193. నూట తొంబది మూడవ అధ్యయము
దుర్యోధనునకు భీష్మాదులు తమ తమ శక్తులను ఎరిగించుట.
సంజయ ఉవాచ
ప్రభాతాయాం తు శర్వర్యాం పునరేవ సుతస్తవ।
మధ్యే సర్వస్య సైన్యస్య పితామహమపృచ్ఛత॥ 1
సంజయుడు చెప్తున్నాడు. రాత్రి గడిచి తెల్లవారిన తరువాత తిరిగి నీ కొడుకు సమస్త సైన్యమధ్యంలో భీష్ముడిని ఇలా అడిగాడు. (1)
పాండవేయస్య గాంగేయ యదేతత్ సైన్యముద్యతమ్।
ప్రభూతనరనాగాశ్వం మహారథసమాకులమ్॥ 2
భీమార్జునప్రభృతిభిః మహేష్వాసైర్మహాబలైః।
లోకపాలసమైర్గుప్తం ధృష్టద్యుమ్నపురోగమైః॥ 3
అప్రధృష్యమనావార్యమ్ ఉద్ధూతమివ సాగరమ్।
సేనాసాగరమక్షోభ్యమ్ అపి దేవైర్మహాహవే॥ 4
గాంగేయా! యుద్ధానికి సిద్ధంగా ఉన్న పాండవుల యొక్క ఈ సైన్యంలో గొప్ప కాల్బలం, గజసైన్యం, అశ్వసైన్యం ఉంది. గొప్పరథాలతో నిండి ఉంది. మహాబలవంతులైన లోకపాలురతో సమానమైన భీమార్జునులు మొదలైన విలుకాండ్ర చేత ముందునడిచే ధృష్టద్యుమ్నుని చేత రక్షించబడుతోంది. పోటెత్తిన సముద్రంలా అది సమీపించటానికి గాని వారించడానికి గాని సాధ్యం కాదు. మహాయుద్ధంలో దేవతలు కూడా ఈ సేనాసాగరాన్ని కలతపెట్టలేరు. (2,3,4)
కేన కాలేన గాంగేయ క్షపయేథా మహాద్యుతే।
ఆచార్యో వా మహేష్వాసః కృపో వా సుమహాబలః॥ 5
కర్ణో వా సమరశ్లాఘీ ద్రౌణిర్వా ద్విజసత్తమః।
దివ్యాస్త్రవిదుషః సర్వే భవంతో హి బలే మమ॥ 6
మహాతేజస్వీ! గంగానందనా! ఎంత కాలంలో ఈ సైన్యాన్ని సంహరించగలవు. గొప్ప విలుకాడైన ఆచార్య ద్రోణుడు గాని బలవంతుడైన కృపాచార్యుడు గాని, యుద్ధాన్ని కొనియాడుతూ ఉండే కర్ణుడు గాని, బ్రాహ్మణోత్తముడైన అశ్వత్థామ గాని ఎంతకాలంలో సంహరించగలరు? మీరందరూ నా సైన్యంలో దివ్యాస్త్రకోవిదులు. (5,6)
ఏతదిచ్ఛామ్యహం జ్ఞాతుం పరం కౌతూహలం హి మే।
హృది నిత్యం మహాబాహో వక్తుమర్హసి తన్మమ॥ 7
మహాబాహూ! ఇది తెలుసుకోవాలని కోరికగా ఉంది. నిత్యమూ నా మనసులో ఉండే గొప్ప కుతూహలం ఇది. కాబట్టి నాకు నీవు చెప్పాలి. (7)
భీష్మ ఉవాచ
అనురూపం కురుశ్రేష్ఠ త్వయ్యేతత్ పృథివీపతే।
బలాబలమమిత్రాణాం తేషాం యదిహ పృచ్ఛసి॥ 8
భీష్ముడు చెప్తున్నాడు - కురుశ్రేష్ఠా పృథివీపతీ! శత్రువుల బలాబలాలను అడిగావు. ఇది నీకు తగినదే. (8)
శృణు రాజన్ మమ రణే యా శక్తిః పరమా భవేత్।
శస్త్రవీర్యం రణే యచ్చ భుజయోశ్చ మహాభుజ॥ 9
మహాభుజా! రాజా! నాకు యుద్ధంలో ఉండే అధికమైన శక్తి, శస్త్రపరాక్రమం, భుజబలం అన్నీ చెప్తాను విను. (9)
ఆర్జవేనైవ యుద్ధేన యోద్ధవ్య ఇతరో జనః।
మాయాయుద్ధేన మాయావీ ఇత్యేతద్ ధర్మనిశ్చయః॥ 10
సాధారణ జనులతో సరళంగా యుద్ధం చేయాలి. మాయావులతో మాయాయుద్ధం చేయాలి. ఇది ధర్మశాస్త్రాలు నిశ్చయించినది. (10)
హన్యామహం మహాభాగ పాండవానామనీకినీమ్।
దివసే దివసే కృత్వా భాగం ప్రాగాహ్నికం మమ॥ 11
మహాభాగా! ప్రతిదినం పాండవసైన్యాన్ని భాగాలుగా చేసి పగటి పూర్వభాగంలోనే చంపుతాను. (11)
యోధానాం దశసాహస్రం కృత్వా భాగం మహాద్యుతే।
సహస్రం రథినామేకమ్ ఏష భాగో మతో మమ॥ 12
మహాతేజస్వీ! పదివేల యోధులు, వేయిరథికులు ప్రతిదినం నా పాలికి ఒక భాగం అనుకొంటున్నాను. (12)
అనేనాహం విధానేన సంనద్ధః సతతోత్థితః।
క్షపయేయం మహత్ సైన్యం కాలేనానేన భారత॥ 13
భారతా! ఈ విధానం అవలంబించి సన్నద్ధుడనౌ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండి ఆ మహాసైన్యాన్ని అంత కాలంలోనే సంహరించగలను. (13)
ముంచేయం యది వాస్త్రాణి మహాంతి సమరే స్థితః।
శతసాహస్రఘాతీని హన్యాం మాసేన భారత॥ 14
భారతా! నేను యుద్ధంలో నిలబడి లక్షమందిని చంపగల మహాస్త్రాలను వేస్తే ఒక నెలలో పాండ సైన్యాన్ని చంపగలను. (14)
సంజయ ఉవాచ
శ్రుత్వా భీష్మస్య తద్వాక్యం రాజా దుర్యోధనస్తతః।
పర్యపృచ్ఛత రాజేంద్ర ద్రోణమంగిరసాం వరమ్॥ 15
ఆచార్య కేన కాలేన పాండుపుత్రస్య సైనికాన్।
నిహన్యా ఇతి తం ద్రోణః ప్రత్యువాచ హసన్నివ॥ 16
సంజయుడు చెప్తున్నాడు - రాజేంద్రా! భీష్ముని ఆ మాటలు విని రాజైన దుర్యోధనుడు తరువాత అంగిరస వంశంలో శ్రేష్ఠుడైన ద్రోణుని అడిగాడు - "ఆచార్యా! పాండుపుత్రుని సైనికులను ఎంత కాలంలో చంపగలరు?" అని, ద్రోణుడు నవ్వుతూ ఇలా బదులు చెప్పాడు. (15-16)
స్థవిరోఽస్మి మహాబాహో మందప్రాణవిచేష్టితః।
శస్త్రాగ్నినా నిర్దహేయం పాండవానామనీకినీమ్॥ 17
మహాబాహూ! నేను వృద్ధుడినయ్యాను. ప్రాణశక్తి చురుకుతనం తగ్గిపోయాయి. అయినా పాండవసైన్యాన్ని నా శస్త్రాగ్ని చేత దహించివేయగలను. (17)
యథా భీష్మః శాంతనవః మాసేనేతి మతిర్మమ।
ఏషా మే పరమా శక్తిః ఏతన్మే పరమం బలమ్॥ 18
శాంతనవుడైన భీష్మునివలెనే నాకూ నెల రోజులు పడుతుందని నా ఉద్దేశ్యం. ఇది నాకున్న శక్తి. ఇది నాకున్న పరమబలం. (18)
ద్వాభ్యామేవ తు మాసాభ్యాం కృపః శారద్వతోఽబ్రవీత్।
ద్రౌణిస్తు దశరాత్రేణ ప్రతిజజ్ఞే బలక్షయమ్॥ 19
శారద్వతుడైన కృపుడు రెండు నెలలని చెప్పాడు. ద్రోణసుతుడు మాత్రం పదిరోజుల్లోనే సేనాసంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. (19)
కర్ణస్తు పంచరాత్రేణ ప్రతిజజ్ఞే మహాస్త్రవిత్।
తచ్ఛ్రుత్వా సూతపుత్రస్య వాక్యం సాగరగాసుతః॥ 20
జహాస సస్వనం హాసం వాక్యం చేదమువాచ హ।
న హి యావద్ రణే పార్థం బాణశంఖధనుర్ధరమ్॥ 21
వాసుదేవసమాయుక్తం రథేనాయాంతమాహవే।
సమాగచ్ఛసి రాధేయ తేనైవమభిమన్యసే।
శక్యమేవం చ భూయశ్చ త్వయా వక్తుం యథేష్టతః॥ 22
మహాస్త్రవిదుడైన కర్ణుడైతే ఐదు రోజులే అని ప్రతిజ్ఞ చేశాడు. సూతపుత్రుని ఆ మాట విని గంగాసుతుడైన భీష్ముడు పెద్దగా బిగ్గరగా నవ్వాడు. ఇలా కూడా అన్నాడు. "రాధేయా! యుద్ధభూమిలో బాణాలు, శంఖం, ధనుస్సు ధరించి, వాసుదేవునితో కూడి రథం మీద వచ్చే పార్థుడిని కలుసుకోనంతవరకు ఇలాగే గర్వపడుతూ ఉంటావు. ఇష్టానుసారంగా పెక్కుమాటలు ఇలా మాట్లాడడానికీ వీలవుతుంది." (20-22)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి భీష్మాదిశక్తికథనే త్రినవత్యధికశతతమోఽధ్యాయః॥ 193 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున
భీష్మాదులు తమ తమ శక్తులను వివరించుట అను నూటతొంబదిమూడవ అధ్యాయము (193)