134. నూట ముప్పది నాలుగవ అధ్యాయము
విదుల తన పుత్రుని యుద్ధమునకు ప్రోత్సహించుట.
విదులోవాచ
అథైతస్యామవస్థాయాం పౌరుషం హాతుమిచ్ఛసి।
నిహీనసేవితం మార్గం గమిష్యస్యచిరాదివ॥ 1
విదుల ఇలా అన్నది. ఈ దశలో నీవు పౌరుషం వదులుకొనాలనుకొంటున్నావు. త్వరలో నీవు నీచుల మార్గం పట్టిపోతావు. (1)
యో హి తేజో యథాశక్తి న దర్శయతి విక్రమాత్।
క్షత్రియో జీవితాకాంక్షీ స్తేన ఇత్యేవ తం విదుః॥ 2
తనకున్న పరాక్రమంతో తేజస్సును ప్రదర్శించకుండా జీవితాశతో వ్రేలాడే క్షత్రియుని 'దొంగ' అంటారు. (2)
అర్థవంత్యుపపన్నాని వాక్యాని గుణవంతి చ।
నైవ సంప్రాప్నువంతి త్వాం ముమూర్షుమివ భేషజమ్॥ 3
ప్రయోజన సహితాలూ, హేతుబద్ధాలూ, గుణవంతాలూ అయిన మాటలు చావబోయేవాడికి మందుల వలె నీకు పనికిరావటం లేదు. (3)
సంతి వై సింధురాజస్య సంతుష్టా న తథా జనాః।
దౌర్బల్యాదాసతే మూఢాః వ్యసనౌఘప్రతీక్షిణః॥ 4
సింధురాజుపట్ల ప్రజలంతా పూర్వం ఉన్నట్లు సంతుష్టులై లేరు. దుర్బలులై ఏమీ తోచకుండా ఆ రాజుకు కష్టాలు రావాలని ఎదురు చూస్తున్నారు. (4)
సహాయోపచితం కృత్వా వ్యవసాయ్య తతస్తతః।
అనుదుష్యేయురపరే అపశ్యంతస్తవ పౌరుషమ్॥ 5
నీవారు నీకు సహాయ ముందించి సమయంలో పరాక్రమించారు. అయినా నీవు పౌరుషం ప్రకటించకపోతే మిగతా వారు నీకు ద్రోహం చేస్తారు. (శత్రుపక్షంలో చేరి) (5)
తైః కృత్వా సహ సంఘాతం గిరిదుర్గాలయం చర।
కాలే వ్యసనమాకాంక్షన్ నైవాయమజరామరః॥ 6
నీ వాళ్ళతోకలిసి గిరిదుర్గాల్లో శత్రువుకు కీడుకాలం కోరుకుంటూ సంచరించు. ఆ శత్రువు జరా మరణాలు లేనివాడు కాదుకదా! (6)
సంజయో నామతశ్చ త్వం న చ పశ్యామి తత్త్వయి।
అన్వర్థనామా భవ మే పుత్ర మా వ్యర్థనామకః॥ 7
పుత్రా! నీపేరు సంజయుడు. ఆ లక్షణం (జయించేలక్షణం) నీలో కనపడటంలేదు. పేరు సార్థకం చేసుకో, వ్యర్థం చేసుకోకు. (7)
సమ్యక్ దృష్టిర్మహాప్రాజ్ఞః బాలం త్వాం బ్రాహ్మణోఽబ్రవీత్।
అయం ప్రాప్య మహత్ కృచ్ఛ్రం పునర్వృద్ధిం గమిష్యతి॥ 8
నీ చిన్నప్పుడు చక్కని దర్శనం, తెలివిగల బ్రాహ్మణుడు "వీడు పెద్ద కష్టం పొంది మళ్లీ అభివృద్ధి చెందుతాడు" అని చెప్పాడు. (8)
తస్య స్మరంతీ వచనమ్ ఆశంసే విజయం తవ।
తస్మాత్ తాత బ్రవీమి త్వాం వక్ష్యామి చ పునః పునః॥ 9
ఆయన మాటను తలచుకొంటూ నీ విజయాన్ని ఆశిస్తున్నాను. పుత్రా! అందుచేత నీకు ఇంతగా చెపుతున్నాను. మళ్లీ మళ్లీ కూడా చెపుతున్నాను. (9)
యస్య హ్యర్థాభినిర్వృత్తాః భవంత్యాప్యాయితాః పరే।
తస్యార్థసిద్ధిర్నియతా నయేష్వర్థానుసారిణః॥ 10
తన కార్యసాధన వల్ల తన వారు(బంధుమిత్రులు) తృప్తిపడతారు. అలా తృప్తికలిగించేవానికి నీతి మార్గంలోనే తప్పక కార్యం సిద్ధిస్తుంది. (10)
సమృద్ధిరసమృద్ధిర్వా పూర్వేషాం మమ సంజయ।
ఏవం విద్వన్ యుద్ధమనాః భవ మా ప్రత్యుపాహర॥ 11
పుత్రా! "జయంకాని పరాజయం కాని నైకైనాసరే ముందు వారికైనా సరే కలుగుతుంది." అని యుద్ధానికి సిద్దపడు. అంతేకాని వెనుదిరగకు. (11)
నాతః పాపీయసీం కాంచిత్ అవస్థాం శంబరోఽబ్రవీత్।
యత్ర నైవాద్య న ప్రాతః భోజనం ప్రతిదృశ్యతే॥12
"ఈ రోజుకేకాదు ఈపూటకు కూడా భోజనం లేదు" అనే దురవస్థను మించినదీ ఏదీలేదని శంబరుడు చెప్పాడు. (యుద్ధం చెయ్యకపోతే దారిద్ర్యం తప్పదని భావిస్తోంది. (12)
పతిపుత్రవధాదేవత్ పరమం దుఃఖమబ్రవీత్।
దారిద్ర్యమితి యత్ప్రోక్తం పర్యాయమరణం హి తత్॥ 13
ఈ దారిద్ర్యం అనేది మగడు, పుత్రుడు, చనిపోయిన దానికంటే దుఃఖరం. నిజానికి మరణానికి మరోపేరు దారిద్ర్యం. (13)
అహం మహాకులే జాతా హ్రదాత్ హ్రదమివాగతా।
ఈశ్వరీ సర్వకల్యాణీ భర్త్రా పరమపూజితా॥ 14
నేను గొప్పవంశంలో పుట్టాను. ఒక మడుగు లోంచి మరో మడుగులోకి వచ్చాను. ఎన్నో వైభవాలూ, శుభాలు అనుభవించాను. భర్త యొక్క ఆదరణ పొందాను. (14)
మహార్హమాల్యాభరణాం సుమృష్టాంబరవాససమ్।
పురా హృష్టః సుహృద్వర్గః మామపశ్యత్ సుహృద్గతామ్॥ 15
విలువయిన పూలమాలలూ, ఆభరణాలూ, వస్త్రాలూ ధరించి చెలికత్తెలతో తిరిగే నన్ను పూర్వం అంతా ఆనందంతో చూసే వారు. (15)
యదా మాం చైవ భార్యాం చ ద్రష్టాసి భృశదుర్బలామ్।
న తదా జీవితేనార్థః భవితా తవ సంజయ॥ 16
నేనూ, నీ భార్యా మిక్కిలి దుర్బలులమై ఉండటం చూశాక సంజయా! నీ జీవితం ఎందుకు? (16)
దాసకర్మకరాన్ భృత్యాన్ ఆచార్యర్త్విక్ పురోహితాన్।
అవృత్త్యాస్మాన్ ప్రజహతః దృష్ట్వా కిం జీవితేన తే॥ 17
దాసీపనివారూ, సేవకులూ, ఆచార్యులూ, ఋత్విక్కులూ, పురోహితులూ జీవనోపాధిలేక మనలను వదలి వెళ్లి పోతుంటే ఆ పరిస్థితిని కళ్లారా చూశాక నీవు ఇంకా జీవించడం ఎందుకురా? (17)
యది కృత్యం న పశ్యామి తవద్యాహం యథా పురా।
శ్లాఘనీయం యశస్వం చ కా శాంతిర్హృదయస్య మే॥ 18
నీవు మళ్లీ ప్రశంసనీయమూ, కీర్తికరమూ అయిన పనులు చేస్తున్నట్లు చూడక పోయాక, నా మనసుకు ఎలా శాంతి లభిస్తుంది? (18)
నేతి చేద్బ్రాహ్మణం బ్రూయాం దీర్యేత హృదయం మమ।
న హ్యహం న చ మే భర్తా నేతి బ్రాహ్మణముక్తవాన్॥ 19
బ్రాహ్మణునకు "లేదు" అని చెప్పవలసివస్తే నాగుండె బ్రద్దలయిపోతోంది. బ్రాహ్మణునికి ఎన్నడూ నేనూ, నా భర్తా లేదనే మాట చెప్పలేదు. (19)
వయమాశ్రయణీయాః స్మ నాశ్రితారః పరస్య చ।
సాన్యమాసాద్య జీవంతీ పరిత్యక్ష్యామి జీవితమ్॥ 20
మనం ఆశ్రయం ఇవ్వదగిన వారమే కాని పొందదగిన వారం కాదు. ఇతరుని ఆశ్రయించి జీవించవలసివస్తే జీవితాన్నే వదిలివేస్తాం. (20)
అపారే భవ నః పారమ్ అప్లవే భవ నః ప్లవః।
కురుష్వ స్థానమస్థానే మృతాన్ సంజీవయస్వ నః॥ 21
తీరం లేని మమ్మల్ని ఒక ఒడ్డుకు చేర్చు, తెప్పలేని మాకు నీవు తెప్పవు కావాలి. నిలకడలేని మాకు నిలుకడ నిమ్ము. చచ్చిపోయిన మమ్ము బ్రతికించు. (21)
సర్వే తే శత్రవః శక్యాః న చేజ్జీవితుమిచ్ఛసి।
అథ చేదీదృశీం వృత్తిం క్లీబామభ్యుపపద్యసే॥ 22
నిర్విణ్ణాత్మా హతమనాః ముంచైతాం పాపజీవికామ్।
శత్రువులందరినీ నీవు జయించగలవు. అలా కాక నపుంసకత్వం వహిస్తానంటే అసలు జీవించటానికే అర్హుడవు కావు. నిర్వేదపరుడవై సంకల్ప రహితుడవై ఈ పాడు బ్రతుకును విడిచిపెట్టు. (22 1/2)
ఏకశత్రువధేనైవ శూరో గచ్ఛతి విశ్రుతిమ్॥ 23
ఇంద్రో వృత్ర వధేనైవ మహేంద్రః సమపద్యత।
మాహేంద్రం చ గృహం లేభే లోకానాం చేశ్వరోఽభవత్॥ 24
ఒక్క శత్రువును చంపినా చాలు శూరుడికి పేరు వస్తుంది. ఒక్క వృత్రుని చంపటం వల్లనే ఇంద్రుడు మహేంద్రుడయ్యాడు. మహేంద్రభవనం పొందాడు. ముల్లోకాలకూ రాజయ్యాడు. (23,24)
నామ విశ్రావ్య వై సంఖ్యే శత్రూనాహూయ దంశితాన్।
సేనాగ్రం చాపి విద్రావ్య హత్వా వా పురుషం వరమ్॥ 25
యదైవ లభతే వీరః సుయుద్ధేన మహద్యశః।
తదైవ ప్రవ్యథంతేఽస్య శత్రవో వినమంతి చ॥ 26
యుద్ధంలో తనపేరు చెప్పి, కవచం తొడిగిన శత్రువులను పిలిచి, సేనాముఖాన్ని తరిమివేసి కాని, నాయకుని ఒక్కడిని చంపికాని మంచి పేరు తెచ్చుకుంటే శత్రువులు ఎంతో వ్యథ చెందుతారు. లొంగిపోతారు. (25,26)
త్వక్త్వాత్మానం రణే దక్షం శూరం కాపురుషా జనాః।
అవశాస్తర్పయంతి స్మ సర్వకామసమృద్ధిభిః॥ 27
నీచులు వశం తప్పి తాము నశించి యుద్ధంలో సమర్థుడూ, పరాక్రమవంతుడూ అయిన శూరుని కోరిన సంపదలతో తృప్తి పరుస్తారు. (27)
రాజ్యం చాప్యుగ్రవిభ్రంశం సంశయో జీవితస్య వా।
న లబ్ధస్య హి శత్రోర్వై శేషం కుర్వంతి సాధనః॥ 28
సజ్జనులు రాజ్యం పోయినా, జీవితం సంశయాస్పద మయినా ఒప్పుకొంటారుకాని చేతికి చిక్కిన శత్రువును మిగల్చరు. (28)
స్వర్గద్వారోపమం రాజ్యమ్ అథవాప్యమృతోపమమ్।
రుద్ధమేకాయనం మత్వా పతోల్ముక ఇవారిషు॥ 29
రాజ్యం స్వర్గద్వారం వంటిది. లేదా అమృత తుల్యమయినది (మరణిస్తే స్వర్గ ద్వారం - చంపితే అమృత తుల్యం) కానిఒక మార్గం మూసి ఉంటుంది అని భావించి మండే కొరవిలాగా శత్రువుల మీద పడు. (29)
జహి శత్రూన్ రణే రాజన్ స్వధర్మమనుపాలయ।
మా త్వాదృశం సుకృపణం శతౄణాం భయవర్ధనమ్॥ 30
యుద్ధంలో శత్రువులను సంహరించు. నీ ధర్మాన్ని చక్కగా పాలించు. శత్రువుల భయాన్ని పోగొట్టే నిన్ను(పరమదీనుని) నేను చూడలేను. (30)
అస్మదీయైశ్చ శోచద్భిః నదద్భిశ్చ పరైర్వృతమ్।
అపి త్వాం నానుపశ్యేయం దీనాద్దీనమివస్థితమ్॥ 31
మనవాళ్లంతా ఏడుస్తూ శత్రువులు పరిహిసిస్తూ అరుస్తూ ఉంటే పరమ దీనుడిలా ఉన్న నిన్ను చూడలేను. (31)
హృష్య సౌవీరకన్యాభిః శ్లాఘస్వార్థైర్యథా పురా।
మా చ సైంధవకన్యానాం అవసన్నో వశం గమః॥ 32
సౌవీరకన్యలైన నీభార్యలతో సుఖించు. పూర్వంలాగా వారిని సంతోషపెట్టు. అంతేగాని అవసానదశకు వచ్చి, సైంధవకన్యలకు వశమై పోకు. (32)
యువా రూపేణ సంపన్నః విద్యయాభిజనేన చ।
యత్త్వాదృశో వికుర్వీత యశస్వీ లోకవిశ్రుతః॥ 33
అధుర్వవచ్చ వోఢవ్యే మన్యే మరణమేవ తత్।
యువకుడై, రూపమూ, విద్య, సత్కులమూ సమృద్ధిగా ఉండి, మంచిపేరు ప్రఖ్యాతులున్న, నీవంటి వాడు ఇటువంటి పనిచేయరాదు. బరువు మోయలేని ఎద్దు లాగా ఇలా చెయ్యడం మరణంతో సమానం. (33 1/2)
యది త్వామనుపశ్యామి పరస్య ప్రియవాదినమ్।
పృష్ఠతోఽనువ్రజంతం వా కా శాంతిర్హృదయస్య మే।
నాస్మిన్ జాతు కులే జాతః గచ్ఛేద్యోఽన్యస్య పృష్ఠతః॥ 35
శత్రువుకు ప్రియంగా మాట్లాడుతూ, వాడి వెంట తిరుగుతున్న నిన్ను చూస్తే నామనస్సుకు శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కులంలో పుట్టినవాడెవడూ మరొకని వెనక తిరగడు. (34,35)
న త్వం పరస్యానుచరః తాత జీవితు మర్హసి।
అహం హి క్షత్రహృదయం వేద యత్పరిశాశ్వతమ్॥ 36
నీవు శత్రువు వెనుక తిరుగుతూ జీవించరాదు. శాశ్వత మయిన క్షత్రియహృదయం నాకే తెలుసును. (36)
పూర్వైః పూర్వతరైః ప్రోక్తమ్ పరైః పరతరైరపి।
శాశ్వతం చావ్యయం చైవ ప్రజాపతివివిట్మితమ్॥ 37
నీ వంశంలోని పూర్వులూ, ఇంకా ముందు వారూ ఈ క్షతియహృదయం శాశ్వతమనీ, తరగని దనీ, ఇది ప్రజాపతి చేసినదనీ చెప్పారు. నీ వారేకాదు. ఇతరులూ, వారిపూర్వులూకూడా ఈ మాటనే చెప్పారు. (37)
యో వై కశ్చిదిహాజాతః క్షత్రియః క్షత్రకర్మవిత్।
భయాద్ వృత్తిసమీక్షో వా న నమేదిహ కస్యచిత్॥ 38
ఈ సద్వంశంలో పుట్టి క్షత్రియధర్మం తెలిసిన క్షత్రియుడు భయంతోకాని, జీవనోపాధికోసంగాని ఎవరికీ తలవంచకూడదు. (38)
ఉద్యచ్ఛేదేవ న నమేత్ ఉద్యమో హ్యేవ పౌరుషమ్।
అప్యపర్వణి భజ్యేత న నమేతేహ కస్యచిత్॥ 39
ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంతేకాని తలవంచకూడదు. ఉద్యమమే పురుష లక్షణం. వ్యర్థంగానైనా చచ్చిపోవచ్చును కాని ఎవరికీ తలవంచరాదు. (39)
మాతంగో మత్త ఇవ చ పరీయాత్ సుమహామనాః।
బ్రాహ్మణేభ్యో నమేన్నిత్యం ధర్మాయైవ చ సంజయ॥ 40
పెద్దమనసుతో మదపుటేనుగులా సంచరించాలి. సంజయా! కాని బ్రాహ్మణులకు బ్రహ్మజ్ఞానులకు నిత్యమూ మ్రొక్క వచ్చును. అదయినా ధర్మంకోసం. (40)
నియచ్ఛన్నితరాన్ వర్ణాన్ వినిఘ్నన్ సర్వదుష్కృతః।
స సహాయోఽసహాయో వా యావజ్జీవం తథా భవేత్॥ 41
మిగిలిన వర్ణాల వారిని వారి వారి ధర్మాల్లో నిలుపుతూ, దుర్మార్గులను సంహరిస్తూ, సహాయం ఉన్నా లేకపోయినా జీవితమంతా అలాగే బ్రతకాలి. (41)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి విదులాపుత్రానుశాసనే చతుస్త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 134 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యానపర్వమను ఉపపర్వమున విదుల పుత్రుని బోధించుట అను నూట ముప్పది నాల్గవ అధ్యాయము. (134)