59. ఏబది తొమ్మిదవ అధ్యాయము
భీష్మపరాక్రమము - శ్రీకృష్ణుడు భీష్ముని ఆక్రమించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
ప్రతిజ్ఞాతే తతస్తస్మిన్ యుద్ధే భీష్మేణ దారుణే ।
క్రోధితో మమ పుత్రేణ దుఃఖితేన విశేషతః ॥ 1
భీష్మః కిమకరోత్ తత్ర పాండవేయేషు సంయుగే ।
పితామహే వా పంచాలాః తన్మమాచక్ష్వ సంజయ ॥ 2
ధృతరాష్ట్రుడిలా అడిగాడు. "నా కుమారుడు బాధపడుతూ భీష్ముని రెచ్చగొట్టిన తరువాత దారుణ యుద్ధం చేస్తానని ప్రతిన బూనిన భీష్ముడు రణభూమిలో పాండవులను ఏంచేశాడు? పాంచాలవీరులు భీష్ముని ఏం చేశారు? సంజయా! నాకు వివరంగా చెప్పు." (1,2)
సంజయ ఉవాచ
గతపూర్వాహ్ణభూయిష్ఠే తస్మిన్నహని భారత ।
పశ్చిమాం దిశమాస్థాయ స్థితే చాపి దివాకరే ॥ 3
జయం ప్రాప్తేషు హృష్టేషు పాండవేషు మహాత్మసు ।
సర్వధర్మవిశేషజ్ఞః పితా దేవవ్రతస్తవ ॥ 4
అభ్యయాజ్జవనైరశ్వైః పాండవానామనీకినీమ్ ।
మహత్యా సేనయా గుప్తః తవ పుత్రైశ్చ సర్వశః ॥ 5
సంజయుడు చెప్తున్నాడు - "భారతా! ఆ రోజులో పూర్వాహ్ణం దాదాపు ముగిసింది. సూర్యుడు పశ్చిమం వైపు నిలిచి ఉన్నాడు. గెలుపొందిన మహాత్ములు - పాండవులు ఆనందంగా ఉన్నారు. అప్పుడు సర్వధర్మ విశేషజ్ఞుడైన నీ తండ్రి దేవవ్రతుడు పెద్దసేనచే, నీ కుమారులచే అంతటా రక్షింపబడుతూ, జవనాశ్వాలతో పాండవసేనపై దాడి చేశాడు. (3-5)
ప్రావర్తత తతో యుద్ధం తుములం లోమహర్షణమ్ ।
అస్మాకం పాండవైః సార్ధమ్ అనయాత్ తవ భారత ॥ 6
భారతా! ఆ పై నీవు చేసిన అన్యాయం వలన మనకు మనవారికి పాండవులతో రోమాంచజనకమైన ఘోరయుద్ధం జరిగింది. (6)
ధనుషాం కూజతాం తత్ర తలానాం చాభిహన్యతామ్ ।
మహాన్ సమభవచ్ఛబ్దః గిరీణామివ దీర్యతామ్ ॥ 7
ధనుష్టంకారాలు జబ్బచరుపులు కొండలు విరిగి పడుతున్నట్టు పెద్దగా శబ్దం చేశాయి. (7)
తిష్ఠ స్థితోఽస్మి విద్ధ్యేనం నివర్తస్వ స్థిరో భవ ।
స్థిరోఽస్మి ప్రహరస్వేతి శబ్దోఽశ్రూయత సర్వశః ॥ 8
"నిలు. నిలిచా. వీణ్ణి కొట్టు - వెనక్కురా. స్థిరంగా ఉండు. స్థిరంగానే ఉన్నా. కొట్టు" - ఎటు విన్నా ఇటువంటి మాటలే వినిపిస్తున్నాయి. (8)
కాంచనేషు తనుత్రేషు కిరీటేషు ధ్వజేషు చ ।
శిలానామివ శైలేషు పతితానామభూద్ ధ్వనిః ॥ 9
బంగారు కవచాలకూ, కిరీటాలకూ, ధ్వజాలకూ అస్త్రశస్త్రాలు తగులుతుంటే పర్వతాల మీద నుండి దొర్లిపడుతున్న రాళ్ళచప్పుడు వలె వినిపిస్తోంది. (9)
పతితాన్యుత్తమాంగాని బాహవశ్చ విభూషితాః ।
వ్యచేష్టంత మహీం ప్రాప్య శతశోఽథ సహస్రశః ॥ 10
వందలు, వేల కొలదిగ సైనికుల తలలు, అలంకారాలతో సహా బాహువులు తెగి, నేలపై బడి కొట్టుకొంటున్నాయి. (10)
హృతోత్తమాంగాః కేచిత్ తు తథైవోద్యతకార్ముకాః ।
ప్రగృహీతాయుధాశ్చాపి తస్థుః పురుషసత్తమాః ॥ 11
కొందరు పురుషసత్తముల తలలు తెగాయి. కానీ వారి శరీరాలు విండ్లను పైకెత్తి లేదా ఆయుధాలను చేతబట్టి నిలిచి ఉన్నాయి. (11)
ప్రావర్తత మహావేగా నదీ రుధిరవాహినీ ।
మాతంగాంగశిలా రౌద్రా మాంసశోణితకర్దమా ॥ 12
వరాశ్వనరనాగానాం శరీరప్రభవా తదా ।
పరలోకార్ణవముఖీ గృధ్రగోమాయుమోదినీ ॥ 13
ఆ రణభూమిలో నెత్తుటేరు మహావేగంగా ప్రవహిస్తోంది. ఏనుగుల శరీరాలే దానిలోని శిలలు. నెత్తురు, మాంసాలే బురద. ఆ రౌద్రనది గుర్రాలు, సైనికులు, ఏనుగులు శరీరాల నుండి పుడుతోంది. పరలోక మనే సాగరం వైపు వెళుతోంది. అది గ్రద్దలకు, నక్కలకు ఆమోదాన్ని కలిగిస్తోంది. (12,13)
న దృష్టం న శ్రుతం వాపి యుద్ధమేతాదృశం నృప ।
యథా తవ సుతానాం చ పాండవానాం చ భారత ॥ 14
భారతా! రాజా! నీ కుమారులకు, పాండవులకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధం లాంటి యుద్ధాన్ని ఇంతవరకు చూడలేదు. కనీసం వినలేదు. (14)
నాసీద్ రథపథస్తత్ర యోధైర్యుధి నిపాతితైః ।
గజైశ్చ పతితైర్నీలైః గిరిశృంగైరివావృతః ॥ 15
యుద్ధంలో పడిపోయిన యోధుల శరీరాలు, కొండ శిఖరాల వంటి నల్లని ఏనుగుల శరీరాలు రణభూమిలో అడ్డంగా ఉన్నందు వల్ల రథాలు వెళ్ళటానికి దారి లేకుండా పోయింది. (15)
వికీర్ణైః కవచైశ్చిత్రైః శిరస్త్రాణైశ్చ మారిష ।
శుశుభే తద్ రణస్థానం శరదీవ నభస్తలమ్ ॥ 16
మారిషా! చిత్రకవచాలు, శిరస్త్రాణాలు చెల్లా చెదరుగ పడిఉంటే ఆ రణభూమి శరత్కాలపు ఆకాశం వలె శోభించింది. (16)
వినిర్భిన్నాః శరైః కేచిద్ అంత్రాపీడప్రకర్షిణః ।
అభీతాః సమరే శత్రూన్ అభ్యధావంత దర్పితాః ॥ 17
కొందరు వీరులు బాణాల తాకిడికి ప్రేవులు తెగి, బాధ కలుగుతున్నా నిర్భయంగా, దర్పంగా యుద్ధంలో శత్రువులను ఆక్రమించారు. (17)
తాత భ్రాతః సఖే బంధో వయస్య మమ మాతుల ।
మా మాం పరిత్యజేత్యన్యే చుక్రుశుః పతితా రణే ॥ 18
ఎంతోమంది రణభూమిలో పడి "తాతా! సోదరా! మిత్రమా! బంధూ! వయస్యా! మామా! నన్ను వీడి వెళ్ళవద్దు" అని ఆక్రోశిస్తున్నారు. (18)
అథాభ్యేహి త్వమాగచ్ఛ కిం భీతోఽసి క్వ యాస్యసి ।
స్థితోఽహం సమరే మా భైః ఇతి చాన్యే విచుక్రుశుః ॥ 19
మరికొందరు "రా! దగ్గరకురా! భయపడుతున్నావా? ఎక్కడకు వెళతాం? నేను యుద్ధ భూమిలోనే ఉన్నాను. భయపడవద్దు" అని అరిచారు. (19)
తత్ర భీష్మః శాంతనవః నిత్యం మండలకార్ముకః ।
ముమోచ బాణాన్ దీప్తాగ్రాన్ అహీనాశీవిషానివ ॥ 20
ధనుస్సును ఎప్పుడూ మండలాకారంలో ఎక్కుపెట్టియున్న శంతనునందనుడు భీష్ముడు విషసర్పాల వలె భీకరంగా ప్రజ్వలిస్తున్న బాణాలను విడిచాడు. (20)
శరైరేకాయనీకుర్వన్ దిశః సర్వా యతవ్రతః ।
జఘాన పాండవరథాన్ ఆదిశ్య భరతర్షభ ॥ 21
భరతర్షభా! యతవ్రతుడైన భీష్ముడు బాణాలతో దిక్కులన్నిటిని ఒక్కటి చేస్తూ పాండవరథాలను, రథులను పేరు చెప్పి, మరీ కొట్టసాగాడు. (21)
స నృత్యన్ రథోపస్థే దర్శయన్ పాణిలాఘవమ్ ।
అలాతచక్రవద్ రాజన్ తత్ర తత్ర స్మ దృశ్యతే ॥ 22
రాజా! అప్పుడు తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్న భీష్ముడు రథం మీద ఆసనంపై నృత్యం చేస్తున్నట్లు కనిపించాడు. అలాతచక్రంలా గుండ్రంగా తిరుగుతున్నాడు. (22)
తమేకం సమరే శూరం పాండవాః సృంజయైః సహ ।
అనేకశతసాహస్రం సమపశ్యంత లాఘవాత్ ॥ 23
భీష్ముడు ఒంటరివాడైనా తన హస్తలాఘవం వల్ల సృంజయులకు, పాండవులకు లక్షల కొలది వీరులుగా కనిపించాడు. (23)
మాయాకృతాత్మానమివ భీష్మం తత్ర స్మ మేనిరే ।
పూర్వస్యాం దిశి తం దృష్ట్వా ప్రతీచ్యాం దదృశుర్జనాః ॥ 24
భీష్ముడు ఏదో మాయ చేసి, అనేక రూపాలను ధరించాడని అక్కడ అందరూ అనుకొంటున్నారు. తూర్పు దిక్కున కనిపిస్తున్నాడు. ఇంతలోనే పశ్చిమదిక్కునా కనిపిస్తున్నాడు. (24)
ఉదీచ్యాం చైవమాలోక్య దక్షిణస్యాం పునః ప్రభో ।
ఏవం స సమరే శూరః గాంగేయః ప్రత్యదృశ్యత ॥ 25
రాజా! ఉత్తరదిక్కున కనిపిస్తున్నాడు. ఇంతలో దక్షిణ దిశలో కనిపిస్తున్నాడు. ఈ రీతిగా ఆ శూరుడు - గాంగేయుడు రణభూమిలో కనిపించాడు. (25)
న చైవం పాండవేయానాం కశ్చిచ్ఛక్నోతి వీక్షితుమ్ ।
విశిఖానేవ పశ్యంతి భీష్మచాపచ్యుతాన్ బహూన్ ॥ 26
పాండవసేనలలో ఎవ్వరూ ఆయనను చూడలేక పోతున్నారు. కేవలం భీష్ముని వింటి నుండి వెలువడిన వివిధ బాణాలను మాత్రమే చూడగలుగుతున్నారు. (26)
కుర్వాణం సమరే కర్మ సూదయానం చ వాహినీమ్ ।
వ్యాక్రోశంత రణే తత్ర నరా బహువిధా బహు ॥ 27
అమానుషేణ రూపేణ చరంతం పితరం తవ ।
అక్కడ రణరంగంలో అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ అమానుషరూపంతో తిరుగుతున్న నీ పెదతండ్రి భీష్ముడు పాండవసేనను సంహరిస్తున్నాడు. అక్కడ రకరకాల ప్రజలు రకరకాలుగా మాటాడుకొంటున్నారు. (27 1/2)
శలభా ఇవ రాజానః పతంతి విధిచోదితాః ॥ 28
భీష్మాగ్నిమభిసంక్రుద్ధం వినాశాయ సహస్రశః ।
విధిప్రేరణతో రాజులెందరో మిడతల వలె ఆత్మ వినాశనానికే క్రోధభరమైన భీష్మాగ్నిలో పడిపోతున్నారు. (28 1/2)
న హి మోఘః శరః కశ్చిద్ ఆసీద్ భీష్మస్య సంయుగే ॥ 29
నరనాగాశ్వకాయేషు బహుత్వాల్లఘుయోధినః ।
భీష్ముడు చేస్తున్న యుద్ధంలో నరులపై, ఏనుగులపై, గుర్రాలపై ప్రయోగిస్తున్న బాణాలలో ఒక్కటీ వ్యర్థం కాలేదు. ఆయన దగ్గర వివిధబాణాలున్నాయి. వాటిని వాడే నేర్పూ ఉంది. (29 1/2)
(ప్రచ్ఛాదయన్ శరాన్ భీష్మః నిశితాన్ కంకపత్రిణః ।)
భినత్త్యేకేన బాణేన సముఖేన పతత్త్రిణా ॥ 30
గజకంటకసన్నద్ధం వజ్రేణేవ శిలోచ్చయమ్ ।
భీష్ముడు కంకపత్రాలతో కూడిన తీక్ష్ణబాణాలను ప్రయోగిస్తున్నాడు. రెక్కలు గలిగి, పదునెక్కి ఉన్న ఒకే బాణంతో లోహసన్నాహం గల ఏనుగును కూడా వజ్రంతో పర్వతాన్ని బ్రద్దలు కొట్టినట్టు చీలుస్తున్నాడు. (30 1/2)
ద్వౌ త్రీనపి గజారోహాన్ పిండితాన్ వర్మితానపి ॥ 31
నారాచేన సుముక్తేన నిజఘాన పితా తవ ।
నీ పెద తండ్రి ఒక్క బాణాన్నే చక్కగా ప్రయోగించి ఒకటిగా కూర్చున్న ఇద్దరు ముగ్గురు గజారోహకులను కూడా - వారు కవచాలు ధరించిన వారైనా సరే - చంపుతున్నాడు. (31 1/2)
యో యో భీష్మం నరవ్యాఘ్రమ్ అభ్యేతి యుధి కశ్చన ॥ 32
ముహూర్తదృష్టః స మయా పతితో భువి దృశ్యతే ।
యుద్ధంలో నరశ్రేష్ఠుడైన భీష్ముని మీదకు వచ్చినవాడు ఎవడైనా ముహూర్తకాలంలోనే నేలపై బడి నాకు కనిపిస్తున్నాడు. (32 1/2)
ఏవం సా ధర్మరాజస్య వధ్యమానా మహాచమూః ॥ 33
భీష్మేణాతులవీర్యేణ వ్యశీర్యత సహస్రధా ।
ఇలా అసమాన పరాక్రమశాలి అయిన భీష్మునిచే సంహరింపబడుతున్న ధర్మజుని మహాసేన వేయి ముక్కలుగా శిథిలమయింది. (33 1/2)
ప్రాకంపత మహాసేనా శరవర్షేణ తాపితా ॥ 34
పశ్యతో వాసుదేవస్య పార్థస్యాథ శిఖండినః ।
వాసుదేవుడు, అర్జునుడు, శిఖండి చూస్తుండగానే శరవర్షంతో తపింపజేయబడిన మహాసేన వణకిపోసాగింది. (34 1/2)
వర్తమానాపి తే వీరాః ద్రవమాణాన్ మహారథాన్ ॥ 35
నాశక్నువన్ వారయితుం భీష్మబాణప్రపీడితాన్ ।
అక్కడ ఎందరో వీరులున్నా భీష్ముని బాణాల తాకిడికి పారిపోతున్న మహారథులను నివారించలేకపోయారు. (35 1/2)
మహేంద్రసమవీర్యేణ వధ్యమానా మహాచమూః ॥ 36
అభజ్యత మహారాజ న చ ద్వౌ సహ ధావతః ।
మహారాజా! మహేంద్ర తుల్యపరాక్రమం గల భీష్మునిచే చంపబడుతున్న ఆ మహాసేన శిథిల మయిపోయింది. ఏ ఇద్దరూ కలిసి పారిపోవటం లేదు. (36 1/2)
ఆవిద్ధనరనాగాశ్వం పతితధ్వజకూబరమ్ ॥ 37
అనీకం పాండుపుత్రాణాం హాహాభూతమచేతనమ్ ।
సైనికులు, ఏనుగులు, గుర్రాలు గాయపడగా రథ ధ్వజాలు, కూబరాలు విరిగిపడిపోగా పాండుపుత్రుల సేన హాహాకారాలు చేస్తూ అచేతనమయింది. (37 1/2)
జఘానాత్ర పితా పుత్రం పుత్రశ్చ పితరం తథా ॥ 38
ప్రియం సఖాయం చాక్రందే సఖా దైవబలాత్కృతః ।
ఆ రణంలో విధివశాన అక్కడ తండ్రి కొడుకును, కొడుకు తండ్రిని, ప్రియమిత్రుని మిత్రుడు చంపివేస్తున్నారు. (38 1/2)
విముచ్య కవచాన్యన్యే పాండుపుత్రస్య సైనికాః ॥ 39
విముక్తకేశా ధావంతః ప్రత్యదృశ్యంత భారత ।
భారతా! పాండవుల సైనికులలో కొందరు కవచాలను వీడి, జుట్టు విరబోసుకొని పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. (39 1/2)
తద్ గోకులమివోద్భ్రాంతమ్ ఉద్భ్రాంతరథయూథపమ్ ॥ 40
దదృశే పాండుపుత్రస్య సైన్యమార్తస్వరం తదా ।
ప్రభజ్యమానం సైన్యం తు దృష్ట్వా యాదవనందనః ॥ 41
ఉవాచ పార్థం బీభత్సుం నిగృహ్య రథముత్తమమ్ ।
అప్పుడు ఆ ధర్మరాజుసేన వ్యాకులపడి, చెదరిపోయి పారిపోతున్న గోవుల సమూహం వలె ఆర్తనాదాలు చేస్తూ కనిపించింది. రథసేనాపతులెందరో కర్తవ్యమూఢులయ్యారు. సేన చితికిపోవటం చూసి, శ్రీకృష్ణుడు తమ శ్రేష్ఠరథాన్ని ఆపి, అర్జునునితో ఇలా అన్నాడు. (40, 41 1/2)
అయం స కాలః సంప్రాప్తః పార్థ యస్తేఽభికాంక్షితః ॥ 42
ప్రహరస్వ నరవ్యాఘ్ర న చేన్మోహాద్ విముహ్యసే ।
"నరశ్రేష్ఠా! అర్జునా! నీవు కోరుకొన్న సమయం ఆసన్నమైంది. నీవు మోహంతో కర్తవ్యమూఢుడవు కాకపోతే వెంటనే పోరాటం ప్రారంభించు. (42 1/2)
యత్ త్వయా కథితం వీర పురా రాజ్ఞాం సమాగమే ॥ 43
భీష్మద్రోణముఖాన్ సర్వాన్ ధార్తరాష్ట్రస్య సైనికాన్ ।
సానుబంధాన్ హనిష్యామి యే మాం యోత్స్యంతి సంయుగే ॥ 44
ఇతి తత్ కురు కౌంతేయ సత్యం వాక్యమరిందమ ।
బీభత్సో పశ్య సైన్యం స్వం భజ్యమానం తతస్తతః ॥ 45
వీరా! ఇంతకుందు రాజులంతా కలిసి ఆలోచిస్తున్నపుడు 'నన్ను ఎదిరించిన భీష్మద్రోణాదులను, దుర్యోధన సేనల నన్నింటినీ, సహచరులతో పాటు చంపుతా'నన్నావు గదా! అరిందమా! కౌంతేయా! దాని నిప్పుడు యథార్థం చేయాలి. బీభత్సూ! శిథిలమై అటూ - ఇటూ పారిపోతున్న నీ సేనను చూడు. (43-45)
ద్రవతశ్చ మహీపాలాన్ పశ్య యౌధిష్ఠిరే బలే ।
దృష్ట్వా హి భీష్మం సమరే వ్యాత్తాననమివాంతకమ్ ॥ 46
భయార్తాః ప్రపలాయంతే సింహాత్ క్షుద్రమృగా ఇవ ।
యుధిష్ఠిరసేనలో పారిపోతున్న రాజులను చూడు. నోరుతెరిచి కబళిస్తున్న మృత్యువులా ఉన్న భీష్ముని యుద్ధంలో చూసి, భయార్తులై సింహాన్ని చూసి పారిపోయే క్షుద్రమృగాల వలె పారిపోతున్నారు." (46 1/2)
ఏవముక్తః ప్రత్యువాచ వాసుదేవం ధనంజయః ॥ 47
నోదయాశ్వాన్ యతో భీష్మః విగాహైతద్ బలార్ణవమ్ ।
పాతయిష్యామి దుర్ధర్షం వృద్ధం కురుపితామహమ్ ॥ 48
వాసుదేవుడలా అనగానే అర్జునుడు ఇలా బదులు పలికాడు - "భీష్ముడున్న చోటికి గుర్రాలను నడుపు. సేనాసముద్రంలోనికి చొరబడే వృద్ధుడు, దుర్ధర్షుడైన కురుపితామహుని పడగొడతాను'. (47,48)
సంజయ ఉవాచ
తతోఽశ్వాన్ రజతప్రఖ్యాన్ నోదయామాస మాధవః ।
యతో భీష్మరథో రాజన్ దుష్ప్రేక్ష్యో రశ్మిమానివ ॥ 49
సంజయుడిలా చెప్తున్నాడు.
'రాజా! అప్పుడు శ్రీ కృష్ణుడు వెండిలా తెల్లగా ఉన్న అర్జునుని గుర్రాలను భీష్ముని రథం దగ్గరకు నడిపించాడు. భీష్ముని రథం సూర్యునివలె చూడటానికి కూడా వీలుకాకుంది. (49)
తతస్తద్ పునరావృత్తం యుధిష్ఠిరబలం మహత్ ।
దృష్ట్వా పార్థం మహాబాహుం భీష్మాయోద్యతమాహవే ॥ 50
ఆ పై మహాబాహు వయిన అర్జునుడు రణరంగంలో భీష్మునిపై దాడిచేయటం చూసి, యుధిష్ఠిరుని ఆ మహాసేన మరలా వెనుకకు వచ్చింది. (50)
తతో భీష్మః కురుశ్రేష్ఠ సింహవద్ వినదన్ ముహుః ।
ధనంజయరథం శీఘ్రం శరవర్షైరవాకిరత్ ॥ 51
కురుశ్రేష్ఠా! ఆ తరువాత భీష్ముడు మాటిమాటికి సింహంలా గర్జిస్తూ, వెంటనే అర్జునుని రథంపై బాణవృష్టిని కురిపించాడు. (51)
క్షణేన స రథస్తస్య సహయః సహసారథిః ।
శరవర్షేణ మహతా సంఛన్నో న ప్రకాశతే ॥ 52
క్షణకాలంలోనే మహాశరవర్షం కప్పివేసింది అర్జునుని రథం కానీ, గుర్రాలు కానీ, సారథి కానీ కనిపించలేదు. (52)
వాసుదేవస్త్వసంభ్రాంతః ధైర్యమాస్థాయ సత్త్వవాన్ ।
చోదయామాస తానశ్వాన్ విచితాన్ భీష్మసాయకైః ॥ 53
కానీ సత్త్వసంపన్నుడైన శ్రీకృష్ణుడు కంగారు పడకుండా ధైర్యం తెచ్చుకొని, భీష్మబాణాలు శరీరమంతటా తగిలి ఉన్న ఆ గుర్రాలను తోలసాగాడు. (53)
తతః పార్థో ధనుర్గృహ్య దివ్యం జలదనిఃస్వనమ్ ।
పాతయామాస భీష్మస్య ధనుశ్ఛిత్త్వా త్రిభిః శరైః ॥ 54
ఆ తరువాత అర్జునుడు మేఘంలా నినదించే దివ్య ధనుస్సును చేతబట్టి, మూడు బాణాలతో భీష్ముని వింటిని విరిచి పడగొట్టాడు. (54)
స చ్ఛిన్నధన్వా కౌరవ్యః పునరన్యన్మహద్ ధనుః ।
నిమిషాంతరమాత్రేణ సజ్యం చక్రే పితా తవ ॥ 55
విల్లు విరిగిపోగానే నీ పెదనాన్న, కురునందనుడు అయిన భీష్ముడు నిమేషకాలంలోనే మరో మేటివింటిని తీసికొని, ఎక్కుపెట్టాడు. (55)
విచకర్ష తతో దోర్భ్యాం ధనుర్జలదనిఃస్వనమ్ ।
అథాస్య తదపి క్రుద్ధః చిచ్ఛేద ధనురర్జునః ॥ 56
భీష్ముడు వెంటనే మేఘంలా ధ్వనించే ఆ ధనుస్సును రెండు చేతులతో లాగాడు. అర్జునుడు కోపంతో ఆ వింటిని కూడా ఖండించాడు. (56)
తస్య తత్ పూజయామాస లాఘవం శాంతనోః సుతః ।
సాధు పార్థ మహాబాహో సాధు భోః పాండునందన ॥ 57
త్వయ్యేవైతద్ యుక్తరూపం మహత్ కర్మ ధనంజయ ।
ప్రీతోఽస్మి సుభృశం పుత్ర కురు యుద్ధం మయా సహ ॥ 58
అర్జునుడు ప్రదర్శించిన హస్తలాఘవాన్ని అభినందిస్తూ భీష్ముడు ఇలా అన్నాడు "పాండునందనా! మహాబాహూ! అర్జునా! భళా! ధనంజయా! ఈ ఘనకార్యం నీకే తగినది. చాలా ఆనందించాను. కుమారా! నాతో యుద్ధం చేయి". (57,58)
ఇతి పార్థం ప్రశస్యాథ ప్రగహ్యాన్యన్మహద్ ధనుః ।
ముమోచ సమరే వీరః శరాన్ పార్థరథం ప్రతి ॥ 59
రణంలో అలా అర్జునుని ప్రశంసించి, మరలా మరొక గొప్పధనుస్సును తీసికొని, ఆ వీరుడు అర్జునుని రథంపైకి బాణాలు విడిచాడు. (59)
అదర్శయద్ వాసుదేవః హయయానే పరం బలమ్ ।
మోఘాన్ కుర్వన్ శరాన్ తస్య మండలాన్యాచరన్ లఘు ॥ 60
శ్రీకృష్ణుడు గుర్రాలను నడపటంలో తనకున్న శక్తిని ప్రదర్శించాడు. భీష్ముని బాణాలను వ్యర్థం చేస్తూ, వెంటనే మండలాకారంలో రథాన్ని నడపసాగాడు. (60)
తథా భీష్మస్తు సుదృఢం వాసుదేవధనంజయౌ ।
వివ్యాధ నిశితైర్బాణైః సర్వగాత్రేషు భారత ॥ 61
భారతా! ఆ స్థితిలో కూడా భీష్ముడు కృష్ణార్జునుల శరీరాలపై పదునైన బాణాలతో గట్టిగా గాయాలు చేశాడు. (61)
శుశుభాతే నరవ్యాఘ్రౌ తౌ భీష్మశరవిక్షతౌ ।
గోవృషావివ సంరబ్ధౌ విషాణైర్లిఖితాంకితౌ ॥ 62
భీష్ముని బాణాలచే గాయబడిన ఆ కృష్ణార్జునులు కోపంతో, గాయాలతో ఉన్న రెండు ఆబోతుల వలె శోభిస్తున్నారు. (62)
పునశ్చాపి సుసంరబ్ధః శరైః శతసహస్రశః ।
కృష్ణయోర్యుధి సంరబ్ధః భీష్మోఽథావారయద్ దిశః ॥ 63
మరల తీవ్రంగా కోపించిన భీష్ముడు వందల, వేల బాణాలతో యుద్ధభూమిలో కృష్ణార్జునులను అన్నివైపులా నిరోధించాడు. (63)
వార్ ష్ణేయం చ శరైస్తీక్ ష్ణైః కంపయామాస రోషితః ।
ముహురభ్యర్దయన్ భీష్మః ప్రహస్య స్వనవత్ తదా ॥ 64
అంతేకాక భీష్ముడు కోపంతో పెద్దగా నవ్వుతూ తీక్ష్ణబాణాలతో మాటిమాటికి బాధిస్తూ శ్రీకృష్ణుని కంపింపజేశాడు. (64)
తతస్తు కృష్ణః సమరే దృష్ట్వా భీష్మపరాక్రమమ్ ।
సంప్రేక్ష్య చ మహాబాహుః పార్థస్య మృదుయుద్ధతామ్ ॥ 65
భీష్మం చ శరవర్షాణి సృజంతమనిశం యుధి ।
ప్రతపంతమివాదిత్యం మధ్యమాసాద్య సేనయోః ॥ 66
వరాన్ వరాన్ వినిఘ్నంతం పాండుపుత్రస్య సైనికాన్ ।
యుగాంతమివ కుర్వాణం భీష్మం యౌధిష్ఠిరే బలే ॥ 67
ఆ తరువాత మహాబాహువయిన కృష్ణుడు రణరంగంలో భీష్ముని పరాక్రమాన్ని చూసి, అర్జునుడు మృదువుగా యుద్ధం చేయటాన్ని, భీష్ముడు నిరంతరంగా శరవృష్టినినొ కురిపించటాన్ని గమనించాడు. భీష్ముడు మండిపడుతున్న సూర్యునిలా ఉభయ సేనల మధ్య నిలిచి పాండవుల సేనలోని మేటి వీరుల నందరనూ చంపుతున్నాడు. యుధిష్ఠిరుని సేనలో ప్రళయాన్ని సృష్టిస్తున్నాడు భీష్ముడు. (65-67)
అమృష్యమాణో భగవాన్ కేశవః పరవీరహా ।
అచింతయదమేయాత్మా నాస్తి యౌధిష్ఠిరం బలమ్ ॥ 68
ఏకాహ్నా హి రణే భీష్మః నాశయేద్ దేవదానవాన్ ।
కిం ను పాండుసుతాన్ యుద్ధే సబలాన్ సపదానుగాన్ ॥ 69
అది చూసి పరవీరహంత, అమేయబలుడు ఐన శ్రీకృష్ణభగవానుడు దానిని సహించలేక ఇలా ఆలోచించాడు. "యుధిష్ఠిర బలం పూర్తిగా నశించిపోతోంది. భీష్ముడు ఒక్కరోజులోనే దేవదానవుల నందరనూ నశింపజేయగలడు. ఇక ఈ పాండవులను సేనానుచరసహితంగా నశింప జేయటమెంత పని? (68,69)
ద్రవతే చ మహాసైన్యం పాండవస్య మహాత్మనః ।
ఏతే చ కౌరవాస్తూర్ణం ప్రభగ్నాన్ వీక్ష్య సోమకాన్ ॥ 70
ప్రాద్రవంతి రణే దృష్ట్వా హర్షయంతః పితామహమ్ ।
సోహం భీష్మం నిహన్మ్యద్య పాండవార్థాయ దంశితః ॥ 71
మహాత్ముడైన యుధిష్ఠిరునిసేన పారిపోతోంది. రణంలో భంగపడి వెంటనే పారిపోతున్న సోమకులను చూసి, కౌరవులు భీష్మునికి ఆనందాన్ని కల్గించటానికై వెంటబడి తరుముతున్నారు. పాండవుల కోసం కవచాన్ని ధరించి, నేను నేడు భీష్ముని సంహరిస్తాను. (70,71)
భారమేతం వినేష్యామి పాండవానాం మహాత్మనామ్ ।
అర్జునో హి శరైస్తీక్ష్ణైః వధ్యమానోఽపి సంయుగే ॥ 72
కర్తవ్యం నాభిజానాతి రణే భీష్మస్య గౌరవాత్ ।
మహాత్ములైన పాండవులపై బడిన ఈ భారాన్ని తొలగిస్తాను. అర్జునుడు రణంలో తీక్ష్ణబాణాలతో దెబ్బలు తింటూ కూడా భీష్ముని మీది గౌరవంతో రణకర్తవ్యాన్ని తెలియలేకున్నాడు" (72 1/2)
తథా చింతయతస్తస్య భూయ ఏవ పితామహః ।
ప్రేషయామాస సంక్రుద్ధః శరాన్ పార్థరథం ప్రతి ॥ 73
శ్రీకృష్ణుడా రీతిగా ఆలోచిస్తుండగానే భీష్ముడు మరల కోపంతో అర్జునరథం మీదికి బాణాలను ప్రయోగించాడు. (73)
తేషాం బహూత్వాత్ తు భృశం శరాణాం
దిశశ్చ సర్వాః పిహితా బభూవుః ।
న చాంతరిక్షం న దిశో న భూమిః
న భాస్కరోఽదృశ్యత రశ్మిమాలీ ।
వవుశ్చ వాతాస్తుములాః సధూమాః
దిశశ్చ సర్వాః క్షుభితా బభూవుః ॥
ఆ బాణాలు ఎక్కువ కావటం వల్ల దిక్కులన్నీ కప్పిపుచ్చబడ్డాయి. అంతరిక్షం కానీ, దిక్కులు కానీ, భూమి కానీ కిరణమాలి అయిన సూర్యుడు కానీ కనపించలేదు. దుమ్ముతో కలిసి పెనుగాలలు వీచాయి. దిక్కులన్నీ క్షోభిస్తున్నాయి.(74)
ద్రోణో వికర్ణఽథ జయద్రథశ్చ
భూరిశ్రవాః కృతవర్మా కృపశ్చ ।
శ్రుతాయురంబష్ఠపతిశ్చ రాజా
విందానువిందౌ చ సుదక్షిణశ్చ ॥ 75
ప్రాచ్యాశ్చ సౌవీరగణాశ్చ సర్వే
వసాతయః క్షుద్రకమాలవాశ్చ ।
కిరీటినం త్వరమాణాఽభిసస్రుః
నిర్దేశగాః శాంతనవస్య రాజ్ఞః ॥ 76
ద్రోణుడు, వికర్ణుడు, జయద్రథుడు, భూరిశ్రవుడు, కృతవర్మ, కృపుడు, శ్రుతాయువు, అంబష్ఠపతి, విందాను విందులు, సుదక్షిణుడు, ప్రాచ్యరాజులు, సౌవీర గణాలు, వసాతులు, క్షుద్రకులు, మాలవులు - వీరంతా భీష్ముని అదేశం మేరకు వేగంగా అర్జునునిపై దాడికి ఉపక్రమించారు. (75,76)
తం వాజిపాదాతరథౌఘజాలైః
అనేకసాహస్రశతై ర్దదర్శ ।
కిరీటినం సంపరివార్యమాణం
శినేర్నప్తా వారణయూథపైశ్చ ॥ 77
గుర్రాలు, పదాతిదళాలు, రథసమూహాలు, గజసేనా పతులు లక్షల కొలదిగ అర్జునుని చుట్టుముట్టటాన్ని సాత్యకి చూశాడు. (77)
తతస్తు దృష్ట్వార్జునవాసుదేవౌ
పదాతినాగాశ్వరథైః సమంతాత్ ।
అభిద్రుతౌ శస్త్రభృతాం వరిష్ఠౌ
శినిప్రవీరోఽభిససార తూర్ణమ్ ॥ 78
ఆ తరువాత పదాతులచే, ఏనుగులచే, గుర్రాలచే, రథాలచే అన్ని దిక్కుల నుండి దాడికి గురవుతున్న పెద్దలు, శ్రేష్ఠయోధులు అయిన కృష్ణార్జునులను చూసి, శినివంశవీరుడైన సాత్యకి వెంటనే అక్కడకు చేరాడు. (78)
స తాన్యనీకాని మహాధనుష్మాన్
శినిప్రవీరః సహసాభిపత్య ।
చకార సాహాయ్యమథార్జునస్య
విష్ణుర్యథా వృత్రనిషాదనస్య ॥ 79
మేటివిలుకాడైన సాత్యకి ఆ సేనలను చూసి, వెంటనే అక్కడకు వచ్చి, విష్ణువు దేవేంద్రునకు సాయపడినట్టు అర్జునునికి సహాయం చేశాడు. (79)
విశీర్ణనాగాశ్వరథధ్వజౌఘం
భీష్మేణ విత్రాసితసర్వయోధమ్ ।
యుధిష్ఠిరానీకమభిద్రవంతం
ప్రోవాచ సందృశ్య శినిప్రవీరః ॥ 80
యుధిష్ఠిర సేనలోని ఏనుగులు, గుర్రాలు, రథాలు, ధ్వజాలు చెదరొపోతున్నాయి. భీష్ముడు సమస్తయోధులను భయపెట్టాడు. ఆ స్థితిలో పారిపోతున్న యుధిష్ఠిర సేనను చూసి, సాత్యకి ఇలా అన్నాడు. (80)
క్వ క్షత్రియా యాస్యథ నైష ధర్మః
సతాం పురస్తాత్ కథితః పురాణైః ।
మా స్వాం ప్రతిజ్ఞాం త్యజత ప్రవీరాః
స్వ వీరధర్మం పరిపాలయధ్వమ్ ॥ 81
"క్షత్రియులారా! ఎక్కడకు పోతున్నారు? ప్రాచీన పురాణ పురుషులు చెప్పిన సజ్జన ధర్మమిది కాదు. వీరులారా! మీ ప్రతిజ్ఞలను మరువకండి. మీ వీరధర్మాన్ని పాటించండి." (81)
తాన్ వాసవానంతరజో నిశామ్య
నరేంద్రముఖ్యాన్ ద్రవతః సమంతాత్ ।
పార్థస్య దృష్ట్వా మృదుయుద్ధతాం చ
భీష్మం చ సంఖ్యే సముదీర్యమాణమ్ ॥ 82
అమృష్యమాణః స తతో మహాత్మా
యశస్వినం సర్వదశార్హభర్తా ।
ఉవాచ శైనేయమభిప్రశంసన్
దృష్ట్వా కురూనాపతతః సమగ్రాన్ ॥ 83
శ్రీకృష్ణుడు ఆ మాటలు విని, అన్ని వైపులా పారిపోతున్న రాజముఖ్యులను చూసి, అర్జునుడు కోమలంగా యుద్ధం చేయటమూ, భీష్ముడు చెలరేగి పోవటమూ గ్రహించాడు. ఆపై యదుకుల పాలకుడు, మహాత్ముడు అయిన శ్రీకృష్ణుడు ఆ స్థితిని సహించలేక, కౌరవులు అంతటా మీద పడటాన్ని చూసి, సాహ్యకిని ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. (82,83)
యే యాంతి తే యాంతు శినిప్రవీర
యేఽపి స్థితాః సాత్వత తేఽపి యాంతు ।
భీష్మం రథాత్ పశ్య నిపాత్యమానం
ద్రోణం చ సంఖ్యే సగణం మయాద్య ॥ 84
"సాత్యకీ! వెళ్ళే వాళ్ళను వెళ్ళనీ! సాత్వతా! ఉన్న వాళ్ళను కూడా వెళ్ళిపోనీ! నేడు నేనే రణభుమిలో అనుచరగణాలతో పాటు భీష్ముని, ద్రోణుని రథాల నుండి పడగొడతాను, చూడు. (84)
న మే రథీ సాత్వత కౌరవాణాం
క్రుద్ధస్య ముచ్యేత రణేఽద్య కశ్చిత్ ।
తస్మాదహం గృహ్య రథాంగముగ్రం
ప్రాణం హరిష్యామి మహావ్రతస్య ॥ 85
సాత్వతా! కౌరవసేనలోని ఏ రథికుడు కూడా కోపంతో నున్న నా నుండి తప్పించుకోలేడు. కాబట్టి నేను నా భీకరచక్రాన్ని చేతబట్టి, మహావ్రతుడైన భీష్ముని ప్రాణాలు హరిస్తాను. (85)
నిహత్య భీష్మం సగణం తథాఽఽజౌ
ద్రోణం చ శైనేయ రథప్రవీరౌ ।
ప్రీతిం కరిష్యామి ధనంజయస్య
రాజ్ఞశ్చ భీమస్య తథాశ్వినోశ్చ ॥ 86
సాత్యకీ! యుద్ధంలో సహచరగణాలతో పాటు మహారథులైన భీష్మునీ, ద్రోణుని చంపి అర్జునునకు యుధిష్ఠిరునకు, భీమునకు, నకులసహదేవులకు ప్రీతిని కలిగిస్తాను. (86)
నిహత్య సర్వాన్ ధృతరాష్ట్రపుత్రాన్
తత్పక్షిణో యే చ నరేంద్రముఖ్యాః ।
రాజ్యేన రాజానమజాతశత్రుం
సంపాదయిష్యామ్యహమద్య హృష్టః ॥ 87
ధృతరాష్ట్ర కుమారులను, ఆయన పక్షంలో నున్న ఇతర రాజముఖ్యులను అందరినీ చంపి, నేడు నేనే ఆనందంగా అజాతశత్రువైన ధర్మరాజుకు రాజ్యాన్ని సంపాదించిపెడతాను." (87)
సంజయ ఉవాచ
(ఇతీదముక్త్వా స మహానుభావః
సస్మార చక్రం నిశితం పురాణమ్ ।
సుదర్శనం చింతితమాత్రమేవ
తస్యాగ్రహస్తం స్వయమారురోహ) ॥
సంజయుడిలా అన్నాడు. "అలా పలికి ఆ మహానుభావుడు ప్రాచీనమైన తన తీక్ష్ణసుదర్శన చక్రాన్ని స్మరించాడు. స్మరణ మాత్రంతోనే అది స్వయంగా కృష్ణుని చేతి చివర నిలిచింది.
తతః సునాభం వసుదేవపుత్రః
సూర్యప్రభం వజ్రసమప్రభావమ్ ।
క్షురాంతముద్యమ్య భుజేన చక్రం
రథాదవప్లుత్య విసృజ్య వాహాన్ ॥ 88
సంకంపయన్ గాం చరణైర్మహాత్మా
వేగేన కృష్ణః ప్రససార భీష్మమ్ ।
మదాంధమాజౌ సముదీర్ణదర్పం
సింహో జిఘాంసన్నివ వారణేంద్రమ్ ॥ 89
అటుపై వసుదేవసుతుడు, మహాత్ముడు అయిన కృష్ణుడు గుర్రపు పగ్గాలను వదిలి చక్రాన్ని చేబట్టాడు. ఆ చక్రం - అందమైన నాభితో, సూర్యకాంతితో, వజ్రంతో సమానమైన ప్రభావంతో, పదునైన అంచులతో ప్రకాశిస్తోంది. దానిని చేబట్టి, రథంపై నుండి క్రిందకు దూకి, భూమిని కంపింపజేస్తూ, మదించి పొగరెక్కుతున్న ఏనుగును చంపే సింహంలా రణభూమిలో శ్రీకృష్ణుడు వేగంగా భీష్ముని వైపు నడిచాడు. (88,89)
సోఽభిద్రవన్ భీష్మమనీకమధ్యే
క్రుద్ధో మహేంద్రావరజః ప్రమాథీ ।
వ్యాలంబిపీతాంతపటశ్చకాశే
ఘనో యథా ఖే తడితావనద్ధః ॥ 90
దేవేంద్ర సోదరుడైన శ్రీకృష్ణుడు శత్రువులను మథించగలవాడు. ఆయన క్రుద్ధుడై సేనామధ్యంలో భీష్మునిపైకి లంఘించాడు. అప్పుడు వ్రేలాడుతున్న పీతాంబరపు అంచుతో ఆకాశంలో మెరుపుతో కూడియున్న మేఘంలా శోభించాడు కృష్ణుడు. (90)
సుదర్శనం చాస్య రరాజ శౌరేః
తచ్చక్రపద్మం సుభుజోరునాలమ్ ।
యథాదిపద్మం తరుణార్కవర్ణం
రరాజ నారాయణనాభిజాతమ్ ॥ 91
శ్రీకృష్ణుని భుజాలనే గొప్పనాళంతో సుదర్శన చక్రమనే పద్మం, నారాయణుని నాభి నుండి పుట్టి ప్రాతః కాల సూర్యుని వలె ప్రకాశిస్తున్న ఆదికమలం వలె ప్రకాశించింది. (91)
తత్ కృష్ణకోపోదయసూర్యబుద్ధం
క్షురాంతతీక్ ష్ణా గ్రసుజాతపత్రమ్ ।
తస్యైవ దేహోరుసరః ప్రరూఢం
రరాజ నారాయణబాహునాలమ్ ॥ 92
ఆ పద్మం శ్రీకృష్ణక్రోధోదయ మనే సూర్యుని వలన వికసించింది. చురకత్తిలా తీక్ష్ణంగా ఉన్న దాని అంచులే పద్మదళాలు. ఆయన శరీర మనే సరస్సు నుండి అది పుట్టింది. నారాయణుని బాహువే దాని నాళం. (92)
తమాత్తచక్రం ప్రణదంతముచ్చైః
క్రుద్ధం మహేంద్రావరజం సమీక్ష్య ।
సర్వాణి భూతాని భృశం వినేదుః
క్షయం కురూణామివ చింతయిత్వా ॥ 93
చక్రాన్ని ధరించి, కోపంతో పెడబొబ్బలు పెడుతున్న శ్రీకృష్ణుని చూసి, "ఇక కౌరవుల నాశనం తప్ప"దని భావించి సమస్త ప్రాణులు హాహాకారాలు చేయసాగాయి. (93)
స వాసుదేవః ప్రగృహీతచక్రః
సంవర్తయిష్యన్నివ సర్వలోకమ్ ।
అభ్యుత్పతల్లోకగురుర్బభాసే
భూతాని ధక్ష్యన్నివ ధూమకేతుః ॥ 94
సర్వలోకాన్ని సంహరించటానికిఉద్యుక్తుడైనట్టుగా చక్రాన్ని చేతబట్టిన ఆ వాసుదేవుడు - ఆ జగద్గురువు సర్వభూతాలను దహించి వేయటానికి ఎగసిపడుతున్న ప్రళయాగ్నివలె భాసించాడు. (94)
తమాద్రవంతం ప్రగృహీతచక్రం
దృష్ట్వా దేవం శాంతనవస్తదానీమ్ ।
అసంభ్రమం తద్ విచకర్ష దోర్భ్యాం
మహాధనుర్గాండివతుల్య ఘోషమ్ ॥ 95
అప్పుడు చక్రాన్ని చేతబట్టి మీదకు వస్తున్న కృష్ణుని చూసి, భీష్ముడు తడబాటు లేకుండా గాండీవంతో సమానంగా నినదించే మేటివింటిని రెండు చేతులతో వికర్షించాడు. (95)
వి॥ ఇక్కడ 'విచకర్ష' అన్నదానికి 'ఎక్కుపెట్టి లాగాడు' అనే అర్థాన్ని కూడా కొందరు చెప్తున్నారు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అనవలసివస్తుంది. అయితే వెంటనే శరణాగతిని సూచిస్తూ పలుకుతున్నాడు భీష్ముడు.
ఉవాచ భీష్మస్తమనంతపౌరుషం
గోవిందమాజావవిమూఢచేతాః ।
ఏహ్యేహి దేవేశ జగన్నివాస
నమోఽస్తు తే మాధవ చక్రపాణే ॥ 96
ప్రసహ్య మాం పాతయ లోకనాథ
రథోత్తమాత్ సర్వశరణ్య సంఖ్యే ॥ 97
అప్పుడు రణభూమిలో మోహరహితమైన మనస్సుతో అనంతపౌరుషంగల గోవిందునితో ఇలా అన్నాడు. "దేవేశా! రా! జగన్నివాసా! మాధవా! చక్రపాణీ! నీకు నమస్కారం. లోకనాథా! సర్వశరణ్య! యుద్ధంలో బలాన్ని ప్రదర్శించి రథం నుండి నన్ను పడగొట్టు. (96,97)
త్వయా హతస్యాపి మమాద్య కృష్ణ
శ్రేయః పరస్మిన్నిహ చైవ లోకే ।
సంభావితోఽస్మ్యంధకవృష్ణినాథ
లోకైస్త్రిభిర్వీర తవాభియానాత్ ॥ 98
కృష్ణా! నీచేత మరణించినా నాకు ఇహపరాలలో శ్రేయస్సే కలుగుతుంది. అంధక వృష్ణి నాథా! వీరా! నీవు నన్ను ఆక్రమించటంతో మూడు లోకాలలోనూ నాగౌరవం పెరిగింది". (98)
రథాదవప్లుత్య తతస్త్వరావాన్
పార్థోఽప్యనుద్రుత్య యదుప్రవీరమ్ ।
జగ్రాహ పీనోత్తమలంబబాహుం
బాహ్వోర్హరిం వ్యాయతపీనబాహుః ॥ 99
ఆ పై అర్జునుడు వేగంగా రథం మీద నుండి దూకి, యదువీరుడైన కృష్ణుని రెండు చేతులూ పట్టుకొన్నాడు. కృష్ణార్జునులు ఇరువురూ బలిసిన పొడవైన బాహువులు కలవారే. (99)
నిగృహ్యమాణశ్చ తదాదిఽఽదేవః
భృశం సరోషః కిల చాత్మయోగీ ।
ఆదాయ వేగేన జగామ విష్ణుః
జిష్ణుం మహావాత ఇవైకవృక్షమ్ ॥ 100
ఆదిదేవుడు, ఆత్మయోగి అయిన శ్రీకృష్ణుడు కోపంతో ఉన్నాడు. అర్జునుడు ఆపుతున్నా ఆగటంలేదు. పెనుగాలి చెట్టును లాగుకొని పోయినట్లు కృష్ణుడు అర్జునుని లాగివేస్తున్నాడు. (100)
పార్థస్తు విష్టభ్య బలేన పాదౌ
భీష్మాంతికం తూర్ణమభిద్రవంతమ్ ।
బలాన్నిజగ్రాహ హరిం కిరీటీ
పదేఽథ రాజన్ దశమే కథంచిత్ ॥ 101
ఆపై అర్జునుడు పదవ అడుగులో చాలా కష్టం మీద పాదాలు నిలద్రొక్కుకొని, వేగంగా భీష్ముని మీదకుదూకుతున్న హరిని బలమంతా ఉపయోగించి, పట్టుకొనగలిగాడు. (101)
అవస్థితం చ ప్రణిపత్య కృష్ణం
ప్రీతోఽర్జునః కాంచనచిత్రమాలీ ।
ఉవాచ కోపం ప్రతిసంహరేతి
గతిర్భవాన్ కేశవ పాండవానామ్ ॥ 102
కృష్ణుడు నిలిచిన తర్వాత కాంచనచిత్ర మాలలు ధరించిన అర్జునుడు ఆనందించి, ఆయనకు నమస్కరించి, ఇలా అన్నాడు - "కోపాన్ని ఉపసంహరించుకో! కేశవా! పాండవులకు నీవే దిక్కు. (102)
న హాస్యతే కర్మ యథాప్రతిజ్ఞం
పుత్రైః శపే కేశవ సోదరైశ్చ ।
అంతం కరిష్యామి యథా కురూణాం
త్వయాహమింద్రానుజ సంప్రయుక్తః ॥ 103
నా కుమారుల మీదా, నా సోదరుల మీద ఒట్టుపెట్టి చెపుతున్నాను. ప్రతిజ్ఞ ననుసరించి కర్తవ్యాన్ని నిర్వహిస్తా. దానిని వీడను. ఉపేంద్రా! నీవు ఆదేశిస్తే కౌరవుల నందరనూ సంహరిస్తా". (103)
తతః ప్రతిజ్ఞాం సమయం చ తస్య
జనార్దనః ప్రీతమనా నిశమ్య ।
స్థితః ప్రియే కౌరవసత్తమస్య
రథం సచక్రః పునరారురోహ ॥ 104
ఆ తరువాత జనార్దనుడు అర్జునుని ప్రతిజ్ఞను, నిశ్చయాన్ని విని ఆనందించి, కురువంశ శ్రేష్ఠుడైన అర్జునునకు నచ్చినది చేయగోరి, మరల చక్రంతో పాటు రథాన్ని ఎక్కాడు. (104)
స తానభీషూన్ పునరాదదానః
ప్రగృహ్య శంఖం ద్విషతాం నిహంతా ।
నినాదయామాస తతో దిశశ్చ
స పాంచజన్యస్య రవేణ శౌరిః ॥ 105
శత్రుసంహారకుడైన కృష్ణుడు మరల గుర్రాల పగ్గాలు పట్టి, శంఖాన్ని పూరించి, ఆ పాంచజన్య శంఖ ధ్వనితో దిక్కులను మారుమ్రోగించాడు. (105)
వ్యావిద్ధనిష్కాంగదకుండలం తం
రజోవికీర్ణాంచితపద్మనేత్రమ్ ।
విశుద్ధదంష్ట్రం ప్రగృహీతశంఖం
విచుక్రుశుః ప్రేక్ష్య కురుప్రవీరాః ॥ 106
శ్రీకృష్ణుని కంఠహారం, భుజకీర్తులు, కుండలాలు కదులుతున్నాయి. పద్మాలవంటి ఆయన కన్నులు ధూళి కప్పిఉన్నాయి. నిర్మలమైన దంతాలు. చేతిలో శంఖం. ఆ స్థితిలో కృష్ణుని చూసి, కౌరవులలో కోలాహలం చెలరేగింది. (106)
మృదంగభేరీపణవప్రణాదాః
నేమిస్వనా దుందుభినిఃస్వనాశ్చ ।
నసింహనాదాశ్చ బభూవురుగ్రాః
సర్వేష్వనీకేషు తతః కురూణామ్ ॥ 107
ఆ తరువాత కౌరవసేనలన్నింటిలో మృదంగాలు, భేరులు, పణవాలు, దుందుభులు మ్రోగుతున్నాయి. రథపుటిరుసుల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. అవన్నీ సైనికుల సింహనాదాలతో కలిసి రౌద్రంగా కనిపిస్తున్నాయి. (107)
గాండీవ ఘోషః స్తనయిత్నుకల్పః
జగామ పార్థస్య నభొ దిశశ్చ ।
జగ్ముశ్చ బాణా విమలాః ప్రసన్నాః
సర్వా దిశః పాండవచాపముక్తాః ॥ 108
మేఘధ్వని వంటి అర్జున గాండీవ ఘోష ఆకాశాన్ని, దిక్కులనూ తాకింది. అర్జునుని వింటి నుండి వెలువడిన ప్రసన్న నిర్మల బాణాలు అన్ని దిక్కులవైపు పడుతున్నాయి. (108)
తం కౌరవాణామధిపో జవేన
భీష్మేణ భూరిశ్రవసా చ సార్థమ్ ।
అభ్యుద్యయావుద్యతబాణపాణిః
కక్షం దిధక్షన్నివ ధూమకేతుః ॥ 109
అప్పుడు దుర్యోధనుడు ధనుస్సు చేతబట్టి, భీష్మభూరి శ్రవసులతో కలిసి, అడవిని తగులబెట్టే అగ్ని పైకెగసినట్లు అర్జునుని మీదకు వేగంగా వచ్చాడు. (109)
అథార్జునాయ ప్రజిఘాయ భల్లాన్
భూరిశ్రవాః సప్త సువర్ణపుంఖాన్ ।
దుర్యోధనస్తోమరముగ్రవేగం
శల్యో గదాం శాంతనవశ్చ శక్తిమ్ ॥ 110
ఆ పై భూరిశ్రవుడు సువర్ణ పుంఖాలు గల ఏడు భల్లాలను అర్జునుని పైకి వేశాడు. దుర్యోధనుడు తీవ్రవేగంతో తోమరాన్ని, శల్యుడు గదను, భీష్ముడు శక్తిని ప్రయోగించారు. (110)
స సప్తభిః సప్త శరప్రవేకాన్
సంవార్య భూరిశ్రవసా విసృష్టాన్ ।
శితేన దుర్యోధనబాహుముక్తం
క్షురేణ తత్ తోమరమున్మమాథ ॥ 111
భూరిశ్రవసుడు విసిరిన ఏడు భల్లాలను ఏడు బాణాలతో నివారించి, అర్జునుడు దుర్యోధనుడు విసిరిన తోమరాన్ని పదునైన క్షురంతో నశింపజేశాడు. (111)
తతః శుభామాపతతీం స శక్తిం
విద్యుత్ప్రభాం శాంతనవేన ముక్తామ్ ।
గదాం చ మద్రాధిపబాహుముక్తాం
ద్వాభ్యాం శరాభ్యాం నిచకర్త వీరః ॥ 112
ఆ తరువాత విద్యుత్ప్రభలతో శోభిస్తూ, మీదకు వచ్చిన భీష్ముడు విసిరిన ఆ శక్తినీ, శల్యుడు విసిరిన గదను వీరుడైన అర్జునుడు రెండు బాణాలతో ఖండించాడు. (112)
తతో భుజాభ్యాం బలవద్ వికృష్య
చిత్రం ధనుర్గాండివమప్రమేయమ్ ।
మాహేంద్రమస్త్రం విధివత్ సుఘోరం
ప్రాదుశ్చకారాద్భుతమంతరిక్షే ॥ 113
ఆ తరువాత అర్జునుడు అమేయమైన గాండివ ధనుస్సును చేతులతో బలంగా లాగి, భయంకరమైన మాహేంద్రాస్త్రాన్ని విధి పూర్వకంగా ప్రయోగించాడు. అది ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించింది. (113)
తేనోత్తమాస్త్రేణ తతో మహాత్మా
సర్వాణ్యనీకాని మహాధనుష్మాన్ ।
శరౌఘజాలైర్విమలాగ్నివర్ణైః
నివారయామాస కిరీటమాలీ ॥ 114
ఆ పిమ్మట మహాత్ముడు, మేటి విలుకాడు అయిన అర్జునుడు ఆ ఉత్తమాస్త్రంతోనూ, నిర్మలమైన నిప్పులా భాసించే శరసమూహాలతోనూ కౌరవ సేనల నన్నింటినీ నివారించాడు. (114)
శిలీముఖాః పార్థధనుఃప్రముక్తాః
రథాన్ ధ్వజాగ్రాణి ధనూంషి బాహూన్ ।
నికృత్య దేహాన్ వివిశుః పరేషాం
నరేంద్రనాగేంద్రతురంగమాణామ్ ॥ 115
అర్జునుని వింటి నుండి వెలువడిన బాణాలు రథాలను, ధ్వజాల పైభాగాలను, ధనుస్సులను, చేతులను ఖండించి శత్రువుల సైనికులు, ఏనుగులు, గుర్రాల శరీరాలలో ప్రవేశించాయి. (115)
తతో దిశః సోఽనుదిశశ్చ పార్థః
శరైః సుధారైః సమరే వితత్య ।
గాండీవశబ్దేన మనాంసి తేషాం
కిరీటమాలీ వ్యథయాంచకార ॥ 116
ఆ తరువాత బాగా పదునెక్కిన బాణాలతో దిక్కులను, విదిక్కులను పూర్తిగా వ్యాపించి, కిరీటధారి అయిన అర్జునుడు గాండీవ ధనుష్టంకారంతో కౌరవుల మనస్సులను వ్యథపెట్టాడు. (116)
తస్మింస్తథా ఘోరతమే ప్రవృత్తే
శంఖస్వనా దుందుభినిఃస్వనాశ్చ ।
అంతర్హితా గాండివనిఃస్వనేన
బభూవురుగ్రాశ్వరథప్రణాదాః ॥ 117
ఆ రీతిగా పరమభీకరంగా అర్జునుడు ప్రవర్తిస్తుంటే శంఖధ్వానాలు, దుందుభిధ్వనులు, గుర్రాలు, రథాల భయంకర శబ్దాలు గాండీవ ధనుష్టంకారంతో వినిపించకుండా పోయాయి. (117)
గాండీవశబ్దం తమథో విదిత్వా
విరాటరాజప్రముఖాః ప్రవీరాః ।
పాంచాలరాజో ద్రుపదశ్చ వీరః
తం దేశమాజగ్మురదీనసత్త్వాః ॥ 118
ఆ పిమ్మట ఆ గాండీవశబ్దాన్ని విని, విరాటరాజు మొదలయిన గొప్ప వీరులు, వీరుడైన పాంచాలరాజు ద్రుపదుడు - దృఢచిత్తులయిన వీరంతా ఆ ప్రదేశానికి వచ్చారు. (118)
సర్వాణి సైన్యాని తు తావకాని
యతో యతో గాండివజః ప్రణాదః ।
తతస్తతః సన్నతిమేవ జగ్ను-
ర్న తం ప్రతీపోఽభిససార కశ్చిత్ ॥ 119
గాండివనాదం వినిపించినంతమేర నీ సేనలు అన్నీ తలవాల్చుతున్నాయి. అర్జునుని ఎదిరించే దృష్టితో ఒక్కడూ కదలలేదు. (119)
తస్మిన్ సుఘోరే నృపసంప్రహారే
హతాః ప్రవీరాః సరథాశ్వసూతాః ।
గజాశ్చ నారాచనిపాతతప్తాః
మహాపతాకాః శుభరుక్మకక్ష్యాః ॥ 120
పరీతసత్త్వాః సహసా నిపేతుః
కిరీటినా భిన్నతనుత్రకాయాః ।
దృఢం హతాః పత్రిభురుగ్రవేగైః
పార్ధేన భల్లైర్విమలైః శితాగ్రైః ॥ 121
రాజులు కొనసాగిస్తున్న ఆ భీకర సంగ్రామంలో రథాలు, గుర్రాలు, సారథులతో పాటు వీరులెందరో మరణించారు. అందమైన బంగారువన్నెగల మోకులతో కట్టబడి, పెద్ద పెద్ద పతాకలు గల ఏనుగులు బాణాల తాకిడికి శక్తి కోల్పోయి, వెంటనే నేలగూలాయి. కిరీటి భల్లాలతో గట్టిగా కొట్టగా కవచాలు, శరీరాలు చీలిపోయి, సైనికులు పడిపోయారు. ఆ భల్లాలు రెక్కలు గలవి. తీవ్రవేగం, పదునైన మొనలు గలిగి నిర్మలమైనవి. (120,121)
నికృత్తయంత్రా నిహతేంద్రకీలాః
ధ్వజా మహాంతో ధ్వజినీముఖేషు ।
పదాతిసంఘాశ్చ రథాశ్చ సంఖ్యే
హయాశ్చ నాగాశ్చ ధనంజయేన ॥ 122
బాణాహతాస్తూర్ణమపేతసత్త్వా
విష్టభ్య గాత్రాణి నిపేతురుర్వ్యామ్ ।
ఐంద్రేణ తేనాస్త్రవరేణ రాజన్
మహాహవే భిన్నతనుత్రదేహాః ॥ 123
అనిమొనలో యంత్రాలు తెగి, ఇంద్రకీలాలు నశించిన మహాపతాకాలు పడిపోతున్నాయి. అర్జునుని బాణాలచే గాయపడి పదాతులు, రథాలు, గుర్రాలు, ఏనుగులు శక్తిని కోల్పోయి, తమ శరీరాలయవాలను స్తంభింపజేసి నేలగూలుతున్నాయి. రాజా! ఆ ఐంద్రాస్త్రంతో సంగ్రామంలో సైనికుల కవచాలు, శరీరాలు భిన్నమై పోయాయి. (122,123)
తతః శరౌఘైర్నిశితైః కిరీటినా
నృదేహశస్త్రక్షతలోహితోదా ।
నదీ సుఘోరా నరమేదఫేనా
ప్రవర్తితా తత్ర రణాజిరే వై ॥ 124
ఆ తరువాత రణభూమిలో అర్జునుని వాడియైన బాణాల తాకిడిచే సైనికుల శరీరాలు గాయపడి, వాటి నుండి కారిన నెత్తుటితో భీకరమైన నది ప్రవహించింది. సైనికుల క్రొవ్వు ఆ నదిలో నురుగులా కనిపిస్తోంది. (124)
వేగేన సాతీవ పృథుప్రవాహా
పరేతనాగాశ్వశరీరరోధా ।
నరేంద్రమజ్జోచ్ఛ్రితమాంసపంకా
ప్రభూతరక్షో గణభూతసేవితా ॥ 125
ఆ నది వేగంగా, నిండుగా ప్రవహిస్తోంది. మరణించిన ఏనుగుల - గుర్రాలు శరీరాలు తీరాల వలె కనిపిస్తున్నాయి. రాజుల మజ్జ, మాంసం ఆ నదిలో బురద. పెద్దపెద్ద రాక్షసగణాలు, భూతగణాలు దానిని సేవిస్తున్నాయి. (125)
శిరః కపాలాకులకేశశాద్వలా
శరీరసంఘాతసహస్రవాహినీ ।
విశీర్ణనానాకవచోర్మిసంకులా
నరాశ్వనాగాస్థినికృత్తశర్కరా ॥ 126
శవాల శిరః కపాల కేశాలు నాచులా కనిపిస్తున్నాయి. కొట్టుకొనిపోతున్న శరీరాలు జలజంతువుల్లా ఉన్నాయి. ఛిన్నాభిన్నమైన వివిధ కవచాలు అలల వలె కదులుతున్నాయి. సైనికులు, గుర్రాళు, ఏనుగుల ఎముకల ముక్కలు కంకర రాళ్ళవలె కనిపిస్తున్నాయి. (126)
శ్వకంకశాలావృకగృధ్రకాకైః
క్రవ్యాదసంఘైశ్చ తరక్షుభిశ్చ ।
ఉపేతకూలాం దదృశుర్మనుష్యాః
క్రూరాం మహావైతరణీప్రకాశామ్ ॥ 127
కుక్కలు, డేగలు, తోడేళ్ళు, గ్రద్దలు, కాకులు, సివంగులు. ఇతర క్రూరజంతువులు నదికి రెండువైపులా తటాలపై తిరుగుతున్నాయి. ఆ భయానక నదిని మనుష్యులు మహావైతరణిలా భావించారు. (127)
ప్రవర్తితామర్జునబాణసంఘైః
మేదోవసాసృక్ ప్రవహాం సుభీమామ్ ।
హతప్రవీరాం చ తథైవ దృష్ట్వా
సేనాం కురూణామథ ఫాల్గునేన ॥ 128
తే చేదిపాంచాలకరూషమత్స్యాః
పార్థాశ్చ సర్వే సహితాః ప్రణేదుః ।
జయప్రగల్భాః పురుషప్రవీరాః
సంత్రాసయంతః కురువీరయోధాన్ ॥ 129
అర్జునుని బాణసమూహాలచే ఆ నది ప్రవర్తించి, క్రొవ్వు, మజ్జ, రక్తాలతో భీకరంగా ప్రవహిస్తోంది. అర్జునుడు కౌరవసేనలోని వీరుల నెందరినో చంపివేశాడు. అది గమనించి చేది, పాంచాల, కరూష, మత్స్య దేశాల క్షత్రియులు, అర్జునుని సోదరులు - ఈ మహావీరులంతా జయప్రగల్భాలు పలుకుతూ, కురువీర యోధులను భయపెడుతూ, సింహనాదాలు చేశారు. (128,129)
హతప్రవీరాణి బలాని దృష్ట్వా
కిరీటినా శత్రుభయావహేన ।
విత్రాస్య సేనాం ధ్వజినీపతీనాం
సింహో మృగాణామివ యూథసంఘాన్ ॥ 130
నినేదతుస్తావతిహర్షయుక్తౌ
గాండీవధన్వా చ జనార్దనశ్చ ।
శత్రుభీకరుడైన అర్జునుడు కౌరవవీరుల బలాలను హతమార్చటం పాండవ వీరులకు ఉల్లాసహేతువయింది. మృగసమూహాలను భయపట్టే సింహంలా కృష్ణార్జునులు కౌరవసేనాపతులను భయానికి గురి చేసి పరమానందంతో గర్జించారు. (130 1/2)
తతో రవిం సంవృతరశ్మిజాలం
దృష్ట్వా భృశం శస్త్రపరిక్షతాంగాః ॥ 131
తదైంద్రమస్త్రం వితతం చ ఘోరమ్
అసహ్యముద్వీక్ష్య యుగాంతకల్పమ్ ।
అథాపయానం కురవః సభీష్మాః
సద్రోణదుర్యోధనబాహ్లికాశ్చ ॥ 132
చక్రుర్నిశాం సంధిగతాం సమీక్ష్య
విభావసోర్లోహితరాగయుక్తామ్ ।
ఆ తరువాత శస్త్రాల దెబ్బలచే శరీరాలు తీవ్రంగా గాయపడగా భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, బాహ్లీకుడు ఇతర కౌరవయోధులు సూర్యుడు తన కిరణజలాన్ని ఉపసంహరించటం, ఐంద్రాస్త్రం ప్రళయాగ్నివలె అసహ్యంగా అంతటా వ్యాపించటం గమనించి, సూర్యుని రక్తిమతో కూడిన సంధ్యను, నిశారంభాన్ని చూసి, తమసేనలను వెనుకకు మళ్ళించారు. (131,132 1/2)
అవాప్య కీర్తిం చ యశశ్చ లోకే
విజిత్య శత్రూంశ్చ ధనంజయోఽపి ॥ 133
యయౌ నరేంద్రైః సహ సోదరైశ్చ
సమాప్తకర్మా శిబిరం నిశాయామ్ ।
అర్జునుడు కూడా శత్రువులను జయించి లోకంలో కీర్తినీ, యశస్సును పొంది రణభూమిలో తన పనిని ముగించి, సోదరులతో, ఇతర రాజులతో కలిసి నిశారంభవేళలో శిబిరానికి వెళ్ళారు. (133 1/2)
తతః ప్రజజ్ఞే తుములః కురూణాం
నిశాముఖే ఘోరతమః ప్రణాదః ॥ 134
రణే రథానామయుతం నిహత్య
హతా గజాః సప్తశతార్జునేన ।
ప్రాచ్యాశ్చ సౌవీరగణాశ్చ సర్వే
నిపాతితాః క్షుద్రక మాలవాశ్చ ॥ 135
మహత్ కృతం కర్మ ధనంజయేన
కర్తుం యథా నార్హతి కశ్చిదన్యః ।
ఆ పై ఆ నిశారంభవేళలో కౌరవ పక్షంలో మహాభయంకర కోలాహలం చెలరేగింది. వారు ఇలా అనుకోసాగారు. "యుద్ధంలో అర్జునుడు పదివేల రథాలను భంగపరచి, ఏడువందల ఏనుగులను చంపి, ప్రాచ్యులను సౌవీరగణాలను, క్షుద్రకులను, మాలవులను అందరినీ చంపి, గొప్ప పని చేశాడు. మరెవ్వరూ అలా చేయలేరు. (134,135 1/2)
శ్రుతాయురంబష్ఠపతిశ్చ రాజా
తథైవ దుర్మర్షణచిత్రసేనౌ ॥ 136
ద్రోణః కృపః సైంధవబాహ్లికౌ చ
భూరిశ్రవాః శల్యశలౌ చ రాజన్ ।
అన్యే చ యోధాః శతశః సమేతాః
క్రుద్ధేన పార్థేన రణస్య మధ్యే ॥ 137
స్వబాహువీర్యేణ జితాః సభీష్మాః
కిరీటినా లోకమహారథేన ।
శ్రుతాయువు, అంబష్ఠపతి, దుర్మర్షణుడు, చిత్రసేనుడు, ద్రోణుడు, కృపుడు, సైంధవుడు, బాహ్లికుడు, వందల సంఖ్యలో కూడిన ఇతర యోధులు, భీష్మునితో సహా లోకైక మహారథుడైన అర్జునునిచే కోపంతో, యుద్ధంలో తన బాహుపరాక్రమంతో ఓడింపబడ్డారు." (136, 137 1/2)
ఇతి బ్రువంతః శిబిరాణి జగ్ముః
సర్వే గణా భారత యే త్వదీయాః ॥ 138
ఉల్కాసహస్త్రైశ్చ సుసంప్రదీప్తైః
విభ్రాజమానైశ్చ తథా ప్రదీపైః ।
కిరీటటివిత్రాసితసర్వయోధాః
చక్రే నివేశం ధ్వజినీ కురూణామ్ ॥ 139
భారతా! ఈ రీతిగా మాటాడుకొంటూ నీ సేనలన్నీ శిబిరాలకు వెళ్ళిపోయాయి. వేలకొలది కాగడాలు, దీపాలు చక్కగా వెలుగుతున్నాయి. యొధులందరూ అర్జునుడంటే బెదురుతున్నారు. ఈ స్థితిలో కౌరవసేన ఆ రాత్రి విశ్రమించింది." (138,139)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయదివసావహారే ఏకోనషష్టితమోఽధ్యాయః ॥ 59 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున తృతీయ దివసావహారమను ఏబది తొమ్మిదవ అధ్యాయము. (59)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకంతో కలిపి 140 1/2 శ్లోకాలు)