11. పదునొకండవ అధ్యాయము
డుండుభము రురునకు అహింస నుపదేశించుట.
డుండుభ ఉవాచ
సఖా బభూవ మే పూర్వం ఖగమో నామ వై ద్విజః ।
భృశం సంశితవాక్ తాత తపోబలసమన్వితః ॥ 1
స మయా క్రీడతా బాల్యే కృత్వా తార్ణం భుజంగమమ్ ।
అగ్నిహోత్రే ప్రసక్తస్తు భీషితః ప్రముమోహ వై ॥ 2
పూర్వం నాకు ఖగముడనే ఒక విప్రుడు స్నేహితుడు ఉండేవాడు. నాయనా! అతడు తపోబలసంపన్నుడు. అతని మాటలు చాలా పదునుగా ఉండేవి. బాల్యంలో ఒకనాడు నేను ఆకతాయితనంగా అగ్నిహోత్రకార్యంలో లగ్నమై ఉన్న అతనిని గడ్డిపాముతో భయపెట్టాను. అతడు భయంతో మూర్ఛపోయాడు. (1,2)
లబ్ద్వా స చ పునః సంజ్ఞాం మామువాచ తపోధనః ।
నిర్దహన్నివ కోపేన సత్యవాక్ సంశితవ్రతః ॥ 3
తిరిగి తెలివి తెచ్చుకొని ఆ తపోధనుడు, సత్యవాక్కు, కఠోరవ్రతుడు కోపంతో నన్ను దహిస్తున్నట్లుగా ఇలా అన్నాడు. (3)
యథావీర్యస్త్వయా సర్పః కృతోఽయం మద్బిభీషయా ।
తథా వీర్యో భుజంగస్త్వం మమ శాసాద్ భవిష్యసి ॥ 4
"నన్ను భయపెట్టడానికి ఎలాంటి శక్తి గల సర్పాన్ని తయారుచేశావో, అలాంటి శక్తి గల సర్పంగా (నిర్వీర్యమైన సర్పం) నా శాపం వలన అవుతావు." (4)
తస్యాహం తపసో వీర్యం జానన్నాసం తపోధన ।
భృశముద్విగ్నహృదయః తమవోచమహం తదా ॥ 5
ప్రణతః సంభ్రమాచ్చైవ ప్రాంజలిః పురతః స్థితః ।
సఖేతి సహసేదం తే నర్మార్థం వై కృతం మయా ॥ 6
క్షంతు మర్హసి మే బ్రహ్మన్ శాపోఽయం వినివర్త్యతామ్ ।
సోఽథ మామబ్రవీద్ దృష్ట్వా భృశముద్విగ్నచేతసమ్ ॥ 7
ముహురుష్ణం వినిఃశ్వస్య సుసంభ్రాంతస్తపోధనః ।
నానృతం వై మయాప్రోక్తం భవితేదం కథంచన ॥ 8
తపోధనా! అతని యొక్క తపశ్శక్తిని నేను ఎరుగుదును. కనుక ఉద్విగ్నహృదయుడనై, సంభ్రమంతో దోసిలి ఒగ్గి నమస్కరిస్తూ అతని ఎదుట నిలిచి అతనితో ఇలా అన్నాను - "చెలికాడవని తొందరపడి పరిహాసం కోసం ఇలా చేశాను. నన్ను క్షమించు. శాపాన్ని మరలించు". అతడు కూడా ఉద్విగ్న మనస్కుడై, మాటిమాటికి వేడినిట్టూర్పులు విడుస్తూ మిక్కిలి తొట్రుపాటుతో నన్ను ఉద్దేశించి ఇలా అన్నాడు - "నా నోట అసత్యం రాదు. ఎలాగూ ఇది జరగవలసినదే. (5-8)
యత్తు వక్ష్యామి తే వాక్యం శృణు తన్మే తపోధన ।
శ్రుత్వా చ హృది తే వాక్యమ్ ఇదమస్తు సదానఘ ॥ 9
తపోధనా! అనఘా! నేను చెప్పబోయే మాటవిను. విని ఈ మాటను నీ ఎదలో ఎల్లప్పుడూ పదిలంగా దాచుకో. (9)
ఉత్పత్స్యతి రురుర్నామ ప్రమతేరాత్మజః శుచిః ।
తం దృష్ట్వా శాపమోక్షస్తే భవితా న చిరాదివ ॥ 10
ప్రమతికి రురువనే పేరుగల పవిత్రుడైన కొడుకు పుడతాడు. అతనిని చూడగానే వెంటనే నీకు శాపవిముక్తి కాగలదు." (10)
స త్వం రురురితి ఖ్యాతః ప్రమతేరాత్మజోఽపి చ ।
స్వరూపం ప్రతిపద్యాహం అద్య వక్ష్యామి తే హితమ్ ॥ 11
రురుడనే పేరుతో ప్రఖ్యాతి చెందిన ప్రమతి కుమారుడవు నీవే కదా! నేను నా రూపాన్ని పొంది నీకు హితం చెపుతాను. (11)
స డౌండుభం పరిత్యజ్య రూపం విప్రర్షభస్తదా ।
స్వరూపం భాస్వరం భూయః ప్రతిపేదే మహాయశాః ॥ 12
ఇదం చోవాచ వచనం రురుమప్రతిమౌజసమ్ ।
అహింసా పరమో ధర్మః సర్వప్రాణభృతాం వర ॥ 13
ఆ విప్రోత్తముడు డుండుభశరీరాన్ని విడిచి ప్రకాశవంతమైన స్వరూపాన్ని తిరిగి పొందాడు. ఆ కీర్తిమంతుడు సాటిలేని ఓజస్సు కల రురువును ఉద్దేశించి ఇలా అన్నాడు - "సమస్తప్రాణులలో శ్రేష్ఠుడా! అహింస పరమ ధర్మం. (12,13)
తస్మాత్ ప్రాణభృతః సర్వాన్ న హింస్యాద్ బ్రాహ్మణః క్వచిత్ ।
బ్రాహ్మణః సౌమ్య ఏవేహ భవతీతి పరా శ్రుతిః ॥ 14
కాబట్టి బ్రాహ్మణుడైనవాడు ఎప్పుడూ కూడా సమస్త ప్రాణులలోను దేనినీ హింసించ కూడదు. "బ్రాహ్మణుడు సౌమ్యుడుగానే ఉండాలి." అని ఉత్తమమైన వేదం చెపుతోంది. (14)
వేద వేదాంగ విన్నామ సర్వభూతాభయప్రదః ।
అహింసా సత్యవచనం క్షమా చేతి వినిశ్చితమ్ ॥ 15
బ్రాహ్మణస్య పరో ధర్మః వేదానాం ధారణాపి చ ।
క్షత్రియస్య హి యో ధర్మః స హి నేష్యేత వై తవ ॥ 16
అతడు (బ్రాహ్మణుడు) వేదవేదాంగవేత్త, సర్వప్రాణులకు అభయప్రదాత అయి ఉండాలి. అహింస, సత్యవాక్యం, క్షమ, వేదాలను ధారణచేయడం బ్రాహ్మణునకు ఉత్తమ ధర్మాలని నిశ్చయింపబడింది. క్షత్రియ ధర్మం నీకు ఉచితమైనది కాదు. (15,16)
దండధారణముగ్రత్వం ప్రజానాం పరిపాలనమ్ ।
తదిదం క్షత్రియస్యాసీత్ కర్మ వై శృణు మే రురో ॥ 17
జనమేజయస్య యజ్ఞేఽస్మిన్ సర్పాణాం హింసనం పురా ।
పరిత్రాణం చ భీతానాం సర్పాణాం బ్రాహ్మణాదపి ॥ 18
తపోవీర్యబలోపేతాద్ వేద వేదాంగపారగాత్ ।
ఆస్తీకాద్ ద్విజముఖ్యాద్ వై సర్పసత్రే ద్విజోత్తమ ॥ 19
రురూ! దండధారణ, ఉగ్రత, ప్రజాపరిపాలన అనేవి క్షత్రియులకు విధింపబడిన కర్మలు. నేను చెప్పేది విను. పూర్వం జనమేజయుడు చేసిన యజ్ఞంలో సర్పాలన్నీ హింసింపబడ్డాయి. ద్విజోత్తమా! ఆ సర్పయాగంలో బ్రాహ్మణముఖ్యుడు, వేద వేదాంగ పారంగతుడు, తపోవీర్య బలసంపన్నుడు అయిన ఆస్తీకుడు భయపడిన సర్పాలకు ప్రాణరక్షణ కల్పించాడు. (17-19)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి డుండుభ శాపమోక్షణే ఏకాదశోఽధ్యాయః ॥11॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున డుండుభ శాపమోక్షము అను పదునొకటవ అధ్యాయము. (11)