164. నూట అరువది నాలుగవ అధ్యాయము

(చైత్రరథ పర్వము)

పాండవులకు బ్రాహ్మణుడు విచిత్రకథలను వినిపించుట.
జనమేజయ ఉవాచ
తే తథా పురుషవ్యాఘ్రాః నిహత్య బకరాక్షసమ్ ।
అత ఊర్ధ్వం తతోబ్రహ్మన్ కిమకుర్వత పాండవాః ॥ 1
జనమేజయుడు ఇలా అన్నాడు-బ్రాహ్మణా! ఆ రీతిగా పురుషశ్రేష్ఠులైన పాండవులు బకరాక్షసుని సంహరించిన తరువాత ఏమి చేశారు? (1)
వైశంపాయన ఉవాచ
తత్రైవ న్యవసన్ రాజన్ నిహత్య బకరాక్షసమ్ ।
అధీయానాః పరం బ్రహ్మ బ్రాహ్మణస్య నివేశనే ॥ 2
వైశంపాయనుడు పలికాడు. రాజా! బకరాక్షసుని చంపిన తరువాత ఆ నగరంలోనే, ఆ బ్రాహ్మణుని ఇంటిలోనే పరబ్రహ్మను బోధించే ఉపనిషత్తుల నధ్యయనం చేస్తూ నివసించసాగారు. (2)
తతః కతిపయాహస్య బ్రాహ్మణః సంశితవ్రతః ।
ప్రతిశ్రయార్థీ తద్వేశ్మ బ్రాహ్మణస్య జగామహ ॥ 3
తరువాత కొన్ని రోజులకు కఠోరనియమాలు గల ఒక బ్రాహ్మణుడు విడిదిచేయటానికి పాండవుల కాశ్రయమిచ్చిన బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. (3)
స సమ్యక్ పూజయిత్వా తం విప్రం విప్రర్షభస్తదా ।
దదౌ ప్రతిశ్రయం తస్మై సదా సర్వాతిథివ్రతః ॥ 4
ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునకు ఇంటికి వచ్చినవారిని సేవించటం ఒక వ్రతం. అందుచేత ఆ బ్రాహ్మణాతిథిని కూడా చక్కగా అర్చించి, ఆశ్రయమిచ్చాడు. (4)
తతస్తే పాండవాః సర్వే సహ కుంత్యా నరర్షభాః ।
ఉపాపాంచక్రిరే విప్రం కథయంతం కథాః శుభాః ॥ 5
ఆపై మంచి మంచి కథలు వినిపిస్తున్న బ్రాహ్మణుని సన్నిధికి నరశ్రేష్ఠులయిన ఆ పాండవులు కుంతితో కూడా వచ్చారు. (5)
కథయామాస దేశాంశ్చ తీర్థాని సరితస్తథా ।
రాజ్ఞశ్చ వివిధాశ్చర్యాన్ దేశాంశ్చైవ పురాణి చ ॥ 6
ఆయన రాజుల గురించి ఆశ్చర్యకర దేశాలను గూర్చి, తీర్థాలను గురించీ, నదులను గురించీ, నగరాల గురించీ చెప్పసాగాడు. (6)
స తత్రాకథయద్ విప్రః కథాంతే జనమేజయ ।
పంచాలేష్వద్భుతాకారం యాజ్ఞాసేన్యాః స్వయంవరమ్ ॥ 7
జనమేజయా! వారి సమావేశం ముగిసే సందర్భంలో ఆ బ్రాహ్మణుడు పంచాల దేశంలో యజ్ఞసేనకుమారి ద్రౌపదికి అద్భుతస్వయంవరం జరగబోతోందని చెప్పాడు. (7)
ధృష్టద్యుమ్నస్యచోత్పత్తిం ఉత్పత్తిం చ శిఖండినః ।
అయోనిజత్వం కృష్ణాయాః ద్రుపదస్య మహామఖే ॥ 8
శిఖండీ ధృష్టద్యుమ్నుల పుట్టుకను గురించి, ద్రుపదుని యాగంలో అయోనిజగా ద్రౌపది జన్మించటాన్ని గురించీ వినిపించాడు. (8)
తదద్భుతతమం శ్రుత్వా లోకే తస్య మహాత్మనః ।
విస్తరేణైవ పప్రచ్ఛుః కథాంతే పురుషర్షభాః ॥ 9
లోకాద్భుతంగా కనిపిస్తున్న బ్రాహ్మణుడు చెప్పిన వృత్తాంతాన్ని వినినంతనే పురుషశ్రేష్ఠులైన పాండవులు దానిని వివరంగా చెప్పమని ఇలా అడిగారు. (9)
పాండవా ఊచుః
కథం ద్రుపదపుతస్య ధృష్ఠద్యుమ్నస్య పావకాత్ ।
వేదీమధ్యాచ్చ కృష్టాయాః సంభవః కథమద్భుతః ॥ 10
పాండవులు అడిగారు. ద్రుపదకుమారుడైన ధృష్టద్యుమ్నుడు అగ్నినుండీ, ద్రౌపది యజ్ఞవేది మధ్యనుండీ అద్భుతరీతిలో ఎలా జన్మించారు? (10)
కథం ద్రోణాత్ మహేష్వాసాత్ సర్వాణ్యస్త్రాణ్యశిక్షత ।
కథం విప్ర సఖాయౌ తౌ భిన్నౌ కస్య కృతేన వా ॥ 11
మేటి విలుకాడైన ద్రోణుని దగ్గర ధృష్టద్యుమ్నుడెలా అస్త్రవిద్యనేర్చుకొన్నాడు. బ్రాహ్మణా! ద్రోణద్రుపదులకు సఖ్యమెలా కుదిరింది? ఏ కారణంగా వారు విడిపోయారు. (11)
వైశంపాయన ఉవాచ
ఏవం తై శ్చోదితో రాజన్ స విప్రః పురుషర్షభైః ।
కథయామాస తత్ సర్వం ద్రౌపదీసంభవం తదా ॥ 12
వైశంపాయనుడు పలికాడు. రాజా! పురుషశ్రేష్ఠులయిన పాండవులు ఆ విధంగా ప్రశ్నించితే ఆ బ్రాహ్మణుడు ద్రౌపది జన్మవృత్తాంతాన్ని ఇలా వివరంగా చెప్పాడు. (12)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి చైత్రరథపర్వణి ద్రౌపదీసంభవే చతుఃషష్ట్యధిక శతతమోఽధ్యాయః ॥ 164 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున చైత్రరథ పర్వమను ఉపపర్వమున ద్రౌపదీసంభవమను నూట అరువది నాలుగవ అధ్యాయము. (164)