51. ఏబది యొకటవ అధ్యాయము
కౌరవ వ్యూహరచన.
సంజయ ఉవాచ
క్రౌంచం దృష్ట్వా తతో వ్యూహమ్ అభేద్యం తనయస్తవ ।
రక్ష్యమాణం మహాఘోరం పార్థేనామితతేజసా ॥ 1
ఆచార్యముపసంగమ్య కృపం శల్యం చ పార్థివ ।
సౌమదత్తిం వికర్ణం చ సోఽశ్వత్థామానమేవ చ ॥ 2
దుఃశాసనాదీన్ భ్రాతౄంశ్చ సర్వానేవ చ భారత ।
అన్యాంశ్చ సుబహూన్ శూరాన్ యుద్ధాయ సముపాగతాన్ ॥ 3
ప్రాహేదం వచనం కాలే హర్షయంస్తనయస్తవ ।
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ॥ 4
సంజయుడిలా చెప్తున్నాడు.
'రాజా! మహాతేజస్వి అయిన పార్థునిచే రక్షింపబడుతూ, అభేద్యమై భయంకరంగా ఉన్న క్రౌంచవ్యూహాన్ని చూసి, నీ కొడుకు దుర్యోధనుడు ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి, కృపుడు, శల్యుడు, సౌమదత్తి, వికర్ణుడు, అశ్వత్థామ, దుశ్శాసనాది సోదరులు, యుద్ధానికి వచ్చిన ఎందరో ఇతర శూరులు - వీరందరి సమక్షంలో వారినందరినీ ఉల్లాస పరుస్తూ ఇలా అన్నాడు - "మీరంతా వివిధాయుధాలు వాడటంలో నిపుణులు, యుద్ధ విశారదులు. (1-4)
ఏకైకశః సమర్థా హి యూయం సర్వే మహారథాః ।
పాండుపుత్రాన్ రణే హంతుం ససైన్యాన్ కిము సంహతాః ॥ 5
మహారథులైన మీరంతా ఒక్కొక్కరుగా అయినా సేనలతో సహా పాండవులను, యుద్ధంలో చంపగలవారు. అందరూ కలిస్తే ఇక చెప్పవలసిన దేముంది? (5)
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ ।
పర్యాప్తమిదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥ 6
సంస్థానాః శూరసేనాశ్చ వేత్రికాః కుకురాస్తథా ।
ఆరోచకాస్త్రిగర్తాశ్చ మద్రకా యవనాస్తథా ॥ 7
శత్రుంజయేన సహితాః తథా దుఃశాసనేన చ ।
వికర్ణేన చ వీరేణ తథా నందోపనందకైః ॥ 8
చిత్రసేనేన సహితాః సహితాః పారిభద్రకైః ।
భీష్మమేవాభిరక్షంతు సహసైన్యపురస్కృతాః ॥ 9
భీష్మరక్షితమైన మనసేన జయింపనలవి కానిది. భీమరక్షితమైన పాండవసేనను సులువుగా జయించవచ్చు. కాబట్టి సంస్థానులు, శూరసేనులు, వేత్రికులు, కుకురులు, ఆరోచకులు, త్రిగర్తులు, మద్రకులు, యవనులు మీరంతా శత్రుంజయుడు, దుశ్శాసనుడు వీరుడైన వికర్ణుడు, నందుడు, ఉపనందుడు, చిత్రసేనుడు, పారిభద్రకులతో కలిసి, మీ మీ సేనలకు ముందు నిలిచి భీష్ముని రక్షించండి. (6-9)
సంజయ ఉవాచ
(దుర్యోధనవచః శ్రుత్వా సర్వ ఏవ మహారథాః ।
తథేత్యేనం నృపా ఊచుః తదా ద్రోణపురోగమాః ॥)
సంజయుడు చెప్తున్నాడు.
దుర్యోధనుని మాట విని, ద్రోణాది మహారథులు, ఇతర రాజులు అందరూ 'అలాగే' అని దుర్యోధనుని మాటను అంగీకరించారు.
తతో భీష్మశ్చ ద్రోణశ్చ తవ పుత్రాశ్చ మారిష ।
అవ్యూహంత మహావ్యూహం పాండూనాం ప్రతిబాధనమ్ ॥ 10
మారిషా! అప్పుడు, భీష్ముడు, ద్రోణుడు, నీ కొడుకులు - అందరూ కలిసి పాండవసేనలను బాధించగల మహావ్యూహాన్ని నిర్మించారు. (10)
భీష్మః సైన్యేన మహతా సమంతాత్ పరివారితః ।
యయౌ ప్రకర్షన్ మహతీం వాహినీం సురరాడివ ॥ 11
పెద్ద సేన తన చుట్టూ నిలవగా భీష్ముడు దేవేంద్రుని వలె మహాసేనను తోడ్కొని, ముందుకు నడిచాడు. (11)
తమన్వయాన్మహేష్వాసః భారద్వాజః ప్రతాపవాన్ ।
కుంతలైశ్చ దశార్ణైశ్చ మాగధైశ్చ విశాంపతే ॥ 12
విదర్భైర్మేకలైశ్చైవ కర్ణప్రావరణైరపి ।
సహితాః సర్వసైన్యేన భీష్మమాహవశోభినమ్ ॥ 13
గాంధారాః సింధుసౌవీరాః శిబయోఽథ వసాతయః ।
మేటివిలుకాడు, ప్రతాపవంతుడు అయిన ద్రోణాచార్యుడు భీష్ముని అనుసరించాడు. రాజా! కుంతలులు దశార్ణులు, మాగధులు, విదర్భులు, మేకలులు, కర్ణప్రావరణులు - ఈ దేశాల సైనికులంతా కలిసి గాంధార సింధు, సౌవీర, శిబి, వసాతి దేశాల వీరులు యుద్ధానికే వన్నె తెచ్చే భీష్మునికి రక్షగా నిలిచారు. (12, 13 1/2)
శకునిశ్చ స్వసైన్యేన భారద్వాజమపాలయత్ ॥ 14
తతో దుర్యోధనో రాజా సహితః సర్వసోదరైః ।
అశ్వాతకైర్వికర్ణైశ్చ తథా చాంబష్ఠకోసలైః ॥ 15
దరదైశ్చ శకైశ్చైవ తథా క్షుద్రకమాలవైః ।
అభ్యరక్షత సంహృష్టః సౌబలేయస్య వాహినీమ్ ॥ 16
శకుని తనసేనతో ద్రోణాచార్యునకు రక్షగా నిలిచాడు. దుర్యోధనుడు సర్వసోదరులతో, అశ్వాతక, వికర్ణ, అంబష్ఠ, కోసల, దరద, శక, క్షుద్రక, మాలవ దేశయోధులతో కలిసి ఆనందంగా శకుని సేనను రక్షింపసాగాడు. (14-16)
భూరిశ్రవాః శలః శల్యః భగదత్తశ్చ మారిషః ।
విందానువిందావావంత్యౌ వామం పార్శ్వమపాలయన్ ॥ 17
సౌమదత్తిః సుశర్మా చ కాంబోజశ్చ సుదక్దిణః ।
శ్రుతాయుశ్చాచ్యుతాయుశ్చ దక్షిణం పక్షమాస్థితాః ॥ 18
భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, మాననీయుడు భగదత్తుడు, అవంతి రాజులు విందానువిందులు ఎడమ వైపు రక్షకులయ్యారు. సౌమదత్తి, సుశర్మ, కాంబోజుడు, సుదక్షిణుడు, శ్రుతాయువు, అచ్యుతాయువు కుడి ప్రక్క రక్షణగా నిలిచారు. (17,18)
అశ్వత్థామా కృపశ్చైవ కృతవర్మా చ సాత్వతః ।
మహత్యా సేనయా సార్థం సేనాపృష్ఠే వ్యవస్థితాః ॥ 19
అశ్వత్థామ, కృపుడు, సాత్వతవంశీయుడు కృతవర్మ గొప్ప సేనతో కౌరవసేనకు వెనుకవైపు బాసటగా నిలిచారు. (19)
పృష్ఠగోపాస్తు తస్యాసన్ నానాదేశ్యా జనేశ్వరాః ।
కేతుమాన్ వసుదానశ్చ పుత్రః కాశ్యస్య చాభిభూః ॥ 20
కేతుమంతుడు, వసుదానుడు, కాశీరాజు కుమారుడు అభిభువు, అనేక దేశాలకు సంబంధించిన ఇతర రాజులు సేనకు వెనుక పుష్టి కల్పించారు. (20)
తతస్తే తావకాః సర్వే హృష్టా యుద్ధాయ భారత ।
దధ్ముః శంఖాన్ ముదా యుక్తాః సింహనాదాంస్తథోన్నదన్ ॥ 21
భారతా! ఆ తరువాత నీవారంతా ఉల్లాసంగా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆనందంగా శంఖాల నూది, సింహనాదాలు చేయనారంభించారు. (21)
తేషాం శ్రుత్వా తు హృష్టానాం వృద్ధః కురుపితామహః ।
సింహనాదం వినద్యోచ్ఛైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥ 22
వారి హర్షనాదాలను విని కురుపితామహుడు, వృద్ధుడు, ప్రతాపవంతుడు అయిన భీష్ముడు పెద్దగా సింహనాదం చేసి, శంఖాన్ని పూరించాడు. (22)
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవా వివిధాః పరే ।
ఆనకాశ్చాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ॥ 23
ఆ తరువాత శంభాలు, భేరులు, వివిధ పణవాలు, ఆనకం మొదలయిన ఇతర వాద్యాలు మ్రోగాయి. ఆ శబ్దం భయంకరంగా ఉంది. (23)
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
ప్రదధ్మతుః శంఖవరౌ హేమరత్నపరిష్కృతౌ ॥ 23
ఆ పై తెల్లగుర్రాలు పూన్చిన మహారథాన్ని ఎక్కి, స్వర్ణరత్నాలతో అలంకరింపబడిన గొప్ప శంఖాలను (కృష్ణార్జునులు) ఊదారు. (24)
పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ॥ 2
కృష్ణుడు పాంచజన్యాన్ని, ధనంజయుడు దేవదత్తాన్ని, ఘోర కర్మలు చేయగల భీమసేనుడు పౌండ్ర మనే మహాశంఖాన్ని పూరించారు. (25)
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 26
కౌంతేయుడైన యుధిష్ఠిరుడు అనంత విజయాన్ని, నకుల సహదేవులు సుఘోష, మణిపుష్పకాలను (పూరించారు). (26)
కాశిరాజశ్చ శైబశ్చ శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ మహారథః ॥ 27
పాంచాల్యాశ్చ మహేష్వాసాః ద్రౌపద్యాః పంచ చాత్మజాః ।
సర్వే దధ్ముర్మహాశంఖాన్ సింహనాదాంశ్చ నేదిరే ॥ 28
కాశిరాజు, శైబ్యుడు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మహారథుడైన సాత్యకి, పాంచాల యోధులు, మేటివిలుకాండ్రయిన ద్రౌపది కొడుకులు అయిదుగురు, అందరూ గొప్ప శంఖాల నూది సింహనాదాలు చేశారు. (27,28)
స ఘోషః సుమహాంస్తత్ర వీరైస్తైః సముదీరితః ।
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయత్ ॥ 29
ఆ వీరులంతా కలిసి చేసిన ఆ మహాభీకర ఘోష భూమ్యాకాశాలను ప్రతిధ్వనింపజేసింది. (29)
ఏవమేతే మహారాజ ప్రహృష్టాః కురుపాండవాః ।
పునర్యుద్ధాయ సంజగ్ముః తాపయానాః పరస్పరమ్ ॥ 30
మహారాజా! ఈ రీతిగా కౌరవపాండవులు ఆనందంగా ఒకరికొకరు సంతాపాన్ని కలిగిస్తూ, మరల యుద్ధానికి సిద్ధమయ్యారు. (30)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి కౌరవవ్యూహరచనాయామేకపంచాశత్తమోఽధ్యాయః ॥ 51 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భీష్మవధ పర్వమను ఉపపర్వమున కౌరవవ్యూహరచనమను ఏబది యొకటవ అధ్యాయము. (51)
(దాక్షిణాత్య అధికపాఠం 1 శ్లోకంతో కలిపి 31 శ్లోకాలు)