47. నలువది యేడవ అధ్యాయము

జరత్కారుడు జరత్కారువును వివాహమాడుట.

సౌతిరువాచ
వాసుకిస్త్వబ్రవీద్ వాక్యం జరత్కారుమృషిం తదా ।
సనామ్నీ త్వ కన్యేయం స్వసా మే తపసాన్వితా ॥ 1
భరిష్యామి చ తే భార్యాం ప్రతిక్షేమాం ద్విజోత్తమ ।
రక్షణం చ కరిష్యేఽస్యాః సర్వశక్త్యా తపోధన ।
త్వదర్థం రక్ష్యతే చైషా మయా మునివరోత్తమ ॥ 2
ఉగ్రశ్రవుడు శౌనకునితో చెపుతున్నాడు. వాసుకి జరత్కారు మునీంద్రునితో "బ్రాహ్మణోత్తమా! ఈ కన్యక పేరు కూడా నీపేరు వంటిదే. జరత్కారు వనే. ఈమె నా సోదరి. ఈమె కూడా మీ వలనే తపస్విని కూడా. కాబట్టి మా సోదరిని భార్యగా స్వీకరించండి. ఈమె యొక్క పోషణాభారాన్ని నేనే చూసుకొంటాను. ఇప్పటివరకు మీకొరకే నిరీక్షిస్తూ ఈమెను రక్షించుకొంటున్నాను" అన్నాడు. (1,2)
ఋషిరువాచ
న భరిష్యేఽహమేతాం వై ఏష మే సమయః కృతః ।
అప్రియం చ న కర్తవ్యం కృతే చైవాం త్యజామ్యహమ్ ॥ 3
జరత్కారుడు అన్నాడు- నాగరాజా! ఈమె పోషణభారాన్ని నేను వహించను. ఇది నా నియమం. ఎప్పుడూ నాకు ఇష్టంలేని పనిని చేయకూడదు. చేస్తె నేను ఈమెను విడిచి వెళ్లిపోతాను. (3)
సౌతిరువాచ
ప్రతిశ్రుతే తు నాగేన భరిష్యే బగినీమితి ।
జరత్కారుస్తదా వేశ్మ భుజగస్య జగామ హ ॥ 4
అపుడు సౌతి ఇలా అన్నాడు. నాగరాజు ఈ షరతుల్ని అంగీకరించాడు. "నా సోదరి భరణ పొషణల్ని నేను భరిస్తాను" అని హామీ ఇచ్చాక జరత్కారుడు వాసుకి ఇంటికి వెళ్లాడు. (4)
తత్ర మంత్రవిదాం శ్రేష్ఠః తపోవృద్ధో మహావ్రతః ।
జగ్రాహ పాణిం ధర్మాత్మా విధిమంత్రపురస్కృతమ్ ॥ 5
ఆ వాసుకి భవనంలో మంత్రవేత్తలలో అగ్రగణ్యుడును, తపోధనుడు, మహావ్రతుడు, ధర్మాత్ముడు అయిన జరత్కారుడు విధియుక్తంగా మంత్రోచ్ఛారణలతో నాగకన్య జరత్కారువును పాణిగ్రహణం చేసుకొన్నాడు. (5)
తతో వాసగృహం రమ్యం పన్నగేంద్రస్య సమ్మతమ్ ।
జగామ భార్యామాదాయ స్తూయమానో మహర్షిభిః ॥ 6
వాసుకి భవనంలోకి జరత్కారుడు, తనభార్యను తీసుకొనివెళ్లాడు. మహర్షులందరూ వీరి దాంపత్యాన్ని ప్రశంసించారు. (6)
శయనం తత్ర సంకఌప్తం స్పర్ధ్యాస్తరణసంవృతమ్ ।
తత్ర భార్యాసహాయో వై జరత్కారురువాస హ ॥ 7
అక్కడ అభిలషణీయమైన ప్రక్క (దుప్పటి)తో కూడిన శయనం అలంకరింపబడింది. అచట భార్యాసహాయుడై జరత్కారుడు నివసించాడు. (7)
స తత్ర సమయం చక్రే భార్యయా సహ సత్తమః ।
విప్రియం మే న కర్తవ్యం న చ వాచ్యం కదాచన ॥ 8
సాధువుంగవుడయిన జరత్కారుడు భార్యతో తన షరతును ఈ విధంగా చెప్పాడు. "నీవు ఎప్పుడూ నాకు ఇష్టంకాని పని చేయవద్దు. అంతేకాక ఎప్పుడూ అప్రియమైన మాటలు కూడా చెప్పవద్దు. (8)
త్యజేయం విప్రియే చ త్వాం కృతే వాసం చ తే గృహే ।
ఏతద్ గృహాణ వచనం మయా యత్ సముదీరితమ్ ॥ 9
నా మాటను కాదని ఎప్పుడైనా అప్రియంగా వాచా కర్మణా ప్రవర్తించినా నిన్ను, నీ గృహాన్నికూడా విడిచిపెట్టి వెళ్లిపోతాను. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించు అని చెప్పాడు. (9)
తతః పరమసంవిగ్నా స్వసా నాగపతేస్తదా ।
అతిదుఃఖాన్వితా వాక్యం సమువాచైవమస్త్వితి ॥ 10
ఈ విధంగా చెప్పిన భర్తమాటలను విని ఆమె ఉద్విగ్నురాలయి దుఃఖించి భర్తతో "అలాగే అగుగాక" అని మాట ఇచ్చింది. (10)
తథైవ సా చ భర్తారం దుఃఖశీలముపాచరత్ ।
ఉపాయైః శ్వేతకాకీయైః ప్రియకామా యశాస్వినీ ॥ 11
యశస్విని అయిన నాగకన్య (కత్తి మీద సాముగా) భర్తపెట్టిన షరతులకు అనుగుణంగా పతిసేవ చేస్తున్నది. ఆమె కుక్కవలె జాగ్రత్తవహిస్తూ, లేడివలె భయంతో ఉంటూ, కాకిలాగా ఇంగితజ్ఞానంతో మెలగుతూ, ఉపాయంగా భర్తకు ఇష్టంగా వ్యవహరిస్తూ, పతివ్రతగా ఆరాధిస్తూ కాలం గడుపుతున్నది. (11)
వి: సం: శ్వేత కాకీయైః = శ్వ+ఏత+కాకీయైః = కుక్కవలె, లేడివలె, కాకివలె అని అర్థం.
వి: తె: వీటినన్నిటినీ సంగ్రహించి నన్నయ "వాలుపయి నడచునట్లు ఆ బాలిక పగలూ రాత్రీ ఆతనిని సేవించేది" అని వ్రాశాడు.
ఋతుకాలే తతః స్నాతా కదాచిద్ వాసుకేః స్వసా ।
భర్తారం వై యథాన్యాయమ్ ఉపతస్థే మహామునిమ్ ॥ 12
ఒక సమయానికి జరత్కారువుకు ఋతుకాలం వచ్చింది. ఋతుస్నాతయై ఆమె సముచితంగా జరత్కారుని సేవలో ఉన్నది. (12)
తతః తస్యాః సమభవద్ గర్భో జ్వలనసంనిభః ।
అతీవ తెజసా యుక్తః వైశ్యానరసమద్యుతిః ॥ 13
పిమ్మట ఆమె గర్భవతి అయింది. ప్రజ్వలిస్తున్న అగ్నితో సమానమైన తేజస్వి, తపస్సంపన్నుడు అయిన శిశువు ఆమె గర్భంలో పెరుగుతున్నాడు. (13)
శుక్లపక్షే యథా సోమః వ్యవర్దత తథైవ సః ।
తతః కతిపయాహస్య జరత్కారుర్మహాయశః ॥14
ఉత్సంగేఽస్యాః శిరః కృత్వా సుష్వాప పరిఖిన్నవత్ ।
తస్మింశ్చ సుప్తే విప్రేంద్రే సవితాస్తమియాద్ గిరిమ్ ॥ 15
శుక్లపక్షంలోని చంద్రుడిలాగా ఆమె గర్భంలోని శిశువు క్రమక్రమంగా పెరుగుతున్నాడు. కొన్నిరోజుల తరువాత జరత్కారుడు ఏదో అలసటతో ఉండి భార్య ఒడిలో తల ఉంచి నిద్రించాడు. ఆ బ్రాహ్మణోత్తముడు నిద్రించే సమయంలో సూర్యభగవానుడు అస్తాద్రిని చేరాడు. (14,15)
అహ్నః పరిక్షయే బ్రహ్మన్ తతః సాచింతయత్ తదా ।
వాసుకేర్భగినీ భీతా ధర్మలోపాన్మనస్వినీ ॥ 16
కిం మ మే సుకృతం భూయాద్ భర్తురుత్థాపనమ్ న వా ।
దుఃఖశీలో హి ధర్మాత్మా కథం నాస్యాపరాధ్నుయామ్ ॥ 17
సంధ్యాకాలం వచ్చింది. సంధ్యా సమయంలో సూర్యునికి అర్ఘ్యమివ్వకుండా నిద్రించడం ధర్మంకాదని, ఆమె భావించి పతికి ధర్మలోపం జరుగుతుందేమోనని భయపడ్డది ఆ మహాపతివ్రత. "ధర్మాత్ముడైన నా పతియొక్క స్వభావం కఠినమైనది. నిద్రలేపితే నాకు పుణ్యం కలుగుతుందా? నా పతిదృష్టిలో అపరాధం చేసినదానినవుతానా?" అని వితర్కించుకొన్నది జరత్కారువు. (16,17)
కోపో వా ధర్మశీలస్య ధర్మలోపోఽథవా పునః ।
ధర్మలోపో గరీయాన్ వై స్యాదిత్యత్రాకరోన్మతిమ్ ॥ 18
ఉత్థాపయిష్యే యద్యేనం ధ్రువం కోపం కరిష్యతి ।
ధర్మలోపో భవేదస్య సంధ్యాతిక్రమణే ధ్రువమ్ ॥ 19
"భర్తను మేలుకొలిపితే తప్పకుండా నాపై కోపపడతారు. నిద్రలేపకపోతే సంధ్యోపాసనా సమయం దాటిపోతుంది. అపుడు తప్పక ధర్మలోపం జరుగుతుంది. కాబట్టి భర్త ఈ సందిగ్ధ సమయంలో కోపించినా సహిస్తాను కానీ ధర్మలోపాన్ని జరుగనీయను. తప్పకుండా మేలుకొలుపుతాను" అని నిశ్చయించుకొన్నది. (18,19)
ఇతి నిశ్చిత్య మనసా జరత్కారుర్భుజంగమా ।
తమృషిం దీప్తతపసం శయానమనలోపమమ్ ॥ 20
ఉవాచేదం వచః శ్లక్ష్ణం తతో మధురభాషిణీ ।
ఉత్తిష్ఠ త్వం మహాభాగ సూర్యోఽస్తముపగచ్ఛతి ॥ 21
ఆ విధంగా మనస్సులో నిశ్చయించుకొని అగ్నితో సమానమైన తేజస్వీ, తపోధనుడూ అయిన భర్తను మృదుభాషలతో మేల్కొలుపుతూ "మహాభాగా! నిద్రనుండి లేవండి. సూర్యభగవానుడు అస్త్రాద్రిని చేరుకొంటున్నాడు. (20,21)
సంధ్యాముపాస్య భగవన్ అపః స్పృష్ట్వా యతవ్రతః ।
ప్రాదుష్కృతాగ్నిహోత్రోఽయం ముహూర్తో రమ్యదారుణః ॥ 22
సంధ్యా ప్రవర్తతే పశ్చిమాయాం దిశి ప్రభో ।
దేవా! నియమపూర్వకంగా ఆచమనం చేసి సంధ్యోపాసన చేయండి. ఇపుడు అగ్నిహోత్రం సిద్ధంగా ఉంది. ఈ సమయం ధర్మసాధనకు సమయం. ప్రాణులన్నీ కదలిపోతున్నాయి. అందువలన ఇది రమణీయంగాను, భయంకరంగాను ఉన్న సమయం. పశ్చిమదిక్కున సంధ్యాప్రకటనం జరుగుతోంది. ఆ దిక్కులో ఆకాశాం ఎఱ్ఱగా ఉంది. (22 1/2)
ఏవముక్తః స భగవాన్ జరత్కారుర్మహాతపాః ॥ 23
భార్యాం ప్రస్ఫురమాణాఉష్ఠః ఇదం వచనమబ్రవీత్ ।
అవమానః ప్రయుక్తోఽ యం త్వయా మమ భుజంగమే ॥ 24
భార్య ఆ విధంగా చెప్పిన తరువాత జరత్కారుడు నిద్రనుండి లేచాడు. పెదవులు అదిరేటట్లు ఆమెతో ఈవిధంగా అన్నాడు. "నాగకన్యా! నీవు నన్ను అవమానించావు. (23,24)
సమీపే తే న వత్స్యామి గమిష్యామి యథాగతమ్ ।
శక్తిరస్తి న వామోరు మయి సుప్తే విభావసోః ॥ 25
అస్తం గంతుం యథాకాలమ్ ఇతి మే హృది వర్తతే ।
న చాప్యవమతస్యేహ వాసో రోచేత కస్యచిత్ ॥ 26
కిం పునర్ధర్మశీలస్య మమ వా మద్విధస్య వా ।
అందుచేత నీ దగ్గఱ ఇక ఉండను. ఎలా వచ్చానో అలాగునే వెళ్లిపోతాను. నేను నిద్రిస్తూ ఉండగా సూర్యుడికి అస్తమించే శక్తి ఉందా? అని అనుకొన్నాను. ఇట్టి అవమానం ఎవరూ భరించలేరు. నాలాంటి ధర్మశీలునికి వేరే చెప్పాలా?" (25,26 1/2)
ఏవముక్తా జరత్కారుః భర్త్రా హృదయకంపనమ్ ॥ 27
అబ్రవీద్ భగినీ తత్ర వాసుకేః సంనివేశనే ।
నావమానాత్ కృతవతీ తవాహం విప్రబోధనమ్ ॥ 28
ధర్మలోపో న తే విప్ర స్యాదిత్యేన్మయాకృతమ్ ।
ఉవాచ భార్యామిత్యుక్తః జరత్కారుర్మహాతపాః ॥ 29
ఋషిః కోపసమావిష్టః త్యక్తుకామో భుజంగమామ్ ।
న మే వాగనృతం ప్రాహ గమిష్యేఽ హం భుజంగమే ॥ 30
భర్తపలికిన భయంకరమైన ఆ మాటలకు జరత్కారువు వణికిపోయింది. దుఃఖార్తయై భర్తతో "స్వామీ! నేను మీకు ఎట్టి అవమానమూ తలపెట్టలేదు. మీకు ధర్మలోపం జరుగకూడదని భావించి నిద్రలేపాను" అంది. జరత్కారుడు కోపోద్రేకంతో ఆమెను విడిచిపెట్ట దలచి భార్యకు ఈవిధంగా చెప్పాడు. "నాగకన్యా! నేను ఎప్పుడూ అసత్యం పలుకలేదు. అందుకని నిశ్చయంగా ఇక్కడ నుండి నిన్ను విడిచి వెళ్లిపోతున్నాను. (27-30)
సమయో హ్యేష మే పూర్వం త్వయా సహ మిథః కృతః ।
సుఖమస్మ్యుషితో భద్రే బ్రూయాస్త్యం భ్రాతరం శుభే ॥ 31
ఇతో మయి గతే భీరు గతః స భగవానితి ।
త్వం చాపి మయి నిష్క్రాంతే న శోకం కర్తుమర్హసి ॥ 32
ఇంతకు పూర్వమే నేను నీకు నా షరతును చెప్పాను. ఇక్కడ నేను ఎంతో సుఖపడ్డాను. నేను ఇక్కడ నుండి వెళ్లిపోయానని నీ సోదరుడు వాసుకితో చెప్పు. నేను వెళ్లిన తరువాత నీవు దుఃఖించరాదు." (31,32)
ఇత్యుక్తా సానవద్యాంగీ ప్రత్యువాచ మునిం తదా ।
జరత్కారుం జరత్కారుః చింతాశోకపరాయణా ॥ 33
బాష్పగద్గదయా వాచా ముఖేన పరిశుష్యతా ।
కృతాంజలిర్వరారోహా పర్యశ్రునయనా తతః ॥ 34
ధైర్యమాలంబ్య వామోరుఃహృదయేన ప్రవేపతా ।
న మామర్హసి ధర్మజ్ఞ పరిత్యక్తుమనాగసమ్ ॥ 35
ధర్మే స్థితాం స్థితో ధర్మే సదా ప్రియహితే రతామ్ ।
ప్రదానే కారణం యచ్చ మమ తుభ్యం ద్విజోత్తమ ॥ 36
తదలబ్ధవతీం మందాం కిం మాం వక్ష్యతి వాసుకిః ।
మాతృశాపాభిభూతానాం జ్ఞాతీనాం మమ సత్తమ ॥ 37
అపత్యమీప్సితం త్వత్తః తచ్చ తావన్న దృశ్యతే ।
త్వత్తో హ్యపత్యలాభేన జ్ఞాతీనాం మే శివం భవేత్ ॥ 38
జరత్కారుడు ఆ మాటలు చెప్పిన తరువాత నిర్దోషి అయిన ఆమె ఆ జరత్కారునితో చింతాకులచిత్తంతో దీనవదనయై కన్నీరు కారుస్తూ అంజలిఘటించి గద్గదస్వరంతో కొంతధైర్యం తెచ్చుకొని ఇట్లా అంది. "ధర్మజ్ఞా! మీరు ఎప్పుడూ ధర్మాన్ని విడిచిపెట్టరు. నేను కూడా పతివ్రతనై నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ మిమ్మల్ని సేవిస్తూనే ఉన్నాను. నిరపరాధిని అయిన నన్ను పరిత్యజించటం ధర్మం కాదు కదా! బ్రాహ్మణోత్తమా! ఈ సదాశయంతోనే నా సోదరుడు వాసుకి నన్ను మీతో పాణిగ్రహణం చేయించాడు. సోదరుడు నాతో "సోదరీ! మన కుటుంబంలోని వారు తల్లి ఇచ్చిన శాపానికి గురి అయ్యారు. నీ సంతానం వల్ల మేము ఉద్ధరింపబడతాం" అని చెప్పాడు. ఇప్పటివరకూ సంతానం కలుగలేదు. నీవలన పుట్టిన సంతానంతో నా జ్ఞాతులకు శాపభయంలేకుండా శుభం జరుగుతుంది. (33-38)
సంప్రయోగే భవేన్నాయం మమ మోఘస్త్వయా ద్విజ ।
జ్ఞాతీనాం హితమిచ్ఛంతీ భగవంస్త్వాం ప్రసాదయే ॥ 39
దేవా! నాతో మీకు ఏర్పడిన సంబంధం వ్యర్థం కారాదు. నా బంధుజనానికి మీరు హితవు కోరినట్లయితే నాప్రార్థనను ఆలకించండి. (39)
ఇమమవ్యక్తరూపం మే గర్భమాధాయ సత్తమ ।
కథం త్యక్త్వా మహాత్మా సన్ గంతుమిచ్ఛస్యనాగసమ్ ॥ 40
మహానుభావా! మీరు నన్ను గర్భవతిని చేశారు. ఇప్పటి వరకు ఆ స్వరూపం వ్యక్తం కాలేదు. ఇటువంటి క్లిష్టపరిస్థితిలో నిరపరాధినినైన నన్ను విడిచి మీరు వెళ్లిపోవడం ధర్మమా?" (40)
ఏవముక్తస్తు స మునిః భార్యాం వచనమబ్రవీత్ ।
యద్ యుక్తమమరూపం చ జరత్కారుం తపోధనః ॥ 41
భార్యమాటల్ని విన్న జరత్కారుడు తనభార్య జరత్కారువుతో సముచితం, అవసరం అయిన కొన్ని విషయాల్ని ఆమెకు తగినట్లుగా చెప్పాడు. (41)
అస్త్యయం సుభగే గర్భఃతవ వైశ్యోనరోపమః ।
ఋషిః పరమధర్మాత్మా వేదవేదాంగపారగః ॥ 42
నీ ఉదరంలో గర్భం ఉంది. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నితో సమానమైన తేజస్వి. పరమధర్మాత్ముడు, మహాతపస్వి, వేదవేదాంగపారగుడు. (42)
ఏవముక్త్య్వా స ధర్మాత్మా జరత్కారుర్మహానృషిః ।
ఉగ్రాయ తపసే భూయః జగామ కృతనిశ్చయః ॥ 43
ఈ విధంగా ఆమెకు చెప్పి ధర్మాత్ముడైన జరత్కారుడు కృతనిశ్చయుడై మరల తపస్సు చేసుకొనడానికి వెళ్లిపోయాడు. (43)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి జరత్కారునిర్గమే సప్తచత్వారింశోఽధ్యాయః ॥ 47 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జరత్కారుని నిర్గమము అను నలువది ఏడవ అధ్యాయము. (47)