159. నూట యేబది తొమ్మిదవ అధ్యాయము

కుంతికి బ్రాహ్మణుడు తన దుఃఖకారణమును వివరించుట.

కుంత్యువాచ
కుతో మూలమిదం దుఃఖం జ్ఞాతుమిచ్ఛామి తత్త్వతః ।
విదిత్వా ప్యపకర్షేయం శక్యం చేదపకర్షితుమ్ ॥ 1
కుంతి పలికింది. అయ్యా! మీకు ఈ దుఃఖం ఏ కారణంగా కల్గింది? ఉన్నదున్నట్లుగా తెలుసుకోవాలనుకొంటున్నాను. తెలుసుకొని ఈ దుఃఖాన్ని తొలగించటం సాధ్యమయితే దాన్ని పోగొట్టటానికి ప్రయత్నం చేస్తాను. (1)
బ్రాహ్మణ ఉవాచ
ఉపపన్నం సతామేతద్ యద్ బ్రవీషి తపోధనే ।
న తు దుఃఖమిదం శక్యం మానుషేణ వ్యపోహితుమ్ ॥ 2
బ్రాహ్మణుడన్నాడు. తపోధనురాలా! నీవు మాట్లాడిన మాట మంచివారికి తగినట్లుగా ఉంది. కానీ ఈ దుఃఖాన్ని మనుష్యమాత్రుడు పోగొట్టటం సాధ్యం కాదు. (2)
సమీపే నగరస్యాస్య బకో వసతి రాక్షసః ।
(ఇతో గవ్యూతిమాత్రేఽస్తి యమునాగహ్వరే గుహా ।
తస్యాం ఘోరః స వసతి జిఘాంసుః పురుషాదకః ॥)
ఈశో జనపదస్యాస్య పురస్య చ మహాబలః ॥ 3
పుష్టో మానుషమాంసేన దుర్బుద్ధిః పురుషాదకః ।
(తేనేయం పురుషాదేన భక్ష్యమాణా దురాత్మనా ।
అనాథా నగరీ నాథం త్రాతారం నాధిగచ్ఛతి ॥)
రక్షత్యసురరాణ్నిత్యమ్ ఇమం జనపదం బలీ ॥ 4
నగరం చైవ దేశం చ రక్షోబలసమన్వితః ।
తత్కృతే పరచక్రాచ్చ భూతేభ్యశ్చ న నో భయమ్ ॥ 5
ఈ నగరానికి సమీపంలో బకుడనే రాక్షసుడున్నాడు. భయంకరుడు, మానవమాంసభక్షకుడు అయిన ఆ రాక్షసుడు ఇక్కడకు రెండు క్రోసుల దూరంలో ఉన్న యమునా తీరంలో ఒక గుహలో నివసిస్తున్నాడు. అతడు ఈ దేశానికీ, నగరానికీ రాజు. దుర్బుద్ధి కలవాడు. మనుష్యమాంసం తినేవాడు. దానితోనే వాని శరీరం పోషింపబడింది. పురుషభక్షకుడైన ఆ దుర్మార్గుని చేత తినబడుతున్న ఈ నగరం ఇంతవరకు రక్షకుడైన రాజును పొందలేకపోయింది ఈ దేశాన్నీ, నగరాన్ని కూడా ఆ రాక్షసరాజే తన రాక్షసబలంతో రక్షిస్తుంటాడు. ఆ కారణంగా శత్రువుల నుండి గానీ, ఇతర ప్రాణుల నుండి కాని మాకు భయం లేదు. (3-5)
వేతనం తస్య విహితం శాలివాహస్య భోజనమ్ ।
మహిషౌ పురుషశ్చైకః యస్తదాదాయ గచ్ఛతి ॥ 6
అతడికి వేతనంగా, ఒక బండెడు భోజనం, రెండు దున్నపోతులు, వాటిని తీసుకుని పోయే ఒక పురుషుడు, ఆహారంగా నిర్ణయింపబడ్డారు. (6)
ఏకైకశ్చాపి పురుషః తత్ప్రయచ్ఛతి భోజనమ్ ।
స వారో బహుభిర్వర్షైః భవత్యసుకరో నరైః॥ 7
ప్రతి గృహస్థు ఈ ఆహారాన్ని సమర్పించవలసి ఉంటుంది. అలాంటి రోజు చాలా సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చినప్పటికీ మానవులకు అది ఆచరించటానికి కష్టంగా ఉన్నది. (7)
తద్విమోక్షాయ యే కేచిత్ యతంతి పురుషాః క్వచిత్ ।
స పుత్రదారాంస్తాన్ హత్వా తద్రక్షో భక్షయత్యుత ॥ 8
దీన్నుండి విడిపించడానికి, ఏ కొందరో పురుషులు ఎప్పుడో ఒకసారి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కాని ఆ రాక్షసుడు వారినే కాకుండా వారి భార్యాపుత్రులను కూడా చంపి తినేస్తున్నాడు. (8)
వేత్రకీయగృహే రాజా నాయం నయమిహాస్థితః ।
ఉపాయం తం న కురుతే యత్నాదపి స మందధీః ।
అనామయం జనస్యాస్య యేన స్యాదద్య శాశ్వతమ్ ॥ 9
వాస్తవానికి ఈ దేశానికి రాజు వేత్రకీయగృహమనే ప్రదేశంలో నివసిస్తుంటాడు. మందబుద్ధియై ఆ రాజు ఏదో ఒక నీతినో, ఉపాయాన్నో ఆలోచించి గట్టి ప్రయత్నం చేయటం లేదు. అలా చేసి ఉంటే ఈ నగరంలోని జనులందరికీ ఈ బకుని పీడ శాశ్వతంగా వదలిపోయి ఉండేది. (9)
ఏతదర్హ వయం నూనం వసామో దుర్బలస్య యే ।
విషయే నిత్యవాస్తవ్యాః కురాజానముపాశ్రితాః ॥ 10
మేము ఇటువంటి దురవస్థలకు తగినవారమే. ఎందుకంటే చెడ్డరాజును ఆశ్రయించాము. దుర్బలుడైన రాజు కల దేశంలో శాశ్వతంగా నివసిస్తున్నాము. (10)
బ్రాహ్మణాః కస్య వక్తవ్యాః కస్య వాచ్ఛందచారిణః ।
గుణైరేతే హి వత్స్యంతి కామగాః పక్షిణో యథా ॥ 11
బ్రాహ్మణుల్ని ఎవరు ఆదేశిస్తారు? విరు ఎవరి ఆధీనంలో ఉంటారు? పక్షులు ఏవిధంగా స్వేచ్ఛగా తమకు నచ్చిన ప్రదేశంలో నివసిస్తాయో, అదేవిధంగా బ్రాహ్మణులు కూడా రాజు గుణగణాల్ని బట్టి ఆదేశంలో నివసిస్తుంటారు. (11)
రాజానం ప్రథమం విందేత్ తతో భార్యాం తతో ధనమ్ ।
త్రయస్య సంచయేనాస్య జ్ఞాతీన్ పుత్రాంశ్చ తారయేత్ ॥ 12
ముందుగా మంచిరాజును పొందాలి. తర్వాత భార్యను, పిదప ధనాన్ని సాధించుకోవాలి. ఈ మూడు సంపాదించుకొన్న పిదప బంధువులను, పుత్రులను ఉద్ధరించే ప్రయత్నం చెయ్యాలి. (12)
విపరీతం మయా చేదం త్రయం సర్వముపార్జితమ్ ।
తదిమామాపదం ప్రాప్య భృశం తప్యామహే వయమ్ ॥ 13
నేను ఈ మూడింటిని సాధించాను కానీ అవన్నీ తారుమారుగా చేశాను. ఆ కారణంగానే మేము ఈ ఆపదను పొంది, అందరం దుఃఖిస్తున్నాం. (13)
సోఽయ మస్మాననుప్రాప్తః వారః కులవినాశనః ।
భోజనం పురుషశ్చైకః ప్రదేయం వేతనం మయా ॥ 14
కులాన్ని నాశనం చేసే వంతు మాకు ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు భోజనాన్ని, ఒక పురుషుని ఆ రాక్షసునికి వేతనంగా సమర్పించవలసి ఉన్నది. (14)
న చ మే విద్యతే విత్తం సంక్రేతుం పురుషం క్వచిత్ ।
సుహృజ్జనం ప్రదాతుం చ న శక్ష్యామి కదాచన ॥ 15
ఎక్కడో ఒక చోట పురుషుని కొనితేవటానికి తగిన డబ్బు నాకు లేదు. అలాగని నా ఆప్తుల్లో ఒకరిని ఆహారంగా పంపించే సామర్థ్యమూ లేదు. (15)
గతిం చైవ న పశ్యామి తస్మాన్మోక్షాయ రక్షసః ।
సోఽహం దుఃఖార్ణవే మగ్నః మహత్యసుకరే భృశమ్ ॥ 16
ఆ రాక్షసుని నుండి బయటపడటానికి పనికివచ్చే ఉపాయమేదీ నాకు కనపడటం లేదు. ఆ స్థితిలో ఉన్న నేను, గొప్ప దుఃఖసముద్రంలో మునిగిపోయాను. ఈ పని మరొకరు చెయ్యటానికి తేలికయినదీ కాదు. (16)
సహైవైతైర్గమిష్యామి బాంధవైరద్య రాక్షసమ్ ।
తతో నః సహితాన్ క్షుద్రః సర్వానేవోపభోక్ష్యతి ॥ 17
కనుక నేడు నేను నా బంధువులందరితోపాటు ఆ రాక్షసుని వద్దాకు వెడతాను. తర్వాత ఆ రాక్షసుడు మమ్మందర్నీ కలిపి తినేస్తాడు. (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి కుంతీప్రశ్నే ఏకోనషష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 159 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున కుంతిప్రశ్న అను నూట యేబది తొమ్మిదవ అధ్యాయము. (159)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలు కలుపుకొని 19 శ్లోకాలు)