24. ఇరువది నాలుగవ అధ్యాయము
అనూరుడు సూర్య రథసారథి అగుట.
సౌతిరువాచ
స శ్రుత్వాథాత్మనో దేహం సుపర్ణః ప్రేక్ష్య చ స్వయమ్ ।
శరీరప్రతిసంహారమ్ ఆత్మనః సంప్రచక్రమే ॥ 1
ఉగ్రశ్రవుడు చెపుతున్నాడు. శౌనకాది మహర్షులారా! ఆ పక్షీంద్రుడు దేవతల స్తుతి విని తన భయంకర శరీరాన్ని చూచుకొని తన ఆ రూపాన్ని ఉపసంహరించుకొన్నాడు. (1)
సుపర్ణ ఉవాచ
న మే సర్వాణి భూతాని బిభియుర్దేహదర్శనాత్ ।
భీమరూపాత్ సముద్విగ్నాత్ తస్మాత్ తేజస్సు సంహరే ॥ 2
గరుడుడు అంటున్నాడు. "దేవతలారా! నా ఈ భయంకరాకారాన్ని చూసి భయపడకండి. నా ఈ స్వరూపాన్ని ఉపసంహరించుకొంటున్నాను." (2)
సౌతిరువాచ
తతః కామగమః పక్షీ కామవీర్యో విహంగమః ।
అరుణం చాత్మనః పృష్ఠమ్ ఆరోప్య సవితుర్గృహాత్ ॥ 3
మాతురంతికమాగచ్ఛత్ పరం తీరం మహోదధోః ।
ఉగ్రశ్రవుడు అంటున్నాడు. ఆ తరువాత కామగమనుడు, కామవీర్యుడు అయిన ఆ పక్షీంద్రుడు కశ్యపుని ఆశ్రమంలో ఉన్న తన అన్నగారైన అరుణుని తనవీపుపై కూర్చుండ బెట్టుకొని తన తండ్రి ఇంటి నుండి సముద్రం అవతల ఒడ్డున ఉన్న తన తల్లి వినతగృహానికి వచ్చాడు. (3 1/2)
తత్రారుణశ్చ నిక్షిప్తః దిశం పూర్వాం మహాద్యుతిః ॥ 4
సూర్యస్తేజోభిరత్యుగ్రైః లోకాన్ దగ్ధుమనా యదా ।
సూర్యుడు తూర్పు దిక్కులో ఉండి తన భయంకర తేజస్సుతో లోకాలన్నిటినీ దగ్ధంచేస్తుంటే గరుడుడు మళ్లీ తన అన్న అరుణుని తీసుకొని వచ్చి సూర్యుని దగ్గర నిలిపాడు. (4 1/2)
రురురువాచ
కిమిథ భగవాన్ సూర్యః లోకాన్ దగ్ధుమనాస్తదా ॥ 5
కిమస్యాపహృతం దేవైః యేనేమం మన్యురావిశత్ ।
ఆ విషయాన్ని విన్న శౌనకుడు "సూర్యుడు ఎందుకు ఈ ప్రపంచాన్ని దగ్ధం చేయ దలచాడు." అని అడిగాడు. (అపుడు సూతుడు "రురుడు తండ్రి యైన ప్రమతిని అడిగితే ఈ కథను చెప్పాడు. ఆ విషయాన్నే మీకు చెపుతాను.) రురుడు తండ్రితో నాన్నగారూ! ఎందుకు సూర్యుడు లోకాన్ని దగ్ధం చేయాలని అనుకొన్నాడు? దేవతలేమన్నా అపకారం చేయటం వల్ల సూర్యుడికి కోపం వచ్చిందా? అని అడిగాడు. (5 1/2)
ప్రమతిరువాచ
చంద్రార్కాభ్యాం యదా రాహుః ఆఖ్యాతో హ్యమృతం పిబన్ ॥ 6
వైరానుబంధం కృతవాన్ చంద్రాదిత్యౌ తదానఘ ।
వధ్యమానే గ్రహేణాథ ఆదిత్యే మన్యురావిశత్ ॥ 7
కుమారుడికి ప్రమతి ఈ విధంగా చెప్పాడు. "అమృతాన్ని దేవతలకు విష్ణుమూర్తి పంచుతున్న సమయంలో దాన్ని సూర్యచంద్రులు చూసి శ్రీమన్నారాయణమూర్తికి చెప్పారు కదా! అతడు తన చక్రంతో రాహుకంఠాన్ని తెగవేశాడు. అమృతం త్రాగటం వల్ల తలమాత్రం ప్రాణంతో ఉండటం వల్ల ఆ రాహువు ఆనాటి నుండి సూర్య చంద్రుల్ని బాధిస్తున్నాడు. తాను లోకానికీ, దేవతలకూ ఎంత మేలు చేసినా రాహువు బాధిస్తూంటే దేవతలు విడ్డూరంగా చూస్తున్నారే కాని అడ్డుకోవటంలేదు. కాబట్టి సూర్యుడికి కోపం వచ్చింది. (6,7)
సురార్థాయ సముత్పన్నః రోషో రాహోస్తు మాం ప్రతి ।
బహ్వనర్థకరం పాపమ్ ఏకోఽహం సమవాప్నుయామ్ ॥ 8
దేవతల మేలుకోసం నేను రాహువును గుఱించి విష్ణుదేవునికి చెప్పటం వల్ల నాపై రోషంతో రాహువు నన్ను బాధిస్తున్నాడు. ఇటువంటి అనర్థం నాకు ప్రాప్తించింది. (8)
సహాయ ఏవ కార్యేషు న చ కృచ్ఛ్రేషు దృశ్యతే ।
పశ్యంతి గ్రస్యమానం మాం సహంతే వై దివౌకసః ॥ 9
ఇటువంటి కష్టకాలంలో దేవతలు ఎవ్వరూ నాకు సహాయ పడటం లేదు. రాహువు నన్ను పీడిస్తూంటే అందరు దేవతలు చూస్తూ కూర్చున్నారే తప్ప ఎవ్వరూ నివారించలేకపోయారు. (9)
తస్మాల్లోకవినాశార్థే హ్యవతిష్ఠే న సంశయః ।
ఏవం కృతమతిః సూర్యః హ్యస్తమభ్యగమద్ గిరిమ్ ॥ 10
అందుకని లోకానికి అందరికీ బాధ కల్గించాలనే ఉద్దేశంతో అస్తాద్రిని చేరాను. అక్కడే ఉంటాను. అని సూర్యుడు నిశ్చయంగా చెప్పాడు. (10)
తస్మాల్లోకవినాశాయ సంతాపయతి భాస్కరః ।
తతో దేవానుపాగమ్య ప్రోచురేవం మహర్షయః ॥ 11
ఆ అస్తాద్రినుండి సూర్యుడు లోకాన్ని నశింప చేయాలని సంకల్పించి తపింప చేస్తున్నాడు. అపుడు మహర్షులందరు దేవతల దగ్గరకు వెళ్లి ఈ విధంగా అంటున్నారు. (11)
అథార్ధరాత్రసమయే సర్వలోకభయావహః ।
ఉత్పత్స్యతే మహాన్ దాహః త్రైలోక్యస్య వినాశనః ॥ 12
"దేవతలారా! అర్ధరాత్రి సమయంలో అన్నిలోకాలకీ భయాన్ని కల్గించేటట్లుగా అధికమైన వేడి పుట్టి అందరిని దహిస్తున్నది." (12)
తతో దేవాః సర్షిగణాః ఉపగమ్య పితామహమ్ ।
అబ్రువన్ కిమివేహాద్య మహద్ దాహకృతం భయమ్ ॥ 13
న తావద్ దృశ్యతే సూర్యః క్షయోఽయం ప్రతిభాతి చ ।
ఉదితే భగవాన్ భానౌ కథమేతద్ భవిష్యతి ॥ 14
మహర్షులు ఇలా చెప్పగా దేవతలు ఆ ఋషులతో కూడా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లారు. "దేవా! నేడు ఎందుకు ఈ విధంగా భయంకరంగా దహించుకు పోతున్నది లోకం? సూర్యుడు కనిపించటం లేదు. సూర్యుడు ఉదయించినా ఇది ఎట్లా సంభవం?" అని పితామహుని అడిగారు. (13,14)
పితామహ ఉవాచ
ఏష లోకవినాశాయ రవిరుద్యంతుముద్యతః ।
దృశ్యన్నేవ హి లోకాన్ స భస్మరాశీకరిష్యతి ॥ 15
అపుడు బ్రహ్మ ఈ విధంగా చెప్పాడు. ఈ లోకాలను నశింపచేయాలనే ఉద్దేశ్యంతో సూర్యుడు ఈ విధంగా విజృంభిస్తున్నాడు. మనం చూస్తూండగానే అతడు సమస్తలోకాలను భస్మం చేయగలడు. (15)
తస్య ప్రతివిధానం చ విహితం పూర్వమేవ హి ।
కశ్యపస్య సుతో ధీమాన్ అరుణేత్యభివిశ్రుతః ॥ 16
ఈ సూర్యుని శాంతింప చేయటానికి ఇదివరకే నేను ఉపాయాన్ని సిద్ధం చేశాను. కశ్యపమహర్షి యొక్క కుమారుడు అరుణుడు అని సుప్రసిద్ధుడే. అతడు చాలా బుద్ధిమంతుడు. (16)
మహాకాయే మహాతేజాః స స్థాస్యతి పురో రవేః ।
కరిష్యతి చ సారథ్యం తేజశ్చాస్య హరిష్యతి ॥ 17
లోకానాం స్వస్తి చైవం స్యాద్ ఋషీణాం చ దివౌకసామ్ ।
ఆ అరుణుని యొక్క శరీరం చాలా విశాలమయినది. అతడు మహాతేజస్వి. అతనిని సూర్యుడి ముందు రథంపై కూర్చుండబెట్టి సారథ్యం చేయిస్తే ఆ భయంకరమైన సూర్య తేజస్సు అడ్డగింపబడుతుంది. ఆ విధంగా చేస్తే దేవతలకూ, ఋషులకూ లోకాలన్నిటికీ శుభం జరుగుతుంది. (17 1/2)
ప్రమతిరువాచ
తతః పితామహాజ్ఞాతః సర్వం చక్రే తదారుణః ॥ 18
ఉదితశ్చైవ సవితా హ్యరుణేన సమావృతః ।
ఏతత్ తే సర్వమాఖ్యాతం యత్ సూర్యం మన్యురావిశిత్ ॥ 19
అపుడు ప్రమతి ఈ విధంగా అంటున్నాడు. అనంతరం బ్రహ్మయొక్క ఆదేశానుసారం అరుణుని దేవతలందరు సూర్య రథ సారథిగా నియమింప చేశారు. సూర్యుడు అరుణునితో సహా ఉదయించాడు. సూర్యుడికి ఎందుకు కోపం వచ్చిందో నేను అంతా చెప్పాను గదా! (18,19)
అరుణశ్చ యథైవాస్య సారథ్యమకరోత్ ప్రభుః ।
భూయ ఏవాపరం ప్రశ్నం శృణు పూర్వముదాహృతమ్ ॥ 20
శక్తిమంతుడైన అరుణుని ఎందుకు సూర్యరథానికి సారథిగా చేశామో ఈ ప్రసంగంలో స్పష్టంగా చెప్పాను గదా! మీరు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాన్ని వినండి. (20)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి సౌపర్ణే చతుర్వింశోఽధ్యాయః ॥ 24 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున ఆస్తీకపర్వమను ఉపపర్వమున సౌపర్ణోపాఖ్యానమను ఇరువది నాల్గవ అధ్యాయము. (24)