146. నూట నలువది యారవ అధ్యాయము

కుంతితో కర్ణుని సంభాషణము.

వైశంపాయన ఉవాచ
తతః సూర్యాన్నిశ్చరితాం కర్ణః శుశ్రావ భారతీమ్।
దురత్యయాం ప్రణయినీం పితృవద్భాస్కరేరితామ్॥ 1
వైశంపాయనుడిట్లు అన్నాడు. అంతలో సూర్యుని నుండి ఒక మాట వెలువడింది. ఆ మాట జవదాట రానిది. ప్రేమతో నిండినది. తండ్రివలె వాత్సల్యంతో సూర్యుడు చెప్పాడు. ఆమాట కర్ణునకు వినపడింది. (1)
సత్యమాహ పృథా వాక్యమ్ కర్ణ మాతృవచః కురు।
శ్రేయస్తే స్యాన్నరవ్యాఘ్ర సర్వమాచరత స్తథా॥ 2
కర్ణా! కుంతి నిజమే చెప్పింది. తల్లిమాట, ఆచరించు. నరోత్తమా! అలా ఆచరిస్తే నీకు సర్వశుభాలూ కలుగుతాయి. (2)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తస్య మాత్రా చ స్వయం పిత్రా చ భానునా।
చచాల నైవ కర్ణస్య మతిః సత్యధృతేస్తదా॥ 3
వైశంపాయనుడు అన్నాడు. ఇలా తల్లీ, స్వయంగా తండ్రియైన సూర్యుడూ చెప్పినా సత్యధైర్యాలు కల కర్ణుని మనస్సు చలించలేదు. (3)
కర్ణ ఉవాచ
న చైతత్ శ్రద్ధధే వాక్యం క్షత్రియే భాషితం త్వయా।
ధర్మద్వారం మమైతత్ స్యాత్ నియోగకరణం తవ॥ 4
కర్ణుడు ఇట్లా చెప్పాడు. నీ మాట పట్ల నాకు శ్రద్ధ కలుగుట లేదు. నీ మాటను పాటిస్తే నేను ధర్మమును విడిచినట్లే. (4)
అకరోన్మయి యత్పాపం భవతీ సుమహాత్యయమ్।
అపాకీర్ణోఽస్మి యన్మాతః తద్యశః కీర్తినాశనమ్॥ 5
పూజ్యురాలా! నాపట్ల నీవు చేసిన పాపం ఘోరమయింది. తల్లీ! నన్ను నిర్దాక్షిణ్యంగా విసిరిపారేశావు. అది కీర్తినాశకం. (5)
అహం చేత్ క్షత్రియో జాతః న ప్రాప్తః క్షత్రసత్క్రియామ్।
త్వత్కృతే కిం ను పాపీయః శత్రుః కుర్యాన్మమాహితమ్॥ 6
నేను క్షత్రియుడిగా పుట్టితే క్షత్రియ సంస్కారం నాకు లభించిందా? నీవు చేసిన ఈ పాపం నాకు ఏ శత్రువూ చేయడు. (6)
క్రియాకాలే త్వనుక్రోశమ్ అకృత్వా త్వమిమం మమ।
హీనసంస్కార సమయమ్ అద్య మాం సమచూచుదః॥ 7
క్షత్రియ సంస్కారాలు చేయవలసిన సమయంలో నా మీద దయ చూపలేదు. హీన సంస్కారాలు పొందిన నన్ను ఇపుడు ప్రేరేపిస్తున్నావు. (7)
న వై మమ హితం ఫుర్వం మాతృవచ్చేష్టితం త్వయా।
సా మాం సంబోధయస్యద్య కేవలాత్మహితైషిణీ॥ 8
పూర్వం నీవు నాపట్ల తల్లిలాగా హితంగా ప్రవర్తింప లేదు. ఇపుడు నీ హితం కోసం నాకు బోధిస్తున్నావు. (8)
కృష్ణేన సహితాత్ కో వై న వ్యథేత ధనంజయాత్।
కోఽద్య భీతం న మాం విద్యాత్ పార్థానాం సమితిం గతమ్॥ 9
కృష్ణ సహితమైన ధనంజయుని వలన యుద్ధంలో వ్యథ చెందని వాడెవడుంటాడు? కౌంతేయులతో యుద్ధానికి సిద్ధపడుతున్న ఈ సమయంలో నేను ఆ వైపు చేరితే నన్ను పిరికివాడు అంటారు. (9)
అభ్రాతా విదితః పూర్వం యుద్ధకాలే ప్రకాశితః।
పాండవాన్ యది గచ్ఛామి కిం మాం క్షత్రం వదిష్యతి॥ 10
పూర్వం నాకు తమ్ముళ్లు లేరని అందరికీ తెలుసు - యుద్ధం వచ్చేసరికి పాండవులు నాకు తమ్ముళ్ళని ప్రకటించుకొని వారితో చేరిపోతే నన్ను క్షత్రియ డంటారా? (10)
సర్వకామైః సంవిభక్తః పూజితశ్చ యథాసుఖమ్।
అహం వై ధార్తరాష్ట్రాణాం కుర్యాం తదఫలం కథమ్॥ 11
ధార్తరాష్ట్రులు నన్ను సుఖంగా పూజించి అన్ని కోరికలూ తీర్చారు. ఇపుడా సౌఖ్యాన్ని ధార్తరాష్ట్రులకు నిష్ఫలం ఎలా చేస్తాను? (11)
ఉపనహ్య పరైర్వైరం యే మాం నిత్యముపాసతే।
నమస్కుర్వంతి చ సదా వసవో వాసవం యథా॥ 12
వారు తమ శత్రువులతో వైరం వహించి నన్ను నిత్యమూ గౌరవిస్తున్నారు. వసువులు ఇంద్రునికి నమస్కరించినట్లు సదా కౌరవులు నాకు నమస్కారాలు చేస్తున్నారు కూడా. (12)
మమ ప్రాణేన యే శత్రూన్ శక్తాః ప్రతి సమాహితుమ్।
మన్యంతే తే కథం తేషామ్ అహం ఛింద్యాం మనోరథమ్॥ 13
నా బలంతో కౌరవులు శత్రువులను జయించుతా మనుకుంటున్నారు-వారి కోరికను నేనెలా తెంచివేస్తాను? (13)
మయా ప్లవేన సంగ్రామం తితీర్షంతి దురత్యయమ్।
అపారే పారకామా యే త్యజేయం తానహం కథమ్॥ 14
దాటరాని యుద్ధం అనే సముద్రాన్ని కర్ణుడనే నావతో దాటాలనుకొంటున్నారు. నడి సముద్రంలోంచి ఒడ్డు చేరాలని భావించే వారిని ఎలా వదలి వేస్తాను? (14)
అయం హి కాలః సంప్రాప్తః ధార్తరాష్ట్రోపజీవినామ్।
నిర్వేష్టవ్యం మయా తత్ర ప్రాణానపరిరక్షతా॥ 15
ధార్తరాష్ట్రుల పై ఆధారపడి బ్రతికే వారికి తగిన సమయం వచ్చింది - నేను కూడా ప్రాణాలకు లెక్కించకుండా ఆ ఋణం తీర్చుకోవాలి. (15)
కృతార్థాః సుభృతా యే హి కృత్యకాలే హ్యుపస్థితే।
అనవేక్ష్య కృతం పాపాః వ్కుర్వంత్యనవస్థితాః॥ 16
రాజకిల్బిషిణాం తేషాం భర్తృపిండాపహారిణామ్।
నైనాయం న పరో లోకః విద్యతే పాపకర్మణామ్॥ 17
రాజువల్ల ఉపకారాలు పొందాక సమయం వచ్చినపుడు ఆ మేలు మరచిపోయి నీచపుపనులు చేసే పాపులకూ, రాజద్రోహులకూ, రాజు ఆహారం అపహరించే వారికీ ఈ లోకమూ లేదు పరలోకమూ లేదు. (16,17)
ధృతరాష్ట్రస్య పుత్రాణామ్ అర్థే యోత్స్యామి తే సుతైః।
బలం చ శక్తిం చాస్థాయ న వై త్వయ్యనృతం వదే॥ 18
నా బలాన్నీ శక్తినీ పుంజుకొని కౌరవుల కోసం నీ కొడుకులతో యుద్ధం చేస్తాను. నీకు అసత్యం చెప్పటం లేదు. (18)
ఆనృశంస్యమథోవృత్తం రక్షన్ సత్పురుషోచితమ్।
అతోఽర్థకరమప్యేతత్ న కరోమ్యద్య తే వచః॥ 19
సజ్జనులకు ఉచితమయిన కరుణా స్వభావాన్ని, ప్రవర్తననూ రక్షిస్తూ, అంతకుమించి ప్రయోజనకరమయినా సరే నీ మాటనిపుడు చేయను. (19)
న చ తేఽయం సమారంభః మయి మోఘో భవిష్యతి।
వధ్యాన్ విషహ్యాన్ సంగ్రామే న హనిష్యామి తే సుతాన్॥ 20
యుధిష్ఠిరం చ భీమం చ యమౌ చైవార్జునాదృతే।
అర్జునేన సమం యుద్ధమ్ అపి యౌధిష్ఠిరే బలే॥ 21
కాని నా మీద నీ ప్రయత్నం వ్యర్థం కాకూడదు. యుధిష్ఠిరుడు, భీముడు, నకుల సహదేవులు వీరు చంపదగిన వారే అయినా వీరిని యుద్ధంలో చంపను - అర్జునుని వదలను. ధర్మరాజు సైన్యంలో నాకు పోటీ అర్జునుడే. (20,21)
అర్జునం హి నిహత్యాజే సంప్రాప్తం స్యాత్ ఫలం మయా।
యశసా చాపి యుజ్యేయం నిహతః సవ్యసాచినా॥ 22
యుద్ధంలో అర్జునుని చంపితే చాలు నాకు ఫలితం దక్కినట్లే. అలా కాక సవ్యసాచి చేత నేనే చనిపోతే కీర్తి దక్కుతుంది. (22)
న తే నశిష్యంతి పుత్రాః పంఛ యశస్విని।
నిరర్జునాః సకర్ణానా సార్జునా వా హతే మయి॥ 23
యశస్వినీ! ఎపుడయినా నీకి అయిదుగురు కొడుకుకే మిగులుతారు. అర్జునుడు పోతే కర్ణునితో పాటు అయిదుగురు. నేను చనిపోతే అర్జునునితో అయిదుగురు. (23)
ఇతి కర్ణవచః శ్రుత్వా కుంతీ దుఃఖాత్ ప్రవేపతీ।
ఉవాచ పుత్రమాశ్లిష్య కర్ణం ధైర్యాదకంపనమ్॥ 24
కర్ణుని ఈ మాట విని దుఃఖంతో చలించిపోతూ కుంతి కొడుకును కౌగిలించుకుంది. కర్ణుడు మాత్రం ధైర్యం చలించకుండా నిలిచాడు. అపుడు కుంతి యిలా అంది. (24)
ఏవం వై భావ్యమేతేన క్షయం యాస్యంతి కౌరవాః।
యథా త్వం భాషసే కర్ణ దైవం తు బలవత్తరమ్॥ 25
కర్ణా! నీవన్నదే జరగనియ్యి. దీనితో కౌరవులు నశిస్తారు. ఏమయినా విధి బలీయం. (25)
త్వయా చతుర్ణాం భ్రాతౄణామ్ అభయం శత్రుకర్శన।
దత్తం తత్ ప్రతిజానీహి సంగరప్రతిమోచనమ్॥ 26
యుద్ధంలో విడిచిపెడతానని నీ నలుగురు తమ్ముళ్లకూ అభయం ఇచ్చావు కదా! అది మరచిపోకు. (26)
అనామయం స్వస్తి చేతి పృథాఽథో కర్ణమబ్రవీత్।
తాం కర్ణోఽథ తథేత్యుక్త్వా తతస్థౌ జగ్మతుః పృథక్॥ 27
నీకు శుభం - స్వస్తి అని కుంతి కర్ణునితో అన్నది. అలాగే అన్నాడు కర్ణుడు. తరువాత వారిద్దరూ వేర్వేరు త్రోవల్లో వెళ్లిపోయారు. (27)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కుంతీ కర్ణసమాగమే షట్ చత్వారింశ దధికశతతమోఽధ్యాయః॥ 146 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కుంతీ - కర్ణసమాగమ మను నూట నలువది ఆరవ అధ్యాయము. (146)