100. నూరవ అధ్యాయము

సత్యవతీలాభోపాఖ్యానము (భీష్మప్రతిజ్ఞ).

వైశంపాయన ఉవాచ
స రాజా శామ్తనుర్ధీమాన్ దేవరాజర్షిసత్కృతః ।
ధర్మాత్మా సర్వలోకేషు సత్యవాగితి విశ్రుతః ॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - శాంతనుమహారాజు బుద్ధిమంతుడు. దేవర్షులు, రాజర్షులు అతనిని సత్కరించేవారు. ధర్మస్వరూపుడు. మాట తప్పడని లోకంలో కీర్తినందినవాడు. (1)
దమో దానం క్షమా బుద్ధిః హ్రీర్ధృతిస్తేజ ఉత్తమమ్ ।
నిత్యాన్యాసన్ మహాసత్త్వే శంతనౌ పురుషర్షభౌ ॥ 2
పురుషశ్రేష్ఠుడూ, సత్త్వసంపన్నుడూ అయిన శాంతనునిలో దమమూ, దానగుణమూ, ఓర్పు, బుద్ధి, బిడియమూ, ధైర్యమూ, ఉత్తమతేజస్సు ఉండేవి. (2)
ఏవం స గుణసంపన్నః ధర్మార్థకుశలో నృపః ।
ఆసీద్ భరతవంశస్య గోప్తా సర్వజనస్య చ ॥ 3
ఈ విధంగా సద్గుణ సంపన్నుడై, ధర్మార్థ నైపుణ్యం గల ఆ శాంతనుమహారాజు భరతవంశానికీ, సమస్త ప్రజలకూ రక్షకుడుగా ఉండేవాడు. (3)
కంబుగ్రీవః పృథువ్యంసః మత్తవారణవిక్రమః ।
అన్వితః పరిపూర్ణార్థైః సర్వైర్నృపతిలక్షణైః ॥ 4
శంఖం వంటి మెడ, విశాలమైన ఎగు భుజాలు, మదపుటేనుగు వంటి నడక గలిగి సార్థకమైన ఉత్తమ రాజలక్షణాలు గలవాడు శాంతనుడు. (4)
తస్య కీర్తిమతో వృత్తమ్ అవేక్ష్య సతతం నరాః ।
ధర్మ ఏవ పరః కామాద్ అర్థాచ్చేతి వ్యవస్థితాః ॥ 5
కీర్తిమంతుడైన ఆ రాజు నడవడిని చూచి ప్రజలంతా అర్థకామాలకన్న ధర్మమే ఉన్నతమైనదని నిశ్చయించుకొనేవారు. (5)
ఏతాన్యాసన్ మహాసత్త్వే శాంతనౌ పురుషర్షభే ।
న చాస్య సదృశః కశ్చిత్ ధర్మతః పార్థివోఽభవత్ ॥ 6
పురుష శ్రేష్ఠుడైన ఆ శాంతనునిలో సకలసద్గుణాలూ ఉన్నాయి. ధర్మవిషయంలో ఆయనకు సాటిరాగల రాజు మరొక్కడు లేడు. (6)
వర్తమానం హి ధర్మేషు సర్వధర్మభృతాం వరమ్ ।
తం మహీపా మహీపాలం రాజరాజ్యేఽభ్యషేచయన్ ॥ 7
ధర్మవేత్తలలో అగ్రగణ్యుడై ధర్మాత్ముడై ఉన్న ఆయనను రాజులందరూ రాజరాజుగా అభిషిక్తుని చేశారు. (7)
వీతశోకభయాబాధాః సుఖస్వప్ననిబోధనాః ।
పతిం భారత గోప్తారం సమపద్యంత భూమిపాః ॥ 8
భారతా! రాజులంతా శాంతనుని తమ రాజుగా, రక్షకుడుగా నియమించుకొనిన తర్వాత ఎవ్వరిలోనూ శోకంగానీ, భయంగానీ, సంతాపం గానీ లేకుండా పోయాయి. అందరూ సుఖంగా నిద్రించి సుఖంగా మేల్కొనేవారు. (8)
తేన కీర్తిమతా శిష్టాః శక్రప్రతిమతేజసా ।
యజ్ఞదానక్రియాశీలాః సమపద్యంత భూమిపాః ॥ 9
ఇంద్రతేజస్సు గలిగి కీర్తిమంతుడైన ఆ శాంతనుని అనుశాసనంలో ఇతర రాజులు కూడా యజ్ఞ దానక్రియలలో తమంతతాముగా ప్రవర్తించేవారు. (9)
శాంతనుప్రముఖైర్గుప్తే లోకే నృపతిభిస్తదా ।
నియమాత్ సర్వవర్ణానాం ధర్మోత్తరమవర్తత ॥ 10
శాంతనుడు మొదలుగా గల రాజుల ఏలుబడిలో సర్వవర్ణాలవారూ నియమబద్ధంగా ధర్మాన్నే ప్రధానంగా భావించేవారు. (10)
బ్రహ్మ పర్యచరత్ క్షత్రం విశః క్షత్రమనువ్రతాః ।
బ్రహ్మక్షత్రానురక్తాశ్చ శూద్రాః పర్యచరన్ విశః ॥ 11
క్షత్రియులు బ్రాహ్మణులను సేవించేవారు. వైశ్యులు క్షత్రియులను అనుసరించి నడిచేవారు. శూద్రులు బ్రాహ్మణ క్షత్రియులందు అనురాగం కలిగి వైశ్యులను సేవించేవారు. (11)
స హాస్తినపురే రమ్యే కురూణాం పుటభేదనే ।
వసన్ సాగరపర్యంతామ్ అన్వశాసద్ వసుంధరామ్ ॥ 12
ఆ శాంతనుమహారాజు కురువంశస్థులకు చెందిన అందమైన ఆ హస్తినాపురాన్ని రాజధానిగా చేసి నివసిస్తూ, సముద్రపర్యంతం వ్యాపించి ఉన్న భూమిని పరిపాలించాడు. (12)
స దేవరాజసదృశః ధర్మజ్ఞః సత్యవాగృజుః ।
దానధర్మతపోయోగాత్ శ్రియా పరమయా యుతః ॥ 13
ఆ శాంతనుడు దేవేంద్రునితో సమానమైనవాడు, ధర్మవేత్త, సత్యవచనుడూ, ఋజువర్తనుడూ అయి దానధర్మతపస్సుల కలయికతో మహోజ్జ్వలకాంతితో శోభించే వాడు. (13)
వి: సం: దానధర్మతపోయోగాత్ = దానం బహిర్వేది, ధర్మః స్వాచారః, తపోజపోపవాసాది, యోగ ఆత్మానుసంధానమ్ = నలుగురికీ తెలిసేది దానం, తన ఆచారాన్ని పాటించటం ధర్మం. జపం, ఉపవాసాలు మొదలైనవి తపస్సు, ఆత్మానుసంధానమే యోగం - ఈ నాలుగింటి కలయికవలన. (నీల)
అరాగద్వేషసంయుక్తః సోమవత్ ప్రియదర్శనః ।
తేజసా సూర్యకల్పోఽభూద్ వాయువేగసమో జవే ।
అంతకప్రతిమః కోపే క్షమయా పృథివీసమః ॥ 14
ఆయన రాగద్వేషాలు లేనివాడు. చంద్రుని వలె చూడముచ్చటైన వాడు. తేజస్సులో సూర్యసమానుడు, వేగంలో వాయుసమానుడు, కోపిస్తే యముడే. ఓర్పులో భూమితో సమానమైనవాడు. (14)
వధః పశువరాహాణాం తథైవ మృగపక్షిణామ్ ।
శాంతనౌ పృథివీపాలే నావర్తత తథా నృప ॥ 15
రాజా! శాంతనుడు పరిపాలిస్తున్నప్పుడు పశువులనూ, పందులనూ, జంతువులనూ, పక్షులనూ హింసించి చంపేవారే లేరు. (15)
బ్రహ్మధర్మోత్తరే రాజ్యే శాంతనుర్వినయాత్మవాన్ ।
సమం శశాస భూతాని కామరాగవివర్జితః ॥ 16
ఆయన రాజ్యంలో బ్రహ్మజ్ఞానానికీ, ధర్మానికీ ప్రాధాన్యం. వినయసంపన్నుడైన శాంతనుడు కామరాగాలను విడిచి సమదృష్టితో ప్రజాపాలన చేయసాగాడు. (16)
వి: సం: బ్రహ్మధర్మోత్తరే = అహింసాధర్మ ప్రధానమైన (నీల)
దేవర్షిపితృయజ్ఞార్థమ్ ఆరభ్యంత తదా క్రియాః ।
న చాధర్మేణ కేషాంచిత్ ప్రాణినామభవద్ వధః ॥ 17
దేవయజ్ఞ ఋషియజ్ఞ పితృయజ్ఞాల కొరకే కర్మల నారంభించేవాడు. అధర్మమార్గంలో ఏ ప్రాణినీ సంహరించేవాడు కాదు. (17)
అసుఖానామనాథానాం తిర్యగ్యోనిషు వర్తతామ్ ।
స ఏవ రాజా సర్వేషాం భూతానామభవత్ పితా ॥ 18
దుఃఖించేవారికీ, దిక్కులేని వారికీ, పశుపక్షిజాతులలో పుట్టినవారికీ - సమస్తభూత కోటికీ కూడా ఆ రాజే తండ్రి వంటివాడు. (18)
తస్మిన్ కురుపతిశ్రేష్ఠే రాజరాజేశ్వరే సతి ।
శ్రితా వాగభవత్ సత్యం దానధర్మాశ్రితం మనః ॥ 19
కురురాజులలో శ్రేష్ఠుడూ, రాజరాజూ అయిన శాంతనుని ఏలుబడిలో మాట సత్యాన్నీ, మనస్సు ధానధర్మాలనూ ఆశ్రయించి ఉన్నాయి. (19)
స సమః షోడశాష్టౌ చ చతస్రోఽష్టౌ తథాపరాః ।
రతిమప్రాప్నువన్ స్త్రీషు బభూవ వనగోచరః ॥ 20
ఆ శాంతనుడు ముప్పదియారు సంవత్సరాల వయస్సు వరకు స్త్రీలపై ఆసక్తిని పొందక వనాల్లో సంచరించేవాడు. (20)
తథారూపస్తథాచారః తథావృత్తస్తథాశ్రుతః ।
గాంగేయస్తస్య పుత్రోఽభూత్ నామ్నా దేవవ్రతో వసుః ॥ 21
అటువంటి రూపం, అటువంటి ఆచారం, అటువంటి వ్యవహారం, అంతటి విద్య గలిగి వసువు అవతారమైన గాంగేయుడు దేవవ్రతుడను పేర ఆయన కుమారుడైనాడు. (21)
సర్వాస్త్రేషు స నిష్ణాతః పార్థివేష్వితరేషు చ ।
మహాబలో మహాసత్త్వః మహావీర్యో మహారథః ॥ 22
ఆ దేవవ్రతుడు మహాబలుడూ, మహాసత్త్వుడూ, మహావీర్యుడూ, మహారథుడు కూడా. లౌకికా లౌకికాలయిన అస్త్రశస్త్ర విద్యలలో నిష్ణాతుడు. (22)
స కదాచిన్మృగం విద్ధ్వా గమ్గామనుసరన్ నదీమ్ ।
భాగీరథీమల్పజలాం శాంతనుర్దృష్టవాన్ నృపః ॥ 23
ఒకప్పుడు శాంతనుమహారాజు ఒక క్రూరమృగాన్ని బాణంతో చంపి గంగ ఒడ్డుకు వచ్చాడు. గంగలో కొంచెమే నీరుండటాన్ని గమనించాడు. (23)
తాం దృష్ట్వా చింతయామాస శాంతనుః పురుషర్షభః ।
స్యందతే కిం త్వియం నాద్య సరిచ్ఛ్రేష్ఠా యథా పురా ॥ 24
దానిని చూచి ఈ నదీలలామ ఎప్పటివలె ఎందుకు ప్రవహించటం లేదని పురుషశ్రేష్ఠుడైన శాంతనుడు ఆలోచించాడు. (24)
తతో నిమిత్తమన్విచ్ఛన్ దదర్శ స మహామనాః ।
కుమారం రూపసంపన్నం బృహంతం చారుదర్శనమ్ ॥ 25
దివ్యమస్త్రం వికుర్వాణం యథా దేవం పురందరమ్ ।
కృత్స్నాం గంగాం సమావృత్య శరైస్తీక్ష్ణైరవస్థితమ్ ॥ 26
దానికి కారణాన్ని వెతుకుతూ మహామనస్వి అయిన ఆరాజు - విశాలశరీరుడై, రూపసంపన్నుడై అందంతో అలరారే ఒక యువకుని చూచాడు. ఆ యువకుడు దివ్యాస్త్రాలను అభ్యసిస్తున్న దేవేంద్రునిలా కనిపిస్తున్నాడు. తన తీక్ష్ణమైన బాణాలతో గంగాప్రవాహాన్ని అంతా అడ్డగించి ఉన్నాడు. (25,26)
తాం శరైరాచితాం దృష్ట్వా నదీం గంగాం తదంతికే ।
అభవద్ విస్మితో రాజా దృష్ట్వా కర్మాతిమానుషమ్ ॥ 27
తన బాణాలతో గంగా ప్రవాహాన్ని అడ్డగించి ఆ తీరంలోనే సంచరిస్తున్న ఆ యువకునీ, అతిమానుషమయిన అతని చేష్టనూ చూచి శాంతను మహారాజు ఆశ్చర్యానికి లోనయ్యాడు. (27)
జాతమాత్రం పురా దృష్ట్వా తం పుత్రం శాంతముస్తదా ।
నోపలేభే స్మృతిం ధీమాణ్ అభిజ్ఞాతుం తమాత్మజమ్ ॥ 28
అంతకు ముందు పసికందుగా ఉన్నప్పుడు మాత్రమే శాంతనుమహారాజు తన కొడుకును చూచి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడతడు గుర్తుకురాలేదు. ఆందువలన తన కొడుకును గుర్తుపట్టలేకపోయాడు. (28)
స తు తం పితరం దృష్ట్వా మోహయామాస మాయయా ।
సంమోహ్య తు తతః క్షిప్రం తత్రైవాంతరధీయత ॥ 29
ఆ బాలుడు తన తండ్రిని చూచి మాయతో మోహింపజేశాడు. ఆ మోహంలో శాంతనుడున్నప్పుడే వెంటనే అక్కడే అంతర్థానమయ్యాడు. (29)
తదద్భుతం తతో దృష్ట్వా తత్ర రాజా స శాంతనుః ।
శంకమానః సుతం గంగామ్ అబ్రవీద్ దర్శయేతి హ ॥ 30
ఆ అద్భుత సంఘటనను చూచిన ఆ శాంతను మహారాజుకు ఏదో అనుమానం కలిగింది. వెంటనే కుమారుని చూపించమని గంగను అడిగాడు. (30)
దర్శయామాస తం గంగా బిభ్రతీ రూపముత్తమమ్ ।
గృహీత్వా దక్షిణే పాణౌ తం కుమారమలంకృతమ్ ॥ 31
అప్పుడు గంగ ఉత్తమ రూపాన్ని ధరించి కొడుకును కుడిచేతితో పట్టుకొని వచ్చింది. అలంకృతుడైన ఆ బాలుని దేవవ్రతుని చూపించింది. (31)
అలంకృతామాభరణైః విరజోఽంబరసంవృతామ్ ।
దృష్టపూర్వామపి స తాం నాభ్యజానాత్ స శాంతనుః ॥ 32
ఆభరణాలు అలంకరించుకొని స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి వచ్చిన ఆ గంగను అంతకుముందు చూచినా కూడా గుర్తు పట్టలేకపోయాడు. (32)
గంగోవాచ
యం పుత్రమష్టమం రాజన్ త్వం పురా మయ్యవిందధాః ।
స చాయం పురుషవ్యాఘ్ర సర్వాస్త్రవిదనుత్తమః ॥ 33
గంగ ఇలా అన్నది - పురుషశ్రేష్ఠా! మహారాజా! నీవు గతంలో నా గర్భం ద్వారా పొందిన ఎనిమిదవ బిడ్డ ఇతడే. ఇతడు సర్వాస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు. (33)
గృహేణేమం మహారాజ మయా సంవర్ధితం సుతమ్ ।
ఆదాయ పురుషవ్యాఘ్ర నయస్వైనం గృహం విభో ॥ 34
మహారాజా! నేను పెంచిన ఈ బిడ్డను స్వీకరించు. పురుషశ్రేష్ఠా! స్వీకరించి ఇంటికి తీసికొనిపో. (34)
వేదానధిజగే సాంగాన్ వసిష్ఠాదేష వీర్యవాన్ ।
కృతాస్త్రః పరమేష్వాసః దేవరాజసమో యుధి ॥ 35
ఈ బాలుడు పరాక్రమవంతుడు. వసిష్ఠుని దగ్గర షడంగాలతో కూడిన వేదాలను అభ్యసించాడు. అస్త్రవిద్యలు నేర్చాడు. మేటివిలుకాడు. యుద్ధంలో దేవేంద్రసమానుడు. (35)
సురాణాం సమ్మతో నిత్యమ్ అసురాణాం చ భారత ।
ఉశనా వేద యచ్ఛాస్త్రమ్ అయం తద్వేద సర్వశః ॥ 36
భారతా! దేవతలకూ, అసురులకూ కూడా నచ్చినవాడీ బాలుడు. శుక్రుడెరిగిన నీతి శాస్త్రాన్ని ఈ బాలుడు కూడా సంపూర్ణంగా తెలిసికొనినాడు. (36)
తధైవాంగిరసః పుత్రః సురాసురనమస్కృతః ।
యద్ వేద శాస్త్రం తచ్చాపి కృత్స్నమస్మిన్ ప్రతిష్ఠితమ్ ॥ 37
తవ పుత్రే మహాబాహౌ సాంగోపాంగం మహాత్మని ।
ఋషిఃపరైరనాధృష్యః జామదగ్న్యః ప్రతాపవాన్ ॥ 38
యదస్త్రం వేద రామశ్చ తదేతస్మిన్ ప్రతిష్ఠితమ్ ।
మహేష్వాసమిమం రాజన్ రాజధర్మార్థకోవిదమ్ ॥ 39
మయా దత్తం నిజం పుత్రం వీరం వీర గృహం నయ ।
అదేవిధంగా అంగిరసుని కొడుకూ, సురాసురవందితుడైన బృహస్పతికి తెలిసిన శాస్త్రమంతా మహాత్ముడూ, మహాబాహువూ అయిన ఈ నీ కుమారుడు సాంగోపాంగంగా గ్రహించాడు. ఇతరులెదిరింపరాని ప్రతాపవంతుడూ, జమదగ్ని కొడుకూ అయిన పరశురాముడు నేర్చిన అస్త్రవిద్య మొత్తం ఇతని యందు ప్రతిష్ఠింపబడింది. రాజా! రాజధర్మార్థకోవిదుడై మేటి విలుకాడైన ఈ నీ కుమారుని అప్పగిస్తున్నాను. వీరా! ఈ వీరబాలకుని ఇంటికి తీసికొనిపో. (37-39 1/2)
వైశంపాయన ఉవాచ
(ఇత్యుక్త్వా సా మహాభాగా తత్రైవాంతరధీయత ।)
తయైవం సమనుజ్ఞాతః పుత్రమాదాయ శాంతనుః ॥ 40
భ్రాజమానం యథాదిత్యమ్ ఆయయౌ స్వపురం ప్రతి ।
పౌరవస్తు పురీం గత్వా పురందరపురోపమామ్ ॥ 41
సర్వకామసమృద్ధార్థం మేనే సోఽత్మానమాత్మనా ।
పౌరవేషు తతః పుత్రం రాజ్యార్థమభయప్రదమ్ ॥ 42
గుణవంతం మహాత్మానం యౌవరాజ్యేఽభ్యషేచయత్ ।
పౌరవాన్ శాంతనోః పుత్రః పితరం చ మహాయశాః ॥ 43
రాష్ట్రం చ రంజయామాస వృత్తేన భరతర్షభ ।
స తథా సహ పుత్రేణ రమమాణో మహీపతిః ॥ 44
వర్తయామాస వర్షాణి చత్వార్యమితవిక్రమః ।
స క్షాచిద్ వనం యాతః యమునామభితో నదీమ్ ॥ 45
వైశంపాయనుడిలా అన్నాడు - ఆ రీతిగా చెప్పి గంగానది అక్కడే అదృశ్యమయినది. ఆమె అనుమతితో, సూర్యతేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ కుమారుని స్వీకరిమ్చి శాంతనుడు తన నగరానికి వెళ్లాడు. అమరావతి వలె అందమైన తన నగరానికి వెళ్ళిన శాంతనుడు తనకు కోరికలన్నీ తీరిన వానిని వలె సఫలమనోరథుని వలె భావించుకొన్నాడు. ఆ తరువాత అందరికీ అభయమీయగల గుణవంతుడూ, మహాత్ముడూ అయిన తన కుమారుని రాజ్యపాలనలో సహకారానికై యువరాజును చేశాడు. భరతశ్రేష్ఠా! శాంతనుకుమారుడు దేవవ్రతుడు కీర్తిమంతుడై తన నడవడితో పౌరవులనూ, తన తండ్రిని, రాజ్యాన్ని కూడా రంజింపజేశాడు. ఆ విధంగా అమితవిక్రముడైన ఆ రాజు కొడుకుతో కలిసి నాలుగు సంవత్సరాలు ఆనందంగా గడిపాడు. ఒకనాడు ఆ శాంతనుడు యమునా తీరంలోని వనానికి వెళ్ళాడు. (40-45)
మహీపతిరనిర్దేశ్యమ్ ఆజిఘ్రద్ గంధముత్తమమ్ ।
తస్య ప్రభవమన్విచ్ఛన్ విచచార సమంతతః ॥ 46
అప్పుడు ఆ రాజు వివరించి చెప్పటానికి వీలుకాని ఉత్తమసౌరభాన్ని ఆఘ్రాణించాడు. అది ఎక్కడ నుండి వస్తున్నదో తెలియగోరి అంతటా సంచరింప సాగాడు. (46)
స దదర్శ తదా కన్యాం దాశానాం దేవరూపిణీమ్ ।
తామపృచ్ఛత్ స దృష్ట్వైవ కన్యామసితలోచనామ్ ॥ 47
అప్పుడు దేవకాంతవలె ఉన్న ఒక బెస్త కన్నియను చూచాడు. కాటుక కన్నులు గల ఆమెను చూడగానే ఆ రాజు ఇలా అడిగాడు. (47)
కస్య త్వమసి కా చాసి కిం చ భీరు చికీర్షసి ।
సాబ్రవీద్ దాశకన్యాస్మి ధర్మార్థం వాహాయే తరీమ్ ॥ 48
పితుర్నియోగాద్ భద్రం తే దాశరాజ్ఞో మహాత్మనః ।
రూపమాధుర్యగంధైస్తాం సంయుక్తాం దేవరూపిణీమ్ ॥ 49
సమీక్ష్య రాజా దాశేయీం కామయామాస శాంతనుః ।
స గత్వా పితరం తస్యాః వరయామాస తాం తదా ॥ 50
భయశీలా! నీవెవర్తెవు? ఎవరి పుత్త్రికవు? ఏం చేస్తున్నావు? ఆమె ఇలా అన్నది - నేను బెస్తకన్నియను. మహాత్ముడూ, దాశరాజూ అయిన మా తండ్రి ఆదేశాన్ని అనుసరించి ధర్మార్థమై నావను నడుపుతున్నాను. నీకు శుభమగుగాక. అందం, మాధుర్యం, పరిమళం కలిగి దేవకాంతవలె కనిపిస్తున్న ఆమెను చూచి శాంతనుడు మోహించాడు. ఆమె తండ్రి దగ్గరకు వెళ్ళి అప్పుడే ఆమెను వరించాడు. (48-50)
పర్యపృచ్ఛత్ తతస్తస్యాః పితరం సోఽత్మకారణాత్ ।
స చ తం ప్రత్యువాచేదం దాశరాజో మహీపతిమ్ ॥ 51
ఆ తర్వాత ఆ శాంతనుడు ఆమె తండ్రిని తనకై ఆమెను అడిగాడు. ఆ దాశరాజు శాంతనునకు ఈ విధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. (51)
జాతమాత్రైవ మే దేయా వరాయ వరవర్ణినీ ।
హృది కామస్తు మే కశ్చిత్ తం నిబోధ జనేశ్వర ॥ 52
రాజా! ఈ అందమయిన కూతురు పుట్టినప్పుడే తగిన వరునకివ్వాలని నేను సంకల్పించాను. కాని నా మనస్సులో ఒక కోరికగలదు. దానిని విను. (52)
యదీమాం ధర్మపత్నీం త్వం మత్తః ప్రార్థయసేఽనఘ ।
సత్యవాగసి సత్యేన సమయం కురు మే తతః ॥ 53
అనఘా! నీవు సత్యవచనువుడు. ఈమెను ధర్మపత్నిగా పొందాలని నీవు నన్ను అడిగే పక్షంలో సత్యప్రమాణంగా నాకొకమాట ఇవ్వాలి. (53)
సమయేన ప్రదద్యాం తే కన్యామహమిమాం నృప ।
న హి మే త్వత్సమః కశ్చిద్ వరో జాతు భవిష్యతి ॥ 54
రాజా! ఆ నియమం మేరకు ఈ కన్యను నేను నీకివ్వగలను. నీకన్న మంచి వరుడు మరొకడు నాకు ఎప్పుడూ దొరకడు. (54)
శాంతనురువాచ
శ్రుత్వా తవ వరం దాశ వ్యవస్యేయమహం తవ ।
దాతవ్యం చేత్ ప్రదాస్యామి న త్వదేయం కథంచన ॥ 55
శాంతనుడు ఇలా అన్నాడు - దాశా! నీ కోరికను విన్న తరువాత దానివిషయమై నిర్ణయిస్తాను. ఇవ్వదగినదయితే తప్పక ఇస్తాను. ఇవ్వదగనిదైతే ఏరీతిగానూ ఇవ్వను. (55)
దాశ ఉవాచ
అస్యాం జాయేత యః పుత్రః స రాజా పృథివీపతే ।
త్వదూర్ధ్వమభిషేక్తవ్యః నాన్యః కశ్చవ పార్థివ ॥ 56
దాశరాజు ఇలా అన్నాడు - మహారాజా! ఈమె యందు కలిగే కొడుకే నీ తరువాత రాజు కావాలి. మరెవ్వరూ పట్టాభిషిక్తులు కాకూడదు. (56)
వైశంపాయన ఉవాచ
నాకామయత తం దాతుం వరం దాశాయ శాంతనుః ।
శరీరజేన తీవ్రేణ దహ్యమానోఽపి భారత ॥ 57
వైశంపాయనుడిలా అన్నాడు - భారతా! శాంతనుడు తీవ్రకామాగ్నితప్తుడైనా కూడా దాశరాజుకు ఆ వరాన్ని ఇవ్వటానికి ఇష్టపడలేదు. (57)
స చింతయన్నేవ తదా దాశకన్యాం మహీపతిః ।
ప్రత్యయాద్ధాస్తినపురం కామోపహతచేతనః ॥ 58
అప్పుడు శాంతనుడు ఆ దాశకన్యను గూర్చియే తలపోస్తూ హాస్తినపురానికి వెళ్ళిపోయాడు. కామవ్యధ అతనిమనస్సును చలింపజేసింది. (58)
తతః కదాచిచ్ఛోచంతం శాంతనుం ధ్యానమాస్థితమ్ ।
పుత్రో దేవవ్రతోఽభ్యేత్య పితరం వాక్యమబ్రవీత్ ॥ 59
ఆ తరువాత ఒకరోజు శాంతనుడు ధ్యానముద్రతో ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయన కొడుకు దేవవ్రతుడు సమీపిమ్చి తండ్రితో ఇలా అన్నాడు. (59)
సర్వతో భవతః క్షేమం విధేయాః సర్వపార్థివాః ।
తత్ కిమర్థమిహాభీక్ష్ణం పరిశోచసి దుఃఖితః ॥ 60
"అన్నివపుల నుండీ మీకు క్షేమమే. రాజులందరూ విధేయులే. అయినా సరే ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఆవేదనలో ఉండటానికి కారణమేమి? (60)
ధ్యాయన్నివ చ మాం రాజన్ నభిభాషసి కించన ।
న చాశ్వేన వినిర్యాసి వివర్ణో హరిణః కృశః ॥ 61
రాజా! మీరు మౌనంగానే ఉంటున్నారు. ఏదో ఆలోచిస్తున్నారు. నాతో మాటాడటం లేదు. గుర్రంపై వాహ్యాళికి కుడా వెళ్ళటం లేదు. కాంతిని కోల్ఫోయి, పాలిపోయి, కృశించిపోతున్నారు. (61)
వ్యాధిమిచ్ఛామి తే జ్ఞాతుం ప్రతికుర్యాం హి తత్ర వై ।
ఏవముక్తః స పుత్రేణ శాంతనుః ప్రత్యభాషత ॥ 62
మీ వ్యాధి ఏమిటో తెలిస్తే దానికి ప్రతిక్రియ చేయగలను". కొడుకు మాటలకు శాంతనుడు ఇలా సమాధానం చెప్పాడు. (62)
అసంశయం ధ్యానపరః యథా వత్స తథా శృణు ।
అపత్యం నస్త్వమేవైకః కులే మహతి భారత ॥ 63
నాయనా! నిజంగా ధ్యానమగ్నుడనై ఉన్నాను. ఆచింత ఎటువంటిదో చెపుతాను. విను భారతా! ఇంత విశాలవంశంలో నాకు నీవు ఒక్కడివే కొడుకువు. (63)
శస్త్రనిత్యశ్చ సతతం పౌరుషే పర్యవస్థితః ।
అనిత్యతాం చ లోకానాం అనుశోచామి పుత్రక ॥ 64
నీవు ఎప్పుడూ ఆయుధప్రయోగాలను అభ్యసించటంలోనే గడుపుతున్నావు. పురుషార్థాల కొరకే ఉద్యమిస్తున్నావు. కుమారా! ఈ లోకాలన్నీ అనిత్యాలన్న భావనతో నేను చింతాక్రాంతుడ నవుతున్నాను. (64)
కథంచిత్ తవ గాంగేయ విపత్తౌ నాస్తి నః కులమ్ ।
అసంశయం త్వమేవైకః శతాదపి వరః సుతః ॥ 65
గాంగేయా! నీకేదయినా విపత్తు కలిగితే ఇక మన వంశమే నిలవదు. నీవు ఒక్కడవే వందమంది కొడుకుల కన్న శ్రేష్ఠుడవు అన్నమాట నిస్సందేహం. (65)
న చాప్యహం వృథా భూయః దారాన్ కర్తుమిహోత్సహే ।
సంతానస్యావినాశాయ కామయేభద్రమస్తు తే ॥ 66
నాకు కూడా వ్యర్థంగా మరలా వివాహమాడాలన్న కోరిక లేదు. కానీ వంశాభివృద్ధికి లోటు రాకూడదు గదా! అందుకు మరల వివాహమాడాలని తలంపు. నీకు మేలు కలుగుగాక. (66)
అనపత్యతైకపుత్రత్వమ్ ఇత్యాహుర్ధర్మవాదినః ।
(చక్షురేకం చ పుత్రశ్చ అస్తి నాస్తి చ భారత ।
చక్షుర్నాశే తనోర్నాశః పుత్రనాశే కులక్షయః ॥)
అగ్నిహోత్రం త్రయీ విద్యా సంతానమపి చాక్షయమ్ ॥ 67
సర్వాణ్యేతాన్యపత్యస్య కలాం నార్హంతి షోడశీమ్ ।
ఒక్కడే కొడుకుంటే కొడుకులు లేనట్లే అని ధర్మవేత్తల అభిప్రాయం. ఒకే కన్నూ, ఒకే కొడుకూ ఉన్నా లేనట్లే. కన్నుపోతే శరీరం పోతుంది. కొడుకు పోతే వంశం నశిస్తుంది. అగ్నిహోత్రంకానీ, వేదవిద్యకానీ, అక్షయ శిష్య ప్రశిష్యపరంపర కానీ ఇవేమీ కూడా కొడుకులో పదహారవ భాగాన్కి కూడా సాటిరావు. (67 1/2)
వి: సం: విద్యాసంతానమ్ = శిష్యప్రశిష్యుల ద్వారా విద్య వ్యాపించుట, ఆ శిష్యప్రశిష్యులే సంతానం. (నీల)
ఏవమేతన్మనుష్యేషు తచ్చ సర్వప్రజాస్వితి ॥ 68
ఈ సంతాన ప్రాధాన్యం మనుష్యులలోనే కాదు సర్వప్రాణులలో కూడా ఉంటుంది. (68)
యదపత్యం మహాప్రాజ్ఞ తత్ర మే నాస్తి సంశయః ।
ఏషా త్రయీ పురాణానాం దేవతానాం చ శాశ్వతీ ॥ 69
(అసత్యం కర్మ విద్యా చ త్రీణి జ్యోతీంషి భారత ।
యదిదం కారణం తాత సర్వమాఖ్యాతమంజసా ॥)
మహాప్రాజ్ఞా! సంతానం, కర్మ, విద్య, అన్నవి మూడూ జ్యోతులు. వీటిలో కూడా సంతానమన్నది సర్వోత్తమం. ఈ విషయంలో నాకు సంశయం లేదు. వేద పురాణదేవతా సమ్మతమైన అభిప్రాయమిదే. నాలోని చింతకు కారణాన్ని నీకు అంతా స్పష్టంగా చెప్పాను. (69)
త్వం చ శూరః సదామర్షీ శస్త్రనిత్యశ్చ భారత ।
నాన్యత్ర యుద్ధాత్ తస్మాత్ తే నిధనం విద్యతే క్వచిత్ ॥ 70
భారతా! నీవు శూరుడవు. మాట పడటానికి ఇష్టపడని వాడవు. ఎప్పుడూ శస్త్రాస్త్రాల అభ్యాసంలోనే కాలం గడిపేవాడవు. కాబట్టి యుద్ధంలో తప్ప మరొకరీతిగా నీ మరణాన్ని సంభావించలేము. (70)
సోఽస్మి సంశయమాపన్నః త్వయి శాంతే కథం భవేత్ ।
ఇతి తే కారణం తాత దుఃఖస్యోక్తమశేషతః ॥ 71
అందుకే సంశయిస్తూ కూర్చున్నాను. నీకు ప్రమాదం జరిగితే తర్వాత వంశమేమవుతుందో? ఇది నా దుఃఖానికి కారణం. ఏమీ మిగల్చకుండా నీకు చెప్పాను. (71)
వైశంపాయన ఉవాచ
తతస్తత్కారణం రాజ్ఞః జ్ఞాత్వా సర్వమశేషతః ।
దేవవ్రతో మహాబుద్ధిః ప్రజ్ఞయా చాన్వచింతయత్ ॥ 72
వైశంపాయనుడిలా అన్నాడు - రాజు దుఃఖానికి కారణమైన ఆ విషయం మొత్తం గ్రహించి మహామతి అయిన దేవవ్రతుడు తన తెలివితో కూడా దానిని ఆలోచించాడు. (72)
అభ్యగచ్ఛత్ తదైవాశు వృద్ధామాత్యం పితుర్హితమ్ ।
తమపృచ్ఛత్ తదాభ్యేత్య పితుస్తచ్ఛోకకారణమ్ ॥ 73
అప్పుడే వేగంగా తన తండ్రిమేలు కోరుకునే వృద్ధుడైన మంత్రి దగ్గరకు వెళ్ళాడు. తండ్రి శోకానికి కారణాన్ని గూర్చి ఆయనను ప్రశ్నించాడు. (73)
తస్మై స కురుముఖ్యాయ యథావత్ పరిపృచ్ఛతే ।
వరం శశంస కన్యాం తామ్ ఉద్దిశ్య భరతర్షభ ॥ 74
భరత శ్రేష్ఠా! అప్పుడా అమాత్యుడు వాస్తవాన్ని తెలియగోరుతున్న దేవవ్రతునకు శాంతనుడు ఎవరో కన్యను వివాహమాడదలచినట్లు చెప్పాడు. (74)
(సూతం భూయోఽపి సంతప్తః ఆహ్వయామాస వై పితుః ।
సూతస్తు కురుముఖ్యస్య ఉపయాతస్తదాజ్ఞయా ।
తమువాచ మహాప్రాజ్ఞః భీష్మో వై సారథిం పితుః ॥
దీనితో మరీ కలతపడిన దేవవ్రతుడు తండ్రిసారథిని పిలిపించాడు. దేవవ్రతుని ఆజ్ఞతో శాంతనుని సారథి వచ్చాడు. మహాప్రాజ్ఞుడైన భీష్ముడు తన తండ్రి సారథితో ఇలా అన్నాడు.
భీష్మ ఉవాచ
త్వం సారథే పితుర్మహ్యం సఖాసి రథయుగ్ యతః ।
అపి జానాసి యది వై కస్యాం భావో నృపస్య తు ॥
యథా వక్ష్యసి మే పృష్టః కరిష్యే న తదన్యథా ।
భీష్ముడిలా అన్నాడు. సారథీ! నీవు రథసారథివి కాబట్టి నా తండ్రికి మిత్రుడవు. రాజుగారి మనస్సు ఏ కన్యపై లగ్నమై ఉన్నదో నీవెరుగుదవా? నేనడిగినదానికి సరిగా సమాధానం చెప్తే ఆవిధంగానే నేను ఆచరిస్తాను. దానికి భిన్నంగా ప్రవర్తించను.
సూత ఉవాచ
దాశకన్యా నరశ్రేష్ఠ తత్ర భావః పితుర్గతః ।
వృతః స నరదేవేన తదా వచనమబ్రవీత్ ॥
యో-స్యాం పుమాన్ భవేద్ గర్భః స రాజా త్వదనంతరమ్ ।
నాకామయత తం దాతుం పితా తవ వరం తదా ॥
స చాపి నిశ్చయస్తస్య న చ దద్యామతోఽన్యథా ।
ఏవం తే కథితం వీర కురుష్వ యదనంతరమ్ ॥)
రథసారథి ఇలా చెప్పాడు - నరోత్తమా! దాశకన్యపై తండ్రికి మక్కువ గలిగింది. రాజుగారు ఆమెను వరించిన తర్వాత ఆమె తండ్రి (ఈమెకు పుట్టిన కొడుకే తమ తర్వాత రాజు కావలసిం'దని కోరాడు. ఆ వరాన్ని ఇవ్వటానికి అప్పుడు తమ తండ్రి అంగీకరించలేదు. మరో విధంగా నేను నా కుమార్తె నివ్వనని ఆ దాశరాజు నిర్ణయం. ఉన్న విషయమిది. వివరించాను, వీరా! తర్వాత చేయవలసినది చేయండి.
తతో దేవవ్రతో వృద్ధైః క్షత్రియైః సహితస్తదా ।
అభిగమ్య దాశరాజం కన్యాం వవ్రే పితుః స్వయమ్ ॥ 75
ఆ తర్వాత దేవవ్రతుడు వృద్ధులయిన క్షత్రియులను వెంటబెట్టుకొని దాశరాజు దగ్గరకు పోయి తండ్రి కొరకు తాను దాశకన్యను వరించాడు. (75)
తం దాశః ప్రతిజగ్రాహ విధివత్ ప్రతిపూజ్య చ ।
అబ్రవీచ్చైనమాసీనమ్ రాజసంసది భారత ॥ 76
దాశుడు దేవవ్రతుని శాస్త్రోక్తరీతిలో పూజించి స్వాగతించాడు. రాజుల మధ్య కూర్చొని ఉన్న దేవవ్రతునితో ఇలా అన్నాడు. (76)
దాశ ఉవాచ
(రాజ్యశుల్కా ప్రదాతవ్యా కన్యేయం యాచతాం వర ।
అసత్యం యద్ భవేత్ తస్యాః స రాజాస్తు పితుః పరమ్ ॥)
దాశరాజు ఇలా అన్నాడు. యాచకశ్రేష్ఠా! నా కూతురు నివ్వటానికి రాజ్యమే శుల్కం. ఆమెకు కొడుకు పుడితే మీ తండ్రి తర్వాత ఆ కొడుకే రాజు కావాలి.
త్వమేవ నాథః పర్యాప్తః శాంతనోర్బరతర్షభ ।
పుత్రః శస్త్రభృతాం శ్రేష్ఠః కిం తు వక్ష్యామి తే వచః ॥ 77
భరతశ్రేష్ఠా! శాంతనుని కుమారుడవైన నీవొక్కడవే అందరినీ రక్షించగలవాడవు. ధనుర్ధారులలో నీవే శ్రేష్ఠుడవు. అయినా సరే నీకు నా మాట చెప్తున్నాను. (77)
కో హి సంబంధకం శ్లాఘ్యమ్ ఈప్సితం యౌనమీదృశమ్ ।
అతిక్రామన్న తప్యేత సాక్షాదపి శతక్రతుః ॥ 78
ఇంతగా నచ్చిన కోరదగిన వివాహ సంబంధాన్ని కాదని ఎవరు బాధపడకుండా ఉండగలరు? సాక్షాత్తూ ఇంద్రుడైనా బాధపడవలసినదే. (78)
అపత్యం చైతదార్యస్య యో యుష్మాకం సమో గుణైః ।
యస్య శుక్రాత్ సత్యవతీ సంభూతా వరవర్ణినీ ॥ 79
ఈ కన్య ఒక గొప్పవాని కూతురు. ఆయన గుణాలలో తమతో సమానమైన వాడే. ఆయన వీర్యం వలననే ఈ సుందరి సత్యవతి జన్మించింది. (79)
తేన మే బహుశస్తాత పితా తే పరికీర్తితః ।
అర్హః సత్యవతీం వోఢుం ధర్మజ్ఞః స నరాధిపః ॥ 80
నాయనా! ఆయన ఎన్నోమార్లు మీ తండ్రిని గూర్చి చర్చించాడు. సత్యవతిని వివాహమాడటానికి ధర్మవేత్త అయిన శాంతనుమహారాజే తగినవాడని ఆయన అభిప్రాయం. (80)
అర్థితశ్చాపి రాజర్షిః ప్రత్యాఖ్యాతః పురా మయా ।
స చాప్యాసీత్ సత్యవత్యా భృశమర్థీ మహాయశాః ॥ 81
కన్యాపితృత్వాత్ కించిత్ తు వక్ష్యామి త్వాం నరాధిప ।
బలవత్సపత్నతామత్ర దోషం పశ్యామి కేవలమ్ ॥ 82
మహాయశుడైన ఆరాజర్షి శాంతనుడు సత్యవతిని ఇంతకుముందే గట్టిగా అడిగాడు. ఆయన అలా అడిగినా కూడా నేను కాదన్నాను. రాజా! ఆడపిల్ల తండ్రిని కాబట్టి కొంచెం చెప్తున్నాను. ఈ సంబంధం చేసికోవటమంటే బలవంతులతో శత్రుత్వాన్ని తెచ్చి పెట్టుకోవటమే అవుతుంది. అదే ఇక్కడ దోషం. (81,82)
యస్య హి త్వం సపత్నః స్యాః గంధర్వస్యాసురస్య వా ।
న స జాతు చిరం జీవేత్ త్వయి క్రుద్ధే పరంతప ॥ 83
పరంతపా! నిన్ను శత్రువుగా చేసికొనినవాడు గంధర్వుడైనా, రాక్షసుడైనా కావచ్చు కానీ నీవే కోపిస్తే ఎక్కువకాలం జీవించలేడు. (83)
ఏతావానత్ర దోషో హి నాన్యః కశ్చన పార్థివ ।
ఏతజ్జానీహి భద్రం తే దానాదానే పరంతప ॥ 84
రాజా! ఈ పెండ్లి జరిపించటంలో ఇదే దోషం. ఇంతకన్న మరేమీ లేదు. పరంతపా! కన్యనివ్వటం ఇవ్వకపోవటంలో ఇదొక్కటే దోషం. అర్థం చేసుకో. నీకు మేలు జరుగు గాక! (84)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్తు గాంగేయః తద్యుక్తం ప్రత్యభాషత ।
శృణ్వతాం భూమిపాలానాం పితురర్థాయ భారత ॥ 85
వైశంపాయనుడిలా అన్నాడు. భారతా! దాశరాజు అలా అనగానే దేవవ్రతుడు తండ్రికోరిక తీర్చటానికై రాజులందరూ వింటుండగానే దానికి తగిన రీతిగా సమాధానం చెప్పాడు. (85)
ఇదం మే వ్రతమాదత్స్వ సత్యం సత్యవతాం వర ।
నైవ జాతో న వా జాతః ఈదృశం వక్తుముత్సహేత్ ॥ 86
సత్యవంతులలో శ్రేష్ఠుడా! నా ఈ సత్యప్రతిజ్ఞను విను. ఇటువంటి మాటలు చెప్పగలవాడు ఇంతవరకు పుట్టలేదు. ఇక పుట్టడు కూడా. (86)
ఏవమేతత్ కరిష్యామి యథా త్వమనుభాషసే ।
యోఽస్యాం జనిష్యతే పుత్రః స నో రాజా భవిష్యతి ॥ 87
నీవు కోరుతున్నట్లే నేను చేస్తాను. ఈమెకు పుట్టబోయే కొడుకే మాకు రాజవుతాడు. (87)
ఇత్యుక్తః పునరేవాథ తం దాశః ప్రత్యభాషత ।
చికీర్షుర్దుష్కరం కర్మ రాజ్యార్థే భరతర్షభ ॥ 88
భరతశ్రేష్ఠా! దేవవ్రతుడు అలా అన్న తరువాత దాశరాజు రాజ్యంకోసం దుష్కర ప్రతిజ్ఞ దేనికో కోరదలచుకొని మరలా ఇలా అన్నాడు. (88)
త్వమేవ నాథః సంప్రాప్తః శాంతనోరమితద్యుతే ।
కన్యాయాశ్చైవ ధర్మాత్మన్ ప్రభుర్దానాయ చేశ్వరః ॥ 89
అమితకాంతి గలవాడా! నీవే శాంతనుమహారాజుకు రక్షకుడవై ఇక్క్కడకు వచ్చావు. ధర్మస్వరూపా! ఈ కన్యపై నీకు పూర్తిగా అధికారమున్నది. ఏమడిగినా నీవివ్వగలవు. అన్నీ చేయగలవాడవు నీవు. (89)
ఇదం తు వచనం సౌమ్య కార్యం చైవ నిబోధ మే ।
కౌమారికాణాం శీలేన వక్ష్యామ్యహమరిందమ ॥ 90
సౌమ్యా! ఈ విషయంలో నేను మరికొంత మాటాడవలసి ఉంది. అది జాగరూకతతో విను. అరిందమా! కన్యాబంధువుల స్వభావాన్ని బట్టి నేనీ విధంగా చెప్పబోతున్నాను. (90)
యత్ త్వయా సత్యవత్యర్థే సత్యధర్మపరాయణ ।
రాజమధ్యే ప్రతిజ్ఞాతమ్ అనురూపం తవైవ తత్ ॥ 91
సత్యధర్మపరాయణా! సత్యవతికోసం రాజుల సమక్షంలో నీవు చేసిన ప్రతిజ్ఞ నీకు తగినదే. (91)
నాన్యథా తన్మహాబాహో సంశయోఽత్ర న కశ్చన ।
తవాపత్యం భవేద్ యత్ తు తత్ర నః సంశయో మహాన్ ॥ 92
మహాబాహూ! అది తిరుగులేనిది. ఈ విషయంలో ఏవిధమయిన సంశయమూ లేదు. కానీ నీకు పుట్టబోయే కొడుకుల విషయంలోనే గొప్పసంశయం మాకుంది. (92)
వైశంపాయన ఉవాచ
తస్త్మెతన్మతమాజ్ఞాయ సత్యధర్మపరాయణః ।
ప్రత్యజానాత్ తదా రాజన్ పితుః ప్రియచికీర్షయా ॥ 93
వైశంపాయనుడిలా అన్నాడు. రాజా! సత్యధర్మ పరాయణుడైన దేవవ్రతుడు దాశరాజు అభిప్రాయాన్ని గ్రహించి తండ్రి కోరిక తీర్చదలచి అప్పుడిలా ప్రతిజ్ఞ చేశాడు. (93)
గాంగేయ ఉవాచ
దాశరాజ నిబోధేదం వచనం మే నరోత్తమ ।
(ఋషయో వాథవా దేవాః భూతాన్యంతర్హితాని చ ।
యాని యానీవా శృణ్వంతు నాస్తి వక్తా హి మత్సమః ॥
ఇదం వచనమాదత్స్వ సత్యేన మమ జల్పతః ।)
శృణ్వతాం భూమిపాలానాం యద్ బ్రవీమి పితుః కృతే ॥ 94
గాంగేయుడిలా అన్నాడు. నరోత్తమా! దాశరాజా! నా ప్రతిజ్ఞ విను. ఋషులు, దేవతలూ, అదృశ్యంగా ఉన్న ప్రాణులూ అందరూ వినండి. నా వలె మాటివ్వగలవాడు మరొకడు లేడు. నేను సత్యం చెప్తున్నాను. తండ్రి కోసం ఈ రాజులందరి సమక్షంలో పలుకుతున్నాను. నా మాటను గ్రహించండి. (94)
రాజ్యం తావత్ పూర్వమేవ మయా త్యక్తం నరాధిపాః ।
అపత్యహేతోరపి చ కరిష్యేఽద్య వినిశ్చయమ్ ॥ 95
రాజశ్రేష్ఠులారా! నేను ఇంతకు ముందే రాజ్యాన్ని పరిత్యజించాను. ప్రస్తుతం సంతానసంబంధంగా కూడా నిర్ణయాన్ని తీసికొంటున్నాను. (95)
అద్యప్రభృతి మే దాశ బ్రహ్మచర్యం భవిష్యతి ।
అపుత్రస్యాపి మే లోకాః భవిష్యంతక్షయా దివి ॥ 96
దాశరాజా! ఇప్పటి నుండి నేను బ్రహ్మచర్యాన్ని స్వీకరిస్తాను. పుత్రులు లేకున్నా నాఖు స్వర్గంలో అక్షయపుణ్యలోకాలు లభిస్తాయి. (96)
(న హి జన్మప్రభృత్యుక్తం మమ కించిది హానృతమ్ ।
యావత్ ప్రాణా ధ్రియంతే వై మమ దేహం సమాశ్రితాః ।
తావన్న జనయిష్యామి పిత్రే కన్యాం ప్రయచ్ఛ మే ।
పరిత్యజామ్యహం రాజ్యం మైథునం చాపి సర్వశః ॥
ఊర్ధ్వరేతా భవిష్యామి దాశ సత్యం బ్రవీమి తే ।)
నేను పుట్టిననాటి నుండి ఎటువంటి అసత్యమూ పలుకలేదు. నా దేహంలో ప్రాణాలు ఉన్నంతవరకూ సంతానాన్ని పొందను. నీ కుమార్తెను మా తండ్రికివ్వు. నేను రాజ్యాన్నీ, మైథునాన్నీ కూడా పూర్తిగా పరిత్యజిస్తున్నాను. దాశా! నేనిక ఊర్ధ్వ రేతుస్కుడనై ఉంటాను. నీకు సత్యం చెప్తున్నాను.
వైశంపాయన ఉవాచ
తస్య తద్ వచనం శ్రుత్వా సంప్రహృష్టతనూరుహః ।
దదానీత్యేవ తం దాశః ధర్మాత్మా ప్రత్యభాషత ॥ 97
వైశంపాయనుడిలా అన్నాడు. దేవవ్రతుని మాటను విని ధర్మాత్ముడైన ఆ దాశరాజుకు శరీరం పులకించి కూతురుని ఇస్తానని సమాధానం చెప్పాడు. (97)
తతోంతరిక్షేఽప్సరసః దేవాః సర్షిగణాస్తదా ।
అభ్యవర్షంత కుసుమైః భీష్మోఽయమితి చాబ్రువన్ ॥ 98
అప్పుడు అంతరిక్షంలోని అచ్చరలూ, దేవతలూ, ఋషిగణాలు పూలవాన కురిపించారు. 'ఇతడు భీష్ము'డని ప్రకటించారు. (98)
తతః స పితురర్థాయ తామువాచ యశస్వినీమ్ ।
అధిరోహ రథం మాతః గచ్ఛావః స్వగృహానితి ॥ 99
ఆ తరువాత దేవవ్రతుడు తండ్రికోసం కీర్తిమతియైన ఆ సత్యవతితో " అమ్మా! రథమెక్కు. మన ఇంటికి పోదాం" అని అన్నాడు. (99)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా తు భీష్మస్తాం రథమారోప్య భావినీమ్ ।
ఆగమ్య హాస్తినపురం శాంతనోః సంన్యవేదయత్ ॥ 100
వైశంపాయనుడిలా అన్నాడు. ఆ విధంగా పలికి భీష్ముడు ఆమెను రథమెక్కించి హాస్తినపురానికి వచ్చి శాంతనునకు నివేదించాడు. (100)
తస్య తద్ దుష్కరం కర్మ ప్రశశంసుర్నరాధిపాః ।
సమేతాశ్చ పృథక్ చైవ భీష్మోఽయమితి చాబ్రువన్ ॥ 101
భీష్ముని ఆ దుష్కర కర్మను రాజులందరూ కలిసి, విడివిడిగా ప్రశంసించారు. 'ఇతడు భీష్ము'డని పలికారు. (101)
తచ్ఛ్రుత్వా దుష్కరం కర్మ కృతం భీష్మేణ శాంతనుః ।
స్వచ్ఛందమరణం తుష్టః దదౌ తస్మై మహాత్మనే ॥ 102
శాంతనుడు భీష్ముడు చేసిన ఆ దుష్కరకర్మను గూర్చి విని ఆనందించి ఆ మహానుభావునకు స్వచ్ఛందమరణాన్ని వరంగా ఇచ్చాడు. (102)
న తే మృత్యుః ప్రభవితా యావజ్జీవితుమిచ్ఛసి ।
త్వత్తో హ్యనుజ్ఞాం సంప్రాప్య మృత్యుః ప్రభవితానఘ ॥ 103
అనఘా! ణివు జీవించదలచు కొన్నంత కాలం మృత్యువు నిన్నేమీ చేయలేదు. నీ అనుజ్ఞను పొందిన తరువాతనే మృత్యువు నీపై తన ప్రభావాన్ని చూపగలదు. (103)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి సత్యవతీలాభోపాఖ్యానే శతతమోఽధ్యాయః ॥ 100 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున సత్యవతీలాభోపాఖ్యానమను నూరవ అధ్యాయము. (100)
(దాక్షిణాత్య అధికపాఠం 13 1/2 శ్లోకాలతో కలిపి మొత్తం 116 1/2 శ్లోకాలు)