10. పదియవ అధ్యాయము

రురు డుండుభుల సంవాదము.

రురు రువాచ
మమ ప్రాణసమా భార్యా దష్టాసీద్ భుజగేన హ ।
తత్ర మే సమయో ఘోరః ఆత్మనోరగ వై కృతః ॥ 1
భుజంగం వై సదా హన్యాం యం యం పశ్యేయమిత్యుత ।
తతోఽహం త్వాం జిఘాంసామి జీవితేనాద్య మోక్ష్యసే ॥ 2
నా ప్రాణసమానురాలయిన భార్యను ఒక పాము కరిచింది. ఎక్కడ పామును చూచినా దానిని చంపాలని అప్పుడు నేను ఘోరమైన ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి నేను నిన్ను చంపాలనుకొంటున్నాను. ఇప్పుడు నీకు చావు తప్పదు. (1,2)
డుండుభ ఉవాచ
అన్యే తే భుజగా బ్రహ్మన్ యే దశంతీహ మానవాన్ ।
డుండుభానహిగంధేన న త్వం హింసితుమర్హసి ॥ 3
బ్రహ్మజ్ఞా! మానవులను కరిచే పాములు వేరేవి. కేవలం ఆకారంలో మాత్రమే సర్పాలను పోలిన డుండుభాలను నీవు హింసించరాదు. (3)
ఏకానర్థాన్ పృథగర్థాన్ ఏకదుఃఖాన్ పృథక్ సుఖాన్ ।
డుండుభాన్ ధర్మవిద్ భూత్వా న త్వం హింసితుమర్హసి ॥ 4
అయ్యో! అనర్థాలు పొందడంలో (హాని పొందడంలో) అన్నీ ఒకటా? ప్రయోజనాలు పొందడంలో మాత్రం వేరా? దుఃఖం పొందడానికి అన్నీ ఒకటేనా? సుఖాలు మాత్రం వేరా? నీవు ధర్మం తెలుసుకో. డుండుభాలను హింసించడం మానుకో. (4)
సౌతిరువాచ
ఇతి శ్రుత్వా వచస్తస్య భుజగస్య రురుస్తదా ।
నావధీద్ భయసంవిగ్నం ఋషిం మత్వాథ డుండుభమ్ ॥ 5
ఉగ్రశ్రవసుడు అంటున్నాడు - ఆ డుండుభం యొక్క మాటలను విని రురువు అతనిని భయావిష్టుడైన మునిగా తలచి చంపలేదు. (5)
ఉవాచ చైనం భగవాన్ రురుః సంశమయన్నివ ।
కామం మాం భుజగ బ్రూహి కోఽసీమాం విక్రియాం గతః ॥ 6
పైగా పూజ్యుడైన రురువు అతనిని శాంతింప చేస్తున్న వానివలె "భుజంగమా! ఈ వికృత రూపాన్ని (సర్పాకారాన్ని) పొందిన నీవెవరవు? నాకు తప్పక చెప్పు" అని అడిగాడు. (6)
సౌతిరువాచ
అహం పురా రురో నామ్నా ఋషిరాసం సహస్రపాత్ ।
సోఽహం శాపేన విప్రస్య భుజగత్వముపాగతః ॥ 7
డుండుభం చెప్పింది - రురూ! నేను పూర్వం సహస్రపాదుడనే మునిని. కాని ఒక బ్రాహ్మణుని యొక్క శాపం వలన సర్పంగా మారాను. (7)
రురు రువాచ
కిమర్థం శప్తవాన్ క్రుద్ధః ద్విజస్త్వాం భుజగోత్తమ ।
కియంతం చైవ కాలం తే వపురేతద్ భవిష్యతి ॥ 8
రురువు అడిగాడు - భుజగోత్తమా! బ్రాహ్మణుడు కోపంతో ఎందుకు నిన్ను శపించాడు? ఎంతకాలం నీవు ఈ శరీరంతో ఉండాలి? (8)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి రురు, డుండుభసంవాదే దశమోఽధ్యాయః ॥ 10 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమపర్వమను ఉపపర్వమున రురు డుండుభ సంవాదమను పదవ అధ్యాయము. (10)