52. ఏబది రెండవ అధ్యాయము
సర్పయాగములో సర్పాలు నశించుట.
సౌతిరువాచ
తతః కర్మ ప్రవవృతే సర్పసత్రవిధానతః ।
పర్యక్రామంశ్చ విధివత్ స్వే స్వే కర్మణి యాజకాః ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. మునీంద్రా! సర్పయజ్ఞం యథావిధిగా ప్రారంభం అయింది. ఋత్విజులందరు తమ తమ కార్యాలలో నిమగ్నమయి ఉన్నారు. (1)
ప్రావృత్య క్ఱ్రుష్ణవాసాంసి ధూమసంరక్తలోచనాః ।
జుహువుర్మంత్రవచ్చైవ సమిద్ధం జాతవేదసమ్ ॥ 2
అక్కడ అందరి కళ్లు యజ్ఞాగ్ని నుండి వచ్చిన పొగవల్ల ఎఱ్ఱబడ్డాయి. ఋత్విజులందరు నల్లటి వస్త్రాలు ధరించి మంత్రోచ్చారణలతో అగ్నిని ప్రజ్వలింపజేసి అందులో హోమాన్ని చేస్తున్నారు. (2)
కంపయంతశ్చ సర్వేషామ్ ఉరగాణాం మనాంసి చ ।
సర్పానాజుహువుస్తత్ర సర్వానగ్నిముఖే తదా ॥ 3
సమస్త సర్పాల మనస్సులను కూడా కంపింపజేస్తూ అప్పుడు ఆ యాగాగ్నిలోనికి సర్పాలను ఆహ్వానించారు. (3)
తతః సర్పాః సమాపేతుః ప్రదీప్తే హవ్యవాహనే ।
విచేష్టమానాః కృపణమ్ ఆహ్వయంతః పరస్పరమ్ ॥ 4
ఆపై సర్పాలన్నీ చేష్టలుడిగి దీనస్వరంతో ఒకరినొకరు కేకలు పెట్టుకుంటూ ఆ ప్రజ్వరిల్లుతున్న హోమగుండంలో పడిపోతున్నాయి. (4)
విస్ఫురంతః శ్వసంతశ్చ వేష్టయంతః పరస్పరమ్ ।
పుచ్ఫైః శిరోభిశ్చ భృశం చిత్రభానుం ప్రపేదిరే ॥ 5
పూత్కరిస్తూ, నిట్టూరుస్తూ, ఒకదానినొకటి తోకలతోను పడగలతోను పెనవేసుకొంటూ మండుతున్న అగ్నిలో అధికసంఖ్యలో సర్పాలన్నీ పడిపోతున్నాయి. (5)
శ్వేతాః కృష్ణాశ్చ నీలాశ్చ స్థవిరాః శిశవస్తథా ।
నదంతో వివిధాన్ నాదాన్ పేతుర్దీప్తే విభావసౌ ॥ 6
తెల్లసర్పాలు, నల్లసర్పాలు, నీలసర్పాలు, వృద్ధసర్పాలు, శిశుసర్పాలు ఆర్తనాదాలు చేస్తూ ఆ అగ్నిలో పడిపోతున్నాయి. (6)
క్రోశయోజనమాత్రా హి గోకర్ణస్య ప్రమాణతః ।
పతంత్యజస్రం వేగేన వహ్నోవగ్నిమతాం వర ॥ 7
కొన్ని సర్పాలు క్రోసుపొడవుతోను, మరికొన్ని నాలుగు క్రోసులతోను, మరికొన్ని చిన్న ప్రమాణాలు కల సర్పాలు అన్నీ హోమాగ్నికి ఆహుతి అయిపోతున్నాయి. (7)
ఏవం శతసహస్రాణి ప్రయుతాన్యర్బుదాని చ ।
అవశాని వినష్టాని పన్నగానాం తు తత్ర వై ॥ 8
ఈ విధంగా లక్షల, కోట్లసర్పాలు ఆ అగ్నిలోపడి భస్మం అయిపోయాయి. (8)
తురగా ఇవ తత్రాన్యే హస్తిహస్తా ఇవాపరే ।
మత్తా ఇవ చ మాతంగా మహాకాయా మహాబలాః ॥ 9
కొన్ని సర్పాలు గుఱ్ఱాలవలె ఉన్నాయి. మరికొన్ని ఏనుగు తుండంలాగా ఉన్నాయి. మరికొన్ని మదించిన ఏనుగుల్లాగా మహాకాయంతో మహాబలంతో ఉన్నాయి. (9)
ఉచ్చావచాశ్చ బహవః నానావర్ణా విషోల్బణాః ।
ఘోరాశ్చ పరిఘప్రఖ్యాః దందశూకా మహాబలాః ।
ప్రపేతురగ్నావురగాః మాతృవాగ్దండపీడితాః ॥ 10
ఆ సర్పాలు కొన్ని భయంకర విషపూరితాలు, చూడటానికి మహాభయంకరంగా ఉన్న సర్పాలు, పరిగ అనే ఆయుధంలాగా ఉన్న సర్పాలు - ఇలా అనేక సర్పాలు తల్లి ఇచ్చిన శాపంతో బాధపడుతూ సర్పయాగంలో ఆహుతి అయ్యాయి. (10)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సర్పసత్రోపక్రమే ద్విపంచాశత్తమోఽధ్యాయః ॥ 52 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సర్పయాగ మను ఏబదిరెండవ అధ్యాయము. (52)