113. నూటపదమూడవ అధ్యాయము

గాలవగరుడులు శాండిలిని కలియుట - గురుదక్షిణను గూర్చి చర్చించుట.

నారద ఉవాచ
ఋషభస్య తతః శృంగం నిపత్య ద్విజపక్షిణౌ।
శాండిలీం బ్రాహ్మణీం తత్ర దదృశాతే తపోఽన్వితామ్॥ 1
నారదుడిలా అన్నాడు - ఆ తరువాత గాలవుడూ, గరుడుడూ ఋషభపర్వత శిఖరంపై దిగి బ్రహ్మజ్ఞానిని, తపస్విని అయిన శాండిలిని చూశారు. (1)
అభివాద్య సుపర్ణస్తు గాలవశ్చాభిపూజ్య తామ్।
తథా చ స్వాగతేనోక్తౌ విష్టరే సంనిషీదతుః॥ 2
గరుడుడు ఆమెకు నమస్కరించాడు. గాలవుడు ఆమెను సత్కరించాడు. ఆమె వారికి స్వాగతం చెప్పి ఆసీనులను కమ్మంది. వారిరువురూ ఆసనాలపై కూర్చున్నారు. (2)
సిద్ధమన్నమ్ తయా దత్తం బలిమంత్రోపబృంహితమ్।
భుక్త్వా తృప్తావుభౌ భూమౌ సుప్తౌ తావనుమోహితౌ॥ 3
అభిమంత్రితమై వైశ్వదేవశేషమయిన సిద్ధాన్నాన్ని ఆమె వారికి సమర్పించింది. వారు తృప్తిగా భుజించి నేలపై పడుకొని నిదురించారు. (3)
ముహూర్తాత్ ప్రతిబుద్ధస్తు సుపర్ణో గమనేప్సయా।
అథ భ్రష్టతనూజాంగమ్ ఆత్మానం దదృశే ఖగః॥ 4
రెండుగడియల కాలం తర్వాత ప్రయాణం ప్రారంభించాలని లేచిన గరుడుడు తన శరీరానికి రెండు రెక్కలూ లేకపోవటాన్ని గమనించాడు. (4)
మాంసపిండోపమోఽభూత్ సః ముఖపాదాన్వితః ఖగః।
గాలవస్తం తథా దృష్ట్వా విమనాః పర్యపృచ్ఛత॥ 5
గరుత్మంతుడు ముఖమూ, పాదాలు కనిపిస్తున్నా రెక్కలు లేనందున మాంసపిండంలాగా కనిపించాడు. అటువంటి గరుత్మంతుని చూసి గాలవుడు బాధపడి ఇలా అడిగాడు. (5)
కిమిదం భవతా ప్రాప్తమ్ ఇహాగమనజం ఫలమ్।
వాసోఽయమిహ కాలం తు కియంతం నౌ భవిష్యతి॥ 6
ఇక్కడకు వచ్చి నీవు ఇటువంటి ఫలితాన్ని పొందావేమిటి? ఇక్కడ మనమెంతకాలం ఉండవలసి వస్తుంది? (6)
కిం ను తే మనసా ధ్యాతమ్ అశుభం ధర్మదూషణమ్।
న హ్యయం భవతఆHఅ స్వల్పః వ్యభిచారో భవిష్యతి॥ 7
ధర్మదూషణరూపమైన ఏ అశుభాన్ని అయినా మనసా స్మరించావా? ఎందుకంటే ధర్మ విరుద్ధమైన స్వల్పకార్యాన్ని అయినా నీవు చేయవని నా భావన. (7)
సుపర్ణోఽథాబ్రవీద్ విప్రం ప్రధ్యాతం వై మయా ద్విజ।
ఇమాం సిద్ధామితో నేతుం తత్ర యత్ర ప్రజాపతిః॥ 8
యత్ర దేవో మహాదేవః యత్ర విష్ణుః సనాతనః।
యత్ర ధర్మశ్చ యజ్ఞశ్చ తత్రేయం నివసేదితి॥ 9
అప్పుడు సుపర్ణుడిలా అన్నాడు. బ్రాహ్మణా! నేను ఈ సిద్ధతపస్వినిని ఇక్కడనుండి బ్రహ్మ, మహాదేవుడు, సనాతనుడైన విష్ణువూ, ధర్మమూ, యజ్ఞమూ ఉన్నచోట నివాసానికై కొనిపోవాలని మనస్సులో అనుకొన్నాను. (8-9)
సోఽహం భగవతీం యాచే ప్రణతః ప్రియకామ్యయా।
మయైతన్నామ ప్రధ్యాతం మనసా శోచతా కిల॥ 10
తనకు మంచి చేయాలనే ఆమెను కొనిపోవాలని, నేను మనసా ధ్యానించినట్టు చెప్పి ఆమె పాదాలపై పడి ప్రార్థిస్తున్నాను. (10)
తదేవం బహుమానాత్తే మయేహానీప్సితం కృతమ్।
సుకృతం దుష్కృతం వా త్వం మాహాత్మ్యాత్ క్షంతుమర్హసి॥ 11
"తమపై ప్రత్యేకమైన గౌరవభావంతోనే నేనిలా చేయాలని భావించాను. తమకది ఇష్టం కాలేదు. నా ఆలోచన పాపమో, పుణ్యమో - ఏదైనా తమ మాహాత్మ్యంతో క్షమించాలి." (11)
సా తౌ తదాబ్రవీత్ తుష్టా పతగేంద్రద్విజర్షభౌ।
న భేతవ్యం సుపర్ణోఽసి సుపర్ణ త్యజ సంభ్రమమ్॥ 12
అప్పుడు ఆమె ఆనందించి ఆ గరుడగాలవులనుద్దేశించి ఇలా అన్నది - సుపర్ణా! భయపడవద్దు. నీవు సుపర్ణుడవే అవుతావు. కంగారుపడనవసరంలేదు. (12)
నిందితాస్మి త్వయా వత్స న చ నిందాం క్షమామ్యహమ్।
లోకేభ్యః సపది భ్రశ్యేద్ యో మాం నిందేత పాపకృత్॥ 13
నాయనా! నీవు నన్ను నిందించావు. నిందనెప్పుడూ నేను సహించను. ఎవడైనా నన్ను నిందించి పాపం చేస్తే వాడు వెంటనే పుణ్యలోకాలనుండి పడిపోతాడు. (13)
హీనయా లక్షణైః సర్వైః తథా నిందితయా మయా।
ఆచారం ప్రతిగృహ్ణంత్యా సిద్ధిః ప్రాప్తేయముత్తమా॥ 14
అవలక్షణాలకు దూరమై, అనిందిత ప్రవర్తనతో సదాచారాన్ని పాటిస్తున్నందువలననే నేను ఈ ఉత్తమ సిద్ధిని పొందాను. (14)
ఆచారః ఫలతే ధర్మమ్ ఆచారః ఫలతే ధనమ్।
ఆచారాచ్ఛ్రియమాప్నోతి ఆచారో హస్త్వలక్షణమ్॥ 15
ఆచారమే ధర్మాన్ని సఫలం చేస్తుంది. ఆచారమే ధనరూపమయిన ఫలితాన్ని ఇస్తుంది. ఆచారం వలననే సంపదలు లభిస్తాయి. అశుభ లక్షణాలను ఆచారమే నశింపజేస్తుంది. (15)
తదాయుష్మన్ ఖగపతే యథేష్టం గమ్యతామితః।
న చ తే గర్హణీయాహం గర్హితవ్యాః స్త్రియః క్వచిత్॥ 16
కాబట్టి చిరంజీవి! పక్షిరాజా! ఇక్కడ నుండి మీ ఇష్టమైన తావునకు వెళ్ళండి. నీవు నన్ను నిందించవద్దు. స్త్రీలనెప్పుడూ నిందించకూడదు. (16)
భవితాసి యథాపూర్వం బలవీర్యసమన్వితః।
బభూవతుస్తతస్తస్య పక్షౌ ద్రవిణవత్తరౌ॥ 17
ఇంతకుముందులాగానే బలపరాక్రమాలు గలవాడవవుతావు - శాండిలి ఇలా అనగానే గరుడుని రెక్కలు అంతకుముందున్న బలం కన్న ఎక్కువ బలాన్ని పొందాయి. (17)
అనుజ్ఞాతస్తు శాండిల్యా యథాగతముపాగమత్।
నైవ చాసాదయామాస తథారూపాంస్తురంగమాన్॥ 18
వారు శాండిలి అనుమతి తీసికొని పూర్వంవచ్చిన బాటనే వెళ్ళారు. గాలవుడు అడిగిన లక్షణాలు గల గుఱ్ఱాలు మాత్రం ఎక్కడా దొరకలేదు. (18)
విశ్వామిత్రోఽథ తం దృష్ట్వా గాలవం చాధ్వని స్థితః।
ఉవాచ వదతాం శ్రేష్ఠః వైనతేయస్య సంనిధౌ॥ 19
గాలవుడు ప్రయాణమైపోతుండగా మార్గమధ్యంలో వాగ్మి అయిన విశ్వామిత్రుడు గమనించి గరుడుని సమక్షంలో గాలవునితో ఇలా అన్నాడు. (19)
యస్త్వయా స్వయమేవార్థః ప్రతిజ్ఞాతో మమ ద్విజ।
తస్య కాలోఽపవర్గస్య యథా వా మన్యతే భవాన్॥ 20
బ్రాహ్మణా! నీఅంత నీవుగా నాకిస్తానని ప్రతిజ్ఞ చేసిన గురుదక్షిణను ఇవ్వటానికి కాలం సమీపిస్తోంది. ఆవిషయాన్ని ఆలోచిస్తున్నావా? (20)
ప్రతీక్షిష్యామ్యహం కాలమ్ ఏతావంతం తథా పరమ్।
యథా సంసిద్ధ్యతే విప్ర స మార్గస్తు నిశామ్యతామ్॥ 21
నేనింతవరకు నిరీక్షిస్తున్నాను. ఇక మీదట కూడా నీకోసం చూస్తుంటాను. బ్రాహ్మణా! నీ కార్యం సిద్ధించే ఉపాయాన్ని ఆలోచించుకో. (21)
సుపర్ణోఽథాబ్రవీద్ దీనం గాలవం భృశదుఃఖితమ్।
ప్రత్యక్షం ఖల్విదానీం మే విశ్వామిత్రో యదుక్తవాన్॥ 22
తదాగచ్చ ద్విజశ్రేష్ఠ మంత్రయిష్యావ గాలవ।
నాదత్త్వా గురవే శక్యం కృత్స్నమర్థం త్వయాఽఽసితుమ్॥ 23
ఆ మాటలు విని గాలవుడు బాధపడ్డాడు. దీనుడై బాధపడుతున్న గాలవునితో గరుడుడిలా అన్నాడు - ద్విజశ్రేష్ఠా! విశ్వామిత్రుడు అన్న మాటలు నేను కూడా విన్నాను గదా! రా! ఇద్దరం కలిసి ఆలోచిద్దాం. నీవు నీ గురువుకు గురుదక్షిణ మొత్తం ఇచ్చేదాకా మిన్నకుండే అవకాశం లేదు. (22-23)
ఇతి శ్రీమహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యాన పర్వణి గాలవచరితే త్రయోదశాధికశతతమోఽధ్యాయః॥ 113 ॥
ఇది శ్రీమహాభారతమున ఉద్యోగ పర్వమున భగవద్యాన పర్వమను ఉపపర్వమున గాలవచరితమను నూటపదమూడవ అధ్యాయము. (113)