99. తొంబది తొమ్మిదవ అధ్యాయము

వసిష్ఠోపాఖ్యానము.

శాంతనురువాచ
ఆపవో నామ కోన్వేషః వసూనాం కిం చ దుష్కృతమ్ ।
యస్యాభిశాపాత్ తే సర్వే మానుషీం యోనిమాగతాః ॥ 1
శాంతనుడిలా అన్నాడు - ఆ వసిష్ఠుడెవరు ? ఆయన శాపం వలన మానవులుగా జన్మించవలసినంత తప్పు ఏం చేశారు ఈ వసువులు? (1)
అనేన చ కుమారేణ త్వయా దత్తేన కిం కృతమ్ ।
యస్య చైవ కృతేనాయం మానుషేషు నివత్స్యతి ॥ 2
నీవు నాకిచ్చిన ఈ కుమారుడు చేసిన తప్పేమిటి? ఏ తప్పు చేసినందువలన ఈయన మానవుడుగా జీవించబోతున్నాడు? (2)
ఈశా వై సర్వలోకస్య వసవస్తే చ వై కథమ్ ।
మానుషేషూదపద్యంత తన్మమాచక్ష్వ జాహ్నవి ॥ 3
జాహ్నవీ! సమస్తలోకాలకూ అధీశ్వరులయిన ఈ వసువులు మానవజాతిలో ఎలా పుట్టారు? అదంతా నాకు చెప్పు. (3)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తా తదా గంగా రాజానమిదమబ్రవీత్ ।
భర్తారం జాహ్నవీ దేవీ శాంతనుం పురుషర్షభ ॥ 4
వైశంపాయనుడిలా అన్నాడు - పురుషశ్రేష్ఠా! తన భర్త శాంతనుడు అలా అడిగిన తర్వాత గంగాదేవి ఆరాజుకు ఇలా చెప్పింది. (4)
గంగోవాచ
యం లేభే వరుణః పుత్రం పురా భరతసత్తమ ।
వసిష్ఠనామా స మునిః ఖ్యాత ఆపవ ఇత్యుత ॥ 5
గంగ అంటున్నది - భరతశ్రేష్ఠా! పూర్వం వరుణుడు తన కుమారునిగా స్వీకరించిన వాడే వసిష్ఠమహర్షి. ఆయనకే ఆపవుడని కూడా ప్రసిద్ధి. (5)
తస్యాశ్రమపదం పుణ్యం మృగపక్షిసమన్వితమ్ ।
మేరోః పార్శ్వే నగేంద్రస్య సర్వర్తుకుసుమావృతమ్ ॥ 6
పర్వతరాజయిన మేరు పర్వతం ప్రక్కన ఆయన ఆశ్రమ ముండేది. అది పవిత్రమైనది. జంతువులతో, పక్షులతో నిండినది. అది అన్ని ఋతువులలోని పూలతో విలసిల్లేది. (6)
స వారుణిస్తపస్తేపే తస్మిన్ భరతసత్తమ ।
వనే పుణ్యకృతాం శ్రేష్ఠః స్వాదుమూలఫలోదకే ॥ 7
భరతసత్తమా! రుచికరాలయిన పండ్లు, మూలాలు, నీరు సమృద్ధిగా గల అక్కడి వనంలో పుణ్యాత్ములలో గొప్పవాడయిన ఆ వసిష్ఠమహర్షి తపస్సు చేసేవాడు. (7)
దక్షస్య దుహితా యా తు సురభీత్యభిశబ్దితా ।
గాం ప్రజాతా తు సా దేవీ కశ్యపాద్ భరతర్షభ ॥ 8
భరతశ్రేష్ఠా! సురభి అనే పేరు గల దక్షుని కుమార్తె కశ్యపుని వలన ఒక ఆవుకు జన్మనిచ్చింది. (8)
అనుగ్రహార్థం జగతః సర్వకామదుహాం వరా ।
తాం లేభే గాం తు ధర్మాత్మా హోమధేనుం స వారుణిః ॥ 9
ఆ ఆవు లోకానుగ్రహం కోసం జన్మించింది. కోరికల నన్నింటిని తీర్చగలవాటిలో శ్రేష్ఠమయినది. ధర్మాత్ముడైన వసిష్ఠమహర్షి హోమధేనువుగా ఆ ఆవును స్వీకరించాడు. (9)
సా తస్మిన్ తాపసారణ్యే వసంతీ మునిసేవితే ।
చచార పుణ్యే రమ్యే చ గౌరపేతభయా తదా ॥ 10
పవిత్రమై, రమణీయమై మునులచే సేవింపబడే ఆ వసిష్ఠాశ్రమంలో ఆ ఆవు నివసిస్తూ నిర్భయంగా సంచరించేది. (10)
అథ తద్ వనమాజగ్ముః కదాచిద్ భరతర్షభ ।
పృథ్వాద్యా వసవః సర్వే దేవా దేవర్షిసేవితమ్ ॥ 11
భరతశ్రేష్ఠా! ఒకప్పుడు పృథువు మొదలయిన ఆ దివ్యవసువులందరూ దేవ, ముని సేవితమైన ఆ ఆశ్రమానికి వచ్చారు. (11)
తే సదారా వనం తచ్చ వ్యచరంత సమంతతః ।
రేమిరే రమణీయేషు పర్వతేషు వనేషు చ ॥ 12
వారు వారి వారి భార్యలతో కలిసి ఆ ఆశ్రమ ప్రాంతమంతా తిరుగుతూ అందమైన ఆ పర్వతాలలో వనాలలో క్రీడించసాగారు. (12)
తత్రైకస్యాథ భార్యా తు వసోర్వాసవవిక్రమ ।
సంచరంతీ వనే తస్మిన్ గాం దదర్శ సుమధ్యమా ॥ 13
దేవేంద్రపరాక్రమా! ఆ వసువులలో ఒకరి ఇల్లాలు ఆ ఆశ్రమవనంలో తిరుగుతూ ఆ ఆవును చూచింది. (13)
నందినీం నామ రాజేంద్ర సర్వకామధుగుత్తమామ్ ।
సా విస్మయసమావిష్టా శీలద్రవిణసంపదా ॥ 14
రాజేంద్రా! అన్ని కోరికలనూ తీర్చటంలో అగ్రగణ్య అయిన ఆ నందినిని ( ఆ ఆవును) చూచి దాని శీలసంపదతో ఆ వసుపత్ని ఆశ్చర్యచకిత అయినది. (14)
ద్యవే వై దర్శయామాస తాం గాం గోవృషభేక్షణ ।
ఆపీనాం చ సుదోగ్ఖ్రీం చ సువాలధిఖురాం శుభామ్ ॥ 15
ఉపపన్నాం గుణైః సర్వైః శీలేనానుత్తమేన చ ।
ఏవంగుణసమాయుక్తాం వసవే వసునందినీ ॥ 16
దర్శయామాస రాజేంద్ర పురా పౌరవ నందన ।
ద్యౌస్తదా తాం తు దృష్ట్వైవ గాం గజేంద్రేంద్రవిక్రమ ॥ 17
ఉవాచ రాజంస్తాం దేవీం తస్యా రూపగుణాన్ వదన్ ।
ఏషా గౌరుత్తమా దేవీ వారుణేరసితేక్షణా ॥ 18
ఋషేస్తస్య వరారోహే యస్యేదం వనముత్తమమ్ ।
అస్యాః క్షీరం పిబేన్మర్త్యః స్వాదు యో వై సుమధ్యమే ॥ 19
దశవర్షసహస్రాణి స జీవేత్ స్థిరయౌవనః ।
ఏతచ్ఛ్రుత్వా తు సా దేవీ నృపోత్తమ సుమధ్యమా ॥ 20
తమువాచానవద్యాంగీ భర్తారం దీప్తతేజసమ్ ।
అస్తి మే మానుషే లోకే నరదేవాత్మజా సఖీ ॥ 21
మహారాజా! వసుపత్ని ఆ ఆవును ద్యోనామకుడైన తన భర్తకు చూపించింది. మంచి గిట్టలు, సలక్షణమైన తోక, పాలతో నిండిన పొదుగు మొదలైన సర్వశుభలక్షణాలతో, ఉత్తమమయిన నడవడితో ఆ నందిని అందగిస్తోంది. ద్యోవు ఆ ఆవును చూచి దాని రూప గుణాలను వివరిస్తూ " దేవీ! నల్లని కన్నులున్న ఈ ఉత్తమధేనువు ఈ ఆశ్రమాధిపతి అయిన వసిష్ఠమహర్షిది. దీని పాళను త్రాగిన మానవుడు స్థిరయౌవనంతో పదివేలసంవత్సరాలు జీవించగలడు" అని తెలియజెప్పాడు. నృపశ్రేష్ఠా! ఆ మాటలు విని అందమైన ఆ వసుపత్ని తేజోమూర్తి అయిన భర్తతో ఈ విధంగా అన్నది - మానవలోకంలో నానెచ్చెలి అయిన ఒక రాజకుమారి ఉన్నది. (15-21)
నామ్నా జితవతీ నామ రూపయౌవనశాలినీ ।
ఉశీనరస్య రాజర్షేః సత్యసంధస్య ధీమతః ॥ 22
దుహితా ప్రథితా లోకే మానుషీ రూపసంపదా ।
తస్యా హేతోర్మహాభాగ సవత్సాం గాం మమేప్సితామ్ ॥ 23
ఆమె పేరు జితవతి. సత్యసంధుడూ, ధీమంతుడూ అయిన ఉశీనరరాజర్షి కుమార్తె ఆమె యువతి, అందమైనది. అందంలో మానవలోకంలో ఖ్యాతి గడించింది. మహాభాగా! ఆమె కోసం దూడతో కూడా ఈ ఆవును తీసుకోవాలని నా కోరిక. (22,23)
ఆనయస్వామరశ్రేష్ఠ త్వరితం పుణ్యవర్ధన ।
యావదస్యాః పయః పీత్వా సా సఖీ మమ మానద ॥ 24
మానుషేషు భవత్వేకా జరారోగ వివర్జితా ।
ఏతన్మమ మహాభాగ కర్తుమర్హస్యనిందిత ॥ 25
పుణ్యవర్ధనా! అమరశ్రేష్ఠా! వెంటనే ఆ ధేనువును తీసికొనిరండి. దానిపాలను త్రాగి, నానెచ్చెలి తానొక్కతే మానవులలో జరారోగాలు లేని వ్యక్తి అవుతుంది. మహాత్మా! దోషరహితా! ఈ నా కోరికను తీర్చాలి. (24,25)
ప్రియం ప్రియతరం హ్యస్మాత్ నాస్తి మేఽన్యత్ కథంచన ।
ఏతచ్ఛ్రుత్వా వచస్తస్యాః దేవ్యాః ప్రియచికీర్షయా ॥ 26
పృథ్వాద్వైర్బ్రాతృభిః సార్ధం ద్యౌస్తదా తాం జహార గామ్ ।
తయా కమలపత్రాక్ష్యా నియుక్తో ద్యౌస్తదా నృప ॥ 27
ఋషేస్తస్య తపస్తీవ్రం న శశాక నిరీక్షితుమ్ ।
హృతా గౌః సా తదా తేన ప్రపాతస్తు న తర్కితః ॥ 28
నాకు ఇంతకన్న ప్రియమయినది కానీ ప్రియతరమైనది కానీ లేదు. ఆమె మాటలు విన్న ఆ వసువు భార్యకోరికను తీర్చదలచి పృథువు మొదలయిన తన సోదరులతో కలిసి ఆ ఆవును అపహరించాడు. రాజా! తన భార్య మాటమేరకు ప్రవర్తిస్తున్న ఆ వసువు వసిష్ఠ మహర్షి యొక్క తీవ్ర తపః ప్రభావాన్ని పరికించలేదు. ఆవును దొంగిలిస్తున్నాడే కానీ ముని కోపంతో స్వర్గభ్రష్టులం కావలసివస్తుందేమో అని ఆలోచించలేదు. (26-28)
అథాశ్రమపదం ప్రాప్తః ఫలాన్యాదాయ వారుణిః ।
న చాపశ్యత్ స గాం తత్ర సవత్సాం కాననోత్తమే ॥ 29
ఆ తరువాత పండ్లను సేకరించుకొని ఆశ్రమపదానికి వచ్చిన వసిష్ఠునకు ఆ వశిష్ఠాశ్రమంలో ఆవు కానీ దూడకానీ కనిపించలేదు. (29)
తతః స మృగయామాస వనే తస్మింస్తపోధనః ।
నాధ్యగచ్ఛచ్ఛ మృగయన్ తాం గాం మునిరుదారధీః ॥ 30
ఆ తరువాత తపోధనుడైన ఆ వసిష్ఠుడు ఆవుకై వెదికాడు. కానీ ఉదార బుద్ధి గల ఆ మహర్షికి ఆ ఆవు కనిపించలేదు. (30)
జ్ఞాత్వా తథాపనీతాం తాం వసుభిర్దివ్యదర్శనః ।
యయౌ క్రోధవశం సద్యః శశాప చ వసూంస్తదా ॥ 31
దివ్యదర్శనంతో వసువులు ఆ ఆవును దొంగిలించుకొని పోవటాన్ని గ్రహించి వసిష్ఠుడు కోపించి వెంటనే ఆ వసువులను శపించాడు. (31)
యస్మాన్మే వసవో జహ్రుః గాం వై దోగ్ద్రీం సువాలధిమ్ ।
తస్మాత్ సర్వే జనిష్యంతి మానుషేషు న సంశయః ॥ 32
చక్కని తోకగలిగి పాలనిచ్చే నా ఆవును వసువులు దొంగిలించారు. కాబట్టి వారంతా మానవులుగా జన్మిస్తారు. దీనికి తిరుగులేదు. (32)
ఏవం శశాప భగవాన్ వసూంస్తాన్ భరతర్షభ ।
వశం క్రోధస్య సంప్రాప్తః ఆపవో మునిసత్తమః ॥ 33
భరతశ్రేష్ఠా! ఇలా పూజ్యుడైన ఆ ముని సత్తముడు - వసిష్ఠుడు - క్రోధవశుడై వసువులను శపించాడు. (33)
శప్త్వా చ తాన్ మహాభాగః తపస్యేవ మనో దధే ।
ఏవం స శప్తవాన్ రాజన్ వసూనష్టౌ తపోధనః ॥ 34
మహాప్రభావో బ్రహ్మర్షిః దేవాన్ క్రోధసమన్వితః ।
అథాశ్రమపదం ప్రాప్తాః తే వై భూయో మహాత్మనః ॥ 35
శప్తాఃస్మ ఇతి జానంతః ఋషిం తముపచక్రముః ।
ప్రసాదయంతస్తమృషిం వసవః పార్థివర్షభ ॥ 36
లేభిరే న చ తస్మాత్తే ప్రసాదమృషిసత్తమాత్ ।
ఆపవాత్ పురుషవ్యాఘ్ర సర్వధర్మవిశారదాత్ ॥ 37
వారిని శపించి ఆ మహాత్ముడు మరల తపస్సు మీదనే మనస్సు పెట్టాడు. రాజా! ఇలా మహాప్రభావుడూ, తపోధనుడూ, బ్రహ్మర్షి అయిన వసిష్ఠుడు క్రోధావిష్టుడై ఎనిమిది మంది వసువులనూ శపించాడు. వసిష్ఠుడు శపించిన విషయం తెలిసి వసువులు మరల మహర్షి ఆశ్రమానికి వచ్చారు. పురుషోత్తమా! మహారాజా! వసువులు ఆ మహర్షిని అనునయించి కూడా సర్వధర్మవిశారదుడై ముని శ్రేష్ఠుడైన ఆ వసిష్ఠుని అనుగ్రహాన్ని పొందలేకపోయారు. (34-37)
ఉవాచ చ స ధర్మాత్మా శప్తా యూయం ధరాదయః ।
అనుసంవత్సరాత్ సర్వే శాపమోక్షమవాప్స్యథ ॥ 38
ధర్మాత్ముడైన ఆ వసిష్ఠుడు "ధరుడు మొదలగు మీ అందరినీ శపించాను. కానీ సంవత్సరం లోపలే మీ కందరికీ శాపవిముక్తి లభిస్తుంది. (38)
అయం తు యత్కృతే యూయం మయా శప్తాః స వత్స్యతి ।
ద్యౌస్తదా మానుషే లోకే దీర్ఘకాలం స్వకర్మణా ॥ 39
అయితే ఎవని కారణంగా మీరంతా నా చేత శపించ బడినారో ఆ ద్యోవు మాత్రం దీర్ఘకాలం మానవలోకంలోనే నివసించవలసి ఉంటుంది. అది ఆయన కర్మఫలం. (39)
నానృతం తచ్చికీర్షామి క్రుద్ధో యుష్మాన్ యదబ్రువమ్ ।
న ప్రజాస్యతి చాప్యేషః మానుషేషు మహామనాః ॥ 40
మీపై కోపించి నేనన్న మాటలు వ్యర్థం కావాలని నేను భావించటం లేదు. గొప్ప మనస్సు గల ఈ ద్యోవు మానవ లోకంలో సంతానాన్ని మాత్రం పొందడు. (40)
భవిష్యతి చ ధర్మాత్మా సర్వశాస్త్రవిశారదః ।
పితుః ప్రియహితే యుక్తః స్త్రీభోగాన్ వర్జయిష్యతి ॥ 41
సర్వశాస్త్రవిశారదుడై, ధర్మస్వరూపుడై తండ్రికి ప్రియాన్నీ, హితాన్నీ కలిగిస్తూ స్త్రీ భోగాలను వదలి జీవిస్తాడు. (41)
ఏవముక్త్వా వసూన్ సర్వాన్ స జగామ మహానృషిః ।
తతో మాముపజగ్ముస్తే సమేతా వసవస్తదా ॥ 42
వసువులందరితో ఇలా పలికి ఆ మహర్షి నిర్గమించాడు. అప్పుడు వసువులంతా కలిసి నా దగ్గరకు వచ్చారు. (42)
అయాచంత చ మాం రాజన్ వరం తచ్చ మయా కృతమ్ ।
జాతాన్ జాతాన్ ప్రక్షిపాస్మాన్ స్వయం గంగే త్వమంభసి ॥ 43
"గంగా! పుట్టినవారిని పుట్టినట్టుగా నీటిలో పడవేయి" అని వారు నన్ను అభ్యర్థించారు. నేను అంగీకరించాను. ఆ పని చేశాను. (43)
ఏవం తేషామహం సమ్యక్ శప్తానాం రాజసత్తమ ।
మోక్షార్థం మానుషాల్లోకాద్ యథావత్ కృతవత్యహమ్ ॥ 44
రాజశ్రేష్ఠా! ఈ విధంగా శాపగ్రస్తులయిన వారి శాపవిముక్తికై, మానవలోకం నుండి వారు బయటపడటానికై నేను మాట ఇచ్చిన మేరకు చక్కగా నిర్వహించాను. (44)
అయం శాపాదృషేస్తస్య ఏక ఏవ నృపోత్తమ ।
ద్యౌ రాజన్ మానుషే లోకే చిరం వత్స్యతి భారత ॥ 45
రాజశ్రేష్ఠా! భారతా! ఈ ద్యోవసువు మాత్రం ఒంటరియై ఆ మహర్షి శాపం వలన మానవలోకంలో చిరకాలం నివసిస్తాడు. (45)
(అయం దేవవ్రతశ్చైవ గంగాదత్తశ్చ మే సుతః ।
ద్వినామా శాంతనోః పుత్రః శాంతనోరధికో గుణైః ॥
అయం కుమారః పుత్రస్తే వివృద్ధః పునరేష్యతి ।
అహం చ తే భవిష్యామి ఆహ్వానోపగతా నృప ॥)
రాజా! ఇతనికి దేవవ్రతుడు, గంగాదత్తుడు అని రెండు పేర్లు. శాంతనుకుమారుడైనా గుణాలలో ఆయనను మించినవాడు. ఈ కుమారుడు పెద్దవాడైన తరువాత మరల నీ దగ్గరకు వస్తాడు. నేను కూడా నీవు పిలిచినప్పుడు నీ దగ్గరకు వస్తాను.
వైశంపాయన ఉవాచ
ఏతదాఖ్యాయ సా దేవీ తత్రైవాంతరధీయత్ ।
ఆదాయ చ కుమారం తం జగామాథ యథేప్సితమ్ ॥ 46
వైశంపాయనుడిలా అన్నాడు - ఇలా ఆ గంగానది ఆ కొడుకును తీసికొని అక్కడే అదృశ్యమై తన ఇచ్చవచ్చిన చోటికి వెళ్ళిపోయింది. (46)
స తు దేవవ్రతో నామ గాంగేయ ఇతి చాభవత్ ।
ద్యునామా శాంతనోః పుత్రః శాంతనోరధికో గుణైః ॥ 47
ఆ ద్యోవు శాంతనుసుతుడై, గుణాలతో అతనిని మించినవాడై దేవవ్రతుడు, గాంగేయుడు కూడా అయ్యాడు. (47)
శాంతనుశ్చాపి శోకార్తః జగామ స్వపురం తతః ।
తస్యాహం కీర్తయిష్యామి శాంతనోరధికాన్ గుణాన్ ॥ 48
ఆపై శాంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు. ఆ శాంతనుని విశేష గుణాలను మున్ముందు వివరిస్తాను. (48)
మహాభాగ్యం చ నృపతేః భారతస్య మహాత్మనః ।
యస్యేతిహాసో ద్యుతిమాన్ మహాభారతముచ్యతే ॥ 49
భరతవంశస్థుడూ, మహాత్ముడూ అయిన ఆ రాజు మహాభాగ్యాన్నీ వివరిస్తాను. ఆయన ఇతిహాసమే ఉజ్జ్వల మయిన మహాభారతమనబడుతోంది. (49)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి ఆపవోపాఖ్యానే నవనవతితమోఽధ్యాయః ॥ 99 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున సంభవపర్వమను ఉపపర్వమున ఆపవోపాఖ్యానమను తొంబది తొమ్మిదవ అధ్యాయము. (99)
(దాక్షిణాత్య అధికపాఠం 2 శ్లోకాలతో కలిసి మొత్తం 51 శ్లోకాలు)