43. నలువది మూడవ అధ్యాయము

తక్షకుడు కాశ్యపుని మరలించి, పరిక్షిత్తును చంపుట.

యది దష్టం మయేహ త్వం శక్తః కించిచ్చికిత్సితుమ్ ।
తతో వృక్షం మయా దష్టమ్ ఇమం జీవయ కాశ్యప ॥ 1
"కాశ్యపా! ఈ ప్రపంచంలో నేను కరచినవారికి నీవు చికిత్స చేయడంలో సమర్థుడవే అయితే, ఈ వృక్షాన్ని నేను కరుస్తాను. దీన్ని జీవింపచెయ్యి, చూస్తాను. (1)
పరం మంత్రబలం యత్తే తద్దర్శయ యతస్వ చ ।
న్యగ్రోధమేనం ధక్ష్యామి పశ్యతస్తే ద్విజోత్తమ ॥ 2
బ్రాహ్మణోత్తమా! నీ దగ్గర అంత గొప్ప మంత్రబలం ఉన్నట్లయితే నాకు ఇపుడు చూపించు. నేను ఈ వటవృక్షాన్ని నీవు చూస్తూ ఉండగానే దహించి వేస్తాను." (2)
కాశ్యప ఉవాచ
దశ నాగేంద్ర వృక్షం త్వం యద్యేతదభిమన్యసే ।
అహమేనం త్వయా దష్టం జీవయిష్యే భుజంగమ ॥ 3
కాశ్యపుడు అన్నాడు. "నాగేంద్రా! నీవు చెప్పినట్లుగా ఆ మఱ్ఱిచెట్టును కరువుము. నేను దాన్ని జీవింపచేస్తాను". (3)
సౌతిరువాచ
ఏవముక్తః స నాగేంద్రః కాశ్యపేన మహాత్మనా ।
అదశద్ వృక్షమభ్యేత్య న్యగ్రోధం పన్నగోత్తమః ॥ 4
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. కాశ్యపుడు ఆ మాట చెప్పిన తరువాత సర్పశ్రేష్ఠుడయిన తక్షకుడు మఱ్ఱిచెట్టును కాటువేశాడు. (4)
స వృక్షస్తేన దష్టస్తు పన్నగేన మహాత్మనా ।
ఆశీవిషవిషోపేతః ప్రజజ్వాల సమంతతః ॥ 5
పన్నగేంద్రుడు కరచిన విషంతో ఆ మఱ్ఱిచెట్టు మండిపోయి బూడిదయిపోయింది. (5)
తం దగ్ధ్వా స నగం నాగః కాశ్యపం పునరబ్రవీత్ ।
కురు యత్నం ద్విజశ్రేష్ఠ జీవయైనం వనస్పతిమ్ ॥ 6
"ద్విజోత్తమా! ఈ చెట్టును జీవింపచేయడానికి ప్రయత్నించు" అని తక్షకుడు కాశ్యపునితో అన్నాడు. (6)
సౌతిరువాచ
భస్మీభూతం తతో వృక్షం పన్నగేంద్రస్య తేజసా ।
భస్మ సర్వం సమాహృత్య కాశ్యపో వాక్యమబ్రవీత్ ॥ 7
ఉగ్రశ్రవుడు అంటున్నాడు. ఆ తక్షకుని విషాగ్నితో భస్మీభూతమైన వృక్షాన్ని బ్రతికించడానికి ఆ బూడిదను అంతా ప్రోగుచేసి కశ్యపుడు తక్షకుడితో ఇలా అంటున్నాడు. (7)
విద్యాబలం పన్నగేంద్ర పశ్య మేఽద్య వనస్పతౌ ।
అహం సంజీవయామ్యేనం పశ్యతస్తే భుజంగమ ॥ 8
నాగరాజా! నా విద్యాబలాన్ని చూడు. నీవు చూస్తూండగానే ఈ వృక్షాన్ని జీవింపచేస్తాను చూడు. (8)
తతః స భగవాన్ విద్వాన్ కాశ్యపో ద్విజసత్తమః ।
భస్మరాశీకృతం వృక్షం విద్యయా సమజీవయత్ ॥ 9
అప్పుడు మహానుభావుడూ, విద్వాంసుడూ అయిన ఆ కాశ్యపుడు తన మంత్రవిద్యాబలంతో ఆ భస్మరాశిని మళ్లీ వృక్షంగా జీవింపచేశాడు. (9)
అంకురం కృతవాంస్తత్ర తతః పర్ణద్వయాన్వితమ్ ।
పలాశినం శాఖినం చ తథా విటపినం పునః ॥ 10
మొదట అంకురంగా, తరువాత రెండు ఆకులతో, ఆ పిదప చిగురుటాకులు, కొమ్మలు, ఉపశాఖలు కలిగేటట్లుగా క్రమక్రమంగా ఆ చెట్టును ఆశ్చర్యకరంగా కాశ్యపుడు జీవింపచేశాడు. (10)
తం దృష్ట్వా జీవితం వృక్షం కాశ్యపేన మహాత్మనా ।
ఉవాచ తక్షకో బ్రహ్మన్ నైతదత్యద్భుతం త్వయి ॥ 11
మహాత్ముడయిన కాశ్యపుని మంత్రబలంతో జీవించిన ఆ మఱ్ఱిచెట్టును చూసి తక్షకుడు కాశ్యపుడితో ఇలా అన్నాడు. "బ్రాహ్మణోత్తమా! ఇది నీకు ఏమీ అద్భుతం కాదు. (11)
ద్విజేంద్ర యద్ విషం హన్యాః మమ వా మద్విధస్య వా ।
కం త్వమర్థమభిప్రేప్సుఃయాసి తత్ర తపోధన ॥ 12
తపోధనా! కాశ్యపా! నా విషాన్నిగాని, ఇతర సర్పాల విషాన్నిగాని నీ మంత్ర విద్యాబలంతో హరించగలవు. కాని తపోధనా! నీవు ఏ ప్రయోజనాన్ని ఆశించి పరిక్షిత్తు దగ్గరకు వెళ్తున్నావు? (12)
యత్ తేఽభిలషితం ప్రాప్తుం ఫలం తస్మాన్నృపోత్తమాత్ ।
అహమేవ ప్రదాస్యామి తత్ తే యద్యపి దుర్లభమ్ ॥ 13
ఆ రాజేంద్రుడి నుండి ఏ ఫలాన్ని ఆశిస్తున్నావో అది దుర్లభమయినా సరే దాన్ని నేనే నీకు ఇస్తాను. (13)
విస్రశాపాభిభూతే చ క్షీణాయుషి నరాధిపే ।
ఘటమానస్య తే విప్ర సిద్ధిః సంశయితా భవేత్ ॥ 14
పరిక్షిత్తు మహారాజు బ్రాహ్మణశాపంతో తిరస్కరింపబడ్డాడు. అతని ఆయుష్షు కూడా క్షీణించింది. ఈ స్థితిలో నీవు ఎంత ప్రయత్నించినా నీ కార్యం సిద్ధించకపోవచ్చు. నాకు సందేహమే. (14)
తతో యశః ప్రదీప్తం తే త్రిషు లోకేషు విశ్రుతమ్ ।
నిరంశురివ ధర్మాంశుః అంతర్ధానమితో భవేత్ ॥ 15
నీవు అనుకొన్నట్లుగా కార్యం సిద్ధించకపోతే ఈ లోకంలో నీవు సంపాదించిన కీర్తి అంతా కిరణాలు లేని సూర్యుడిలాగా అదృశ్యం అయిపోతుంది." (15)
కాశ్యప ఉవాచ
ధనార్థీ యామ్యహం తత్ర తన్మే దేహి భుజంగమ ।
తతోఽహం వినివర్తిష్యే స్వాపతేయం ప్రగృహ్య వై ॥ 16
అపుడు కాశ్యపుడు అన్నాడు. "తక్షకా! నేను ధనాన్ని సంపాదించడానికి ఆ రాజు దగ్గరకు వెళ్తున్నాను. నీవు ఆ ధనాన్ని నాకు ఇయ్యి. అలా ఇస్తే ఆ ధనం తీసుకొని వెనుదిరిగి వెళ్లిపోతాను." (16)
తక్షక ఉవాచ
యావద్ధనం ప్రార్థయసే తస్మాద్ రాజ్ఞస్తతోఽధికమ్ ।
అహమేవ ప్రదాస్యామి నివర్తస్వ ద్విజోత్తమ ॥ 17
తక్షకుడు అన్నాడు. "ఆ రాజు నుండి ఎంత ధనాన్ని కోరుతున్నావో దానికంటె అధికంగా నేనే ఇస్తాను. నీవు వెనుదిరిగి వెళ్లు." (17)
సౌతిరువాచ
తక్షకస్య వచః శ్రుత్వా కాశ్యపో ద్విజసత్తమః ।
ప్రదధ్యౌ సుమహాతేజాః రాజానం ప్రతి బుద్ధిమాన్ ॥ 18
ఉగ్రశ్రవుడు శౌనకునితో చెపుతున్నాడు. "తక్షకుని మాటలు విని మహాతేజస్వి, బుద్ధిశాలి అయిన కాశ్యపుడు పరీక్షిత్తు గురించి కొంతసేపు ధ్యానించి విచారించాడు. (18)
వి: సం: రాజు యొక్క మృత్యువును గురించి. (నీల)
దివ్యజ్ఞానః స తేజస్వీ జ్ఞాత్వా తం నృపతిం తదా ।
క్షీణాయుషం పాండవేయమ్ అపావర్తత కాశ్యపః ॥ 19
లబ్ధ్వా విత్తం మునివరః తక్షకాద్ యావదీప్సితమ్ ।
నివృత్తే కాశ్యపే తస్మిన్ సమయేన మహాత్మని ॥ 20
జగామ తక్షకస్తూర్ణం నగరం నాగసాహ్వయమ్ ।
అథ శుశ్రావ గచ్ఛన్ స తక్షకో జగతీపతిమ్ ॥ 21
మంత్రైర్గదైర్విషహరైః రక్ష్యమాణం ప్రయత్నతః ।
కాశ్యపుడు తన దివ్యజ్ఞానంతో పరీక్షితుని ఆయువు సమాప్తం అయిందని గ్రహించాడు. అందుచేత తక్షకుని కోరిక ప్రకారం ధనం తీసుకొని అక్కడ నుండి తన ఊరుకు వెళ్లిపోయాడు. కాశ్యపుడు మరలిపోయిన తరువాత తక్షకుడు అతిత్వరితంగా హస్తినాపురాన్ని చేరుకొన్నాడు. అక్కడికి వెళ్లిన తరువాత పరిక్తిత్తు మంత్రవేత్తలతోను, విషాన్ని హరించే ఓషధులతోను తనను రక్షించుకొనడానికి సిద్ధంగా ఉన్నాడని విన్నాడు తక్షకుడు. (19-21 1/2)
సౌతిరువాచ
స చింతయామాస తదా మాయాయోగేన పార్థివః ॥ 22
మయా వంచయితవ్యోఽసౌ క ఉపాయో భవేదితి ।
తతస్తాపసరూపేణ ప్రాహిణోత్ స భుజంగమాన్ ॥ 23
ఫలదర్భోదకం గృహ్య రాజ్ఞే నాగోఽథ తక్షకః ।
సౌతి చెపుతున్నాడు. తక్షకుడు తన కార్యసాధన కోసం "ఏ ఉపాయంతో పరిక్షిత్తు ప్రాణాల్ని అపహరించాలి?" అని ఆలోచించాడు. మాయతో పరీక్షిత్తును మోసగించాలి అనుకొన్నాడు. కొందరు నాగుల్ని దర్భలు, ఫలాలు తీసుకొని తాపసులవేషంతో మహారాజు దగ్గరకు వెళ్లవలసిందిగా ఆజ్ఞాపించాడు. (22,23 1/2)
తక్షక ఉవాచ
గచ్చధ్వం యూయమవ్యగ్రాః రాజానం కార్యవత్తయా ॥ 24
ఫలపుష్పోదకం నామ ప్రతిగ్రాహయితుం నృపమ్ ।
తక్షకుడు అన్నాడు. "మీరు మన కార్యాన్ని సఫలం చేయడానికి రాజు దగ్గరకు వెళ్లండి. ఏ మాత్రం భీతి చెందకండి. ఉద్వేగపడకండి. ఆ రాజు మీరిచ్చిన ఫలాలను, పుష్పాలను తీసుకోవాలి. మీతో బాటే నేను గూడా అదృశ్యరూపంలో వస్తాను. (24 1/2)
సౌతిరువాచ
తే తక్షకసమాదిష్టౌః తథా చక్రుర్భుజంగమాః ॥ 25
సౌతి అంటున్నాడు. "తక్షకుడు చెప్పినట్లే ఆ సర్పాలన్నీ చేశాయి." (25)
ఉపనిన్యుస్తథా రాజ్ఞే దర్భానాపః ఫలాని చ ।
తచ్చ సర్వం స రాజేంద్రః ప్రతిజగ్రాహ వీర్యవాన్ ॥ 26
వాళ్లందరు దర్భలు, జలం, పండ్లు తీసుకొని వెళ్లారు. మహాపరాక్రమశాలియైన పరిక్షిత్తు వాటినన్నిటిని తీసుకొన్నాడు. (26)
కృత్వా తేషాం చ కార్యాణి గమ్యతామిత్యువాచ తాన్ ।
గతేషు తేషు నాగేషు తాపసచ్ఛద్మరూపిషు ॥ 27
అమాత్యాన్ సుహృదశ్పైవ ప్రోవాచ స నరాధిపః ।
భక్షయంతు భవంతో వై స్వాదూనీమాని సర్వశః ॥ 28
తాపసైరుపనీతాని ఫలాని సహితా మయా ।
తతో రాజా ససచివః ఫలాన్యాదాతుమైచ్ఛత ॥ 29
ఆ ఫలాన్ని తీసుకొన్నరాజు వారందరికీ పారితోషికాల్ని ఇచ్చి "మీరు వెళ్లండి" అని వారిని పంపించాడు. తాపసవేషంలో ఉన్న ఆ నాగులు వెళ్లిపొయిన తరువాత పరిక్షిత్తు తన మంత్రులతోను, స్నేహితులతోను "తాపసులు తెచ్చిన తీయని ఫలాలను మీరు కూడ తినండి" అని చెప్పాడు. అందరూ పండ్లను తీసుకొన్నారు. (27-29)
విధినా సంప్రయుక్తో నై ఋషివాక్యేన తేన తు ।
యస్మిన్నేవ ఫలే నాగః తమేవాభక్షయత్ స్వయమ్ ॥ 30
బ్రహ్మ వ్రాసిన వ్రాతప్రకారం శృంగిమహర్షిచే ప్రేరేపింపబడి, మహారాజు ఆ ఫలాల్లో ఒకదాన్ని స్వయంగా భుజించాడు. ఆ పండులోనే తక్షకుడు క్రిమిరూపంలో ఉన్నాడు. (30)
తతో భక్షయతస్తస్య ఫలాత్ కృమిరభూదణుః ।
హ్రస్వకః కృష్ణనయనః తామ్రవర్ణోఽథ శౌనక ॥ 31
శౌనకమహర్షీ! ఆ పండు మహారాజు చేతిలో ఉన్న సమయంలో అందులో ఒక చిన్న క్రిమి కనిపించింది. చూడటానికి ఆ పురుగు చిన్నదిగా కనిపించింది. కళ్లు నల్లగా ఉన్నాయి. శరీరకాంతి తామ్రవర్ణంగా ఉంది. (31)
స తం గృహ్య నృపశ్రేష్ఠః సచివానిదమబ్రవీత్ ।
అస్తమభ్యేతి సవితా విషాదద్య న మే భయమ్ ॥ 32
పరిక్షిత్తు ఆ కీటకాన్ని తన చేతిలోనికి తీసుకొని మంత్రులతో ఈ విధంగా అన్నాడు. "ఇపుడు సూర్యభగవానుడు అస్త్రాద్రిని చేరాడు. అందుచేత ఈ సమయంలో నాకు విషంవల్ల ఎటువంటి భయం ఉండదు. (32)
సత్యవాగస్తు స మునిః కృమిర్మాం దశతామయమ్ ।
తక్షకో నామ భూత్వా వై తథా పరిహృతం భవేత్ ॥ 33
శాపం ఇచ్చిన ఆ మహర్షి సత్యవాది. ఈ పురుగు తక్షకుడై నన్ను కఱచుగాక! ఈ విధంగా మునిశాపం తీరిపోతుంది. నా దోషం పరిహారమవుతుంది గదా! (33)
తే చైనమన్వవర్తంత మంత్రిణః కాలచోదితాః ।
ఏవముక్త్వా స రాజేంద్ర గ్రీవాయాం సంనివేశ్య హ ॥ 34
కృమికం ప్రాహసత్ తూర్ణం ముమూర్షుర్నష్టచేతనః ।
ప్రహసన్నేవ భోగేన తక్షకేణ త్వవేష్ట్యత ॥ 35
తస్మాద్ ఫలాద్ వినిష్క్రమ్య యద్ తద్ రాజ్ఞే నివేదితమ్ ।
వేష్టయిత్వా చ వేగేన వినద్య చ మహాస్వనమ్ ।
అదశత్ పృథివీపాలం తక్షకః పన్నగేశ్వరః ॥ 36
కాలంచేత ప్రేరేపింపబడిన మంత్రులు అతని మాటను అనుసరించారు. తరువాత ఆ రాజు ఆ పురుగును తన మెడ మీద ఉంచుకొని గట్టిగా నవ్వాడు. అలా రాజు నవ్వుతూ ఉండగానే రాజుకిచ్చిన ఫలం నుండి త్వరగా బయటకు వచ్చి పెద్ద ధ్వని చేస్తూ రాజును చుట్టివేసి తక్షకుడు కాటువేశాడు. (34-36)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి తక్షకదంశే త్రిచత్వారింశోఽధ్యాయః ॥ 43 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమున తక్షకదంశనమను నలువదిమూడవ అధ్యాయము. (43)