160. నూట అరువదియవ అధ్యాయము

(ఉలూక దూతాగమన పర్వము)

ఉలూకుని ద్వారా దుర్యోధనుడు పాండవులకు సందేశము పంపుట.

సంజయ ఉవాచ
హిరణ్వత్యాం నినిష్టేషు పాండవేషు మహాత్మసు।
న్యవిశంత మహారాజ కౌరవేయా యథావిధి॥ 1
సంజయుడిలా అన్నాడు - మహారాజా! మహాత్ములయిన పాండవులు హిరణ్వతీనదీతీరంలో విడిది చేయగా కౌరవేయులు యథావిధిగా మరోప్రక్క శిబిరం వేశారు. (1)
తత్ర దుర్యోధనో రాజా నివేశ్య బలమోజసా।
సమ్మానయిత్వా నృపతీన్ యస్య గుల్మాంస్తథైవ చ॥ 2
రాజయిన దుర్యోధనుడు అక్కడ శక్తిసంపన్నమయిన తన సేనను నిలిపి, రాజులనందరినీ సమాదరించి వారి రక్షణకై గుల్మాలను నియమించాడు. (2)
సం.వి. గుల్మము - తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, ఇరువదేడు గుఱ్ఱాలు, నలువది అయిదుగురు పదాతిసైనికులు గల సేన -
ఆరక్షస్య విధిం కృత్వా యోధానాం తత్ర భారత।
కర్ణం దుశ్శాసనం చైవ శకునిం చాపి సౌబలమ్॥ 3
ఆనాయ్య నృపతిస్తత్ర మంత్రయామాస భారత।
భారతా! ఈ విధంగా యోధుల రక్షణకు తగు ఏర్పాట్లు చేసి దుర్యోధనుడు కర్ణునీ, దుశ్శాసనునీ, సౌబలుడయిన శకునినీ పిలిపించి మంతనాలు జరిపాడు. (3 1/2)
తత్ర దుర్యోధనో రాజా కర్ణేన సహ భారత॥ 4
సంభాషిత్వా చ కర్ణేన భ్రాత్రా దుశ్శాసనేన చ।
సౌబలేన చ రాజేంద్ర మంత్రయిత్వా నరర్షభ॥ 5
ఆహూయోపహ్వరే రాజన్ ఉలూకమిదమబ్రవీత్।
భారతా! అక్కడ దుర్యోధనరాజు కర్ణునితోనూ, సోదరుడయిన దుశ్శాసనునితోనూ, శకునితోనూ ఆలోచించి ఉలూకుని ఏకాంతప్రదేశానికి పిలిపించి ఆయనతో ఇలా అన్నాడు. (4-5 1/2)
ఉలూక గచ్ఛ కైతస్య పాండవాన్ సహ సోమకాన్।
గత్వా మమ వచో బ్రూహి వాసుదేవస్య శృణ్వతః।
ఇదం తత్సమనుప్రాప్తం వర్షపూగాభిచింతితమ్॥ 7
పాండవానాం కురూణాం చ యుద్ధం లోకభయంకరమ్।
కితవకుమారా! ఉలూకా! నీవు సోమకులతో కూడిన పాండవుల దగ్గరకుపోయి, వాసుదేవుడు వింటుండగా నామాటలు చెప్పు. "సంవత్సరాల తరబడి చర్చలలో నలుగుతున్న, లోకభీకరమయిన కౌరవ పాండవయుద్ధం ఇప్పుడు మీదికి వచ్చింది. (6-7 1/2)
యదేతత్ కత్థనావాక్యం సంజయో మహదబ్రవీత్॥ 8
వాసుదేవసహాయస్య గర్జతః సానుజస్య తే।
మధ్యే కురూణాం కౌంతేయ తస్య కాలోఽయ మాగతః॥ 9
యథా వః సంప్రతిజ్ఞాతం తత్సర్వం క్రియతామితి।
కౌంతేయా! వాసుదేవుని సహాయాన్ని పొంది సోదరులతో సహా గర్జనలు చేస్తూ ఆత్మశ్లాఘాపూర్వకంగా నీవు సంజయునితో పలికినమాటా, సంజయుడు కౌరవసబలో వినిపించిన మాట నిజమని నిరూపించటానికి సమయమాసన్నమైనది. దానిని చేసి చూపండి. (8-9 1/2)
జ్యేష్ఠం తథైవ కౌంతేయం బ్రూయాస్త్వం వచనాన్మమ॥ 10
కౌంతేయులలో జ్యేష్ఠుడయిన ధర్మరాజుతో నామాటగా ఇలా చెప్పు. (10)
భ్రాతృభిస్సహితః సర్వైః సోమకైశ్చ సకేకయైః।
కథం వా ధార్మికో భూత్వా త్వమధర్మే మనః కృథాః॥ 11
రాజా! నీవు నలుగురు సోదరులూ, సోమకులూ, కేకయులు అందరితో కలిసి ధర్మస్వరూపుడవయ్యావు. అటువంటివాడివి అధర్మంపై మనస్సు పెట్టవచ్చా? (11)
య ఇచ్ఛసి జగత్ సర్వం నశ్యమానం నృశంసవత్।
అభయం సర్వభూతేభ్యః దాతా త్వమితి మే మతిః॥ 12
సమస్తప్రాణులకూ నీవు అభయదాతవని నా నమ్మకం. అటువంటి నీవు ఇప్పుడు క్రూరునివలె జగత్తునంత నాశనం చేయాలని చూస్తున్నావు. (12)
శ్రూయతే హి పురా గీతః శ్లోకోఽయం భరతర్షభ।
ప్రహ్లాదేనాథ భద్రం తే హృతే రాజ్యే తు దైవతైః॥ 13
భరతశ్రేష్ఠా! గతంలో దేవతలు ప్రహ్లాదుని రాజ్యాన్ని అపహరించినప్పుడు ఆయన గానం చేసిన శ్లోకమొకటి వినిపిస్తుంది. (13)
యస్య ధర్మధ్వజో నిత్యం సురా ధ్వజ ఇవోచ్ఛ్రితః।
ప్రచ్ఛన్నాని చ పాపాని బైడాలం నామ తద్వ్రతమ్॥ 14
దేవతలారా! సాధారణ ధ్వజంలాగా ధర్మధ్వజం ఉన్నతంగా ఉన్ననూ, గుప్తంగా పాపాలను కూడా పాటించటాన్ని బిడాలవ్రత మంటారు. (14)
అత్ర తే వర్తయిష్యామి ఆఖ్యానమిదముత్తమమ్।
కథితం నారదేనేహ పితుర్మమ నరాధిప॥ 15
రాజా! ఈ విషయంలో మా తండ్రికి నారదుడు చెప్పిన ఒక ఉత్తమమయిన ఆఖ్యానాన్ని నీకు వినిపిస్తాను. (15)
మార్జారః కిల దుష్టాత్మా నిశ్చేష్టః సర్వకర్మసు।
ఊర్థ్వబాహుః స్థితో రాజన్ గంగాతీరే కదాచన॥ 16
ఒకప్పుడు గంగాతీరంలో ఒక చెడ్డపిల్లి ఏ పనీ చేయకుండా చేతులు పైకెత్తి నిలిచి ఉన్నది. (16)
స వై కృత్వా మనశ్శుద్ధిం ప్రత్యయార్థం శరీరిణామ్।
కరోమి ధర్మమిత్యాహ సర్వానేవ శరీరిణః॥ 17
అది దేహధారులందరికీ నమ్మకం కలిగించటానికై అందరితో "నేను మనస్సును శుద్ధిచేసికొన్నాను. ప్రస్తుతం ధర్మాచరణ చేస్తున్నాను." అని చెప్పేది. (17)
తస్య కాలేణ మహతా విశ్రంభం జగ్మురండజాః।
సమేత్య చ ప్రశంసంతి మార్జారం తం విశాంపతే॥ 18
రాజా! చాలాకాలానికి పక్షులన్నీ దానిని నమ్మడం మొదలుపెట్టాయి. అవి పిల్లిని సమీపించి అమితంగా పొగడసాగాయి. (18)
పూజ్యమానస్తు తైః సర్వైః పక్షిభిః పక్షిభోజనః।
ఆత్మకార్యం కృతం మేనే చర్యాయాశ్చ కృతం ఫలమ్॥ 19
పక్షులను భుజించే ఆ పిల్లి పక్షులన్నింటిచే పూజింప బడుతూ తాను చేసిన చర్య ఫలించినట్లు తనపని సిద్ధించినట్లు భావించింది. (19)
అథ దీర్ఘస్య కాలస్య తం దేశం మూషికా యయుః।
దదృశుస్తం చ తే తత్ర ధార్మికం వ్రతచారిణమ్॥ 20
ఆపై చాలాకాలం తర్వాత కొన్ని ఎలుకలు అక్కడకు పోయి ధార్మికుడై వ్రతాచరణలో ఉన్న ఆ పిల్లిని చూశాయి. (20)
కార్యేణ మహతా యుక్తం దంభయుక్తేన భారత।
తేషాం మతిరియం రాజన్ ఆసీత్తత్ర వినిశ్చయే॥ 21
భారతా! దంభంతో పెద్దపెద్ద పనులను ఆచరిస్తున్న ఆ పిల్లిని చూచి ఆ ఎలుకలు ఇలా ఆలోచించాయి. (21)
బహుమిత్రా వయం సర్వే తేషాం నో మాతులో హ్యయమ్।
రక్షాం కరోతు సతతం వృద్ధబాలస్య సర్వశః॥ 22
మనం ప్రజలకు మంచిమిత్రులం. ఇప్పుడు ఈ పిల్లి మనకు మేనమామయై ఆబాల వృద్ధంగా మనలను రక్షించాలి. (22)
ఉపగమ్య తు తే సర్వే బిడాలమిదమబ్రువన్।
భవత్ప్రసాదాదిచ్ఛామః చర్తుం చైవ యథాసుఖమ్॥ 23
భవాన్ నో గతి రవ్యగ్రా భవాన్ నః పరమః సుహృత్।
తే వయం సహితాః సర్వే భవంతం శరణం గతాః॥ 24
ఆవన్నీ ఆ పిల్లి దగ్గరకు పోయి ఇలా అన్నాయి - నీ అనుగ్రహంతో మేమంతా సుఖంగా చరించాలనుకొంటున్నాము. నీవే మాకు నిర్భయమైన ఆశ్రయానివి. నీవే మాకు పరమమిత్రుడవు. మేమంతా ఒక్కటై నీ శరణుజొచ్చాము. (23-24)
భవాన్ ధర్మపరో నిత్యం భవాన్ ధర్మే వ్య్వస్థితః।
స నో రక్ష మహాప్రాజ్ఞ త్రిదశానివ వజ్రభృత్॥ 25
మహాప్రాజ్ఞా! నీవూ నిత్యమూ ధర్మాసక్తుడవు. ధర్మమందే నిలిచినవాడవు. దేవేంద్రుడు దేవతలను రక్షించినట్లు మమ్ము నీవు రక్షించాలి. (25)
ఏవ ముక్తస్తు తైః సర్వైః మూషికైః స విశాంపతే।
ప్రత్యువాచ తతః సర్వాన్ మూషికాన్ మూషికాంతకృత్॥ 26
ద్వయోర్యోగం న పశ్యామి తపసో రక్షణస్య చ।
అవశ్యం తు మయా కార్యం వచనం భవతాం హితమ్॥ 27
మహరాజా! ఆ ఎలుకలన్నీ అలా అనగా ఎలుకలను చంపే పిల్లి వాటితో ఇలా అన్నది-
మీ సంరక్షణా, నా తపస్సూ రెండూ జరగాలంటే కుదిరేది కాదు. కానీ మీ మాటను నేను కాదనరాదు. తప్పని సరిగా మీకి హితాన్ని చేకూర్చాలి. (26-27)
యుష్మాభిరపి కర్తవ్యం వచనం మమ నిత్యశః।
తపసాస్మి పరిశ్రాంతః దృఢం నియమమాస్థితః॥ 28
న చాపి గమనే శక్తిం కాంచిత్ పశ్యామి చింతయన్।
సోఽస్మి నేయః సదా తాత నదీకూలమితః పరమ్॥ 29
మీరుకూడా నా మాట ఎల్లప్పుడూ పాటించాలి. తపస్సుతో అలసిపోయాను. దృఢంగా నియమపాలన చేస్తున్నాను. ఎంత ఆలోచించినా, ప్రయత్నించినా నడిచే ఓపిక కొంచెం కూడా లేదు. కాబట్టి నాయనా ఇక మీదట నదీతీరానికి మీరే నన్ను తీసికొనిపోవాలి. (28-29)
తథేతి తం ప్రతిజ్ఞాయ మూషికా భరతర్షభ।
వృద్ధబాలమథో సర్వం మార్జారాయ న్యవేదయన్॥ 30
భరతశ్రేష్ఠా! అలాగే అని ఆ పిల్లికి మాట ఇచ్చి ఆ ఎలుకలు అన్నీ ఆబాలవృద్ధంగా ఆ పిల్లికి లొంగిపోయాయి. (30)
తతః స పాపో దుష్టాత్మా మూషికానథ భక్షయన్।
పీవరశ్చ సువర్ణశ్చ దృఢబంధశ్చ జాయతే॥ 31
ఆ తర్వాత పాపి, దురాత్ముడు, అయిన పిల్లి ఎలుకలను తింటూ బలిసి, రంగు వచ్చింది. కీళ్ళు కూడా గట్టిపడ్డాయి. (31)
మూషికాణాం గణశ్చాత్ర భృశం సంక్షీయతేఽథ సః।
మార్జారో వర్ధతే చాపి తేజోబలసమన్వితః॥ 32
అక్కడ ఎలుకల గుంపు చాలా తగ్గిపోసాగింది. తేజోబలాలతో కూడి ఆ పిల్లి బలుస్తోంది.
తతస్తే మూషికా స్సర్వే సమేత్యాన్యోన్యమబ్రువన్।
మాతులో వర్ధతే నిత్యం వయం క్షీయామహే భృశమ్॥ 33
ఆ తర్వాత ఎలుకలు అన్నీ ఒకచోట కూడి పరస్పరం ఇలా అన్నాయి - మేనమామ రోజూ బలుస్తున్నాడు కానీ మనం తగ్గిపోతున్నాం. (33)
తతః ప్రాజ్ఞతమః కశ్చిత్ డిండికో నామ మూషికః।
అబ్రవీత్ వచనం రాజన్ మూషికాణాం మహాగణమ్॥ 34
గచ్ఛతాం వో నదీతీరం సహితానాం విశేషతః।
పృష్ఠతోఽహం గమిష్యామి సహైవ మాతులేన తు॥ 35
రాజా! అప్పుడు వాటిలో ఒక తెలివైన ఎలుక - డిండికం - అనే పేరుగలది ఎలుకల గుంపుతో ఇలా అన్నది. 'మీరంతా విశేషంగా కలిసి ఒక్కటై నదీతీరానికి వెళ్ళండి. నేను కూడా మాతులునితో కలిసి వెనకేవస్తా." (34-35)
సాధు సాధ్వితి తే సర్వే పూజయాంచక్రిరే తదా।
చక్రుశ్చైవ యథాన్యాయం డింగికస్య వచోఽర్థవత్॥ 36
'బాగుంది-బాగుంది' అంటూ ఎలుకలన్నీ అప్పుడు దానిని అభినందించాయి. ప్రయోజనకారి అయిన ఆ డిండికవచనాన్ని యథాన్యాయంగా పాటించాయి. (36)
అవిజ్ఞానాత్తతః సోఽథ డిండికం హ్యుపభుక్తవాన్।
తతస్తే సహితా స్సర్వే మంత్రయామాసురంజసా॥ 37
ఆ తర్వాత ఆ విషయమంతా తెలియని పిల్లి డిండికాన్ని తినివేసింది. ఆ తరువాత అవన్నీ కలిసి రహస్యంగా ఆలోచించాయి. (37)
తత్ర వృద్ధతమః కశ్చిత్ కోలికో నామ మూషికః।
అబ్రవీద్ వచనం రాజన్ జ్ఞాతిమధ్యే యథాతథమ్॥ 38
రాజా! అక్కడ ఒక ముసలి ఎలుక - దాని పేరు కోలికం. అది సాటి ఎలుకల మధ్య నిలిచి ఇలా అన్నది. (38)
న మాతులో ధర్మకామః ఛద్మమాత్రం కృతా శిఖా।
న మూలఫలభక్షస్య విష్ఠా భవతి లోమశా॥ 39
మాతులుడు ధర్మాసక్తి కలవాడు కాదు. లోకులను మోసం చేయటానికి శిఖపెట్టాడు. కంద మూలఫలాలు తినే వారి పురీషం ఎర్రగా ఉండదు. (39)
అస్య గాత్రాణి వర్ధంతే గణశ్చ పరిహీయతే।
అద్య సప్తాష్టదివసాన్ డిండికోఽపి న దృశ్యతే॥ 40
దాని శరీరం బలుస్తోంది. మన గుంపు తగ్గిపోతోంది. ఇప్పటికి ఏడెనిమిదిరోజులనుండి డిండికం కూడా కనిపించటం లేదు. (40)
ఏతచ్ఛ్రుత్వా వచః సర్వే మూషికా విప్రదుద్రువుః।
బిడాలోఽపి స దుష్టాత్మా జగామైవ యథాగతమ్॥ 41
ఇది విని ఎలుకలన్నీ పారిపోయాయి. దురాత్మకుడైన ఆ పిల్లికూడా వచ్చినట్టే వెళ్ళిపోయింది. (41)
తథా త్వమపి దుష్టాత్మాన్ బైడాలం వ్రత మాస్థితః।
చరసి జ్ఞాతిషు సదా బిడాలో మూషికేష్వివ॥ 42
అదే విధంగా దురాత్ముడా! నీవుకూడా బిడాలవ్రతాన్ని పట్టావు. ఎలుకల మధ్య పిల్లి తిరిగినట్లు జ్ఞాతులలో నీవు తిరుగుతున్నావు. (42)
అన్యథా కిల తే వాక్యమ్ అన్యథా కర్మ దృశ్యతే।
దంభనార్థాయ లోకస్య వేదాశ్చోపశమశ్చ తే॥ 43
నీ మాట ఒకటి. చేత మరొకటి. నీ వేదాధ్యయనం. నీ శాంతస్వభావమూ లోక ప్రదర్శనకోసం ప్రగల్భించటమే. (43)
త్యక్త్వా ఛద్మ త్విదం రాజన్ క్షత్రధర్మం సమాశ్రితః।
కురు కార్యాణి సర్వాణి ధర్మిష్ఠోఽపి నరర్షభ॥ 44
నరశ్రేష్ఠా! రాజా! నీవు ధర్మిష్ఠుడవైతే ఈ కుహనాతత్త్వాన్ని వదలిపెట్టి క్షత్రధర్మాన్ని ఆశ్రయించి పనులిఉ చేయి. (44)
బాహువీర్యేణ పృథివీం లబ్ధ్వా భరతసత్తమ।
దేహి దానం ద్విజాతిభ్యః పితృభ్యశ్చ యథోచితమ్॥ 45
భరత సత్తమా! బాహుపరాక్రమంతో భూమిని సాధించి యథోచితంగా బ్రాహ్మణులకూ, పితరులకూ దానం చేయి. (45)
క్లిష్టాయా వర్షపూగాంశ్చ మాతుర్మాతృహితే స్థితః।
ప్రమార్జాశ్రు రణే జిత్వా సమ్మానం పరమావహ॥ 46
మీ అమ్మ సంవత్సరాల తరపడు కష్టపడుతోంది. ఆమె సుఖాన్ని కోరుకొంటూ ఆమె కన్నీటిని తుడిచి, యుద్ధంలో జయించి ఆమెకు పరమానందాన్ని కల్గించు. (46)
పంచ గ్రామా వృతా యత్నాత్ నాస్మాభిరపవర్జితాః।
యుధ్యామహే కథం సంఖ్యే కోపయేమ చ పాండవాన్॥ 47
నీవు కేవలం అయిదుగ్రామాలనడిగావు. పాండవులను రెచ్చగొట్టి వారితో యుద్ధం చేయాలన్న సంకల్పంతోనే మేము అవి కూడా ఇవ్వలేదు. (47)
త్వత్కృతే దుష్టభావస్య సంత్యాగో విదురస్య చ।
జాతుషే చ గృహే దాహం స్మర తం పురుషో భవ॥ 48
మీ కోసమే నేను దుష్టాత్ముడైన విదురుని వదిలిపెట్టాను. లక్క ఇంటిలో మిమ్ములను తగులబెట్టడం గుర్తుతెచ్చుకో. ఇప్పటికైనా పౌరుషాన్ని చూపెట్టు. (48)
యచ్చ కృష్ణమవోచస్త్వమ్ అయాంతం కురుసంసది।
అయమస్మి స్థితో రాజన్ శసూయ సమరాయ చ॥ 49
తస్యాయమాగతః కాలః సమరస్య నరాధిప।
ఏతదర్థం మయా సర్వం కృతమేతద్యుధిష్ఠిర॥ 50
కౌరవసభకు వస్తున్న కృష్ణునితో "రాజా! నేను సంధికైనా సమరానికైనా సంసిద్ధుడనే" అని చెప్పి పంపావు కదా! రాజా! అయుద్ధకాలం ఇప్పుడు సమీపించింది. యుధిష్ఠిరా! ఆ యుద్ధం కోసమే నేనిదంతా చేశాను. (49-50)
కిం ను యుద్ధాత్పరమ్ లాభం క్షత్రియో బహుమన్యతే।
కిం చ త్వం క్షత్రియకులే జాతః సంప్రథితో భువి॥ 51
క్షత్రియుడు యుద్ధాన్ని మించిన లాభంలేదని భావిస్తాడు. నీవు క్షత్రియవంశంలో పుట్టి లోకంలో ప్రసిద్ధిని పొంది ఉన్నావు గదా! (51)
ద్రోణాదస్త్రాణి సంప్రాప్య కృపాచ్చ భరతర్షభ।
తుల్యయోనౌ సమబలే వాసుదేవం సమాశ్రితః॥ 52
భరతర్షభా! ద్రోణ కృపుల ద్వారా అస్త్రాలను పొంది, వంశవిషయంలో బలవిషయంలోనూ మాతో సమానుడవైకూడా శ్రీకృష్ణుని ఆశ్రయాన్ని పొందావు. (52)
బ్రూయాస్త్వం వాసుదేవం చ పాండవానాం సమీపతః।
ఆత్మార్థం పాండవార్థం చ యత్తా మాం ప్రతియోధయ॥ 53
ఉలూకా! నీవు పాండవుల సమక్షంలోనే వాసుదేవునితో కూడా ఇలా చెప్పు - నీకోసం, పాండవుల కోసం సన్నద్ధుడవై నన్ను ఎదిరించు. (53)
సభామధ్యే చ యద్రూపం మాయయా కృతవానసి।
తత్తథైవ పునః కృత్వా సార్జునో మా మభిద్రవ॥ 54
కౌరవసభలో మాయచేసి ఏ రూపాన్ని ప్రదర్శించావో, అదే రూపాన్ని ప్రదర్శించి అర్జునునితో కలిసి నామీద దండెత్తు. (54)
ఇంద్రజాలం చ మాయా వై కుహకా వాపి భీషణా।
ఆత్తశస్త్రశ్చ సంగ్రామే వహంతి ప్రతిగర్జనాః॥ 55
ఇంద్రజాలం, మాయా, మోసం, బెదిరింపు - ఇవన్నీ రణరంగంలో ఆయుధం పట్టినవాడిని ప్రతిగర్జనకి ప్రోత్సహిస్తాయి. (55)
వయమప్యుత్సహేమ ద్యాం ఖం చ గచ్ఛేమ మాయయా।
రసాతలం విశామోఽపి ఐంద్రం వా పురమేవ తు॥ 56
మేము కూడా మాయతో ఆకాశంలో ఎగరగలం. అంతరిక్షంలోనికి పోగలం. పాతాళంలో అయినా ప్రవేశించగలం. అమరావతినైనా చేరగలం. (56)
దర్శయేమ చ రూపాణి స్వశరీరే బహూన్యపి।
న తు పర్యాయతః సిద్ధిః బుద్ధిమాప్నోతి మానుషీమ్॥ 57
మా శరీరంలో కూడా చాలా రూపాలను ప్రదర్శించగలం కానీ దీని వలన అభీష్టసిద్ధి కలుగదు. శత్రువులూ భయపడరు. (57)
మనసైవ హి భూతాని ధాతైవ కురుతే వశే।
యద్బ్రవీషి వా వార్ష్ణేయ ధార్తరాష్ట్రానహం రణే॥ 58
ఘాతయిత్వా ప్రదాస్యామి పార్థేభ్యో రాజ్యముత్తమమ్।
ఆచచక్షే చ మే సర్వం సంజయస్తవ భాషితమ్॥ 59
ధాత తన సంకల్ప మాత్రం చేతనే ప్రాణులను అదుపు చేస్తాడు.
వార్ష్ణేయా! ధృతరాష్ట్రుని కొడుకుల నందరినీ యుద్ధంలో చంపి ఈ ఉత్తమరాజ్యాన్ని కౌంతేయులకిస్తానని అన్నావటగదా! నీ మాటలన్నీ నాకు సంజయుడు చెప్పాడు. (58-59)
మద్ద్వితీయేన పార్థేన వైరం వః సవ్యసాచినా।
స సత్యసంగరో భూత్వా పాండవార్థే పరాక్రమీ॥ 60
నేను తోడున్న సవ్యసాచి అయిన పార్థునితో మీకు శత్రుత్వమా? అనికూడా అన్నావట గదా! మాటమీద నిలిచి పాండవులకోసం పరాక్రమించు. (60)
యుధ్యస్వాద్య రణే యత్తః పశ్యామః పురుషో భవ।
యస్తు శత్రుమభీజ్ఞాయ శుద్ధం పౌరుషమాశ్రితః॥ 61
కరోతి ద్విషతాం శోకం స జీవతి సుజీవితమ్।
ఇప్పుడు సన్నద్ధుడవై రణభూమిలో యుద్ధం చేయి. చూద్దాం. పౌరుషాన్ని ప్రదర్శించు. శత్రువును గూర్చి బాగా తెలిసికొని, అకల్మషపరాక్రమాన్ని ఆశ్రయించి శత్రువులకు శోకాన్ని కల్గించగలవాడే గొప్పగా బ్రతికినట్లు. (61 1/2)
అకస్మాచ్చైవ తే కృష్ణ ఖ్యాతం లోకే మహద్యశః॥ 62
అద్యేదానీం విజానీమః సంతి షండాః సశృంగకాః।
శ్రీకృష్ణా! అకస్మాత్తుగా నీకు లోకంలో గొప్ప కీర్తి లభించింది. ఇప్పుడు మాకర్థమవుతోంది. పురుషరూపాన్ని ధరించిన షండులు కూడా ఉన్నారు అని. (62 1/2)
మద్విధో నాపి నృపతిః త్వయి యుక్తః కథంచన॥ 63
సంనాహం సంయుగే కర్తుం కంసభృత్యే విశేషతః।
కంసునకొక సేవకుడయిన నీవంటివానితో నావంటిరాజు యుద్ధం చేయటానికి కవచాన్ని ధరించి యుద్ధ సన్నద్ధుడు కావటం ఏ రీతిగానూ తగదు. (63 1/2)
తం చ తూబరకం బాలం బహ్వాశినమవిద్యకమ్ ॥ 64
ఉలూక మద్వచో బ్రూహి అసకృద్భీమసేనకమ్।
విరాటనగరే పార్థ యస్త్వం సూదో హ్యభూః పురా॥ 65
వల్లవో నామ విఖ్యాతః తన్మయైవ హి పౌరుషమ్।
ఉలూకా! ఆ ఎద్దులాంటి భీముడు బాలుడు, తిండిపోతు అజ్ఞాని... అతనితో నామాటగా ఒకటికి పదిసార్లు ఇలా చెప్పు-
పార్థా! విరాటనగరంలో అజ్ఞాతవాసకాలంలో వల్లవ నామంతో నీవు వంటలవాడివయ్యావు. అది నా పౌరుష ఫలితమే. (64-65 1/2)
ప్రతిజ్ఞాతం సభామధ్యే న తన్నిథ్యా త్వయా పురా॥ 66
దుశ్శాసనస్య రుధిరం పీయతాం యది శక్యతే।
గతంలో సభామద్యంలో ప్రతిజ్ఞ చేశావు. అది తప్పిపోకూడదు. చేతనయితే దుశ్శాసనుడి నెత్తురు త్రాగు. (66 1/2)
యద్బ్రవీషి చ కౌంతేయ ధార్తరాష్ట్రానహం రణే॥ 67
నిహనిష్యామి తరసా తస్య కాలోయ మాగతః।
కౌంతేయా! దార్తరాష్ట్రులను నేను త్వరలో యుద్ధంలో చంపుతనని పలుకుతుంటావు. దానికి తగిన సమయం వచ్చింది. (67 1/2)
త్వం హి భోజ్యే పురస్కార్యః భక్ష్యే పేయే చ భారత॥ 68
క్వ యుద్ధం క్వ చ భోక్తన్యం యుధ్యస్వ పురుషో భవ।
భారతా! ఎక్కువ తినటంలో, త్రాగటంలో నీకు నేర్పు, కాబట్టి నీకు భోజన విషయంలోనే పురస్కారం. భోజనమెక్కడ? యుద్ధమెక్కడ? యుద్ధం చేసి పౌరుషాన్ని చూపు. (68 1/2)
శయిష్యసే హతో భూమౌ గదామాలింగ్య భారత॥ 69
తద్ వృథా చ సభామధ్యే వల్గితం తే వృకోదర।
భారతా! వృకోదరా! యుద్ధభూమిలో నాచేత చంపబడి, గదను కౌగిలించుకొని పడుకొంటావు. సభలో నీవు చేసిన గంతులన్నీ వృథాయే. (69 1/2)
ఉలూక నకులం బ్రూహి వచనాన్మమ భారత॥ 70
యుధ్యస్వాద్య స్థిరో భూత్వా పశ్యామస్తవ పౌరుషమ్।
యుధిష్ఠిరానురాగం చ ద్వేషం చ మయి భారత।
కృష్ణాయాశ్చ పరిక్లేశం స్మరేదానీం యథాతథమ్॥ 71
ఉలూకా! నామాటగా నకునులితో ఇలా చెప్పు-భారతా! స్థిరంగా నిలిచి ఇపుడు యుద్ధం చేయి. నీ పౌరుషాన్ని చూద్దాం. ఈ సమయంలో ధర్మరాజుపై ప్రేమనూ, నామీది ద్వేషాన్నీ, ద్రౌపది బాధలనూ యథాతథంగా స్మరించుకో. (70-71)
బ్రూయా స్త్వం సహదేవం చ రాజమధ్యే వచో మమ।
యుద్ధ్యేదానీం రణే యత్తః క్లేశాన్ స్మర చ పాండవ॥ 72
రాజుల సమక్షంలో నామాటగా సహదేవునితో ఇలా చెప్పు - గతంలోని మీ బాధలను తలచుకొని సంసిద్ధుడవై ఇప్పుడు రణభూమిలో పోరాడు. (72)
విరాటద్రుపదౌ చోభౌ బ్రూయా స్త్వం వచనాన్మను।
న దృష్టపూర్వా భర్తారః భృత్యైరపి మహాగుణైః॥ 73
తథార్థపతిర్భృత్యాః యతః సృష్టాః ప్రజాస్తతః।
అశ్లాఘ్యోఽయం నరపతిః యువయో రితి చాగతమ్॥ 74
విరాటద్రుపదులకు కూడా నామాటగా ఇలా చెప్పు - బ్రహ్మ ప్రజలను సృష్టించిన నాటినుండీ ఎంతో మంచిసేవకులు కూడా తమ యజమానులను సరిగా పరీక్షించలేదు. వారి గుణాగుణాలను సరిగా తెలిసికొనలేదు. అట్లే ప్రభువులు కూడా భృత్యులను సరిగా తెలిసికొనలేదు. యుధిష్ఠిరుని పక్షానికి మీరు వచ్చారు. కానీ ఆయన అంతగా సేవింపదగిన వాడు కాదు. (73-74)
తే యూయం సంహతా భూత్వ తద్వధార్ధం మమాపి చ।
ఆత్మార్థం పాండవార్థం చ ప్రయుద్ధ్యధ్వం మయా సహ॥ 75
కాబట్టి మీరంతా ఒక్కటై నన్ను చంపటానికి సిద్ధంకండి. మీకోసం పాండవులకోసం నాతో యుద్ధం చేయండి. (75)
ధృష్టద్యుమ్నం చ పాంచాల్యం బ్రూయాస్త్వం వచనాన్మామ।
ఏష తే సమయః ప్రాప్తః లబ్ధవ్యశ్చ త్వయాపి సః॥ 76
పాంచాలరాజైన ధృష్టద్యుమ్నునితో కూడా నా మాటగా చెప్పు - నీకు తగిన అవకాశం వచ్చింది. ద్రోణుడు కూడా నీకు దొరుకుతాడు. (76)
ద్రోణ మాసాద్య సమరే జ్ఞాస్యసే హితముత్తమమ్।
యుధ్యస్య సమహృత్ పాపం కురు కర్మ సుదుష్కరమ్॥ 77
యుద్ధంలో ద్రోణున కెదురు నిలిచినప్పుడు నీకు ఏది హితకరమో తెలిసికొనగలవు. సుహృదులతో కలిసి యుద్ధానికి రా. దుష్కరమైన గురువధ రూపమైన, పాపకృత్యాన్ని చేయి. (77)
శిఖంసినమథో బ్రూహి ఉలూక వచనాన్మమ।
స్త్రీతి మత్వా మహాబాహుః న హనిష్యతి కౌరవః॥ 78
గాంగేయో ధన్వినాం శ్రేష్ఠః యుద్ధ్యేదానీం సునిర్భయః।
కురు కర్మ రణే యత్తః పశ్యామః పౌరుషం తవ॥ 79
ఉలూకా! ఆ తరువాత నా మాటగా శిఖండికి కూడా ఇలా చెప్పు. గొప్పవిలుకాడై, మహాబాహువయిన గాంగేయుడు నిన్ను స్త్రీగా భావించి చంపడు. కాబట్టి నీవు నిర్భయంగా యుద్ధంచేసి రణభూమిలో నీ పరాక్రమాన్ని ప్రకటించు. నీ పౌరుషాన్ని చూద్దాం. (78-79)
ఏవముక్త్వా తతో రాజా ప్రహస్యోలూకమబ్రవీత్।
ధనంజయం పునర్బ్రూహి వాసుదేవస్య శృణ్వతః॥ 80
ఆ మాటలు చెప్పి దుర్యోధనుడు నవ్వి మరలా ఉలూకునితో ఇలా అన్నాడు - వాసుదేవుడు వింటుండగా మరలా అర్జునునితో ఇలా చెప్పు. (80)
అస్మాన్ వా త్వం పరిత్యజ్య ప్రశాధి పృథివీమిమామ్।
అథవా నిర్జితో ఽస్మాభిః రణే వీర శయిష్యసి॥ 81
వీరా! నీవు మమ్ములను చంపి ఈ భూమిని పరిపాలించు. లేదా మాతో ఓడిపోయి రణభూమిలో శాశ్వతంగా నిదురించు. (81)
రాష్ట్రాన్నిర్వాసనక్లేశం వనవాసం చ పాండవ।
కృష్ణాయాశ్చ పరిక్లేశం సంస్మరన్ పురుషో భవ॥ 82
పాండుకుమారా! రాజ్యభ్రంశక్లేశాన్నీ, వనవాసాన్నీ, ద్రౌపదీ పరాభవక్లేశాన్నీ స్మరిస్తూ పౌరుషాన్ని ప్రదర్శించు. (82)
యదర్థం క్షత్రియా సూతే సర్వం తదిదమాగతమ్।
బలం వీర్యం చ శౌర్యం చ పరం చాప్యస్త్రలాఘవమ్॥ 83
పౌరుషం దర్శయన్ యుద్ధే కోపస్య కురు నిష్కృతిమ్।
క్షత్రియుడు ఎందుకోసం పుడతాడో దానిని ప్రదర్శించవలసిన కాలం వచ్చింది. బలాన్ని, పరాక్రమాన్ని శౌర్యాన్ని, అస్త్రప్రయోగలాఘవాన్ని, పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో క్రోధాన్ని ఉపశమింపజేసికో. (83)
పరిక్లిష్టస్య దీనస్య దీర్ఘకాలోషితస్య చ।
హృదయం కస్య న స్ఫోటేద్ ఐశ్వర్యాద్భ్రంశితస్య చ॥ 84
అనేకక్లేశాలననుభవించి, దీనుడై, చిరకాలం రాజ్యానికి దూరమై, ఐశ్వర్యాన్ని కోల్పోయిన ఎవరి హృదయమైనా బ్రద్దలవుతుంది. (84)
కులే జాతస్య శురస్య పరవిత్తేష్వగృధ్యతః।
ఆస్థితం రాజ్యమాక్రమ్య కోపం కస్య న దీపయేత్॥ 85
ఉత్తమవంశంలో పుట్టి, శూరుడై, పరులసొమ్ముల కాపిం పని వాని రాజ్యాన్ని ఇతరులు ఆక్రమిస్తే అది ఏవీరుని కోపాన్ని ఉద్దీపింపజేయదు.? (85)
యత్తదుక్తం మహద్వాక్యం కర్మణా తద్విభావ్యతామ్।
అకర్మణా కత్థితేన సంతః కుపురుషం విదుః॥ 86
అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాటాడావు. వాటిని చేతలలో చూపించు. ఆచరణ లేకుండా మాటలు మాత్రమే చెప్పేవాడివి దుర్జనుడు అంటారు. (86)
అమిత్రాణాం వశే స్థానం రాజ్యం చ పునరుద్ధర।
ద్వావర్థే యుద్ధకామస్య తస్మాత్తత్కురు పౌరుషమ్॥ 87
మీ స్థానమూ, రాజ్యమూ శత్రువుల అధీనంలో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించుకో. యుద్ధం చేయదలచినవానికి ఇవి రెండే ప్రయోజనాలు. కాబట్టి వాటికై పౌరుషాన్ని ప్రదర్శించు. (87)
పరాజితోఽసి ద్యూతేన కృష్ణా చానయితా సభామ్।
శక్యోఽమర్షో మనుష్యేణ కర్తుం పురుషమానినా॥ 88
నీవు జూదంలో ఓడిపోయావు. ద్రౌపదిని సభకీడ్పించాము. తనను మగవాడుగా భావించుకొనే వాడిలో కోపం కలగటానికి ఇది చాలు. (88)
ద్వాదశైవ తు వర్షాణి వనే ధిష్ణ్యాద్వివాపితః।
సంవత్సరం విరాటస్య దాస్యమాస్థాయ చోషితః॥ 89
పండ్రెండు సంవత్సరాలు రాజ్యంనుండి తొలగింపబడ్డావు. అరణ్యంలో ఉన్నావు. సంవత్సరకాలం విరాటునకు దాసుడవై జీవించావు. (89)
రాష్ట్రాన్నిర్వాసనక్లేశం వనవాసం చ పాండవ।
కృష్ణాయా శ్చ పరిక్లేశం సంస్మరన్ పురుషో భవ॥ 90
రాజ్యభ్రష్టతవలన ఏర్పడిన బాధనూ, వనవాసం వలన ఏర్పడిన కష్టాన్నీ, ద్రౌపదీ పరాభవక్లేశాన్నీ తలచుకొంటూ పౌరుషాన్ని ప్రదర్శించు. (90)
అప్రియాణాం చ వచనం ప్రబ్రువత్సు పునః పునః।
అమర్షం దర్శయస్వ త్వమ్ అమర్షోహ్యేవ పౌరుషమ్॥ 91
మేము మాటిమాటికీ అప్రియాలు పలుకుతూ ఉంటే నీవు నీ కోపాన్ని ప్రదర్శించు - క్రోధమే పౌరుషం గదా!(91)
క్రోధో బలం తథా వీర్యం జ్ఞానయోగోఽస్త్రలాఘవమ్।
ఇహ తే దృశ్యతాం పార్థ యుద్ధ్యస్య పురుషో భవ॥ 92
క్రోధమే బలం, వీర్యం, జ్ఞానం, యోగం, అస్త్ర లాఘావమూను. ఇప్పుడే నీవు వానిని ప్రదర్శించు. యుద్ధం చెయ్యి. పురుషుడవు కమ్ము. (92)
లోహాభిసారో నిర్వృత్తః కురుక్షేత్ర మకర్దమమ్।
పుష్టాస్తేఽశ్వా భృతా యోధ్యాః శ్వో యుద్ధ్యస్వ సకేశనః॥ 93
ఆయుధపూజ జరిగింది. కురుక్షేత్రం బురద లేకుండా ఉంది. గుర్రాలు బలిసి ఉన్నాయి. సైనికులు చక్కగా పోషితులయ్యారు. కేశవునితో సహా వచ్చి రేపే యుద్ధం చెయ్యి. (93)
అసమాగమ్య భీష్మేణ సంయుగే కిం వికత్థసే।
ఆరురుక్షుర్యథా మందః పర్వతం గంధమాదనమ్॥ 94
ఏవం కత్థసి కౌంతేయ అకత్థన్ పురుషో భవ।
యుద్ధంలో భీష్మునితో తలపడకుండానే ప్రగల్భాలు పలుకుతున్నావే! కుంటివాడు గంధమాదనపర్వతం ఎక్కాలి అనుకున్నట్లే ఉంది. కుంతీకుమారా! ఎందుకిలా ప్రగల్భాలు పలుకుతావు? బడాయి మాటలు విడిచి పురుషుడివి కమ్ము. (94 1/2)
సూతపుత్రం సుదుర్ధర్షం శల్యం చ బలినాం వరమ్॥ 95
ద్రోణం చ బలినాం శ్రేష్ఠం శచీపతిసమం యుధి।
అజిత్వా సంయుగే పార్థ రాజ్యం కథమిహేచ్ఛసి॥ 96
అణచరాని కర్ణునీ, బలవంతుల్లో ఉత్తముడయిన శల్యునీ, మహేంద్రసమానుడయిన ద్రోణునీ జయించకుండానే రాజ్యం ఎలా ఆశిస్తున్నావు? (95-96)
బ్రాహ్మే ధనుషి చాచార్యం వేదయోరంతగం ద్వయోః।
యుధి ధుర్యమవిక్షోభ్యమ్ అనీకచరమచ్యుతమ్॥ 97
ద్రోణం మహాద్యుతిం పార్థ జేతుమిచ్ఛపి తన్మృషా।
న హి శుశ్రుమ వాతేన మేరుమున్మథితం గిరిమ్॥ 98
ద్రోణుడు వేదంలోనూ ధనుర్వేదంలోనూ ఆచార్యుడు. రెండింటినీ చివరిదాకా చూసిన వాడు. యుద్ధంలో సర్వభారమూ వహిస్తాడు. చలించకుండా స్థిరంగా సేనలో తిరుగుతూ, పొరబడని వాడు. అటువంటి మహాతేజస్విని జయించాలనుకొంటున్నావు. కాని అది జరిగేదికాదు. మేరు పర్వతాన్ని గాలి కుదిపినట్లు ఎప్పుడూ మనం వినలేదు కదా! (97-98)
అనిలో వా వహేన్మేరుం ద్యౌర్వాపి నిపతేన్మహీమ్।
యుగం వా పరివర్తేత యద్యేవం స్యాద్యథాత్థ మామ్॥ 99
నన్ను నీవు అన్నట్లే జరిగితే మేరు పర్వతాన్ని గాలి ఎగురగొట్టుతుంది. ఆకాశం నేలకూలుతుంది. కాలచక్రం వెనక్కు తిరుగుతుంది. (99)
కోహ్యస్తి జీవితాకాంక్షీ ప్రాప్యేమమరిమర్దనమ్।
పార్థో వా ఇతరో వాపి కోఽన్యః స్వస్తి గృహాన్ వ్రజేత్॥ 100
బ్రతుకుమీద ఆశ ఉన్నవాడెవడయినా సరే. అర్జునుడు కానీ, మరొకడు కానీ ద్రోణుని ఎదిరించి సుఖంగా ఇంటికి చేరగలడా? (100)
కథమాభ్యామభిధ్యాతః సంస్పృష్టో దారుణేన వా।
రణే జీవన్ ప్రముచ్యేత పదా భూమిముపస్పృశన్॥ 101
ఈ భీష్మద్రోణులు ఎవరినయినా చంపాలనుకొంటే దారుణమయిన వారి అస్త్రం తాకిన తరువాత వాడు ప్రాణాలతో బయటపడతాడా? వాడి కాళ్లు నేలమీద నిలుస్తాయా? (101)
కిం దర్దురః కూపశయో యథేమాం
న బుధ్యసే రాజచమూం సమేతామ్।
దురాధర్షాం దేవచమూప్రకాశాం
గుప్తాం నరేంద్రైస్త్రిదశైరివ ద్యామ్॥ 102
ప్రాచ్యైః ప్రతీచ్యైరథ దాక్షిణాత్యైః
ఉదీచ్యకాంబోజశకైః ఖశైశ్చ।
శాల్యైః సమత్స్యైశ్చ కురుమధ్యదేశ్యైః
మ్లేచ్ఫైః పుళిందైర్ద్రవిడాంధ్ర కాంచ్యైః॥ 103
ఇక్కడి మాసేనను ఎవరూ ఎదుర్కొనలేరు - దేవతల సేనలాగా వెలిగిపోతోంది - స్వర్గాన్ని దేవతలలాగా రాజులంతా రక్షిస్తున్నారు - ఇంతటి సేనను నూతిలో కప్పలాగా తెలుసుకోలేక పోతున్నావు. నాలుగుదిక్కుల రాజులూ, కాంబోజులు, శకులు, ఖశులు, శాల్వులు, మత్స్యులు, కురుమధ్య దేశీయులు, మ్లేచ్ఛులు, పుళిందులు, ద్రావిడులు, ఆంధ్రులు, కాంచీదేశీయులు... అంతా నా సేనను రక్షిస్తున్నారు. (102-103)
నానాజనౌఘం యుధి సంప్రవృద్ధం
గాంగం యథా వేగమపారణీయమ్।
మాం చ స్థితం నాగబలస్య మధ్యే
యుయుత్ససే మంద కిమల్పబుద్ధే॥ 104
వివిధ దేశస్థులతో పెరిగిపోయి ఉన్న నాసేన గంగావేగం లాగా దాట శక్యం కాకుండా ఉంది. ఏనుగుల యూథం మధ్యలో ఉన్న నాతో యుద్ధం చెయ్యాలనుకొంటున్నావు. ఎంత తెలివి తక్కువతనమో! (104)
అక్షయ్యానిషుధీ చైవ అగ్నిదత్తం చ తే రథమ్।
జానీమో హి రణే పార్థ కేతుం దివ్యం చ భారత॥ 105
నీవి అక్షయతూణీరాలు, నీరథం అగ్ని ఇచ్చినది - నీ జెండా దివ్యమయిందని తెలుసును మాకు. (105)
అకత్థమానో యుద్ధ్యస్వ కత్థసేఽర్జున కిం బహు।
పర్యాయాత్సిద్ధిరేతస్య నైతత్ సిధ్యతి కత్థనాత్॥ 106
అర్జునా! ఎక్కువగొప్పలెందుకు? మాటలు మాని యుద్ధం చెయ్యి - విజయం అనేది మానవ ప్రయత్నంతో వస్తుందొ కాని ఇలా గొప్పలు చెప్పుకుంటే రాదు-. (106)
యదీదం కత్థనాల్లోకే సిధ్యేత్కర్మ ధనంజయ।
సర్వే భవేయుః సిద్ధార్థాః కత్థనేకో హి దుర్గతః॥ 107
అర్జునా! కేవలం గొప్పలు చెప్పుకొంటేనే పనులు జరిగిపోతే అందరికీ ప్రయోజనం సమకూరినట్లే - గొప్పలు చెప్పుకోవడం చేతకాని దెవరికి? (107)
జానామి తే వాసుదేవం సహాయం
జానామి తే గాండివం తాలమాత్రమ్।
జానామ్యహం త్వాదృశో నాస్తి యోద్ధా
జానావస్తే రాజ్యమేతద్ధరామి॥ 108
నీకు కృష్ణుడు తోడు ఉన్నాడనీ తెలుసు. తాటిచెట్టంత విల్లు నీకుందనీ తెలుసు. నీలాంటి యోద్ధలేకపోవడమూ తెలుసు. అంతా తెలిసే నీ రాజ్యం హరిస్తున్నాను. (108)
న తు పర్యాయధర్మేణ సిద్ధిం ప్రాప్నోతి మానవః।
మనసైవానుకూలాని ధాతైవ కురుతే వశే॥ 109
మానవుడు మానవప్రయత్నంతో కూడా రాజ్యం పొందలేడు. బ్రహ్మ తన మనస్సంకల్పానికి అనుకూలంగా పనులు నెరవేరేటట్లు చేస్తాడు. (109)
త్రయోదశ సమా భుక్తం రాజ్యంవిలపతస్తవ।
భూయశ్పైవ ప్రశాసిష్యే త్వాం నిహత్య సబాంధవమ్॥ 110
నీవు ఏడుస్తూ ఉంటే పదుమూడేళ్లూ రాజ్యం మేము అనుభవించాము. ఇపుడు నిన్ను బంధుసహితంగా చంపి మరీ అనుభవిస్తాను. (110)
క్వ తదా గాండీవం తేఽభూద్ యత్త్వం దాసపణైర్జితః।
క్వ తదా భీమసేనస్య బలమాసీచ్చ ఫాల్గున॥ 111
అర్జునా! మిమ్మల్ని జూదంలో ఓడించి దాసుల్ని చేసిననాడు ఈ గాండీవం ఎక్కడికి పోయింది? భీముని బలం ఎక్కడుంది? (111)
సగదాద్ భీమసేనా ద్వా ఫాల్గునాద్వా సగాండివాత్।
న వై మోక్ష స్తదాభూద్వః వినా కృష్ణామనిందితామ్॥ 112
గద దాల్చిన భీముని వల్లగానీ, గాండీవం దాల్చిన అర్జునుని వల్లగానీ ఆనాడు మీకు ముక్తి కలగలేదు. పాపం ఏమీ ఎరగని ఆ ద్రౌపది గతి అయింది. (112)
సా వో దాస్యే సమాపన్నాన్ మోచయామాస పార్షతీ।
అమానుష్యం సమాపన్నాన్ దాసకర్మణ్యవస్థితాన్॥ 113
పౌరుషం విడిచి దాస్యం చేసే మిమ్మల్ని ఆనాడు ద్రౌపది విడిపించింది. (113)
అవోచం యత్ షండతిలాన్ అహం వస్తథ్య మేవ తత్।
ధృతా హి వేణీ పార్థేన విరాటనగరే తదా॥ 114
నపుంసకులని నేను ఆనాడు సభలో మిమ్మల్ని అన్నమాట నిజమే అయింది. విరాటనగరంలో అర్జునుడు సిగ చుట్టాడు కదా! (114)
సూదకర్మణి విశ్రాంతం విరాటస్య మహానసే।
భీమసేనేన కౌంతేయ యత్తు తన్మమ పౌరుషమ్॥ 115
విరాటుని వంటశాలలో భీమసేనుడు వంటలు చేసి అలసి పోయాడు గదా! అదికూడా నాపనితనమే. (115)
ఏవ మేవ సదా దండం క్షత్రియాః క్షత్రియే దధుః।
వేణీం కృత్వా షండవేషః కన్యాం నర్తితవానసి॥ 116
ఇలా రాజులు తమ శత్రువుల మీద దండాన్ని ఎల్లప్పుడూ ప్రయోగిస్తారు. అందుచేతనే నీవుకూడా నపుంసకుడివై సిగచుట్టి కన్యలకు ఆటలు నేర్పావు. (116)
న భయాద్వాసుదేవస్య న చాపి తవ ఫాల్గున।
రాజ్యం ప్రతిప్రదాస్యామి యుధ్యస్వ సహకేశవః॥ 117
కృష్ణునిమీది భయంతోనీ, నీమీది భయంతోనో నేను రాజ్యం ఇవ్వను. ఆ కేశవునితో వచ్చి యుద్ధం చెయ్యి. (117)
న మాయాహీంద్రజాలం వా కుహకా వాపి భీషణా।
ఆత్తశస్త్రశ్చ సంగ్రామే వహంతి ప్రతిగర్జనాః॥ 118
నేను ఆయుధం ధరించి యుద్ధంలో నిలిస్తే ఎదుర్కొనడమే తప్ప అక్కడ మాయలూ, ఇంద్రజాలాలూ, మోసాలూ బెదిరింపులూ పని చెయ్యవు. (118)
వాసుదేవసహస్రం వా ఫాల్గునానాం శతాని వా।
ఆసాద్య మామమోఘేషుం ద్రవిష్యంతి దిశో దశ॥ 119
అమోఘమయిన ఆయుధంతో నిలిచిన నన్ను ఎదిరించటానికి వేయిమంది కృష్ణులయినా వందలకొద్దీ అర్జునులయినా సరే దిక్కులు పట్టి పారిపోవలసిందే! (119)
సంయుగం గచ్ఛా భీష్మేణ భింధి వా శిరసా గిరిమ్।
తరస్వ వా మహాగాధం బాహుభ్యాం పురుషోదధిమ్॥ 120
భీష్మునితో యుద్ధానికయినా సిద్ధపడు లేదా కొండతో తలను పగులగొట్టుకో. లేదా అగాధమయిన సేనా సముద్రాన్ని చేతులతో ఈది దాటు తెలుస్తుంది. (120)
శారద్వతమహామీనం వివింశతిమహారగమ్।
బృహద్బలమహోద్వేలం సౌమదత్తితిమింగిలమ్॥ 121
ఈ మహాసేనా సముద్రంలో కృపుడనే పెద్ద చేప ఉంది. వివింశతి అనే సర్పం ఉంది. బృహద్బలుడనే పెద్ద కెరటాలూ, భూరిశ్రవుడనే తిమింగలమూ ఉన్నాయి. (121)
భీష్మవేగమపర్యంతం ద్రోణగ్రాహదురాసదమ్।
కర్ణశల్యఝుషావర్తం కాంబీజవడవాముఖమ్॥ 122
భీష్ముడనే ఆగని ప్రవాహవేగం, ద్రోణుడనే మొసలి ఉన్న ఈ సేనాసముద్రంలో ఎవరూ ప్రవేశించలేరు. పైగా కర్ణుడనే మత్స్యం ఉంది. శల్యుడనే సుడిగుండం ఉంది. కాంబోజరాజు అనే బడబాగ్ని ఉంది. (122)
దుశ్శాసనౌఘం శలశల్యమత్స్యం
సుషేణచిత్రాయుధనాగనక్రమ్।
జయద్రథాద్రిం పురుమిత్రగాధం
దుర్మర్షణోదం శకునిప్రతాపమ్॥ 123
దుశ్శాసనుడనే ప్రవాహమూ, శలుడు శల్యుడు అనే చేపలూ, సుషేణుడు అనే ఏనుగు చిత్రాయుధుడు అనే మొసలి ఉన్నాయి. సైంధవుడనే పర్వతం ఉంది. పురు మిత్రుడనే అగాధం ఉంది. దుర్మర్షణుడనే నీరుంది. శకుని అనే జలపాతం ఉంది. (123)
శస్త్రౌఘమక్షయ్యామభిప్రవృద్ధం
యదావగాహ్య శ్రమనష్టచేతాః।
భవిష్యసి త్వం హతసర్వబాంధవః
తదా మనస్తే పరితాపమేష్యతి॥ 124
ఈ సేనా సముద్రంలో శస్త్రాలనే ప్రవాహాలున్నాయి. అవి పెరుగుతాయే కాని తరగవు. దాంట్లోకి దిగితే ఎంతోశ్రమ. మనసు నశిస్తుంది. బంధువులంతా చచ్చిపోతారు. అపుడు నీ మనసుకు పరితాపం కలుగుతుంది. (124)
తదా మనస్తే త్రిదివాదివాశుచేః
నివర్తితా పార్థ మహీప్రశాసనాత్।
ప్రశామ్య రాజ్యం హి సుదుర్లభం త్వయా
బుభూషితః స్వర్గ ఇవాతపస్వినా॥ 125
అర్జునా! అపవిత్రుడు స్వర్గం నుండి గెంటి వేయబడినట్లుగా నీ మనస్సు రాజ్యపాలనం నుండి వెనుదిరుగుతుంది. తపస్సు చేయని వానికి స్వర్గం దుర్లభం. అలాగే నీకూ రాజ్యం దుర్లభం. (125)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణీ ఉలూకదూతాగమన పర్వణి దుర్యోధనవాక్యే షష్ట్యధికశతతమోఽధ్యాయః ॥ 160 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున ఉలూకదూతాగమన పర్వమను ఉపపర్వమున దుర్యోధన వాక్యమను నూట అరువదియవ ఆధ్యాయము. (160)