7. ఏడవ అధ్యాయము
కోపించిన అగ్ని మాయమగుట - బ్రహ్మ అతనిని ప్రసన్నుని చేయుట.
సౌతిరువాచ
శప్తస్తు భృగుణా వహ్నిః క్రుద్ధో వాక్యమథాబ్రవీత్ ।
కిమిదం సాహసం బ్రహ్మన్ కృతవానసి మాం ప్రతి ॥ 1
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - "భృగువు శపించగానే క్రుద్ధుడైన అగ్ని ఇలా అన్నాడు. - బ్రహ్మజ్ఞా! నా పట్ల ఇంత సాహసం ఎందుకు చేశావు? (1)
ధర్మే ప్రయతమానస్య సత్యం చ వదతః సమమ్ ।
పౄష్టో యదబ్రువం సత్యం వ్యభీచారోఽత్ర కో మమ ॥ 2
నేను ధర్మం కొరకే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. పక్షపాతం లేకుండా సత్యాన్ని చెపుతూ ఉంటాను. నన్ను అడిగినపుడు సత్యమే చెప్పాను. ఇందులో నా తప్పు ఏముంది. (2)
పృష్టో హి సాక్షీ యః సాక్ష్యం జానానోఽన్యథా వదేత్ ।
స పూర్వానత్మనః సప్త కులే హన్యాత్ తథా పరాన్ ॥ 3
సాక్షి అయినవానిని అడిగినపుడు తెలిసి కూడా సాక్ష్యం చెప్పకుండా అబద్ధం చెపితే అతడు నశిస్తాడు. అతని వంశంలోని అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు నాశనమవుతాయి. (3)
యశ్చ కార్యార్థతత్త్వజ్ఞః జానావోఽపి న భాషతే ।
సోఽపి తేనైవ పాపేన లిప్యతే నాత్ర సంశయః ॥ 4
అలాగే కార్యం యొక్క అసలు తత్త్వం (రహస్యం) తెలిసినప్పటికి చెప్పనివాడు కూడా ఆ పాపాన్నే పొందుతాడు. ఇందులో సందేహమేమీ లేదు. (4)
శక్తోఽహమపి శప్తుం త్వాం మాన్యాస్తు బ్రాహ్మాణా మమ ।
జానతోఽపి చ తే బ్రహ్మన్ కథయిష్యే నిబోధ తత్ ॥ 5
నేను కూడా నీకు శాపం ఇవ్వగలను. కాని బ్రాహ్మణులు నాకు పూజ్యులు. బ్రహ్మనిధీ! నీకు తెలిసినదే అయినా నేను చెపుతున్నది జాగ్రత్తగా విను. (5)
యోగేన బహుధాత్మానం కృత్వా తిష్ఠామి మూర్తిషు ।
అగ్నిహోత్రేషు సత్రేషు క్రియాసు చ మఖేషు చ ॥ 6
యోగబలం చేత నేను అనేకరూపాలు ధరించి, ఆహవనీయ గార్హపత్య దక్షిణాగ్ని మూర్తులయందు, నిత్యం చేయబడే అగ్నిహోత్రాల యందు; అనేక వ్యక్తులు చేసే యాగాలలోను; గర్భాధానాది క్రియలలోను; జ్యోతిష్టోమాది యజ్ఞాలలోను ఉంటున్నాను. (6)
వేదోక్తేన విధానేన మయి యద్ధూయతే హవిః ।
దేవతాః పితరశ్చైవ తేన తృప్తా భవంతి వై ॥ 7
వేదోక్తమైన విధానం ద్వారా నాయందు హోమం చేయబడే హవిస్సుచేత దేవతలు, పితరులు తృప్తి చెందుతున్నారు. (7)
ఆపో దేవగణాః సర్వే ఆపః పితృగణాస్తథా ।
దర్శశ్చ పౌర్ణమాసశ్చ దేవానాం పితృభిః సహ ॥ 8
దేవగణాలన్నీ జలరూపమే. అలాగే పితృగణాలు జలరూపమే. పితరులకు, దేవతలకు కూడా దర్శపౌర్ణమాసలు చేస్తూ ఉంటారు. (8)
దేవతాః పితరస్తస్మాత్ పితరశ్చాపి దేవతాః ।
ఏకీభూతాశ్చ పూజ్యంతే పృథక్త్వేన చ పర్వసు ॥ 9
దేవతలే పితరులు. పితరులు కూడా దేవతలే. పర్వాలలో వీరిని కలిపి పూజిస్తారు. విడిగా కూడా పూజిస్తారు. (9)
దేవతాః పితరశ్సైవ భుంజతే మయి యద్ధుతమ్ ।
దేవతానాం పితౄణాం చ ముఖమేతదహం స్మృతమ్ ॥ 10
నా యందు హోమం చేయబడిన హవిస్సును దేవతలు, పితరులు కూడా భుజిస్తున్నారు. కనుక నన్ను దేవతలకు, పితరులకు ముఖం అని చెపుతూ ఉంటారు. (10)
అమావాస్యాం హి పితరః పౌర్ణమాస్యాం హి దేవతాః ।
మమ్మఖే నైవ హూయంతే భుంజతే చ హుతం హవిః ॥ 11
సర్వభక్షః కథం త్వేషాం భవిష్యామి ముఖం త్వహమ్ ।
అమావాస్యనాడు పితరులకు, పూర్ణిమనాడు దేవతలకు నా ముఖం ద్వారానే హోమాలు వ్రేల్చబడుతూ ఉంటాయి. హోమం చేయబడిన హవిస్సును వారు భుజిస్తూ ఉంటారు. వారికి ముఖంగా ఉన్న నేను సర్వభక్షకుడను ఎట్లు కాగలను? (11 1/2)
సౌతిరువాచ
చింతయిత్వా తతో వహ్నిః చక్రే సంహారమాత్మనః ॥ 12
ద్విజానామగ్నిహోత్రేషు యజ్ఞసత్రక్రియాసు చ ।
నిరోంకారవషట్కారాః స్వధాస్వాహావివర్జితాః ॥ 13
వినాగ్నినా ప్రజాః సర్వాః తత ఆసన్ సుదుఃఖితాః ।
అథర్షయః సముద్విగ్నాః దేవాన్ గత్వాబ్రువన్ వచః ॥ 14
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - "మహర్షులారా! తరువాత అగ్ని కొంతసేపు చింతించి, ద్విజుల యొక్క అగ్నిహోత్రాలలోను, యజ్ఞ సత్ర క్రియలలోను గల తన రూపాన్ని ఉపసంహరించాడు. అగ్ని లేకపోవడం చేత ప్రజలందరూ ఓంకార వషట్కారాలు లేక, స్వధా స్వాహా శబ్దాలు లేక ఆక్రోశించారు. అపుడు మహర్షులందరూ ఉద్విగ్నులై దేవతలవద్దకు వెళ్ళి ఇలా అన్నారు. (12-14)
అగ్నినాశాత్ క్రియాభ్రంశాత్ భ్రాంతా లోకాస్త్రయో ఽనఘాః ।
విధద్ధ్వమత్ర యత్ కార్యం న స్యాత్ కాలాత్యయో యథా ॥ 15
"పుణ్యాత్ములారా! అగ్ని లేకపోవడం వలన క్రియాలోపం జరిగి ముల్లోకాలు దిక్కు తోచకుండా ఉన్నాయి. ఈ విషయంలో ఏమి చేయాలో చేయండి. ఆలసించడం మాత్రం తగదు." (15)
అథర్షయశ్చ దేవాశ్చ బ్రహ్మాణముపగమ్య తు ।
అగ్నేరావేదయన్ శాపం క్రియాసంహారమేవ చ ॥ 16
అనంతరం ఋషులు, దేవతలు కలిసి బ్రహ్మ దగ్గరకు వెళ్లి, అగ్నికి కలిగిన శాపం, అతడు అన్ని రకాల క్రియల నుండి తన రూపాన్ని ఉపసంహరించడం గురించి చెపుతూ ఇలా అన్నారు. (16)
భృగుణా వై మహాభాగ శప్తోఽగ్నిః కారణాంతరే ।
కథం దేవముఖో భూత్వా యజ్ఞభాగాగ్రభుక్ తథా ॥ 17
హుతభుక్ సర్వలోకేషు సర్వభక్షత్వమేష్వతి ।
"మహాభాగా! కారణాంతరం వలన భృగువు అగ్నికి శాపమిచ్చాడు (సర్వభక్షకుడవు కమ్మని). దేవతలకు ముఖ స్వరూపమై, యజ్ఞభాగాలలో అగ్రభోక్తగా ఉంటూ, అన్ని లోకాలలోను హోమం చేయబడిన దానిని భుజిస్తూ ఉండే అగ్ని సర్వభక్షకుడు ఎలా కాగలుగుతాడు? (17 1/2)
శ్రుత్వా తు తద్ వచస్తేషామ్ అగ్ని మాహూయ విశ్వకృత్ ॥ 18
ఉవాచ వచనం శ్లక్ష్ణంభూతభావనమవ్యయమ్ ।
లోకానామిహ సర్వేషాం త్వం కర్తా చాంత ఏవ చ ॥ 19
త్వం ధారయసి లోకాంస్త్రీన్ క్రియాణాం చ ప్రవర్తకః ।
స తథా కురు లోకేశ నోచ్ఛిద్యేరన్ యథా క్రియాః ॥ 20
కస్మాదేవం విమూఢస్త్వమ్ ఈశ్వరః సన్ హుతాశన ।
త్వం పవిత్రం సదా లోకే సర్వభూతగతిశ్చ హ ॥ 21
దేవతల యొక్క ఋషులయొక్క ఆ మాటలను విని విశ్వవిధాత అయిన బ్రహ్మ ప్రాణులను సృష్టించే నాశరహితుడైన అగ్నిదేవుని పిలిచి మృదువుగా ఇలా అన్నాడు. "హుతాశనా! ఈ లోకాలన్నిటికి సృష్టికర్తవు నీవే. అంతం చేసేవాడవూ నీవే. ముల్లోకాలను నీవే ధరిస్తూ ఉంటావు. సమస్త క్రియాకలాపాలను ప్రవర్తింప చేసేవాడవు నీవే. కాబట్టి లోకేశా! క్రియాకలాపాలు విచ్ఛేదం కాకుండా ఉండేలా చేయి. నీవు అన్నిటికి ఈశ్వరుడవు అయిఉండి కూడా ఎందుకిలా మూఢునివలె ప్రవర్తించావు? నీవు లోకంలో సదా పవిత్రుడవు. సర్వభూతాలకు గతివి కూడా. (18-21)
న త్వం సర్వశరీరేణ సర్వభక్షత్వమేష్యసి ।
అపానే హ్యర్చిషో యాస్తే సర్వం భక్ష్యంతి తాః శిఖిన్ ॥ 22
నీవు నీ శరీర మంతటితోను సర్వభక్షకత్వాన్ని పొందవు. అగ్నిదేవా! నీ అపానదేశంలో ఉండే జ్వాలలు మాత్రమే సమస్తాన్ని భక్షిస్తాయి. (22)
క్రవ్యాదా చ తనుర్యా తే సా సర్వం భక్షయిష్యతి ।
యథా సూర్యాంశుభిః స్పృష్టం సర్వం శుచి విభావ్యతే ॥ 23
తథా త్వదర్చిర్నిర్దగ్ధః సర్వం శుచి భవిష్యతి ।
త్వమగ్నే పరమం తేజః స్వప్రభావాద్ వినిర్గతమ్ ॥ 24
స్వతేజసైవ తం శాపం కురు సత్యం ఋషేర్విభో ।
దేవానాం చాత్మనో భాగం గృహాణ త్వం ముఖే హుతమ్ ॥ 25
మాంసాన్ని (లేదా మృత శరీరాన్ని) తినే నీ శరీరభాగంతో సమస్తాన్ని భక్షించగలవు. సూర్యకిరణాల స్పర్శ తగిలిన సమస్తమూ శుచిగా భావింపబడినట్లే నీ జ్వాలచేత దగ్ధమైన సర్వమూ శుచి కాగలదు. అగ్నీ! స్వీయ ప్రభావం చేత ప్రకటమయ్యే పరమ తేజః స్వరూపానివి నీవు, ఆ నీ స్వీయ తేజస్సు చేతనే ఋషి శాపాన్ని నిజం చెయ్యి. నీ యందు హోమం చేయబడిన దానిలో దేవతల యొక్క, నీ యొక్క భాగాన్ని కూడా స్వీకరించు. (23-25)
సౌతిరువాచ
ఏవమస్త్వితి తం వహ్నిః ప్రత్యువాచ పితామహమ్ ।
జగామ శాసనం కర్తుం దేవస్య పరమేష్ఠినః ॥ 26
సూతసుతుడు చెపుతున్నాడు - అగ్ని బ్రహ్మదేవునితో "అలాగే జరుగుగాక" అని చెప్పి పూజ్యుడైన ఆ పరమేష్ఠి ఆజ్ఞను పాటించడానికి వెళ్లాడు. (26)
దేవర్షయశ్చ ముదితాః తతో జగ్ముర్యథాగతమ్ ।
ఋషయశ్చ యథాపూర్వం క్రియాః సర్వాః ప్రచక్రిరే ॥ 27
అనంతరం దేవర్షులు సంతోషించి ఎలా వచ్చినవారు అలాగే వెళ్లిపోయారు. ఋషులు పూర్వం లాగే సమస్త క్రియాకలాపాలు చేసుకోసాగారు. (27)
దివి దేవా ముముదిరే భూతసంఘాశ్చ లౌకికాః ।
అగ్నిశ్చ పరమాం ప్రీతిమ్ అవాప హతకల్మషః ॥ 28
స్వర్గంలో దేవతలు, లోకంలోని ప్రాణికోటి సంతోషించారు. అగ్ని కూడా శాపం వలన కలిగిన పాపం తొలగిపోయి మిక్కిలి సంతోషించాడు. (28)
ఏవం స భగవాన్ శాపం లేభేఽగ్నిః భృగుతః పురా ।
ఏవమేష పురావృత్తః ఇతిహాసోఽగ్నిశాపజః ।
పులోమ్నశ్చ వినాశోఽయం చ్యవనస్య చ సంభవః ॥ 29
ఈ రీతిగా పూర్వం పూజ్యుడైన అగ్నిదేవుడు భృగువు వలన శాపం పొందాడు. ఇది అగ్ని శాపానికి సంబంధించి పూర్వం జరిగిన ఇతిహాసం. ఇదే పులోముడనే రాక్షసుడు నశించడం, చ్యవనుడు పుట్టడం చెప్పే ఇతిహాసం కూడా. (29)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి అగ్నిశాపమోచనే సప్తమోఽధ్యాయః ॥ 7 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమ పర్వమను ఉపపర్వమున అగ్ని శాపవిముక్తుడగుట అను ఏడవ అధ్యాయము. (7)