183. నూట యెనుబదిమూడవ అధ్యాయము

భీష్మునకు వసువులు ప్రస్వాపనాస్త్రమిచ్చుట.

భీష్మ ఉవాచ
తతోఽహం నిశి రాజేంద్ర ప్రణమ్య శిరసా తదా।
బ్రాహ్మణానాం పితౄణాం చ దేవతానాం చ సర్వశః॥ 1
నక్తంచరాణాం భూతానాం రాజన్యానాం విశాంపతే।
శయనం ప్రాప్య రహితే మనసా సమచింతయమ్॥ 2
భీష్ముడు చెప్తున్నాడు. రాజేంద్రా! తరువాత నేను ఆ రాత్రిపూట బ్రాహ్మణులకు, పితరులకు, దేవతలకు, నిశాచరులకు, భూతాలకు, రాజపుంగవులకు అందరికీ శిరసు వంచి నమస్కరించి, ఏకాంతంగా శయ్యను చేరి మనసులో ఇలా అనుకోసాగాను. (1,2)
జామదగ్న్యేన మే యుద్ధమ్ ఇదం పరమదారుణమ్।
అహాని చ బహూన్యద్య వర్తతే సుమహాత్యయమ్॥ 3
పరశురాముడు నాకు మధ్య జరిగే ఈ యుద్ధం మిక్కిలి దారుణంగా గొప్ప అనిష్టాన్ని కలిగించేదిగా ఉంది. చాలా దినాలు గడిచిపోయాయి ఇప్పటికి. (3)
న చ రామం మహావీర్యం శక్నోమి రణమూర్ధని।
విజేతుం సమరే విప్రం జామదగ్న్యం మహాబలమ్॥ 4
కాని సమరభూమిలో యుద్ధానికి మోహరించి మహాబల పరాక్రమాలు కల విప్రుడు, పరశురాముడిని నాకు జయింపశక్యం కాదు. (4)
యది శక్యో మయా జేతుం జామదగ్న్యః ప్రతాపవాన్।
దైవతాని ప్రసన్నాని దర్శయంతు నిశాం మమ॥ 5
ప్రతాపశాలి అయిన జమదగ్ని కుమారుని నేను జయించగలిగేమాటుంటే నాకు ఈ రాత్రి దేవతలు ప్రసన్నంగా దర్శనం ఇత్తురు గాక. (5)
తతో నిశి చ రాజేంద్ర ప్రసుప్తః శరవిక్షతః।
దక్షిణేనేహ పార్శ్వేన ప్రభాతసమయే తదా॥ 6
తతోఽహం విప్రముఖ్యైస్తైః యైరస్మి పతితో రథాత్।
ఉత్థాపితో ధృతశ్పైవ మా భైరితి చ సాంత్వితః॥ 7
త ఏవ మాం మహారాజ స్వప్నదర్శనమేత్య వై।
పరివార్యాబ్రువన్ వాక్యం తన్నిబోధ కురూద్వహ॥ 8
రాజేంద్రా! అలా అనుకున్న తరువాత బాణాలతో గాయపడిన నేను ఆ రాత్రి తెల్లవారుజామున ప్రొద్దు పోయాక కుడిప్రక్కకు తిరిగి పడుకున్నాను. అప్పుడు యుద్ధంలో నేను రథాన్నుండి పడిపోతున్నపుడు ఏ బ్రాహ్మణోత్తములయితే లేపి పట్టుకొని "భయపడకు" అని ధైర్యం చెప్పి ఓదార్చారో వారే నా కలలో కనపడి నా చుట్టూ చేరి అన్న మాటలను నీకు వినిపిస్తాను. కురుశ్రేష్ఠా! సావధానంగా విను. (6,7,8)
ఉత్తిష్ఠ మా భైర్గాంగేయ న భయం తేఽస్తి కించన।
రక్షామహే త్వాం కౌరవ్య స్వశరీరం హి నీ భవాన్॥ 9
"గాంగేయా! లే. భయపడకు. నీకేమీ భయం లేదు. కురువంశీయుడా! నీవు మాలో వాడివే కదా! నిన్ను మేము రక్షిస్తాం" (9)
న త్వాం రామో రణే జేతా జామదగ్న్యః కథంచన।
త్వమేవ సమరే రామం విజేతా భరతర్షభ॥ 10
భరతశ్రేష్ఠుడా! జమదగ్ని కుమారుడయిన రాముడు యుద్ధంలో నిన్ను ఏవిధంగానూ జయించలేడు. యుద్ధంలో నీవే రాముడిని జయిస్తావు. (10)
ఇదమస్త్రం సుదయితం ప్రత్యభిజ్ఞాస్యతే భవాన్।
విదితం హి తవాప్యేతత్ పూర్వస్మిన్ దేహధారణే॥ 11
ప్రాజాపత్యం విశ్వకృతం ప్రస్వాపం నామ భారత।
న హీదం వేద రామోఽపి పృథివ్యాం వా పుమాన్ క్వచిత్॥ 12
భారతా! ఇదిగో 'ప్రస్వాపము' అనే ఈ అస్త్రం నీకు ఇష్టమైనది. నీవు దీని ప్రయోగ, ఉపసంహారాలను ఎరుగుదువు. పూర్వజన్మలో (వసువుగా ఉన్నపుడు) దీని ఎరుక నీకు ఉంది. దీనికి ప్రజాపతి అధిష్ఠానదైవం. విశ్వకర్మచేత నిర్మించబడింది. ఈ అస్త్రాన్ని గురించి రాముడికి కూడా తెలియదు. అసలు భూమిమీద ఏ మానవుడికీ కూడా ఎప్పుడూ దీని గురించి తెలియదు. (11,12)
తత్ స్మరస్వ మహాబాహో భృశం సంయోజయస్వ చ।
ఉపస్థాస్యతి రాజేంద్ర స్వయమేవ తవానఘ॥ 13
రాజేంద్రా! మహాబాహూ! దీన్ని స్మరించు. దీన్ని బాగా ప్రయోగించు. అనఘా! ఇది నీకు స్వయంగానే సిద్ధిస్తుంది. (13)
యేన సర్వాన్ మహావీర్యాన్ ప్రశాసిష్యసి కౌరవ।
న చ రామః క్షయం గంతా తేనాస్త్రేణ నరాధిప॥ 14
కౌరవరాజా! దీనితో నీవు మహావీరులైన రాజులందరినీ శాసించగలవు. కాని రాముడు దీనితో నాశనం కాడు. (చనిపోడని భావం).
ఏనసా న తు సంయోగం ప్రాప్స్యసే జాతు మానద।
స్వప్స్యతే జామదగ్న్యోఽసౌ త్వద్బాణబలపీడితః॥ 15
మానవుడా! కాబట్టి దీనివల్ల నీకు ఎప్పుడూ పాపం అంటదు. నీ బాణం తగిలి జమదగ్ని నందనుడు నిదుర పోయినట్లుంటాడు. (సొమ్మసిల్లి పోతాడని భావం) (15)
తతో జిత్వా త్వమేవైనం పునరుత్థాపయిష్యసి।
అస్త్రేణ దయితేనాజౌ భీష్మ సంబోధనేన వై॥ 16
భీష్మా యుద్ధంలో ఈ నీ ప్రియమైన అస్త్రం చేత అతడిని జయించి, తిరిగి నీవే అతడిని సంబోధనాస్త్రం చేత మేల్కొలుపగలుగుతావు. (16)
ఏవం కురుష్వ కౌరవ్య ప్రభాతే రథమాస్థితః।
ప్రసుప్తం వా మృతం వేతి తుల్యమ్ మన్యామహే వయమ్॥ 17
కౌరవ్యా! తెల్లవారగానే రథం ఎక్కి ఇలా చెయ్యి. ఎందుకంటే నిద్రపోయినవాడు, చనిపోయినవాడు ఒక్కటే అనుకుంటాము మేము. (17)
న చ రామేన మర్తవ్యం కదాచిదపి పార్థివ।
తతః సముత్పన్నమిదం ప్రస్వాపం యుజ్యతామితి॥ 18
రాజా! పరశురాముడు ఎన్నటికీ మరణించడు. కనుక నీకు లభించిన ఈ ప్రస్వాపమనే అస్త్రాన్ని ప్రయోగించు. (18)
ఇత్యుక్త్వాంతర్హితా రాజన్ సర్వ ఏవ ద్విజోత్తమాః।
అష్టా సదృశరూపాస్తే సర్వే భాసురమూర్తయః॥ 19
రాజా! ఇలా చెప్పి ఒకే ఆకారంతో దివ్యమూర్తుల్లా ఉన్న ఆ ఎనిమిదిమంది బ్రాహ్మణోత్తములూ అంతర్ధానం అయిపోయారు. (19)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి భీష్మప్రస్వాపనాస్త్రలాభే త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 183
ఇది శ్రీ మాహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున భీష్మునకు ప్రస్వాపనాస్త్రము లభించుట అను నూట ఎనుబది మూడవ అధ్యాయము. (183)