6. ఆరవ అధ్యాయము

చ్యవనుడు పుట్టుట - భృగువు అగ్నికి శాపమిచ్చుట.

సౌతిరువాచ
అగ్నేరథ వచశ్శ్రుత్వా తద్ రక్షః ప్రజహార తామ్ ।
బ్రహ్మన్ వరాహరూపేణ మనోమారుతరంహసా ॥ 1
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - "బ్రహ్మజ్ఞా! అగ్ని చెప్పిన మాటలను విని ఆ రాక్షసుడు వరాహరూపం ధరించి మనోవేగ వాయువేగాలతో ఆమెను అపహరించాడు. (1)
తతః స గర్భో నివసన్ కుక్షౌ భృగుకులోద్వహ ।
రోషాన్మాతుశ్చ్యుతః కుక్షేః చ్యవనస్తేన సోఽభవత్ ॥ 2
భృగువంశోత్తమా! ఆ సమయంలో ఉదరంలో నివసించే గర్భం రోషంతో తల్లి ఉదరం నుండి (యోగబలం చేత) జారి (చ్యుతమై) వెలుపలికి వచ్చింది. ఆ కారణంగా అతడు చ్యవనుడైనాడు. (2)
తం ద్ఱ్రుష్ట్వా మాతురుదరాత్ చ్యుతమాదిత్యవర్చసమ్ ।
తద్రక్షో భస్మసాద్భుతం సపాత పరిముచ్య తామ్ ॥ 3
తల్లి కడుపునుండి జారిపడి, సూర్యునివలె వెలుగొందే అతనిని చూచి ఆ రాక్షసుడు ఆమెను వదలి పడిపోయి మండి బూడిదగా మారిపోయాడు. (3)
సా తమాదాయ సుశ్రోణీ సపార భృగువందనమ్ ।
చ్యవనం భార్గవం పుత్రం పులోమా దుఃకమూర్చితా ॥ 4
భృగువంశానికి ఆనందకారకమైన భార్గవపుత్రుని చ్యవనుని తీసుకొని పులోమ దుఃఖోద్వేగంతో బ్రహ్మ వద్దకు వెళ్లింది. (4)
తాం దదర్శ స్వయం బ్రహ్మా సర్వలోకపితామహః ।
రుదతీం బాష్పపూర్ణాక్షీం భృగోర్భార్యామనిందితామ్ ॥ 5
సాంత్వయామాస భగవాన్ వధూం బ్రహ్మా పితామహః ।
అశ్రుబిందూద్భవా తస్యాః ప్రావర్తత మహానదీ ॥ 6
లోకాలన్నిటికి పితామహుడు అయిన బ్రహ్మ నీరు నిండిన కళ్లతో ఏడుస్తున్న పతివ్రత అయిన భృగువు యొక్క భార్యను చూశాడు. పూజ్యుడైన ఆ పితామహుడు బ్రహ్మ కోడలిని ఓదార్చాడు. ఆమె కన్నీటి బిందువులు మహానదిగా మారాయి. (5,6)
ఆవర్తంతీ సృతిం తస్యాః భృగోః పత్న్యాస్తపస్వినః ।
తస్యా మార్గం సృతవతీం దృష్ట్యా తు సరితం తదా ॥ 7
నామ తస్యా స్తదా నద్యాః చక్రే లోకపితామహః ।
వధూసరేతి భగవాన్ చ్యవనస్యాశ్రమం ప్రతి ॥ 8
తపస్విని అయిన ఆ భృగుపత్ని యొక్క మార్గాన్ని ఆక్రమిస్తూ ఆమె మార్గాన్నే అనుసరించి ప్రవహిస్తున్న నదిని చూచి లోకపితామహుడు అప్పుడే నదికి "వధూసర" అనే పేరు పెట్టాడు. అది పూజ్యుడైన భృగువు యొక్క ఆశ్రమప్రాంతంలో ప్రవహించ సాగింది. (7,8)
స ఏవ చ్యవనో జజ్ఞే భృగోః పుత్రః ప్రతాపవాన్ ।
తం దదర్శ పితా తత్ర చ్యవనం తాం చ భామినీమ్ ।
స పులోమాం తతో భార్యాం పప్రచ్ఛ కుపితో భృగుః ॥ 9
ఈ రీతిగా భృగువునకు ప్రతాపశాలి అయిన పుత్రుడు చ్యవనుడు పుట్టాడు. తండ్రి ఆ చ్యవనుని, తన పత్ని అయిన పులోమను చూశాడు. సంగతి అంతా విన్నాక కుపితుడై భృగువు తన భార్య పులోమను ఇలా అడిగాడు. (9)
భృగురువాచ
కేవాసి రక్షసే తస్మై కథితా త్వం జిహీర్షతే ।
న హి త్వాం వేద తద్ రక్షః మద్భార్యాం చారుహాసినీమ్ ॥ 10
భృగువు అంటున్నాడు - నిన్ను ఎత్తుకుపోవాలని వచ్చిన ఆ రాక్షసునికి నీ గురించి ఎవరు చెప్పారు? నా భార్యవైయున్న నిన్ను ఆ రాక్షసుడు ఎరుగడు గదా! (10)
తత్వమాఖ్యాహి తం హ్యద్య శప్తుమిచ్ఛామ్యహం రుషా ।
బిభేతి కో న శాపాన్మే కస్య చాయం వ్యతిక్రమః ॥ 11
నిజం చెప్పు. కోపంతో ఇప్పుడే అతనిని శపించాలనుకొంటున్నాను. నా శాపానికి వెరవని అతడెవరు? ఎవరు చేశారు ఈ అపరాధం? (11)
పులోమోవాచ
అగ్నినా భగవన్ తస్మై రక్షసేఽహం నివేదితా ।
తతో మామనయద్ రక్షః క్రోశంతీం కురరీమివ ॥ 12
పులోమ చెపుతున్నది - "పూజ్యుడా! అగ్ని ఆ రాక్షసునికి నా గురించి తెలియచేశాడు. పిమ్మట ఆడుపక్షి వలె ఏడుస్తున్న నన్ను ఆ రాక్షసుడు తీసుకొని పోయాడు. (12)
సాహం తవ సుతస్యాస్య తేజసా పరిమోక్షితా ।
భస్మీభూతం చ తద్ రక్షః మాముత్సృజ్య పపాత వై ॥ 13
అట్టి నేను ఈ నీ కొడుకు యొక్క తేజస్సు చేత విడిపింపబడ్డాను. ఆ రాక్షసుడు నన్ను విడిచి భస్మీభూతుడై పడిపోయాడు". (13)
సౌతిరువాచ
ఇతి శ్రుత్వా పులోమాయాః భృగుః పరమమన్యుమాన్ ।
శశాపాగ్నిమతిక్రుద్ధః సర్వభక్షో భవిష్యసి ॥ 14
ఉగ్రశ్రవసుడు చెపుతున్నాడు - "పులోమయొక్క ఈ మాటలను విన్న భృగువునకు కోపం మరింత పెరిగింది. అతడు అగ్నిని సర్వభక్షకుడవు అవుతావని శపించాడు. (14)
ఇతి శ్రీమహాభారతే ఆదిపర్వణి పౌలోమపర్వణి అగ్నిశాపే షష్ఠోఽధ్యాయః ॥ 6 ॥
ఇది శ్రీమహాభారతమున ఆదిపర్వమున పౌలోమ పర్వమను ఉపపర్వమున అగ్నిశాపమను ఆరవ అధ్యాయము. (6)