104. నూట నాలుగవ అధ్యాయము
వ్యాసుడు సత్యవతి ఆజ్ఞను పాటించుట కంగీకరించుట.
భీష్మ ఉవాచ
పునర్భరతవంశస్య హేతుం సంతానవృద్ధయే ।
వక్ష్యామి నియతం మాతః తన్మే నిగదతః శృణు ॥ 1
బ్రాహ్మణో గుణవాన్ కశ్చిద్ ధనేనోపనిమంత్య్రతామ్ ।
విచిత్రవీర్యక్షేత్రేషు యః సముత్పాదయేత్ ప్రజాః ॥ 2
భీష్ముడిలా అన్నాడు. అమ్మా! భరతవంశంలో మరల సంతానవృద్ధికి ఉపాయాన్ని చెపుతాను. నా మాట విను. గుణవంతుడయిన బ్రాహ్మణుని ఎవనినైనా ధనమిచ్చి నియమించు. ఆయన విచిత్రవీర్యుని భార్యలయందు సంతానాన్ని కంటాడు. (1,2)
వైశంపాయన ఉవాచ
తతః సత్యవతీ భీష్మం వాచా సంసజ్జమానయా ।
విహసంతీవ సవ్రీడమ్ ఇదం వచనమబ్రవీత్ ॥ 3
వైశంపాయనుడిలా అన్నాడు. అప్పుడు సత్యవతి నవ్వుతున్నట్లుగా, సిగ్గుపడుతూ మాటలు కూర్చుకొంటూ భీష్మునితో ఇలా అన్నది. ఆ మాటలలో కొంత సంకోచం కూడా ఉన్నది. (3)
సత్యమేతన్మహాబాహో యథా వదసి భారత ।
విశ్వాసాత్ తేప్రవక్ష్యామి సంతానాయ కులస్య నః ॥ 4
మహాబాహూ! భారతా! నీవు చెప్పినది సత్యమే. నీ మీది నమ్మకంతో మన వంశాభివృద్ధి కోసం నీకొక మాట చెప్తున్నాను. (4)
న తే శక్యమనాఖ్యాతుమ్ ఆపద్ధర్మం తథావిధమ్ ।
త్వమేవ నః కులే ధర్మః త్వం సత్యం త్వం పరాగతిః ॥ 5
అటువంటి ఆపద్ధర్మాన్ని పరిశీలించి ఆ మాట నీకు చెప్పక నేనుండలేను. నీవే మన వంశంలో ధర్మాత్ముడవు. నీవే సత్యస్వరూపుడవు, ఉత్తమగతివి కూడా. (5)
తస్మాన్నిశమ్య సత్యం మే కురుష్వ యదనంతరమ్ ।
(యస్తు రాజా వసుర్నామ శ్రుతస్తే భరతర్షభ ।
తస్య శుక్రాదహం మత్స్యాద్ ధృతా కుక్షౌ పురా కిల ।
మాతరం మే జలాద్ ధృత్వా దాశః పరమధర్మవిత్ ।
మాం తు స్వగృహమానీయ దుహితృత్వే హ్యకల్పయత్ ॥)
ధర్మయుక్తస్య ధర్మార్థం పితురాసీత్ తరీ మమ ॥ 6
కాబట్టి నా మాట విని ఆపై కర్తవ్యాన్ని నిర్ణయించుకో భరతశ్రేష్ఠా! వసుమహారాజు పేరు నీవు విని ఉంటావు. పూర్వం ఆ మహారాజు శుక్రాన్ని ఒక చేప గర్భంలో భరిస్తే నేను జన్మించాను. పరమధర్మాత్ముడయిన దాశరాజు మా అమ్మను నీటి నుండి పట్టి నన్ను బయటకు తీశాడు. నన్ను ఇంటికి తీసికొనిపోయి కూతురుగా చేసికొన్నాడు. ఆ ధర్మాత్ముని నౌకనే నేను ధర్మార్థం (ఉచితంగా) నడుపుతుండేదాన్ని. (6)
సా కదాచిదహం తత్ర గతా ప్రథమయౌవనమ్ ।
అథ ధర్మవిదాం శ్రేష్ఠః పరమర్షిః పరాశరః ॥ 7
ఆజగామ తరీం ధీమాన్ తరిష్యన్ యమునాం నదీమ్ ।
స తార్యమాణో యమునాం మాముపేత్యాబ్రవీత్ తదా ॥ 8
సాంత్వపూర్వం మునిశ్రేష్ఠః కామార్తో మధురం వచః ।
ఉక్తం జన్మ కులం మహ్యమ్ అస్మి దాశసుతేత్యహమ్ ॥ 9
అప్పుడే నాకు యౌవనమారంభమైంది. ఒక రోజు నావపై ఉన్నాను. ఆ సమయంలో ధర్మవేత్తలలో శ్రేష్ఠుడూ, ధీమంతుడూ, మహర్షి అయిన పరాశరుడు యమునా నదిని దాటటానికి పడవనెక్కాడు. నేను యమునను దాటిస్తుండగా కామార్తుడైన ఆమునిశ్రేష్ఠుడు నా దగ్గరకు వచ్చి మధురవచనాలతో తన జన్మనూ, వంశాన్నీ తెలిపాడు. నేను దాశసుతను అని నేను తెలిపాను. (7-9)
తమహం శాపభీతా చ పితుర్భీతా చ బారత ।
వరైరసులభైరుక్తా న ప్రత్యాఖ్యాతుముత్సహే ॥ 10
భారతా! తండ్రి భయం ఒక ప్రక్క, మహర్షి శాపభయం మరొక ప్రక్క. అప్పుడు ఆ మహర్షి దుర్లభమైన వరాలనిచ్చి నన్ను ప్రోత్సాహించాడు. నేను తిరస్కరించలేకపోయాను. (10)
అభిభూయ స మాం బాలాం తేజసా వశమానయత్ ।
తమసా లోకమావృత్య నౌగతామేవ భారత ॥ 11
మత్స్యగంధో మహానాసీత్ పురా మమ జుగుప్సితః ।
తమపాస్య శుబం గంధమ్ ఇమం ప్రాదాత్ స మే మునిః ॥ 12
నేను ఇష్టపడకపోయినా అబలనైన నన్ను ఆ మహర్షి తన తేజస్సుతో లొంగదీసి కొన్నాడు. లోకాన్నంతా చీకటిలో ముంచి నావలోనే నన్ను కాలిశాడు. అంతకు ముందు నా దగ్గర చేపలకంపు కొడుతుండేది. ఆముని దానిని పొగొట్టి నాకీ దివ్యపరిమళాన్ని ఇచ్చాడు. (11,12)
తతో మామాహ స మునిః గర్భముత్సృజ్య మామకమ్ ।
ద్వీపేఽస్యా ఏవ సరితః కన్యైవ త్వం భవిష్యసి ॥ 13
తరువాత ఆముని - నీవే యమునా ద్వీపంలోనే నా కారణంగా కలిగిన గర్భాన్ని వదలిపెట్టి మరలా కన్యగానే మిగిలిపోతావని అన్నాడు. (13)
పారాశర్యో మహాయోగీ స బభూవ మహానృషిః ।
కన్యాపుత్రో మమ పురా ద్వైపాయన ఇతి శ్రుతః ॥ 14
ఆగర్భం నుండి మహాయోగీ, మహాఋషి అయిన పారాశర్యుడు జన్మించాడు. నేను కన్యగా ఉన్నప్పుడే పుట్టిన ఆయనే ద్వైపాయనుడు. (వ్యాసుడు) (14)
యో వ్యస్య వేదాంశ్చతురః తపసా భగవానృషిః ।
లోకే వ్యాసత్వమాపేదే కార్ణ్యాత్ కృష్ణత్వమేవ చ ॥ 15
పూజ్యుడైన ఆ మహర్షియే తపశ్శక్తితో నాలుగు వేదాలనూ విభజించి లోకంలో వ్యాసత్వాన్ని పొందాడు. నల్లగా ఉన్నాడు కాబట్టి కృష్ణత్వాన్ని కూడా పొందాడు. (15)
సత్యవాదీ శమపరః తపస్వీ దగ్ధకిల్బిషః ।
సముత్పన్నః స తు మహాన్ సహ పిత్రా తతో గతః ॥ 16
సత్యవాదీ, శమాసక్తుడూ, తపస్వీ, పాపరహితుడూ అయిన ఆ మహాత్ముడు పుట్టగానే తండ్రితో ఫాటు వెళ్ళిపోయాడు. (16)
స నియుక్తో మయా వ్యక్తం త్వయా చాప్రతిమద్యుతిః ।
భ్రాతుః క్షేత్రేషు కళ్యాణమ్ అపత్యం జనయిష్యతి ॥ 17
సాటిలేని వెలుగులు గల ఆయనను నేనూ, నీవూ పట్టుబట్టి నియమిస్తే ఆయన విచిత్రవీర్యుని భార్యలలో మంచిసంతానాన్ని కనగలడు. (17)
స హి మాముక్తవాంస్తత్ర స్మరేః కృచ్ఛ్రేషు మామితి ।
తం స్మరిష్యే మహాబాహో యది భీష్మ త్వమిచ్ఛసి ॥ 18
ఆపద వచ్చినపుడు నన్ను తలచుకొమ్మని ఆ పారాశర్యుడు అక్కడ నాతో పలికాడు. మహాబాహూ! నీకిష్టమయితే ఆయనను తలచుకొంటాను. (18)
తవ హ్యనుమతే భీష్మ నియతం స మహాతపాః ।
విచిత్రవీర్యక్షేత్రేషు పుత్రానుత్పాదయిష్యతి ॥ 19
భీష్మా! నీకిష్టమయితే ఆ మహాతపస్వి సరిగా విచిత్రవీర్యుని భార్యలకు సంతానాన్ని కలిగిస్తాడు. (19)
వైశంపాయన ఉవాచ
మహర్షేః కీర్తనే తస్య భీష్మః ప్రాంజలిరబ్రవీత్ ।
ధర్మమర్థం చ కామం చ త్రీనేతాన్ యోఽనుపశ్యతి ॥ 20
అర్థమర్థానుబంధం చ ధర్మం ధర్మానుబంధనమ్ ।
కామం కామానుబంధంచ విపరీతాన్ పృథక్ పృథక్ ॥ 21
యో విచింత్య ధియా ధీరః వ్యవస్యతి స బుద్ధిమాన్ ।
తదిదం ధర్మయుక్తం చ హితం చైవ కులస్య నః ॥ 22
ఉక్తం భవత్యా యచ్ఛ్రేయః తన్మహ్యం రోచతే భృశమ్ ।
వైశంపాయనుడిలా అన్నాడు. మహర్షి గురించి వినగానే భీష్ముడు చేతులు జోడించి ఇలా ఆన్నాడు - ధర్మం, అర్థం, కామం - ఈ మూడింటిని గురించి పదే పదే ఆలోచించి ధర్మాన్నీ, దాని అనుబంధ ఫలితాన్నీ; అర్థాన్నీ, దాని అనుబంధ ఫలితాన్నీ; అలాగే కామాన్నీ దాని అనుబంధఫలితాన్నీ; విపరీత ఫలితాలనూ వేరు వేరుగా ఆళోచించి నిశ్చయించే వాడే తలివైనవాడు, ధీరుడు. నీవు చెప్పిన మాట ధర్మసహితమైనదీ, మన వంశానికి హితాన్ని కల్గించ గలది కూడా. శ్రేయస్కరమయిన ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. (20- 22 1/2)
వైశంపాయన ఉవాచ
తతస్తస్మిన్ ప్రతిజ్ఞాతే భీష్మేణ కురునందన ॥ 23
కృష్ణద్వైపాయనం కాలీ చింతయామాస వై మునిమ్ ।
స వేదాన్ విబ్రువన్ ధీమాన్ మాతుర్విజ్ఞాయ చింతితమ్ ॥ 24
ప్రాదుర్బభూవావిదితః క్షణేన కురునందన ।
తస్మై పూజాం తతః కృత్వా సుతాయ విధిపూర్వకమ్ ॥ 25
షరిష్వజ్య చ బాహుభ్యాం ప్రస్రవైరభ్యషించత ।
ముమోచ బాష్పం దాశేయీ పుత్రం దృష్ట్వా చిరస్య తు ॥ 26
వైశంపాయనుడిలా అన్నాడు. కురునందనా! భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణద్వైపాయన మునిని స్మరించింది. తల్లి తనను తలచినదని గ్రహించి ఆ బుద్ధిమంతుడు క్షణంలో వేదాలు వల్లిస్తూ ప్రత్యక్షమయ్యాడు. సత్యవతి తన కుమారుని విధిపూర్వకంగా అర్చించి, బాహూవులతో కౌగిలించి, స్రవిస్తున్న పాలతో ఆయనను అభిషేకించింది. ఆ సత్యవతి చాలా కాలానికి కుమారుని చూచి కన్నీరు నింపుకొంది. (23-26)
తామద్భిః పరిషిచ్యార్తాం మహర్షిరభివాద్య చ ।
మాతరం పుర్వజః పుత్రః వ్యాసో వచనమబ్రవీత్ ॥ 27
సత్యవతి పెద్దకొడుకు వ్యాసుడు కమండలుజలాన్ని కలతపడిన ఆమెపై చల్లి, నమస్కరించి పలికాడు. (27)
భవత్యా యదభిప్రేతం తదహం కర్తుమాగతః ।
శాధి మాం ధర్మతత్త్వజ్ఞే కరవాణి ప్రియం తవ ॥ 28
ధర్మతత్త్వమెరిగిన తల్లీ! నీ కోరికను నెరవేర్చటానికి నేను వచ్చాను. నన్ను ఆదేశించు. నీకు ఏవిధంగా ప్రీతిని కల్గించాలి? (28)
తస్మై పూజాం తతోఽకార్షీత్ పురోధాః పరమర్షయే ।
స చ తాం ప్రతిజగ్రాహ విధివన్మంత్రపూర్వకమ్ ॥ 29
ఆ తారువాత పురోహితుడు ఆ పరమమునికి మంత్ర పూర్వకంగా శాస్త్రోక్తరీతిలో పూజలు జరిపాడు. వ్యాసుడు వాటిని స్వీకరించాడు. (29)
పూజితో మంత్రపూర్వం తు విధివత్ ప్రీతిమాప సః ।
తమాసనగతం మాతా పృష్ట్వా కుశలమవ్యయమ్ ॥ 30
సత్యవత్యథ వీక్ష్యైనమ్ ఉవాచేదమనంతరమ్ ।
శాస్త్రోక్తంగా, సమంత్రకంగా పూజలంది ఆ వ్యాసుడు ఆనందించాడు. ఆసనస్థుడైన ఆయనను సత్యవతి కుశలక్షేమసమాచారాన్ని అడిగి అతనివైపు చూస్తూ ఇలా పలికింది. (30 1/2)
మాతాపిత్రోః ప్రజాయంతే పుత్రాః సాధారణాః కవే ॥ 31
తేషాం పితా యథా స్వామీ తథా మాతా న సంశయః ।
విధానవిహితః సత్యం యథా మే ప్రథమః సుతః ॥ 32
విచిత్రవీర్యో బ్రహ్మర్షే తథా మేఽవరజః సుతః ।
యథైవ పితృతో భీష్మః తథా త్వమపి మాతృతః ॥ 33
భ్రాతా విచిత్రవీర్యస్య యథా వా పుత్ర మన్యసే ।
అయం శాంతనవః సత్యం పాలయన్ సత్యవిక్రమః ॥ 34
పండితా! తల్లిదండ్రులకు సాధారణంగా కొడుకులు పుడతారు. వారికి తండ్రి యజమాని, తల్లి కూడా అటువంటిదే సందేహం లేదు. బ్రహ్మర్షీ! విధివిధానాన్ని అనుసరించి నీవు నా పెద్ద కొడుకువు. విచిత్ర వీర్యుడు ఆ రీతిగానే నా చిన్నకొడుకు. తండ్రిని బట్టి బీష్ముడు అతని (విచిత్ర వీర్యుని) సోదరుడయినట్టు. తల్లిని బట్టి నీవు కుడా సోదరుడవే. నీవేమనుకొంటున్నావో కానీ నా అభిప్రాయమిదే. సత్యవిక్రముడైన ఈ భీష్ముడు సత్యాన్ని పాటిస్తున్నాడు. (31-34)
బుద్ధిం న కురుతేఽపత్యే తథా రాజ్యానుశాసనే ।
స త్వం వ్యపేక్షయా భ్రాతుః సంతానాయ కులస్య చ ॥ 35
భీష్మస్య చాస్య వచనాత్ నియోగాచ్చ మమానఘ ।
అనుక్రోశాచ్చ భూతానాం సర్వేషాం రక్షణాయ చ ॥ 36
ఆనృశంస్యాచ్చ యద్ బ్రూయాం తచ్ఛ్రుత్వా కర్తుమర్హసి ।
యవీయసస్తవ భ్రాతుః భర్యే సురసుతోపమే ॥ 37
రూపయౌవనసంపన్నే పుత్రకామే చ ధర్మతః ।
తయోరుత్పాదయాపత్యం సమర్థోఽహ్యసి పుత్రక ॥ 38
అనురూపం కులస్యాస్య సంతత్యాః ప్రసవస్య చ ।
రాజ్యపాలనయందు కానీ సంతానాన్ని పొందటంలో కానీ భీష్మునకు ఆసక్తి లేదు. కాబట్టి నీ సోదరుని పారలౌకిక హితాన్ని, వంశపరంపరనూ విచారించి ఈ బీష్ముని మాటమేరకూ, నా ఆదేశం మేరకూ, సర్వప్రాణులపై దయ ఉంచి వాఠి సంరక్షణ కొరకూ కరుణతో నేను చెప్పినది విని నీవు చేయాలి. నీవు అనఘుడవూ, కోమల హృదయుడవూ. నీ చిన్న తమ్ముని భార్యలు దేవకాంతల వంటివారు. రూపయౌవన సంపన్నలు. ధర్మబద్ధంగా సంతానాన్ని అభిలషిస్తున్నవారు. వారి యందు బిడ్డలను కను. నాయనా! ఈ వంశరక్షణకూ, అభివృద్ధికి అనురూపమైన సంతానాన్ని ఇవ్వటానికి నీవు సమర్థుడవు. (35 - 38 1/2)
వ్యాస ఉవాచ
వేత్థ ధర్మం సత్యవతి పరం చాపరమేవ చ ॥ 39
తథా తవ మహాప్రాజ్ఞే ధర్మే ప్రణిహితా మతిః ।
తస్మాదహం త్వన్నియోగాద్ ధర్మముద్దిశ్య కారణమ్ ॥ 40
ఈప్సితం తే కరిష్యామి దృష్టం హ్యేతత్ సనాతనమ్ ।
భ్రాతుః పుత్రాన్ ప్రదాస్యామి మిత్రావరుణయోః సమాన్ ॥ 41
వ్యాసుడిలా అన్నాడు. సత్యవతీ! నీకు లౌకిక - అలౌకిక ధర్మాలు తెలుసు. మహాప్రాజ్ఞీ! నీ బుద్ధి కూడా ధర్మనిబద్ధం. కాబట్టి నేను ధర్మకారణంగా నీ ఆదేశాన్ని మన్నించి నీ కోరిక తీరుస్తాను. ఇది సనాతమైన ధర్మమే. సోదరుని కొరకు మిత్రావరుణలతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను. (39-41)
వ్రతం చరేతాం తే దేవ్యౌ నిర్దిష్టమిహ యన్మయా ।
సంవత్సరం యథాన్యాయం తతః శుద్ధే భవిష్యతః ॥ 42
న హి మామవ్రతోపేతా ఉపేయాత్ కాచిదంగనా ।
ఆ రాణులిద్దరూ నేను చెప్పినట్టు సంవత్సరం పాటు నియమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు పరిశుద్ధలు అవుతారు. వ్రతపాలన చేయని ఏ స్త్రీ కూడా నా దగ్గరకు రాలేదు. (42)
సత్యవత్యువాచ
సద్యో యదా ప్రపద్యేతే దేవ్యౌ గర్భం తథా కురు ॥ 43
సత్యవతి ఇలా అన్నది. ఏం చేస్తే ఆ రాణులు వెంటనే గర్భవతులు కాగలరో ఆ ప్రకారం చెయ్యి. (43)
అ రాజకేషు రాష్ట్రేషు ప్రజానాథా వినశ్యతి ।
నశ్యంతి చ క్రియాః సర్వాః నాస్తి వృష్టిర్న దేవతా ॥ 44
రాష్ట్రంలో రాజు లేకపోతే ప్రజలు అనాథలై నశిస్తారు. ధర్మార్థమయిన క్రియలన్నీ నశిస్తాయి. వానలు పడవు. దేవతానుగ్రహముండదు. (44)
కథం చారాజకం రాష్ట్రం శక్యం ధారయితుం ప్రభో ।
తస్మాద్ గర్భం సమాధత్స్వ భీష్మః సంవర్ధయిష్యతి ॥ 45
ప్రభూ! అరాజకంగా రాష్ట్రాన్ని పాలించటం కష్టం. కాబట్టి నీవు గర్భాధానం చేయి. బీష్ముడే పెంచి పోషిస్తాడు. (45)
వ్యాస ఉవాచ
యది పుత్రః ప్రదాతవ్యః మయా భ్రాతురకాలికః ।
విరూపతాం మే సహతాం తయోరేతత్ పరం వ్రతమ్ ॥ 46
వ్యాసుడిలా అన్నాడు. సోదరునకు వ్యవధి లేకుండా ఇప్పుడే పుత్రుని ప్రసాదించాలంటే ఆ రాణులు నా విరూపతను సహించగలగాలి. వారికి ఇది ప్రధానమైన వ్రతం. (46)
యది మే సహతే గంధం రూపం వేషం తథా వపుః ।
అద్యైవ గర్భం కౌసల్యా విశిష్టం ప్రతిపద్యతామ్ ॥ 47
నా శారీరగంధాన్నీ, రూపాన్నీ, వేషాన్నీ, శరీరాన్నీ భరించగలిగితే అంబిక నేడే ఉత్తమ గర్భాన్ని పొందవచ్చు. (47)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా మహాతేజాః వ్యాసః సత్యవతీం తదా ।
శయనే సా చ కౌసల్యా శుచివస్త్రా హ్యలంకృతా ॥ 48
సమాగమనమాకాంక్షేద్ ఇతి సోంతర్హితో మునిః ।
తతోఽభిగమ్య సా దేవీ స్నుషాం రహసి సంగతామ్ ॥ 49
ధర్మమర్థసమాయుక్తమ్ ఉవాచ వచనం హితమ్ ।
కౌసల్యే ధర్మతంత్రం త్వాం యద్ బ్రవీమి నిబోధ తత్ ॥ 50
వైశంపాయనుడిలా అన్నాడు. మహాతేజోమూర్తి అయిన వ్యాసుడు సత్యవతితో అలా పలికి మరల "ఆ కౌసల్యను శుభ్రవస్త్రాలు ధరించి, అలంకరించుకొని శయ్యపై కలుసుకొనేందుకు ఎదురుచూడ" మను అని చెప్పి అంతర్ధానమయ్యాడు. తరువాత సత్యవతి ఏకాంతంగా కోడలిని సమీపించి ధర్మార్థయుక్తమై, హితకరమైన మాటను చెప్పింది ఇలా - కౌసల్యా! ధర్మసంగతమయిన మాటను చెప్పబోతున్నాను. జాగరూకతతో విను. (48-50)
భరతానాం సముచ్ఛేదః వ్యక్తం మద్భాగ్యసంక్షయాత్ ।
వ్యథితాం మాం చ సంప్రేక్ష్య పితృవంశం చ పీడితమ్ ॥ 51
భీష్మో బుద్ధిమాదాన్మహ్యం కులస్యాస్య వివృద్ధయే ।
సా చ బుద్ధిస్త్వయ్యధీనా పుత్రి ప్రాపయ మాం తథా ॥ 52
నా భాగ్యం నశించి భరతవంశ మిప్పుడు విచ్ఛిన్నం కాబోతోంది. అది స్పష్టంగా కనిపిస్తున్నదే. నశిస్తున్న పితృవంశాన్నీ, బాధపడుతున్న నన్నూ చూచి భీష్ముడు వంశాభివృద్ధి కోసం నాకొక ఆలోచన చెప్పాడు. అది నెరవేరటం నీ చేతిలో ఉంది. వత్సా! నన్ను ఆ స్థితికి తీసికోనిపో. (51,52)
నష్టం చ భారతం వంశం పునరేవ సముద్ధర ।
పుత్రం జనయ సుశ్రోణి దేవరాజసమప్రభమ్ ॥ 53
స హి రాజ్యధురం గుర్వీమ్ ఉద్వక్ష్యతి కులస్య నః ।
నశించిన భారతవంశాన్ని మరల సముద్ధరించు.సుశ్రోణి! దేవేంద్రుని వంటి బిడ్డను కను. వాడు మన వంశానికి చెందిన ఈ మహారాజ్యభారాన్ని వహించగలుగుతాడు. (53)
సా ధర్మతోఽనునీయైనాం కథంచిద్ ధర్మచారిణీమ్ ।
భోజయామాస విప్రాంశ్చ దేవర్షీనతిథీంస్తదా ॥ 54
సత్యవతి ధర్మచారిణి అయిన అంబికను, ధర్మాన్ని ముందుంచుకొనియే ఎలాగో ఒప్పించి విప్రులనూ, దేవర్షులనూ, అతిథులనూ భోజనంతో తృప్తి పరచింది. (54)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సత్యవత్యుపదేశే చతురధికశతతమోఽధ్యాయః ॥ 104 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున సత్యవత్యుపదేశమను నూటనాలుగవ అధ్యాయము. (104)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలతో కలిపి మొత్తం 56 శ్లోకాలు)