49. నలువది తొమ్మిదవ అధ్యాయము

పరిక్షిత్తు వేటకు వెళ్లుట - శమీకుని అవమానించుట.

శౌనక ఉవాచ
యదపృచ్ఛత్ తదా రాజా మంత్రిణో జనమేజయః ।
పితుః స్వర్గగతిం తన్మే విస్తరేన పునర్వద ॥ 1
శౌనకుడు అడుగుతున్నాడు. సూతనందనా! జనమేజయుడు ఉత్తంకుని మాటల్ని విన్నతరువాత తనమంత్రులను తన తండ్రి పరిక్షిత్తు స్వర్గస్థుడయిన విషయాన్ని గురించి పూర్తిగా చెప్పమని కోరాడు గదా! ఆ విషయాన్ని మాకు సవిస్తరంగా చెప్పు. (1)
సౌతిరువాచ
శృణు బ్రహ్మన్ యథాపృచ్ఛన్ మంత్రిణో నృపతిస్తదా ।
యదా చాఖ్యాతవంతస్తే నిధనం తత్ పరీక్షితః ॥ 2
సౌతి చెప్పాడు. "బ్రాహ్మణోత్తమా! వినండి. ఆ సమయంలో మహారాజుకు మంత్రులు ఏమిచెప్పారో, పరీక్షిత్తు మృత్యువు గురించి జరిగిన సంభాషణను నేను విన్నాను. (2)
జనమేజయ ఉవాచ
జానంతి స్మ భవంతస్తద్ యథావృత్తం పితుర్మమ ।
ఆసీద్ యథా స నిధనం గతః కాలే మహాయశాః ॥ 3
జనమేజయుడు చెప్పాడు. "నా తండ్రియొక్క జీవితకాలంలో ఆయనయొక్క ఆచారవ్యవహారాల్ని మీరు ఎరుగుదురుకదా! వాటిని చెప్పండి. అంత్యకాలంలో ఆయనకు మృత్యువు ఎలా సంభవించిందో తెలుపండి. (3)
శ్రుత్వా భవత్సకాశాద్ధి పితుర్వృత్తమశేషతః ।
కల్యాణం ప్రతిపత్స్యామి విపరీతం న జాతుచిత్ ॥ 4
మీరందరు నా తండ్రితో సన్నిహిత సంబంధం కలవారు కాబట్టి ఆయన చరిత్రను చెప్పండి. అది వింటే నా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. (4)
సౌతిరువాచ
మంత్రిణోఽథాబ్రువన్ వాక్యం పృష్టాస్తేన మహాత్మనా ।
సర్వే ధర్మవిదః ప్రాజ్ఞాః రాజానం జనమేజయమ్ ॥ 5
సౌతి చెపుతున్నాడు. పరిక్షిత్తుయొక్క మంత్రులందరు ధర్మజ్ఞులు, బుద్ధిమంతులును. జనమేజయుడు అడిగినదానికి సమాధానంగా వారు ఆ వృత్తాంతాన్ని అంతటినీ చెప్పారు. (5)
మంత్రిణ ఊచుః
శృణు పార్థివ యద్ బ్రూషే పితుస్తవ మహాత్మనః ।
చరితం పార్ధివేంద్రస్య యథా నిష్ఠా గతశ సః ॥ 6
మంత్రులు ఇలా అడిగారు. మహారాజా! నీవు అడిగిన విషయాన్ని చెపుతాం. వినండి. పరీక్షిత్తుమహారాజు చరిత్రనీ, అతనికి మృత్యువు ప్రాప్తించిన విధానాన్ని చెపుతాం. (6)
ధర్మాత్మా చ మహాత్మా చ ప్రజాపాలః పితా తవ ।
ఆసీదిహ యథావృత్తః స మహాత్మా శృణుష్వ తత్ ॥ 7
"మహారాజా! మీ తండ్రి ధర్మాత్ములు. మహాత్ములు. గొప్ప ప్రజాపాలకులును. ఆ మహాత్ముడు ఏ విధంగా వ్యవహరిస్తూ రాజ్యపాలన చేశాడో దాన్ని చెపుతాం. (7)
చాతుర్వర్ణ్యం స్వధర్మస్థం స కృత్వా పర్యరక్షత ।
దర్మతో ధర్మవిద్ రాజా ధర్మో విగ్రహవానివ ॥ 8
నాలుగువర్ణాలను స్వధర్మము నందు నిలిచేటట్లుచేసి ధర్మపరిపాలన చేశాడు. అతడు రూపుదాల్చిన ధర్మమే సుమా! (8)
రరక్ష పృథివీం దేవీం శ్రీమానతులవిక్రమః ।
ద్వేష్టారస్తస్య నైవాస్య స చ ద్వేష్టి న కంచన ॥ 9
సాటిలేని పరాక్రమం కల అతడు సకలసంపదలు కలిగి భూమండలాన్ని పరిపాలించాడు. అతడిని ద్వేషించే వారే లేరు. అతడు ఎవరినీ ఎప్పుడూ ద్వేషించలేదు. (9)
సమః సర్వేషు భూతేషు ప్రజాపతిరివాభవత్ ।
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రాశ్చైవ స్వకర్మసు ॥ 10
స్థితాః సుమనసో రాజన్ తేవ రాజ్ఞా స్వధిష్ఠితాః ।
విధవానాథవికలాన్ కృపణాంశ్చ బభార సః ॥ 11
ప్రజాపతి అయిన బ్రహ్మతో సమానుడైన ఆ పరిక్షిత్తు ప్రతిప్రాణిని సమదృష్టితో ఆదరించాడు. మహారాజా! మీ తండ్రి పాలనలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్రులు అందరు తమతమ ధర్మాలను సక్రమంగా పాటించేవారు. దేవతలుకూడ అతని చేత చక్కగా పూజింపబడేవారు. మీ తండ్రి విధవలకు, అనాథలకు, వికలాంగులకు, దీనులకు పోషణ రక్షణ భారాన్ని వహించాడు. (10,11)
సుదర్శః సర్వభూతానామ్ ఆసీత్ సోమైవాపరః ।
తుష్టపుష్టజనః శ్రీమాన్ సత్యవాగ్ దృడవిక్రమః ॥ 12
ఆ మహారాజు రెండవ చంద్రుడిలాగ ప్రాణికోటికి అంతటికి సుందరంగాను, సులభుడుగాను దర్శనమిచ్చేవాడు. అతనిరాజ్యంలో ప్రజలందరు తుష్టిగా, పుష్టిగా ఆనందిస్తూ ఉన్నారు. అతడు ధనసంపన్నుడేకాదు, అమిత పరాక్రమశాలి. సత్యవాది కూడ. (12)
ధనుర్వేదే తు శిష్యోఽభూత్ నృపః శారద్వతస్య సః ।
గోవిందస్య ప్రియశ్చాసీత్ పితా తే జనమేజయ ॥ 13
మీ తండ్రి కృపాచార్యుని దగ్గర శిష్యరికం చేసి విలువిద్యలో పండితుడయ్యాడు. అంతేకాదు. ఆయన శ్రీకృష్ణపరమాత్మకు ఇష్టుడు కూడా. (13)
లోకస్య చైవ సర్వస్య ప్రియ ఆసీన్మహాయశాః ।
పరిక్షీణేషు కురుషు సోత్తరాయామజీజనత్ ॥ 14
పరీక్షిదభవత్ తేన సౌభద్రస్యాత్మజో బలీ ।
రాజధర్మార్థకుశలః యుక్తః సర్వగుణైర్వృతః ॥ 15
మహాయశస్వి అయిన ఆ మహారాజు జగత్తులో అందరికీ ఇష్టుడయినాడు. కురుకులం క్షీణిస్తున్న సమయంలో అతడు ఉత్తరగర్భంలో జన్మించాడు. అందుచేత అభిమన్యుకుమారుడైన అతనికి పరీక్షిత్ అనుపేరు పెట్టారు. రాజధర్మంలో, అర్థనీతిలో ఆయన నేర్పరి. అన్ని సద్గుణాలు మీతండ్రిని వరించాయి. (14,15)
జితేంద్రియశ్చాత్మవాంశ్చ మేధావీ ధర్మసేవితా ।
షడ్వర్గజిన్మహాబుద్ధిః నీతిశాస్త్రవిదుత్తమః ॥ 16
అతడు జితేంద్రియుడు. సంయమనంతో వ్యవహరించేవాడు. మహామేధావి. నిరంతర ధర్మసేవకుడు. కామ క్రోద లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువుల్ని జయించిన మహానుభావుడు. నీతికోవిదులలో అతడు ప్రథముడు. (16)
ప్రజా ఇమాస్తత్ర పితా షష్టివర్షాణ్యపాలయత్ ।
తతో దిష్టాంత మాపన్నః సర్వేషాం దుఃకమావహన్ ॥ 17
తతస్త్వం పురుషశ్రేష్ఠ ధర్మేన ప్రతిపేదివాన్ ।
ఇదం వర్షసహస్రాణి రాజ్యం కురుకులాగతమ్ ।
బాల ఏవాభిషిక్తస్త్వం సర్వభూతానుపాలకః ॥ 18
60 సంవత్సరాలు నీ తండ్రి అత్యుత్తమంగా ప్రజారంజకంగా పాలన చేశాడు. అనంతరం మా అందరికీ దుఃఖం కలిగేటట్లుగా అతనికి మోక్షప్రాప్తి కలిగింది. తరువాత మీరు ధర్మంతో రాజ్యం పొందారు. వేల సంవత్సరాలుగా కురువంశంలో వస్తున్న ఈ రాజ్యాన్ని మీరు చిన్నతనంలోనే పొంది, సర్వప్రాణులనూ రక్షిస్తున్నారు. (17,18)
జనమేజయ ఉవాచ
నాస్మిన్ కులే జాతు బభూవ రాజా
యో న ప్రజానాం ప్రియకృత్ ప్రియశ్చ ।
విశేషతః ప్రేక్ష్య పితామహానాం
వృత్తం మహద్వృత్తపరాయణానామ్ ॥ 19
జనమేజయుడు అంటున్నాడు. "మంత్రులారా! మా ఈ వంశంలో ఇటువంటి ప్రభువు లేడు. ప్రజలకు ప్రియకార్యాలు చేస్తూ వారి ప్రేమకు పాత్రుడయిన రాజు పూర్వం లేడుగదా! మా ప్రపితామహులు మహాపురుషులు, వారు ధర్మపరాయణులు. వారి సదాచారాలతో సమానంగా మా తండ్రి కీర్తి పొందాడు. (19)
కథం నిధనమాపన్నః పితా మమ తథావిధః ।
ఆచక్షధ్వం యథావన్మే శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 20
అటువంటి ధర్మాత్ముడైన మా తండ్రికి అటువంటి మృత్యువు ఎలావచ్చింది? సవిస్తరంగా తెలుసుకోవాలని కోరుతున్నాను. (20)
సౌతిరువాచ
ఏవం సంచోదితా రాజ్ఞా మంత్రిణస్తే నరాధిపమ్ ।
ఊచుః సర్వే యథావృత్తం రాజ్ఞః ప్రియహితైషిణః ॥ 21
ఉగ్రశ్రవుడు చెప్పాడు. ఆ విధంగా అడిగిన మహారాజుకు అతని మంత్రులు పరిక్షిత్తు మరణాన్ని గురించి యథాతథంగా చెప్తున్నారు. (21)
మంత్రిణః ఊచుః
స రాజా పృథివీపాలః సర్వశస్త్రభ్ర్రుతాం వరః ।
బభూవ మ్ఱ్రుగయాశీలః తవ రాజన్ పితా సదా ॥ 22
యథా పాండుర్మహాబాహుః ధనుర్ధరవరో యుధి ।
అస్మాస్వాసజ్య సర్వాణి రాజకార్యాణ్యశేషతః ॥ 23
స కదాచిత్ వనగతః మృగం వివ్యాధ పత్రిణా ।
విద్ధ్వా చాన్వసరత్ తూర్ణం తం మృగం గహనే వనే ॥ 24
మంత్రులు చెప్పారు. ఆ రాజు వేటమీద ఆసక్తి కలిగి ఉండేవాడు. పాండురాజులాగా ధనుర్ధారియై వేటకు వెళ్లేవాడు. రాజకార్యాలన్నీ మామీద పెట్టి వెళ్లేవాడు. ఒకనాడు వేటకు వెళ్లి ఒక బాణంతో మృగాన్ని కొట్టాడు. అది పారిపోతుంటే అడవిలో దాని వెంట పరుగెత్తాడు. (22-24)
పదాతిర్బద్ధనిస్త్రింశః తతాయుధకలాపవాన్ ।
న చాససాద గహనే మృగం నష్టం పితా తవ ॥ 25
కత్తిపట్టుకొని పరుగెత్తే అతనికి ఆయుధ కలాపర కూడా ఉంది. ఎంత ప్రయత్నించినా మీ తండ్రికి దాని ఆచూకీ తెలియలేదు. (25)
పరిశ్రాంతో వయఃస్థశ్చ షష్టివర్షో జరాన్వితః ।
క్షుధితః స మహారణ్యే దదర్శ మునిసత్తమమ్ ॥ 26
స తం పప్రచ్ఛ రాజేంద్రః మునిం మౌనవ్రతే స్థితమ్ ।
న చ కించిదువాచైవం పృష్టోఽపి స మునిస్తదా ॥ 27
మీ తండ్రికి అరవైసంవత్సరాల వయసుంది. వేటలో మిక్కిలిగా అలసిపోయాడు. ఆకలిదప్పులతో ఉన్నాడు. ఆ స్థితిలో అక్కడ ఒక మహర్షిని చూశాడు. అతడు మౌనవ్రతంతో తపస్సు చేసుకొంటున్నాడు. మహారాజు అతనిని మృగం గురించి అడిగాడు. మౌనంగా ఉండటంవల్ల ఆ మహర్షి ఎటువంటి సమాధానం చెప్పలేదు. (26,27)
తతో రాజా క్షుచ్ఛ్రమార్తః తం మునిం స్థాణువత్ స్థితమ్ ।
మౌనవ్రతధరం శాంతం సద్యో మన్యువశం గతః ॥ 28
మహర్షి స్థాణువులాగా నిశ్చేష్టుడై కదలకుండా కూర్చుని ఉన్నాడు. ఆకలితోను, అలసటతోను ఉన్న రాజేంద్రుడు వ్యాకులపడి ప్రశాంతంగా మౌనవ్రతంతో ఉన్న ఆ మునిపై క్రోధావేశుడయ్యాడు. (28)
న బుబోధ చ తం రాజా మౌనవ్రతధరం మునిమ్ ।
స తం క్రోధసమావిష్టః ధర్షయామాస తే పితా ॥ 29
మౌనవ్రతంతో ఉన్నమహర్షిని రాజు మేల్కొలుపలేదు. కోపంతో ఆ మునిని మీతండ్రి అవమానించాడు. (29)
మృతం సర్పం ధనుష్కోట్యా సముతిక్షిప్య ధరాతలాత్ ।
తస్య శుద్ధాత్మనః ప్రాదాత్ స్కంధే భరతసత్తమ ॥ 30
భరతవంశోత్తమా! అక్కడ భూమిపై చచ్చిపడి ఉన్న సర్పాన్ని తన వింటికొనతో తీసి పరమపవిత్రుడైన మునియొక్క భుజంమీద వేశాడు. (30)
న చోవాచ స మేధావీ తమథో సాధ్వసాధు వా ।
తస్థౌ తథైవ చాక్రుద్ధః సర్పం స్కంధేన ధారయన్ ॥ 31
మేధావియయిన మహర్షి మీ తండ్రిని మంచిగా గాని చెడుగా గాని ఏమీ అనలేదు. మెడలో మృతసర్పం ధరిస్తూనే అలాగే కోపించకుండా ఉండిపోయాడు. (31)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి పారిక్షితీయే ఏకోనపంచాశత్తమోఽధ్యాయః ॥ 49 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున పారిక్షితీయము అను నలువది తొమ్మిదవ అధ్యాయము. (49)