66. అరువది యారవ అధ్యాయము
నరనారాయణులయిన అర్జున కృష్ణుల మహిమను వర్ణించుట.
భీష్మ ఉవాచ
తతః స భగవాన్ దేవః లోకానామీశ్వరేశ్వరః ।
బ్రహ్మాణం ప్రత్యువాచేదం స్నిగ్ధగంభీరయా గిరా ॥ 1
భీష్ముడిలా చెప్తున్నాడు. "ఆ తరువాత దివ్యుడు, లోకేశ్వరులకే ఈశ్వరుడు అయిన భగవానుడు మధురగంభీర వాక్కుతో బ్రహ్మతో ఇలా అన్నాడు. (1)
విదితం తాత యోగాన్మే సర్వమేతత్ తవేప్సితమ్ ।
తథా తద్ భవితేత్యుక్త్వా తత్రైవాంతరధీయత ॥ 2
'నాయనా! నీ మనస్సులోని కోరిక మొత్తం యోగశక్తితో నా కర్థమైంది. నీవు చెప్పినట్లే జరుగుతుంది!' ఆ మాట అని, అక్కడే అంతర్ధాన మయ్యాడు. (2)
తతో దేవర్షిగంధర్వాః విస్మయం పరమం గతాః ।
కౌతూహలపరాః సర్వే పితామహమథాబ్రువన్ ॥ 3
ఆపై దేవర్షులు, గంధర్వులూ పరమాశ్చర్యానికి లోనయ్యారు. అందరూ కుతూహలంతో పితామహునితో ఇలా అన్నారు. (3)
కో న్వయం యో భగవతా ప్రణమ్య వినయాద్ విభో ।
వాగ్భిః స్తుతో వరిష్ఠాభిః శ్రోతుమిచ్ఛామ తం వయమ్ ॥ 4
'ప్రభూ! పూజ్యులయిన మీరు వినయంతో నమస్కరించి, గొప్పమాటాలతో స్తుతించిన తానెవరు? ఆయనను గురించి వినాలనుకొంటున్నాం.' (4)
ఏవముక్తస్తు భగవాన్ ప్రత్యువాచ పితామహః ।
దేవబ్రహ్మర్షిగంధర్వాన్ సర్వాన్ మధురయా గిరా ॥ 5
వారలా పలుకగానే పితామహుడు మధురమైన వాక్కుతో దేవ బ్రహ్మర్షి గంధర్వులందరితో ఇలా అన్నాడు. (5)
యేన క్షయం న గచ్ఛంతి దివి తారాగణా ఇవ ।
భూతాత్మా చ ప్రభుశ్చైవ బ్రహ్మ యచ్చ పరం పదమ్ ॥ 6
తేనాస్మి కృతసంవాదః ప్రసన్నేవ సురర్షభాః ।
జగతోనుగ్రహార్థాయ యాచితో మే జగత్పతిః ॥ 7
మానుషం లోకమాతిష్ఠ వాసుదేవ ఇతి శ్రుతః ।
అసురాణాం వధార్థాయ సంభవస్వ మహీతలే ॥ 8
'సురశ్రేష్ఠులారా! పరమతత్త్వమై, భూతభవిష్యద్వర్తమాన స్వరూపుడై, భూతస్వరూపుడై, ప్రభువై, పరబ్రహ్మ పరమపద ప్రఖ్యాతుడైన పరమాత్మ నన్ను అనుగ్రహించాడు. ఆయనతోనే నేను మాట్లాడాను. ఆ జగత్పతి అనుగ్రహాన్ని యాచించాను. అసురసంహారం కోసం మహీతలంలో వాసుదేవుడుగా పుట్టి, మానవలోకంలో అవతరించమని ప్రార్థించాను. (6-8)
సంగ్రామే నిహతా యే తే దైత్యదానవరాక్షసాః ।
త ఇమే నృషు సంభూతాః ఘోరరూపా మహాబలాః ॥ 9
గతంలో యుద్ధాలలో మరణించిన దైత్యులు, దానవులు, రాక్షసులు మానవులలో జన్మించి, మహాబలులై ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. (9)
తేషాం వధార్థం భగవాన్ నరేణ సహితో వశీ ।
మానుషీం యోనిమాస్థాయ చరిష్యతి మహీతలే ॥ 10
వాఱిని చంపటానికై అందరినీ వశం చేసి కొనగల ఆ భగవానుడు నరునితో కలిసి, మానవుడుగా అవతరించి, భూతలంలో సంచరిస్తున్నాడు. (10)
నరనారాయణౌ యౌ తౌ పురాణావృషిసత్తమౌ ।
సహితౌ మానుషే లోకే సంభూతావమితద్యుతీ ॥ 11
అమిత తేజస్వులు, ఋషిసత్తములు, ప్రాచీనులు అయిన నరనారాయణులే మరలా మానవలోకంలో కలిసి పుట్టారు. (11)
అజేయౌ సమరే యత్తౌ సహితైరమరైరపి ।
మూఢాస్త్వేతౌ న జానంతి నరనారాయణావృషీ ॥ 12
ఆ నరనారాయణ ఋషులను అమరులంతా కలిసి సన్నద్ధులై వచ్చినా యుద్ధంలో జయించలేరు. మూఢమానవులు ఆ నరనారాయణులను తెలిసికొనలేకపోతున్నారు. (12)
తస్యాహమగ్రజః పుత్రః సర్వస్య జగతః ప్రభుః ।
వాసుదేవోఽర్చనీయో వః సర్వలోకమహేశ్వరః ॥ 13
ఆయనకు నేను జ్యేష్ఠపుత్రుడను. సర్వజగత్తునకు ప్రభువును. సర్వలోకమహేశ్వరుడైన వాసుదేవుడు మనకు పూజింపదగినవాడు. (13)
తథా మనుష్యోఽయమితి కదాచిత్ సురసత్తమాః ।
నావజ్ఞయా మహావీర్యః శంఖచక్రగదాధరః ॥ 14
సురశ్రేష్ఠులారా! శంఖ చక్ర గదా ధారి, మహాపరాక్రమశాలి అయిన వాసుదేవుని మానవుడే కదా అని మనమెప్పుడూ నిరాదరించగూడదు. (14)
ఏతత్ పరమకం గుహ్యమ్ ఏతత్ పరమకం పదమ్ ।
ఏతత్ పరమకం బ్రహ్మ ఏతత్ పరమకం యశః ॥ 15
ఏతదక్షరమవ్యక్తమ్ ఏతద్ వై శాశ్వతం మహః ।
ఈ వాసుదేవుడే పరమరహస్యం. పరమపద మీయనయే. పరబ్రహ్మ, పరమ యశస్సు ఈ వాసుదేవుడే. అక్షరం, అవ్యక్తం, శాశ్వతమైన తేజస్సు వాసుదేవుడే. (15)
యత్ తత్ పురుషసంజ్ఞం వై గీయతే జ్ఞాయతే న చ ॥ 16
ఏతత్ పరమకం తేజః ఏతత్ పరమకం సుఖం ।
ఏతత్ పరమకం సత్యం కీర్తితం విశ్వకర్మణా ॥ 17
ఈయననే పురుషడంటారు. కానీ ఈయన యథార్థస్వరూపం మాత్రం తెలిసికొనలేము. విశ్వస్రష్ట అయిన బ్రహ్మ ఈయననే పరమతేజస్సు అని, పరమసుఖ మనీ, పరమసత్యమనీ కీర్తించారు. (16,17)
తస్మాత్ సేంద్రైః సురైః సర్వైః లోకశ్చామితవిక్రమః ।
నావజ్ఞేయో వాసుదేవః మానుషోఽయమితి ప్రభుః ॥ 18
కాబట్టి దేవేంద్రుడు కానీ, దేవతలు కానీ, సమస్తజనులు కానీ, "ఈయన మనుష్యుడే" అని అమితవిక్రముడైన వాసుదేవుని తక్కువచేసి చూడదగదు. (18)
యశ్చ మానుషమాత్రోఽయమ్ ఇతి బ్రూయత్ స మందధీః ।
హృషీకేశమవజ్ఞానాత్ తమాహుః పురుషాధమమ్ ॥ 19
ఇంద్రియాధిపతి అయిన ఈయనను అజ్ఞానంతో మానవమాత్రుడుగా భావించినవాడు మందమతి. అటువంటి వానిని నరాధముడంటారు. (19)
యోగినం తం మహాత్మానం ప్రవిష్టం మానుషీం తనుమ్ ।
అవమన్యేద్ వాసుదేవం తమాహుస్తామసం జనాః ॥ 20
మహాత్ముడై యోగశక్తితో మానవశరీరాన్ని స్వీకరించిన వాసుదేవుని అవహేళన చేసిన వానిని తామసుడని జనులంటారు. (20)
దేవం చరాచరాత్మానం శ్రీవత్సాంకం సువర్చసమ్ ।
పద్మనాభం న జానాతి తమాహుస్తామసం బుధాః ॥ 21
చరాచరస్వరూపుడై, శ్రీవత్సాంకుడై, సుతేజస్వియైన భగవానుడు - పద్మనాభుని తెలియనివారు తామసులని పండితులంటారు. (21)
కిరీటకౌస్తుభధరం మిత్రాణామభయంకరమ్ ।
అవజానన్ మహాత్మానం ఘోరే తమసి మజ్జతి ॥ 22
కిరీటకౌస్తుభధారియై మిత్రులకు అభయమిచ్చే మహాత్ముడా వాసుదేవుడు. ఆయనను అవహేళన చేస్తే గాఢాంధకారంలో మునిగిపోతాడు. (22)
ఏవం విదిత్వా తత్త్వార్థం లోకానామీశ్వరేశ్వరః ।
వాసుదేవో నమస్కార్యః సర్వలోకైః సురోత్తమాః ॥ 23
సురశ్రేష్ఠులారా! ఈ రీతిగా తత్త్వార్థాన్ని గ్రహించి, లోకేశ్వరేశ్వరుడైన వాసుదేవుడు సర్వలోకాలకూ నమస్కరింపదగినవాడు." (23)
భీష్మ ఉవాచ
ఏవముక్త్వా స భగవాన్ దేవాన్ సర్షిగణాన్ పురా ।
విసృజ్య సర్వభూతాత్మా జగామ భవనం స్వకమ్ ॥ 24
భీష్ముడు చెపుతున్నాడు. గతంలో సర్వభూత స్వరూపుడైన బ్రహ్మ దేవతలకు, ఋషిగణాలకు ఈ రీతిగా చెప్పి, వారిని వీడి, తన భవనానికి వెళ్ళిపోయాడు. (24)
తతో దేవాః సగంధర్వాః మునయోఽప్సరసోఽపి చ ।
కథాం తాం బ్రహ్మణా గీతాం శ్రుత్వా ప్రీతా దివం యయుః ॥ 25
ఆపై దేవతలు, గంధర్వులు, మునులు, అచ్చరలు బ్రహ్మ చెప్పిన ఆ కథను విని, ఆనందించి, స్వర్గానికి వెళ్ళారు. (25)
ఏతచ్ఛ్రుతం మయా తాత ఋషీణాం భావితాత్మనామ్ ।
వాసుదేవం కథయతాం సమవాయే పురాతనమ్ ॥ 26
నాయనా! ఒకప్పుడు పవిత్రహృదయులైన మహర్షుల సమావేశంలో వాసుదేవుని గురించి ఇలా చెప్పుకొంటుంటే నేను విన్నాను. (26)
రామస్య జామదగ్న్యస్య మార్కండేయస్య ధీమతః ।
వ్యాసనారదయోశ్చాపి సకాశాద్ భరతర్షభ ॥ 27
భరతర్షభా! ఇంతేకాక జగదగ్ని కొడుకు పరశురాముడు, ధీమంతుడైన మార్కండేయుడు, వ్యాసనారదుల ద్వారా కూడా ఇలాగే విన్నాను. (27)
ఏతమర్థం చ విజ్ఞాయ శ్రుత్వా చ ప్రభుమవ్యయమ్ ।
వాసుదేవం మహాత్మానం లోకానామీశ్వరేశ్వరమ్ ॥ 28
(జానామి భరతశ్రేష్ఠ కృష్ణం నారాయణం ప్రభుమ్) ।
భరతశ్రేష్ఠా! ఈ విషయాన్ని అర్థం చేసికొని, వసుదేవసుతుడైన కృష్ణుడు అవ్యయుడు, ప్రభువు, లోకేశ్వరుడు, మహాత్ముడు, శక్తి సంపన్నుడు అయిన నారాయణుడే అని గ్రహించాడు. (28)
యస్య చైవాత్మజో బ్రహ్మా సర్వస్య జగతః పితా ।
కథం న వాసుదేవోఽయమ్ అర్చ్యశ్చేజ్యశ్చ మానవైః ॥ 29
సర్వజగత్పిత అయిన బ్రహ్మ కూడా ఆ వాసుదేవుని కొడుకే అటువంటి వాసుదేవుడు మానవులకు పూజ్యుడు, ఆరాధనీయుడు కాకపోతాడా? (29)
వారితోఽసి మయా తాత మునిభిర్వేదపారగైః ।
మా గచ్ఛ సంయుగం తేన వాసుదేవేన ధన్వినా ॥ 30
మా పాండవైః సార్ధమితి తత్ త్వం మోహాన్న బుధ్యసే ।
మన్యే త్వాం రాక్షసం క్రూరం తథా చాసి తమోవృతః ॥ 31
నాయనా! నేను, వేదవేత్తలయిన మునులు మేటివిలుకాడైన వాసుదేవునితోనూ, పాండవులతోనూ యుద్ధం తగదని నిన్ను వారించాం. కానీ మోహంకారణంగా నీవు తెలిసికొనలేదు. తమోగుణం ఆవరించిన నీవు క్రూరరాక్షసుడవని నేను భావిస్తున్నాను. (30,31)
యస్మాద్ ద్విషసి గోవిందం పాండవం తం ధనంజయమ్ ।
నరనారాయణౌ దేవౌ కోఽన్యో ద్విష్యాద్ధి మానవః ॥ 32
నీవు పాండుకుమారుడైన అర్జునుని, గోవిందుని ద్వేషిస్తున్నావు. వారు దివ్యులైన నరనారాయణులు. నీవు తప్ప మరే మానవుడు వారిని ద్వేషించడు. (32)
తస్మాద్ బ్రవీమి తే రాజన్ ఏష వై శాశ్వతోఽవ్యయః ।
సర్వలోకమయో నిత్యః శాస్తా ధాత్రీధరో ధ్రువః ॥ 33
రాజా! అందువలననే నీకు చెప్తున్నాను. ఈ కృష్ణుడు సనాతనుడు, అవ్యయుడు, సర్వలోకమయుడు, నిత్యుడు, పాలకుడు, ధరణీధరుడు, నిశ్చలుడు. (33)
యో ధారయతి లోకాంస్త్రీన్ చరాచరగురుః ప్రభుః ।
యోద్ధా జయశ్చ జేతా చ సర్వప్రకృతిరీశ్వరః ॥ 34
చరాచరగురు వయిన ఈ ప్రభువే మూడు లోకాలనూ ధరిస్తున్నాడు. తానే యోద్ధ. తానే జేత. తానే జయం. సర్వకారణమైన పరమేశ్వరుడు తానే. (34)
రాజన్ సర్వమయో హ్యేషః తమోరాగవివర్జితః ।
యతః కృష్ణస్తతో ధర్మః యతో ధర్మస్తతో జయః ॥ 35
రాజా! ఈ హరియే సర్వస్వరూపుడు. తమోగుణం కానీ రాగం కానీ లేనివాడు. కృష్ణుడున్న చోట ధర్మ ముంటుంది. ధర్మమున్నచోట గెలుపు ఉంటుంది. (35)
తస్య మాహాత్మ్యయోగేన యోగేనాత్మమయేన చ ।
ధృతాః పాండుసుతా రాజన్ జయశ్చైషాం భవిష్యతి ॥ 36
రాజా! ఆ శ్రీహరి మాహాత్మ్యయోగంతో, ఆత్మయోగంతో పాండవులు రక్షింపబడుతున్నారు. విజయం వారికే దక్కుతుంది. (36)
శ్రేయోయుక్తాం సదా బుద్ధిం పాండవానాం దధాతి యః ।
బలం చైవ రణే నిత్యం భయేభ్యశ్చైవ రక్షతి ॥ 37
ఆ శ్రీహరి పాండవులకు సదా శ్రేయస్సుతో కూడిన బుద్ధిని కలిగిస్తాడు. యుద్ధంలో బలాన్ని అందిస్తాడు. భయాల నుండీ రక్షిస్తాడు. (37)
స ఏష శాశ్వతో దేవః సర్వగుహ్యమయః శివః ।
వాసుదేవ ఇతి జ్ఞేయః యన్మాం పృచ్ఛసి భారత ॥ 38
భారతా! నీవు నన్ను అడిగావు కదా! ఆ సనాతన, సర్వరహస్యమయ, కళ్యాణరూప పరమాత్మయే వాసుదేవుడని గ్రహించాలి. (38)
బ్రాహ్మణైః క్షత్రియైర్యైశ్యైః శూద్రైశ్చ కృతలక్షణైః ।
సేవ్యతేఽభ్యర్చ్యతే చైవ నిత్యయుక్తైః స్వకర్మభిః ॥ 39
నిత్యాసక్తులై తమ కర్మలతో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సల్లక్షణులయిన శ్రూదులు ఈయనను సేవిస్తారు. పూజిస్తారు. (39)
ద్వాపరస్య యుగస్యాంతే ఆదౌ కలియుగస్య చ ।
సాత్వతం విధిమాస్థాయ గీతః సంకర్షణేన వై॥ 40
(కృష్ణేతి నామ్నా విఖ్యాతః ఇమం లోకం స రక్షతి) ।
ద్వాపర యుగాంతంలో, కలియుగాదిలో సంకర్షణుడు ఉపాసనావిధితో శ్రీకృష్ణుని కీర్తించాడు. కృష్ణనామంతో ప్రసిద్ధుడైన ఆయన ఈ లోకాన్ని రక్షిస్తున్నాడు. (40)
స ఏష సర్వం సురమర్త్యలోకం
సముద్రకక్ష్యాంతరితాం పురీం చ ।
యుగే యుగే మానుషం చైవ వాసం
పునః పునః సృజతే వాసుదేవః ॥ 41
ఆ వాసుదేవుడే ప్రతియుగంలోనూ దేవలోకాన్ని, మర్త్యలోకాన్ని, సముద్రంలోనున్న ద్వారకాపురిని నిర్మిస్తాడు. తాను పదే పదే భూలోకంలో అవతరిస్తాడు." (41)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి విశ్వోపాఖ్యానే షట్ షష్టితమోఽధ్యాయః ॥ 66 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధపర్వమను ఉపపర్వమున విశ్వోపాఖ్యాన మను అరువది యారవ అధ్యాయము. (66)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి 42 శ్లోకాలు)