50. ఏబదియవ అధ్యాయము
పరిక్షిత్తు మరణించుట - జనమేజయుని ప్రతీకారము.
మంత్రిణ ఊచుః
తతః స రాజా రాజేంద్ర స్కంధే తస్య భుజంగమమ్ ।
మునేః క్షుత్షామ ఆసజ్య స్వపురం పునరాయయౌ ॥ 1
మంత్రులు ఇలా చెపుతున్నారు. మహారాజా! పరిక్షిత్తు ఆకలితో కృశించి శమీకుని కంఠంలో మృతసర్పాన్ని పడవేసి తన రాజధానికి వచ్చాడు. (1)
ఋషేస్తస్య తు పుత్రోఽభూద్ గవి జాతో మహాయశాః ।
శృంగీ నామ మహాతేజాః తిగ్మవీర్యోఽతికోపనః ॥ 2
ఆ శమీకమహర్షికి శృంగి అనే తేజస్వి అయిన కుమారుడు ఉన్నాడు. గోశాలలో అతడు పుట్టాడు. అతడు మహాయశస్వి. శక్తిశాలి కూడా. కోపస్వభావం కలవాడు. (2)
బ్రాహ్మణం సముపాగమ్య మునిః పూజాం చకార హ ।
సఖ్యుః సకాశాత్ పితరం పిత్రా తే ధర్షితం పురా ।
మృతం సర్పం సమాసక్తం స్థాణుభూతస్య తస్య తమ్ ॥ 4
వహంతం రాజశార్దూల స్కంధేనానపకారిణమ్ ।
తపస్వినమతీవాథ తం మునిప్రవరం నృప ॥ 5
జితేంద్రియం విశుద్ధం చ స్థితం కర్మణ్యథాద్భుతమ్ ।
తపసా ద్యోతితాత్మానం స్వేష్వంగేషు యతం తదా ॥ 6
శుభాచారం శుభకథం సుస్థితం తమలోలుపమ్ ।
అక్షుద్రమనసూయం చ వృద్ధం మౌనవ్రతే స్థితమ్ ।
శరణ్యం సర్వభూతానం పిత్రా వినికృతం తవ ॥ 7
ఒకనాడు శృంగి ఆచార్యదేవుని దగ్గర పూజ చేశాడు. గుర్వాజ్ఞతో ఇంటికి వెళ్తుండగా అతని సహపాఠి, మిత్రుడును అయిన కృశుని ద్వారా తన తండ్రికి మీ తండ్రివలన కలిగిన అవమానాన్ని విన్నాడు. రాజా! ఆ సంగతిని చెప్తాను వినండి. శృంగి ఈ విషయాన్ని మిత్రుడివల్ల తెలుసుకొన్నాడు. "నా తండ్రి పరీక్షిత్తును ఏమీ అనకుండా నిశ్చలంగా ఉన్నాడు. అయినాసరే అతని కంఠంలో మృతసర్పాన్ని వేసి మీ తండ్రి వెళ్లిపోయాడు. అయినప్పటికీ శమీకుడు మీ తండ్రికి ఎటువంటి అపకారమూ చేయలేదు. ఆ శమీక మహర్షి గొప్ప తపస్వి. జితేంద్రియుడు. పవిత్రాత్ముడు. కర్మిష్ఠి. అద్భుతశక్తిశాలి. కాంతిమంతమయిన శరీరచ్ఛాయ గలవాడు. సంయమి. సదాచారపరుడు. నిశ్చలుడు. లోభరహితుడు. గంభీరుడు. ఏమాత్రం దోషదృష్టి లేనివాడు. వృద్ధుడు. మౌనవ్రతధారుడు. ఆశ్రితవత్సలుడును. ఇట్టి మహనీయునికి మీతండ్రి అవమానం కలిగించాడు. (3-7)
శశాపాథ మహాతేజాః పితరం తే రుషాన్వితః ।
ఋషేః పుత్రో మహాతేజాః బాలోఽపి స్థవిరద్యుతిః ॥ 8
ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకొని బాల్యావస్థలో ఉన్నా వృద్ధుడిలాగా తేజస్వి అయిన ఆ ఋషికుమారుడు శృంగి కోపావేశంతో మీ తండ్రికి శాపం ఇచ్చాడు. (8)
స క్షిప్రముదకం స్పృష్ట్వా రోషాదిదమువాచ ।
పితరం తేఽభిసంధాయ తేజసా ప్రజ్వలన్నివ ॥ 9
అనాగసి గురౌ యో మే మృతం సర్పమనాసృజత్ ।
తం నాగస్తక్షకః క్రుద్ధః తేజసా ప్రదహిష్యతి ॥ 10
ఆశీవిషస్తిగ్మతేజాః మద్వాక్యబలచోదితః ।
సప్తరాత్రాదితః పాపం పశ్య మే తపసో బలమ్ ॥ 11
శృంగి తేజస్సుతో ప్రజ్వలించిపోతున్నట్లు వెంటనే చేతిలో నీళ్లు తీసుకొని మీ తండ్రిని లక్ష్యంగా చేసుకొని కోపంతో ఇలా శాపం ఇచ్చాడు. "నిరపరాధుడైన నా తండ్రిపై మృతసర్పాన్ని పడవేసిన మహాపాపి నేటి నుండి ఏడు రోజులలోగా నా శక్తివంతమైన వాక్కుచే ప్రేరితుడై సర్పరాజైన తక్షకుని విషాగ్నిచేత దహింపబడుగాక! నా తపోబలాన్ని చూతువుగాక" అని కఠినంగా పలికాడు. (9-11)
ఇత్యుక్త్వా ప్రయయా తత్ర పితా యత్రాస్య సోఽభవత్ ।
దృష్ట్వా చ పితరం తస్మై తం శాపం ప్రత్యవేదయత్ ॥ 12
ఈ విధంగా శాపం ఇచ్చాక తన తండ్రి దగ్గరకు వెళ్లాడు శృంగి. తండ్రిని చూసి తాను పరీక్షిత్తుకు శాపం ఇచ్చిన విషయాన్ని చెప్పాడు. (12)
స చాపి మునిశార్దూలః ప్రేషయామాస తే పితుః ।
శిష్యం గౌరముఖం నామ శీలవంతం గుణాన్వితమ్ ॥ 13
అచఖ్యౌ స చ విశ్రాంతః రాజ్ఞః సర్వమశేషతః ।
శప్తోఽసి మమ పుత్రేణ యత్తో భవ మహీపతే ॥ 14
శపకథనాన్ని విన్న శమీకుడు మీ తండ్రి దగ్గరకు తన శిష్యుడైన గౌరముఖుని సందేశం పంపాడు. గౌరముఖుడు సాధుశీలుడు. గుణవంతుడును. అతడు మీ తండ్రికి శాపవృత్తాంతాన్ని అంతా చెప్పి తన గురువు ఇచ్చిన సందేశాన్ని ఇలా చెప్పాడు. "మహారాజా! నా కుమారుడు నీకు శాపం ఇచ్చాడు. అందుచేత నీవు ఏమరుపాటులేక జాగరూకతతో ఉండు. (13,14)
తక్షకస్త్వాం మహారాజ తేజసాసౌ దహిష్యతి ।
శ్రుత్వా చ తద్ వచో ఘోరం పితా తే జనమేజయ ॥ 15
యత్తోఽభవత్ పరిత్రస్తః తక్షకాత్ పన్నగోత్తమాత్ ।
తతస్తస్మింస్తు దివసే సప్తమే సముపస్థితే ॥ 16
రాజ్ఞః సమీపం బ్రహ్మర్షిః కాశ్యపో గంతుమైచ్ఛత ।
తం దదర్శాథ నాగేంద్రః తక్షకః కాశ్యపం తదా ॥ 17
మహారాజా! తక్షకుడు అనే సర్పరాజు మిమ్మల్ని దహించుతాడు" అని శమీకుని సందేశాన్ని గౌరముఖుడు మీ తండ్రికి చెప్పాడు. ఈ భయంకరమైన మాటను విన్న మీ తండ్రి తక్షకసర్పరాజువలన భయపడుతూ జాగరూకుడై ఉంటున్నాడు. తరువాత ఏడవరోజు వచ్చింది. ఆ రోజున కాశ్యపుడు అనే బ్రహ్మర్షి మీ తండ్రి దగ్గరకు విషచికిత్సకోసం బయలుదేరాడు. మార్గమధ్యంలో తక్షకుడు కాశ్యపుని కలుసుకొన్నాడు. (15-17)
తమబ్రవీత్ పన్నగేంద్రః కాశ్యపం త్వరితం ద్విజమ్ ।
క్వ భవాం స్త్వరితో యాతి కిం చ కార్యం చికీర్షతి ॥ 18
త్వరితగతిని వెళ్తున్న కాశ్యపుని చూసి తక్షకుడు బ్రాహ్మణవేషధారియై అతనితో "బ్రాహ్మణోత్తమా! మీరు ఏపని మీద ఎక్కడికి ఇంత కంగారుగా వెళ్తున్నారు?" అని ప్రశ్నించాడు. (18)
కాశ్యప ఉవాచ
యత్ర రాజా కురుశ్రేష్ఠః పరిక్షిన్నామ వై ద్విజ ।
తక్షకేణ భుజంగేన ధక్ష్యతే కిల సోఽద్య వై ॥ 19
గచ్ఛామ్యహం తం త్వరితః సద్యః కర్తుమపజ్వరమ్ ।
మయాభిపన్నం తం చాపి న సర్పో ధర్షయిష్యతి ॥ 20
కశ్యపుడు అన్నాడు. "బ్రాహ్మణా! నేను కురువంశ శ్రేష్ఠుడయిన పరీక్షిత్తుమహారాజు దగ్గరకు వెళ్తున్నాను. ఈవేళ ఆ రాజును తక్షకుడు అనే సర్పరాజు కరుస్తాడట. అందుచేత అతనికి చికిత్సచేసి విషాన్ని హరించి జీవింపచేద్దామని త్వరత్వరగా వెళ్తున్నాను. నావల్ల సర్పబాధనుండి ఆ మానవేశ్వరుడు రక్షింపబడాలి. (19,20)
తక్షక ఉవాచ
కిమర్థం తం మయా దష్టం సంజీవయితుమిచ్ఛసి ।
అహం స తక్షకో బ్రహ్మన్ పశ్య మే వీర్యమద్భుతమ్ ॥ 21
న శక్తస్త్వం మయా దష్టం తం సంజీవయితుం నృపమ్ ।
ఇత్యుక్త్వా తక్షకస్తత్ర సోఽదశద్ వై వనస్పతిమ్ ॥ 22
తక్షకుడు ఇలా అన్నాడు. "బ్రాహ్మణోత్తమా! నేను కరిస్తే నీవు ఎందుకు అతనిని బ్రతికించుకోవాలని అనుకొంటున్నావు? నేను ఆ తక్షకుడను- నా అద్భుతశక్తిని చూడు! నేను రాజును కరిస్తే అతనిని నీవు జీవింపచేయలేవు" అని చెప్పి పక్కనే ఉన్న వృక్షాన్ని కరిచి విషపూరితం చేశాడు. (21,22)
స దష్టమాత్రో నాగేన భస్మీభూతోఽభవన్నగః ।
కాశ్యపశ్చ తతో రాజన్ అజీవయత తం నగమ్ ॥ 23
కరవడంతోనే ఆ వృక్షం భస్మం అయిపోయింది. పిమ్మట కాశ్యపుడు తన మంత్ర విద్యాబలంతో ఆ వృక్షాన్ని జీవింపచేశాడు. (23)
తతస్తం లోభయామాస కామం బ్రూహీతి తక్షకః ।
స ఏవముక్తస్తం ప్రాహ కాశ్యపస్తక్షకం పునః ॥ 24
ధనలిప్సురహం తత్ర యామీత్యుక్తశ్చ తేన సః ।
తమువాచ మహాత్మానం తక్షకః శ్లక్ష్ణయా గిరా ॥ 25
ఈ అద్భుతాన్ని గమనించి తక్షకుడు కాశ్యపుని తన ప్రలోభానికి గురిచేశాడు. కాశ్యపుడితో "నీకోరిక ఏమిటో చెప్పు. నేను తప్పక తీరుస్తాను" అని తక్షకుడు అడుగగానే తనకు ధనం కావాలని కోరాడు. అపుడు కాశ్యపునితో మధురంగా మాట్లాడుతూ తక్షకుడు ఇలా అన్నాడు. (24,25)
యావద్ధనం ప్రార్థయసే రాజ్ఞస్తస్మాత్ తతోఽధికమ్ ।
గృహాణ మత్త ఏవ త్వం సంనివర్తస్వ చానఘ ॥ 26
మహాత్మా! మహారాజునుండి ఎంతధనాన్ని కోరుతున్నావో అంతకంటె అధికమయిన ధనాన్ని నేను ఇస్తాను. దాన్ని తీసుకొని మరలిపో. (26)
స ఏవముక్తో నాగేన కాశ్యపో ద్విపదాం వరః ।
లబ్ధ్వా విత్తం నివవృతే తక్షకాద్ యావదీప్సితమ్ ॥ 27
తక్షకుని మాటలను విన్న కాశ్యపుడు తనకు కావలసిన ధనాన్ని తీసుకొని వెంటనే మరలిపోయాడు. (27)
తస్మిన్ ప్రతిగతే విప్రే ఛద్మనోపేత్య తక్షకః ।
తం నృపం నృపతిశ్రేష్ఠం పితరం ధార్మికం తవ ॥ 28
ప్రాసాదస్థం యత్తమపి దగ్ధవాన్ విషవహ్నినా ।
తతస్త్వం పురుషవ్యాఘ్ర విజయాయాభిషేచితః ॥ 29
కాశ్యప బ్రాహ్మణుడు వెళ్లిపోయిన తరువాత తక్షకుడు రహస్యవేషంలో మహాత్ముడయిన మీతండ్రి గారి దగ్గరకు వచ్చాడు. రాజప్రాసాదంలో పరిక్షిత్తు ఎంతో జాగరూకతతో ఉన్నప్పటికిని తక్షకుడు అతనిని భస్మం చేశాడు. జనమేజయమహారాజా! పిదప నీవు రాజ్యాభిషిక్తుడవు అయినావు. (28,29)
ఏతద్ దృష్టం శ్రుతం చాపి యథావన్నృపసత్తమ ।
అస్మాభిర్నిఖిలం సర్వం కథితం తేఽతిదారుణమ్ ॥ 30
రాజోత్తమా! చెప్పిన విషయం అంతా కఠినంగాను దుఃఖదాయకంగాను ఉన్నప్పటికినీ నీవు అడగటం వల్ల పూర్తిగా శాపవృత్తాంతాన్ని నీకు చెప్పాము. (30)
శ్రుత్వా చైవం నరశ్రేష్ఠ పార్థివస్య పరాభవమ్ ।
అస్య చర్షేరుత్తంకస్య విధత్స్వ యదనంతరమ్ ॥ 31
మహారాజా! ఈ విధంగా తక్షకుడు మీ తండ్రికి అపకారం చేశాడు. ఈ ఉదంకమహర్షికి గూడా తక్షకుడు చాలా కష్టాన్ని కలిగించాడు. ఈ విషయాలన్నీ విన్నారు. అనంతర కర్తవ్యాన్ని తమరు చేయండి. (31)
సౌతిరువాచ
ఏతస్మిన్నేవ కాలే తు స రాజా జనమేజయః ।
ఉవాచ మంత్రిణః సర్వాన్ ఇదం వాక్యమరిందమః ॥ 32
ఉగ్రశ్రవుడు అంటున్నాడు. "శౌనకా! శత్రుదమనుడైన జనమేజయుడు తన మంత్రులందరినీ పిలిచి ఈ విధంగా చెప్పాడు. (32)
జనమేజయ ఉవాచ
అథ తత్ కథితం కేన యద్ వృత్తం తద్ వనస్పతౌ ।
ఆశ్చర్యభూతం లోకస్య భస్మరాశీకృతం తదా ॥ 33
యద్ వృక్షం జీవయామాస కాశ్యపస్తక్షకేణ వై ।
మానం మంత్రైర్హతవిషః న ప్రణశ్యేత కాశ్యపాత్ ॥ 34
జనమేజయుడు మంత్రులతో ఇలా అంటున్నాడు. తక్షకుడు వృక్షాన్ని కరిస్తే అది భస్మం అయిందికదా. మరల అది జీవింపచేయబడిందని ఎవరు చెప్పారు? తక్షకుడు చెట్టును భస్మంచేస్తే కాశ్యపుడు దాన్ని పూర్తిగా బ్రతికించాడు. ఇది ఆశ్చర్యం కదా! కాశ్యపుడు తన మంత్రాలతో తక్షక విషాన్ని అణచివేసి ఉంటే మా తండ్రి బ్రతికి ఉండేవాడు. (33,34)
చింతయామాస పాపాత్మా మనసా పన్నగాధమః ।
దష్టం యది మయా విప్రః పార్థివం జీవయిష్యతి ॥ 35
తక్షకః సంహతవిషః లోకే యాస్యతి హాస్యతామ్ ।
విచింత్వైవం కృతా తేన ధ్రువం తుష్టిర్ద్విజస్య వై ॥ 36
పాపాత్ముడు, నీచుడు అయిన ఆ తక్షకాధముడు ఇలా ఆలోచించి ఉంటాడు. "నేను రాజును కరిస్తే కశ్యపుడు ఆవిషాన్ని హరించి రాజును బ్రతికింపచేస్తాడు. ఈ విధంగా జరిగితే ఈ తక్షకుడు లోకంలో పరిహాసానికి గురి అవుతాడు" అని ఆలోచించి కాశ్యపబ్రాహ్మణునికి ధనం ఇచ్చి సంతోషపెట్టి ఉంటాడు. (35,36)
భవిష్యతి హ్యుపాయేన యస్య దాస్యామి యాతనామ్ ।
ఏకం తు శ్రోతుమిచ్ఛామి తద్ వృత్తం నిర్జనే వనే ॥ 37
సంవాదం పన్నగేంద్రస్య కాశ్యపస్య చ కస్తదా ।
శ్రుతవాన్ దృష్టవాంశ్చాపి భవత్సు కథమాగతమ్ ।
శ్రుత్వా తస్య విధాస్యేఽహం పన్నగాంతకరీం మతిమ్ ॥ 38
భవిష్యత్తులో ఏదో ఒక విషయాన్ని ఆలోచించి తప్పక ఆ నీచుని దండిస్తాను. ఇంకా ఒక విషయాన్ని గురించి వినాలని అనుకొంటున్నాను. నాగరాజు తక్షకుడికీ, కాశ్యపబ్రాహ్మణుడికీ జరిగిన సంవాదాన్ని ఎవరు విన్నారు? అది నిర్జనవనంగదా! వాళ్లని ఎవరు చూశారు? మీదాకా ఈ విషయం ఎలా వచ్చింది? ఇదంతా తెలుసుకొన్న తరువాత తక్షకుని నాశనానికి ఆలోచిస్తాను. (37,38)
మంత్రిణ ఊచుః
శృణు రాజన్ యథాస్మాకం యేన తత్ కథితం పురా ।
సమాగతం ద్విజేంద్రస్య పన్నగేంద్రస్య చాధ్వని ॥ 39
తస్మిన్ వృక్షే నరః కశ్చిత్ ఇంధనార్థాయ పార్థివ ।
విచిన్వన్ పూర్వమారూఢః శుష్కశాఖాం వనస్పతౌ ॥ 40
మంత్రులు ఈవిధంగా బదులు చెప్పారు. "మహారాజా! వినండి. ఆకాశ్యపతక్షకులకు మార్గంలో మరొకవ్యక్తి కలిశాడు. అతడు ఈ సమాచారాన్ని అంతటినీ మాకు చెప్పాడు. తక్షకుడు భస్మంచేసిన వృక్షాన్ని కట్టెలకోసం వచ్చిన ఒకడు అంతకుముందే ఎక్కి ఎండు కొమ్మపై కూర్చొని ఉన్నాడు. (39,40)
న బుధ్యేతాముభౌ తౌ చ నగస్థం పన్నగద్విజౌ ।
సహ తేనైవ వృక్షేణ భస్మీభూతోఽభవన్నృప ॥ 41
దగ్ధం చేయబోయే చెట్టుమీద మరొక మనుష్యుడు ఉన్నాడని తక్షకుడు గాని, కాశ్యపుడుగాని గుర్తించలేదు. రాజా! తక్షకుడు వృక్షాన్ని కరచిన తరువాత ఆ మనుష్యుడు విషాగ్నికి భస్మం అయిపోయాడు. (41)
ద్విజప్రభావాద్ రాజేంద్ర వ్యజీవత్ సవనస్పతిః ।
తేనాగమ్య నరశ్రేష్ఠ పుంసాస్మాసు నివేదితమ్ ॥ 42
రాజేంద్ర! కాశ్యపబ్రాహ్మణుని ప్రభావం వల్ల ఆ వృక్షంతో పాటే ఈ మానవుడు గూడా పునర్జీవితుడయ్యాడు. ఆ వ్యక్తి మాదగ్గరకు వచ్చి తక్షక బ్రాహ్మణ సంవాదాన్ని మాకు వినిపించాడు. (42)
యథావృత్తం తు తత్ సర్వం తక్షకస్య ద్విజస్య చ ।
ఏతత్ తే కథితం రాజన్ యథా దృష్టం శ్రుతం చ యత్ ।
శ్రుత్వా చ నృపశార్దూల విధత్స్వ యదనంతరమ్ ॥ 43
రాజా! ఈవిధంగా మేము చూసినది, విన్నదీ అయిన ఈ విషయాన్ని మీకు వినిపించాము. దీనినంతటిని మీరు విన్నారుకదా! ఇపుడు మీకు ఏమి చేస్తే ఉచితమనిపిస్తోందో దానిని చేయండి. (43)
సౌతిరువాచ
మంత్రిణాం తు వచః శ్రుత్వా స రాజా జనమేజయః ।
పర్యతప్యత దుఃఖార్తః ప్రత్యపింషత్ కరం కరే ॥ 44
సౌతి చెపుతున్నాడు. శౌనకా! మంత్రులు చెప్పిన వృత్తాంతాన్ని అంతటిని విన్న జనమేజయుడు దుఃఖంతో కుమిలిపోయాడు. కుపితుడయ్యాడు. చేతితో చేతిని అప్పళించాడు. (44)
నిఃశ్వాసముష్ణమసక్ఱ్రుద్ దీర్ఘం రాజీవలోచనః ।
ముమోచాశ్రూణి చ తదా నేత్రాభ్యాం ప్రరుదన్ నృపః ॥ 45
దీర్ఘంగా వేడిగా నిట్టూర్చాడు. పద్మంలాంటి కళ్లలోంచి కన్నీరు విడిచాడు. విలపించాడు. (45)
ఉవాచ చ మహీపాలః దుఃఖశోకసమన్వితః ।
దుర్ధరం బాష్పముత్సృజ్య స్పృష్ట్వా చాపో యథావిధి ॥ 46
ముహూర్తమివ చ ధ్యాత్వా నిశ్చిత్య మనసా నృపః ।
అమర్షీ మంత్రిణః సర్వాన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 47
ఆ రాజు కొద్దిసేపు ధ్యానించి మనస్సులో ఒక నిశ్చయానికి వచ్చాడు. దుఃఖంతోను, కోపంతోను బాధపడుతున్న అతడు విధిపూర్వకంగా నీటిని స్పృశించి తన మంత్రులకు ఈవిధంగా చెపుతున్నాడు. (46,47)
జనమేజయ ఉవాచ
శ్రుత్వైతద్ భవతాం వాక్యం పితుర్మే స్వర్గతిం ప్రతి ।
నిశ్చితేయం మమ మతిః యా చ తాం మే నిబోధత ।
అనంతరం చ మన్యేఽహం తక్షకాయ దురాత్మనే ॥ 48
ప్రతికర్తవ్య మిత్యేవం యేన మే హింసితః పితా ।
శృంగిణం హేతుమాత్రం యః కృత్వా దగ్ధా చ పార్థివమ్ ॥ 49
జనమేజయుడు (మంత్రులతో) ఇలా అన్నాడు. "మంత్రులారా! నాతండ్రి స్వర్గతుడైన విషయాన్ని మీరు చెప్పిన తరువాత నేను నాకర్తవ్యాన్ని నాబుద్ధిద్వారా నిశ్చయించుకొన్నాను. నేను ఏమి చేయబోవునదీ మీకు చెపుతున్నాను. వినండి. దురాత్ముడైన తక్షకునిపై తప్పకుండా ప్రతీకారం చేసి తీరుతాను. శృంగి చెప్పినంతమాత్రాన మహారాజైన నాతండ్రిని తన విషాగ్నితో దగ్ధం చేస్తాడా? (48,49)
ఇయం దురాత్మనా తస్య కాశ్యపం యో న్యవర్తయత్ ।
యదాఽఽగచ్ఛేత్ స వై విప్రః నమ జీవేత్ పితా మమ ॥ 50
ఈ పాపాత్ముడు కాశ్యపుని వెనక్కి మరలింపచేశాడు. కాశ్యపుడు నాతండ్రి దగ్గరకు వచ్చి ఉంటే తప్పక జీవింపచేసేవాడే గదా! (50)
పరిహీయేత కిం తస్య యది జీవేత్ స పార్థివః ।
కాశ్యపస్య ప్రసాదేన మంత్రిణాం వినయేన చ ॥ 51
మంత్రుల వినయప్రవర్తనచేతనూ, కాశ్యపుని అనుగ్రహం వలనను నాతండ్రి జీవింపబడితే తక్షకుడికి కలిగే నష్టం ఏమిటి? (51)
స తు వారితవాన్ మోహాత్ కాశ్యపం ద్విజసత్తమమ్ ।
సంజిజీవయిషుం ప్రాప్తం రాజానమపరాజితమ్ ॥ 52
నా తండ్రిని జీవింపజేయడానికి కాశ్యపుడు వచ్చేవాడే. కాని అతనిని ప్రలోభపెట్టి తక్షకుడు అతడిని రాకుండా చేశాడు. (52)
మహానతిక్రమో హ్యేషః తక్షకస్య దురాత్మనః ।
ద్విజస్య యోఽదదద్ ద్రవ్యం మా నృపం జీవయేదితి ॥ 53
తక్షకుడు ఈ విషయంలో పెద్ద తప్పే చేశాడు. నాతండ్రిని బ్రతికించవద్దని ఆ బ్రాహ్మణునికి ధనం ఇచ్చి పంపివేశాడు. ఇది మహాపాపం కదా! (53)
ఉత్తంకస్య ప్రియం కర్తుమ్ ఆత్మనశ్చ మహత్ ప్రియమ్ ।
భవతాం చైవ సర్వేషాం గచ్ఛామ్యపచితిం పితుః ॥ 54
అందుచేత ఉత్తంకమహర్షికీ మాకు సంతోషం కలిగించడానికి తప్పకుండా తక్షకుడిపై ప్రతీకారాన్ని తీర్చుకొంటాను." (54)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పరిక్షిన్మంత్రి సంవాదే పంచాశత్తమోఽధ్యాయః ॥ 50 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున పరిక్షిత్ మంత్రిసంవాదము అను ఏబదవ అధ్యాయము. (50)