105. నూట అయిదవ అధ్యాయము

ధృతరాష్ట్ర - పాండు - విదురుల జననము.

వైశంపాయన ఉవాచ
తతః సత్యవతీ కాలే వధూం స్నాతామృతౌ తదా ।
సంవేశయంతీ శయనే శనైర్వచనమబ్రవీత్ ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ తరువాత సత్యవతి తగిన వేళలో ఋతుస్నాత అయిన తన కోడలిని శయ్యపై కూర్చుండబెడుతూ మెల్లగా ఇలా అన్నది. (1)
కౌసల్యే దేవరస్తేస్తి సోఽద్య త్వానుప్రవేక్ష్యతి ।
అప్రమత్తా ప్రతీక్షైనం నిశీథే హ్యాగమిష్యతి ॥ 2
కౌసల్యా! నీకొక బావ ఉన్నాడు. ఈరోజు ఆయన నీ దగ్గరకు గర్భాధానానికై వస్తాడు. సావధానంగా ఎదురుచూడు. అర్థరాత్రి వేళ ఇక్కడకు రాగలడు. (2)
వి: సం: గర్భధారణ సమయంలో స్త్రీ ఏ మగవానిని గూర్చి ఆలోచిస్తుందో అటువంటి లక్షణాలు గల బిడ్డకు జన్మనిస్తుంది. (నీల)
శ్వశ్వ్రాస్తద్ వచనం శ్రుత్వా శయానా శయనే శుభే ।
సా చింతయత్ తదా భీష్మమే అన్యాంశ్చ కురుపుంగవాన్ ॥ 3
అత్తగారి ఆ మాటను విని పవిత్రమైన ప్రక్కపై పరుండిన ఆ అంబిక మనస్సులో భీష్మునీ, ఇతర కురువంశశ్రేష్ఠులనూ తలపోసింది. (3)
తతోఽంబికాయాం ప్రథమం నియుక్తః సత్యవాగృషిః ।
దీప్యమానేషు దీపేషు శరణం ప్రవివేశ హ ॥ 4
ఆ తరువాథ అంతకుముందే అంబికయందు నియోగింపబడిన సత్యవచనుడైన ఆ వ్యాసుడు దీపాలు వెలుగుతుండగా ఇంటిలో ప్రవేశించాడు. (4)
తస్య కృష్ణస్య కపిలాం జటాం దీప్తే చ లోచనే ।
బభ్రూణి చైవ శ్మశ్రూణి దృష్ట్వా దేవీ న్యమీలయత్ ॥ 5
నల్లగా ఉన్న ఆ వ్యాసునీ, రాఘి రంగులో ఉన్న జటలనూ, వెలుగుతున్న కళ్ళనూ, కపిల వర్ణంలోని గడ్డం మీసాలను చూచి ఆంఎ కళ్ళు మూసికొన్నది. (5)
సంబభూవ తయా సార్థం మాతుః ప్రియచికీర్షయా ।
భయాత్ కాశిసుతా తం తు నాశక్నోదభివీక్షితుమ్ ॥ 6
తల్లి కోరిక తీర్చదలచి ఆమెతో వ్యాసుడు సంగమించాడు. భయం వలన అంబిక అతనిని చూడలేకపోయింది. (6)
తతో నిష్క్రాంతమాగమ్య మాతా పుత్రమువాచ హ ।
అప్యస్యా గుణవాన్ పుత్ర రాజపుత్రో భవిష్యతి ॥ 7
శయ్యాగారం నుండి బయటకు వచ్చిన వ్యాసుని "నాయానా! ఆమెకు గుణవంతుడైన రాజపుత్రుడు జన్మిస్తాడా?" అని అడిగింది. (7)
నిశమ్య తద్ వచో మాతుః వ్యాసః సత్యవతీసుతః ।
నాగాయుతసమప్రాణః విద్వాన్ రాజర్షిసత్తమః ॥ 8
మహాభాగో మహావీర్యః మహాబుద్ధిర్భవిష్యతి ।
తస్య చాపి శతం పుత్రాః భవిష్యంతి మహాత్మనః ॥ 9
తల్లి మాటలు విని సత్యవతీనందనుడైన వ్యాసుడిలా అన్నాడు - పదివేల ఏనుగుల బలంగలవాడూ, పండితుడూ, రాజర్షి శ్రేష్ఠుడూ, మహాభాగుడు, మహాపరాక్రమ వంతుడు, మహాబుద్ధి, అయిన కొడుకు పుడతాడు. ఆ మహాత్ముడికి కూడా వందమంది కొడుకులు పుడతారు. (8,9)
కిం తు మాతుః స వైగుణ్యాద్ అంధ ఏవ భవిష్యతి ।
తస్య తద్ వచనం శ్రుత్వా మాతా పుత్రమథాబ్రవీత్ ॥ 10
నాంధః కురూణాం నృపతిః అనురూపస్తపోధన ।
జ్ఞాతివంశస్య గోప్తారం పితౄణాం వంశవర్ధనమ్ ॥ 11
ద్వితీయం కురువంశస్య రాజానం దాతుమర్హసి ।
కానీ తల్లి దోషం వలన అతడు గ్రుడ్డివాడవుతాడు. వ్యాసుని ఆ మాటలు విని తల్లి కొడుకుతో మరలా ఇలా అన్నది - మహర్షీ! గ్రుడ్డివాడు కురురాజుగా తగినవాడు కాదు. దాయాదుల వంశాన్ని రక్షిస్తూ, వంశాన్ని అభివృద్ధి చేయగల వానిని మరొకనిని కురువంశరాజుగా ప్రసాదించాలి. (10,11 1/2)
స తథేతి ప్రతిజ్ఞాయ నిశ్చక్రామ మహాయశాః ॥ 12
అలాగే అని మాట ఇచ్చి మహాయశస్వి అయిన వ్యాసుడు నిష్క్రమించాడు. (12)
సాపి కాలేన కౌసల్యా సుషువేఽంధం తమాత్మజమ్ ।
పునరేవ తు సా దేవీ పరిభాష్య స్నుషాం తతః ॥ 13
ఋషిమావాహయత్ సత్యా యథాపూర్వమరిందమ ।
తతస్తేనైవ విధినా మహర్షిస్తామపద్యత ॥ 14
అంబాలికామథ్యాభ్యాగాద్ ఋషిం దృష్ట్వా చ సాపి తమ్ ।
వివర్ణా పాండుసంకాశా సమపద్యత భారత ॥ 15
ఆ అంబిక ప్రసవవేళ సమీపించగా గ్రుడ్డికొడుకును కన్నది. మరల సత్యవతి రెండవ కోడలితో మాటాడి ఒప్పించి ఇంతకు ముందు లాగానే వ్యాసమహర్షిని ఆహ్వానించింది. ఆ తరువాత అంతకుముందులాగానే వ్యాసుడు అంబాలిక దగ్గర చేరాడు. భారతా! ఆంఎ కూడా ఆ మహర్షిని చూచి తెల్లబోయింది. (13-15)
తాం భీతాం పాండుసంకాశాం విషణ్ణాం ప్రేక్ష్య భారత ।
వ్యాసః సత్యవతీపుత్రః ఇదం వచనమబ్రవీత్ ॥ 16
భారతా! భయపడి, తెల్లబోయి, విషాదంతో ఉన్న ఆమెతో సత్యవతీ సుతుడైన వ్యాసుడిలా అన్నాడు. (16)
యస్మాత్ పాండుత్వమాపన్నా విరూపం ప్రేక్ష్య మామిహ ।
తస్మాదేష సుతస్తే వై పాండురేవ భవిష్యతి ॥ 17
వికారంగా కనిపిస్తున్న నన్ను చూచి తెల్లబోయావు కాబట్టి నీకు పుట్టబోయే కొడుకు పాండువర్ణంతోనే ఉంటాడు. (17)
నామచాస్యైతదేవేహ భవిష్యతి శుభాననే ।
ఇత్యుక్త్వా స నిరక్రామద్ భగవానృషిసత్తమః ॥ 18
శుభాననా! అతని పేరు కూడా పాండుడే అవుతుంది. ఆ మాటలు చెప్పి పూజ్యుడైన ఆ ఋషిపుంగవుడు వెళ్ళిపోయాడు. (18)
తతో నిష్క్రాంతమాలోక్య సత్యా పుత్రమథాబ్రవీత్ ।
శశంస స పునర్మాత్రే టహ్స్య బాలస్య పాండుతామ్ ॥ 19
ఆపై బయటకు వచ్చిన కుమారుని చూచి సత్యవతి బిడ్డ గురించి అడిగింది. ఆయన మరల ఆ బాలుడు పాండురోగి అవుతాడని చెప్పాడు. (19)
తం మాతా పునరేవాన్యమ్ ఏకం పుత్రమయాచత ।
తథేతి స మహర్షిస్తాం మాతరం ప్రత్యభాషత ॥ 20
సత్యవతి మరల మరొక బిడ్డకోసం అభ్యర్థించింది. అలాగే అని యాసమహర్షి తల్లికి సమాధానమిచ్చాడు. (20)
తతః కుమారం సా దేవీ ప్రాప్తకాలమజీజనత్ ।
పాండుం లక్షణసంపన్నం దీప్యమానమివ శ్రియా ॥ 21
ఆ తరువాత అంబాలిక ప్రసవవేళ సమీపించగానే పాండువర్ణం గల కొడుకును కన్నది. దివ్యకాంతితో వెలిగిపోతున్నట్లు పాండుడు కనిపించాడు. (21)
యస్య పుత్రా మహేష్వాసాః జజ్ఞిరే పంచపాండవాః ।
ఋతుకాలే తతో జ్యేష్ఠాం వధూం తస్మై న్యయోజయత్ ॥ 22
ఆ పాండురాజు కొడుకులు అయిదుగురూ మేటి విలుకాండ్రయ్యారు. ఆ తరువాత సత్యవతి ఋతుకాలంలో పెద్దకోడలిని వ్యాససంగమానికై నియోగించింది. (22)
సా తు రూపంచ గంధంచ మహర్షేః ప్రవిచింత్య తమ్ ।
నాకరోద్ వచనం దేవ్యాః భయాత్ సురసుతోపమా ॥ 23
దేవకాంతవంటి ఆమె ఆ మహర్షి రూపాన్నీ, శరీరవాసననూ, తలచుకొని బెదిరిపోయి అత్తగారి మాటను పాటించలేదు. (23)
తతః స్పైర్భూషణైర్దాసీం భూషయిత్వాప్సరోపమామ్ ।
ప్రేషయామాస కృష్ణాయ తతః కాశిపతేః సుతా ॥ 24
ఆపై అంబిక తన దాసికి తన నగలనన్నింటినీ ధరింపజేసి అచ్చరగా తీర్చి వ్యాసుని దగ్గరకు పంపింది. (24)
సా తమృషిమనుప్రాప్తం ప్రత్యుద్గమ్యాభివాద్య చ ।
సంవివేశాభ్యనుజ్ఞాతా సత్కృత్యోపచచార హ ॥ 25
ఆమె తన చెంతకు వచ్చిన మహర్షిని ఎదురేగి, నమస్కరించి ఆయన అనుమతితో శయ్యకు చేరి సత్కృతులు నెరిపి ఉపచారాలు చేసింది. (25)
కామోపభోగేన రహః తస్యాం తుష్టిమగాదృషిః ।
తయా సహోషితో రాజన్ మహర్షిః సంశితవ్రతః ॥ 26
ఉత్తిష్ఠన్నబ్రవీదేనామ్ అభుజిష్యా భవిష్యసి ।
అయం చ తే శుభే గర్భః శ్రేయానుదరమాగతః ।
ధర్మాత్మా భవితా లోకే సర్వబుద్ధిమతాం వరః ॥ 27
మహర్షి ఏకాంతంలో ఆమెను కలిసి కామోపభోగంతో సంతుష్టిని పొందాడు. రాజా! తీవ్రవ్రతధారి అయిన ఆ వ్యాసమహర్షి ఆమెతో పరుండి లేచాడు. శయ్యనుండి లేస్తూ ఆమెతో ఇలా అన్నాడు - శుభాంగనా! ఇకపై నీవు దాసిని కావు. నీ కడుపున శ్రేష్ఠుడైన కొడుకు పుట్టబోతున్నాడు. అతడు పండితశ్రేష్ఠుడూ, ధర్మస్వరూపుడూ కాగలడు. (26,27)
స జజ్ఞే విదురో నామ కృష్ణద్వైపాయనాత్మజః ।
ధృతరాష్ట్రస్య వై భ్రాతా పాండోశ్చైవ మహాత్మనః ॥ 28
ఆ బాలుడే విదురుడు. కృష్ణద్వైపాయనుని కొడుకు. తండ్రి ఒక్కడే కాబట్టి ఆ విదురుడు ధృతరాష్ట్రపాండు రాజులకు తమ్ముడయ్యాడు. (28)
ధర్మో విదురరూపేణ శాపాత్ తస్య మహాత్మనః ।
మాండవ్యస్యార్థతత్త్వజ్ఞః కామక్రోధవివర్జితః ॥ 29
మహాత్ముడైన మాండవ్యుని శాపం వలన ధర్ముడే విదురుడుగా పుట్టాడు. ఆయన అర్థతత్త్వం తెలిసినవాడూ, కామక్రోధాలను విడిచినవాడూ. (29)
కృష్ణద్వైపాయనోఽప్యేతత్ సత్యవత్వై న్యవేదయత్ ।
ప్రలంభమాత్మనశ్చైవ శూద్రాయాః పుత్రజన్మ చ ॥ 30
కృష్ణద్వైపాయనుడు ఇది కూడా సత్యవతికి చెప్పాడు. అంబిక తనను మోసగిమ్చటాన్ని, దాసికి కొడుకు పుట్టబోవటాన్ని వివరించాడు. (30)
స ధర్మస్యానృణో భూత్వా పునర్మాత్రా సమ్యేత్య చ ।
తస్మై గర్భం సమావేద్య తత్రైవాంతరధీయత ॥ 31
ఈ విధంగా వ్యాసుడు తల్లిఋణం తీర్చికొని మరల ఆమెను కలిసి గర్భవృత్తాంతాన్ని ఆమెకు చెప్పి అక్కడే మాయమయ్యాడు. (31)
ఏతే విచిత్రవీర్యస్య క్షేత్రే ద్వైపాయనాదపి ।
జజ్ఞిరే దేవగర్భాభాః కురువంశవివర్ధనాః ॥ 32
విచిత్ర వీర్యుని భార్యలయందు కృష్ణద్వైపాయనుడు అనుగ్రహించిన ముగ్గురు కొడుకులూ, దేవకుమారులవలె కురువంశవివర్ధకులయ్యారు. (32)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి విచిత్రవీర్యసుతోత్పత్తౌ పంచాధికశతతమోఽధ్యాయః ॥ 105 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున విచిత్రవీర్యసుతోత్పత్తి అను నూట అయిదవ అధ్యాయము. (105)