120. నూట ఇరువదవ అధ్యాయము
వ్యుషితాశ్వోపాఖ్యానము.
వైశంపాయన ఉవాచ
ఏవముక్తాః మహారాజ కుంతీ పాండుమభాషత ।
కురూణామృషభం వీరం తదా భూమిపతిం పతిమ్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. మహారాజా! పాండురాజు ఇలా అన్న తరువాత కురువంశశ్రేష్ఠుడూ, వీరుడూ, భూపాలుడూ అయిన తన భర్తతో కుంతి ఇలా అన్నది. (1)
న మామర్హసి ధర్మజ్ఞ వక్తుమేవం కథంచన ।
ధర్మపత్నీమభిరతాం త్వయి రాజీవలోచనే ॥ 2
ధర్మజ్ఞా! నీవు నాతో ఇటువంటి మాటలు అనవచ్చునా? నేను నీ ధర్మపత్నిని. తామరల వంటి కన్నులు గల నీయందే అనురాగమున్నదానను. (2)
త్వమేవ తు మహాబాహో మయ్యపత్యాని భారత ।
వీర వీర్యోపపన్నాని ధర్మతో జనయిష్యసి ॥ 3
మహాబాహూ! భరతవంశోద్భవా! మహావీరా! నీవు నాయందు ధర్మబద్ధంగా వీరులైన పిల్లలను కనగలవు. (3)
స్వర్గం మనుజశార్దూల గచ్ఛేయం సహితా త్వయా ।
అపత్యాయ చ మాం గచ్ఛ త్వమేవ కురునందన ॥ 4
మానవశ్రేష్ఠా! కురునందనా! నీతో పాటే స్వర్గానికి వెళతాను. నీవే సంతానం కోసం నాతో సంగమించు. (4)
న హ్యహం మనసాప్యన్యం గచ్ఛేయం త్వదృతే నరమ్ ।
త్వత్తః ప్రతివిశీష్టశ్చ కోఽన్యోఽస్తి భువి మానవః ॥ 3
నేను మనస్సులో కూడా నిన్ను తప్ప మరొకరిని భావించను. లోకంలో నీకన్న గొప్పవాడైన మానవుడెవడున్నాడు? (5)
ఇమాం చ తావద్ ధర్మాత్మన్ పౌరాణీం శృణు మే కథామ్ ।
పరిశ్రుతాం విశాలాక్ష కీర్తయిష్యామి యామహమ్ ॥ 6
ధర్మాత్మా! పురాతనమయిన ఈ కథను విను. విశాలనేత్రా! నేను చెప్పబోవు ఈ కథ అందరికీ తెలిసినదే. (6)
వ్యుషితాశ్వ ఇతి ఖ్యాతః బభూవ కిల పార్థివః ।
పురా పరమధర్మిష్ఠః పూరోర్వంశవివర్ధనః ॥ 7
ఒకప్పుడు వ్యుషితాశ్వుడనే మహారాజు ఉండేవాడు. అతడు పరమధర్మాత్ముడు. పూరువంశ వివర్ధనుడు కూడా. (7)
తస్మింశ్చ యజమానే వై ధర్మాత్మని మహాభుజే ।
ఉపాగమంస్తతో దేవాః సేంద్రా దేవర్షిభిః సహ ॥ 8
మహాపరాక్రమశాలి అయిన ఆధర్మాత్ముడు యాగం చేస్తుండగా దేవతలు దేవేంద్రునితోనూ, దేవర్షులతోనూ కలిసి అక్కడకు వచ్చారు. (8)
అమాద్యదింద్రః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః ।
వ్యుషితాశ్వస్య రాజర్షేః తతో యజ్ఞే మహాత్మనః ॥ 9
దేవా బ్రహ్మర్షయశ్చైవ చక్రుః కర్మ స్వయం తదా ।
వ్యుషితాశ్వస్తతో రాజన్ అతి మర్త్యాన్ వ్యరోచత ॥ 10
ఇంద్రుడు సోమపానంతో ఉన్మత్తుడయ్యాడు. బ్రాహ్మణులు దక్షిణలతో సంతృప్తులయ్యారు. మహాత్ముడూ, రాజర్షీ అయిన ఆ వ్యుషితాశ్వుని యాగంలో దేవతలూ, బ్రహ్మర్షులూ తామే అన్ని పనులూ చేశారు. రాజా! దానితో వ్యుషితాశ్వుడు సర్వమానవులకన్నా మిన్నయై ప్రకాశించాడు. (9,10)
సర్వభూతాన్ ప్రతి యథా తపనః శిశీరాత్యయే ।
స విజిత్య గృహీత్వా చ నృపతీన్ రాజసత్తమః ॥ 11
ప్రాచ్యానుదీచ్యాన్ పాశ్చాత్త్యాన్ దాక్షిణాత్యానకాలయత్ ।
అశ్వమేథే మహాయజ్ఞే వ్యుషితాశ్వః ప్రతాపవాన్ ॥ 12
శరీరం ముగిసిన తరువాత సూర్యునివలె ఆ వ్యుషితాశ్వుడు సర్వప్రాణులకూ ప్రీతిపాత్రుడయ్యాడు. ఆయన అశ్వమేధయాగం చేసి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరదిక్కులలో ఉన్న రాజుల నందరినీ పరాక్రమశాలియై జయించి లోబరచుకున్నాడు. (11,12)
బభూవ స హి రాజేంద్రః దశనాగబలాన్వితః ।
అప్యత్ర గాథాం గాయంతి యే పురాణవిదో జనాః ॥ 13
వ్యుషితాశ్వే యశోవృద్ధే మనుష్యేంద్రే కురూత్తమ ।
వ్యుషితాశ్వః సముద్రాంతాం విజిత్యేమాం వసుంధరామ్ ॥ 14
అపాలయత్ సర్వవర్ణాన్ పితా పుత్రానివౌరసాన్ ॥
యజమానో మహాయజ్ఞైః బ్రాహ్మణేభ్యో ధనం దదౌ ॥ 15
ఆ వ్యుషితాశ్వమహారాజు పదియేనుగుల బలం కలవాడు. కురుశ్రేష్ఠా! పురాణవేత్తలు యశోవృద్ధుడై మానవోత్తముడైన ఆవ్యుషితాశ్వుని గూర్చి ఇలా చెప్పుకొంటుంటారు - వ్యుషితాశ్వుడు సాగరపర్యంతమయిన ఈ భూమిని జయించి తండ్రి తన పిల్లలను కాపాడినట్లు సర్వవరాలవారినీ పరిపాలించాడు. మహాయాగాలను చేసి బ్రాహ్మణులకు భూరు దక్షిణలనిచ్చాడు. (13-15)
అనంతరత్నాన్యాదాయ స జహార మహాక్రతూన్ ।
సుషావ చ బహూన్ సోమాన్ సోమసంస్థాస్తతాన చ ॥ 16
అనంతరత్నాలను కొనివచ్చి ఆ వ్యుషితాశ్వుడు ఎన్నో మహాక్రతువులను ఆదరించాడు. అనేక సోమయాగాలను సమకూర్చి ఎంతో సోమరసాన్ని సంగ్రహించి అగ్నిష్ఠోమం మొదలుగా గల ఏడు విధాలయిన సోమయాగాలనూ అనుష్ఠించాడు. (16)
ఆసీత్ కాక్షీవతీ చాస్య భార్యా పర్మసమ్మతా ।
భద్రా నామ మనుష్యేంద్ర రూపేణాసదృశీ భువి ॥ 17
రాజా! వ్యుషితాశ్వునకు కాక్షీవంతుని కుమార్తె అయిన భద్ర ఇల్లాలు. ఆమె ఆయనకు మరీ ఇష్టమైనది. రాజా! ఆరోజులలో ఆమె అంత అందగత్తె లోకంలో లేదట. (17)
కామయామాసతుస్తౌ చ పరస్పరమితి శ్రుతమ్ ।
స తస్యాం కామసంపన్నః యక్ష్మణా సమపద్యత ॥ 18
వారు ఒకరినొకరు బాగా ఇష్టపడేవారట. భార్యతో మితిమీరిన కామప్రవృత్తి వలన ఆ వ్యుషితాశ్వుడు క్షయవ్యాధికి గురి అయ్యాడు. (18)
తేనాచిరేణ కాలేన జగామాస్తమివాంశుమాన్ ।
తస్మిన్ ప్రేతే మనుష్యేంద్రే భార్యాస్య భృశదుఃఖితా ॥ 19
దానితో స్వల్పవ్యవధిలోనే సంధ్యాసూర్యునివలె ఆ వ్యుషితాశ్వుడు అస్తమించాడు. ఆరాజు మరణించగా అతని భార్య తీవ్రంగా దుఃఖించింది. (19)
అపుత్రా పురుషవ్యాఘ్ర విలలాపేతి నః శ్రుతమ్ ।
భద్రా పరమదుఃఖాల్తా తన్నిబోధ జనాధిప ॥ 20
నరోత్తమా! ఆమె సంతానహీన. ఆకారణంగా ఆమె విలపించిందని విని ఉన్నాను. రాజా! పరమదుఃఖానికి లోనయిన ఆ భద్ర విలపించిన తీరును గమనించండి. (20)
భద్రోవాచ
నారీ పరమధర్మజ్ఞ సర్వా భర్తృవినాకృతా ।
పతిం వినా జీవతి యా న సా జీవతి దుఃఖితా ॥ 21
భద్ర ఇలా అన్నది - పరమ ధర్మజ్ఞా! విధవ అయిన స్త్రీ భర్త లేకుండా జీవిస్తున్నా దుఃఖంలోనే మునిగి ఉంటుంది. కాబట్టి ఆమె జీవిస్తున్నట్లు కనిపించినా మరణించినట్లే. (21)
పతిం వినా మృతం శ్రేయః నార్యాః క్షత్రియపుంగవ ।
త్వద్గతిం గంతుమిచ్ఛామి ప్రసీదస్వ నయస్వ మామ్ ॥ 22
త్వయా హీనా క్షణమపి నాహం జీవితుముత్సహే ।
ప్రసాదం కురు మే రాజన్ ఇతస్తూర్ణం నయస్వ మామ్ ॥ 23
క్షత్రియశ్రేష్ఠా! భర్తను కోల్పోయిన స్త్రీకి మరణమే మంచిది. నేనుకూడా నీ మార్గాన్నే అనుసరించదలచాను. దయతో నన్ను కూడా తీసికొనిపో. నీవు లేకుండా క్షణకాలం కూడా నాకు బ్రతకాలను లేదు. రాజా! దయచూపించు. ఇక్కడనుండి వెంటనే నన్ను తీసికొనిపో. (22,23)
పృష్ఠతోఽనుగమిష్యామి సమేషు విషమేషు చ ।
త్వామహం నరశార్దూల గచ్ఛంతమనివర్తితుమ్ ॥ 24
నరశార్దూలా! తిరిగివచ్చే ప్రసక్తి లేకుండా వెళ్తున్న నీదారి సమమయినా విషమమయినా నీవెంటే నేనూ నడుస్తాను. (24)
ఛాయేవానుగతా రాజన్ సతతం వశవర్తినీ ।
భవిష్యామి నరవ్యాఘ్ర నిత్యం ప్రియహితే రతా ॥ 25
రాజా! నిత్యమూ నీకు లోబడి నీడలా నిన్ను అనుసరిస్తాను. నరశ్రేష్ఠా! ఎల్లప్పుడూ నీకు ప్రియమయిన, హితమయిన వాటి యందే ఆసక్తిని ప్రదర్శిస్తాను. (25)
అద్యప్రభృతి మాం రాజన్ కష్టా హృదయశోషణాః ।
ఆధయో-భిభవిష్యంతి త్వామృతే పుష్కరేక్షణ ॥ 26
రాజీవలోచనా! రాజా! నీవిరహంతో నేటినుండి హృదయాన్ని ఎండింపజేసే కష్టాలూ, మనోవ్యథలూ నన్ను చుట్టుముట్టుతాయి. (26)
అభాగ్యయా మయా నూనం వియుక్తాః సహచారిణః ।
తేన మే విప్రయోగోఽయమ్ ఉపపన్నస్త్వయా సహ ॥ 27
దురదృష్టవంతురాలను నేను. ఎన్ని జంటలను విడదీశానో? ఆకారణంగానే నీతో నాకు ఈ వియోగమేర్పడినది. (27)
విప్రయుక్తా తు యా పత్యా ముహూర్తమపి జీవతి ।
దుఃఖం జీవతి సా పాపా నరకస్థేవ పార్థివ ॥ 28
రాజా! భర్తలేకుండా రెండు గడియలు జీవించినా ఆ పాపాత్మురాలు నరకంలో ఉన్నట్లు దుఃఖమయమైన జీవితాన్నే గడుపుతుంది. (28)
సంయుక్తా విప్రయుక్తాశ్చ పూర్వదేహే కృతా మయా ।
తదిదం కర్మభిః పాపైః పూర్వదేహేషు సంచితమ్ ॥ 29
దుఃఖం మామనుసంప్రాప్తం రాజన్ త్వద్విప్రయోగ్జమ్ ।
అద్యప్రభృత్యహం రాజన్ కుశసంస్తరశాయినీ ।
భవిష్యామ్యసుఖావిష్టా త్వద్దర్శనపరాయణా ॥ 30
గతజన్మలో నేను కలిసి ఉన్న వారి నెందరినో విడదీసి ఉంటాను. ఆపాపకర్మల ద్వారా గత జన్మలోని సంచితమే ఈరీతిగా నాకు నీ వియోగంతో దుఃఖాన్ని కల్పించింది. రాజా! దుఃఖంలో మునిగిన నేను నేటినుండీ నీ దర్శనానికై నిరీక్షిస్తూ దర్భలమీదనే శయనిస్తాను. (29,30)
దర్శయస్వ నరవాఘ్ర శాధి మామసుఖాన్వితామ్ ।
కృపణాం చాథ కరుణం విలపంతీం నరేశ్వర ॥ 31
నరశ్రేష్ఠా! నాకు కనిపించు. నరీశ్వరా! దీనంగా, జాలిగా విలపిస్తూ దుఃఖానికే నోచుకొన్న నాకు కర్తవ్యాన్ని ఉపదేశించు. (31)
కుంత్యువాచ
ఏవం బహువిధం తస్యాం విలపంత్యాం పునః పునః ।
తం శవం సంపరిష్వజ్య వాక్ కిలాంతర్హితాబ్రవీత్ ॥ 32
కుంతి ఇలా అన్నది. ఆమె ఆసవాన్ని కౌగిలించుకొని పదేపదే ఆవిధంగా విలపిస్తుండగా అశరీరవాణి ఇలా పలికింది. (32)
ఉత్తిష్ఠ భద్రే గచ్ఛ త్వం దదానీహ వరం తవ ।
జనయిష్యామ్యపత్యాని త్వయ్యహం చారుహాసిని ॥ 33
కళ్యాణీ! లేచి వెళ్ళు. నీకు వరమిస్తున్నాను. చారుహాసిని నీ యందు నేను సంతానాన్ని కలిగిస్తాను. (33)
ఆత్మకీయే వరారోహో శయనీయే చతుర్దశీమ్ ।
అష్టమీం వా ఋతుస్నాతా సంవిశేథా మయా సహ ॥ 34
వరారోహా! ఋతుస్నానం తర్వాత ఎనిమిదవ రాత్రి గానీ, పదునాలుగవ రాత్రి కానీ నీ శయ్యపై ఈ నా శవంతో నిదురించు. (34)
ఏవముక్తా తు సా దేవీ తథా చక్రే పతివ్రతా ।
యథోక్తమేవ తద్వాక్యం భద్రా పుత్రార్థినీ తదా ॥ 35
ఆమాటలు విని పతివ్రత ఆమె ఆవిధంగానే చేసింది. సంతానాన్ని కోరుతున్న ఆమె ఆవాక్యాన్ని యథాతథంగా పాటించింది. (35)
సా తేన సుషునే దేవీ శవేన భరతర్షభ ।
త్రీన్ శాల్వాంశ్చతురో మద్రాన్ సుతాన్ భరతసత్తమ ॥ 36
భరతశ్రేష్ఠా! ఆశవంతో పాటు శయనించి ఆ భద్ర ఏడుగురు కొడుకులను కన్నది. వారిలో ముగ్గురు శాల్వదేశాన్ని నలుగురు మద్రదేశాన్ని పరిపాలించగలిగారు. (36)
తథా త్వమపి మయ్యేవం మనసా భరతర్షభ ।
శక్తో జనయితుం పుత్రాన్ తపోయోగబలాన్వితః ॥ 37
భరతశ్రేష్ఠా! అదేవిధంగా నీవుకూడా తపోబలసమన్వితుడవై మనస్సంకల్పంచేతనే నాయందు పుత్రులను కనగలవాడవు. (37)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి వ్యుషితాశ్వోపాఖ్యానే వింశత్యధిక శతతమోఽధ్యాయః ॥ 120 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున వ్యుషితాశ్వోపాఖ్యానమను నూట ఇరువదవ అధ్యాయము. (120)