158. నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము
బ్రాహ్మణకన్య త్యాగానికి సిద్ధపడుట.
వైశంపాయన్ ఉవాచ
తయోర్దుఃఖితయోర్వాక్యమ్ అతిమాత్రం నిశమ్య తు ।
తతో దుఃఖపరీతాంగీ కన్యా తావభ్యభాషత ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! ఆ విధంగా మిక్కిలిగా దుఃఖిస్తున్న తల్లితండ్రుల మాటలు విన్న కుమార్తె, ఎంతగానో దుఃఖిస్తూ వారితో ఇలా అన్నది. (1)
కిమేవం భృశదుఃఖార్తౌ రోరూయేతామనాథవత్ ।
మమాపి శ్రూయతాం వాక్యం శ్రుత్వా చ క్రియతాం క్షమమ్ ॥ 2
మీరెందుకు అనాథల్లా, ఇంతగా దుఃఖంతో రోదిస్తున్నారు? నేను చెపుతున్న మాటలు కూడా వినండి. విని ఏది బాగుందనుకొంటే దానిని చెయ్యండి. (2)
ధర్మతోఽహం పరిత్యాజ్యా యువయోర్నాత్ర సంశయః ।
త్యక్తవ్యాం మాం పరిత్యజ్య త్రాహి సర్వం మయైకయా ॥ 3
ధర్మం ప్రకారం, మీకిద్దరికీ, నేను విడిచిపెట్టవలసిన దానినే. అందులో సందేహం లేదు కదా! విడిచిపెట్టకతప్పని నన్ను, విడిచిపెట్టండి. నా ఒక్క దానితో అంతటినీ రక్షించండి. (3)
ఇత్యర్థమిష్యతేఽపత్యం తారయిష్యతి మామితి ।
అస్మిన్నుపస్థితే కాలే తరధ్వం ప్లవవన్మయా ॥ 4
ఎవరైనా ఆపద నుండి రక్షిస్తారనే కదా సంతానాన్ని కోరుకొంటారు. అలాంటి ఆపత్సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నన్ను పడవగా చేసుకొని మీరు దుఃఖసాగరాన్ని దాటండి. (4)
ఇహ వా తారయేద్ దుర్గాద్ ఉత వా ప్రేత్య భారత ।
సర్వథా తారయేత్ పుత్రః పుత్ర ఇత్యుచ్యతే బుధైః ॥ 5
ఆర్యా! పుత్రుడన్నవాడు ఇహ లోకంలోగాని, పరలోకంలోగాని దుర్గమమైన కష్టాన్నుండి తల్లితండ్రులను దాటించాలి. అలా చేస్తాడు కనుకనే పుత్రుడని పండితులచే చెప్పబడుతున్నాడు. (5)
ఆకాంక్షం తే చ దౌహిత్రాన్ మయి నిత్యం పితామహాః ।
తత్ స్వయం వై పరిత్రాస్యే రక్షంతీ జీవితం పితుః ॥ 6
నా తాతలు నా నుండి దౌహిత్రుని కోరుకొంటారు. వారు దేనికోసం దౌహిత్రుని కోరుకొంటారో, ఆ భయం నుండి వారిని, నా తండ్రి జీవితాన్ని పరిరక్షించటం ద్వారా స్వయంగానే రక్షిస్తాను. (6)
భ్రాతా చ మమ బాలోఽయం గతే లోకమముం త్వయి ।
అచిరేణైవ కాలేన వినశ్యేత న సంశయః ॥ 7
నా సోదరుడు బాలుడు. మీరు లోకాంతరానికి పోతే ఇతడు కూడా అనతికాలంలో నశిస్తాడనటంలో సందేహం లేదు. (7)
తాతేఽపి హి గతే లోకమముం త్వయి ।
అచిరేణైవ కాలేన వినశ్యేత న సంశయః ॥ 7
నా సోదరుడు బాలుడు. మీరు లోకాంతరానికి పోతే ఇతడు కూడా అనతికాలంలో నశిస్తాడనటంలో సందేహం లేదు. (7)
తాతేఽపి హి గతే స్వర్గం వినష్టే చ మమానుజే ।
పిండః పితౄణాం వ్యుచ్ఛిద్యేత్ తత్ తేషాం విప్రియం భవేత్ ॥ 8
తండ్రి ముందే స్వర్గాన్ని పొందగా, నా సోదరుడు కూడా నశించిపోతే పితృదేవతలకు పిండప్రదానం ఎవరు చేస్తారు? వారికి పెద్ద అప్రియం జరుగుతుంది. (8)
పిత్రా త్యక్తా తథా మాత్రా భ్రాత్రా చాహమసంశయమ్ ।
దుఃఖాద్ దుఃఖతరం ప్రాప్య మ్రియేయమతథోచితా ॥ 9
తండ్రిచేత, తల్లిచేత, సోదరుని చేత కూడా విడిచిపెట్టబడ్డ నేను, ఒక దుఃఖాన్నుండి, మరొక క్రొత్త దుఃఖాన్ని పొందుతూ చివరకు దిక్కులేని చావును పొందుతాను. (9)
త్వయి త్వరోగే నిర్ముక్తే మాతా భ్రాతా చ మే శిశుః ।
సంతానశ్చైవ పిండశ్చ ప్రతిష్ఠాస్యత్యసంశయమ్ ॥ 10
నీవు ఏ హాని లేకుండా జీవించినట్లయితే తల్లి, బాలుడైన సోదరుడు, వాడికి పుట్టబోయే సంతతి, పితృదేవతల కర్పించవలసిన పిండం ఇవన్నీ స్థిరంగా నిలుస్తాయి. సందేహం లేదు. (10)
ఆత్మా పుత్రః సఖా భార్యా కృచ్ఛ్రం తు దిహితా కిల ।
స కృచ్ఛ్రాన్మోచయాత్మానం మాం చ ధర్మే నియోజయ ॥ 11
పుత్రుడు తన స్వరూపమే అంటారు. భార్యను స్నేహితురాలంటారు. కుమార్తెను సంకటంగా చెప్తారు. కనుక ముందుగా నాసంకటాన్ని వదిలించుకో. నన్ను ధర్మమార్గంలో ముందుకు సాగనియ్యి. (11)
అనాథా కృపణా బాలా యత్ర క్వచన గామినీ ।
భవిష్యామి త్వయా తాత విహీనా కృపణా సదా ॥ 12
నాయనా! నీవు నన్ను విడిచిపోయినట్లయితే, నేను అనాథను, దీనురాలిని అవుతాను. ఎల్లప్పుడు దైన్యంతో జీవించవలసివస్తుంది. చివరకు ఎక్కడో ఒకచోట తిరిగే దుర్దశను పొందవలసివస్తుంది. (12)
అథవాహం కరిష్యామి కులస్యాస్య విమోచనమ్ ।
ఫలసంస్థా భవిష్యామి కృత్వా కర్మ సుదుష్కరమ్ ॥ 13
అయినా ఇన్ని మాటలెందుకు? ఈ వంశానికి ఆపదనుండి విముక్తిని కల్పిస్తాను. దుష్కరమైన ఈ పనిని సాధించి పుణ్యఫలాన్ని పొందుతాను. (13)
అథవా యాస్యసే తత్ర త్యక్త్వా మాం ద్విజసత్తమ ।
పీడితాహం భవిష్యామి తదవేక్షస్వ మామపి ॥ 14
బ్రాహ్మణోత్తమా! ఇన్ని చెప్పినా వినకుండా నీవే అక్కడకు వెళ్ళినట్లైతే నేను చాలా బాధపడతాను. కనుక నేను చెప్పిన విషయాన్ని ఆలోచించు. (14)
తదస్మదర్థం ధర్మార్థం ప్రసవార్థం చ సత్తమ ।
ఆత్మానం పరిరక్షస్వ త్యక్తవ్యాం మాం చ సంత్యజ ॥ 15
కనుక తండ్రీ! మాకోసం, ధర్మం కోసం, రాబోయే తరంకోసం, నిన్ను నీవు రక్షించుకోవాలి. ఎలాగా విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టు. (15)
అవశ్యకరణీయే చ మా త్వాం కాలోఽత్యగాదయమ్ ।
కింత్వతః పరమం దుఃఖం యద్ వయం స్వర్గతే త్వయి ॥ 16
యాచమానాః పరాదన్నం పరిధావేమహి శ్వవత్ ।
త్వయి త్వరోగే నిర్ముక్తే క్లేశాదస్మాత్ సబాంధవే ।
అమృతే వసతీ లోకే భవిష్యామి సుఖాన్వితా ॥ 17
ఎలాగైనా ఈ పని చెయ్యకతప్పదు. ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది. నీవు మరణిస్తే మేమంతా ఇతరుల నుండి అన్నాన్ని అడుక్కొంటూ కుక్కల్లా బ్రతకవలసి వస్తుంది. ఇంతకంటె గొప్ప దుఃఖం ఏముంటుంది? నీవు రోగరహితంగా బంధువులతోపాటు ఆపదనుండి బయటపడితే నేను అమృతలోకంలో నివసిస్తూ సుఖంగా ఉంటాను. (16,17)
ఇతః ప్రదానే దేవాశ్చ పితరశ్చేతి న శ్రుతమ్ ।
త్వయా దత్తేన తోయేన భవిష్యంతి హితాయ వై ॥ 18
ఇలాంటి దానం వల్ల దేవతలు, పితృదేవతలు సంతోషించారని విన్నాను. అయినా నీవు చేసే తర్పణాలతో వారు సంతసించి, మన కుటుంబానికి క్షేమాన్ని కల్గిస్తారు. (18)
వైశంపాయన ఉవాచ
ఏవం బహువిధం తస్యాః నిశమ్య పరిదేవితమ్ ।
పితా మాతా చ సా చైవ కన్యా ప్రరురుదుస్త్రయః ॥ 19
వైశంపాయనుడన్నాడు. రాజా! ఇలా పలువిధాలైన ఆమె ఆక్రోశాన్ని విని, తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురు కూడా మిక్కిలిగా శోకించారు. (19)
తతః ప్రరుదితాన్ సర్వాన్ నిశమ్యాథ సుతస్తదా ।
ఉత్ఫుల్లనయనో బాలః కలమవ్యక్తమబ్రవీత్ ॥ 20
అప్పుడు ఏడుస్తున్న అందర్నీ చూస్తూ వికసించిన కన్నులతో, స్పష్టాస్పష్టంగా తియ్యని మాటలతో బాలుడైన కొడుకు ఈవిధంగా అన్నాడు. (20)
మా పితా రుద మా మాతః మా స్వసస్త్వితి చా బ్రవీత్ ।
ప్రహసన్నివ సర్వాంస్తాన్ ఏకైక మనుసర్పతి ॥ 21
తతః సతృణమాదాయ ప్రహృష్టః పునరబ్రవీత్ ।
అనేనాహం హనిష్యామి రాక్షసం పురుషాదకమ్ ॥ 22
అమ్మా! ఏడవకు! నాన్నా ఏడవకు! అక్కా బాధపడకు. అంటూ వారందరినీ పరిహసిస్తున్నట్లు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి వారించాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఒక గడ్డిపరకను పట్టుకొని ఆనందంతో ఇలా అన్నాడు. 'ఈ గడ్డి పరకతో మనుష్యుల్ని తినే రాక్షసుడిని నేను చంపేస్తాను.' (21,22)
తథాపి తేషాం దుఃఖేన పరీతానాం నిశమ్య తత్ ।
బాలస్య వాక్య మవ్యక్తం హర్షః సమభవన్మహాన్ ॥ 23
ఎంతో దుఃఖంతో ఉన్నప్పటికీ, బాలుని అస్పష్టమైన తియ్యని మాటలు విన్నవారందరికీ గొప్ప సంతోషం కల్గింది. (23)
అయం కాల ఇతి జ్ఞాత్వా కుంతీ సముపసృత్య తాన్ ।
గతాసూనమృతేనేవ జీవయంతీదమబ్రవీత్ ॥ 24
ఇదే సరియైన సమయమని భావించి, కుంతి వారి వద్దకు వెళ్ళి ప్రాణాలు పోయాయనుకొంటున్న వారిని, తిరిగి బ్రతికిస్తూ వారితో ఇలా అంది. (24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి బకవధపర్వణి బ్రాహ్మణకన్యా పుత్రవాక్యే అష్టపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 158 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున బకవధపర్వమను ఉపపర్వమున బ్రాహ్మణకన్యా పుత్రవాక్యమను నూట ఏబది ఎనిమిదవ అధ్యాయము. (158)