141. నూటనలువది యొకటవ అధ్యాయము
పాండవులను వారణావతమునకు పంపవలెనని దుర్యోధనుని సూచన.
వైశంపాయన ఉవాచ
ఏవం శ్రుత్వా తు పుత్రస్య ప్రజ్ఞాచక్షుర్నరాధిపః ।
కణికస్య చ వాక్యాని తాని శ్రుత్వా స సర్వశః ॥ 1
ధృతరాష్ట్రో ద్విధాచిత్తః శోకార్తః సమపద్యత ।
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిః సౌబలస్తథా ॥ 2
దుఃశాసనచతుర్థాస్తే మంత్రయామాసురేకతః ।
తతో దుర్యోధనో రాజా ధృతరాష్ట్రమభాషత ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు - ప్రజ్ఞా నేత్రుడు మహారాజు ధృతరాష్ట్రుడు, తన కుమారుని మాటలు విన్నాడు. కణికుడు చెప్పిన మాటలన్నిటినీ గుర్తు చేసుకొన్నాడు. అతని మనస్సు రెండు విధాలుగా చీలింది. అతడు దుఃఖితుడయ్యాడు. దుర్యోధనుడు, కర్ణుడు, సుబలపుత్రుడు శకుని, దుఃశాసనుడు వీరు నల్గురూ రహస్యంగా మంతనాలు సాగించారు. తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. (1-3)
పాండవేభ్యో భయం న స్యాత్ తాన్ వివాసయతాం భవాన్ ।
నిపుణే నాభ్యుపాయేన నగరం వారణావతమ్ ॥ 4
నాయనా! మనకు పాండవుల భయం ఉండకూడదు. నీవు వారిని ఏదో ఒక మంచి ఉపాయంతో వారణావతపురానికి పంపించు. (4)
ధృతరాష్ట్రస్తు పుత్రేణ శ్రుత్వా వచనమీరితమ్ ।
ముహూర్తమివ సంచింత్య దుర్యోధనమథాబ్రవీత్ ॥ 5
ధృతరాష్ట్రుడు మాత్రం కొడుకు చెప్పిన మాటలు విని, కొద్దిసేపు ఆలొచించుకొని, దుర్యోధనునితో ఇలా అన్నాడు. (5)
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మనిత్యః సదా పాండుః తథా ధర్మపరాయణః ।
సర్వేషు జ్ఞాతిషు తథా మయు త్వాసీద్విశేషతః ॥ 6
ధృతరాష్ట్రుడిలా అన్నాడు - పాండురాజు తనజీవితమంతా ధర్మాన్ని గూర్చి యోచించాడు. ధర్మాన్నే ఆచరించాడు. సమస్తబంధువుల పట్ల మీదుమిక్కిలి నాపట్ల ధర్మంగా ప్రవర్తించాడు. (6)
నాసౌ కించి ద్విజానాతి భోజనాది చికీర్షితమ్ ।
నివేదయతి నిత్యం హి మమ రాజ్యం ధృతవ్రతః ॥ 7
అతడు తనకు సంబంధించిన భోజనాదుల విషయంలో కూడా ఏమీ పట్టించుకొనేవాడు కాదు. ఉత్తమమైన వ్రతంగా ప్రతిరోజు రాజకార్యాలను నాకు నివేదించేఽఆడు. (7)
తస్య పుత్రో యథా పాండుః తథా ధర్మపరాయణః ।
గుణవాన్ లోకవిఖ్యాతః పౌరవాణాం సుసమ్మతః ॥ 8
పాండురాజుకుమారుడు యుధిష్ఠిరుడు కూడా తండ్రివలె ధర్మపరాయణుడు. గుణవంతుడుగా లోకంలో ప్రసిద్ధి చెందాడు. పురువంశీయుల ఆమోదం పొందాడు. (8)
స కథం శక్యతేఽస్మాభిః అపాకర్తుం బలాదితః ।
పితృపైతామహాద్రాజ్యాత్ ససహాయో విశేషతః ॥ 9
అటువంటి యుధిష్ఠిరుని తండ్రి తాతల నుండి సంక్రమిచిన రాజ్యాన్నుండి మన మెలా దూరం చేయాగలం? అందునా అతడు సహాయసంపదలున్నవాడు. (9)
భృతా హి పాండునామాత్యాః బలం చ సతతం భృతమ్ ।
భృతాః పుత్రాశ్చ పౌత్రాశ్చ తేషామపి విశేషతః ॥ 10
పాడురాజు మంత్రులను, సైన్యాన్ని అన్నివేళలా ఆదరించాడు, పోషించాడు. ముఖ్యంగా వారినే కాక, వారిపుత్రులను, మనుమలను కూడా పోషించాడు. (10)
తే పురా సత్కృతాస్తాత పాండునా నాగరా జనాః ।
కథం యుధిష్ఠిరస్యార్థే న నో హన్యుః సబాన్ధవాన్ ॥ 11
నాయనా! సుయోధనా! నగర జనులందరూ పాండురాజుచే అనేక సత్కారాలు పొందారు. వారందరూ యుధిష్ఠిరుని ప్రయోజనం కోసం మనకు, మన బంధువులకు ద్రోహం చేయటానికి వెనుకాడరు. (11)
దుర్యోధన ఉవాచ
ఏవమేతన్మయా తాత భావితం దోషమాత్మని ।
దృష్ట్వా రకృతయః సర్వాః అర్థమానేన పూజితాః ॥ 12
తండ్రీ! నీవు చెప్పింది నిజమే. ప్రజావిరోధదోష గూర్చి నేనూ ఆలోచించాను. కనుకనే ధనంతో, సత్కారాలతో ప్రజలతో మంచి సంబంధాలను నెలకొల్పుకొన్నాను. (12)
ధ్రువ మస్మత్వహాయాస్తే భవిష్యంతి ప్రధానతః ।
అర్థవర్గః సహామాత్యః మత్సంస్థోఽద్య మహీపతే ॥ 13
వారందరూ మనకు ముఖ్యసహాయకులౌతారు. రాజా! ఈ సమయంలో మంత్రివర్గం, ధనంతో నిండిన కోశాగారం నా అధీనంలో ఉంది. (13)
స భవాన్ పాండవానాశు వివాసయితు మర్హతి ।
ఋదునైవాభ్యుపాయేన నగర వారణావతమ్ ॥ 14
సహాయసపదలున్న నీవు, వెంటనే మెత్తని ఉపాయంతో పాండవులను వారణావతనగరానికి పంపించు. (14)
యదా ప్రతిష్ఠితం రాజ్యం మయి రాజన్ భవిష్యతి ।
తదా కుంతీ సహాపత్యా పునరేష్యతి భారత ॥ 15
మహారాజా! భారతా! రాజ్యమంతా పూర్తిగా నా అధీనంలోకి వచ్చాక కుంతీదేవి తన కుమారులతో పాటు ఈ నగరానికి వస్తుంది. (15)
ధృతరాష్ట్ర ఉవాచ
దుర్యోధన మమాప్యేతత్ హృది సంపరివర్తతే ।
అభిప్రాయస్య పాపత్వాత్ నైవం తు వివృణోమ్యహమ్ ॥ 16
ధృతరాష్ట్రుడిలా అన్నాడు. దుర్యోధనా! నా మనస్సులో కూడా ఈ భావన వస్తూనే ఉంది. కాని ఈ అభిప్రాయం పాపిష్టిధి కావటం చేత నీలా నేను వివరించలేదు. (16)
న చ భీష్మో న చ ద్రోణః న చ క్షత్తా న గౌతమః ।
వివాస్యమానాన్ కౌంతేయాన్ అనుమంస్యన్తి కర్హిచిత్ ॥ 17
భీష్ముడుగాని, ద్రోణుడుకాని, విదురుడుకానీ, కృపాచార్యుడు గాని, కుంతీపుత్రుల ప్రవాసాన్ని ఎన్నడూ అనుమతించరు. (17)
సమా హి కౌరవేయాణాం వయం తే చైవ పుత్రక ।
నైతే విషమ మిచ్ఛేయుః ధర్మయుక్తా మనస్వినః ॥ 18
కుమారా! కురువంశజులదరికీ వారూ, మనమూ సమానులమే. అభిమానవంతులు, ధార్మికులు అయిన కురుశ్రేష్ఠులు, మనలో తరతమ భావాన్ని (పక్షపాతాన్ని) అంగీకరించరు. (18)
తే వయం కౌరవేయాణామ్ ఏతేషాం చ మహాత్మనామ్ ।
కథం న వధ్యతాం తాత గచ్ఛామ జగతస్తథా ॥ 19
నాయనా! దుర్యోధనా! మనం పాండవుల పట్ల భేదభావంతో వ్యవహరిస్తే, మహానుభావులైన కురుకుల శ్రేష్ఠులకు, ప్రపంచానికి కూడా మనం వధ్యులమవుతాము. (19)
దుర్యోధన ఉవాచ
మధ్యస్థః సతతం భీష్మః ద్రోణపుత్రో మయి స్థితః ।
యతః పుత్రస్తతో ద్రోణః భవితా నాత్ర సంశయః ॥ 20
దుర్యోధనుడన్నాడు. తండ్రీ! భీష్ముడెపుడూ మధ్యస్థుడే. ఒక పక్షం పట్టేవాడు కాడు. ద్రోణపుత్రుడు అశ్వత్థామ నా యందు అభిమానమున్నవాడు. ద్రోణుడూ తనకుమారుని పక్షంలోనే ఉంటాడనటంటో సందేహంలేదు. (20)
కృపః శారద్వతశ్చైవ యత ఏతౌ తతో భవేత్ ।
ద్రోణం చ భాగినేయం చ న స త్యక్ష్యతి కర్హిచిత్ ॥ 21
వీరిద్దరు ఎటుంటే కృపాచార్యుడు అటే ఉంటాడు. అతడెన్నడూ తన బావ ద్రోణుని, మేనల్లుడు అశ్వత్థామను విడిచి పెట్టడు. (21)
క్షత్తార్థబద్ధస్త్వస్మాకం ప్రచ్ఛన్నం సంయుతః పరైః ।
న చైకః స సమరోఽస్మాన్ పాండవార్థేఽధిబాధితుమ్ ॥ 22
విదురుని ఆర్థిక ప్రయోజనాలు అనతో ముడిపడి ఉంటాయి. అతనికి శత్రువులతో రహస్య మైత్రి ఉంది. కాని తానొక్కడే పాండవుల కోసం, మనల్ని బాధించడానికి సమర్థుడు కాదు. (22)
స విస్రబ్ధః పాండుపుత్రాన్ సహ మాత్రా ప్రవాసయ ।
వారణావతమద్యైవ యథా యాంతి తథా కురు ॥ 23
కనుక నీవు అన్ని శంకలూ వదలి వెంటనే తల్లితోసహా పాండవులను వారణావతం పంపించే ఏర్పాట్లు చెయ్యి. (23)
వినిద్రకరణం ఘోరం హృదిశల్యమివార్పితమ్ ।
శోకపావక ముద్భూతమ్ కర్మణైతేన నాశయ ॥ 24
రాజా! ఈ పని చేసి, నాశోకాగ్నిని చల్లార్చు. ఈ శోకాగ్ని నిద్రకు దూరం చేస్తుంది, హృదయంలో దిగిన శల్యం వంటిది, మిక్కిలి భయంకరమైనది. (24)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి దుర్యోధనపరామర్శే ఏకచత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥ 141 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున దుర్యోధనపరామర్శ అను నూటనలువదియొకటవ అధ్యాయము. (141)