132. నూట ముప్పదిరెండవ అధ్యాయము
కుంతీ సందేశము.
వైశంపాయన ఉవాచ
ప్రవిశ్యాథ గృహం తస్యాః చరణావభివాద్య చ।
ఆచఖ్యౌ తత్ సమాసేన యద్ వృత్తం కురుసంసది॥ 1
వైశంపాయనుడిలా అన్నాడు - శ్రీకృష్ణుడు కుంతి ఇంట ప్రవేశించి, ఆమె పాదాలకు నమస్కరించి, కౌరవసభలో జరిగిన వృత్తాంతమంతా సంక్షేమంగా ఆమెకు చెప్పాడు. (1)
వాసుదేవ ఉవాచ
ఉక్తం బహువిధం వాక్యం గ్రహణీయం సహేతుకమ్।
ఋషిభిశ్చైవ చ మయా న చాసౌ తద్ గృహీతవాన్॥ 2
వాసుదేవుడిలా అన్నాడు - నేనూ, మహర్షులూ కూడా హేతుబద్ధంగా స్వీకరణయోగ్యంగా అనేకవిధాలుగా సభలో చెప్పిచూచాము. కానీ దుర్యోధనుడు దానిని అంగీకరించలేదు. (2)
కాలపక్వమిదం సర్వం సుయోధనవశానుగమ్।
ఆపృచ్ఛే భవతీం శీఘ్రం ప్రయాస్యే పాండవాన్ ప్రతి॥ 3
దుర్యోధనునకు అధీనమై నిలిచిన రాజులకందరకూ కాలం సమీపించినట్లున్నది. నీవు అనుమతిస్తే త్వరగా పాండవుల దగ్గరకు వెళ్తాను. (3)
కిం వాచ్యాః పాండవేయాస్తే భవత్యా వచనాన్మయా।
తద్ బ్రూహి త్వం మహాప్రాజ్ఞే శుశ్రూషే వచనం తవ॥ 4
బుద్ధిమంతురాలా! నీ మాటగా నేను పాండవులకు ఏమి చెప్పాలి. అది చెప్పు. నీ మాటలు వినాలని ఉంది. (4)
కుంత్యువాచ
బ్రూయాః కేశవ రాజానం ధర్మాత్మానం యుధిష్ఠిరమ్।
భూయాంస్తే హీయతే ధర్మః మా పుత్రక వృథా కృథాః॥ 5
కుంతి ఇలా అన్నది. - కేశవా! ధర్మాత్ముడైన యుధిష్ఠిర రాజుతో నామాటగా చెప్పు - ప్రజాపాలన రూపమైన నీధర్మం కుంటుప్డుతోంది. ధర్మపరిపాలనావకాశాన్ని వృథా చేసికోవద్దు. (5)
శ్రోత్రియస్యేవ తే రాజన్ మందకస్యావిపశ్చితః।
అనువాకహతా బుద్ధిః ధర్మమేవైకమీక్షతే॥ 6
రాజా! వేదార్థం తెలియని మందబుద్ధి అయిన వేదపండితుడు మంత్రాలను పఠించటమే పరమధర్మ మనుకొన్నట్లు నీవు శాంతి ధర్మాన్ని మాత్రమే చూస్తున్నావు. (6)
అంగావేక్షస్వ ధర్మం త్వం యథా సృష్టః స్వయంభువా।
బాహుభ్యాం క్షత్రియాః సృష్టాః బాహువీర్యోపజీవినః॥ 7
నాయనా! బ్రహ్మ నీకోసం ఏర్పరచిన ధర్మాన్ని చూడు. క్షత్రియులు బాహువులనుండి సృష్టింపబడినవారు. భుజపరాక్రమంతో జీవించవలసినవారు. (7)
క్రూరాయ కర్మణే నిత్యం ప్రజానాం పరిపాలనే।
శృణు చాత్రోపమామేకాం యా వృద్ధేభ్యః శ్రుతా మయా॥ 8
నిత్యమూ యుద్ధంవంటి క్రూరకర్మలూ, ప్రజాపరిపాలన క్షత్రధర్మం. ఈ విషయాలకు సంబంధించి నేను పెద్దల ద్వారా విన్న ఉదాహరణమొకటి చెపుతా విను. (8)
ముచుకుందస్య రాజర్షేః అదదాత్ పృథివీమిమామ్।
పురా వైశ్రవణః ప్రీతః న చాసౌ తాం గృహీతవాన్॥ 9
ఒకప్పుడు కుబేరుడు ముచుకుందుడను రాజర్షికి ఈ భూమిని ఇచ్చాడు. కానీ ముచుకుందుడు దానిని గ్రహించలేదు. (9)
బాహువీర్యార్జితం రాజ్యమ్ అశ్నీయామితి కామయే।
తతో వైశ్రవణః ప్రీతః విస్మితః సమపద్యత॥ 10
నా బాహుబలంతో సంపాదించిన దానినే అనుభవించాలని నా కోరిక - అని కూడా అన్నాడు ముచుకుందుడు. దానితో కుబేరుడు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. (10)
ముచుకుందస్తతో రాజా సోఽన్వశాసద్ వసుంధరామ్।
బాహువీర్యార్జితాం సమ్యక్ క్షత్రధర్మమనువ్రతః॥ 11
ఆ తరువాత ముచుకుందుడు తన బాహుపరాక్రమంతో ఆర్జించిన భూమిని క్షత్రధర్మాన్ని అనుసరిస్తూ చక్కగా పరిపాలించాడు. (11)
యం హి ధర్మం చరంతీహ ప్రజా రాజ్ఞా సురక్షితాః।
చతుర్థం తస్య ధర్మస్య రాజా విందేత భారత॥ 12
భారత! రాజుచే సురక్షితులైన ప్రజలు ఆచరించిన ధర్మంలో నాలుగవ భాగాన్ని రాజు పొందుతాడు. (12)
రాజా చరతి చేద్ ధర్మం దేవత్వాయైవ కల్పతే।
స చేదధర్మం చరతి నరకాయైవ గచ్ఛతి॥ 13
రాజు ధర్మాన్ని ఆచరిస్తే దేవత్వాన్నే పొందగల్గుతాడు. రాజు అధర్మంగా ప్రవర్తిస్తే నరకానికి పోతాడు. (13)
దండనీతిః స్వధర్మేణ చాతుర్వర్ణ్యం నియచ్ఛతి।
ప్రయుక్తా స్వామినా సమ్యక్ అధర్మేభ్యశ్చ యచ్ఛతి॥ 14
రాజుయొక్క దండనీతి రాజు ద్వారా స్వధర్మానుసారం చక్కగా ప్రయోగింపబడితే అది చతుర్వర్ణాలనూ నియంత్రించి, అధర్మం నుండి మరల్చ గలుగుతుంది. (14)
దండనీత్యాం యదా రాజా సమ్యక్ కార్త్స్న్యేన వర్తతే।
తదా కృతయుగం నామ కాలః శ్రేష్ఠః ప్రవర్తతే॥ 15
రాజు సంపూర్ణంగా చక్కగా దండనీతిని ప్రయోగించిన రోజు కృతయుగ మన్న పేర శ్రేష్ఠమైన కాలం వస్తుంది. (15)
కాలో వా కారణం రాజ్ఞః రాజా వా కాలకారణమ్।
ఇతి తే సంశయో మాభూద్ రాజా కాలస్య కారణమ్॥ 16
రాజు కాలానికి కారణమా? కాలం రాజుకు కారణమా? అని సంశయించవలసిన పని లేదు. రాజే కాలానికి కారణమవుతాడు. (16)
రాజా కృతయుగప్రష్టా త్రేతాయా ద్వాపరస్య చ।
యుగస్య చ చతుర్థస్య రాజా భవతి కారణమ్॥ 17
రాజే కృతయుగాన్నీ, త్రేతాయుగాన్నీ, ద్వాపరయుగాన్నీ సృష్టిస్తాడు. కలియుగానికి కూడా రాజే కారకుడవుతాడు. (17)
కృతస్య కరణాద్ రాజా స్వర్గమత్యంతమశ్నుతే।
త్రేతాయాః కరణాద్ రాజా స్వర్గం నాత్యంత మశ్నుతే॥ 18
కృతయుగాన్ని కల్పించిన రాజు అక్షయస్వర్గాన్ని పొందగలుగుతాడు. త్రేతాలక్షణాలను కల్పించగలరజు స్వర్గాన్ని పొందగలడు కానీ అది శాశ్వతం కాదు. (18)
ప్రవర్తనాద్ ద్వాపరస్య యథాభాగముపాశ్నుతే।
కలేః ప్రవర్తనాద్ రాజా పాపమత్యంత మశ్నుతే॥ 19
ద్వాపరలక్షణాలను ప్రవర్తింపజేసిన రాజు పుణ్యపాప ఫలితాలను విడివిడిగా అనుభవిస్తాడు. కలి లక్షణాలను ప్రవర్తింపజేసిన రాజు ఘోరనరకాన్ని పొందుతాడు. (19)
తతో వసతి దుష్కర్మా నరకే శాశ్వతీః సమాః।
రాజదోషేణ హి జగత్ స్పృశ్యతే జగతః స చ॥ 20
ఆ కారణంగా దుష్కర్మలు చేసిన రాజు చాలా సంవత్సరాలు నరకలోకంలో ఉంటాడు. రాజదోషం ప్రజలకు, ప్రజాదోషం రాజుకు సంక్రమిస్తాయి. (20)
రాజధర్మానవేక్షస్వ పితృపైతామహోచితాన్।
నైతద్ రాజర్షివృత్తమ్ హి యత్ర త్వం స్థాతుమిచ్ఛసి॥ 21
పితృపైతామహులు పరిపాలించిన రాజధర్మాలను పరిశీలించు. ఇప్పుడు నీవు నిలువదలచిన స్థానం రాజులకూ, రాజధర్మాలకూ తగినది కాదు. (21)
న హి వైక్లవ్యసంసృష్ట ఆనృశంస్యే వ్యవస్థితః।
ప్రజాపాలనసంభూతం ఫలం కించన లబ్ధవాన్॥ 22
నిత్యమూ దయాభావంతో నిలిచినవాడు వైక్లవ్యాన్ని పొందుతాడు. అటువంటివాడు ప్రజాపాలన సంబంధమైన ఏ పుణ్యఫలాన్నీ ఎప్పుడూ పొందలేడు. (22)
న హ్యేతామాశిషం పాండుః న చాహం న పితామహః।
ప్రయుక్తవంతః పూర్వం తే యయా చరసి మేధయా॥ 23
ఇప్పుడు నీ బుద్ధి ప్రసరిస్తున్న ఆలోచనలకనుగుణంగా మీ తండ్రి పాండురాజుగానీ, నేను కానీ, పితామహుడు కానీ ఎప్పుడూ ఆశీస్సులనందజేయలేదు. (23)
యజ్ఞో దానం తపః శౌర్యం ప్రజ్ఞా సంతానమేవ చ।
మాహాత్మ్యం బలమోజశ్చ నిత్యమాశంసితం మయా॥ 24
యజ్ఞం, దానం, తపస్సు, శౌర్యం, ప్రజ్ఞ, సంతానం, మాహాత్మ్యం, బలం ఓజస్సు నీకి ప్రాప్తించాలని నేనెప్పుడూ కోరుకొనే దాన్ని. (24)
నిత్యం స్వాహా స్వధా నిత్యం దద్యుర్మానుషదేవతాః।
దీర్ఘమాయుర్ధనమ్ పుత్రాన్ సమ్యగారాధితాః శుభాః॥ 25
శుభాస్పదులైన బ్రాహ్మణులను చక్కగా ఆరాధిస్తే వారుకూడా దేవయజ్ఞ, పితృయజ్ఞ, దీర్ఘాయుర్ధన, పుత్రప్రాప్తికి, అనుగుణంగా ఆశీస్సులనిచ్చేవారు. (25)
పుత్రేష్వాశాసతే నిత్యం పితరో దైవతాని చ।
దానమధ్యయనం యజ్ఞం ప్రజానాం పరిపాలనమ్॥ 26
దేవతలైనా, పితరులైనా తమను ఉపాసించే పుత్రులకు దానం, అధ్యయనం, యజ్ఞం, ప్రజాపరిపాలనం సిద్ధించాలనే కోరుకొంటారు. (26)
ఏతద్ ధర్మ్యమధర్మ్యం వా జన్మ నైవాభ్యజాయథాః।
తే తు వైద్యాః కులే జాతాః అవృత్త్వా తాత పీడితాః॥ 27
శ్రీకృష్ణా! నేను చెప్తున్నది ధర్మసంగతమో, అధర్మయుక్తమో నీకు స్వాభావికంగానే తెలుసు. పాండవులు ఉత్తమవంశంలో పుట్టీ విద్వాంసులై కూడా బ్రతుకు తెరువులేక బాధపడుతున్నారు. (27)
యత్ర దానపతిం శూరం క్షుధితాః పృథివీచరాః।
ప్రాప్యః తుష్టాః ప్రతిష్ఠంతే ధర్మః కోఽభ్యధికస్తతః॥ 28
ఆకలిగొన్న మానవులంతా దానపతీ, శూరుడూ అయిన క్షత్రియుని చేరి ఆకలి తీరి సంతుష్టులై వెళ్లటం కంటె గొప్పధర్మమే ముంటుంది? (28)
దానేనాన్యం బలేనాన్యం తథా సూనృతయా పరమ్।
సర్వతః ప్రతిగృహ్ణీయాద్ రాజ్యం ప్రాప్యేహ ధార్మికః॥ 29
ధర్మబద్ధుడైన వాడు, ముందు రాజ్యాన్ని పొంది ఆపై దానంతో కొందరిని, బలంతో కొందరిని, మంచి మాటలతో కొందరిని - ఈ విధంగా ఎటువంటి వచ్చినవారినైనా తృప్తి పరచి తన వారినిగా చేసికోవాలి. (29)
బ్రాహ్మణః ప్రచరేద్ భైక్షం క్షత్రియః పరిపాలయేత్।
వైశ్యో ధనార్జనం కుర్యాత్ శూద్రః పరిచరేచ్చ తాన్॥ 30
బ్రాహ్మణుడు బిచ్చమెత్తాలి. క్షత్రియుడు పరిపాలించాలి. వైశ్యుడు డబ్బు సంపాదించాలి. శూద్రుడు వారికి పరిచర్యలు చేయాలి. (30)
భైక్షం విప్రతిషిద్ధం తే కృషిర్నైవోపపద్యతే।
క్షత్రియోఽసి క్షతాత్ త్రాతా బాహువీర్యోపజీవితా॥ 31
నీకు యాచన నిషిద్ధం. వ్యవసాయం కుదరదు. నీవు క్షత్రియుడవు. ఇతరులను ఇబ్బందులనుండి రక్షించవలసినవాడవు. బాహుబలంతోనే జీవించవలసినవాడివి. (31)
పిత్ర్యమంశం మహాబాహో నిమగ్నం పునరుద్ధర।
సామ్నా భేదేన దానేన దండేనాథ నయేన వా॥ 32
మహాబాహూ! శత్రువుల చేత చిక్కి ఉన్న నీపైతృకమైన రాజ్యభాగాన్ని సామ, దాన, భేద, దండోపాయాలతో పునరుద్ధరించుకో. (32)
ఇతో దుఃఖతరం కింను యదహం హీనబాంధవా।
పరపిండముదీక్షే వై త్వాం సూత్వా మిత్రనందన॥ 33
మిత్రులకు ఆనందాన్ని కలిగించే వాడా! నేను నిన్ను కని ఎవ్వరూ లేని దానివలె పరులు పెట్టే అన్నం కోసం ఎదురుచూస్తుండటం కన్న ఎక్కువ దుఃఖం మరేముంటుంది. (33)
యుద్ధ్యస్వ రాజధర్మేణ మా నిమజ్జీః పితామహాన్।
మాగమః క్షీణపుణ్యస్త్వం సానుజః పాపికాం గతిమ్॥ 34
రాజధర్మాన్ని పాటించి యుద్ధం చెయ్యి. పెద్దల పేరు అణగారిపోకుండా చూడు. పుణ్యహీనుడవై, సోదరులతోపాటు పాపాత్ములు పొందే గతిని పొందవద్దు. (34)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి కుంతీవాక్యే ద్వాత్రింశదధికశతతమోఽధ్యాయః॥ 132 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగపర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున కుంతీవాక్యమను నూటముప్పది రెండవ అధ్యాయము. (132)