175. నూటడెబ్బదిఅయిదవ అధ్యాయము
అంబ సాళ్వునిచే తిరస్కరింపబడి తపోవనమునకు చేరుట.
భీష్మ ఉవాచ
తతోఽహం సమనుజ్ఞాప్య కాలీం గంధవతీం తదా।
మంత్రిణశ్చ ర్త్విశ్చైవ తథైవ చ పురోహితాన్॥ 1
సమనుజ్ఞాసిషం కన్యాం అంబాం జ్యేష్ఠాం నరాధిప।
నరేశ్వరా! అప్పుడు గంధవతి, కాళి అయిన తల్లివద్ద నేను అనుమతి తీసుకుని, మంత్రులు, ఋత్విజులు, పురోహితులను కూడా అడిగి పెద్దది అయిన ఆ రాకుమారి అంబను వెళ్లుమని అనుమతించాడు. (1 1/2)
అనుజ్ఞాతా యయౌ సా తు కన్యా సాల్వపతేః పురమ్॥ 2
వృద్ధైర్ద్విజాతిర్గుప్తా ధాత్ర్యా చానుగతా తదా।
అతీత్య చ తమధ్వానమ్ ఆసాద్య నృపతిం తథా॥ 3
సా తమాసాద్య రాజానం సాల్వం వచనమబ్రవీత్।
ఆగతాహం మహాబాహో త్వాముద్దిశ్య మహామతే॥ 4
అనుమతి పొంది ఆ రాకుమారి అంబ సాల్వరాజు యొక్క పట్టణానికి బ్రాహ్మణుల సంరక్షణలో బయల్దేరింది. ఆమె దాది కూడా ఆమెను అనుసరించింది. ఆ రీతిగా ప్రయాణించి ఆమె రాజయిన సాళ్వుని చేరి "మహామతీ! మహాబాహూ! నీ గురించే వచ్చేశాను" అంది. (2-4)
(అభినందస్వ మాం రాజన్ సదా ప్రియహితే రతామ్।
ప్రతిపాదయ మాం రాజన్ ధర్మార్థం చైవ ధర్మతః॥
త్వం హి మే మనసా ధ్యాతః త్వయా చాప్యుపమంత్రితా॥)
రాజా! ఎప్పుడూ నీకు మేలు, ప్రియం కలగాలని కోరు కునే నన్ను అభినందించు. ధర్మం కోసం ధర్మానుసారంగా నన్ను భార్యగా స్వీకరించు. నిన్నే ఎప్పుడూ మనసులో ధ్యానిస్తూ ఉంటాను. నీవు కూడా ఏకాంతంలో వివాహప్రస్తావన చేశావు.
తామబ్రవీచ్ఛాల్వపతిః స్మయన్నివ విశాంపతే।
త్వయాన్యపూర్వయా నాహం భార్యార్థీ వరవర్ణిని॥ 5
రాజా! అంబ మాటలు విన్న సాళ్వుడు నవ్వు తెచ్చిపెట్టుకుని "సుందరీ! ఇంతకు ముందే పరాయిదానివైన నిన్ను భార్యగా స్వీకరించడం నాకిష్టం లేదు". (5)
గచ్ఛ భద్రే పునస్తత్ర సకాశం భీష్మకస్య వై।
నాహమిచ్ఛామి భీష్మేణ గృహీతాం త్వాం ప్రసహ్య వై॥ 6
భద్రే! తిరిగి అక్కడికే ఆ భీష్ముడి వద్దకు వెళ్లు. భీష్ముడు నిన్ను బలవంతంగా పట్టుకున్నాడు. నిన్ను నేను భార్యగా స్వీకరించడానికి ఇష్టపడను. (6)
త్వం హి భీష్మేణ నిర్జిత్య నీతా ప్రీతిమతీ తదా।
పరామృశ్య మహాయుద్ధే నిర్జిత్య పృథివీపతీన్॥ 7
భీష్ముడు ఆ మహాయుద్ధంలో రాజులందరినీ జయించి నిన్ను తనతో తీసుకుపోయాడు. ఆ సమయంలో నీవు కూడా సంతోషంగానే ఉన్నావు. (7)
నాహం త్వయ్యన్యపూర్వాయాం భార్యార్థీ వరవర్ణిని।
కథమస్మద్విధో రాజా పరపూర్వాం ప్రవేశయేత్॥ 8
నారీం విదితవిజ్ఞానః పరేషాం ధర్మమాదిశన్।
యథేష్టం గమ్యతాం భద్రే మా త్వాం కాలోఽత్యగాదయమ్॥ 9
సుందరీ! పూర్వమే నీవు ఇతరుల సొత్తు అయిపోయావు - ఇక నాకు భార్య అక్కరలేదు. అన్ని విషయాలూ తెలిసి ఇతరులకు ధర్మాన్ని బోధించే నావంటి రాజు పరాయి స్త్రీకి ఎలా చోటు ఇస్తాడు? నీ యిష్టం వచ్చిన చోటికి వెళ్లు. ఇక్కడ సమయాన్ని వ్యర్థం చేసుకోకు. (8,9)
అంబా తమబ్రవీద్ రాజన్ననంగశరపీడితా।
నైనం వద మహీపాల నైతదేవం కథంచన॥ 10
నాస్మి ప్రీతిమతీ నీతా భీష్మేణామిత్రకర్శన।
బలవన్నీతాస్మి రుదతీ విద్రావ్య పృథివీపతీన్॥ 11
రాజా! ఆ మాటలు విన్న అంబ మన్మథతాపంతో (ప్రేమచంపుకోలేక) సాళ్వరాజుతో ఇలా అంది. "రాజా! అలా అనకు. అలా ఎప్పటికీ జరగదు. శత్రుమర్దనా! నేను భీష్ముడితో ఆనందంగా వెళ్లలేదు. అతడు రాజులందరినీ పారద్రోలి ఏడుస్తూన్న నన్ను బలవంతంగా తీసుకువెళ్లాడు. (10-11)
భజస్వ మాం సాల్వపతే భక్తాం బాలామనాగసమ్।
భక్తానాం హి పరిత్యాగః న ధర్మేషు ప్రశస్యతే॥ 12
సాళ్వరాజా! ఏ తప్పూ చేయని బాలికను. నన్ను స్వీకరించు. నీ పట్ల అనురాగం కలదానిని. భక్తులను విడిచిపెట్టడం ఏ ధర్మమూ మంచిదని చెప్పదు. (12)
సాహమామంత్ర్య గాంగేయం సమరేష్వనివర్తనమ్।
అనుజ్ఞాతా చ తేనైవ తతౌహం భృశమాగతా॥ 13
యుద్ధంలో ఎప్పుడూ వెన్నుచూపని భీష్ముడిని అడిగి, అతని అనుమతితోనే నేనిప్పుడిక్కడికి ఎంతో ఆశగా వచ్చాను. (13)
న స భీష్మో మహాబాహుః మామిచ్ఛతి విశాంపతే।
భ్రాతృహేతోః సమారంభః భీష్మస్యేతి శ్రుతం మయా॥ 14
రాజా! మహాబాహువు అయిన ఆ భీష్ముడు నన్ను కోరుకోలేదు. అతని ఈ ప్రయత్నమంతా తన తమ్మునికోసం అని విన్నాను. (14)
భగిన్యౌ మమ యే నీతే అంబికాంబాలికే నృప।
ప్రాదాద్ విచిత్రవీర్యాయ గాంగేయో హి యవీయసే॥15
నరేశ్వరా! భీష్ముడు తాను తీసుకుపోయిన నా చెల్లెళ్లు అంబిక అంబాలికలను తన తమ్ముడైన విచిత్రవీర్యునికి ఇచ్చి పెళ్లి చేశాడు. (15)
యథా సాల్వపతే నాన్యం వరం ధ్యామి కథంచన।
త్వాం ఋతే పురుషవ్యాఘ్ర తథా మూర్ధానమాలభే॥ 16
పురుషసింహా! సాళ్వరాజా! నేను నా తలమీద ఒట్టువేసి చెపుతున్నాను. నిన్ను తప్ప ఇతరుని ఎవరినీ భర్తగా ఎప్పుడూ నేను ధ్యానించలేదు. (మనసులో ఊహించలేదు). (16)
న చాన్యపూర్వా రాజేంద్ర త్వామహం సముపస్థితా।
సత్యం బ్రవీమి సాల్వైతత్ సత్యేనాత్మానమాలభే॥ 17
రాజేంద్రా! నామీద ఇంతవరకు ఎవరికీ అధికారం లేదు. (నేను ఎవరికీ వశం కాలేదు) మొదటినుండీ ఇష్టపూర్వకంగా నిన్నే చేరాను. నేను నిజం చెప్తున్నాను. ఆ నిజాన్ని నా శరీరం మీద ఒట్టువేసి మరీ చెప్తున్నాను. (17)
భజస్వ మాం విశాలాక్ష స్వయం కన్యాముపస్థితామ్।
అనన్యపూర్వాం రాజేంద్ర త్వత్ప్రసాదాభికాంక్షిణీమ్॥ 18
ఇంతలు కన్నులున్న రాజేంద్రా! నేను ఈ క్షణం వరకు ఇతరుని ఎవరినీ కూడా భర్తగా భావించలేదు. నీదయకోసమే కోరుకొంటున్నాను. స్వయంగా నిన్ను చేరిన కన్యనైన నన్ను భార్యగా స్వీకరించు. (18)
తామేవం భాషమాణాం తు సాల్వః కాశిపతేః సుతామ్।
అత్యజద్ భరతశ్రేష్ఠ జీర్ణాం త్వచమివోరగః॥ 19
భరతవీరుడా! ఈ రీతిగా నచ్చచెప్తూ వేడుకుంటూ ఉన్న కాశిరాజు కూతురు అంబను సాళ్వుడు పనికిరాని కుబుసాన్ని పాము విడిచినట్లుగా విడిచిపెట్టేశాడు. (19)
ఏవం బహువిధైర్వాక్యైః యాచ్యమానస్తయా నృపః।
నాశ్రద్దధచ్ఛాల్వపతిః కన్యాయాం భారతర్షభ॥ 20
భరతశ్రేష్ఠుడా! ఈ రీతిగా ఎన్నోరకాలుగా బ్రతిమాలుతీ నచ్చచెప్తున్నా ఆమె మాటలతో సాళ్వపతికి నమ్మకం కలగలేదు. (20)
తతః సా మన్యునాఽవిష్టా జ్యేష్ఠా కాశిపతేః సుతా।
అబ్రవీత్ సాశ్రునయనా బాష్పవిప్లుతయా గిరా॥ 21
అప్పుడు కాశిరాజు యొక్క పెద్దకూతురైన ఆ అంబ కోపంతో, దుఃఖంతో, నీళ్లు నిండిన కళ్లతో, బొంగురుపొయిన గొంతుతో ఇలా అంది. (21)
త్వయా త్యక్తా గమిష్యామి యత్ర తత్ర విశాంపతే।
తత్ర తే గతయః సంతు సంతః సత్యం యథా ధ్రువమ్॥ 22
రాజా! నేను చెప్పినది సత్యమూ, శాశ్వతమూ అయితే నీచేత వదిలివేయబడిన నేను ఎక్కడెక్కడ తిరుగుతానో అక్కడక్కడ సాధువులందరూ నాకు రక్షకులవుదురుగాక!(22)
ఏవం తాం భాషమాణాం తు కన్యాం సాల్వపతిస్తదా।
పరితత్యాజ కౌరవ్య కరుణం పరిదేవతీమ్॥ 23
కురునందనా! ఈ రీతిగా దీనంగా విలపిస్తూ మాట్లాడుతున్న కన్య అయిన అంబబు అప్పుడు సాళ్వపతి పూర్తిగా విడిచిపెట్టేశాడు. (23)
గచ్ఛ గచ్ఛేతి తాం సాల్వః పునః పునరభాషత।
బిభేమి భీష్మాత్ సుశ్రోణి త్వం చ భీష్మపరిగ్రహః॥ 24
"సుశ్రోణి! వెళ్లు, వెళ్లు, భీష్ముని వల్ల భయపడుతున్నాను. భీష్ముడు నిన్ను పరిగ్రహించాడు" - అని సాళ్వుడు ఆమెతో పదేపదే అన్నాడు. (24)
ఏవముక్తా తు సా తేన సాల్వేనాదీర్ఘదర్శినా।
నిశ్చక్రామ పురాద్ దీనా రుదతీ కురరీ యథా॥ 25
దూరదృష్టిలేని సాళ్వుడు ఇలా అనగానే అంబ దీనురాలై కురరీపక్షి వలె ఏడుస్తూ ఆ పట్టణంనుండి బయలుదేరింది. (25)
భీష్మ ఉవాచ
నిష్క్రామంతీ తు నగరాత్ చింతయామాస దుఃఖితా।
పృథివ్యాం నాస్తి యువతిః విషమస్థతరా మయా॥ 26
ఆ నగరాన్నుండి దుఃఖితురాలై తిరిగివెళ్తూ అంబ తన మనసులో "నాలా ఇంత సంకటస్థితిలో పడిన యువతులెవరూ ప్రపంచంలో ఉండరు. (26)
బంధుభిర్విప్రహీణాస్మి సాల్వేన చ నిరాకృతా।
న చ శక్యం పునర్గంతుం మయా వారణసాహ్వయమ్॥ 27
బంధువులకు ఇంతకుముందే దూరమయ్యాను. సాళ్వుడు కూడా నన్ను నిరాకరించాడు. తిరిగి హస్తినాపురానికి వెళ్లలేను. (27)
అనుజ్ఞాతా తు భీష్మేణ సాల్వముద్దిశ్య కారణమ్।
కిం ను గర్హామ్యథాత్మానమ్ అథ భీష్మం దురాసదమ్॥ 28
ఎందుకంటే సాళ్వునిపై నాకుగల ప్రేమను కారణంగా చూపి, భీష్ముని అనుమతి తీసుకుని అక్కడినుండి వచ్చాను. ఇప్పుడు నన్ను నేను నిందించుకోనా? లేక యుద్ధంలో గెలుపు పొందిన వీరుడైన భీష్ముడిని నిందించనా? (28)
అథవా పితరం మూఢం యో మేఽకార్షీత్ స్వయంవరమ్।
మయాయం స్వకృతో దోషో యాహం భీష్మరథాత్ తదా॥ 29
ప్రవృత్తే దారుణే యుద్ధే సాల్వార్థం నాపతం పురా।
లేకుంటే నాకు స్వయంవరం ప్రకటించిన మూఢుడైన మా తండ్రిని నిందించనా? అసలు ఆనాడు దారుణమైన యుద్ధం జరుగుతూంటే సాళ్వుడికోసం భీష్ముని రథం నుండి దూకి వేయకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. (29 1/2)
తస్యేయం ఫలనిర్వృత్తిః యదాపన్నాస్మి మూఢవత్॥ 30
ధిగ్ భీష్మం ధిక్ చ మే మందం పితరం మూఢచేతసమ్।
యేనాహం వీర్యశుల్కేన పణ్యస్త్రీవ ప్రచోదితా॥ 31
ఆ తప్పుకు ఫలితంగానే ఇప్పుడు మూఢురాలిలాగా గొప్ప ఆపదలో చిక్కుకున్నాను. పరాక్రమం శుల్కంగా నిర్ణయించి నన్ను ఒక బజారు స్త్రీలాగ(వేశ్యవలె) జనుల మధ్యలోకి నెట్టిన మందబుద్ధి, వివేక శూన్యుడు అయిన నా తండ్రికీ, భీష్మునికీ కూడా బుద్ధి లేదు. (30-31)
ధిఙ్మాం ధిక్ సాల్వరాజానం ధిగ్ ధాతారమథాపి వా।
యేషాం దుర్నీతభావేన ప్రాప్తాస్మ్యాపదముత్తమామ్॥ 32
నాకూ బుద్ధిలేదు. సాళ్వరాజుకూ బుద్ధిలేదు. ఎవరి దుర్ణయంతో ఇంత గొప్ప ఆపదలో చిక్కుకున్నానో ఆ విధికి అసలే బుద్ధిలేదు. (32)
సర్వథా భాగధేయాని స్వాని ప్రాప్నోతి మానవః।
అనయస్యాస్య తు ముఖం భీష్మః శాంతనవో మమ॥ 33
మానవుడు తన అదృష్టంలో ఉన్నదానినే పొందుతాడు. అయినా నాకు జరిగిన ఈ అన్యాయానికి శంతనిపుత్రుడైన భీష్ముడే కారణం. (33)
సా భీష్మే ప్రతికర్తవ్యమ్ అహం పశ్యామి సాంప్రతమ్।
తపసా వా యుధా వాపి దుఃఖహేతుః స మే మతః॥ 34
కాబట్టి ఈ సమయంలో తపస్సు చేసి కాని, యుద్ధం చేసి కాని భీష్మునిపై ప్రతీకారం తీర్చుకోవడమే ఉచితంగా కనిపిస్తోంది. అతడే నా ఈ దుఃఖానికి ప్రధాన కారకుడు. (34)
కో ను భీష్మం యుథా జేతుమ్ ఉత్సహేత మహీపతిః।
ఏవం సా పరినిశ్చిత్య జగామ నగరాద్ బహిః॥ 35
యుద్ధంలో భీష్ముని జయించడానికి ఉత్సాహం చూపే రాజు ఎవరున్నారు?" అని ఆలోచించుకుంటూ ఆమె నగరం వెలుపలికి వచ్చింది. (35)
ఆశ్రమం పుణ్యశీలానాం తాపసానాం మహాత్మనామ్।
తతస్తామవసద్ రాత్రిం తాపసైః పరివారితా॥ 36
ఆమె అలా పుణ్యాత్ములైన మహాత్ములైన మునుల ఆశ్రమానికి వెళ్లి ఆ రాత్రి అక్కడ గడిపింది. అక్కడి మునులందరూ చేరి ఆమెను కాపాడారు. (36)
ఆచఖ్యౌ చ యథావృత్తం సర్వమాత్మని భారత।
విస్తరేణ మహాబాహో నిఖిలేన శుచిస్మితా।
హరణం చ విసర్గం చ సాల్వేన చ విసర్జనమ్॥ 37
భరతకుమారా! మహాబాహూ! శుచిస్మిత అయిన ఆ అంబ తనపట్ల జరిగిన వృత్తాంతాన్ని యావత్తూ, భీష్ముడు తన్ను ఎలా అపహరించాడో, అతని నుండి ఎలా విముక్తి కలిగిందో, తరువాత సాళ్వుడు తన్ను ఎలా వదిలిపెట్టాడో, అంతా సవిస్తరంగా వారికి చెప్పింది. (37)
తతస్తత్ర మహానాసీద్ బ్రాహ్మణః సంశితవ్రతః।
శైఖావత్యస్తపోవృద్ధః శాస్త్రే చారణ్యకే గురుః॥ 38
ఆ ఆశ్రమంలో శాస్త్రాలలోను ఉపనిషత్తులలోను గురువై ఉన్న శైఖావత్యుడనే ఒక తప్పోవృద్ధుడు ఉన్నాడు. అతడు కఠోరవ్రత నియమాలు ఆచరించే బ్రాహ్మణుడు. (38)
ఆర్తాం తామాహ స మునిః శైఖావత్యో మహాతపాః।
విఃశ్వసంతీం సతీం బాలాం దుఃఖశోకపరాయణామ్॥ 39
మహాతపస్వి అయిన ఆ శైఖావత్యముని ఆర్తురాలై, నిట్టూర్పులు విడుస్తూ, దుఃఖశోక పరాయణురాలై ఉన్న సాధ్వి అయిన ఆ బాలికతో ఇలా అన్నాడు. (39)
ఏవం గతే తు కిం భద్రే శక్యం కర్తుం తపస్విభిః।
ఆశ్రమస్థైర్మహాభాగే తపోయుక్తైర్మహాత్మభిః॥ 40
"మహాభాగా! పూజ్యురాలా! ఈ స్థితిలో ఆశ్రమ వాసులై తపస్సు చేసుకునే మహాత్ములైన ఈ మునులు నీకు ఏమి సహాయం చేయగలుగుతారు? (40)
సా త్వేనమబ్రవీద్ రాజన్ క్రియతాం మదనుగ్రహః।
ప్రావ్రాజ్యమహమిచ్ఛామి తపస్తప్స్యామి దుశ్చరమ్॥ 41
రాజా! అప్పుడు అంబ ఇలా అంది. "నా మీద దయ చూపండి. నేను సన్యాసం తీసుకోవాలనుకొంటున్నాను. ఇక్కడ ఉండి దుష్కరమైన తపస్సు చేస్తాను. (41)
మయైవ యాని కర్మాణి పూర్వదేహే తు మూఢయా।
కృతాని నూనం పాపాని తేషామేతత్ ఫలం ధ్రువమ్॥ 42
పూర్వజన్మలో మూఢురాలైన నేను చేసిన పాపకృత్యాలకు ఫలితమే నిశ్చయంగా ఇది. (42)
నోత్సహే తు పునర్గంతుం స్వజనం ప్రతి తాపసాః।
ప్రత్యాఖ్యాతా నిరానందా సాల్వేన చ నిరాకృతా॥ 43
మునులారా! సాళ్వుడు నిరాకరించి తిరస్కరించడంతో ఆనందం కోల్పోయిన నాకు తిరిగి మా వాళ్ల దగ్గరికి వెళ్లడం ఇష్టం లేదు. (43)
ఉపదిష్టమిహేచ్ఛామి తాపస్యం వీతకల్మషాః।
యుష్మాభిర్దేవసంకాశైః కృపా భవతు వో మయి॥ 44
పాపరహితులైన తాపసులారా! దేవ సమానులైన మిమ్మల్ని నాకు తపోదీక్ష ఇవ్వమని వేడుకొంటున్నాను. నామీద దయ చూపండి." (44)
స తామాశ్వాసయత్ కన్యాం దృష్టాంతాగమహేతుభిః।
సాంత్వయామాస కార్యం చ ప్రతిజజ్ఞే ద్విజైః సహ॥ 45
అపుడు శైఖావత్యముని లోకంలో దృష్టాంతాలను, శాస్త్రవచనాలను యుక్తియుక్తంగా చెప్పి ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి; బ్రాహ్మణులందరితో కలిసి ఆమెకార్యం సానుకూలమయ్యే ప్రయత్నం చేయడానికి ప్రతిజ్ఞ చేశాడు. (45)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ అంబోపాఖ్యానపర్వణి శైఖావత్యాంబాసంవాదే పంచసప్తత్యధికశతతమోఽధ్యాయః ॥ 175 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున అంబోపాఖ్యాన పర్వమను ఉపపర్వమున శైఖావత్య అంబా సంవాదము అను నూటడెబ్బది యైదవ ఆధ్యాయము. (175)
(దాక్షిణాత్య అధికపాఠం 1 1/2 శ్లోకం కలుపుకొని మొత్తం 46 1/2 శ్లోకాలు.)