54. ఏబది నాలుగవ అధ్యాయము
కళింగరాజువధ.
ధృతరాష్ట్ర ఉవాచ
తథా ప్రతిసమాదిష్టః కాలింగో వాహినీపతిః ।
కథమద్భుతకర్మాణం భీమసేనం మహాబలమ్ ॥ 1
ధృతరాష్ట్రుడిలా అడిగాడు. "దుర్యోధనుడలా ఆధేశించగా సేనాపతి అయిన కళింగరాజు మహాబలుడు, అద్భుత పరాక్రమశాలి అయిన భీమునితో ఎలా యుద్ధం చేశాడు ? (1)
చరంతం గదయా వీరం దండహస్తమివాంతకమ్ ।
యోధయామాస సమరే కాలింగః సహ సేనయా ॥ 2
చేత దండాన్ని ధరించిన యమునిగా గదను బట్టి, తిరుగుతున్న భీమునితో సేనాసహితుడైన కళింగుడు ఎలా యుద్ధం చేశాడు?" (2)
సంజయ ఉవాచ
పుత్రేణ తవ రాజేంద్ర స తథోక్తో మహాబలః ।
మహత్యా సేనయా గుప్తః ప్రాయాద్ భీమరథం ప్రతి ॥ 3
సంజయుడిలా చెప్తున్నాడు. "రాజేంద్రా! నీ కుమారుడలా ఆదేశించగానే మహాబలుడైన కళింగరాజు గొప్పసేనచే సురక్షితుడై భీముని రథంవైపు వెళ్ళాడు. (3)
తామాపతంతీం మహతీం కలింగానాం మహాచమూమ్ ।
రథాశ్వనాగకలిలాం ప్రగృహీతమహాయుధామ్ ॥ 4
భీమసేనః కలింగానామ్ ఆర్చ్ఛద్ భారత వాహినీమ్ ।
కేతుమంతం చ నైషాదిమ్ ఆయాంతం సహ చేదిభిః ॥ 5
భారతా! రథాలు, గుర్రాలు, ఏనుగులు, పదాతులతో కూడిన ఆ మహాకళింగసేన పెద్ద పెద్ద ఆయుధాలను చేత బట్టి, భీమసేనుని మీదకు వచ్చింది. అది చూసి భీమసేనుడు చేదిదేశసైనికులతో కలిసి, బాణాలతో కళింగసేనను బాధించాడు. నిషాదరాజైన కేతుమంతుని కూడా గాయపరిచాడు.(4,5)
తతః శ్రుతాయః సంక్రుద్ధః రాజ్ఞా కేతుమతా సహ ।
ఆససాద రణే భీమం వ్యూఢానీకేషు చేదిషు ॥ 6
అటుపిమ్మట రాజైన కేతుమంతునితో పాటు క్రోధంతో నిండిన శ్రుతాయువు కూడా భీమసేనుని మీదకు యుద్ధానికి వచ్చాడు. చేదిసేనలప్పుడు వ్యూహాత్మకంగా నిలిచి ఉన్నాయి. (6)
రథైరనేకసాహస్త్రైః కలింగానాం నరాధిప ।
అయుతేన గజానాం చ నిషాదైః సహ కేతుమాన్ ॥ 7
భిమసేనం రణేరాజన్ సమంతాత్ పర్యవారయత్ ।
రాజా! వేలకొలది కళింగరథాలతో, పదివేల ఏనుగులతో, నిషాదులతో కూడి, కేతుమంతుడు యుద్ధంలో భీమసేనుని అన్నివైపులా నిరోధించాడు. (7 1/2)
చేదిమత్స్యకరూషాశ్చ భీమసేనపదానుగాః ॥ 8
అభ్యధావంత సమరే నిషాదాన్ సహ రాజభిః ।
తతః ప్రవవృతే యుద్ధం ఘోరరూపం భయావహమ్ ॥ 9
భీమసేనుని అనుసరించి నడిచే చేది, మత్స్య, కరూష దేశ క్షత్రియులు నిషాదులను, వారి రాజులను యుద్ధంలో ఆక్రమించారు. ఆపై మహాఘోరంగా, భయంకరంగా యుద్ధం జరిగింది. (8,9)
న ప్రాజానంత యోధాః స్వాన్ పరస్పరజిఘాంసయా ।
ఘోరమాసీత్ తతో యుద్ధం భీమస్య సహసా పరైః ॥ 10
యథేంద్రస్య మహారాజ మహత్యా దైత్యసేనయా ।
మహాదైత్యసేనతో ఇంద్రునకు వలె శత్రుసేనతో భీమునకు సాహసంతో ఘోరయుద్ధం జరిగింది. ఒకరినొకరు చంపదలచుకొన్న స్థితితో వీరులకు స్వపరభేదం కూడా తెలియటం లేదు. (10 1/2)
తస్య సైనస్య సంగ్రామే యుధ్యమానస్య భారత ॥ 11
బభూవ సుమహాన్ శబ్దః సాగరస్యేవ గర్జతః ।
భారతా! రణంలో ఆ సేనలు పోరాడుతుంటే సాగరఘోషలా మహాశబ్దం వినిపించింది. (11 1/2)
అన్యోన్యం స్మ తదా యోధాః వికర్షంతో విశాంపతే ॥ 12
మహీం చక్రుశ్చితాం సర్వాం శశలోహితసన్నిభామ్ ।
రాజా! యోధులు ఒకరినొకరు ఈడ్చుకొంటూ రణభూమినంతా శవాలతో నింపేశారు. నేల కుందేటి నెత్తుటి వలె ఎర్రగా కనిపిస్తోంది. (12 1/2)
యోధాంశ్చ స్వాన్ పరాన్ వాపి నాభ్యజానన్ జిఘాంసయా ॥ 13
స్వానప్యాదదతే స్వాశ్చ శూరాః పరమదుర్జయాః ।
పరమదుర్జయులైన శూరులు శత్రుహననం చేయదలచినా తమవారినీ, శత్రువులను విడివిడిగా గుర్తించలేకపోతున్నారు. తమవారినే పట్టుకొంటున్నారు కూడా. (13 1/2)
విమర్దః సుమహానాసీద్ అల్పానాం బహుభిః సహ ॥ 14
కలింగైః సహ చేదీనాం నిషాదైశ్చ విశాంపతే ।
రాజా! కళింగసేనలు, నిషాదసేనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చేదిదేశసైనికులు తక్కువ మంది అయినా వారి మధ్య మహాయుద్ధం జరిగింది. (14 1/2)
కృత్వా పురుషకారం తు యథాశక్తి మహాబలాః ॥ 15
భీమసేనం పరిత్యజ్య సన్న్యవర్తంత చేదయః ।
మహాబలులైన చేదిసైనికులు తమ శక్తికొలది పరాక్రమాన్ని ప్రకటించి, భీమసేనుని వీడి, వెనుదిరిగారు. (15 1/2)
సర్వైః కలింగైరాసన్నః సన్నివృత్తేషు చేదిషు ॥ 16
స్వబాహుబలమాస్థాయ న న్యవర్తత పాండవః ।
న చచాల రథోపస్థాద్ భీమసేనలో మహాబలః ॥ 17
చేదిసేనలు మరలగానే కళింగసేనలు భీముని సమీపించాయి. అయినా తన బాహుబలాన్ని విశ్వసించి మహాబలుడు, పాండుకుమారుడు అయిన భీమసేనుడు వెనుకంజ వేయలేదు. నొగలి నుండి చలించలేదు. (16,17)
శితైరవాకిరద్ బాణైః కలింగానాం వరూథినీమ్ ।
కాలింగస్తు మహేష్వాసః పుత్రశ్చాస్య మహారథః ॥ 18
శక్రదేవ ఇతి ఖ్యాతః జఘ్నతుః పాండవం శరైః ।
కళింగసేనపై పదునైన బాణాల వానను కురిపించాడు. మేటివిలుకాడైన కాళింగుడు, మహారథుడైన ఆయన కొడుకు శక్రదేవుడు భీమసేనుని బాణాలతో కొట్టారు. (18 1/2)
తతో భీమో మహాబాహుః విధున్వన్ రుచిరం ధనుః ॥ 19
యోధయామాస కాలింగం స్వబాహుబలమాశ్రితః ।
అప్పుడు మహాబాహు వయిన భీమసేనుడు అందంగా ధనుష్టంకారం చేస్తూ, తన బాహుబలాన్ని ఆశ్రయించి, కాళింగునితో యుద్ధం చేశాడు. (19 1/2)
శక్రదేవస్తు సమరే విసృజన్ సాయకాన్ బహూన్ ॥ 20
అశ్వాన్ జఘాన సమరే భీమసేనస్య సాయకైః ।
శక్రదేవుడు రణభూమిలో తీవ్రబాణవృష్టిని కురిపిస్తూ, భీమసేనుని గుర్రాలను చంపివేశాడు. (20 1/2)
తం దృష్ట్వా విరథం తత్ర భీమసేనమరిందమమ్ ॥ 21
శక్రదేవోఽభిదుద్రావ శరైరవకిరన్ శితైః ।
అరిందముడైన భీమసేనుడు విరథుడు కావటం చూసి, శక్రదేవుడు వాడి బాణాలను కురిపిస్తూ, భీమసేనుని మీదకు వచ్చాడు. (21 1/2)
భీమస్యోపరి రాజేంద్ర శక్రదేవో మహాబలః ॥ 22
వవర్ష శరవర్షాణి తపాంతే జలదో యథా ।
రాజేంద్రా! వర్షాకాలమేఘం వలె మహాబలుడైన శక్రదేవుడు భీమునిపై శరవర్షాన్ని కురిపించాడు. (22 1/2)
హతాశ్వే తు రథే తిష్ఠన్ భీమసేనో మహాబలః ॥ 23
శక్రదేవాయ చిక్షేప సర్వశైక్యాయసీం గదామ్ ।
గుర్రాలు చనిపోగా మహాబలుడైన భీమసేనుడు ఆ రథంలోనే నిలిచి, పూర్తిగా లోహంతో తయారుచేసిన గదను శక్రదేవునిపై విసిరాడు. (23 1/2)
స తయా నిహతో రాజన్ కాలింగతనయో రథాత్ ॥ 24
సధ్వజః సహ సూతేన జగామ ధరణీతలమ్ ।
రాజా! ఆ గద దెబ్బ తగిలి, కళింగరాజు కొడుకు శక్రదేవుడు ధ్వజంతో, సూతునితో సహా నేలకూలాడు. (24 1/2)
హతమాత్మసుతం దృష్ట్వా కలింగానాం జనాధిపః ॥ 25
రథైరనేకసాహస్త్రైః భీమస్యావారయద్ దిశః ।
తన కొడుకు చనిపోవటం చూసి, కళింగరాజు ఎన్నో వేలరథాలతో భీముని దిక్కుల నన్నింటినీ నివారించాడు. (25 1/2)
తతో భీమో మహావేగాం త్యక్త్వా గుర్వీం మహాగదామ్ ॥ 26
నిస్త్రింశమాదదే ఘోరం చికీర్షుః కర్మ దారుణమ్ ।
చర్మ చాప్రతిమం రాజన్ ఆర్షభం పురుషర్షభ ॥ 27
నక్షత్రైరర్ధచంద్రైశ్చ శాతకుంభమయైశ్చితమ్ ।
రాజా! ఆ తర్వాత భీమసేనుడు తీవ్రవేగం గల ఆ గొప్ప గదను అక్కడే వదలి, దారుణ కృత్యాన్ని చేయాలనుకొని, భీకరమైన కత్తిని చేబట్టాడు. పురుషర్షభా! నక్షత్రాలు, అర్ధచంద్రాకారంలో పొదిగిన బంగారు పూలు గల డాలును కూడా చేతబట్టాడు. (26,27 1/2)
కాళింగస్తు తతః క్రుద్ధః ధనుర్జ్యామవమృజ్య చ ॥ 28
ప్రగృహ్య చ శరం ఘోరమ్ ఏకం సర్పవిషోపమమ్ ।
ప్రాహిణోద్ భీమసేనాయ వధాకాంక్షీ జనేశ్వరః ॥
ఆపై కళింగరాజు కోపంతో వింటినారిని బాగా లాగి, విషసర్పం లాంటి ఒక బాణాన్ని తీసికొని భీమసేనుని వధను కోరుకొంటూ ఆయన మీదకు విసిరాడు. (28,29)
తమాపతంతం వేగేన ప్రేరితం నిశితం శరమ్ ।
భీమసేనో ద్విధా రాజన్ చిచ్ఛేద విపులాసినా ॥ 30
ఉదక్రోశచ్చ సంహృష్టః త్రాసయానో వరూథినీమ్ ।
కాళింగుడు తీవ్రవేగంతో ప్రయోగించిన ఆ పదునైన బాణం మీదపడుతుండగా భీమసేనుడు విశాలమైన కత్తితో దానిని రెండు ముక్కులుగా నరికాడు. శత్రుసేనలను భయపెడుతూ ఉల్లాసంగా పెద్దగా అరిచాడు. (30 1/2)
కాలింగోఽథ తతః క్రుద్ధః భీమసేనాయ సంయుగే ॥ 31
తోమరాన్ ప్రాహిణోచ్ఛీఘ్రం చతుర్దశ శిలాశితాన్ ।
రణభూమిలో ఆ తరువాత కాళింగుడు కూడా భీమసేనునిపై కోపించి, సానబెట్టిన పదునాలుగుతోమరాలను వెంటనే విసిరాడు. (31 1/2)
తానప్రాప్తాన్ మహాబాహుః ఖగతానేవ పాండవః ॥ 32
చిచ్ఛేద సహసా రాజన్ అసంభ్రాంతో వరాసినా ।
రాజా! భీమసేనుడు ఏమీ కంగారు పడకుండా ఆ తోమరాలను ఆకాశంలో ఉన్నప్పుడే మంచి కత్తితో ఛేదించాడు. (32 1/2)
నికృత్య తు రణే భీమః తోమరాన్ వై చతుర్దశ ॥ 33
భానుమంతం తతో భీమః ప్రాద్రవత్ పురుషర్షభః ।
పదునాలుగు తోమరాలను రణభూమిలో ఖండించి, పురుషశ్రేష్ఠుడైన భీముడు భానుమంతునిపై దాడి చేశాడు. (33 1/2)
భానుమాంస్తు తతో భీమం శరవర్షేణ చ్ఛాదయన్ ॥ 34
ననాద బలవన్నాదం నాదయానో నభస్తలమ్ ।
ఆపై భానుమతుండు శరవృష్టితో భీముని కప్పివేశాడు. ఆకాశాన్ని ధ్వనింపజేస్తూ మహోత్సాహంగా సింహనాదం చేశాడు. (34 1/2)
న చ తం మమృషే భీమః సింహనాదం మహాహవే ॥ 35
తతః శబ్దేన మహతా విననాద మహాస్వనః ।
తేన నాదేన విత్రస్తా కలింగానాం వరూథినీ ॥ 36
రణరంగంలో ఆ సింహనాదాన్ని భీముడు సహింపలేకపోయాడు. అంతకన్నా పెద్దగా మహాధ్వనితో తానూ గర్జించాడు. ఆ సింహనాదంతో కళింగసేన బెదిరింది. (35,36)
న భీమం సమరే మేనే మానుషం భరతర్షభ ।
తతో భీమో మహాబాహుః నర్దిత్వా విపులం స్వనమ్ ॥ 37
సాసిర్వేగవదాప్లుత్య దంతాభ్యాం వారణోత్తమమ్ ।
ఆరురోహ తతో మధ్యం నాగరాజస్య మారిష ॥ 38
భరతర్షభా! సైనికులు భీమసేనుని మనుష్యునిగా భావించలేదు. అపుడు మహాబాహు వయిన భీముడు పెద్దగా అరచి, కత్తి చేతిబట్టి, వేగంగా వచ్చి, దంతాల మీదుగా మదపుటేనుగు నెక్కి, ఆ గజరాజుపై కూర్చున్నాడు. (37,38)
తతో ముమోచ కాలింగః శక్తిం తామకరోద్ ద్విధా ।
ఖడ్గేన పృథునా మధ్యే భానుమంతమథాచ్ఛినత్ ॥ 39
ఆ పిమ్మట కళింగరాజు శక్తిని ప్రయోగించాడు. దాన్ని భీముడు రెండు ముక్కలు చేసి, విశాలఖడ్గంతో భానుమంతుని శరీరాన్ని మధ్యకు నరికివేశాడు. (39)
సోఽంతరాయుధినం హత్వా రాజపుత్రమరిందమః ।
గురుం భారసహం స్కంధే నాగస్యాసిమపాతయత్ ॥ 40
ఈ రీతిగా యుద్ధం చేస్తున్న కళింగరాజకుమారుని చంపి, అరిందముడైన భీమసేనుడు భారాన్ని సహించ గల తన పెనుకత్తితో కళింగుని ఏనుగుమెడపై నరికాడు. (40)
ఛిన్నస్కంధః స వినదన్ పపాత గజయూథపః ।
ఆరుగ్ణః సింధువేగేన సానుమానివ పర్వతః ॥ 41
మెడతెగి ఆ గజరాజు ఆక్రోశిస్తూ, ప్రవాహవేగానికి పడిపోతున్న శిఖరసహితపర్వతంలా నేలకూలాడు. (41)
తతస్తస్మాదవప్లుత్య గజాద్ భారత భారతః ।
ఖడ్గపాణిరదీనాత్మా తస్థౌ భూమౌ సుదంశితః ॥ 42
భారతా! తర్వాత ఖడ్గపాణి, కవచధారి, ఉదారచిత్తుడు, భరతవంశీయుడైన భీముడు ఆ ఏనుగు మీద నుండి క్రిందకు దూకి, నేలపై నిలిచాడు. (42)
స చచార బహూన్ మార్గాన్ అభితః పాతయన్ గజాన్ ।
అగ్నిచక్రమివావిద్ధం సర్వతః ప్రత్యదృశ్యత ॥ 43
అడ్డు వచ్చిన ఏనుగులను పడగొడుతూ అనేక మార్గాలలో సంచరించాడు భీముడు. తిరుగుతున్న అగ్నిచక్రంలాగా అంతటా కనిపించాడు. (43)
అశ్వవృందేషు నాగేషు రథానీకేషు చాభిభూః ।
పదాతీనాం చ సంగేషు వినిఘ్నన్ శోణితోక్షితః ॥ 44
శక్తిమంతుడైన భీముడు అశ్వసమూహాలలో, ఏనుగులలో, రథసేనలలో, పదాతిదళ సముదాయాల్లో తిరుగుతూ, అందరిని చంపుతూ, నెత్తుటితో తడిసి కనిపించాడు. (44)
శ్యేనవద్ వ్యచరద్ భీమః రణేఽరిషు బలోత్కటః ।
ఛిందంస్తేషాం శరీరాణి శిరాంసి చ మహాబలః ॥ 45
ప్రచండుడు, మహాబలుడు అయిన భీమసేనుడు యుద్ధంలో శత్రువులలో, వారి శరీరాలను, శిరస్సులను ఖండిస్తూ డేగలాగా సంచరించాడు. (45)
ఖడ్గేన శితధారేణ సంయుగే గజయోధినామ్ ।
పదాతిరేకః సంక్రుద్ధః శత్రూణాం భయవర్ధనః ॥ 46
సమ్మోహయామాస స తాన్ కాలాంతకయమోపమః ।
పదునైన వాదరగల కత్తితో యుద్ధంలో గజయోధులను సంహరిస్తూ; ఒంటరిగా, కోపంగా, శత్రుభీకరంగా సంచరిస్తూ కాలాంతకుడైన యముని వలె భీముడు శత్రువులను మోహానికి గురిచేశాడు. (46 1/2)
మూఢాశ్చ తే తమేవాజౌ వినదంతః సమాద్రవన్ ॥ 47
సాసిముత్తమవేగేన విచరంతం మహారణే ।
మూర్ఖులైన ఆ సైనికులు గర్జిస్తూ భీమసేనుని దగ్గరకు తామే వచ్చి బలి అవుతున్నారు. మహాసంగ్రామంలో కత్తి చేతబట్టి, మహావేగంగా సంచరిస్తున్నాడు భీమసేనుడు. (47 1/2)
నికృత్య రథినాం చాజౌ రథేషాశ్చ యుగాని చ ॥ 48
జఘాన రథినశ్చాపి బలవాన్ రిపుమర్దనః ।
బలవంతుడు, రిపుమర్దనుడు అయిన భీముడు యుద్ధంలో సారథులను, రథపుకాడెలను, నొగలను, రథులను కూడా చంపివేస్తున్నాడు. (48 1/2)
భీమసేనశ్చరన్ మార్గాన్ సుబహూన్ ప్రత్యదృశ్యత ॥ 49
భ్రాంతమావిద్ధముద్భ్రాంతమ్ ఆప్లుతం ప్రసృతం ప్లుతమ్ ।
సంపాతం సముదీర్ణం చ దర్శయామాస పాండవః ॥ 50
భీమసేనుడు వివిధమార్గాలలో సంచరిస్తూ కనిపించాడు. ఖడ్గయుద్ధానికి సంబంధించిన భ్రాంతం, ఆవిద్ధం, ఉద్భ్రాంతం, ఆప్లుతం, ప్రసృతం, ప్లుతం, సంపాతం, సముదీర్ణ మనే గతులను ప్రదర్శించాడు. (49,50)
వి॥ కత్తిని మండలాకారంలో త్రిప్పటం భ్రాంతం. ఎక్కువ శక్తిని ఉపయోగించిన భ్రాంతమే ఆవిద్ధం. కత్తిని పైకి ఎత్తి, మండలాకారంలో త్రిప్పటం ఉద్భ్రాంతం. కత్తి త్రిప్పుతూ పైకి ఎగరటం ఆప్లుతం. అన్నిదిక్కులకూ వ్యాపించటం ప్రసృతం. కత్తిని త్రిప్పుతూ ఒకే దిక్కుగా ముందుకు పోవటం ప్లుతం. వేగంగా చలించటం సంపాతం. శత్రువులందరి మీదకు ఉద్యమించటం సముదీర్ణం.
కేచిదగ్రాసినా ఛిన్నాః పాండవేన మహాత్మనా ।
వినేదుర్భిన్నమర్మాణః నిపేతుశ్చ గతాసవః ॥ 51
మహాత్ముడైన భీమసేనునిచే కత్తిమొనచే గాయపడి కొన్ని ఏనుగులు తెగిపోయాయి. వాటి మర్మస్థలాలు బ్రద్దలై అవి ఆక్రోశిస్తూ, ప్రాణాలు పోయి నేలగూలాయి. (51)
ఛిన్నదంతాగ్రహస్తాశ్చ భిన్నకుంభాస్తథా పరే ।
వియోధాః స్వాన్యనీకాని జఘ్నుర్భారత వారణాః ॥ 52
నిపేతురుర్వ్యాం చ తథా వినదంతో మహారవాన్ ।
భారతా! దంతాలు తొండం విరిగిపోయి, కుంభస్థలాలు బ్రద్దలై, ఏనుగునెక్కినవాడు కూడా చనిపోగా ఏనుగులు తమసేనలలోని వారినే చంపనారంభించాయి. అలా దెబ్బతిన్నవారు పెద్దగా అరుస్తూ నేలబడిపోతున్నారు. (52 1/2)
ఛిన్నాంశ్చ తోమరాన్ రాజన్ మహామాత్రశిరాంసి చ ॥ 53
పరిస్తోమాన్ విచిత్రాంశ్చ కక్ష్యాశ్చ కనకోజ్జ్వలాః ।
గ్రైవేయాణ్యథ శక్తీశ్చ పతాకాః కణపాంస్తథా ॥ 54
తూణీరానథ యంత్రాణి విచిత్రాణి ధనూంషి చ ।
భిందిపాలాని శుభ్రాణి తోత్రాణి చాంకుశైః సహ ॥ 55
ఘంటాశ్చ వివిధా రాజన్ హేమగర్భాంస్త్సరూనపి ।
పతతః పాతితాంశ్చైవ పశ్యామః సహ సాదిభిః ॥ 56
రాజా! ఎన్నో తోమరాలు, మావటీళ్ళతలలు తెగి కనిపిస్తున్నాయి. ఏనుగుపై పరిచే విచిత్ర కంబళీలు, కనకమయకక్ష్యలు, కంఠాభరణాలు, శక్తులు, పతాకలు, ముద్గరాలు, తూణీరాలు, విచిత్ర యంత్రాలు, ధనుస్సులు, మెరుస్తున్న భిందిపాలాలు, తోత్రాలు, అంకుశాలు, వివిధఘంటలు, స్వర్ణమయమైన కత్తిపిడులు, ఏనుగునెక్కిన వీరులతో సహా ఏనుగులు, కొన్ని పడుతూ, కొన్ని పడి కనిపిస్తున్నాయి. (53-56)
వి॥ భిందిపాలం = నాళికాస్త్రం
కక్ష్యలు = ఏనుగు నడుముకు గాని, గుర్రం నడుముకు గాని కట్టే మోకు. లేదా మొలత్రాడు.
ఛిన్నగాత్రావరకరైః నిహతైశ్చాపి వారణైః ।
ఆసీద్ భూమిః సమాస్తీర్ణా పతితైర్భూధరైరివ ॥ 57
చనిపోయిన ఏనుగులు శరీరాల పూర్వభాగాలు ఒక చోట, పృష్ఠభాగాలు మరొకచోట పడ్డాయి. పడిపోయిన కొండలు భూమిపై పరచుకొన్నట్లుగా ఉన్న దది. (57)
విమృద్యైవం మహానాగాన్ మమర్దన్యాన్ మహాబలః ।
అశ్వారోహవరాంశ్చైవ పాతయామాస సంయుగే ॥ 58
తద్ ఘోరమభవద్ యుద్ధం తస్య తేషాం చ భారత ।
మహాబలుడైన భీముడు మహాగజాలను ఇలా సంహరించి, ఇతరులను కూడా చంపనారంభించాడు. భారతా! రణంలో మేటి అశ్వారోహకులను పడగొట్టాడు. ఇలా భీమ, కళింగసేనల మధ్య ఘోరయుద్ధం జరిగింది.(58 1/2)
ఖలీనాన్యథ యోక్త్రాణి కక్ష్యాశ్చ కనకోజ్జ్వలాః ॥ 59
పరిస్తోమాశ్చ ప్రాసాశ్చ ఋష్టయశ్చ మహాధనాః ।
కవచాన్యథ చర్మాణి చిత్రాణ్యాస్తరణాని చ ॥ 60
తత్ర తత్రాపవిద్ధాని వ్యదృశ్యంత మహాహవే ।
ఆ మహారణంలో గుర్రాల కళ్ళాలు, ముకుత్రాళ్ళు, పగ్గాలు, కక్ష్యలు, ఏనుగుపై పరిచే కంబళీలు, ప్రాసాలు, విలువైన ఋష్టులు, కవచాలు, కాళ్ళు, విచిత్రమైన ఆస్తరణాలు చెల్లాచెదరుగా కనిపిస్తున్నాయి. (56,60 1/2)
వి॥ ఋష్టి = రెండు అంచుల కత్తి
ప్రాసైర్యంత్రైర్విచిత్రైశ్చ శస్రైశ్చ విమలైస్తథా ॥ 61
స చక్రే వసుధాం కీర్ణాం శబలైః కుసుమైరివ ।
ప్రాసాలు, విచిత్రయంత్రాలు, విమలశస్త్రాలతో భూమిని నింపి, భీమసేనుడు చిత్రవర్ణాలు గల పూలతో నేల నలంకరించినట్లు అనిపించాడు. (61 1/2)
ఆప్లుత్య రథినః కాంశ్చిత్ పరామృశ్య మహాబలః ॥ 62
పాతయామాస ఖడ్గేన సధ్వజానపి పాండవః ।
మహాబలుడైన భీముడు ఎగిరి, రథికులెందరి మీదకో దూకి, కత్తితో, పతాకలతో సహా వారిని పడగొట్టాడు. (62 1/2)
ముహురుత్పతతో దిక్షు ధావతశ్చ యశస్వినః ॥ 63
మార్గాంశ్చ చరతశ్చిత్రం వ్యస్మయంత రణే జనాః ।
యశస్వి అయిన భీమసేనుడు మాటిమాటికి ఎగురుతున్నాడు. అన్ని దిక్కులలో పరుగెత్తుతున్నాడు. వివిధ చిత్రవిన్యాసాలతో రణభూమిపై తిరుగుతున్నాడు. అది చూసి జనులంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. (63 1/2)
స జఘాన పదా కాంశ్చిద్ వ్యాక్షిప్యాన్యానపోథయత్ ॥ 64
ఖడ్గేనాన్యాంశ్చ చిచ్ఛేద నాదేనాన్యాంశ్చ భీషయన్ ।
ఊరువేగేన చాప్యన్యాన్ పాతయామాస భూతలే ॥ 65
ఆ భీముడు కాలితో కొందరిని చంపాడు. పైకెత్తి కుదేసి కొందరిని చంపాడు. కత్తితో కొందరిని ఖండించాడు. కొందరిని తన గర్జనతోనే భయపెట్టాడు. మరికొందరిని తన కాలివేగంతోనే నేలపై పడగొట్ఠాడు. (64,65)
అపరే చైనమాలోక్య భయాత్ పంచత్వమాగతాః ।
ఏవం సా బహులా సేనా కలింగానాం తరస్వినామ్ ॥ 66
పరివార్య రణే భీష్మం భీమసేనముపాద్రవత్ ।
మరొకొందరు భీముని చూడగానే భయంతో చచ్చిపోయారు. ఈ రీతిగా మరణించినా కూడా ఇంకా చాలా మిగిలిన ఆ కళింగసేన వేగంగా భీష్ముని రక్షణకై చుట్టూ నిలిచి, భీమసేనుని మీద దాడి చేసింది. (66 1/2)
తతః కాలింగసైన్యానాం ప్రముఖే భరతర్షభ ॥ 67
శ్రుతాయుషమభిప్రేక్ష్య భీమసేనః సమభ్యయాత్ ।
భరతర్షభా! ఆ తర్వాత కళింగసేనలో ప్రముఖుడైన శ్రుతాయువును చూసి, భీమసేనుడు ఆయనపైకి దూకాడు. (67 1/2)
తమాయాంతమభిప్రేక్ష్య కాలింగో నవభిః శరైః ॥ 68
భీమసేనమమేయాత్మా ప్రత్యవిధ్యత్ స్తనాంతరే ।
అమేయబలుడైన కాళింగుడు తనపైకి భీమసేనుడు రావటం గమనించి, తొమ్మిది బాణాలతో భీముని చాతిపై కొట్టాడు. (68 1/2)
కాలింగబాణాభిహతః తోత్రార్దిత ఇవ ద్విపః ॥ 69
భీమసేనః ప్రజజ్వాల క్రోధేనాగ్నిరివైధితః ।
కాళింగుని బాణాల దెబ్బతిన్న భీముడు అంకుశంతో పొడిచిన ఏనుగులాగా, ఆహుతులతో పైకెగిసిన అగ్నిలాగా క్రోధంతో ప్రజ్వరిల్లాడు. (69 1/2)
అథాలోకః సమాదాయ రథం హేమపరిష్కృతమ్ ॥ 70
భీమం సంపాదయామాస రథేన రథసారథిః ।
అపుడు భీమరథసారథి అయిన అశోకుడు బంగారు అలంకరణలు గల రథాన్ని భీముని దగ్గరకు తెచ్చి, భీముని కూడా రథసంపన్నుని చేశాడు. (70 1/2)
తమారుహ్య రథం తూర్ణం కౌంతేయః శత్రుసూదనః ॥ 71
కాలింగమభిదుద్రావ తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్ ।
శత్రుసంహర్త అయిన భీమసేనుడు వెంటనే ఆ రథాన్ని ఎక్కి, కాళింగుని వైపు వెళ్ళి, "నిలు, నిలు" అన్నాడు. (71 1/2)
తతః శ్రుతాయుర్బలవాన్ భీమాయ నిశితాన్ శరాన్ ॥ 72
ప్రేషయామాస సంక్రుద్ధః దర్శయన్ పాణిలాఘవమ్ ।
ఆ తరువాత బలవంతుడైన శ్రుతాయువు కోపంతో తన హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ, భీమునిపై పదునైన బాణాలను ప్రయోగించాడు. (72 1/2)
స కార్ముకవరోత్సృష్టైః నవభిర్నిశితైః శరైః ॥ 73
సమాహతో మహారాజ కాలింగేన మహాత్మనా ।
సంచుక్రుశే భృశం భీమః దండాహత ఇవోరగః ॥ 74
మహారాజా! మహాత్ముడైన ఆ కళింగరాజు మేటివింటి నుండి విడిచిన తొమ్మిది పదునెక్కిన బాణాల దెబ్బతిని, భీముడు కర్రతో కొట్టబడిన పాములాగా తీవ్రకోపానికి గురి అయ్యాడు. (73,74)
క్రుద్ధచ చాపయాయమ్య బలవద్ బలినాం వరః ।
కాళింగమవధీత్ పార్థః భీమః సప్తభిరాయసైః ॥ 75
బలవంతులలోశ్రేష్ఠుడు, కుంతి కొడుకు అయిన భీముడు కోపించి, వింటిని బాగా లాగి, ఏడు లోహబాణాలతో కాళింగరాజును - శ్రుతాయువును గాయపరిచాడు. (75)
క్షురాభ్యాం చక్రరక్షౌ చ కాలింగస్య మహాబలౌ ।
సత్యదేవం చ సత్యం చ ప్రాహిణోద్ యమసాదనమ్ ॥ 76
కాళింగుని చక్రరక్షకులు, మహాబలులు అయిన సత్యదేవుని, సత్యుని రెండు క్షురాల (బాణాల) తో యమసదనానికి పంపించాడు. (76)
తతః పునరమేయాత్మా నారాచైర్మిశితైస్త్రిభిః ।
కేతుమంతం రణే భీమోఽగమయద్ యమసాదనమ్ ॥ 77
ఆ తరువాత అమేయబలుడైన భీముడు మూడు పదునైన బాణాలతో యుద్ధంలో కేతుమంతుని యమసదనానికి పంపించాడు. (77)
తతః కలింగాః సన్నద్ధాః భీమసేనమమర్షణమ్ ।
అనీకైర్బహుసాహస్త్రైః క్షత్రియాః సమవారయన్ ॥ 78
ఆ పై కళింగ క్షత్రియులు వేలకొద్ది సేనలతో వచ్చి, యుద్ధసన్నద్ధుడై, అమర్షశీలి అయిన భీమసేనుని కదలకుండా నిరోధించాడు. (78)
తతః శక్తిగదాఖడ్గతోమరర్ ష్టిపరశ్వధైః ।
కలింగాశ్చ తతో రాజన్ భీమసేనమవాకిరన్ ॥ 79
రాజా! ఆ తరువాత కళింగులు భీమసేనునిపై శక్తి, గదా, తోమర, ఋష్టి, పరశ్వధాలను కురిపించారు. (79)
సన్నివార్య స తాం ఘోరాం శరవృష్టిం సముత్థితామ్ ।
గదామాదాయ తరసా సన్నిపత్య మహాబలః ॥ 80
భీమః సప్త శతాన్ వీరాన్ అనయద్ యమసాదనమ్ ।
పునశ్చైవ ద్విసాహస్రాన్ కలింగానరిమర్దనః ॥ 81
ప్రాహిణోన్మృత్యులోకాయ తదుద్భుతమివాభవత్ ।
మీదకు వస్తున్న ఆ భీకర శరవృష్టిని నివారించి, మహాబలుడైన భీమసేనుడు గదను తీసికొని, ఏడువందల మంది వీరులను యమసదనానికి పంపాడు. ఆ అరిమర్దనుడు మరల రెండు వేలమంది కళింగులను మృత్యులోకానికి పంపాడు. అది అద్భుత మనిపించింది. (80, 81 1/2)
ఏవం స తాన్యనీకాని కలింగానాం పునః పునః ॥ 82
బిభేద సమరే తూర్ణం ప్రేక్ష్య భీష్మం మహారథమ్ ।
ఈ రీతిగా భీమసేనుడు మహారథుడైన భీష్మునివైపు చూస్తూనే, యుద్ధంలో కళింగ సేనలను మాటిమాటికీ వేగంగా చీల్చివేశాడు. (82 1/2)
హతారోహాశ్చ మాతంగాః పాండవేన కృతా రణే ॥ 83
విప్రజగ్మురనీకేషు మేఘా వాతహతా ఇవ ।
మృద్నంతః స్వాన్యనీకాని వినదంతః శరాతురాః ॥ 84
రణభూమిలో భీమసేనుడు ఏనుగుల నెక్కిన యోధులను చంపగా ఆ ఏనుగులు గాలికి చెదరిపోయిన మేఘాల వలె అటు, ఇటు పరుగెత్తుతున్నాయి. బాణాలదెబ్బలకు వ్యథచెందుతూ, తమసేనలనే త్రొక్కుతూ, పెద్దగా అరుస్తూ, తిరుగుతున్నాయి. (83,84)
తతో భీమో మహాబాహుః ఖడ్గహస్తో మహాభుజః ।
సంప్రహృష్టో మహాఘోషం శంఖం ప్రాధ్మాపయద్ బలీ ॥ 85
ఆ తరువాత మహాబాహువు, మహాభుజుడు, బలిష్ఠుడు అయిన భీముడు ఆనందంతో కత్తి చేతబట్టి, పెద్దగా శంఖాన్ని పూరించాడు. (85)
సర్వకాలింగసైన్యానాం మనాంసి సమకంపయత్ ।
మోహశ్చాపి కలింగానామ్ ఆవివేశ పరంతప ॥ 85
పరంతపా! ఆ శంఖనాదంతో కాళింగ సేనలందరి మనస్సులు కంపించాయి. మోహం కూడా వారిని ఆవేశించింది. (86)
ప్రాకంపంత చ సైన్యాని వాహనాని చ సర్వశః ।
భీమేన సమరే రాజన్ గజేంద్రేణేవ సర్వశః ॥ 87
మార్గాన్ బహూన్ విచరతా ధావతా చ తతస్తతః ।
ముహురుత్పతతా చైవ సమ్మోహః సమపద్యత ॥ 88
రాజా! రణభూమిలో గజరాజువలె వివిధ మార్గాలలో సంచరిస్తూ, అటూ ఇటూ పరుగెత్తుతూ ఉన్న భీమసేనుని చూసి, భయపడి, సమస్తసేనలూ, వాహనాలూ వణికిపోసాగాయి. మాటి మాటికి భీముడు ఎగిరిపడుతుంటే అందరూ సమ్మోహితులయ్యారు. (87,88)
భీమసేనభయత్రస్తం సైన్యం చ సమకంపత ।
క్షోభ్యమాణమసంబాధం గ్రాహేణేవ మహత్ సరః ॥ 89
పెద్ద సరస్సు మొసలిచే కలచివేయబడి క్షోభించినట్లు సైన్యమంతా భీమసేనుడు నిరాటంకంగా మథిస్తుంటే ఆ భయంతో కంపించింది. (89)
త్రాసితేషు చ సర్వేషు భీమేనాద్భుతకర్మణా ।
పునరావర్తమానేషు విద్రువత్సు చ సంఘశః ॥ 90
సర్వకాలింగయోధేషు పాండూనాం ధ్వజినీపతిః ।
అబ్రవీత్ స్వాన్యనీకాని యుధ్యధ్వమితి పార్షతః ॥ 91
అద్భుతకృత్య మాచరిస్తున్న భీమసేనుని వలన కాళింగుని సర్వసేనలూ బెదిరి పారిపోయి, మరల గుమిగూడి, మీదకు వస్తుంటే పాండవ సేనాపతి ధృష్టద్యుమ్నుడు "పోరాడండి" అంటూ తన సేనలను ఆదేశించాడు. (90,91)
సేనాపతివచః శ్రుత్వా శిఖండిప్రముఖా గణాః ।
భీమమేవాభ్యవర్తంత రథానీకైః ప్రహారిభిః ॥ 92
సేనాపతి మాట విని, శిఖండి మొదలయిన మహారథులు దెబ్బతీయటంలో నేర్పు గల రథసేనతో పాటు భీముని ఎదిరించాడు. (92)
ధర్మరాజశ్చ తాన్ సర్వాన్ ఉపజగ్రాహ పాండవః ।
మహతా మేఘవర్ణేన నాగానీకేన పృష్ఠతః ॥ 93
పాండు కుమారుడైన యుధిష్ఠిరుడు మేఘవర్ణంతో నున్న పెద్ద గజసేనను తొడ్కొని, వెనుక నుండి వచ్చి, తన రథసేనకు అండగా నిలిచాడు. (93)
ఏవం సన్నోద్య సర్వాణి స్వాన్యనీకాని పార్షతః ।
భీమసేనస్య జగ్రాహ పార్ ష్ణిం సత్పురుషైర్వృతః ॥ 94
ఈ రీతిగా ధృష్టద్యుమ్నుడు తన సేనల నన్నింటినీ యుద్ధానికి పురికొలిపి, మేటి యోధులతో కలిసి, భీమసేనుని వెనుక భాగాన్ని రక్షించటాన్ని తాను స్వీకరించాడు. (94)
న హి పంచాలరాజస్య లోకే కశ్చన విద్యతే ।
భీమసాత్యకయోరన్యః ప్రాణేభ్యః ప్రియకృత్తమః ॥ 95
పాంచాల రాజుకు భీమసాత్యకులకన్న, ప్రాణాల కన్న ఇష్టమైన వారు లోకంలో మరెవ్వరూ లేరు. (95)
సోపశ్యచ్చ కలింగేషు చరంతమరిసూదనః ।
భీమసేనం మహాబాహుం పార్షతః పరవీరహా ॥ 96
అరిసూదనుడు, పరవీరహంత అయిన ధృష్టద్యుమ్నుడు కళింగసేనలో చెలరేగుతున్న మహాబాహువైన భీమసేనుని చూశాడు. (96)
ననర్ద బహుధా రాజన్ హృష్టశ్చాసీత్ పరంతపః ।
శంఖం దధ్మౌ చ సమరే సింహనాదం ననాద చ ॥ 97
రాజా! భీమసేనుని చూసి పరంతపుడైన ధృష్టద్యుమ్నుడు ఆనందించి, పదే పదే గర్జించాడు. రణభూమిలో శంఖాన్ని పూరించాడు. సింహనాదాలు చేశాడు. (97)
స చ పారావతాశ్వస్య రథే హేమపరిష్కృతే ।
కోవిదారధ్వజం దృష్ట్వా భీమసేనః సమాశ్వసత్ ॥ 98
భీమసేనుడు ధృష్టద్యుమ్నుని రథాన్ని చూసి, ఊరట చెందాడు. ఆ రథం స్వర్ణభూషితం. దాని గుర్రాలు పావురాల వన్నెగలవి. ఆ ధ్వజం మీద కోవిదారవృక్షం గుర్తుగా ఉంది. (98)
ధృష్టద్యుమ్నస్తు తం దృష్ట్వా కలింగైః సమభిద్రుతమ్ ।
భీమసేనమయేయాత్మా త్రాణాయాజౌ సమభ్యయాత్ ॥ 99
కళింగసేనలు దాడిచేసిన భీముని చూసి, అమేయబలుడైన ధృష్టద్యుమ్నుడు భీమసేన రక్షణకై యుద్ధంలో భీమసేనుని సమీపించాడు. (99)
తౌ దూరాత్ సాత్యకిం దృష్ట్వా ధృష్టద్యుమ్నవృకోదరౌ ।
కలింగాన్ సమరే వీరౌ యోధయేతాం మనస్వినౌ ॥ 100
వీరులు, మనస్వినులు ఐన ధృష్టద్యుమ్న భీమసేనులు దూరం నుండి సాత్యకి కూడా తమకు సాయంగా రావటాన్ని గమనించి, ఉత్సాహంగా కళింగులతో యుద్ధం చేయసాగారు. (100)
స తత్ర గత్వా శైనేయః జవేన జయతాం వరః ।
పార్థపార్షతయోః పార్ ష్ణిం జగ్రాహ పురుషర్షభః ॥ 101
జయశీలులలో శ్రేష్ఠుడు, పురుషోత్తముడు, అయిన సాత్యకి వేగంగా అక్కడకు వచ్చి, భీమసేన ధృష్టద్యుమ్నుల వెనుక అండగా నిలిచాడు. (101)
స కృత్వా దారుణం కర్మ ప్రగృహీతశరాసనః ।
ఆస్థితో రౌద్రమాత్మానం కలింగానన్వవైక్షత ॥ 102
ఆ సాత్యకి ధనుస్సు చేతబట్టి, భీకర పరాక్రమాన్ని ప్రకటించి, రౌద్రరూపాన్ని ధరించి, కళింగ సేనవైపు చూశాడు. (102)
కలింగప్రభావం చైవ మాంసశోణితకర్దమామ్ ।
రుధిరస్యందినీం తత్ర భీమః ప్రావర్తయన్నదీమ్ ॥ 103
భీమసేనుడు అక్కడొక నదిని ప్రవహింపజేశాడు. దాని జన్మస్థానం కళింగసేన. మాంసమూ, నెత్తురూ దానిలోని బురద. నెత్తుటిధారయే అక్కడి ప్రవాహం. (103)
అంతరేణ కలింగానాం పాండవానాం చ వాహినీమ్ ।
తాం సంతతార దుస్తారాం భీమసేనో మహాబలః ॥ 104
కళింగసేనలకు, పాండవసేనలకు మధ్య ప్రవహిస్తున్న ఆ దుస్తర రక్తనదిని మహాబలుడైన భీమసేనుడు దాట గలిగాడు. (104)
భీమసేనం తథా దృష్ట్వా ప్రాక్రోశంస్తావకాః నృప ।
కాలోఽయం భీమరూపేణ కలింగైః సహ యుధ్యతే ॥ 105
రాజా! ఆ స్థితిలో నున్న భీమసేనుని చూసి నీవారు "కాలుడే భీమరూపాన్ని ధరించి కళింగ సేనతో యుద్ధం చేస్తున్నా"డని ఆక్రోశించారు. (105)
తతః శాంతనవో భీష్మః శ్రుత్వా తం నినదం రణే ।
అభ్యయాత్ త్వరిత్ భీమం వ్యూఢానీకః సమంతతః ॥ 106
ఆ పై శంతనుసుతుడైన భీష్ముడు రణభూమిలోని ఆ కోలాహలాన్ని విని, తనసేనను అన్నివైపులా వ్యూహాత్మకంగా నిలుపుకొని, వెంటనే భీముని మీదకు వచ్చాడు. (106)
తం సాత్యకిర్భీమసేనః ధృష్టద్యుమ్నశ్చ పార్షతః ।
అభ్యద్రవంత భీష్మస్య రథం హేమపరిష్కృతమ్ ॥ 107
సాత్యకి, భీమసేనుడు, ద్రుపదసుతుడు ధృష్టద్యుమ్నుడు సువర్ణాలంకారాలు గల ఆ భీష్మరథంపై దాడి చేశారు. (107)
పరివార్య తు తే సర్వే గాంగేయం తరసా రణే ।
త్రిభిస్త్రిభిః శరైర్ఘోరైః భీష్మమానర్చ్ఛురోజసా ॥ 108
వారందరూ యుద్ధంలో వేగంగా భీష్ముని చుట్టుముట్టి, తమ పరాక్రమంతో మూడు మూడు భీకర బాణాలను ప్రయోగించి, భీష్ముని గాయపరిచారు. (18)
ప్రత్యవిధ్యత తాన్ సర్వాన్ పితా దేవవ్రతస్తవ ।
యతమానాన్ మహేష్వాసాన్ త్రిభిస్త్రిభిరజిహ్మగైః ॥ 109
నీ తండ్రి - భీష్ముడు యుద్ధ సన్నద్ధులైన ఆ మేటి విలుకాండ్ర నందరినీ సూటిగా వెళ్ళే మూడు మూడు బాణాలతో కొట్టి, బదులు తీర్చుకొన్నాడు. (109)
తతః శరసహస్రేణ సన్నివార్య మహారథాన్ ।
హయాన్ కాంచనసన్నాహాన్ భీమస్య న్యహనచ్ఛరైః ॥ 110
ఆ తరువాత వేలబాణాలతో ఆ మహారథులను నిలువరించి, బంగారు తొడుగులు గల భీమసేనుని గుర్రాలను బాణాలతో చంపివేశాడు. (110)
హతాశ్వే స రథే తిష్ఠన్ భీమసేనః ప్రతాపవాన్ ।
శక్తిం చిక్షేప తరసా గాంగేయస్య రథం ప్రతి ॥ 111
ప్రతాపవంతుడైన భీమసేనుడు గుర్రాలు మరణించిన ఆ రథం మీదనే నిలిచి, ఒక శక్తిని భీష్ముని రథం మీదకు వేగంగా విసిరాడు. (111)
అప్రాప్తామథ తాం శక్తిం పితా దేవవ్రతస్తత ।
త్రిధా చిచ్ఛేద సమరే సా పృథివ్యామశీర్యత ॥ 112
శక్తి తనను సమీపించకముందే నీ తండ్రి దేవవ్రతుడు యుద్ధంలో దానిని మూడు ముక్కలుగా ఖండించాడు. (112)
తతః శైక్యాయసీం గుర్వీం ప్రగృహ్య బలవాన్ గదామ్ ।
భీమసేనస్తతస్తూర్ణం పుప్లువే మనుజర్షభః ॥ 113
మనుజశ్రేష్ఠా! ఆ పై బలవంతుడైన భీమసేనుడు ఉక్కుతో చేసిన పెద్ద గదను చేతబట్టి, వెంటనే ఆ రథం మీద నుండి దూకాడు. (113)
సాత్యకోఽపి తతస్తూర్ణం భీమస్య ప్రియకామ్యయా ।
గాంగేయసారథిం తూర్ణం పాతయామాస సాయకైః ॥ 114
సాత్యకి కూడా భీమునకు ప్రియం చేయాలన్న కోరికతో భీష్ముని సారథిని బాణాలతో పడగొట్టాడు. (114)
భీష్మస్తు నిహతే తస్మిన్ సారథౌ రథినాం వరః ।
వాతాయమానైసైరశ్వైః అపనీతో రణాజిరాత్ ॥ 115
సారథి మరణించగానే, రథిశ్రేష్ఠుడైన భీష్ముని వాయువేగంగా చలించే గుర్రాలు రణభూమి నుండి బయటకు కొనిపోయాయి. (115)
భీమసేనస్తతో రాజన్ అపయాతే మహావ్రతే ।
ప్రజజ్వాల యథా వహ్నిః దహన్ కక్షమివేధితః ॥ 116
అపై మహావ్రతుడైన భీష్ముడు తొలగిపోగానే భీముడు చెత్తాచెదారాన్ని దహిస్తూ మందే అగ్నిలా ప్రజ్వరిల్లాడు. (116)
స హత్వా సర్వకాలింగాన్ సేనామధ్యే వ్యతిష్ఠత ।
నైనమభ్యుత్సహన్ కేచిత్ తావకా భరతర్షభ ॥ 117
భరతర్షభా! భీమసేనుడు కాళింగుల నందరినీ హింసించి, సేనమధ్యలో నిలిచాడు. అయితే నీ వారెవ్వరూ ఆయనను సమీపించే సాహసం చేయలేదు. (117).
ధృష్టద్యుమ్నస్తమారోప్య స్వరథే రథినాం వరః ।
పశ్యతాం సర్వసైన్యానామ్ అపోవాహ యశస్వినమ్ ॥ 118
రథిశ్రేష్ఠుడైన ధృష్టద్యుమ్నుడు ఆ కీర్తిశాలిని తన రథంపై ఎక్కించుకొని సర్వసేనలూ చూస్తుండగానే తన సేనలోనికి కొనిపోయాడు. (118)
సంపోజ్యమానః పాంచాల్యైః మత్స్యైశ్చ భరతర్షభ ।
ధృష్టద్యుమ్నం పరిష్వజ్య సమేయాదథ సాత్యకిమ్ ॥ 119
భరతర్షభా! పాంచాలుర చేత, మత్స్యదేశీయుల చేత పూజింపబడుతూ భీమసేనుడు ధృష్టద్యుమ్నుని కౌగిలించి, సాత్యకిని సమీపించాడు. (119)
అథాబ్రవీద్ భీమసేనం సాత్యకిః సత్యవిక్రమః ।
ప్రహర్షయన్ యదువ్యాఘ్రః ధృష్టద్యుమ్నస్య పశ్యతః ॥ 120
అప్పుడు యదుశ్రేష్ఠుడు, సత్యపరాక్రముడు ఐన సాత్యకి ధృష్టద్యుమ్నుని ఎదుట భీమసేనుని ఉల్లాసింపజేస్తూ ఇలా అన్నాడు. (120)
దిష్ట్వా కలింగరాజశ్చ రాజపుత్రశ్చ కేతుమాన్ ।
శక్రదేవశ్చ కాలింగః కలింగాశ్చ మృధే హతాః ॥ 121
"ఇది గొప్ప విషయం. కళింగరాజు భానుమంతుడు, రాజకుమారుడు కేతుమంతుడు, కళింగ వీరుడు శక్రదేవుడు, ఇతర కళింగ సైనికులు యుద్ధంలో మరణించారు. (121)
స్వబాహుబలవీర్యేణ నాగాశ్వరథసంకులః ।
మహాపురుషభూయిష్ఠః ధీరయోధనిషేవితః ॥ 122
మహావ్యూహః కలింగానామ్ ఏకేన మృదితస్త్వయా ।
ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో నిండి, మహాపురుషులనదగ్గవారు మెండుగా ఉండి, ధీరయోధులచే సేవింపబడుతూ మహావ్యూహాత్మకంగా ఉన్న కళింగ సేనను బలపరాక్రమంతో నీవు ఒక్కడివే మట్టిలో గలిపావు." (122)
ఏవముక్త్వా శినేర్నప్తా దీర్ఘబాహురరిందమ ॥ 123
రథాద్ రథమభిద్రుత్య పర్యష్వజత పాండవమ్ ।
అరిందమా! ఆ రీతిగా పలికి, దీర్ఘబాహువైన సాత్యకి తన రథం మీద నుండి భీముని రథం మీదకు దూకి, భీముని కౌగిలించాడు. (123)
తతః స్వరథమాస్థాయ పునరేవ మహారథః ।
తావకానవధీత్ క్రుద్ధః భీమస్య బలమాదధత్ ॥ 124
మరల తన రథం మీదకు వచ్చి, ఆ మహారథుడు - సాత్యకి భీమసేనుని బలాన్ని పెంచుతూ, కోపంగా నీ వారిని చంపనారంభించాడు. (124)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ద్వితీయయుద్ధదివసే కలింగరాజవధే చతుష్పంచాశత్తమోఽధ్యాయః ॥ 54 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున ద్వితీయయుద్ధదినమున కళింగరాజవధ అను ఏబది నాలుగవ అధ్యాయము. (54)