53. ఏబది మూడవ అధ్యాయము
తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించుట.
శౌనక ఉవాచ
సర్పసత్రే తదా రాజ్ఞః పాండవేయస్య ధీమతః ।
జనమేజయస్య కే త్వాసన్ ఋత్విజః పరమర్షయః ॥ 1
శౌనకుడు చెప్పాడు. సూతనందనా! పాండవవంశజుడైన జనమేజయుడు ఈసర్పయాగంలో ఏఏమహర్షుల్ని ఋత్విజులుగా నియమించాడు? (1)
కే సదస్యా బభూవుశ్చ సర్పసత్రే సుదారుణే ।
విషాదజననేఽత్యర్థం పన్నగానాం మహాభయే ॥ 2
సర్పాలకు విషాదహేతువై, మహాభయంకరమై, పరమదారుణమైన ఆ సర్పయాగంలో సదస్యులెవరు? (2)
సర్వం విస్తరశస్తాత భవాచ్ఛంసితుమర్హతి ।
సర్పసత్రవిధానజ్ఞ విజ్ఞేయాః కే చ సూతజ ॥ 3
తాత! ఆ విషయాలను అన్నింటిని వివరించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. సర్పయాగం చేసేవిధానం తెలిసిన వాళ్లలో ఏఏమహర్షులు అక్కడ ఉన్నారు? (3)
సౌతిరువాచ
హంత తే కథయిష్యామి నామానీహ మనీషిణామ్ ।
యే ఋత్విజః సదస్యాశ్చ తస్యాసన్ నృపతేస్తదా ॥ 4
తత్ర హోతా బభూవాథ బ్రాహ్మణశ్చండభార్గవః ।
చ్యవనస్యాన్వయే ఖ్యాతః జాతో వేదవిదాం వరః ॥ 5
ఉద్గాతా బ్రాహ్మణో వృద్ధః విద్వాన్ కౌత్సోఽథ జైమినిః ।
బ్రహ్మాభవచ్ఛార్ ణ్గవః అథాధ్వర్యుశ్చాపి పింగలః ॥ 6
ఉగ్రశ్రవుడు అంటున్నాడు. ఆ నరపాలుడు చేస్తున్న సర్పయాగంలో అప్పుడు ఋత్విజులుగా, సదస్యులుగా ఉన్న మహనీయులపేర్లు నీకు చెపుతాను. ఆ యజ్ఞంలో వేదవేదాంగవిదుడై చ్యవనకుల విక్యాతుడైన చండభార్గవుడు హోత. ఉద్గాత వృద్ధ బ్రాహ్మణుడైన కౌత్సుడు, జైమిని శార్ ఙ్గరవులు బ్రహ్మలు. పింగళుడు అధ్వర్యుడు. (4-6)
సదస్యశ్చాభవద్ వ్యాసః పుత్రశిష్యసహాయవాన్ ।
ఉద్దాలకః ప్రమతకః శ్వేతకెతుశ్చ పింగలః ॥ 7
అసితో దేవలశ్చైవ నారదః పర్వతస్తదా ।
ఆత్రేయః కుండజఠరౌ ద్విజః కాలఘటస్తదా ॥ 8
వాత్స్యః శ్రుతశ్రవా వృద్ధః జపస్వాధ్యాయశీలవాన్ ।
కోహలో దేవశర్మా చ మౌద్గల్యః సమసౌరభః ॥ 9
ఏతే చాన్యే చ బహవః బ్రాహ్మణా వేదపారగాః ।
సదస్యాశ్చాభవంస్తత్ర సత్రే పారీక్షితస్య హ ॥ 10
ఇక ఈయాగంలోని సదస్యుల్ని చెపుతాను. శిష్య పుత్రసహితుడైన భగవంతుడైన వేదవ్యాసుడు, ఉద్దాలకుడు, ప్రమతకుడు, శ్వేతకేతువు, పింగలుడు, అసితుడు, దేవలుడు, నారదుడు, పర్వతుడు, ఆత్రేయుడు, కుండుడు, జఠరుడు, కాలఘటుడు, వాత్స్యుడు, స్వాధ్యాయ జపతత్పరుడును వృద్ధుడును అయిన శ్రుతశ్రవుడు, కోహలుడు, దేవశర్మ, మౌద్గల్యుడు, సమసౌరభుడు - వారేకాక వేదవిద్యాపారంగతులైన ఇతరులు కూడా ఆ సదస్సులో సభ్యులుగా కూర్చున్నారు. (7-10)
జుహ్వత్సు ఋత్విక్ష్వథ తదా సర్పసత్రే మహాక్రతౌ ।
అహయః ప్రాపతంస్తత్ర ఘోరాః ప్రాణిభయావహాః ॥ 11
ఆ మహాసర్పయాగంలో ఋత్విజులు ఆహుతులిస్తూ మంత్రాలను చదువుతూ ఏఏసర్పాలను పిలుస్తున్నారో ఆయా సర్పాలన్నీ ఆ యజ్ఞకుండంలో పడిపోతున్నాయి. (11)
వసమేదోవహాః కుల్యాః నాగానాం సంప్రవర్తితాః ।
వవౌ గంధశ్చ తుములః దహ్యతామనిశం తదా ॥ 12
అగ్నిలో పడి భస్మం అవుతున్న సర్పాలదేహాల నుండి వస, క్రొవ్వు కాలువలు ప్రవహిస్తున్నాయి. ఆ సర్పాలు అగ్నిలో పడుతూంటే వటి నుండి వచ్చే దుర్వాసనతో కలిసి గాలి వీస్తోంది. (12)
పతతాం చైవ నాగానాం ధిష్టితానాం తథాంబరే ।
అశ్రూయతానిశం శబ్దః పచ్యతాం చాగ్నినా భృశమ్ ॥ 13
ఆ సర్పాలు కొన్ని అగ్నిలో పడిపోతున్నాయి. మరికొన్ని ఆకాశంలో ఆగి ఉన్నాయి. ఆ ప్రకారంగా అగ్నిలో పడి ఉడుకుతున్న ధ్వనులు సదా వినిపిస్తున్నాయి. (13)
తక్షకస్తు స నాగేంద్రః పురందరనివేశనమ్ ।
గతః శ్రుత్వైవ రాజానం దీక్షితం జనమేజయమ్ ॥ 14
జనమేజయుడు సర్పయాగం చెయ్యడానికి దీక్షపూనాడని విన్న తక్షకుడు వెంటనే ఇంద్రుని భవనానికి శరణుకోరడానికి వెళ్లాడు. (14)
తతః సర్వం యథావృత్తమ్ ఆఖ్యాయ భుజగోత్తమః ।
అగచ్ఛచ్ఛరణం భీతః ఆగః కృత్వా పురందరమ్ ॥ 15
అక్కడ ఇంద్రుడికి జరిగిన విషయం అంతా తక్షకుడు చెప్పాడు. అపరాధం చేసిన తక్షకుడు మిక్కిలిగా భయపడుతూ ఇంద్రుని శరణుకోరాడు. (15)
తమింద్రః ప్రాహ సుప్రీతః న తవాస్తీహ తక్షక ।
భయం నాగేంద్ర తస్మాద్ వై సర్పసత్రాత్ కదాచన ॥ 16
ఇంద్రుడు తక్షకుడితో "నాగరాజా! సర్పయాగం వల్ల నీవు భయపడనక్కరలేదు" అని ప్రసన్నహృదయంతో చెప్పాడు. (16)
ప్రసాదితో మయా పూర్వం తవార్థాయ పితామహః ।
తస్మాద్ తవ భయం నాస్తి వ్యేతు తే మానసోజ్వరః ॥ 17
"నీకోసం ఇదివరకే బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకొన్నాను. కావున నీవు ఏమాత్రం భయపడనక్కరలేదు. నీమనస్సులోని చింత విడిచిపెట్టు" అని ఇంద్రుడు తక్షకుడికి అభయం ఇచ్చాడు. (17)
సౌతిరువాచ
ఏవమాశ్వాసితస్తేన తతః స భుజగోత్తమః ।
ఉవాస భవనే తస్మిన్ శక్రస్య ముదితః సుఖీ ॥ 18
అపుడు ఉగ్రశ్రవుడు (శౌనకునితో) అన్నాడు. ఆ విధంగా ఓదార్చబడిన తక్షకుడు సంతోషపడి దేవేంద్రుని భవనంలోనే ఉండిపోయాడు. (18)
అజస్రం నిపతత్స్వగ్నౌ నాగేషు భృశదుఃఖితః ।
అల్పశేషపరీవారః వాసుకిః పర్యతప్యత ॥ 19
సర్పాలన్నీ అగ్నికి ఆహుతి అవుతుండటంవల్ల వాసుకి మిక్కిలి దుఃఖించాడు. అనేకులు మరణించారు. కొద్ది మంది మాత్రమే మిగిలారు. దీన్ని తలచుకొని వాసుకి కుమిలిపోతున్నాడు. (19)
కశ్మలం చావిశద్ ఘోరం వాసుకిం పన్నగోత్తమమ్ ।
స ఘూర్ణమానహృదయః భగినీమిదమబ్రవీత్ ॥ 20
పన్నగోత్తముడయిన వాసుకి హృదయంలో బాధ, మోహం ఏర్పడ్డాయి. కలతచెందిన మనస్సుతో సోదరియైన జరత్కారువుతో వాసుకి ఈ విధంగా అన్నాడు. (20)
దహ్యంత్యంగాని మే భద్రే న దిశః ప్రతిభాంతి చ ।
సీదామీవ చ సమ్మోహాత్ ఘార్ణతీవ చ మే మనః ॥ 21
దృష్టిర్భ్రామ్యతి మేఽతీవ హృదయం దీర్యతీవ చ ।
పతిష్యామ్యవశోఽద్యాహం తస్మిన్ దీప్తే విభావసౌ ॥ 22
సోదరీ! నా శరీరం దహించుకుపోతోంది. దిక్కుతోచడం లేదు. శైథిల్యం చెందాను. నా మనస్సు భ్రమిస్తోంది. కళ్లు తిరుగుతున్నాయి. మనస్సు వికలమై పోతోంది. నేనుగూడా వశంతప్పి ఆ సర్పయాగాగ్నిలో పడిపోతాను. (21-22)
పారిక్షితస్య యజ్ఞోఽసౌ వర్తతేఽ స్మజ్జిఘాంసయా ।
వ్యక్తం మయాపి గంతవ్యం ప్రేతరాజనివేశనమ్ ॥ 23
జనమేజయుడు చేసే యజ్ఞం మన సర్పలోక నాశనానికే జరుగుతోంది. నేనుగూడా తప్పక యమలోకానికి వెళ్లిపోతాను. (23)
అయం స కాలః సంప్రాప్తః యదర్థమసి మే స్వసః ।
జరత్కారౌ మయా దత్తా త్రాయస్వాస్మాన్ సబాంధవాన్ ॥ 24
సోదరీ! ఈ ఆపదనుండి రక్షించుకొనడానికే నిన్ను జరత్కారునకిచ్చి వివాహంచేశాను. ఇపుడు ఆ సమయం వచ్చింది. నీవు బంధుకోటితో సహా మమ్మల్ని రక్షించు. (24)
ఆస్తీకః కిల యజ్ఞం తం వర్తంతం భుజగోత్తమే ।
ప్రతిషేత్స్యతి మాం పూర్వం స్వయమాహ పితామహః ॥ 25
సోదరీ! పూర్వం స్వయంగా బ్రహ్మయే నాతో ఆస్తీకుడే ఈ యజ్ఞాన్ని ఆపుచేయగలడని చెప్పాడు. (25)
తద్ వత్సే బ్రూహి వత్సం స్వం కుమారం వృద్ధసమ్మతమ్ ।
మమాద్య త్వం సభృత్యస్య మోక్షార్థం వేదవిత్తమమ్ ॥ 26
సోదరీ! నేడు నీవు మాకష్టాల్ని తొలగించి మమ్మల్ని కాపాడటానికి ఆస్తీకుడికి చెప్పు. అతడు బాలుడయి నప్పటికినీ పెద్దలవలె గౌరవింపబడతాడు. వేదవేత్తలలో శ్రేష్ఠుడు. (26)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పసత్రే వాసుకివాక్యే త్రిపంచాశత్తమోఽధ్యాయః ॥ 53 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగములో వాసుకి ఆవేదన అను ఏబదిమూడవ అధ్యాయము. (53)