25. ఇరువది అయిదవ అధ్యాయము
కద్రువ సూర్యుని ఇంద్రాదులను స్తుతించుట.
సౌతిరువాచ
తతః కామగమః పక్షీ మహావీర్యో మహాబలః ।
మాతురంతికమాగచ్ఛత్ పరం పారం మహోదధేః ॥ 1
ఉగ్రశ్రవుడు ఇలా చెపుతున్నాడు. కోరిన ప్రకారం ఏ రూపంలోనైనా ఎక్కడికైనా వెళ్ల గల్గిన బలాఢ్యుడైన ఆ గరుత్మంతుడు సముద్రానికి ఆవలి ఒడ్డున ఉన్న తల్లియైన వినత దగ్గరకు వచ్చాడు. (1)
యత్ర సా వినతా తస్మిన్ పణితేన పరాజితా ।
అతీవ దుఃఖసంతప్తా దాసీభావముపాగతా ॥ 2
అక్కడే కద్రువతో వేసిన పందెంలో వినత ఓడిపోయి ఆమెకు దాస్యం చేస్తూ ఎంతగానో కుమిలిపోతున్నది. (2)
తతః కదాచిద్ వినతాం ప్రణతాం పుత్రసంనిధౌ ।
కాలే చాహూయ వచనం కద్రూరిదమభాషత ॥ 3
ఒకనాడు కద్రువ గరుత్మంతుని దగ్గర కూర్చున్న వినయశీల అయిన వినతను పిలిచి ఈ విధంగా చెప్పింది. (3)
నాగానామాలయం భద్రే సురమ్యం చారుదర్శనమ్ ।
సముద్రకుక్షావేకాంతే తత్ర మాం వినతే నయ ॥ 4
వినతా! సముద్రం లోపల నిర్జన ప్రదేశంలో రమణీయమై చూడదగిన నాగుల నివాసస్థానం ఉన్నది. నన్ను అక్కడికి తీసుకొని వెళ్లి చూపించు. (4)
తతః సుపర్ణమాతా తామ్ ఆవహత్ సర్పమాతరమ్ ।
పన్నగాన్ గరుడశ్చాపి మాతుర్వచనచోదితః ॥ 5
అపుడు వినత కద్రువను తనవీపు పైకి తీసుకొన్నది. ఆమె కుమారుడైన గరుత్మంతుడు కూడా తల్లి ఆజ్ఞాపించడం వల్ల కొన్ని సర్పాల్ని తన వీపుపై కూర్చుండ బెట్టుకొన్నాడు. (5)
స సూర్యమభితో యాతి వైనతేయో విహంగమః ।
సూర్యరశ్మిప్రతప్తాశ్చ మూర్ఛితాః పన్నగాభవన్ ॥ 6
వైనతేయుడు సూర్యుడికి ఎదురుగా ఆకాశమార్గంలోకి ఎగిరాడు. సూర్యతాపానికి తాళలేక ఆ సర్పాలన్నీ మూర్ఛపోయాయి. (6)
తదవస్థాన్ సుతాన్ దృష్ట్వా కద్రూః శక్రమథాస్తువత్ ।
నమస్తే! సర్వదేవేశ నమస్తే బలసూదన ॥ 7
తనకుమారుల దీనావస్థను చూసి నాగమాత అయిన కద్రువ ఇంద్రుని స్తుతించింది. సమస్త దేవతల అధిపతివైన మహేంద్రా! నీకు నమస్కారం. బలసూదనా! నీకు నా ప్రణామాలు. (7)
నముచిఘ్న నమస్తేఽస్తు సహస్రాక్ష శచీపతే ।
సర్పాణాం సూర్యతప్తానాం వారిణా త్వం ప్లవో భవ ॥ 8
వేయికన్నులు కలిగి నముచి అనే రాక్షసుని సంహరించి లోకాన్ని రక్షించిన మహేంద్రా! శచీపతీ! నీకు నమస్కారం. సూర్యతాపం చేత తపించి మూర్ఛిల్లిన నా పుత్రుల్ని రక్షించు. నీటిని వర్షించి వారిని మూర్ఛనుండి కాపాడు. నౌకలాగా వారిని ఒడ్డుకు చేర్చు. (8)
త్వమేవ పరమం త్రాణమ్ అస్మాకమమరోత్తమ ।
ఈశో హ్యసి పయః స్రష్టుం త్వమనల్పం పురందర ॥ 9
అమరనాయకా! నీవే మా అందరకు రక్షకుడవు. పురందరా! అధికాధిక వర్షాన్ని కురిపించగల శక్తిమంతుడవు నీవు. (9)
త్వమేవ మేఘస్త్వం వాయుః త్వమగ్నిర్విద్యుతోఽంబరే ।
త్వమభ్రగణవిక్షేప్తా త్వామేవాహుర్మహాఘనమ్ ॥ 10
నీవే మేఘానివి. నీవే వాయుదేవుడవు. నీవే అగ్నివి. ఆకాశంలో విద్యుత్తువు. నీవు మేఘాల్ని ఛిన్నాభిన్నం చేసి వర్షింప చేసే మహానుభావుడవు. (10)
త్వం వజ్రమతులం ఘోరం ఘోషవాంస్త్వం వలాహకః ।
స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చాపరాజితః ॥ 11
ఈ ప్రపంచంలో నీతో సాటి వచ్చేవారు ఎవరూ లేరు. సాటిలేని మహాశక్తి గల వజ్రాయుధం నీవే. నీవు ప్రళయకాలంలో గర్జించే మేఘానివి. సమస్త లోకాలనూ సృష్టించగలవు. లయింప జేయగలవు. నీవు అజేయుడవుకదా! (11)
త్వం జ్యోతిః సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః ।
త్వం మహద్భూతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః ॥ 12
నీవు సమస్త ప్రాణికోటికి జ్యోతిస్వరూపుడవు. చిద్రూపుడవు, సూర్య దేవుడవు. అగ్ని స్వరూపుడవు. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే మహాపురుషుడవు. నీవు రాజువే. సమస్త దేవతలలో శ్రేష్ఠుడవు నీవే. (12)
త్వం విష్ఠుస్త్వం సహస్రాక్షః త్వం దేవస్త్వం పరాయణమ్ ।
త్వం సర్వమమృతం దేవ త్వం సోమః పరమార్చితః ॥ 13
నీవే విష్ఠువువు, సహస్రాక్షుడవు. సమస్త దేవతలకు ఆశ్రయం కల్పించే వాడవు నీవే. నీవే అమృతానివి. శీతకిరణుడైన చంద్రుడవు నీవే. (13)
త్వం ముహూర్తస్తిథిస్త్వం చ త్వం లవస్త్వం పునః క్షణః ।
శుక్లస్త్వం బహులస్త్వం చ కలా కాష్ఠా త్రుటిస్తథా ।
సంవత్సరర్తవో మాసాః రజన్యశ్చ దినాని చ ॥ 14
నీవు ముహూర్తానివి. తిథివి, శుక్లపక్షం, కృష్ణ పక్షం కూడా నీవే. కల, కాష్ఠా, త్రుటి అన్ని కాలభేదాలూ నీవే. నీవే సంవత్సరం, ఋతువు, మాసం రాత్రి, పగలు కూడా. (14)
త్వముత్తమా సగిరివనా వసుంధరా
సభాస్కరం వితిమిరమంబరం తథా ।
మహోదధిః సతిమితిమింగిలస్తథా
మహోర్మిమాన్ బహుమకరో ఝషాకులః ॥ 15
నీవు పర్వతాలతోను అడవులతోను కూడిన భూమివి. అంధకారాన్ని పటాపంచలు చేసే సూర్యుడితో కూడిన ఆకాశానివి నీవే. తిమి, తిమింగిల మకరాది జంతువులతోను, అలలతోను కూడిన సముద్రానివి నీవే. (15)
మహాయశాస్త్వమితి సదాభిపూజ్యసే
మనీషిభిర్ముదితమనా మహర్షిభిః ।
అభిష్టుతః పిబసి చ సోమమధ్వరే
వషట్ కృతాన్యపి చ హవీంషి భూతమ్ ॥ 16
నీవు గొప్ప కీర్తిమంతుడవు. అందుచేతనే బుద్ధిమంతులు అందరూ నిన్నే పూజిస్తున్నారు. మహర్షులందరు నిన్నే స్తుతిస్తున్నారు. యజమాని సంతోషం కోసమే యజ్ఞంలో సోమరసాన్ని పానం చేస్తున్నావు. వషట్కారంతో సమర్పిస్తున్న హవిస్సుల్ని స్వీకరిస్తున్నావు. (16)
త్వం విప్రైః సతతమిహేజ్యసే ఫలార్థం
వేదాంగేష్వతుల బలౌఘ గీయసే చ ।
త్వద్ధేతోర్యజనపరాయణా ద్విజేంద్రాః
వేదాంగాన్యభిగమయంతి సర్వయత్నైః ॥ 17
ఈ ప్రపంచం యొక్క మేలు కోరి బ్రాహ్మణులందరూ నిన్ను పూజిస్తున్నారు. అతులబలాఢ్యుడవైన దేవేంద్రా! ఉపనిషత్తులలో కూడా బ్రాహ్మణోత్తములు నీ మహిమను గానం చేస్తున్నారు. నీ సన్నిధిని చేరడానికి బ్రాహ్మణులు వేదాంగాల జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. (17)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణాఖ్యానే పంచవింశోఽధ్యాయః ॥ 25 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువది అయిదవ అధ్యాయము. (25)