవీత్ ।
అహమిత్యదృశ్యంతీమం సా స్నుషా ప్రత్యభాషత ।
శక్తేర్భార్యా మహాభాగ తపో యుక్తాతపస్వినీ ॥ 13
"నా వెనుక వస్తున్నదెవరు?" అని వసిష్ఠుడు ప్రశ్నించాడు. అప్పుడు "మహాభాగా! నేను తపోదీక్షతో ఉన్నదానను, శక్తిభార్యను" అని ఆ కోడలు అదృశ్యంతి వసిష్ఠునితో అన్నది. (13)
వసిష్ఠ ఉవాచ
పుత్రి కస్యైష సాంగస్య వేదస్యాధ్యయనస్వనః ।
పురా సాంగస్య వేదస్య శక్తేరివ మయా శ్రుతః ॥ 14
వసిష్ఠుడిలా అన్నాడు.
కుమారీ! సాంగమైన ఈ వేదాధ్యయన ధ్వని ఎవరిది? గతంలో శక్తి వేదాధ్యయనం చేస్తున్న స్వరంలా నాకు వినిపిస్తోంది. (14)
అదృశ్యంత్యువాచ
అయం కుక్షౌ సముత్పన్నః శక్తేర్గర్భః సుతస్య తే ।
సమా ద్వాదశ తస్యేహ వేదానభ్యస్యతో మునే ॥ 15
అదృశ్యంతి ఇలా అన్నది. నీ కుమారుడైన శక్తి కొడుకు నా గర్భంలో నున్నాడు. ఇప్పటికి పండ్రెండు సంవత్సరాల నుండి నా గర్భంలోనే వేదాభ్యాసం చేస్తున్నాడు. (15)
గంధర్వ ఉవాచ
ఏవముక్త స్తయా హృష్టః వసిష్ఠః శ్రేష్ఠభాగృషిః ।
అస్తి సంతాన మిత్యుక్త్వా మృత్యోః పార్థ న్యవర్తత ॥ 16
గంధర్వుడిలా అన్నాడు.
అర్జునా! ఆ మాటవిని ఆనందించి పరమాత్మను సేవించే వసిష్ఠ మహర్షి "సంతానప్రాప్తి ఉన్నది" అనుకొని మరణాలోచన నుండి వెనుదిరిగాడు (16)
తతః ప్రతినివృత్తః సః తయా వధ్వా సహానఘ ।
కల్మాషపాదమాసీనం దదర్శ విజనే వనే ॥ 17
అనఘా! ఆ తరువాత కోడలితోపాటు మరలివస్తూ ఒక నిర్జనారణ్యంలో కూర్చొనొ ఉన్న కల్మాషపాదుని చూచాడు. (17)
స తు దృష్ట్వైవ తం రాజా క్రుద్ధ ఉత్థాయ భారత ।
ఆవిష్టో రక్షసో-గ్రేణ ఇయేషాత్తుం తదా మునిమ్ ॥ 18
భారతా! భీకరుడైన రాక్షసుడు ఆవేశించిన కల్మాషపాదుడు వసిష్ఠుని చూడగానే కోపంతో లేచి అప్పుడు ఆయనను తినాలని ఉద్యమించాడు. (18)
అదృశ్యంతీ తు తం దృష్ట్వా క్రూరకర్మాణ మగ్రతః ।
భయసంవిగ్నయా వాచా వసిష్ఠమిదమబ్రవీత్ ॥ 19
క్రూరకర్ముడైన ఆ రాక్షసుని ఎదురుగా చూచి అదృశ్యంతి బయోద్విగ్నమైన గొంతుతో వసిష్ఠునితో ఇలా అన్నది. (19)
అసౌ మృత్యురివోగ్రేణ దండేన భగవన్నితః ।
ప్రగృహీతేన కాష్ఠేన రాక్షసోఽభ్యేతి దారుణః ॥ 20
స్వామీ! ఆ రాక్షసుడు పెద్ద కర్ర తీసికొని ఇటే వస్తున్నాడు. దండాన్ని చేతబట్టి ఉన్న యమధర్మరాజులా కనిపిస్తున్నాడు. (20)
తం నివారయితుం శక్తః నా న్యోఽస్తి భువి కశ్చన ।
త్వదృతేఽద్య మహాభాగ సర్వవేదవిదాం వర ॥ 21
మహాభాగా! వేదవేత్తలలో శ్రేష్ఠుడా! నీవు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ ఆ రాక్షసుని నిలవరించలేరు. (21)
పాహి మాం భగవన్ పాపాద్ అస్మాద్దారుణదర్శనాత్ ।
రాక్షసో-య మిహాత్తుం వై నూనమావాం సమీహతే ॥ 22
స్వామీ! దారుణంగా కనిపిస్తున్న ఈ పాపాత్ముని బారి నుండి నన్ను రక్షించు. ఈ రాక్షసుడు మనలను తినాలనుకొంటున్నాడు. (22)
వసిష్ఠ ఉవాచ
మాభైః పుత్రి న భేతవ్యం రాక్షసాత్తు కథంచన ।
నైతద్ రక్షోభయం యస్మాత్ పశ్యసి త్వముపస్థితమ్ ॥ 23
వసిష్ఠుడిలా అన్నాడు.
కుమారీ! భయపడవద్దు. ఈ రాక్షసుని నుండి ఏ విధంగానూ భయపడనవసరం లేదు. నిన్ను భయపెడుతున్నవాడు వాస్తవానికి రాక్షసుడే కాదు. (23)
రాజా కల్మాషపాదోఽయం వీర్యవాన్ ప్రథితో భువి ।
స ఏషోఽస్మిన్ వనోద్దేశే నివసత్యతిభీషణః ॥ 24
భూలోకంలో పరాక్రమంలో ప్రసిద్ధి కెక్కిన రాజు కల్మాషపాదుడు ఆయన. అతిభీషణరూపాన్ని ధరించి ఈ అరణ్య ప్రాంతంలో నివసిస్తున్నాడు. (24)
గంధర్వ ఉవాచ
తమాపతం తం సంప్రేక్ష్య వసిష్ఠో భగవాన్ ఋషిః ।
వారయామాస తేజస్వీ హుంకారేణైవ భారత ॥ 25
గంధర్వుడిలా అన్నాడు.
భారతా! మీదికి వస్తున్న ఆ రాక్షసుని చూచి తేజస్వి, పూజ్యుడైన వసిష్ఠమహర్షి హుంకారమాత్రంతో ఆయనను నివారించాడు. (25)
మంత్రపూతేన చ పునః తమభ్యుక్ష్య వారిణా ।
మోక్షయామాస వై శాపాత్ తస్మాద్ యోగాన్నరాధిపమ్ ॥ 26
ఆపై మంత్రజలాన్ని ఆయనపై చల్లి తనయోగశక్తితో ఆ రాజును ఆ శాపం నుండి విముక్తుని చేశాడు. (26)
సహి ద్వాదశ వర్షాణి వాసిష్ఠస్యైవ తేజసా ।
గ్రస్త ఆసీద్ర్గహేణేవ పర్వకాలే దివాకరః ॥ 27
ఆ కల్మాషపాదుడు పండ్రెండు సంవత్సరాలు వసిష్ఠుని కొడుకైన శక్తి తేజస్సుచే గ్రహణసూర్యుని వలె మ్రింగబడ్డాడు. (27)
రక్షసా విప్రముక్తోఽథ స నృపస్తద్వనమ్ మహత్ ।
తేజసా రంజయామాస సంధ్యాభ్రమివ భాస్కరః ॥ 28
రాక్షసుని బారి నుండి విముక్తుడైన ఆ కల్మాషపాదుడు సంధ్యాకాలంలో భాస్కరుడు ఆకాశాన్ని ప్రకాశింపచేసినట్లు ఆ మహావనాన్ని తన తేజస్సుతో రంజింపచేశాడు. (28)
ప్రతిలభ్య తతస్సంజ్ఞామ్ అభివాద్య కృతాంజలిః ।
ఉవాచ నృపతిః కాలే వసిష్ఠమృషిసత్తమమ్ ॥ 29
అటు పిమ్మట ఆ రాజు వివేకాన్ని పొంది, చేతులు జోడించి నమస్కరించి, ఋషి శ్రేష్ఠుడైన వసిష్ఠునితో ఇలా అన్నాడు. (29)
సౌదాసో-హం మహాభాగ యాజ్యస్తే మునిసత్తమ ।
అస్మిన్ కాలే యదిష్టం తే బ్రూహి కిమ్ కరవాణి తే ॥ 30
మహాభాగా! నేను తమ దాసుడను. మునిశ్రేష్ఠా! తమరు యాగాలు చేయించదగినవాడను. ఈ సమయంలో తమకిష్టమైనది చెప్పండి. నేనేం చేయాలి తమకు? (30)
వసిష్ఠ ఉవాచ
వృత్తమేతద్ యథాకాలం గచ్ఛ రాజ్యం ప్రశాధి వై ।
బ్రాహ్మణం తు మనుష్యేంద్ర మావమంస్థాః కదాచన ॥ 31
వసిష్ఠుడిలా అన్నాడు.
నా కోరికను కాలమే తీర్చింది. వెళ్ళు! రాజ్యాన్ని పరిపాలించుకో! నరోత్తమా! బ్రాహ్మణుని ఎప్పుడూ అవమానించవలదు. (31)
రాజోవాచ
నావమంస్యే మహాభాగ కదాచిత్ బ్రాహ్మణానహమ్ ।
త్వన్నిదేశే స్థితః సమ్యక్ పూజయిష్యామ్యహం ద్విజాన్ ॥ 32
రాజు ఇలా అన్నాడు.
మహాభాగా! ఎప్పుడూ నేను బ్రాహ్మణులను అవమానించను. తమ ఆజ్ఞానువర్తినై ద్విజులను చక్కగా పూజిస్తాను. (32)
ఇక్ష్వాకూణాం చ యేనాహమ్ అనృణః స్యాం ద్విజోత్తమ ।
తత్ త్వత్తః ప్రాప్తుమిచ్ఛామి సర్వవేదవిదాం వర ॥ 33
వేదవేత్తలలో శ్రేష్ఠుడా! ద్విజోత్తమా! ఇక్ష్వాకువంశస్థులైన పితరుల ఋణం నుండి విముక్తి పొందటానికి మీ కారణంగా ఒక పుత్రుని పొందాలనుకొంటున్నాను. (33)
అపత్యమీప్సితం మహ్యం దాతుమర్హసి సత్తమ ।
శీలరూపగుణోపేతమ్ ఇక్ష్వాకుకులవృద్ధయే ॥ 34
సజ్జనశ్రేష్ఠా! ఇక్ష్వాకు వంశవృద్ధికై నాకు శీలరూపగుణాలు గల అభీష్టసంతానాన్ని దయచేయవలసినది. (34)
గంధర్వ ఉవాచ
దదానీత్యేవ తం తత్ర రాజానం ప్రత్యువాచ హ ।
వసిష్ఠః పరమేష్వాసం సత్యసంధో ద్విజోత్తమః ॥ 35
గంధర్వుడిలా అన్నాడు.
సత్యసంధుడు ద్విజోత్తముడు అయిన ఆ వసిష్ఠుడు 'అలాగే ఇస్తాను' అని మేటివిలుకాడైన కల్మాషపాద మహారాజుతో అన్నాడు. (35)
తతః ప్రతి యయౌ కాలే వసిష్ఠః సహ తేన వై ।
ఖ్యాతం పురీమిమాం లోకే ష్వయోధ్యాం మనుజేశ్వర ॥ 36
నరోత్తమా! ఆ తరువాత తగిన వేళలో వసిష్ఠుడు రాజుతో కలిసి లోకవిఖ్యాతమైన రాజధానీ నగరానికి-అయోధ్యకు-వెళ్ళాడు. (36)
తం ప్రజాః ప్రతిమోదంత్యః సర్వాః ప్రత్యుద్గతాస్తదా ।
విపాప్మానం మహాత్మానం దివౌకస ఇవేశ్వరమ్ ॥ 37
పాపరహితుడు, మహాత్ముడు అయిన తమరాజు రాకకు సంతోసిస్తూ అయోధ్యాపుర ప్రజలు అందరు దేవతలు దేవేంద్రునకెదురేగినట్లు ఆయనకు ఎదురేగారు. (37)
సుచిరాయ మనుష్యేంద్రః నగరీం పుణ్యలక్షణామ్ ।
వివేశ సహితస్తేన వసిష్ఠేన మహర్షిణా ॥ 38
దదృశుస్తం మహీపాలమ్ అయోధ్యావాసినో జనాః ।
పురోహితేన సహితం దివాకరమివోదితమ్ ॥ 39
చాలాకాలం తర్వాత రాజు పుణ్యలక్షణాలు గల ఆ నగరిలోనికి వసిష్ఠమహర్షితో సహా ప్రవేశించాడు. అయోధ్యానివాసులయిన ప్రజలందరూ పురోహితునితో కలిసి వస్తున్న రాజును ఉదయభానుని చూచినట్లుగా చూచారు. (38,39)
స చ తాం పూరయామాస లక్ష్మ్యా లక్ష్మీవతాం వరః ।
అయోధ్యాం వ్యోమ శీతాంశుః శరత్కాల ఇవోదితః ॥ 40
శరత్కాలపు చంద్రుడు ఆకాశాన్ని వెన్నెలతో నింపివేసినట్టు లక్ష్మీసంపన్నులలో శ్రేష్ఠుడైన ఆ రాజు అయోధ్యను శోభతో నింపివేశాడు. (40)
సంసిక్తమృష్టపంథానం పతాకాధ్వజశోభితమ్ ।
మనః ప్రహ్లాదయామాస తస్య తత్పురముత్తమమ్ ॥ 41
నగరమార్గాలనన్నింటిని తడిపి శుభ్రంగా ఊడ్చి (చిమ్మి) పెట్టారు. పతాకధ్వజాలు శోభాకాకరంగా ఉన్నాయి. ఆ అలంకరణతో ఆ శ్రేష్ఠ నగరం మనస్సును ఆహ్లాదపరిచింది. (41)
తుష్టపుష్టజనాకీర్ణా సా పురీ కురునందన ।
అశోభత తదా తేన శక్రేణేవామరావతీ ॥ 42
కురునందనా! ఆ నగరంలోని ప్రజలు తుష్టి, పుష్టిగలవారు. ఆ రాజు రాకతో అటువంటి జనులతో నిండిన ఆ పురి దేవేంద్రునిచే అమరావతి శోభిల్లినట్టు శోభిల్లింది. (42)
తతః ప్రవిష్టే రాజర్షౌ తస్మిం స్తతురముత్తమమ్ ।
రాజ్ఞస్తస్యాజ్ఞయా దేవీ వసిష్ఠముపచక్రమే ॥ 43
ఆ రాజర్షి ఆ నగరంలో ప్రవేశించగానే మహారాజు ఆదేశాన్ని అనుసరించి మహారాణి (మదయంతి) వసిష్ఠమహర్షి దగ్గరకు వచ్చింది. (43)
ఋతా వథ మహర్షిః సః సంబభూవ తయా సహ ।
దేవ్యా దివ్యేన విధినా వసిష్ఠః శ్రేష్ఠభాగృషిః ॥ 44
ఆ తర్వాత ఋతుకాలంలో భగవద్భక్తుడైన ఆ వసిష్ఠమహర్షి దివ్యవిధానంతో ఆ మహారాణితో కలిశాడు. (44)
తతస్తస్యాం సముత్పన్నే గర్భే స మునిసత్తమః ।
రాజ్ఞాభివాదితస్తేన జగామ మునిరాశ్రమమ్ ॥ 45
ఆ తర్వాత ఆ రాణి గర్భం నిలిచిన తర్వాత మునిశ్రేష్ఠుడైన వసిష్ఠుడు రాజువందనాలు స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. (45)
దీర్ఘకాలేన సా గర్భం సుషువే న తు తం యదా ।
తదా దేవ్యశ్మనా కుక్షిం నిర్బిభేద యశస్వినీ ॥ 46
ఆ రాణి దీర్ఘకాలం గర్భాన్ని ధరించింది కానీ ప్రసవించలేదు. అప్పుడు ఆ యశస్విని రాతితో తన గర్భాశయంపై కొట్టుకొన్నది. (46)
తతోఽపి ద్వాదశే వర్షే స జజ్ఞే పురుషర్షభః ।
అశ్మకో నామః రాజర్షిః పౌదాన్యం యో న్యవేశయత్ ॥ 47
ఆ తరువాత పండ్రెండు సంవత్సరాలకు కొడుకు పుట్టాడు. అతడు పురుషోత్తముడు, రాజర్షి అయి అశ్మహుడను పేర ప్రసిద్ధి పొందాడు. పౌదాన్యనగరంలో తాను నివసించేవాడు. (47)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి సౌదాస సుతోత్పత్తౌ షట్ సప్తత్యధిక శతతమోఽధ్యాయః ॥ 176 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను
ఉపపర్వమున సౌదాససుతోత్పత్తి యను నూట డెబ్బది ఆరవ అధ్యాయము. (176)