165. నూట అరువది ఐదవ అధ్యాయము

ద్రోణ ద్రుపదుల వృత్తాంతము.

బ్రాహ్మన ఉవాచ
గంగాద్వారం ప్రతి మహాన్ బభూవర్షిః మహాతపాః ।
భరద్వాజో మహాప్రాజ్ఞః సతతం సంశితవ్రతః ॥ 1
బ్రాహ్మణుడు పలికాడు. గంగాద్వారంలో భరద్వాజుడనే మహర్షి ఉండేవాడు. ఆయన మహాప్రాజ్ఞుడు, మహాత్ముడు, మహాతపస్సంపన్నుడు, ఎల్లప్పుడూ వ్రతదీక్షలలో ఉండేవాడు. (1)
సోఽభిషేక్తుం గతో గంగాం పూర్వమేవాగతాం సతీమ్ ।
దదర్శాప్సరసం తత్ర ఘృతాచీమాప్లుతాం ఋషిః ॥ 2
ఆయన స్నానానికై గంగకు వెళ్ళాడు. అప్పటికే అక్కడకు వచ్చి ఉన్న ఘృతాచి అనే అప్సరసను ఆయన చూశాడు. ఆమె స్నానం చేస్తోంది. (2)
తస్యా వాయుః నదీతీరే వసనం వ్యహరత్ తదా ।
అపకృష్టాంబరాం దృష్ట్వా తాం ఋషిశ్చకమే తదా ॥ 3
ఆమె నది ఒడ్డున బట్టలు మార్చుకొంటుంటే అక్కడి గాలి ఆమె వస్త్రాన్ని అపహరించింది. దిసమొలతో నున్న ఆమెను చూచి భరద్వాజ మహర్షి అప్పుడు కామించాడు. (3)
తస్యాం సంసక్తమనసః కౌమార బ్రహ్మచారిణః ।
చిరస్య రేతః చస్కంద తదృషిః ద్రోణ ఆదధే ॥ 4
ఆ భరద్వాజుడు కుమారావస్థ నుండి బ్రహ్మచారియే. ఆయనకు ఆమెపై మనస్సు తగులుకొనగానే వీర్యం పతనమైంది, ఆ ఋషి దానిని గిన్నెలోనికి సేకరించాడు. (4)
తతః సమభవత్ ద్రోణః కుమారః తస్య ధీమతః ।
అధ్యగీష్ట స వేదాంశ్చ వేదాంగాని చ సర్వశః ॥ 5
ఆ ధీమంతునకు దాని నుండి ద్రోణుడనే కొడుకు పుట్ఠాడు. ద్రోణుడు వేద వేదాంగాలు మొత్తం చదివాడు. (5)
భరద్వాజస్య తు సఖా సృషతః నామ పార్థివః ।
తస్యాపి ద్రుపదోనామ తదా సమభవత్ సుతః ॥ 6
పృషతుడు అనే రాజు భరద్వాజుని మిత్రుడు. ఆ పృషతునకు కూడా ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ద్రుపదుడు. (6)
స నిత్యమాశ్రయం గత్వా ద్రోణేన సహ పార్షతః ।
చిక్రీడాధ్యయనం చైవ చకార క్షత్రియర్షభః ॥ 7
క్షత్రియశ్రేష్ఠుడైన ఆ పార్షతుడు ప్రతిదినమీ భరద్వాజుని ఆశ్రమానికి పోయి ద్రోణునితో కలిసి ఆడుకొనేవాడు, చదువుకొనేవాడు కూడా. (7)
తతస్తు పృషతేఽతీతే సః రాజా ద్రుపదోఽభవత్ ।
ద్రోణోఽపి రామం శుశ్రావ దిత్సంతం వసు సర్వశః ॥ 8
వనం తు ప్రస్థితం రామం భరద్వాజసుతోఽబ్రవీత్ ।
ఆగతం విత్తకామం మాం విద్ధి ద్రోణం ద్విజోత్తమ ॥ 9
పృషతుడు మరణించగానే ద్రుపదుడు రాజయ్యాడు. ఆ సమయంలోనే పరశురాముడు తన సంపదనంతా దానం చేస్తున్నాడనీ, తాను అరణ్యాలను వెళ్ళగోరుతున్నాడనీ ద్రోణుడు విని ఆయన దగ్గరకు పోయి "ద్విజోత్తమా! నేను ద్రోణుడను. డబ్బుకోసం వచ్చాను" అని పలికాడు. (8,9)
రామ ఉవాచ
శరీరమాత్రమేవాద్య మయా సమవశేషితమ్ ।
అస్త్రాణి వా శరీరం వా బ్రహ్మన్నేకతమం వృణు ॥ 10
పరశురాముడిలా అన్నాడు. 'బ్రాహ్మణా! ఇప్పుడు శరీరం మాత్రమే మిగిలింది. కాబట్టి ఈ శరీరాన్నో, అస్త్రాలనో ఏదో ఒకటి కోరుకో.' (10)
ద్రోణ ఉవాచ
అస్త్రాణి చైవ సర్వాణి తేషాం సంహారమేవ చ ।
ప్రయోగం చైవ సర్వేషాం దాతుమర్హతి మే భవాన్ ॥ 11
ద్రోణుడిలా అన్నాడు. 'అస్త్రాలనన్నింటినీ వాటి ప్రయోగోపసంహారమంత్రాలతో పాటు తమరు నాకు అనుగ్రహించండి.' (11)
బ్రాహ్మణ ఉవాచ
తథేత్యుక్త్వా తతస్తస్మై ప్రదదౌ భృగునందనః ।
ప్రతిగృహ్య తదా ద్రోణః కౄతకృత్యోఽభవత్ తదా ॥ 12
పరశురాముడిలా అన్నాడు-'అలాగే తీసుకో!' అంటూ ద్రోణునకు అస్త్రవిద్యను దానం చేశాడు. అప్పుడు ద్రోణుడు వాటిని గ్రహించి ధన్యుడయ్యాడు. (12)
సంప్రహృష్టమనాద్రోణః రామాత్ పరమసంమతమ్ ।
బ్రహ్మాస్త్రం సమనుప్రాప్య నరేష్వభ్యధికోఽభవత్ ॥ 13
ద్రోణుడు పరశురాముని దగ్గర నుండి గొప్పగా ప్రశంసింపబడే బ్రహ్మాస్త్రాన్ని పొంది, పరమానందాన్ని పొంది నరులందరికన్న గొప్పవాడు అయ్యాడు. (13)
తతో ద్రుపదమాసాద్య భారద్వాజః ప్రతాపవాన్ ।
అబ్రవీత్ పురుషవ్యాఘ్రః సఖాయం విద్ధి మామితి ॥ 14
ఆ తరువాత ప్రతాపశాలీ, పురుషశ్రేష్ఠుడూ అయిన ద్రోణుడు ద్రుపదుని దగ్గరకు పోయి "నేను నీ మిత్రుడను" అన్నాడు. (14)
ద్రుపద ఉవాచ
నాశ్రోత్రియః శ్రోత్రియస్య నారథీ రథినః సఖా ।
నారాజా పార్థివస్యాపి సఖిపూర్వం కిమిష్యతే ॥ 15
ద్రుపదుడిలా అన్నాడు - శ్రోత్రియుడు కానివాడు శ్రోత్రియునకు మిత్రుడు కాలేడు. రథంలేని వాడు రథికునకు మిత్రుడు కాడు. రాజుకానివాడు రాజునకు మిత్రుడు కాలేడు. ఒకనాటి చెలిమి గూర్చి ఇప్పుడెందుకు? (15)
బ్రాహ్మణ ఉవాచ
స వినిశ్చిత్య మనసా పాంచాల్యం ప్రతి బుద్ధిమాన్ ।
జగామ కురుముఖ్యానాం నగరం నాగసాహ్వయమ్ ॥ 16
బ్రాహ్మణుడిలా అన్నాడు. బుద్ధిమంతుడైన ద్రోణుడు ద్రుపదునిపై పగ సాధించాలని మనస్సులో నిశ్చయించుకొని కురువంశస్థుల రాజధాని అయిన హస్తినాపురికి వెళ్ళాడు. (16)
తస్మై పౌత్రాన్ సమాదాయ వసూని వివిధాని చ ।
ప్రాప్తాయ ప్రదదౌ భీష్మః శిష్యాన్ ద్రోణాయ ధీమతే ॥ 17
ధీమంతుడైన ద్రోణుడు అక్కడకు వెళ్ళగా భీష్ముడు వివిధ ధనాలతో పాటు తన పౌత్రులను ఆయనకు శిష్యులుగా అప్పగించాడు. (17)
ద్రోణః శిష్యాన్ తతః పార్థాన్ ఇదం వచనమబ్రవీత్ ।
సమానీయ తు తాన్ శిష్యాన్ ద్రుపదస్యాసుఖాయ వై ॥ 18
ఆ తరువాత ద్రోణుడు పాండవులతో బాటు శిష్యులనందరినీ సమావేశ పరచి ద్రుపదుని కష్టాలపాలు చేయదలచి ఇలా అన్నాడు. (18)
ఆచార్య వేతనం కించిత్ హృది యత్ వర్తతే మమ ।
కృతాస్త్రైః తత్ ప్రదేయం స్యాత్ తదృతం వదతానఘాః ।
సో-ర్జునప్రముఖైరుక్తః తథాస్త్వితి గురుస్తదా ॥ 19
'అనఘులారా! నెను మీ నుండి కొంత గురుదక్షిణను ఆశిస్తున్నాను. అస్త్రవిద్యలో కృతార్థులయ్యారు. కాబట్టి మీరు దక్షిణ నివ్వవలసి ఉన్నది. నాకు మాట ఇవ్వండి'. అలాగే అని అర్జునుడు మొదలగు వారన్నారు. (19)
యదా చ పాండవాః సర్వే కృతాస్తాః కృతనిశ్చయాః ।
తతోఽద్రోణోఽబ్రవీత్ భూయః వేతనార్థమిదమ్ వచః ॥ 20
పాండవులంతా కృతాస్తులై గురుదక్షిణ చెల్లించటానికి నిశ్చయించుకొన్న తరువాత ద్రోణుడు గురుదక్షిణకై మరలా ఇలా అన్నాడు. (20)
పార్షతో ద్రుపదోనామ ఛత్రవత్యాం నరేశ్వరః ।
తస్మాదాకృష్య తత్ రాజ్యం మమ శీఘ్రం ప్రదీయతామ్ ॥ 21
అహిచ్ఛత్రనగరానికి పృషతుని కుమారుడు ద్రుపదుడు రాజు. అతని నుండి రాజ్యాన్ని కొల్లగొట్టి వెంటనే నాకు గురుదక్షిణగా సమర్పించాలి. (21)
(ధార్తరాష్ట్రైశ్చ సహితాః పంచాలాన్ పాండవా యయుః ।
యజ్ఞసేనేన సంగమ్య కర్ణదుర్యోధనాదయః ।
నిర్జితాః సంన్యవర్తంత తథాన్యే క్షత్రియర్షభాః ॥)
తతః పాండుసుతాః పంచ నిర్జిత్య ద్రుపదం యుధి ।
ద్రోణాయ దర్శయామాసుః బద్ధ్వా ససచివం తదా ॥ 22
పాండవులు ధార్తరాష్ట్రులతో కలిసి పాంచాలదేశానికి వెళ్ళారు. అప్పుడు కర్ణదుర్యోధనాదులు ఇతర క్షత్రియశ్రేష్ఠులూ ద్రుపదునితో యుద్ధం చేసి ఓడిపోయి వెనుదిరిగారు.
ఆ తర్వాత పాండవులు అయిదుగురూ యుద్ధంలో ద్రుపదుని ఓడించి, అమాత్యులతో సహా బంధించి ద్రోణుని సమక్షానికి తీసికొని వచ్చారు. (22)
(మహేంద్ర ఇవ దుర్ధర్షః మహేంద్ర ఇవ దానవమ్ ।
అహేంద్రపుత్రః పాంచాలం జితవానర్జునస్తదా ॥
తత్ దృష్ట్వాతు మహావీర్యం ఫాల్గునస్యామితౌజసః ।
వ్యస్మయంత జనాః సర్వే యజ్ఞసేనస్య బాంధవాః ॥
నాస్త్యర్జున సమో వీర్యః రాజపుత్ర ఇతి బ్రువన్ ।)
మహేంద్రకుమారుడైన అర్జునుడు మహేంద్రపర్వతం వలె ఎదిరింపరానివాడు. మహేంద్రుడు దానవులను జయించినట్లు అతడు ద్రుపదునిపై గెలిచాడు. మహాతేజస్వి అయిన అర్జునుని ఆ పరాక్రమాన్ని చూచి ద్రుపదుని బంధుజనులందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. రాజకుమారులలో అర్జునుని వంటి పరాక్రమవంతుడు లేడని కొనియాడారు.
ద్రోణ ఉవాచ
ప్రార్థయామి త్వయా సఖ్యం పునరేవ నరాధిప ।
అరాజా కిల నో రాజ్ఞః సఖా భవితుమర్హతి ॥ 23
అతః ప్రయతితం రాజ్యే యజ్ఞసేనస్త్వయా సహ ।
రాజాసి దక్షిణే కూలే భాగీరథ్యాహముత్తరే ॥ 24
ద్రోణుడిలా అన్నాడు. రాజా! నేను మరలా నీతో మైత్రినే కోరుతున్నాను. యజ్ఞసేనా! రాజు కానివాడు రాజుకు మిత్రుడు కాలేడన్నావు గదా! అందుకోసమే - రాజ్యం కోసమే - నేను నీతో యుద్ధం చేసే ప్రయత్నం చేశాను. నీవు గంగానది దక్షిణపుఒడ్డున రాజుగా ఉండు. ఉత్తర దిక్కునకు నేను రాజును. (23,24)
బ్రాహ్మణ ఉవాచ
ఏవముక్తో హి పాంచాల్యః భారద్వాజేన ధీమతా ।
ఉవాచాస్త్రవిదాం శ్రేష్ఠః ద్రోణం బ్రాహ్మణసత్తమమ్ ॥ 25
ధీశాలి అయిన ద్రోణుడిలా పలుకగానే మేటి విలుకాడైన ద్రుపదుడు బ్రాహ్మణసత్తముడైన ద్రోణునితో ఇలా అన్నాడు. (25)
ఏవం భవతు భద్రం తే భారద్వాజ మహామతే ।
సఖ్యం తదేవ భవతు శశ్వద్ యదభిమన్యసే ॥ 26
ద్రోణా! అలాగే కానీ! మహామతీ! నీ కిష్టమైనరీతిగా మన పూర్వస్నేహాన్ని శాశ్వతంగా ఉండనీ! (26)
ఏవమన్యోన్యముక్త్వా తౌ కృత్వా సఖ్యమనుత్తమమ్ ।
జగ్మతుః ద్రోణపాంచాల్యౌ యథాగత మరిందమౌ ॥ 27
ఈ రీతిగా పరస్పరం మాటాడుకొని అరిందములయిన ద్రోణద్రుపదులు పరమోన్నత స్నేహభావంతో ఎవరి స్థానానికి వారు వెళ్ళిపోయారు. (27)
అసత్కారః స తు మహాన్ ముహూర్తమపి తస్య తు ।
నా పైతి హృదయాత్ రాజ్ఞః దుర్మనాః స కృశోఽభవత్ ॥ 28
ఆ తీవ్రపరాభవం ద్రుపదుని మనస్సులో నుండి క్షణకాలం కూడా తొలగిపోవటం లేదు. మానసికంగా, శారీరకంగా కూడా ద్రుపదుడు కృశించిపోయాడు. (28)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్రౌపదీసంభవే పంచషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 165 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథపర్వమను ఉపపర్వమున ద్రౌపదీసంభవమను నూట అరువది అయిదవ అధ్యాయము. (165)
(దాక్షిణాత్య అధికపాఠము 4 శ్లోకములతో కలిపి 32 శ్లోకములు)