140. నూటనలువదియవ అధ్యాయము
(జతుగృహ పర్వము)
పాండవుల పట్ల పురజనుల ప్రేమను చూచి దుర్యోధనుడు విచారించుట.
వైశంపాయన ఉవాచ
తతః సుబలపుత్రస్తు రాజా దుర్యోధనశ్చ హ ।
దుఃశాసనశ్చ కర్ణశ్చ దుష్టం మంత్ర మమంత్రయన్ ॥ 1
తే కౌరవ్యమనుజ్ఞాప్య ధృతరాష్ట్రం నరాధిపమ్ ।
దహనే తు సపుత్రాయాః కుంత్యా బుద్ధిమకారయన్ ॥ 2
వైశంపాయనుడిలా అన్నాడు. తరువాత శకుని, దుర్యోధనుడు, దుఃశాసనుడు, కర్ణుడు, దుర్మార్గమైన రహస్యసమాలోచన చేశారు. వారు రాజైన ధృతరాష్ట్రుని ఒప్పించి, కుంతిని కుమారులతో సహా అగ్నికి ఆహుతి చేయాలని తలచారు. (1,2)
తేషామింగిత భావజ్ఞః విదురస్తత్త్వదర్శివాన్ ।
ఆకారేణ చ తం మంత్రం బుబుధే దుష్టచేతసామ్ ॥ 3
తత్త్వవేత్త అయిన విదురుడు వారి చేష్టల భావాన్ని గ్రహించ గల వాడవటం చేత దుర్మార్గులైన వారి ఆకారం చేతనే వారి రహస్యసమాలోచనను తెలిసికొన్నాడు. (3)
తతో విదితవేద్యాత్మా పాండవానాం హితే రతః ।
పలాయనే మతిం చక్రే కుంత్యాః పుత్రైః సహానఘః ॥ 4
తర్వాత జ్ఞాని అయిన పాపరహితుడు, విదురుడు పాండవులకు మేలుచేయగోరి, తన కుమారులతో కుంతిని ఆ ప్రదేశం నుండి తప్పింపవలెనని భావించాడు. (4)
తతో వాతసహాం నావం యంత్రయుక్తాం పతాకినీమ్ ।
ఊర్మిక్షమాం దృఢాం కృత్వా కుతీమిదమువాచ హ ॥ 5
తరువాత గాలితాకిడికి, తరంగాల ఒత్తిడికి, తట్టుకొనగల్గిన యంత్రాలతో కూడి; జెండాలు కల ధృఢమైన నౌకను తయారు చేయించి కుంతితో విదురుడిలా అన్నాడు. (5)
ఏష జాతః కులస్యాస్య కీర్తివంశప్రణాశనః ।
ధృతరాష్ట్రః పరీతాత్మా ధర్మం త్యజతి శాశ్వతమ్ ॥ 6
ఇయం వారిపథే యుక్తా తరంగపవనక్షమా ।
దౌర్యయా మృత్యుపాశాత్ త్త్వం సపుత్రా మోక్ష్యసే శుభే ॥ 7
దేవీ! ధృతరాష్ట్రుడు కురువంశ కీర్తిప్రతిష్ఠలనూ, వంశాన్నీ, నశింపచేసేవాడు. తన కుమారుల మీది పక్షపాత బుద్ధిచేత శాశ్వతమైన ధర్మాన్ని విడుస్తున్నాడు. అమ్మా! ఈ నౌక వాయుతరంగాల ధాటికి నిల్వగల్గినది. జలమార్గాన చక్కగా ప్రయాణిస్తుంది. ఈ నౌక ద్వారా, మీరు మృత్యుపాశం నుండి బయట పడతారు. (6,7)
తచ్ఛ్రుత్వా వ్య్థితా కుంతీ పుత్రైః సహ యశ్స్వినీ ।
నావమారుహ్య గంగాయాం ప్రయయౌ భరతర్షభ ॥ 8
భరత శ్రేష్ఠా! యశస్వినియగు కుంతి, ఇది విని, మిక్కిలి బాధపడింది. ఆమె తన కుమారులతో కూడా ఆ నౌకలో గంగానదిలో ప్రయాణం సాగించింది. (8)
తతో విదురవాక్యేన నావం విక్షిప్య పాండవాః ।
ధనం చాదాయ తైర్దత్తమ్ అరిష్టం ప్రావిశన్ వనమ్ ॥ 9
పిదప విదురుని మాటచొప్పున, పాండవులు తాము ప్రయాణించిన నౌకను ధ్వంసం చేసి, వారు సమకూర్చిన ధనాన్ని తీసికొని, నిరపాయంగా అరణ్యానికి వెళ్ళారు. (9)
నిషాదీ పంచపుత్రా తు జాతుషే తత్ర వేశ్మని ।
కారణాభ్యాగతా దగ్ధా సహపుత్రై రనాగసా ॥ 10
వారణావతంలో ఉన్న లక్క ఇంటిలో, కారణాంతరాల వల్ల నిలిచియున్న బోయస్త్రీ, ఏ తప్పు చేయకపోయినా, తన ఐదుగురు పుత్రులతో పాటు కాలిపోయింది. (10)
స చ మ్లేచ్ఛాధమః పాపః దగ్ధస్తత్రపురోచనః ।
వంచితాశ్చ దురాత్మానః ధార్తరాష్ట్రాః సహానుగాః ॥ 11
పాపి, మ్లేచ్ఛాధముడు అయిన పురోచనుడు లక్కయింటిలో కాలిపోయాడు. దుర్మార్గులైన ధృతరాష్ట్రపుత్రులు, వారి అనుచరులు, మోసగింపబడ్డారు. (11)
అవిజ్ఞాతా మహాత్మానః జనానామక్షతాస్తథా ।
జనన్యా సహ కౌంతేయాః ముక్తా విదురమంత్రితాః ॥ 12
విదురుని సలహాతో, మహాత్ములైన కుంతి కుమారులు తల్లితో సహా విముక్తిని పొందారు. వారు ఏవిధమైన హానీ పొందలేదు. జనసామాన్యానికి వారి వివరాలు తెలియలేదు. (12)
తతస్తస్మిన్ పురే లోకాః నగరే వారణావతే ।
దృష్ట్వా జతుగృహ దగ్ధమ్ అన్వశోచంత దుఃఖితాః ॥ 13
వారణావతంలోని జనమంతా కాలిపోయిన లక్క యింటిని చూచి, దుఃఖితులై పాండవుల కోసం పరితపించారు. (13)
రాజ్ఞే చ ప్రేషయామాసుః యథావృత్తం నివేదితుమ్ ।
సంవృత్తస్తే మహాన్ కామః పాండవాన్ దగ్ధవానసి ॥ 14
సకామో భవ కౌరవ్య భుంక్ష్వ రాజ్యం సపుత్రకః ।
తచ్ఛ్రుత్వా ధృతరాష్ట్రస్తు సహపుత్రేణ శోచయన్ ॥ 15
ధృతరాష్ట్రా! నీ గొప్పకోరిక నెరవేరింది. పాండవులను బూడిద చేశావు. ఇక నీవు రాజ్యాన్ని పుత్రులతో పాటు అనుభవించు, ఆనందించు! అంటూ జరిగిన దానిని యథాతథంగా ధృతరాష్ట్రునకు చెప్పిపంపారు. అది విన్న ధృతరాష్ట్రుడు, తనపుత్రులతోపాటు శోకిస్తూ... (14,15)
ప్రేతకార్యాణి చ తథా చకార సహ బాంధవైః ।
పాండవానాం తథా క్షత్తా భీష్మశ్చ కురుసత్తమః ॥ 16
బంధువులతో కూడి, విదురుడు, కురుశ్రేష్ఠుడయిన భీష్ముడు, పాండవులకు ప్రేతకార్యాలను (దహనం, శ్రాద్ధం మొదలైనవాటిని) జరిపించారు. (16)
జనమేజయ ఉవాచ
పునర్విస్తరశః శ్రోతుమ్ ఇచ్ఛామి ద్విజసత్తమ ।
దాహం జతుగృహస్వైవ పాండవానాం చ మోక్షణమ్ ॥ 17
జనమేజయుడిలా అన్నాడు. బ్రాహ్మణోత్తమా! లక్కయిల్లు మాత్రమే దహింపబడటం, పాండవులు విముక్తిని పొందటం - ఈ విషయాలను సవిస్తరంగా వినాలని ఉన్నది. (17)
సునృశంస మిదం కర్మ తేషాం క్రూరోపసంహితమ్ ।
కీర్తయస్వ యథావృత్తం పరం కౌతూహలం మమ ॥ 18
కౌరవులు చేసిన ఈ పని మిక్కిలి క్రూరమైనదీ, నీచమైనది. దీన్నంతటినీ యథాతథంగా వివరించు. నాకు దీన్ని వినాలని కుతూహలం అమితంగా ఉంది. (18)
వైశంపాయన ఉవాచ
శృణు విస్తరశో రాజన్ వదతో మే పరంతప ।
దాహ జతుగృహస్త్యెతత్ పాండవానాం చ మోక్షణమ్ ॥ 19
వైశంపాయనుడిలా అన్నాడు. శత్రువులను తపింపచేసే రాజా! లక్కయిల్లు కాలిపోవటం, పాండవులు బయటపడటం అనే విషయాలను విపులంగా వివరిస్తాను, శ్రద్ధగా విను. (19)
ప్రాణాధికం భీమసేనం కృతవిద్యం ధనంజయమ్ ।
దుర్యోధనో లక్షయిత్వా పర్యతప్యత దుర్మనాః ॥ 20
భీముడుఅందరిలో బలాధికుడు. అర్జునుడు శస్త్రవిద్యలో నేర్పరి. అది తలచుకొంటూ దుర్మనస్కుడయిన దుర్యోధనుడు పరితపించిపోయాడు. (20)
తతో వైకర్తనః కర్ణః శకునిశ్చాపి సౌబలః ।
అనేకైరభ్యుపాయైస్తే జిఘాంసంతి స్మ పాండవాన్ ॥ 21
అప్పుడు సూర్యపుత్రుడు కర్ణుడు, సుబల సుతుడు శకుని, వివిధోపాయాలతో పాండవులను చంపాలని భావించారు. (21)
పాండవా అపి తత్సర్వం ప్రతిచక్రుర్యథాగతమ్ ।
ఉద్భావనమకుర్వంతః విదురస్య మతే స్థితాః ॥ 22
పాండవులు కూడా విదురుని సలహా సంప్రదింపులతో, కౌరవుల చర్యలకు ప్రతీకారాన్ని చేస్తూ వచ్చారు. కాని జరిగే విషయాలను మాత్రం బయటపెట్టలేదు. (22)
గుణై సముదితాన్ దృష్ట్వా పౌరాః పాండుసుతాంస్తదా ।
కథయాంచక్రిరే తేషాం గుణాన్ సంసత్సు భారత ॥ 23
భారతా! ఆ రోజుల్లో పురజనులు పాండవుల గుణ సంపదను చూసి, సభల్లో సమావేశాల్లో వారి గుణగణాలను ప్రస్తుతింంచడం ప్రారంభించారు. (23)
రాజ్యప్రాప్తిం చ సంప్రాప్తం జ్యేష్ఠం పాండుసుతం తదా ।
కథయతి స్మ సంభూయ చత్వరేషు సభాసు చ ॥ 24
వారు వీథుల్లో కూడా, పాండుపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజుకు రాజ్యాన్ని అప్పగించే కాలం దగ్గరలో ఉందని చెప్పుకోసాగారు. (24)
ప్రజ్ఞా చక్షురచక్షుష్ట్వాత్ ధృతరాష్ట్రో జనేశ్వరః ।
రాజ్యం న ప్రాప్తవాన్ పూర్వం స కథం నృపతి ర్భవేత్ ॥ 25
ధృతరాష్ట్ర మహారాజు కన్నులు లేని కారణంగా పూర్వం రాజ్యాధికారాన్ని పొందలేక పోయాడు. ప్రజ్ఞయే కన్నులుగా కల అతడు ఇప్పుడు మాత్రం రాజు ఎలా అవుతాడు? (25)
తథా శాంతనవో భీష్మః సత్యసంధో మహావ్రతః ।
ప్రత్యాఖ్యాయ పురా రాజ్యం న స జాతు గ్రహీష్యతి ॥ 26
సత్యసంధుడై గొప్పవ్రతనిష్ఠకల శంతనుపుత్రుడు భీష్ముడు, పూర్వమే రాజ్యాన్ని తిరస్కరించాడు. అతడెప్పటికీ రాజ్యాన్ని తిరిగి స్వీకరించడు. (26)
తే వయం పాండవజ్యేష్ఠం తరుణం వృద్ధశీలినమ్ ।
అభిషించామ సాధ్వద్య సత్యకారుణ్యవేదినమ్ ॥ 27
పాండు సుతులలో జ్యేష్ఠుడు ధర్మరాజు. యువకుడైనా పెద్దరికం కలవాడు, సత్యమూ, దయ కలవాడు. వేదవేత్త. ఇపుడతనికి రాజ్యాభిషేకం చేద్దాము. (27)
స హి భీష్మం శాంతనవం ధృతరాష్ట్రం చ ధర్మవిత్ ।
సపుత్రం వివిధైర్భోగైః యోజయిష్యతి పూజయన్ ॥ 28
అతడు సకల ధర్మవేత్త, శంతను పుత్రుడు భీష్మునీ, పుత్రులతో సహా ధృతరాష్ట్రునీ పూజిస్తూ వారికి సకలభోగాల్నీ సమకూరుస్తాడు. (28)
తేషాం దుర్యోధనః శ్రుత్వా తాని వాక్యాని జల్పతామ్ ।
యుధిష్ఠిరానురక్తానాం పర్యతప్యత దుర్మతిః ॥ 29
యుధిష్ఠిరుని ప్రేమించే ప్రజల ఈ మాటలు విన్న దుర్యోధనుడు దురాలోచనలతో పరితపించాడు. (29)
స తప్యమానో దుష్టాత్మా తేషాం వాచో న చక్షమే ।
ఈర్ష్యయా చాపి సంతప్తః ధృతరాష్ట్రముపాగమత్ ॥ 30
దుర్మార్గుడు, పరితప్తుడు అయిన దుర్యోధనుడు, వారిమాటలు సహించలేక పోయాడు. అసహనంతో దుఃఖితుడై ధృతరాష్ట్రుని దగ్గరకు వెళ్ళాడు. (30)
తతో విరహితం దృష్ట్వా పితరం ప్రతిపూజ్య సః ।
పౌరానురాగసంతప్తః పశ్చాదిదమభాషత ॥ 31
తండ్రి ఏకాంతంగా ఉండటాన్ని గమనించి ఆయనను గౌరవించి, పౌరులు ధర్మరాజుపై ప్రకటిస్తున్న అనురాగాన్ని చూచి బాధపడుతున్న దుర్యోధనుడు తండ్రితో ఇలా అన్నాడు. (31)
దుర్యోధన ఉవాచ
శ్రుతా మే జల్పతాం తాత పౌరాణామశివా గిరః ।
త్వామనాదృత్య భీష్మం చ పతిమిచ్ఛంతి పాండవమ్ ॥ 32
దుర్యోధనుడిలా అన్నాడు. తండ్రీ, పురజనుల సంభాషణల్లో వారి అభిప్రాయాలను విన్నాను. అవి మనకెంతో కీడు కల్గించేవి. వారు, నిన్నూ, భీష్మునీ కాదని ధర్మరాజును రాజుగా చేయాలని భావిస్తున్నారు. (32)
మతమేతచ్చ భీష్మస్య న స రాజ్యం బుభుక్షతి ।
అస్మాకం తు పరాం పీడాం చికీర్షంతి పురే జనాః ॥ 33
భీష్ముడు రాజ్యాన్ని స్వీకరించరాదని నిర్ణయించుకొన్నాడు. కాని పురజనులు మనకు మిక్కిలి బాధ కలిగే విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు. (33)
పితృతః ప్రాప్తవాన్ రాజ్యం పాండురాత్మగుణైః పురా ।
త్వమంధగుణసంయోగాత్ ప్రాప్తం రాజ్యం న లబ్ధవాన్ ॥ 34
పాండురాజు తన సద్గుణాల వల్ల తండ్రి నుండి రాజ్యాన్ని పొందగలిగాడు. నీవు మాత్రం గ్రుడ్డితనం వల్ల రాజ్యాన్ని పొందలేకపోయావు. (34)
స ఏష పాండోర్దాయాద్యం యది ప్రాప్నోతి పాండవః ।
తస్య పుత్రో ధ్రువం ప్రాప్తః తస్య తస్యాపి చాపరః ॥ 35
ధర్మజుడు పాండురాజురాజ్యాన్ని ఉత్తరాధికారిగా పొందితే, మళ్ళీ రాజ్యాధికారం ధర్మరాజు కొడుక్కీ, అతని నుండి అతని కుమారునికీ పరంపరగా సంక్రమిస్తుంది. (35)
తే వయం రాజవంశేన హీనాః సహ సుతైరపి ।
అవజ్ఞాతా భవిష్యామః లోకస్య జగతీపతే ॥ 36
రాజా! మనమీవిధంగా పుత్రపౌత్రులతో సహా రాజ్యాధికారాన్ని కోల్పోతాము. లోకమంతా మనల్ని చులకనగా చూస్తుంది. (36)
సతతం నిరయం ప్రాప్తాః పరపిండోపజీవినః ।
న భవేమ యథా రాజన్! తథా నీతిర్విధీయతామ్ ॥ 37
మహారాజా! మనమంతా పరపిండం కోసం ప్రాకులాడకుండా ఉండేటట్లు, నరకంలాంటి దాస్యంలో పడిపోకుండా ఉండేటట్లు నీతిని మీరు అవలంబించవలసి ఉన్నది. (37)
యది త్వం హి పురా రాజన్ ఇదం రాజ్యమవాప్తవాన్ ।
ధ్రువం ప్రాప్స్యాయ చ వయం రాజ్యమప్యవశే జనే ॥ 38
రాజా! నీవు ముందుగానే ఈ రాజ్యాన్ని పొందగలిగితే, మేమూ నీ కుమారులుగా రాజ్యాన్ని పొందుగలుగుతాము. అప్పుడు అవశులైన లోకులు మనల్ని ఏమీ చేయలేరు. (38)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి జతుగృహపర్వణి దుర్యోధనేర్ష్యాయాం చత్వారింశదధిక శతతమోఽధ్యాయః ॥ 140 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున జతుగృహపర్వమను ఉపపర్వమున దుర్యోధనేర్ష్య అను నూటనలువదవ అధ్యాయము (140)