125. నూట ఇరువది అయిదవ అధ్యాయము

ఋషులు కుంతిని, పాండవులను హస్తినకు కొనిపోవుట.

వైశంపాయన ఉవాచ
పాండోరుపరమం దృష్ట్వా దేవకల్పా మహర్షయః ।
తతో మంత్రవిదః సర్వే మంత్రయాంచక్రిరే మిథః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. పాండురాజు మరణాన్ని చూచి అక్కడున్న మంత్రవేత్తలు, దేవతుల్యులయిన మహర్షులు తమలో తాము చర్చించుకొన్నారు. (1)
తాపసా ఊచుః
హిత్వా రాజ్యం చ రాష్ట్రంచ స మహాత్మా మహాయశాః ।
అస్మిన్ స్థానే తపస్తప్త్వా తాపసాన్ శరణం గతః ॥ 2
తాపసులిలా అన్నారు. మహాత్ముడూ, మహాయశస్వి అయిన ఆ పాండురాజు రాజ్యాన్నీ, రాష్ట్రాన్నీ వీడి ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి తాపనుల శరణుకోరాడు. (2)
స జాతుమాత్రాన్ పుత్రాంశ్చ దారంశ్చ భవతామిహ ।
ప్రాదాయోపనిధిం రాజా పాండుః స్వర్గమితో గతః ॥ 3
ఆ పాండురాజు తన భార్యనూ, పసి వయస్సులోని కుమారులనూ మీకు అప్పగించి ఇక్కడనుండియే స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. (3)
తస్యేమానాత్మజాన్ దేహం భార్యాం చ సుమహాత్మనః ।
స్వరాష్ట్రం గృహ్య గచ్ఛామః ధర్మ ఏష హి నః స్మృతః ॥ 4
ఆ పాండురాజు కుమారులను, మాద్రీ పాండురాజుల అస్థికలను, ఆ మహాత్ముని భార్య అయిన కుంతిని తీసికొని వారి రాష్ట్రానికి వెళదాం. ప్రస్తుతమిదే మనకు తగిన ధర్మం. (4)
వైశంపాయన ఉవాచ
తే పరస్పరమామంత్ర్య దేవకల్పా మహర్షయః ।
పాండోః పుత్రాన్ పురస్కృత్య నగరం నాగసాహ్వయమ్ ॥ 5
ఉదారమనసః సిద్దాః గమనే చక్రిరే మనః ।
భీష్మాయ పాండవాన్ దాతుం ధృతరాష్ట్రాయ చైవ హి ॥ 6
వైశంపాయనుడిలా అన్నాడు. ఈ విధంగా పరస్పరం సంప్రదించుకొని దేవసమానులు, ఉదార హృదయులూ అయిన ఆ సిద్ధ మహర్షులు పాండుకుమారులను తీసికొని హస్తినకు వెళ్ళి భీష్మ ధ్ఱ్రుతరాష్ట్రులకు పాండవులను అప్పగించాలని ప్రయాణానికి సంకల్పించారు. (5,6)
తస్మిన్నేవ క్షణే సర్వే తానాదాయ ప్రతస్థిరే ।
పాండోర్దారాంశ్చ పుత్రాంశ్చ శరీరే తే చ తాపసాః ॥ 7
ఆ క్షణంలోనే పాండు రాజకుమారులనూ, కుంతిని, మాద్రీ పాండురాజుల అస్థికలను తీసికొని ఆ తాపసులు బయలుదేరారు. (7)
సుఖినీ సా పురా భూత్వా సతతం పుత్రవత్సలా ।
ప్రపన్నా దీర్ఘమధ్వానం సంక్షిప్తం తదమన్యత్ ॥ 8
నిరంతరమూ పుత్రవాత్సల్యం గలిగినదీ, ఒకప్పుడు సుఖంగా జీవించినదే అయినా ఇప్పుడు ప్రపన్నురాలయిన ఆ కుంతి ఆ సుదీర్ఘమార్గాన్ని కూడా స్వల్పంగానే భావించింది. (8)
సాత్వదీర్ఘేణ కాలేన సంప్రాప్తా కురుజాంగలమ్ ।
వర్ధమానపురద్వారమ్ ఆససాద యశస్వినీ ॥ 9
యశస్విని అయిన కుంతి స్వల్ప వ్యవధిలోనే కురుజాంగల దేశాన్ని చేరి వర్ధమాన మనుపేరుగల నగరద్వారాన్ని సమీపించింది. (9)
ద్వారిణం తాపసా ఊచుః రాజానం చ ప్రకాశయ ।
తే తు గత్వా క్షణేనైవ సభాయాం వినివేదితాః ॥ 10
తమరాకకు ప్రభువున కెరిగించమని తాపసులు ద్వారపాలకునితో అన్నారు. వారు వెళ్ళి క్షణకాలంలోనే ఆ విషయాన్ని సభలో తెలియజేశారు. (10)
తం చారణసహస్రాణాం మునీనామాగమం తదా ।
శ్రుత్వా నాగపురే నౄణాం విస్మయః సమపద్యత ॥ 11
వేలకొలది చారణులు, మహర్షులూ అక్కడకు రావటాన్ని విని హస్తినాపురిలోని రాజులు ఆశ్చర్యపడ్డారు. (11)
ముహూర్తోదిత ఆదిత్యే సర్వే బాలపురస్కృతాః ।
సదారాస్తాపసాన్ ద్రష్టుం నిర్యయుః పురవాసినః ॥ 12
రెండు గడియల కాలంలోనే నగరవాసులంతా స్త్రీలనూ, పిల్లలనూ కూడా వెంటబెట్టుకొని తాపసులను చూడటానికి బయటకు వచ్చారు. (12)
స్త్రీ సంఘాః క్షత్రసంఘాశ్చ యానసంఘసమాస్థితాః ।
బ్రాహ్మణైః సహ నిర్జగ్ముః బ్రాహ్మణానాం చ యో హితః ॥ 13
స్త్రీలూ, క్షత్రియసమూహాలూ వివిధవాహనాలను అధిరోహించి బయలుదేటారు. బ్రాహ్మణులతో బాటు బ్రాహ్మణ స్త్రీలు కూడా బయలుదేరి వచ్చారు. (13)
తథా విట్ శూద్రసంఘానాం మహాన్ వ్యతికరోఽభవత్ ।
న కశ్చిదకరోదీర్ఘ్యామ్ అభవన్ ధర్మబుద్ధయః ॥ 14
అదే విధంగా వైశ్య శూద్ర సముదాయాలు పెద్దగా గుమిగూడాయి.ఎవ్వరి మనస్సులలోనూ ఈర్ష్యలేదు. అందరూ ధర్మబుద్ధులయి ఉన్నారు. (14)
తథా భీష్మః శాంతనవః సోమదత్తోఽథ బాహ్లికః ।
ప్రజ్ఞాచక్షుశ్చ రాజర్షిః క్షత్తా చ విదురః స్వయమ్ ॥ 15
ఆ ప్రకారంగా శంతనుసుతుడయిన భీష్ముడూ, సోమదత్తుడూ, బాహ్లీకుడు, ప్రజ్ఞానేత్రుడు రాజర్షీ అయిన ధృతరాష్ట్రుడూ, విదురుడూ స్వయంగా వచ్చారు. (15)
సా చ సత్యవతీ దేవీ కౌసల్యా చ యశస్వినీ ।
రాజదారైః పరివృతా గాంధారీ చాపి నిర్యయౌ ॥ 16
రాణి అయిన సత్యవతి, కీర్తిమతి అయిన కౌసల్య అంతఃపురకాంతలతో గూడి గాంధారి వెలుపలకు వచ్చారు. (16)
ధృతరాష్ట్రస్య దాయాదాః దుర్యోధనపురోగమాః ।
భూషితా భూషణై శ్చిత్రైః శతసంఖ్యా వినిర్యయుః ॥ 17
ధృతరాష్ట్రుని కొడుకులు వందమందీ దుర్యోధనుని ముందు నిలిపికొని, విచిత్రాభరణాలను ధరించి వచ్చారు. (17)
తాన్ మహర్షిగణాన్ దృష్ట్వా శిరోభిరభివాద్య చ ।
ఉపోపవివిశుః సర్వే కౌరవ్యాః సపురోహితాః ॥ 18
ఆ మహర్షిగణాలను చూచి శిరసా నమస్కరించి, పురోహితులతో సహా కౌరవులంతా వారికి సమీపంగా కూర్చున్నారు. (18)
తథైవ శిరసా భూమౌ అభివాద్య్ ప్రణమ్య చ ।
ఉపోపవివిశుః సర్వే పౌరా జానపదా అపి ॥ 19
ఆ ప్రకారంగానే పౌరులూ, జానపదులూ అందరూ నేలకు తల తాకించి అభివాదం/నమస్కారం చేసి సమీపంలో కూర్చున్నారు. (19)
తమకూజమభిజ్ఞాయ జనౌఘం సర్వశస్తదా ।
పూజయిత్వా యథాన్యాయం పాద్యేనార్ఘేణ చ ప్రభో ॥ 20
భీష్మో రాజ్యం చ రాష్ట్రం చ మహర్షిభ్యో న్యవేదయత్ ।
తేషామథో వృద్ధతమః ప్రత్యుత్థాయ జటాజినీ ।
ఋషీణాం మతమాజ్ఞాయ మహర్షిరిదమవ్రీత్ ॥ 21
జనమేజయా! ఆ తర్వాత ప్రజలంతా నిశ్శబ్దంగా కూర్చొని ఉండటాన్ని గమనించి భీష్ముడు అర్చించి రాజ్యాన్నీ, రాష్ట్రాన్నీ మహర్షులకు నివేదించాడు. ఆ మహర్షులందరిలో వృద్ధుడై జటాజినాలను ధరించి ఉన్న మహర్షి లేచి ఇతరమహర్షుల అనుమతితో ఇలా అన్నాడు. (20,21)
యః స కౌరవ్య దాయాదః పాండుర్నామ వరాధిపః ।
కామభోగాన్ పరిత్యజ్య శతశృంగమితో గతః ॥ 22
(స యథోక్తం తపస్తేపే తత్ర మూలఫలాశనః ।
పత్నీభ్యాం సహ ధర్మాత్మా కంచిత్ కాలమతంద్రితః ।
తేన వృత్తసమాచారైః తపసా చ తపస్వినః ।
తోషితాస్తాపసా స్తత్ర శతశృంగనివాసినః ॥)
బ్రహ్మచర్యవ్రతస్థస్య తస్య దివ్యేన హేతునా ।
సాక్షాద్ ధర్మాదయం పుత్రః తత్ర జాతో యుధిష్ఠిరః ॥ 23
నీకుమారుడు పాండుమహారాజు కామభోగాలను విసర్జించి ఇక్కడనుండి శతశృంగ పర్వతానికి వెళ్లాడు. ఆ ధర్మాత్ముడు అక్కడ కందమూలాలను ఆహారంగా తీసికొని తన భార్యలతో సహా అలసట లేకుండా కొంతకాలం యథావిధి తపస్సు చేశాడు. ఆయన స్వభావం, నడవడీ, తపస్సు చూచి శతశృంగనివాసులూ, తపోమూర్తులు ఆ మహర్షులందరూ ఆనందించారు. బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న ఆయనకు ఏదో దివ్యమైన కారణంవలన సాక్షాత్తూ ధర్మరాజు ద్వారా ఈ కుమారుడు యుధిష్ఠిరుడు పుట్టాడు. (22,23)
తథైనం బలినాం శ్రేష్ఠం తస్య రాజ్ఞో మహాత్మనః ।
మాతరిశ్వా దదౌ పుత్రం భీమం నామ మహాబలమ్ ॥ 24
అదే విధంగా మహాత్ముడైన ఆ రాజునకు బలవంతులలో శ్రేష్ఠుడూ, మహాబలుడూ అయిన ఈ భీముని వాయుదేవుడు కుమారునిగా ఇచ్చారు. (24)
పురుహూతాదయం జజ్ఞే కుంత్యామేవ ధనంజయః ।
యస్య కీర్తిర్మహేష్వాసాన్ సర్వానభిభవిష్యతి ॥ 25
ఈ కుమారుడు ధనంజయుడు ఇంద్రుని ద్వారా కుంతికి జన్మించినవాడు. ఇతని కీర్తి ధనుర్ధారులందరినీ తిరస్కరింపగలది. (25)
యౌ తు మాద్రీ మహేష్వాసౌ అసూత పురుషోత్తమౌ ।
అశ్విభ్యాం పురుషవ్యాఘ్రౌ ఇమౌ తావపి పశ్యత ॥ 26
ఇదిగో ఈ కుమారులను చూడండి. వీరు పురుషోత్తములు, మేటి విలుకాండ్రు, వీరిని మాద్రి అశ్వినీ దేవతల ద్వారా కన్నది. (26)
(నకులః సహదేవశ్చ తావప్యమితతేజసౌ ।
పాండవౌ నరశార్దూలౌ ఇమావప్యపరాజితౌ ॥)
చరతాధర్మనిత్యేన వనవాసం యశస్వినా ।
నష్టః పైతామహో వంశః పాండువా పునరుద్ధృతః ॥ 27
వీరిపేర్లు నకులుడూ, సహదేవుడూ. వీరు అమిత తేజోవంతులు, నరశ్రేష్ఠులూ, ఓటమిలేనివారు. కీర్తిమంతుడై, నిత్యమూ ధర్మబద్ధంగా జీవిస్తున్న పాండురాజు నశించిపోయిన పితామహవంశాన్ని పునరుద్ధరించాడు. (27)
పుత్రాణాం జన్మ వృద్ధిం చ వైదికాధ్యయనాని చ ।
పశ్యంతః సతతం పాండోః పరాం ప్రీతిమవాప్స్యథ ॥ 28
పాండుకుమారుల జన్మనూ, అభివృద్ధినీ, వైదికాధ్యయనాదులను చూచి మీరంతా ఎంతో సంతోషించండి. (28)
వర్తమాన సతాం వృత్తే పుత్రలాభమవాప్య చ ।
పితృలోకం గతః పాండుః ఇతః సప్తదశేఽహని ॥ 29
సజ్జనుల బాటలో జీవించి పుత్రలాభాన్ని పొంది పాండురాజు నేటికి పదిహేడు రోజులముందు పితృలోకాన్ని పొందాడు. (29)
తం చితాగత మాజ్ఞాయ వైశ్వానరముఖే హుతమ్ ।
ప్రవిష్టా పావకం మాద్రీ హిత్వా జీవితమాత్మనః ॥ 30
పాండురాజును చితిపైకెక్కించి దాహకర్మను నిర్వర్తిస్తున్న వేళలో మాద్రి జీవనమోహాన్ని విడిచి తాను కూడా అగ్నికి ఆహుతైనది. (30)
సా గతా సహతేనైవ పతిలోకమనువ్రతా ।
తస్యాస్తస్య చ యత్కార్యం క్రియతాం తదనంతరమ్ ॥ 31
పతివ్రత అయిన ఆ మాద్రి భర్తతో సహగమించి పతిలోకానికే చేరింది. ఇకపై మాద్రీ పాండురాజులకు నిర్వర్తించవలసిన కార్యాలను నిర్వర్తించండి. (31)
(పృథాం చ శరణం ప్రాస్తాం పాండవాంశ్చ యశస్వినః ।
యథావదనుగృహ్ణంతు ధర్మోహ్యేష సనాతనః ॥)
ఇమే తయోః శరీరే ద్వే పుత్రాశ్చేమే తయోర్వరాః ।
క్రియాభిరనుగృహ్యంతాం సహమాత్రా పరంతపాః ॥ 32
శరణుకోరి వచ్చిన కుంతినీ, కీర్తిమంతులను పాండవులనూ తగినరీతిగా మీరు అనుగ్రహించి స్వీకరించండి. ఇది సనాతనధర్మం.
ఇవి మాద్రీ పాండురాజుల అస్థికలు. వీరు ఆ పాండురాజు వరపుత్రులు. శత్రువులను అణచగలవారు. మాద్రి పాండురాజుల శ్రాద్ధక్రియల నిర్వహించటంతో పాటు ఈ కుమారులనూ, కుంతినీ అనుగ్రహించండి. (32)
ప్రేతకార్యే నివృత్తే తు పితృమేధం మహాయశాః ।
లభతాం సర్వధర్మజ్ఞః పాండుః కురుకులోద్వహః ॥ 33
సపిండీకరణపర్యంతం ప్రేతకార్యాన్ని నిర్వహించిన తరువాత సర్వధర్మజ్ఞుడూ, మహాయశస్కుడూ కురుకుల శ్రేష్ఠుడూ అయిన ఈ పాండురాజు పితృమేధఫలాన్ని పొందవలసి ఉన్నది. (33)
వి: సం: పితృమేధం = పితృమేధయజ్ఞం లేదా వృషోత్సర్గం (ఆంబోతును వదులుట) (నీల)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా కుఱూన్ సర్వాన్ కుఱూణామేవ పశ్యతామ్ ।
క్షణేనాంతర్హితాః సర్వే తాపసా గుహ్యకైః సహ ॥ 34
వైశంపాయనుడిలా అన్నాడు. కౌరవులందరితో ఈవిధంగా పలికి వారు చూస్తూండగానే క్షణకాలంలో ఆ తాపసులంతా చారణులతో సహా అంతర్ధానమయ్యారు. (34)
గంధర్వనగరాకారం తథైవాంతర్హితం పునః ।
ఋషిసిద్ధగణం దృష్ట్వా విస్మయం తే పరం యయుః ॥ 35
(కౌరవాః సహసోత్పత్య సాధు సాధ్వితి విస్మితాః ॥)
గంధర్వనగరం వలె ఋషులూ, సిద్ధులూ ఆ ప్రకారంగా అంతర్ధానం కావటం చూచి కౌరవులంతా పరమాశ్చర్యాన్ని పొందారు. వెంటనే లేచి "భళీ-భళీ" అని విస్మయాన్ని ప్రకటించారు. (35)
వి: సం: గంధర్వనగరం - జ్యోతిశాస్త్రంలో గంధర్వనగరానికి సంబంధించిన ప్రస్తావన -
అనేకరత్నాకృతి ఖే ప్రకాశతే
పురం పతాకాధ్వజతోరణాన్వితమ్ ।
యదా తదా నాగమనుష్యవాజినాం
పిబత్యసృగ్ భూరిరణే వసుంధరా ॥ (నీల)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఋషిసంవాదే పంచవింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 125 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఋషిసంవాదమను నూట ఇరువదియయిదవ అధ్యాయము. (125)
(దాక్షిణాత్య ఆధికపాఠం 4 1/2 శ్లోకాలతో కలిసి మొత్తం 39 1/2 శ్లోకాలు)