44. నలువది నాల్గవ అధ్యాయము
జనమేజయుని రాజ్యాభిషేకము - వివాహము.
సౌతిరువాచ
తే దయా మంత్రిణో దృష్ట్వా భోగేన పరివేష్టితమ్ ।
విషణ్ణవదనాః సర్వే రురుదుర్భృశదుఃఖితాః ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. మంత్రులందరూ తమ రాజేంద్రుని నాగేంద్రుడు చుట్టుకొనడం చూచి విచారవదనాలతో మిక్కిలి దుఃఖితులైనారు. (1)
తం తు నాదం తతః శ్రుత్వా మంత్రిణస్తే ప్రదుద్రువుః ।
అపశ్యంత తథా యాంతమ్ ఆకాశే నాగమద్భుతమ్ ॥ 2
సీమంతమివ కుర్వాణం నభసః పద్మవర్చసమ్ ।
తక్షకం పన్నగశ్రేష్ఠం భృశం శోకపరాయణాః ॥ 3
తక్షకుడు చేసిన పూత్కారశబ్దాన్ని మంత్రులు విని దూరంగా పారిపోయారు. పరీక్షితుని కరచిన తరువాత తక్షకుడు అద్భుతంగా ఆకాశానికి సీమంతం వలె వెళ్లిపోతూంటే మంత్రులు అతనిని చూశారు. అతనిని చూసి మంత్రులందరూ శోకపరవశులయ్యారు. (2,3)
తతస్తు తే గృహమగ్నినాఽఽవృతం
ప్రదీప్యమానం విషజేన భోగినః ।
భయాత్ పరిత్యజ్య దిశః ప్రపేదిరే
పపాత రాజాశనితాడితో యథా ॥ 4
ఆ ఒంటిస్తంభంమెడ తక్షకుని విషాగ్నితో దగ్ధమైపోయింది. ఈ దృశ్యాన్ని చూసి మంత్రులు అందరు చెల్లాచెదరై పారిపోయారు. రాజు పిడుగుపడిన విధంగా కుప్పకూలిపోయాడు. (4)
తతో నృపే తక్షకతేజసా హతే
ప్రయుజ్య సర్వాః పరలోకసత్ర్కియాః ।
శుచిర్ద్విజో రాజపురోహితస్తదా
తథైవ తే తస్య నృపస్య మంత్రిణః ॥ 5
నృపం శిశుం తస్య సుతం ప్రచక్రిరే
సమేత్య సర్వే పురవాసినో జనాః ।
నృపం యమాహు స్తమమిత్రఘాతినం
కురుప్రవీరం జనమేజయం జనాః ॥ 6
తక్షకుని విషాగ్నివలన పరిక్షిత్తు దగ్ధమైపోయాడు. అతనికి పారలౌకిక క్రియలు జరిపించిన తరువాత బ్రాహ్మణులు రాజపురోహితులు, మంత్రులు, ప్రజలందరు కలిసి పరీక్షిత్తుని కుమారుడు, శిశువయినా జనమేజయునికి పట్టాభిషేకం చేశారు. జనమేజయుడు శత్రునాశనసమర్థుడు. ప్రజలు అందరు అతనిని జనమేజయుడనే పిలుస్తున్నారు. (5,6)
స బాల ఏవార్యమతిర్నృపోత్తమః
సహైవ తైర్మంత్రిపురోహితైస్తదా ।
శశాస రాజ్యం కురుపుంగవాగ్రజః
యథాస్య వీరః ప్రపితామహస్తథా ॥ 7
బాలుడైనప్పటికీ అతని ప్రజ్ఞ మహాపురుషుల బుద్ధికి సమానంగా ఉంది. తన తాతగారు అయిన ధర్మరాజులాగ వీరులలో జనమేజయుడుకూడా అగ్రగణ్యుడే. ఇతడు కూడా మంత్రులతోను, పురోహితులతోను కూడి రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు. (7)
తతస్తు రాజానమమిత్రతాపనం
సమీక్ష్య తే తస్య నృపస్య మంత్రిణః ।
సువర్ణవర్మాణముపేత్య కాశిపం
వపుష్టమార్థం వరయాంప్రచక్రముః ॥ 8
ఇతనియొక్క మంత్రులు శత్రుసంహారంలో సమర్థుడే అని గమనించి, ఇతనికి వివాహం చేసే నిమిత్తం కాశీరాజు అయిన సువర్ణ కుమార్తె వపుష్టమకోసం ఆ రాజును అర్థించారు. (8)
తతః స రాజా ప్రదదౌ వపుష్టమాం
కురుప్రవీరాయ పరీక్ష్య ధర్మతః ।
స చాపి తాం ప్రాప్య ముదాయుతోఽభవ
న్న చాప్యనారీషు మనో దధే క్వచిత్ ॥ 9
సువర్ణవర్మ కురుప్రవీరుడైన జనమేజయుని యొక్క ధర్మగుణాన్ని విని సంతోషించి తన కుమార్తె అయిన వపుష్టమను అతనికి ఇచ్చి వివాహం చేశాడు. జనమేజయుడు కూడా ఆమెను వరించి ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఏకసతీవ్రతుడై ఉన్నాడు. (9)
సరఃసు ఫుల్లేషు వనేషు చైవ హి
ప్రసన్నచేతా విజహార వీర్యవాన్ ।
తథా స రాజన్యవరో విజహ్రివాన్
యథోర్వశీం ప్రాప్య పురా పురూరవాః ॥ 10
పూర్వం ఊర్వశితో పురూరవుడు విహరించినట్లుగా జనమేజయుడు తన భార్య వపుష్టమతో సరస్సులలోను ఉద్యానవనాలలోను, విహరిస్తూ మహానందాన్ని పొందుతున్నాడు. (10)
వపుష్టమా చాపి వరం పతివ్రతా
ప్రతీతరూపా సమవాస్య భూపతిమ్ ।
భావేన రామా రమయాంబభువ సా
విహారకాలేష్వవరోధసుందరీ ॥ 11
వపుష్టమ మహాపతివ్రత, రూపవతి, సౌందర్యవతి. జనమేజయుని పొంది అంతఃపుర కాంత అయిన వపుష్టమ మనసారా ఆ రాజుతో రమించింది. (11)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి జనమేజయ రాజ్యాభిషేకే చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥ 44 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున జనమేజయరాజ్యాభిషేకము అను నలువది నాల్గవ అధ్యాయము. (44)