46. నలువది ఆరవ అధ్యాయము

వాసుకి జరత్కారులు కలిసికొనుట.

సౌతిరువాచ
ఏతచ్ఛ్రుత్వా జరత్కారుః భృశం శోకపరాయణః ।
ఉవాచ తాన్ పితౄన్ దుఃఖాద్ బాష్పసందిగ్ధయా గిరా ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఆ పితరులమాటల్ని విన్న జరత్కారుడు మిక్కిలిగా దుఃఖించాడు. అతడు దుఃఖంతో, గద్గదస్వరంతో పితరులకు చెపుతున్నాడు. (1)
జరత్కారురువాచ
మమ పూర్వే భవంతో వై పితరః సపితామహాః ।
తద్ బ్రూత యన్మయా కార్యం భవతాం ప్రియకామ్యయా ॥ 2
అహమేవ జరత్కారుః కిల్బిషీ భవతాం సుతః ।
తే దండం ధారయత మే దుష్కృతేరకృతాత్మనః ॥ 3
జరత్కారుడు చెపుతున్నాడు. మీరు నా పితరులే. పితామహులే. అందుచేత మీకు సంతోషం కలిగించడానికి నేను ఏ పని చెయ్యాలి? చెప్పండి. నేనే ఆ జరత్కారుడను. నేనే ఆ పాపాత్ముడను, నేనే మీ కుమారుడిని. పాపాత్ముడిని అయిన నన్ను మీ ఇష్టం వచ్చినట్లుగా శిక్షించండి. (2,3)
పితర ఊచుః
పుత్ర దిష్ట్యాసి సంప్రాప్తః ఇమం దేశం యదృచ్ఛయా ।
కిమిర్థం చ త్వయా బ్రహ్మన్ న కృతో దారసంగ్రహః ॥ 4
అపుడు పితరులు ఇలా అన్నారు. "కుమారా! మా అదృష్టంకొద్దీ నీవు ఇక్కడికి వచ్చావు. ఇప్పటిదాకా నీవు ఎందుకు వివాహం చేసుకోలేదు?" (4)
జరత్కారురువాచ
మమాయం పితరో నిత్యం హృద్యర్థః పరివర్తతే ।
ఊర్ధ్వరేతాః శరీరం వై ప్రాపయేయమముత్ర వై ॥ 5
జరత్కారుడు చెప్పాడు. "పితృదేవతలారా! నా మనసులో ఈ భావం ఎందుకు తిరుగుతోందంటే నేను బ్రహ్మచర్యంతో పరలోకం చేరాలని ఎప్పుడూ నా మనసులో అనుకొంటూ ఉంటాను. (5)
న దారాన్ వై కరిష్యేఽ హమ ఇతి మే భావితం మనః ।
ఏవం దృష్ట్వా తు భవతః శకుంతానివ లంబతః ॥ 6
మయా నివర్తితా బుద్ధిః బ్రహ్మచర్యాత్ పితామహాః ।
కరిష్యే వః ప్రియం కామం నివేక్ష్యేఽహమసంశయమ్ ॥ 7
ఎప్పుడూ పత్నీపరిగ్రహం చేయరాదని అనుకొంటూ ఉంటాను- పితరులారా! పక్షులవలె వ్రేలాడుతున్న మిమ్మల్ని చూచిన తరువాత నా బుద్ధిని బ్రహ్మచర్యం నుండి మళ్లిస్తున్నాను. నిస్సందేహంగా మీరు కోరిన ప్రకారం వివాహం ఏసుకొంటాను. (6,7)
సనామ్నీం యద్యహం కన్యామ్ ఉపలప్స్యే కదాచన ।
భవిష్యతి చ యా కాచిద్ భైక్ష్యవత్ స్వయముద్యతా ॥ 8
ప్రతిగ్రహీతా తామస్మి న భరేయం చ యామహమ్ ।
ఏవంవిధమహం కుర్యాం నివేశం ప్రాప్నుయాం యది ।
అన్యథా న కరిష్యేఽ హం సత్యమేతత్ పితామహాః ॥ 9
నా పేరుతో సమానమైన పేరుగల కన్య ఎపుడయినా దొరికితేనే నేను వివాహం చేసుకొంటాను. నేనడగకుండా ఎవరయినా స్వయంగా భిక్షగా లభిస్తే స్వీకరిస్తాను. ఆ భార్యయొక్క పాలన - పోషణభారం నాపై ఉండకూడదు. ఇలా లభిస్తేనే వివాహం చేసుకుంటాను. మరోవిధంగా అయితే వివాహం చేసుకోను. ఇది నిజం. (8,9)
తత్ర చోత్పత్స్యతే జంతుఃభవతాం తారణాయ వై ।
శాశ్వతాశ్చావ్యయాశ్పైవ తిష్ఠంతు పితరో మమ ॥ 10
ఆమె గర్భంలో మిమ్మల్ని నరకం నుండి తప్పించే పుత్రుడు జన్మిస్తాడు. నా పితరులు నిత్యమూ, శాశ్వతమూ అయిన లోకాల్లో ఉందురుగాక! (10)
సౌతిరువాచ
ఏవముక్త్వా తు స పితౄన్ చచార పృథివీం మునిః ।
న చ స్మ లభతే భార్యాం వృద్ధోఽయమితి శౌనక ॥ 11
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. ఈ విధంగా జరత్కారుడు పితరులకు చెప్పి, వారిని విడిచి పూర్వంవలె దేశాటనం చేస్తున్నాడు. కాని "ఇతడు వృద్ధు"డని ఎవరూ కన్యనివ్వటంలేదు. అందుచేత భార్య లభించటంలేదు. (11)
యదా నిర్వేదమాపన్నః పితృభిశ్చోదితస్తథా ।
తదారణ్యం స గత్వోచ్చైః చుక్రోశా భృశదుఃఖితః ॥ 12
వివాహం జరగలేదని విచారపడుతూ అతని పితరులు ప్రేరేపించిన కారణంగా అడవిలోకి వెళ్లి దుఃఖంలో బిగ్గరగా విలపించాడు. (12)
స త్వరణ్యగతః ప్రాజ్ఞః పితౄణాం హితకామ్యయా ।
ఉవాచ కన్యాం యాచామి తిస్రో వాచః శనైరిమాః ॥ 13
అడవికి వెళ్లిన తరువాత విద్వాంసుడైన జరత్కారుడు తన పితరుల హితాన్నికోరి మూడు పర్యాయాలు నెమ్మది నెమ్మదిగా "నేను కన్యను యాచిస్తున్నాను" అని అన్నాడు. (13)
యాని భూతాని సంతీహ స్థావరాణి చరాణి చ ।
అంతర్హితాని వా యాని తాని శృణ్వంతు మే వచః ॥ 14
మరల బిగ్గరగా "ఇక్కడ ఏ చరాచరప్రాణులు ఉన్నాయో, దృశ్య - అదృశ్యప్రాణులు ఉన్నాయో అవి అన్నీ నామాటను వినుగాక" అని అరిచాడు. (14)
ఉగ్రే తపసి వర్తంతే పితరశ్చోదయంతి మామ్ ।
నివిశస్వేతి దుఃఖార్తాః సంతానస్య చికీర్షయా ॥ 15
నా పితరులు భయంకరమైన కష్టాల్లో ఉన్నారు. వారు దుఃఖంతో బాధపడుతున్నారు. సంతానప్రాప్తికోసం నన్ను ప్రేరేపించారు నన్ను వివాహం చేసుకొమ్మన్నారు. (15)
నివేశాయాఖిలాం భూమిం కన్యా భైక్ష్యం చరామి భోః ।
దరిద్రో దుఃఖశీలశ్చ పితృభిః సంనియోజితః ॥ 16
అందుచేత వివాహం కోసం భూమి అంతా తిరిగి కన్యను భిక్షగా ఇవ్వమని యాచిస్తున్నాను. నేను దరిద్రుడను. దుఃఖశీలుడను. అయినా పితరుల ఆజ్ఞవలన నేను వివాహం చేసుకొనడానికి ప్రయత్నాన్ని కొనసాగిస్తాను. (16)
యస్య కన్యాస్తి భూతస్య యే మయేహ ప్రకీర్తితాః ।
తే మే కన్యాం ప్రయచ్ఛంతు చరతః సర్వతోదిశమ్ ॥ 17
నేను పేర్కొన్న ఈ ప్రాణి సమూహంలో నాపేరు కల కన్య ఉంటే దేశమంతా తిరిగే నాకు మీరు ఆ కన్యను ఇత్తురుగాక! (17)
మమ కన్యా స నామ్నీ యా భైక్ష్యవచ్చోదితా భవేత్ ।
భరేయం చైవ యాం నాహం తాం మే కన్యాం ప్రయచ్ఛత ॥ 18
నా పేరుగల కన్యను నాకిచ్చి వివాహం చేస్తే ఆమె పాలనను పోషణను నాపై ఉంచరాదు. ఆ భారం నేను భరించను. అటువంటి కన్యనే నాకు ఇవ్వండి. (18)
తతస్తే పన్నగా యే వై జరత్కారౌ సమాహితాః ।
తామాదాయ ప్రవృత్తిం తే వాసుకేః ప్రత్యవేదయన్ ॥ 19
జరత్కారుని సమీపంలో ఉన్న నాగులు ఈ జరత్కారుని మాటల్ని విని సోదరుడైన వాసుకికి చెప్పారు. (19)
తేషాం శ్రుత్వా స నాగేంద్రః తాం కన్యాం సమలంకృతామ్ ।
ప్రగృహ్యారణ్యమగమత్ సమీపం తస్య పన్నగః ॥ 20
ఆ వార్తను విన్న నాగరాజు వాసుకి తనసోదరి అయిన జరత్కారువును వధువుగా అలంకరించి అరణ్యంలో ఉన్న జరత్కారుమహర్షి దగ్గరకు తీసుకొని వెళ్లాడు. (20)
తత్ర తాం భైక్ష్యవత్ కన్యాం ప్రాదాత్ తస్మై మహాత్మనే ।
నాగేంద్రో వాసుకిర్బ్రహ్మన్ న స తాం పత్రగృహ్ణత ॥ 21
అక్కడ వాసుకి జరత్కారునకు భిక్షవలె ఆ కన్యకను సమర్పించాడు. అయితే వెంటనే జరత్కారుడు ఆమెను స్వీకరింపలేదు. (21)
అసనామేతి వై మత్వా భరణే చావిచారితే ।
మోక్షభావే స్థితశ్చాపి మందీభూతః పరిగ్రహే ॥ 22
తతో నామ స కన్యాయాః పప్రచ్ఛ భృగునందన ।
వాసుకిం భరణం చాస్యాః న కుర్యామిత్యువాచ హ ॥ 23
మనసులో ఇలా అనుకొన్నాడు. ఈమె నాపేరు కలది కాదేమో! పోషణభారం గురించి చెప్పకుండా ఎలా? పితరుల మోక్షం మీద ఆసక్తి ఉన్నా ఇలా అనుకొని వివాహానికి వెనుకాడుతున్నాడు. అపుడు జరత్కారుడు ఆ కన్య యొక్క పేరు ఏమిటి? అని అడిగి ఆమె పోషణభారం గురించి వాసుకికి చెప్పాడు. (22,23)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి వాసుకి జరత్కారు సమాగమే షట్చత్వారింశోఽధ్యాయః ॥ 46 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున వాసుకి జరత్కారు సమాగమము అను నలువది ఆరవ అధ్యాయము. (46)