56. ఏబది యారవ అధ్యాయము

మూడవనాడు కౌరవ పాండవవ్యూహరచన - యుద్ధారంభము.

సంజయ ఉవాచ
ప్రభాతాయాం చ శర్వర్యాం భీష్మః శాంతనవస్తదా ।
అనీకాన్యనుసంయానే వ్యాదిదేశాథ భారతః ॥ 1
సంజయుడు ఇలా చెప్తున్నాడు. "భారతా! రాత్రి గడచి తెల్లవారగానే శంతనుసుతుడైన భీష్ముడు అప్పుడు యుద్ధభూమికి వెళ్ళటానికి తన సేనలను ఆదేశించాడు. (1)
గారుడం చ మహావ్యూహం చక్రే శాంతనవస్తదా ।
పుత్రాణాం తే జయాకాంక్షీ భీష్మః కురుపితామహః ॥ 2
కురుపితామహుడు, శంతనుసుతుడు ఐన భీష్ముడు నీ కుమారుల విజయాన్ని ఆకాంక్షిస్తూ గొప్పగా గరుడవ్యూహాన్ని రచించాడు. (2)
గరుడస్య స్వయం తుండే పితా దేవవ్రతస్తవ ।
చక్షుషీ చ భరద్వాజః కృతవర్మా చ సాత్వతః ॥ 3
నీ తండ్రి దేవవ్రతుడు గరుడవ్యూహంలో చంచూపుట స్థానంలో అగ్రభాగంలో నిలిచాడు. ద్రోణుడు, సాత్వత వంశీయుడు కృతవర్మ కనులుగా నిలిచారు. (3)
అశ్వత్థామా కృపశ్చైవ శీర్షమాస్తాం యశస్వినౌ ।
త్రైగర్తైరథ కైకేయైః వాటధానైశ్చ సంయుగే ॥ 4
కీర్తిమంతులైన అశ్వత్థామ, కృపుడు శిరోభాగంలో నిలిచారు. వారితో పాటు త్రిగర్తులు, కైకేయులు, వాటధానులు కూడా రణభూమిలో నిలిచారు. (4)
భూరిశ్రవాః శలః శల్యః భగదత్తశ్చ మారిష ।
మద్రకాః సింధుసౌవీరాః తథా పాంచనదాశ్చ యే ॥ 5
జయద్రథేన సహితాః గ్రీవాయాం సన్నివేశితాః ।
మారిషా! భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, భగదత్తుడు; మద్రక, సైంధవ, సౌవీరులతో కలిసి జయద్రథుడు మెడభాగంలో నిలిచారు. (5 1/2)
పృష్ఠే దుర్యోధనో రాజా సోదర్యైః సానుగైర్వృతః ॥ 6
విందానువిందావావంత్యౌ కాంబోజాశ్చ శకైః సహ ।
పుచ్ఛమాసన్ మహారాజ శూరసేనాశ్చ సర్వశః ॥ 7
మహారాజా! సోదరులతో, అనుచరులతో కలిసి దుర్యోధన మహారాజు పృష్ఠభాగంలో నిలిచాడు. అవంతీ రాజకుమారులు విందానువిందులు, కాంబోజులు, శకులు, శూరసేనులు పుచ్ఛభాగంలో వ్యాపించి నిలిచారు. (6,7)
మాగధాశ్చ కలింగాశ్చ దాసేరకగణైః సహ ।
దక్షిణం పక్షమాసాద్య స్థితా వ్యూహస్య దంశితాః ॥ 8
దాసేరక గణాలతో కలిసి మాగధులు, కాళింగులు కవచాలు ధరించి, ఆ వ్యూహంలో కుడివైపు రెక్కగా నిలిచారు. (8)
కారూషాశ్చ వికుంజాశ్చ ముండాః కుండీవృషాస్తథా ।
బృహద్బలేన సహితాః వామం పార్శ్వమవస్థితాః ॥ 9
కారూషులు, వికుంజులు, ముండులు, కుండీవృషులు బృహద్బలునితో కలిసి ఎడమరెక్కగా నిలిచారు. (9)
వ్యూఢం దృష్ట్వా తు తత్ సైన్యం సవ్యసాచీ పరంతపః ।
ధృష్టద్యుమ్నేన సహితః ప్రత్యవ్యూహత సంయుగే ॥ 10
అర్ధచంద్రేణ వ్యూహేన వ్యూహం తమతిదారుణమ్ ।
దక్షిణం శృంగమాస్థాయ భీమసేనో వ్యరోచత ॥ 11
కౌరవసేన వ్యూహాత్మకంగా నిలవటం చూసి, పరంతపుడైన సవ్యసాచి ధృష్టద్యుమ్నునితో కలిసి ఆలోచించి, ప్రతివ్యూహాన్ని కల్పించాడు. అతి దారుణంగా కనిపించే అర్ధచంద్రాకార వ్యూహాన్ని పన్నాడు. దానికి దక్షిణశృంగస్థానంలో భీమసేనుడు శోభించాడు. (10,11)
నానాశస్త్రౌఘసంపన్నైః నానాదేశ్యైర్నృపైర్వృతః ।
తదన్వేవ విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ॥ 12
నానాశస్త్ర సమూహసంపన్నులైన నానాదేశాల రాజులు భీమునితో కలిసి ఉన్నారు. భీముని వెనుక విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు ఉన్నారు. (12)
తదనంతరమేవాసీత్ నీలో నీలాయుధైః సహ ।
నీలాదనంతరశ్చైవ ధృష్టకేతుర్మహాబలః ॥ 13
ఆ వెనుక నల్లని ఆయుధాలు ధరించిన సైనికులతో కలిసి నీలుడు, ఆ వెనుక మహాబలుడైన ధృష్టకేతువు నిలిచారు. (13)
చేదికాశికరూషైశ్చ పౌరవైరపి సంవృతః ।
ధృష్టద్యుమ్నః శిఖండీ చ పంచాలాశ్చ ప్రభద్రకాః ॥ 14
మధ్యే సైన్యస్య మహతః స్థితా యుద్ధాయ భారత ।
తత్రైవ ధర్మరాజోఽపి గజానీకేన సంవృతః ॥ 15
భారతా! చేది, కాశి, కరూష, పౌరవదేశాల సేనలు కూడా ధృష్టకేతువు వెంట ఉన్నాయి. ఆ మహాసేన మధ్యలో ధృష్టద్యుమ్నుడు, శిఖండి, పాంచాలురు, ప్రభద్రకులు నిలిచారు. ధర్మరాజు కూడా అక్కడే ఉన్నాడు. గజసేన ఆయన చుట్టూ నిలిచి ఉంది. (14,15)
తతస్తు సాత్యకీ రాజన్ ద్రౌపద్యాః పంచ చాత్మజాః ।
అభిమన్యుస్తతః శూరః ఇరావాంశ్చ తతః పరమ్ ॥ 16
రాజా! ఆ తరువాత సాత్యకి, ద్రౌపది కొడుకులు అయిదుగురు నిలిచారు. ఆ పై శూరుడైన అభిమన్యుడు, ఆ వెనుక ఇరావంతుడు నిలిచారు. (16)
భైమసేనిస్తతో రాజన్ కేకయాశ్చ మహారథాః ।
తతోఽభూద్ ద్విపదాం శ్రేష్ఠః వామం పార్శ్వముపాశ్రితః ॥ 17
సర్వస్య జగతో గోప్తా గోప్తా యస్య జనార్దనః ।
ఇరావంతుని తరువాత భీమసేన కుమారుడయిన ఘటోత్కచుడు, మహారథులైన కేకయులు నిలిచారు. ఆ తరువాత నరోత్తముడైన అర్జునుడు వ్యూహానికి ఎడమవైపు నిలిచాడు. సర్వజగద్రక్షకుడైన జనార్దనుడే అర్జునునకు రక్షణ. (17 1/2)
ఏవమేతం మహావ్యూహం ప్రత్యవ్యూహంత పాండవాః ॥ 18
వధార్థం తవ పుత్రాణాం తత్పక్షం యే చ సంగతాః ।
ఈ రీతిగా పాండవులు నీ కుమారులను, నీ కుమారుని పక్షాన్ని ఆశ్రయించిన వారిని సంహరించటానికి గరుడ వ్యూహానికి ప్రతిగా మహావ్యూహాన్ని పన్నారు. (18 1/2)
తతః ప్రవవృతే యుద్ధం వ్యతిషక్తరథద్విపమ్ ॥ 19
తావకానాం పరేషాం చ నిఘ్నతామితరేతరమ్ ।
ఆ తరువాత ఒకరినొకరు కొట్టుకొంటూ, నీ వారికీ శత్రుసేనలకూ మధ్య యుద్ధం ప్రారంభమైంది. రెండు సేనల రథాలు, ఏనుగులూ కలిసి పోయాయి. (19 1/2)
హయౌఘాశ్చ రథౌఘాశ్చ తత్ర తత్ర విశాంపతే ॥ 20
సంపతంతో వ్యదృశ్యంత నిఘ్నంతస్తే పరస్పరమ్ ।
రాజా! గుర్రాల సముదాయాలూ, రథాల సమూహాలూ పరస్పరం దాడి చేసుకొంటూ, ఘర్షణ పడుతూ కనిపించాయి. (20 1/2)
ధావతాం చ రథౌఘానాం నిఘ్నతాం చ పృథక్ పృథక్ ॥ 21
బభూవ తుములః శబ్దః విమిశ్రో దుందుభిస్వనైః ।
దివస్పృఙ్ నరవీరాణాం నిఘ్నతామితరేతరమ్ ।
సంప్రహారే సుతుములే తవ తేషాం చ భారత ॥ 22
పరుగులెత్తుతూ వేరువేరుగా ప్రహరిస్తున్న రథాల శబ్దం దుందుభి శబ్దాలతో కలిసి భయంకరంగా వినిపించింది. భారతా! నీవారికీ, పాండవులకూ మధ్య జరుగుతున్న భీకరయుద్ధంలో పరస్పరం కొట్టుకొంటున్న ఆ నరవీరుల భీకరధ్వని ఆకాశమంతా వ్యాపించింది. (21,22)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి తృతీయ యుద్ధదివసే పరస్పరవ్యూహరచనాయాం షట్ పంచాశత్తమోఽధ్యాయః ॥ 56 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున మూడవనాడు పరస్పర వ్యూహరచన మను ఏబది యారవ అధ్యాయము. (56)